ఆఫీసులో అందరికీ ఇంటర్నెట్ ఉండదు. ఉన్నవాళ్ళకు కూడా చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఎలాంటివంటే, ‘సెక్స్ రేషియో’ అని కొట్టినా కూడా, అడ్డుకునేలాంటివి. ఇక్కడొక స్మైలీ వేయాలనివుంది. సరే, తక్కువ పరిమితులతో ఇంటర్నెట్ సౌకర్యం ఉన్న సిస్టమ్స్‌లో నాదీ ఒకటి. ఎవరి సిస్టమ్ వారిదే అయినా కూడా, మిస్యూజ్ కాకుండా విధిగా ఒక పాస్వర్డ్ పెట్టుకోవాలి. యూజర్ నేమ్‌ను ఐటీ వాళ్ళే సెట్ చేశారు కాబట్టి, అది గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. కానీ పాస్వర్డ్ తప్పదు.
లాగిన్ అయ్యాక, సాధారణంగా నేను ‘పేజీ’ బాధ్యుడిగా చూడాల్సిన మెయిల్ ఒకటుంటుంది. అది ముందు చూస్తాను. దానికి ఒక పాస్వర్డ్. తర్వాత పర్సనల్ మెయిల్. దీనికి ఒక పాస్వర్డ్. పర్సనల్ మెయిల్‌గా జీమెయిల్ వాడకముందు నేను యాహూ వాడేవాణ్ని. కొత్తగా పరిచయమైనవాళ్ళకు దాన్ని ఇవ్వను. ఎవరైనా ప్రి–జీమెయిల్ పరిచయస్తులే అందులో సంభాషిస్తారు. యాహూను నేను న్యూస్లెటర్స్కే పరిమితం చేశాను. టైమ్, న్యూయార్క్ టైమ్స్, లైఫ్, ఎస్క్వైర్, జీక్యూ, పారిస్ రివ్యూ… ఇట్లా చాలా ఉంటాయి. ఈ లిస్టు చూసి ఇవన్నీ చదువుతానని అనుకోనక్కర్లేదు. నేను మహా అయితే చదివేది థామస్ ఎల్స్‌వర్త్ రోజూ పంపే జోక్ ఒకటి. ఆ జోక్ కూడా చదివే టైమ్ (ఓపిక) లేకపోతే, చివర్లో కోట్ ఆఫ్ ద డే మాత్రం చూస్తాను. గౌహర్ చౌధురి అని ఒకాయన కూడా ఇంతకుముందు కెనడా నుంచి జోక్స్ పంపేవాడు. నేను చాలా రోజులు ‘గౌహర్’ పేరునుబట్టి ఆమె అనుకున్నాను. ఒక్కసారి అదే అడిగినందుకు, నవ్వుతూ డిజప్పాయింట్ అయ్యావా? అన్న అర్థంలో బదులు కూడా ఇచ్చాడు. ఆసియాతనం కనబడుతున్న ఈ పేరు గురించి మళ్ళీ నేను అంతగా ఆలోచించలేదు.
ఇంకా, పేజ్–3 రద్దు కాకముందు సన్, కొత్తగా ట్రీట్స్! లాంటివి కూడా ఈ సైనప్ జాబితాలో ఉంటాయి. అలాగే, వ్యవసాయానికి సంబంధించిన, కంట్రీ లైఫ్‌కు సంబంధించిన గ్రూప్ మెయిల్స్ కూడా. వాటిలో చూడాల్సినవి చూడటం, డిలీట్ చేయడం, మళ్ళీ ట్రాష్‌ను కూడా ఖాళీ చేయడం… ఇదొక రోజువారీ చర్య. ఈ గ్రూప్మెయిల్స్లో ఉన్నవాళ్ళు ఎవరూ మనకు తెలియదు. కానీ మనకు కావాల్సింది ఏదో వాటినుంచి అందుతూవుంటుంది. ఒక్కోసారి మనకు ఏమాత్రం అక్కర్లేనివి కూడా ఇందులో ఉంటాయి. ఈ గోల ఎందుకని, ఒకసారి ఈ బృందమెయిళ్ళ బృందగానం కింద డిస్కంటిన్యూ బటన్ నొక్కాను. అక్కడితో అయిపోతుంది కదా అనుకున్నాను. కానీ, వెంటనే, ‘వై? ఎందుకు ఈ గ్రూపులోంచి వెళ్ళిపోవాలనుకుంటున్నారు?’ అని ప్రశ్నతో కూడిన స్పందన ఎగ్రిగేటర్ నుంచి వచ్చింది. ఒక పరిచయం లేని మనిషి, అసలు ఒక మనిషి వచ్చి అట్లా అడుగుతాడని నేనేమాత్రం ఊహించలేదు. నేను కొంచెం ఎమోషనల్ అయిపోయి, ఇది కూడా ఒక బంధం లాగానే భావించి దాన్ని కూడా కొనసాగిస్తున్నాను.
అసలు నేను చెప్పాలనుకుంటున్న విషయం ఇది కాదు. ఈ యాహూకు కూడా ఒక పాస్వర్డ్ ఉండాల్సిందే కదా. ఉంటుంది. అయితే, ఒకసారి ఏమైందంటే దీనినుంచి లావు తగ్గించుకోవడానికి చిట్కాలు లాంటి పోస్ట్ ఏదో నా మెయిల్ మిత్రులందరికీ వెళ్ళిపోయింది. ఎవరూ స్పందించినట్టు లేదుగాని, మెహెర్ ఒక్కడు నా మెయిల్ హాక్ అయినట్టుగా గుర్తించి, వెంటనే పాస్వర్డ్ మార్చుకొమ్మని సలహా ఇచ్చాడు. దానికి నా ఒకానొక అమలిన ప్రేమ తాలూకు సిద్దిపేట కాలేజీ ప్రేయసి పేరు పెట్టుకున్నాను. దాన్ని విధిలేక రీప్లేస్ చేయవలసి వచ్చింది. కొత్త పాస్వర్డ్ టైప్ చేయడానికి ముందు కచ్చితంగా ఆ పేరు గుర్తొస్తుంది.
సరే, ఇదిలావుంటే న్యూస్‌లెటర్స్ సైనప్ చేశానని చెప్పాను కదా, వాటిలో కొన్ని లోపలికి ప్రవేశించాలంటే పాస్వర్డ్ అడుగుతాయి. వాటికి వేరే పాస్వర్డ్ ఏదో పెట్టాల్సివస్తుంది. మన పేరునే ముక్కలుగా విరిచీ, వెనక్కీ ముందుకూ చేసీ, పేరుకే మన జీవితంతో ముడిపడిన నంబరేదో కలిపీ, గిమ్మిక్కులు చేస్తుంటాను.
బ్లాగుల్ని ఇప్పుడు రోజూ చూడకపోయినా, ఐదారేళ్ళ క్రితం రెగ్యులర్‌గా ఫాలో అయ్యేవాణ్ని. నా బ్లాగులోనూ అప్డేట్స్ పెట్టేవాణ్ని. దానికో పాస్వర్డ్ ఉండాల్సిందే కదా. ఓపెన్ చేసిన తర్వాత మరీ ఎక్కువకాలం పాస్వర్డ్ మార్చలేదని గుర్తొచ్చి, కొత్తది పెట్టాను. ఒక్కోసారి పాత పాస్వర్డ్ కొట్టి, ఎర్రర్ వచ్చాక, మళ్ళీ కొత్తది కొడతాను. అసలు ఈ పాస్వర్డ్ ఎందుకు మార్చాల్సి వచ్చిందంటే, అప్పుడెందుకో అది ఓపెన్ కావడంలో ఏదో సమస్య ఇచ్చింది. అందుకని కొత్త బ్లాగు ఓపెన్ చేశాను. దానికో పాస్వర్డ్ కచ్చితంగా ఉంటుందిగా. అయితే, ఈ పాతబ్లాగే మళ్ళీ సరిగ్గా నడవడంతో ఇదే కంటిన్యూ అవుతూవున్నాను.
నేను యూట్యూబులో ఒకే ఒక్కసారి మా పెద్దోడు నడవడానికి ముందు కాళ్ళు హుషారుగా టపటపలాడించే వీడియో పోస్టు చేయడానికిగానూ అకౌంట్ ఓపెన్ చేశాను. దానికి పాస్వర్డ్ ఏదో ఉంటుంది. నాకే గుర్తులేదిప్పుడు. ట్విట్టర్ కూడా ఓపెన్ చేశాను. కానీ వాడట్లేదు. అయినా దానికి కూడా ఏదో ఉండేవుంటుంది. గూగుల్ ప్లస్ కూడా ఏదో ఉన్నట్టుందిగానీ దానిలో నేను ఉన్నట్టో లేనట్టో నాకే తెలీదు.
ఇక, ఎంతోకొంత ఉపయోగంలో ఉన్న ఫేస్‌బుక్‌కు కూడా ఒక పాస్వర్డ్ ఉంటుంది కదా. అయితే, నాకు ఇవి రెండు అకౌంట్స్ ఉన్నాయి. నాకు తెలియకుండానే నేను ఇంకో అకౌంట్ కూడా ఓపెన్ చేశాను. అంటే, ఈ పాతది వాడకపోవడం వల్ల ఓపెన్ చేసినట్టుగా మర్చిపోయి, మళ్ళీ ఇంకోటి తెరిచానన్నమాట. ఎప్పుడైనా అప్డేట్స్ వచ్చి కుతూహలపడ్డప్పుడు పాస్వర్డ్ గుర్తుండదు. అందులో ఒకరిద్దరు మాత్రమే ఫ్రెండ్సున్నారు. ఈ కొత్తదానిమీద రావాల్సినంత విరక్తి రాగానే కనీసం ఆ పాత అకౌంట్‌నైనా సెలెక్టివ్ ఫ్రెండ్స్‌తో వాడాలని ఒక ఆశ ఉంది. చూద్దాం. ఆ పాస్వర్డ్ ఏదో ముందు తెలుసుకోవాలి.
