డివెర్టిమెంటో

హొటేల్ సెయింట్ అగస్టీన్, ప్రాగ్.

“సో గ్లాడ్! ప్రాగ్ మళ్ళీ నా కోసం రమ్మంటే వచ్చావు! ఎంత మంచిదానివి!”

నిసి షామల్ భుజం నిమురుతూ అన్నాడు విక్టర్. ఆమె గుండ్రని భుజం నిమరటం అతనికెంతో ఇష్టమైన పని. ఆమె తల అతని ఛాతీ మీద ఉన్నప్పుడు ఆ కురుల సుగంధాలు, ఆ వెంట్రుకల చిక్కుల లోపలికి చెయ్యి పోనిచ్చి, బిగించి పట్టడం, ఆమెకు తన శరీరమంతా ఆనించటం, ఆ భుజాలు నిమరటం, ఓహ్! ఇట్స్ హెవెన్! నిసిది చాలా చక్కని ఒంపుల శరీరం, ఈ భారతీయ స్త్రీ అతనికి తను మోగించే బీథోవెన్ సొనాటా లాగా ఉంటుంది. కొంత కాఠిన్యం, కొంత సౌకుమార్యం.

“జొ వాదా కియా ఓ నిభానా పడేగా
రోకే జమానా, చాహే రోకే ఖుదాయీ,
హమ్ కో ఆనా పడేగా”

పాడింది నిసి.

బ్యూటిఫుల్ మెలడీ! బట్ వాట్ డస్ ఇట్ మీన్? అని అతడంటే, ఆమె ఆ పాట ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తెలిసి ఉన్న తాజ్‌మహల్, ఎవరి ప్రేమచిహ్నంగా నిర్మించబడిందో ఆ ప్రేమికులు పాడిన పాట, చాలా చక్కని హిందీ సినిమా, కమ్మని సంగీతం, తప్పక చూడమని చెప్పింది అతనితో. ఐతే, మనం కలిసే చూద్దాం ఆ సినిమా, అన్నాడతను.

నిసి తనలో తను ఇలా అనుకుంటున్నది. మేము ఎదురూ బొదురూ కౌగిలించుకున్నప్పుడు, ప్రపంచంనుంచి విడిపోయినట్టుంటుంది. విక్టర్ తనను వెనక నుండి కౌగిలించినప్పుడు, ఒక వెచ్చని మాక్స్-మారా కాశ్మీరీ క్లోక్‌లో ఉండి, కళ్ళెదుటి అందాలు నిశ్చింతగా, అతడి రక్షణలో చూస్తున్నట్టుంటుంది. అనంతమైన వివశత్వం.

“ప్రాగ్, ఈ హోటేల్, మనం ఇలా కలుసుకోగలగటం నాకు పరమానందం కలిగిస్తూంది విక్! లక్జరీ హొటేల్, మొనాస్టరీ కలిసి ఒకేచోట ఉండటం నేను ఊహించనే లేను. ఈ సెయింట్ అగస్టీన్‌లో ఉండి, ఇక్కడి సెయింట్ థామస్ ఫ్రయర్స్ వారి అనుమతి తీసుకుని కలుసుకుని మొనాస్టరీ చూడటం, వారి లోకల్ బ్రూవరీస్‌లో డార్క్ ఏల్ తాగటం! వాట్ ఏన్ ఎక్స్‌పిరియన్స్!”

“ఐ నో! నువ్వు కాబట్టి, ఆ మస్టీ డంజన్‌లో లైబ్రరీకి తీసుకువెళ్ళి, ఆ పురాతన మతపు ప్రార్థనాగ్రంథాలు చూద్దామని ఉబలాటపెడతావు. ఇంకా చిత్రమేంటంటే, నువ్వు ఇండియన్, యూరోపియన్ నేన. మనం కలిసి ఏ గతంలోని చరిత్రలు చూసినా, నీ అనుభవం నాకూ, నా అనుభవం నీకూ అందదు. ఐనా మనిద్దరం ఏది కలిసి చూసినా, ఒక వింత ఆనందం. ఎందుకంతసేపు చేశావు, ఎలిౙబెత్ జేన్ వెస్టన్ సమాధి ముందు. ఓ! గాడ్! ఎంతమంది సమాధుల మీద నడిపించావు ఆ వసారాలలో! పోన్లే! ఆ తర్వాత నన్ను వెళ్ళగొట్టకుండా, నీతో బాత్‌టబ్ పంచుకోనిచ్చావు కదా. ఐ ఫర్‌గివ్ యూ స్వీటీ!”

నిసి అతని వైపుకు తిరిగి, అతన్ని కన్నులారా చూసింది. ఓహ్! ఇవ్వాళ సాయంత్రం ఇతనితో కలిసి ట్రామ్ తీసుకుని, తన ఫేవరెట్ రోజ్ గార్డెన్‌లో వెన్నెలలో స్ట్రోల్. మూన్‌లైట్ సొనాటాను పరిపూర్ణంగా పఠించి, బీథొవెన్ ఫామ్‌ను శోధించి, అది విలాస గీతం ఎంతమాత్రం కాదని తెలిసికూడా అంత ఎక్సయిటింగా పలికించగలిగిన ఈ విద్వాంసుడితో, అంతూపొంతూ లేని గులాబీల తోటలో, వెన్నెల విహారం. ఇట్స్ ప్యూర్ బ్లిస్. స్మెతానా గురించి తన కొత్త కాంపోజిషన్ గురించి ఏమైనా తన మాటల్లో తెస్తాడేమో!

విక్టర్ అంతకంతకీ, డిగ్నిఫైడ్‌గా మారుతున్నాడు. హి ఈజ్ సో వెల్ గ్రూమ్‌డ్! పియానో లోని పలువాయిద్యాల మధురిమలు, శక్తులు, అతని ముఖపు కండరాల్లో, అతని అవయవాలలో చేరిపోతున్నవా! హిజ్ లిప్స్! హిజ్ లిప్స్! గాడ్! హి ఈజ్ సచ్ ఎ గుడ్ కిసర్!

ఆమె చెవులకు, తను తెచ్చిన నాజూకు రోజ్ గోల్డ్ లోలాకులు ఎక్కిస్తూ, ఊగుతున్న షోపార్డ్ డైమండ్‌ను గమనిస్తున్నాడు విక్టర్.

“నువ్వు వచ్చేలోపలే, జ్యూయిష్ క్వార్టర్‌లో, పేరిస్ స్ట్రీట్ లోని జ్యూయలర్ నుండి, ఇవి తెచ్చి ఉంచాను. స్వీటీ! వీటికి మేచింగ్ ఈ సన్నని కంకణం, దానికి అతుక్కుని ఊగే ఎన్నో హృదయాలు, ఒక్కో దానిలో ఊగే షోపార్డ్ రవ్వ. ఇట్ ఈజ్ సో రైట్ ఫర్ యూ! కాని ఈ కంకణం నీ చేతికి ఇప్పుడు తొడగను. టూ డెలికేట్! నేను నీతో కొన్ని మోటు పనులు సంకల్పించాను.”

“కాంట్ వెయిట్!” అంది నిసి.

ప్రాహా ఎయిర్‌పోర్ట్, ప్రాగ్.

“సీరియస్‌లీ విక్! నాకు ప్లేన్ ప్రయాణాలు ఇక చెయ్యలేననిపిస్తున్నది. ఎప్పటి 9-11. ఇట్ రూయిన్డ్ ది ఎయిర్ ట్రావెల్ ఫర్ ఆల్ ఆఫ్ అజ్! అప్పుడు పెట్టిన రెస్ట్రిక్షన్స్ ఇంతవరకూ మనల్ని వదలలేదు. ప్రజల సేఫ్టీ సేఫ్టీ అంటూ పబ్లిక్ యుటిలిటీస్, ప్రతి వాటిమీద ఈ ఆంక్షలనేవి పెరగటమే కాని తరగటమన్నదే లేదు. వాటి మూలాన, ఎయిర్‌పోర్ట్‌కు కొన్ని గంటలు ముందు పోవాలి. గంటలు గంటలు ఎయిర్‌పోర్ట్ లోనే పడి ఉండాలి. ఆ స్కానర్ల తనిఖీలు, ఎంత విసుగు. ఒళ్ళు తడిమితే, మా డాక్టర్లకేముంది కాని, అన్నిచోట్లా తొక్కివచ్చిన షూస్ విప్పించి, కోట్లూ, స్వెటర్లతో కలిపి ఆ బిన్స్‌లో పడేయించటం, మళ్ళీ అవే వేసుకోవటం, సో అన్‌శానిటరీ!”

“ఐ నో. అయినా గాని, నిసీ! నేను మళ్ళీ యు.ఎస్.ఎ. ఎప్పుడు వస్తానా, మన కలయిక ఎప్పుడు ఎక్కడ ఏ దేశంలోనా అని వింతపడకుండా ఉండలేను. ఎదురుచూడకుండా ఉండలేను.”

“విక్టర్! ఐ యామ్ సో స్ట్రెస్డ్. రియల్లీ. విత్ బోత్ లోకల్ అండ్ ఇంటర్నేషనల్ ట్రావెల్. నేను కొన్ని రకాల గేదరింగ్స్‌కి వెళ్ళటం మానేశాను. ఆలమ్నై రీయూనియన్స్, ఏనివర్సరీస్, మదర్స్ డే, మారేజెస్, సెలబ్రేషన్స్ ఆఫ్ లైఫ్, లిటరరీ మీట్స్, అన్నీ వెళ్ళిపోయినయ్ కేలండర్ లోంచి. నాకైతే వైద్యులతో నిండిపోయి ఉన్న నా కుటుంబం మొనాటనీ ఇప్పుడు నిజంగా, భరించరానిదైపోయింది. అన్ని జెనరేషన్లూ కలిపి లెక్కపెడితే, ఇరవైమంది పైన డాక్టర్లు ఉన్నారు. మా ఒక్క కుటుంబం నుండే. తెలుగుదేశం నుండి వైద్యరంగంలో వివిధ శాఖల్లో కృషిచేసిన ఇంతమంది ఉన్న కుటుంబం మరొకటి లేదు. పెళ్ళాడిన వైద్యుల సంఖ్య కూడా కలిపితే ముఫ్పయిల్లో ఉన్నట్టున్నారు. ఎంతసేపూ హాస్పిటల్, కాల్స్, స్కెడ్యూల్స్, బిల్లింగ్స్, లంగ్స్, గట్, బోన్స్, రోగాలు రొష్టులు. సేవింగ్ లైవ్స్ జంక్, ఐ యామ్ సిక్ ఆఫ్ మై ఫేమిలీ!”

“హ, హ! అందుకే పనిగట్టుకుని లండన్ వెడుతున్నావు, డార్లింగ్! నీ ఫేమిలీలో మరో ఇద్దరిని కలవటానికి! ఐనా, నువ్వు ఆంకాలజిస్ట్ కాకుంటే, మనం ఎలా కలిసి ఉండేవాళ్ళం! నా జీవితంలోకి నీ ప్రవేశం ఒక అద్భుతం. మన మధ్య మరిచిపోలేని సంబంధం కల్పిస్తివి. సో, నిసీ! గో, గో టు లండన్! హేవ్ ఎ గుడ్ టైమ్ విత్ దెమ్! నువ్వు క్షేమంగా ఉండు! గో! మళ్ళీ కలుద్దాం.”

తన అల్ట్రాలైట్ టూమీ సూట్కేస్ చులాగ్గా లాగుతూ చకచక గేట్‌కేసి వెడుతున్న నిసిని చూస్తుంటే విక్టర్ గుండ్ బరువెక్కింది.

“Every time we say good bye
I die a little
Every time we say good bye
I wonder why a little
Why the Gods above me,
who must be in the know
Think so little of me,
They allow you to go… “

–అహ్! సన్ ఆఫ్ ఎ బిచ్! కోల్ పోర్టర్! దీజ్ సాంగ్ రైటర్స్! దే నో ఎవ్రీథింగ్!

క్వీన్ మేరీస్ గార్డెన్స్, లండన్.

ఒక చక్కని కలువల కొలను దగ్గర కూర్చుని మాట్లాడుకుంటున్నారు వారు ముగ్గురూ!

మేనత్తలు నీల, నిసి, ఇద్దరు ఒకేసారి లండన్ రావటం, అదీ తన ఇండియా ట్రిప్ ముందే జరగటం, వారి మేనకోడలికి చాలా సంతోషాన్నిచ్చింది. అదీ! వారంతా ఈ అతి చక్కని చోట ఆ రోజు కలవాలనుకోటం. జస్ట్ గ్రేట్! కొలనులో హంసలు విలాసంగా తేలుతున్నాయి, వారి కళ్ళముందు. రంగుల తుమ్మెదలు ఓడ్‌హౌస్ కథలలోలాగా ఎగురుతున్నయ్యి. గాలి తేలిక సుగంధాలు తెస్తున్నది.

ఆ అత్తలిద్దరూ దాదాపు ఒకటిగానే ఉంటారు. చిన్నప్పుడు వారు కవలలేమో అని భ్రమపడేవారు కొంతమంది. నిసి అమెరికాలో పనిచేసి రిటైర్ ఐన రేడియేషన్ ఆంకాలజిస్ట్! నీల ఇంకా డబ్లిన్‌లో ప్రాక్టిస్ చేస్తున్న రేడియాలజిస్ట్. కోట్‌వాల్డ్స్‌లో ఒక చక్కని కాటేజ్ లీజ్ చేస్తుంది సెలవుల కని, అప్పుడప్పుడూ. అక్కడకి పిలుస్తుంది తన సెలవల్లో చుట్టాలనెవరినైనా వచ్చి కొన్నాళ్ళు ఉండిపోయేట్టు.

వారి మాటల మధ్యలో, నీలతో మేనగోడలు, “అత్తా! నా పేరు నువ్వే పెట్టినట్టు నాయనమ్మ చెప్పింది. మా అమ్మా నాన్నా పేర్ల కోసమని వెతుక్కుంటున్నప్పుడు, నువ్వు చెప్పిన పేరు వాళ్ళు వెంటనే ఒప్పేసుకున్నారని విన్నా. నాయనమ్మ, నిజంగా నాకంత బాగా తెలియదమ్మా అంది. మా అమ్మకు తెలుగు సరిగ్గా రాదయ్యే. నా పేరుకు అర్థమే ఆమెకు తెలియదు. అసలు ఆమె పేరుకు అర్థమే ఆమెకు తెలియదు. నాన్ననడిగితే, నువ్వొక ‘చిన్న బండ’ అని అర్థం అన్నాడు. మళ్ళీ ఎందుకో, నన్నడగకు. మీ పెద్ద మేనత్త ఉందిగా, ఆమెనే అడిగి చెప్పించుకోమన్నాడు.”

“హ్మ్! మంచి సమయం! ఇండియా వెడుతున్నావు, నిన్ను పెంచిందని, ప్రేమతో మీ నాయనమ్మను చూస్తానికి. ఇది కొంత మా అమ్మ ‘సుమతి’ కథే. ఆమే నీతో చెప్పొచ్చు. ఐనా నేను చెపుతాలే నీకు. ఇప్పుడు నేను వెల్చేరు నారాయణరావు, డేవిడ్ షూల్మన్ రాసిన శ్రీనాథ అని ఒక తెలుగు కవి గురించిన పుస్తకం చదువుతున్నాను. అందులో పాలసముద్రం చిలకటం అనే మైథలాజికల్ కథ, శ్రీనాథుడు చెప్పిన పద్ధతిని డిఫెమిలియరైజేషన్ స్ట్రాటజీ అన్నారు వాళ్ళు. పైగా ఎంతో చమత్కారంగా- బహుశా శ్రీనాథుడు ష్క్లావ్‌స్కీని, తోల్‌స్తోయ్‌ని చదివాడేమో అంటారు. అన్నారు. నేను ఇప్పుడు ఆ పద్ధతిలో శివుడు, పార్వతికి కథ చెప్పినట్టు, నీకీ పేరెందుకొచ్చిందో చెపుతాను.” అంది నీల.

ఆమె శ్రోతలిద్దరూ గలగలా నవ్వి, పిక్నిక్ బాస్కెట్ లోనుండి సాఫ్ట్‌డ్రింకులు బైటికి తీసి, బ్లాంకెట్లమీద విశ్రాంతిగా సెటిలయ్యారు.


సుమతికి ఆ ముదనష్టపు నడుమునొప్పి ఎప్పుడు పట్టుకుందో ఆమెకు సరిగ్గా గమనికలేదు. డాక్టర్లు ఎవరైనా ముందు అడిగేది నొప్పి ఎప్పటినుంచీ అనేగదా. అది ఆమె చెప్పలేకపోయింది.

పూరీలు వేయిస్తున్నప్పుడు, అప్పుడప్పుడూ, గబుక్కున కుడి కాలులోకి షాక్ లాగా వెళటం కొంత గుర్తు. ఆ తర్వాత నడుము పట్టేసినట్టుగా ఉంటం, కుడివైపు నొప్పి, గేస్ పొయ్యి మీద వంట చేసేప్పుడు ఒక కాలు కాస్త ఎత్తు పీటమీద పెడితే, రిలీఫ్ రావటం గమనించింది.

మామూలుగానే, అన్ని కంప్లెయింట్లూ (తన సంసారం గురించి సహా) చెప్పుకునే తన ఆప్తమిత్రురాలు డాక్టర్ సీతారత్నంతో ఆ సంగతి చెపితే, ‘ఇరవై నాలుగు గంటలూ పనిచెయ్యకుండా, కొంచె నొప్పి తగ్గేదాకా మధ్య మధ్య విశ్రాంతిగా ఉండు. ఈ నొప్పి బిళ్ళలతో సర్దుకుంటుందేమో చూద్దాం,’ అంది.

కాని ఆ ఇంటి చక్రమంతా తిప్పేది సుమతి.

ఒకరోజు పొద్దున్నే పూరీ, బంగాళాదుంప కూర; మరోరాజు ఇడ్లీలు, కొబ్బరిపచ్చడి; ఇంకోరోజు పెసరట్టు, అల్లప్పచ్చడి; మరింకోరోజు రవ్వదోసె, ఎవరు చేస్తారు? ఇంటిల్లపాదీనే కాకుండా, ఆ బెజవాడలో సరిగ్గా వంటరాని, వచ్చినా మొగుడికి వండి పెట్టేందుకు మనస్కరించని భార్యామణులు చాలామందే ఉన్నారయ్యే. వారి భర్తలు కూడా సరిగ్గా ఉదయపు ఫలహారాల టైమ్‌కి వస్తూంటారయ్యే. వాళ్ళకి పెట్టకుండా సుమతి భర్తగారు, డాక్టరు బాలముకుందరావు తినరయ్యే. అందుకని ఆమె ఎప్పుడూ ఇబ్బడిముబ్బడిగా వండేది.

ఆ ఇంట్లో ఎవరూ అలారం మోతలకి నిద్ర లేవరు. సుప్రభాత గీతికలూ వినపడవు. అంతకన్నా పొద్దున్నే, ఇంట్లోనే ఉండే పాలేరు చావిట్లో గేదకు కుడితి కలిపిపెట్టి, తర్వాత పొదుగు శుభ్రంగా కడిగి పాలు తీసుకువచ్చి ఆ తపేళా సుమతికి ఇచ్చి, వేరే పనులమీద వెళ్ళేవాడు. అవటానికి ఎన్నో ఏళ్ళుగా ఆమె బెజవాడ పట్టణవాసి ఐనా, ఆమెకు కొంత పల్లెటూరును వాళ్ళ నాన్న రవాణా చేస్తుంటాడు. ఆ ఇంటోకి పోతే ఆయన పంపిన పందిరి మంచాలు, చెక్కుడు బీరువాలు ఉండేవి. ఆ ఇంటి పెరడులో తనే వేసిపెట్టిన చావిడి ఉండనే ఉంది. ఆయన ఏటా తోలిపెట్టే పాడి గేదె, నేసిపెట్టే గడ్డివాము, షెడ్‌లో గడించి మీద నిలవచేసే బియ్యపు బస్తాలు, వంటింట్లోకి తరలించే పప్పులు, ఉప్పులు క్రమం తప్పకుండా సాగుతూనే ఉన్నయ్యి. సుమతి తల్లి పండగలకి కారపు చేగోడీలు, పప్పుచెక్కలు, గట్టి పకోడీలు, తీపికి కాజాలు, కజ్జికాయలు, మైసూరుపాక్, నిలవ పిండి వంటలు, సాదాలడ్డూలు, బూందీ లడ్డూలు తెస్తూనే ఉంది. సుమతి వారికి ఒక్కతే సంతానం. కూతురు, అల్లుడు మీద ఇబ్బడిముబ్బడైన అలాటి ప్రేమ చూస్తే, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి కథలో చూడాలి. లేకుంటే ఆ ఇంట్లో చూడాలి. బెజవాడ పట్టణమేంటి, ఈ వాములేంటి, ఈ గేదెలేంటి అని ఎవరైనా అడిగేదాకా, అంత గవర్నమెంట్ అప్పటికి ఏర్పడలా. రావిశాస్త్రి వైజాగ్ గేదెల లాయర్‌గిరీ, వ్యాజ్యాలు ఆ డాక్టర్ ఇంటికి రాలా.

ఇంట్లో ఎక్స్-రే డాక్టరు ముకుందుగారు, వారి ఆఖరి సంతానమే కాక అన్నదమ్ముల అక్కచెల్లెళ్ళ ఆఖరి బిడ్డలు స్కూలు, కాలేజ్ చదువుల్లో నిమగ్నమై ఉండేవారు. వారు పొద్దున్నే కాగే పాల వాసనలు, కాఫీ సుగంధాలు, టిఫిన్ ఘుమఘుమలకి నిద్రలేచి తయారై, తిండితిని బడులకు, ట్యూషన్లకు, కాలేజ్‌లకూ పోతుండేవారు. అది నిజంగా ఒక విచిత్రమైన ఇల్లు. అక్కడ అందరూ కాందిశీకులే. తెలుగు సినిమా ఐతే, కుటుంబం, ఉమ్మడి కుటుంబం అని మెచ్చేసుకుంటుంది. కొందరు పొరుగు టీచర్లు, మాంటిసొరీ ప్రిన్సిపల్ కోటేశ్వరమ్మగారు ఆ ఇంటిని హాస్టల్ అనొచ్చు. గ్లూమీ డికెన్స్, లేకుంటే, ఫెమ్మీ ఓల్గా లాటి రైటర్లు అనాథశరణాలయం అన్నా అనేస్తారు.

ఆ ఇంట్లో సుమతి లేకుంటే ఒక్క పని నడవదు. ఎందరో చుట్టాలు నివాసముండే ఆ ఇంట్లో ఆమె ఇంటి యజమానురాలు, గృహిణి అని రూఢిగా అందరికీ తెలిసేది రోజూ చేసే ఆమె పని వల్లే. సుమతి ఇప్పటికీ వంటింట్లో చల్లకవ్వం తిప్పి చల్ల చెయ్యటం, వెన్న తియ్యటం చేస్తుంది. కాని ఆ సమయంలో ఒక్క పదం రాదు పాడటానికి. ఇప్పటికీ ఇంతబారున జడ ఉంటుంది కానీ ఒక్క వంకీ సున్నా. నిటారుగా కిందకు పెరిగిపోయాయి ఆమె వెంట్రుకలు. ఆమె కుర్రపిల్లగా, కాటూరులో కర్రసాము నేర్చుకుని, ఊళ్ళో కుర్రవాళ్ళతో సాముగరిడీలు చేసి, దేహపుష్టి కలిగిన స్త్రీ. బాలముకుందరావు నాజూకు చేతులకూ పాదాలకూ, గోళ్ళరిగిపోయిన ఆమె పారల్లాటి చేతులకూ, కండకలిగిన ఒంటికీ ఏమీ సాపత్యం ఉండదు. శరీర సౌందర్యం సుమతి స్ట్రాంగ్ పాయింట్ కాదు. అందచందాలకు ఆమె ఎక్కువ స్కోర్ ఇవ్వదు. ఒంటరిపిల్లగా పెరిగిన ఆమెకు చుట్టరికాలతో, స్నేహాలతో కిటకిటలాడే ఇల్లు, ఆ సంసారమే జీవం పోసింది. ఆమెకు తగినది ఆ ఇల్లే. దైవం చిన్నప్పటి ఆమె ప్రార్థనలు వినబట్టే, ఆ బిజీ బిజీ స్కెడ్యూలు ఆమెకిచ్చాడు.

పొద్దుటి టిఫిన్లు అవుతుండగానే, కూరగాయలమ్మేవాళ్ళు వస్తారు. వాళ్ళతో పాటు కింద మునివేళ్ళ మీద కూర్చుని తట్టల్లోని సొరకాయలు, బీరకాయలు, కరేపాకు, కొత్తిమీర కట్టలు, అన్నీ ఏరుకుని వంటింట్లోకి చేర్చాలా! ఇంతలోనే కోడుగుడ్లమ్మే సాయిబు అతనొస్తాడు. ఒక గిన్నెలో నీళ్ళు పోసుకుని వచ్చి, ఒక్కోగుడ్డూ మునుగుతుందో తేలుతుందో తనే స్వయంగా పరీక్షించి ఓ రెండు డజన్ల గుడ్లయినా, మురిగిపోనివి ఎంపిక చెయ్యాలా!

ఆసరికే అన్ని గేస్ పొయ్యిలూ వెలిగించి, మధ్యాహపు భోజనాల ప్రయత్నం మీదుండాలా! మధ్యలో, మరో ఇద్దరు బుడతలకు నలుగుల స్నానాలు చేయించాలి, తిండి తినిపించాలి. రోళ్ళు, రోకళ్ళు కడగటాలు, పచ్చడి నూరటాలు, పప్పు రుబ్బటాలు, చాకలికి బట్టలు వెయ్యటాలు, ఇస్త్రీ బట్టలు బీరువాలో సర్దటాలు అన్నీ ఆమె ఒక చెయ్యి వేస్తేనో లేకుంటే ఆమె సహకారంతోనో జరుగుతాయి. ఆమె మల్టీ టాస్కర్! ఏ విభాగంలో పనిచేసేవాళ్ళు ఎవరు నాగాపెట్టినా, వారి బదులు ఆమె ఆ పని అందుకుని పూర్తిచెయ్యగలదు.

అలాటి వ్యక్తి మెల్లిగా కాలు ఈడుస్తుంటే, అప్పుడప్పుడూ కాసేపు వెళ్ళి పడుకుంటే, అందరికీ ఆశ్చర్యమే కాని, అసలు ఆమె పనికి నాగాపెట్టడం వారు ఊహించను కూడా లేరు. ఛీ! సిగ్గు చేటు! పట్టపగలు పడుకోటమా, అనుకునే మనిషయ్యే.

నీల సుమతి, ముకుందుల పెద్ద కూతురు. వాళ్ళ అమ్మ అస్వస్థత (అమ్మో, అంత జబ్బుమాట ఈ సూపర్‌హ్యూమన్ మెషీన్‌కి వర్తిస్తుందా!) గురించి విని బెజవాడ వచ్చింది. వాళ్ళమ్మకు ఎంత వయసనీ! అంతా కలిపి నలభై ఉండవు. నీల పిల్లలు, ఆమెను అమ్మమ్మను చేశారు. నీల మద్రాసులో సాగించిన డాక్టరు చదువు, బెజవాడలో సుమతిని ఫుల్‌టైమ్ నానీని చేసింది.

