ఆకాశవంతెన 5

12

ఎలా అయితేనేం, యాభయ్యేళ్ళకి నేనూ ఒక ఇంటివాణ్ణయ్యాను. మా వర్క్‌షాప్‌లో కొంతమంది కుర్రవాళ్ళు నాతో “అదృష్టమంటే మీదే వాంగ్‌బావ్! మీకు భార్యతో పాటూ ఒక కొడుక్కూడా దొరికేడు. మీరు మా అందరికీ ఓ పెద్ద విందిచ్చి తీరాల్సిందే!” అన్నారు.

నేను పుట్టిందగ్గర్నుంచీ జనాలు నన్ను అదృష్టవంతుణ్ణనడం ఇది రెండోసారి. రెండుసార్లు కూడా నాకర్థంకాని కారణాలవల్లనే. నేను పీకలమొయ్యా తిని పీకలమీదకి తెచ్చుకున్నప్పుడు పొట్టోడు నేను అదృష్టవంతుణ్ణన్నాడు. ఈ కుర్ర వర్కర్లు షావ్‌డాంగ్ గురంచంటున్నారదే మాటని. నాకు వీళ్ళంటే కోపం లేదు. మంచివాళ్ళే. కొంచెం జోకులేస్తారంతే. వీళ్ళకి విందు భోజనం పెట్టడానికి మాత్రం నేను సిద్ధంగాలేను. నేనూ ఇప్పుడొస్తున్న కొత్త ఫ్యాషన్ల ప్రకారం హనీమూనుకని ఎటన్నా వెళతాను.


తియన్ చియావ్ (Sky bridge)

మా నాన్న పోయింతర్వాత, తన అస్థికలు నా ఇంట్లోనే ఉన్నాయి. వాటిని రేడియో పక్కన ఉంచాన్నేను. ఆయనకి నచ్చుంటుందనుకుంటానా చోటు. ఒక సంవత్సరం క్రితం, ఉత్తర జాన్‍సూ నుంచి మా బాబాయొచ్చి నాన్న అస్థికలు పట్టుకెళ్ళాడు. అక్కడ వాటికి ఒక సమాధి కట్టేడు. షూలన్‌నీ, షావ్‌డాంగ్‌నీ తీసుకుని మా ఊరు వెళదామని నా ఆలోచన. అలా వెళితే గనుక, మా నాన్న సమాధిని తుడిచే కార్యక్రమం చేయొచ్చు[1]చనిపోయినవాళ్ళకు గౌరవం చూపడం. రెండవది, షావ్‌డాంగ్‌కి పల్లెల్ని చూపెట్టినట్టూ ఔతుంది. వాడికి నా ‘అదృష్టం’ అంటుకుంటే చెప్పలేంగానీ. లేకపోతే, పల్లెటూర్లు చూసే అవకాశం వాడి జీవితంలో దొరక్కపోవచ్చు.

మాకు పల్లెలో చాలా సరదాగా కాలం గడిచింది. మా బాబాయీ, పిన్నీ షూలన్‌ని చాలా ఆప్యాయంగా చూశారు. వాళ్ళకో కోళ్ళ ఫారం ఉన్నదిప్పుడు. దాంతో మాకు కావలసినంత కోడి మాంసమూ గుడ్లూ దొరికినై. అందరికంటే షావ్‌డాంగ్ ఆనందానికి అవధుల్లేవు. రోజంతా వాడు మా బాబాయి చిన్న కొడుకుతో పాటూ ఇంటివెనకుండే కొండల్లోకెళ్ళేవాడు. సాయంత్రం తిరిగొచ్చేసరికి వాడి వంటిమీద ఎక్కడా మురికిలేని భాగముండేది కాదు. వాళ్ళమ్మ మందలించబోతే వాడు ‘ఇది మురికా? రక్తమిది. అన్నయా నేనూ కొండమీద సమాధుల దగ్గరున్నప్పుడు కొందరు బందిపోట్లు మా మీద దాడిచేశారు. మేం వాళ్ళని పిచ్చిపిచ్చిగా తన్నేం. చివరకి పారిపోయి ప్రాణాలు కాపాడుకున్నారు వాళ్ళు!’ అని గడుసు సమాధానాలు చెప్పేవాడు.

మా నాన్న సమాధి కూడా ఆ కొండమీదే ఉన్నది. నేను షాంగ్‌హాయ్‌కి తిరిగివచ్చే ముందురోజు అక్కడ చాలాసేపు నుంచున్నాన్నేను. ఒక మనిషెత్తున్నది ఆయన సమాధి. మొదల్లో నల్ల రాళ్ళు పేర్చున్నాయి. దాన్లో ఉన్న అస్థికలతో పోలిస్తే అది చాలా పెద్ద సమాధి. చనిపోయేముందు మా నాన్న నాతో చెప్పిన విషయం గుర్తుంది నాకు. ఇప్పుడు ఆయన కోరిక నిజమయ్యింది. ఐతే, మా అమ్మ ఎక్కడ ఉన్నదీ ఇంకా తెలియదు నాకు.