ఇంకా, డబ్బుల వ్యవహారంలోకి వస్తే, ఎస్బిఐ ఎటిఎమ్ పిన్ నంబర్, అదే ఆన్లైన్ అకౌంట్లో యూజర్ నేమ్, పాస్వర్డ్, ప్రొఫైల్ పాస్వర్డ్; ఈ మూడింటినీ గుర్తుంచుకోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కూడా కదా. వీటిని గుర్తు పెట్టుకోవడానికి ఏం చేశానంటే, నా భార్య పేరుతో చిన్న తమాషా చేసుకున్నా. నన్ను పెళ్ళి చేసుకున్నాక తన పేరు మారింది. ఇదే కోడ్. అయితే, నేను తనను పెళ్ళి చేసుకున్నాక మారిందా, తను నన్ను పెళ్ళి చేసుకున్నాక మారిందా? ఇది సరిగ్గా గుర్తురాదు. ప్రొఫైల్ యాక్సెస్ చేసిన ప్రతిసారీ వాళ్ళిచ్చే మూడు ఆప్షన్లు ఎక్కడ అయిపోతాయోనని టెన్షనే.
దీనికంటే ముందు ఈనాడులో ఉన్నప్పుడు ఐసీఐసీఐ డెబిట్ కార్డ్ ఉండేది. దానికొక పాస్వర్డ్. దానికంటే ముందు, అంటే పాతకంపెనీలో ఉన్నప్పుడు జీటీబీ కార్డ్ ఉండేది. ఈ జీటీబీని ఓసీబీలో మెర్జ్ చేసినప్పుడు వాళ్ళు ఏదో ఇచ్చినట్టున్నారు. దానికో పాస్వర్డ్. ఈ కార్డులు పోయినాకూడా ఆ నంబర్లు కొన్నిరోజులు నాతో ప్రయాణించాయి. ఏది దేనికిరా నాయనా!
నేను పెద్దగా రైలు ప్రయాణాలు చేసింది లేదుగానీ, అవసరంకొద్దీ ఐఆర్సిటిసి ఎకౌంట్ ఓపెన్ చేశాను. దానికో పాస్వర్డ్. పాత కంపెనీలో పీఎఫ్ పాస్వర్డ్. వాటిని ఆన్లైన్లో చూసుకునే వీలు కల్పించాక దానికో పాస్వర్డ్. పాన్ నంబర్. నాకిప్పటికీ చిత్రం, పాన్ నంబరుంది కానీ కార్డు లేదు. ఇంకా, ప్రస్తుత ఎంప్లాయి నెంబర్, సవరింపుల తర్వాత వచ్చిన కొత్త నంబరు, వాడుతున్న ఫోన్ నంబర్, పోయిన ఫోన్ నంబర్, పోయినదానికన్నా ముందుపోయిన ఇంకో ఫోన్ నంబరు, వాడుతున్న ఫోన్ పాస్వర్డ్, ఆధార్ నంబరు, టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఇంకా ఇతరత్రా రాస్తేగీస్తే ఆ కాంపిటీటివ్ పరీక్షల హాల్‌టికెట్ నంబర్లు… మా ఊరి ఇంటి నంబరు, ఊరి పిన్‌కోడ్ నంబరు, ఎన్నెన్నిసార్లు ఊళ్ళు, ఇళ్ళు మార్చితే అన్ని ఇంటి నంబర్లు, అన్ని పిన్‌కోడ్ నంబర్లు, ఫోన్లు లేని రోజుల్లో పక్కవాళ్ళ ఫోన్ నంబర్లు, అవసరంకొద్దీ చేయాల్సిన ప్రయాణాల బస్సు నంబర్లు… ఎన్ని నంబర్లు ఈ జీవితానికి!
మతపరంగా నన్ను కాల్చేస్తారేమోలేగానీ, ఊహకోసం ఇలా అనుకుంటున్నా. మట్టిలో పూడ్చడానికి ముందు బట్ట ఏదో చుడతారు కదా, అలా ఈ అంకెల్లో నన్ను చుట్టబెట్టి పాతిపెట్టినట్టు అనిపిస్తుంటుంది. ప్రాణం పోయినప్పుడు ఈ అంకెలన్నీ మనలోంచి ఎగిరిపోతాయో ఏమో. ఈ అంకెలు ఎగిరిపోవడమే ప్రాణం పోవడమో ఏమో.
(2016 మార్చ్)