ఇంట్లో, తనకన్నా పెద్దవారైన కజిన్‌లు, చదువులు పూర్తిచేసుకుని విదేశాలు పోతున్నారని విని, నీల కూడా ఫారెన్ పరీక్ష కౌలాలంపూర్‌లో రాసేట్టుగా నిర్ణయించుకుని, హౌస్ సర్జన్సీ పూర్తవగానే కొన్నాళ్ళు బెజవాడింట్లో ఉండి పరీక్షకు చదువుకుందామనుకున్న ఆ శుభ సందర్భంలోనే, ఆ సమయంలో రాకూడని జబ్బు వచ్చి, వాళ్ళమ్మ నడుములో వెన్నుపూసల మధ్య డిస్క్ జారిపోయింది.

సుమతి గురించిన స్పృహ అందరికీ ఉన్నా ఎవరికి కలగబోయే ఇబ్బందుల గురించిన ఆలోచన కూడా ఇంట్లోని వారికి ఉంది. సుమతికే అందరికన్నా తను మూలబడితే ఆ ఇల్లు ఎలా నడుస్తుందని ఉంది. నీలకి ఇ.సి.ఎ.ఎమ్.జి. పరీక్ష దగ్గరపడింది. ఆమెకు తన పిల్లల పని ఇంతకూడా రాదు. వాళ్ళెవరో, ఆమెవరో! తన జబ్బుమేళంతో, పిల్లల పనితో, నీల పరీక్షకి ఎలా చదువుతుంది! సుమతికి, పెద్ద కూతురు నీల పరీక్షల మెట్లు అలా ఎక్కుతూ పోకపోతే, డాక్టరుగారు మద్యపానం మరింత ఎక్కువ చేస్తారనే ఆందోళన ఉంది.

బాలముకుందు సంవత్సరాల మీద చేర్చిన బంధు బలగం, వెళ్ళినవాళ్ళు వెళ్ళగా, కొత్తగా దిగబడిన ఇతరసంతానం గదుల్లో ఎలాగో సద్దుకుని ఉంటున్నట్టు విన్నాం కదా. ఈ మిగతా సంతు పర్యవేక్షణకి నీల నాయనమ్మ వడుంకట్టి అక్కడే ఉంటుంది. ఆమె కొంచెం అటూ ఇటూగా పల్నాటియుద్థంలో భానుమతి పోషించిన నాయకురాలు నాగమ్మ పాత్రను నిర్వహిస్తుంది. తను తలచిన తంత్రాలు నిర్విఘ్నంగా జరిపేసి, తనకు లాభించని ఆలోచనల గొంతు నులిమేసేది. ‘తప్పు, తప్పు, మేనరికాలు చెయ్యకండి’ అని కొమ్మూరి వేణుగోపాలరావు అప్పట్లో ఒక పుస్తకం రాశాడని, నీల నాయనమ్మ సంకల్పించిన మేనరికాలు ఏమేనా ఆగిపోయాయా? లేదు. ఆ పుస్తకం వాళ్ళింట్లో బ్యాన్ చెయ్యబడింది. వీరేశలింగంగారు చెప్పారని, వాళ్ళింటో విధవా వివాహాలు జరిగాయా? లేదు. కుటుంబంలోని వీరకమ్యూనిస్టు కూడా మొదటి ఆడపిల్లకు పద్నాలుగేళ్ళకే బాల్య వివాహం చేసేశాడు. సుమతి ఇంట్లోవారందరి ధాటికి ఆగలేని సుమతి తలిదండ్రులు, జడుస్తూ జడుస్తూనే కాటూరు నుండి సరుకులు జేరేసి, కొన్నాళ్ళు ఊళ్ళో తెలుగు సినిమాలు చూసుకుని, ఓ మారు దుర్గ గుడికి పోయి, కొబ్రికాయలు కొట్టి, సుమతి నడుంపోటు లేకుండా తిరగాలని మొక్కుకుని వాళ్ళూ వెళ్ళిపోయేవారు.

సుమతి అంత బాగా తిరగటల్లేదని కబురు తెలిసి, గుంటూరు కళాశాల ఆసుపత్రి వైద్యులు వరసాగ్గా వచ్చిపోయారు. పెద్ద డాక్టరుగారు కబురు చేస్తే, ఆర్థోపీడిక్స్ యతిరాజులుగారొచ్చి, మంచం కాళ్ళకింద ఇటుకలు పెట్టించి, ఎత్తు చేయించి, ఒక పుల్లీ ఏర్పాటు చేయించి, ఆమెను కొన్ని గంటల పాటు, కాలు పైకి పెట్టుకుని పడుకోండి, ఆపరేషన్ దాకా ఎందుకు తెస్తారని చెప్పి వెళ్ళారు.

చిన్న డాక్టరుగారి ఎక్సరే దాకానే వచ్చి డ్రింకులు పుచ్చుకుపోయే జగన్మోహనరావు రెండో భార్య జాయ్ ఈసారి ఇంటికొచ్చి డాక్టరునీ, కొద్దిగా సుమతినీ పలకరించి పోయారు. పెథాలజిస్ట్ కామేశ్వరరావు, కార్డియాలజిస్ట్ లక్ష్మణరావు, ఎనస్తీసియాలజిస్ట్ వెంకట్రావు, గుంటూరులో కళ్ళ డాక్టర్ పెదనాన, చిలకలూరిపేట పెదనాన, ఆ ఊరినించీ ఈ ఊరినించీ అంతా, అంతా ఎప్పుడో వచ్చే ఉంటారు. సదాశివరావుగారు జయప్రదగారు, సరోజినీ రామారావు, సుభద్ర, సీతగారితో సహా, వచ్చి వెళ్ళారు. ఏరా సి.బి.! ఏమిటిరా! నిర్లక్ష్యం చేస్తున్నావా, బ్రిడ్జ్ టోర్నమెంటుల్లో పడి? అని కోప్పడే నూతక్కి వెంకటేశ్వరరావుగారు, భార్య రాకుండా ఎలా ఉంటారు!

దీనితో, ఈ పరామర్శల తాకిడితో, ఇప్పుడు సుమతి స్థానంలో వంటకి ఒకరిని పెట్టవలసిన పరిస్థితి వచ్చింది. వచ్చే పోయే వారికి టీలు, కాఫీలు, టిఫిన్లు మర్యాదలు సరిగానే జరుగుతున్నవి.

నీల తన పరీక్ష చదువుతో పాటు కొంత మెడికల్ ప్రాక్టిస్‌తో టచ్‌లో ఉండేందుకు సీతారత్నంగారి హాస్పిటల్లో డెలివరీల్లో సహాయం చేస్తూ, మధుసూదనరావుగారి హాస్పిటల్లో జనరల్ మెడిసిన్ కేసులు ఆయనతో కలిసి చూస్తూ, ఇంట్లో పరీక్షకు ప్రిపేర్ అవుతూంది. ఆమె ద్వారా ఈ డాక్టర్లిద్దరూ సుమతిని ఒక కంట కనిపెట్టి ఉంటున్నారు.