పశువులు చేసిన కాలిబాటన నేను పల్లెలోకి తిరిగెళ్ళాను. పల్లెని చేరుతుండగానే మా తమ్ముడు పరుగెత్తుకొచ్చి “అన్నయ్యా! నువ్వు త్వరగా రావాలి,” అన్నాడు. అతగాడు రొప్పుతూనూ భయంతోనూ కనబడ్డాడు. “త్వరగా రావాలి. మా నాన్న నీకోసం అన్నిచోట్లా వెతుకుతున్నారు.” దాదాపూ నన్ను ఈడ్చుకువెళ్ళినంత పనిచేశాడు వాడు.

మా బాబాయి గుమ్మంలోనే ఎదురుచూస్తూ కనబడ్డాడు. నేను వెళ్ళగానే ఆయన నా ముంజేయి పట్టుకుని, “రా! రా! మీ అమ్మ నీతో ఏదో చెప్పాలంటున్నది.” అన్నాడు. ఆయన జ్వరపడి సంధి మాటలు మాట్లాడుతున్నాడనిపించింది. మా అమ్మ చనిపోయి దాదాపు ముప్ఫయ్యేళ్ళయ్యింది.

మా బాబాయివాళ్ళ ఇంట్లో రెండు గదులున్నాయి. ఈ సారి ట్రిప్పులో, వాళ్ళు నాకూ షూలన్‌కూ లోపలిగదినిచ్చారు. నేను లోపలి గదిలోకెళ్ళి చూస్తే మా పిన్ని మా మంచమ్మీద గొంతుక్కూర్చుని కనబడింది. గాల్లోకి చూస్తున్నది ఆవిడ. వక్క నములుతున్నట్టుగా నోరు కదుల్తున్నది. నన్ను చూసేసరికి ఆవిడ కళ్ళు మతాబాల్లా వెలిగినై. “వాంగ్‌బావ్! నా తండ్రీ!” అంటూ కేక పెట్టింది.

నేను పూర్తి అయోమయంలో పడ్డాను. ఏమనడానికీ పాలుపోలేదు. మా బాబాయి నా చెయ్యి గిల్లేడు. “జవాబు చెప్పు, మీ అమ్మ మీ పిన్ని వంటిమీదున్నది.” అన్నాడు.

“అమ్మా!” అన్నాన్నేను లోగొంతుకతో.

“నా తండ్రీ, వాంగ్‌బావ్! నీ గురించెంత బెంగ పెట్టుకున్నాన్నాయనా!” నా పక్క తదేకంగా చూస్తున్నది మా పిన్ని. ఆవిడ కళ్ళలోంచి గుడ్లు బయటకు దూకుతాయేమో అనిపించింది. నా వంటిమీద చెమట్లు పట్టడం తెలుస్తూనే ఉన్నది. “నాయనా! మీ అమ్మ బెంగ పెట్టుకున్నదిరా! నీకు తెలుసునా? చాలా అన్యాయంగా చచ్చిపోయేను నాయనా. ఆ దుర్మార్గుడు మీ అమ్మని చంపేడు బాబూ, మీ అమ్మని నిన్ను చూడ్డానికి రానివ్వలేదురా, తండ్రీ. వాడు రేషన్ టిక్కెట్లు దొంగిలించేడురా. కానీ వాడికి డబ్బులు దొరకలేదురా. అవి మీ అమ్మ లంగా జేబులోనే ఉన్నాయిరా నాయనా. నువ్వొచ్చి ఆ డబ్బులు తీసుకో నాయనా. ఇన్ని సంవత్సరాలపాటూ మీ అమ్మ దయ్యంలా ఇల్లు లేకుండా తిరుగుతున్నది నాయనా. మీ అమ్మని ఇంటికి తీసుకెళ్ళు నాయనా. నువ్వు సుఖంగా ఉన్నావిప్పుడు. మీ అమ్మ ఇంకా చాలా కష్టపడుతున్నది తండ్రీ.”

“ఏడవొద్దమ్మా! నీ కొడుకు నిన్ను ఇల్లు చేరుస్తాడమ్మా.” ఇక మాట్లాడలేక నేను మా పిన్ని ముందు మోకాళ్ళమీద కూలబడ్డాను.


మా అమ్మ మా పిన్ని వంటిమీదకు రావడం గురించి విన్నప్పుడు కాలేజీ స్టూడెంట్ ఎంతగట్టిగా నవ్వేడంటే మనిషి లుంగలుచుట్టుకుపోయేడు. “కామ్రేడ్ గ్రూప్ లీడర్! నువ్వీ నాన్సెన్స్ నమ్ముతున్నావా? నమ్మట్లేదని చెప్పు,” అన్నాడు.

“వేరేవాళ్ళ దగ్గర్నుంచి వినుంటే నమ్ముండేవాణ్ణి కాదుగానీ నేను స్వయంగా నా కళ్ళతో చూసేనిది. మా పిన్ని గొంతు అచ్చు మా అమ్మ గొంతులానే అనిపించింది తెలుసునా? ఇంకా… మా అమ్మ డబ్బులెక్కడ దాచిందో మా పిన్నికెలా తెలుస్తుంది?”

“నన్నడిగితే మీ ఉత్తర జాన్‌సూ జనమందరి గొంతులూ ఒకే రకంగా ఉంటాయి. మూర్ఖుడిలా మాట్లాడకు. మీ అమ్మ నీతో మాట్లాడాలనుకుంటే ఎక్కడన్నా మాట్లాడుండవచ్చు. దానికి ