ఆ నేల, ఆ నీరు, ఆ గాలి
కథన రీతుల్లో మార్పు ఎప్పుడూ ఉండేదే కానీ, క్రాఫ్ట్ మీద శ్రద్ధ పెరిగాక, తెలుగు కథల్లో కొట్టొచ్చినట్టు కనపడుతున్న లోటు మాత్రం, కథ చెప్పే ఒరవడిని పోగొట్టుకొని ఉండటం. శ్రీపాద, మల్లాది మొదలుకుని మధురాంతకం రాజారాం దాకా వాసికెక్కిన కథకుల్లో చాలామంది కథ రాశారనడం కన్నా, కథ చెప్పారనడమే సబబు. మళ్ళీ అలా, ఆ కథ చెప్పే ధోరణిని అందిపుచ్చుకుని, ఆసాంతమూ ఆసక్తిగా చదివించే పుస్తకం ఆ నేల, ఆ నీరు, ఆ గాలి. సంభాషణల్లో చిన్న విరుపూ, లేనిపోని ఆర్భాటాలు కనపబరిచే వ్యక్తిత్వాల పట్ల దాచుకోని వెరపూ, తెలుగువారైతేనే తప్ప అర్థంకాని కొన్ని తెలుగు అలవాట్ల మీద నిస్సంకోచంగా వదిలిన వ్యంగ్యం, ఈ సంపుటిని ప్రస్తుతం చుట్టూ కనపడుతున్న తెలుగు కథల సంపుటుల నుండి ప్రత్యేకంగా నిలబెడతాయి. చెప్పొద్దూ అన్న ఊతపదాన్ని దగ్గరుంచుకుని, చుట్టూ మందిని కూడదీసి అనర్గళంగా కబుర్లు చెప్పుకుపోతున్నట్టుండే ఈ శైలి రెప్ప వేయనీయదు. తల తిప్పనీయదు. “మా తెలుగు మేష్టారిని తల్చుకుంటూ” అంటూ మొట్టమొదటే ఎదురొచ్చే మాటలు, ఈ కథ చెప్పే గుణాన్నే పరిచయం చేస్తాయి. ఇంగ్లీషు పాఠాల మీద తెలుగువాళ్ళకుండే వదుల్చుకునే వీల్లేని భక్తీ, తెలుగు క్లాసుల్లో నడిచిన అల్లర్లూ సందళ్ళ మీదుగా, తెలుగు మేష్టారు చెప్పిన శ్లోకానికి చెవులప్పగించి రచయిత తెలుగు మీద ఆసక్తి పెంచుకోవడం మీదుగా, ఆ మేష్టారి ఉద్యమ జీవితం దాకా కథనమంతా ఒకే ఒరవడిలో సాగిపోవడం చూస్తే, కథ చెప్పడం ఇంత తేలికా అని ఆశ్చర్యం కలుగుతుంది. వాళ్ళ స్వచ్ఛంద ఉద్యమ జీవితం గురించి చెప్పి, దాని ఫలాలు అనుభవిస్తున్న వెర్రిమొహాల మీద వ్యంగ్యం గుప్పించడమూ రచయిత మర్చిపోలేదు.
వ్యంగ్య రచనల్లో చివరికి పెదాల మీదకి పల్చటి నవ్వును తెప్పించే గుణంతో పాటు, మామూలుగా అంత తేలిగ్గా ఒప్పుకోవడానికి, తల్చుకోవడానికి ఇష్టపడని విషయాలను గురించి ఆలోచింపజేసే లక్షణం, కొండొకచో ఒప్పింపజేసే లక్షణం కూడా ఉంటుంది. చిరుచేదు గుళికను రవ్వంత తీపితో కలిపి నోట పెట్టినట్టు, ఇబ్బందిపెట్టే విషయాలను కాసింత హాస్యం తోడుగా ఇట్టే పాఠకులకు చేర్చారీ రచయిత. అమెరికాకు వచ్చిన తొలితరం తెలుగువారిలో ఒకరిగా, ప్రాక్పశ్చిమ సంస్కృతుల మధ్య ఉండే భేదాలు, అవి చెరుగుతూ వచ్చిన తీరు, రచయితకు తెలుసు. తప్పనిసరిగా అబ్బే విద్యలూ, అలవాటుగా మారే పోకడలూ, తరాల అంతరంతో చూసీ చూడనట్టుండాల్సిన విషయాలు ఈ కథల్లోకి అలవోకగా జారిపోతాయి. అలా చూసినప్పుడు, ఈ కథల్లో చరిత్ర పుస్తకాల్లో దొరకని విభిన్నమైన వివరముంది.
అంటు అత్తగారు, మెటామర్ఫసిస్ అలాంటి కథలే. గోమెజ్ ఎప్పుడొస్తాడో? అన్న కథ మనుషుల్లోని మంచినీ చెడునీ దేనికీ వత్తాసు పలకకుండా చూపిస్తూనే మనిషితనం మీద నమ్మకం పెంచే కథ. సంపుటికి శీర్షిక అయిన ఆ నేల, ఆ నీరు, ఆ గాలి సీతారామలక్ష్మణులను అడ్డుపెట్టుకుని గోదావరి నీళ్ళ మీద ఆడిన వేళాకోళం. కథాచిత్రాల్లో ద్వైతం బుద్ధిమంతులకూ బద్ధకస్తులకూ ఉన్న అవినాభావసంబంధం కళ్ళకు కడుతుంది. చారిత్రక జీవన సత్యాలు కలుపుకుంటూ అందరి జీవితాలూ ఒక్కటేలెమ్మన్న ఊరటనూ ఇస్తుంది.
ప్రయత్నం మీదనైనా ఇలాంటి గొంతు అందరూ అందుకోగలిగింది కాదు. మొదట్లోనే చెప్పినట్టు ఇందులో చాలా కథలు కూర్చోబెట్టి కథ చెప్పే అరుదైన ధోరణికి అద్దంపట్టే కథలు. హాయిగా, మిత్రుడితో సాగే ఆత్మీయ సంభాషణలా, లేనిపోని మర్యాదలూ నటనలూ పక్కన పెట్టి, దాపరికం లేకుండా కులాసాగా మాట్లాడుకున్న ముచ్చట్లు.
రచయిత: వేలూరి వేంకటేశ్వరరావు
వెల: రూ. 80
ప్రతులకు: నవోదయ లేదా కినిగె.