నీల, ఇప్పుడు అమ్మ కమోడ్ ఎక్కువ వాడుతున్నట్టూ, బాత్రూమ్‌కి ఎక్కువసార్లు నడవటంలేదని, అప్పుడప్పుడూ ఆమెను కమోడ్ మీద కూర్చోబెట్టటం, ఆమె ముడ్డి కడగటం, ఆమె సొంత సపర్యలు కొన్ని తను చేస్తున్నట్టు చెప్పింది. సీతారత్నం మామ్మ ’వెంటనే నేను నర్సును ఏర్పాటు చేయిస్తా, ఇదేం బాగా లేదు, చాన్నాళ్ళు, సాగలాగింది. సాంతం మూలబడేముందు సుమతిని ఈ ఉపద్రవం లోంచి బైటికి లాగాలంది. ఆకునూరు అమ్మమ్మ గుర్తుందిగా. కీళ్ళ జబ్బుతో సంవత్సరాలు మంచంలోనే గడిపేసిందిగా. ‘నాకు భయం వేస్తున్నది, ఇదేం బాగాలేదమ్మాయ్!’ అంది.

నీల ఆమెతో ‘ఈ మధ్యే పిన్నమనేని వెంకటేశ్వరరావుగారు, సీతాదేవి వచ్చారు ఇంటికి. అప్పుడు, అమ్మేం చేస్తోందో తెలుసా, కాలు ఈడ్చుకుంటూ చీపురుతో ఇల్లు ఊడుస్తోంది! నేను కిటికీలోంచి చూసి, అమ్మా, నిన్ను చూస్తానికి వాళ్ళొస్తున్నారంటే, చీపురు హడావుడిగా మంచం కింద పడేసి, మంచం ఎక్కి, తన కుడికాలు స్లింగ్‌లో దూర్చి పడుకుంది.’ నీల చెప్పిన తీరుకి, డాక్టర్ సీతారత్నంకి కూడా నవ్వాగలేదు. ఇద్దరూ కలిసి నవ్వారు. అంతలోనే వాళ్ళకు సుమతి దాపుడుకు కళ్ళనీళ్ళు తిరిగాయి. ఆ దాపుడు, రకరకాల దాపుడులు, అదే సుమతి నైజం.

పిన్నమనేని వెంకటేశ్వరరావుగారు గొప్ప సర్జన్! సెభాషైన డాక్టర్! ఆయనకు వైద్యమే ప్రపంచం. బెజవాడలో ఒక సభలో, ఎన్. టి. రామారావు వచ్చి ఆయన పక్కనే కూర్చుంటే, ‘నేను పిన్నమనేని వెంకటేశ్వరరావుని,’ అని తన పరిచయం చెప్పి, ‘మీరెవరండీ!’ అని అడిగిన మహానుభావుడాయన. ఆయసకు వైద్యం తప్పించి ఏమీ పట్టదు. ఆయనంటే అంతా ఇంతా గౌరవం కాదు ఇంటిల్లిపాదికీ. ఆయన లోపలికి వచ్చి సుమతి మంచం పక్కనే కుర్చీ లాక్కుని కూర్చుని, ఆమెను విషయాలడిగితే, ఆమె ఏమి చెపుతుంది! నీలకు ఆయనంటే గుండె అదురు. ఆమె ఏమి పుస్తకాలు పరీక్షకి చదివేదీ తనిఖీ చేసి, ఇంకేమైనా కావాలంటే తనకు చెప్పితే తెప్పించి పెడతానన్నాడాయన. ‘అమ్మని మేం జాగ్రత్తగా చూస్తాంలే. యూ మస్ట్ గో టు అమెరికా, సూన్ యాజ్ యు ఫినిష్ దిస్ ఎక్జామ్!’

యార్లగడ్డ సీతారత్నం నిజమైన స్నేహితురాలు సుమతికి. ఆమెకే ఏమిటి? సుమతి బిడ్డలందరికీ కూడా. ఒకరోజు ఫోన్ చేసి, ‘బాలపరమేశ్వరరావుగారని న్యూరో సర్జన్ ఊళ్ళోకి వస్తున్నారు. నేను ఆయన్ను మనింటికి తీసుకువస్తాను. ఈ లోపల ఆయన అడిగిన ఎక్స్-రేలు, రక్త పరీక్షలు చేయించి ఉంచుదా’మంది.

బాల పరమేశ్వరరావుగారు వచ్చారు. ఎక్కువేమీ ఇతరులతో మాట్లాడకుండానే సుమతితో మాత్రమే మాట్లాడి, ఆమె కాళ్ళు కదలించి పరీక్షించి, కొంచెం మంచం దిగి నడవమని అడిగి, ‘మీరు వైజాగ్ రండి. అక్కడ నేను నడుము మీద ఆపరేట్ చేసి, వెన్నులో జారిన డిస్క్ తీసివేస్తాను. తర్వాత నేను చెప్పే ఫిజికల్ థెరపీ ఎక్సర్‌సైజులూ అవీ చేద్దురు. రండి వైజాగ్‌కి.’ అని చెప్పేసి వెళ్ళిపోయాడు.

అప్పటికి కదిలింది ఆ ఇంటి రథం.

కాటూరుకి వార్త వెళ్ళింది. వైజాగ్‌లో డాక్టర్ సత్యభామారెడ్డిగారికి వార్త వెళ్ళిపోయింది. ఆమె ’ఎంతమంది వచ్చి ఎన్నాళ్ళున్నా పరవాలేదు. అందరూ రండి. నా దగ్గర తప్ప ఇంకోచోట ఉండే ప్రసక్తి తేవద్దు. కాటూరి అమ్మమ్మ, తాత, బాల డాక్టరు, నీల, అందరూ సుమతితో పాటు రావాల్సిందే. నీల ఇక్కడ చదువుకోవచ్చు. వంటవాడు అందరికీ వంట చేస్తాడు. ఇంత ఇల్లు ఉన్నది ఎందుకు? నేనెన్ని సార్లు వచ్చి తినలేదు మీ ఇంట్లో.’ అన్నది.

వాళ్ళంతా పొలోమని వైజాగ్ పోయారు. సత్యా ఆంటీగారు వారిని ఆ ఇంట్లో ఉంచుకున్న తీరు చెప్పసాధ్యం కాదు. ఒక్కరికీ వేరే ఎవరో ఇంటికి వచ్చినట్టు అనిపించలేదు. హాస్పిటల్లో సుమతి ఆపరేషన్ ముందు, అయ్యాక, నీల మొదట్లో హాస్పిటల్‌లోనే తల్లి దగ్గర కనిపెట్టుకుని ఉండి ఆమెకు కేథెటర్ వెయ్యల్సినా, బెడ్‌పాన్ పెట్టాల్సినా, ఇంజెక్షన్‌లివ్వాల్సినా తనే చేసేది. ఆమె ఒళ్ళు తుడవటంలో, తల దువ్వటంలో, పక్క బట్టలు మార్చటంలో సహాయం చేసేది. ఆమె పక్కనే కూర్చుని చదువుకునేది.

బాలపరమేశ్వరరావుగారు అంతకుముందు లానే, రోగినే డైరెక్ట్‌గా అడిగి సమాచారం సేకరించేవారు. మితభాషి. ఎక్కువ టైమ్ ఇచ్చేవాడు కాదు ఇతరులకు. అనవసర సంభాషణంటే ఏంటో ఆయనకు తెలియదు.

నీలకు సత్యా ఆంటీగారంటే అదురు. ఇంట్లో ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ ఆమెకు కనపడేది. ఆమె నీల జడుపు గమనించి, నీల తింటున్నదీ లేనిదీ అజగా చూసేది. ఆమె కోసం కారు ఒకటి హాజరుగా ఉంచేది. వారిద్దరే ఉన్నప్పుడు, ఆంటీగారు ‘నేనెంత ఫూలిష్ కాపోతే, నువ్వు మెడికల్ స్కూల్‌కి వెళ్ళవనుకుంటాను! రియల్లీ సారీ! డాక్టర్! చాలా తొందరపడ్డాడు. చిన్న వయసులో పెళ్ళి చేశాడు. అది చాలనట్టు నేను నా తప్పుడు ఊహలతో, ప్రశ్నలతో నా ఇంటర్వూలో నిన్ను చదువుకోకుండా చేస్తే, ఇంకెంత పెద్ద పొరపాటయ్యేది. నువ్వు ఇ.సి.ఫ్.ఎమ్.జి. తేలిగ్గా పాసవుతావు. ఆ బాల కూతురివి కాదూ! మీ నాన్న ఎస్.ఎస్.ఎల్.సి. స్కోర్ కృష్ణాజిల్లాలో ఇంతవరకూ ఎవరూ అధిగమించలేదని విన్నా. మెడికల్ కాలేజీలో అతని నోట్సులు క్లాస్‌మేట్స్, అతని జూనియర్స్ చదువుకుని పరీక్షలు పాసయ్యారు. మమ్మీ గురించి ఏం బెంగ లేదు. ఆమె చాలా త్వరగా కోలుకుంటుంది.’

నీల గడ్డం పుచ్చుకుని ఆమెకు చక్కని మాటలు చెప్పి, పైగా పళ్ళెంలో అన్నం, కూరలు తనే వడ్డించి దగ్గరుండి తినిపించీ నీల మనసులోని భయాన్ని తన ఆత్మీయతతో ఆంటీగారు కడిగివేసింది. ఒక హాస్పిటల్ ఎలా నిర్వహిస్తుందో, తన ఇల్లు, అంత స్టాఫ్‌తో నిర్వహిస్తుందామె. అందరిపై చెలాయింపు. జమానైన మనిషి, ఖంగున మోగే స్వరం. జడుపు లేని మాట. వస్తుందంటేనే, మరి వణికిపోక వార్డులలోనైనా ఇంట్లోనైనా ఆ సత్యభామ ధాటీకి ఎవరు నిలవగలరు!

కొన్నాళ్ళకు సుమతి కుటుంబం వాళ్ళంతా బెజవాడ తిరిగి వెళ్ళిపోయారు. సుమతి కొన్ని నెలల పాటు ఇంట్లో, సర్జన్ చెప్పినవి విధిగా జాగ్రత్తగా పాటించింది. అందువల్ల, మత్తుమందు బిళ్ళలకు లొంగిపోకుండా, నొప్పిలోంచి క్రమంగా బైటపడింది, కొంచెం మెరుగ్గా నడిచినప్పుడల్లా ఇంకా ధైర్యం పెరిగి మెల్లి మెల్లిగా నిటారుగా నుంచుని చక్కగా ఆరోగ్యం మెరుగుపరుచుకుంది.

కొన్ని నెలల తర్వాత నీల తన కౌలాలంపూర్ ట్రిప్ ముగించి బెజవాడ వచ్చింది. ఓ రోజు హఠాత్తుగా సీతారత్నంగారు ఫోన్ చేసి ‘బాలపరమేశ్వరరావుగారు వైజాగ్ నుండి మద్రాసు వెడుతున్నారంట. వారి ట్రెయిన్ బెజవాడ స్టేషన్‌కు ఈ సమయానికి వస్తుందట. నీ కులాసా ఆయన అడిగారు. వెళ్ళి కలుద్దామా సుమతీ!’ అంది. ఆ రోజుకు సుమతి, నీల, సీతారత్నం, ఎక్స్‌-రే కాంపౌడర్, బాల డాక్టరుగారు, అందరూ కార్లలో వెళ్ళారు. వీళ్ళంతా బెజవాడ రైల్వే స్టేషన్లో, మెట్లు ఎక్కీ దిగీ ప్లాట్‌ఫామ్ మీదికి వచ్చినా, స్టేషన్ మాస్టర్ దగ్గర తీసుకున్న పర్మిషన్‌తో సుమతిని వేరు దోవల్లో వారు ప్లాట్‌ఫామ్ మీదికి తీసుకవెళ్ళారు. అందరూ రైలుకోసం ఎదురు చూస్తున్నారు.

(కధకురాలి స్వరం ఇక్కడ మారిపోయింది. ఆమె కళ్ళు వర్షిస్తున్నాయి. ఆమె తడబడిపోయింది.)

రైలు వచ్చి ఆగినప్పుడు, ఆ సర్జన్ రైలుపెట్టె గుమ్మంలో కనపడినప్పుడు, మా అమ్మ నడిచిన నడక నేనెప్పటికీ మరిచిపోలేను. ఆమె చేతులెత్తి పెట్టిన నమస్కారం మాకు కనిపించింది. మేము ఆమె వేగాన్ని అందుకోలేకపోయాం. ఆమె, తన డాక్టర్ మాట్లాడుకుంటున్నప్పుడు మేం వెనకే ఉండిపోయాం. ఆమె ఆయనతో ఏం చెప్పిందో మాకు తెలియదు. కాని ఆమె నడిచిన తీరు చూస్తే, ఆయనకు ఇంకా వెయ్యవలసిన ప్రశ్నలేముంటయ్!

ఆ నడక, మా అమ్మ నడక నేనెప్పటికీ మర్చిపోలేను. కృతజ్ఞత, కృతజ్ఞత! వైద్యుడి పట్ల ఒక రోగి కృతజ్ఞత. అదీ ఆ నడక.


“ఇప్పుడీ వయసులో మీ నాయనమ్మ వంగిపోయిందని, సరిగా నడవటంలేదని, వాకర్ వాడుతున్నదని జాలితో నువ్వు వెడుతున్నావు. నేను ఎప్పుడో మూలపడవలసిన మా అమ్మను ఆ రోజుల్లో వైద్యంచేసి ఇన్నేళ్ళపాటు చకచకా నడిచేట్టు చేసిన బాలపరమేశ్వరరావుగారిని తలుచుకుంటాను. అందుకే నీ పేరులో ‘బాల’ ఉంది.” చెప్పింది నీల.

“ఓ! నేను తాతగారి పేరు కలిసివచ్చేట్టు పెట్టావనుకున్నా అత్తా!”

“అది కూడా. మా నాన్నగారంటే నాకు తక్కువ ఇష్టమా! అంతేనా! నీ పేరు ఇంటి ఆడబడుచుల పేర్లతో రైమ్ అవుతుంది.”

“ఓ! ప్రఫుల్ల, విమల, నీల, బాల! ఓ, ఐ డింట్ థింక్ ఎబౌట్ ఇట్! మరి శైల ఎందుకు? వై ద రాక్?”

“శైలబాల అంటే పార్వతి. ఆ ఇండియన్ గాడెస్‌కి దుర్గ, భవాని, కాళి, చండి, గౌరి–ఇలా ఎన్నో పేర్లు, ఆమెకెన్నో గుడులు. ఆమె మా అమ్మ ఇష్టదైవం. ఎప్పుడూ తన పూజకు ముందు ఒక పసుపు ముద్ద ఉంచేది. ఆ ముద్దను గౌరీదేవి అనేది. అందువల్ల, నీ పేరులో ఆమెకు ఎక్కువ ఇష్టమైన వారుండాలని. ఎన్నైనా చెప్పూ, ఆమెకు అందరికన్నా ఇష్టమైన మనిషి, ముఖ్యమైన మనిషి మా నాన్నగారే. అందుకూ.”

“ఓహ్! ఆజ్ ఇఫ్ ఉయ్ డోంట్ నో ఇట్!” అంది మధ్య మధ్య టిష్యూలు అందించిన నిసి అప్పుడు.

“ఇట్స్ ఆబ్వియస్! నీలత్తా! ఉయ్ ఆల్ నో ఇట్!” అంది మేనగోడలు నవ్వేస్తూ, “ఐనో! రిలేషన్‌షిప్స్! ఇట్ ఈజ్ ఆల్ సో కాంప్లికేటెడ్!”

“ఇక కథ ముగించనా” అంటూ నీల:

“నువ్వు బెజవాడలో పుట్టావు. అప్పుడు నేను ఆ దేశంలోనే లేను. ఐనా, ఫోన్‌లో ఒక్క సంభాషణ లోనే, దూరంగా ఉన్న నేను చెప్పిన పేరు నీకివ్వటం నన్ను సంతోషపెట్టింది. ఎంత బిజీగా ఉండీ, దాదాపు ప్రతి ఏడాదీ ఇండియా, బెజవాడ వెళ్ళివస్తుంటావు. కొండమీద దుర్గ గుడికి వెళ్ళలేదేమో ఇంకా. మా చిన్నప్పుడు పండగలకి తీసుకువెళ్ళేవారు. ఆ కనకదుర్గ గర్భగుడిలోకి వెళ్ళే ద్వారం మీద ఈ పద్యం ఉండేదని గుర్తు.

‘అమ్మలగన్న యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల బె
ద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చిన యమ్మ దన్ను లో
నమ్మిన వేల్పులమ్మల మనమ్ముల నుండెడి యమ్మ దుర్గ మా
యమ్మ కృపాబ్ది ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్!’

ఈ తెలుగు పద్యం అక్కడ ఉందో లేదో, తర్వాత మాకో ఈ-మెయిల్ పంపు.”

“ప్రయత్నిస్తా, నాకు తెలుగు రాదయ్యే. కానీ, ఇక్కడి నా స్నేహితులు ఈ సారి అడిగినప్పుడు, ఇంత కథ ఉంది నా పేరుపెట్టటంలో అని నేను చెప్పచ్చు! థాంక్యూ, ఐ లవ్ మై నేమ్!” అంది మేనకోడలు శైల.

మళ్ళీ తనే “ఆంటీస్, ఏంటీ కథ టెక్నిక్? డీఫెమిలియరైజేషనా, నిజంగానే? ఆ వచ్చీపోయే వాళ్ళంతా ఎవరు ఈ కథలో, వారికీ కథకూ ఏమిటి సంబంధం? ఫీల్స్ మోర్ లైక్ మియర్ నేమ్ డ్రాపింగ్ టు మి.” అన్నది.

“బాల్జాక్.” నవ్వుతూ అంది నిసి. “ఓ వంద మనుషులను మనపై వదిలేసి, ఆ తర్వాత ఇష్టమైన వాళ్ళను డెవలప్ చెయ్యటం. నో, నో, ఆన్ సెకండ్ థాట్స్, కథలో రచయిత స్వయంగా ఎక్కడో ఒకచోట తనే దిగిపోటం. నేనిప్పుడే ఛెక్ రిపబ్లిక్ నుండి వస్తున్నాను కదా, అది కున్దేరా ఇన్‌ఫ్లూయన్స్ అనిపిస్తూంది.”

“మే బి! ఇట్స్ నాట్ నేమ్ డ్రాపింగ్! ఐ టేక్ ఇట్ బేక్, నీలత్తా! కథలో వాళ్ళంతా సమ ఉజ్జీల్లానే ఉన్నారుగా. బహుశా బోర్హెస్ లాగా తన స్నేహితులను, సమకాలీనులను కథలోకి లాక్కురావటం. ఏమోలే! మీ కజిన్స్ ఇద్దరూ కారులో వాదించుకోండి. నేను వెళ్ళాలి, హాస్పిటల్ సి.ఫ్.ఓ. లకు ఎలాంటి మెడికల్ గ్రూప్‌లతో కాంట్రాక్ట్ లోకి దిగటం మంచిదో, నేను ఒక ప్రజెంటేషన్ ఇవ్వాలి.” మేనగోడలు వాళ్ళిద్దరికీ చెరో రెండు ముద్దులిచ్చి వెళ్ళిపోయింది.

ఆమె వెళ్ళాక, “మైడియర్ కజిన్! నీకూ తెలుసు, నాకూ తెలుసు, ఆ పిల్లకు ఆ పేరు నువ్వెందుకు పెట్టావో! బాపిరాజు నవలలు నాకెంతో ఇష్టమంటే, అవే కాక అతని చిన్న కథలు కూడా నీకిష్టమని చెప్పావు. అతని ఒక కథల సంపుటి పేరే శైలబాల కాదూ! ఆ కథ నీకెంతో నచ్చింది కాదూ? అందుకూ నువ్వు ఆ పేరు పెట్టింది. సీరియస్‌లీ! కజ్! ఎప్పుడైనా ఒకసారి, కథలోనైనా నిజం చెపుతావేమో అని చూస్తా!” అంది నిసి నవ్వుతూ.

“వాట్ ఫర్!?” అంది నీల.

(డాక్టర్ నిసి షామల్ 2017 డైరీ ఎంట్రీల నుండి.)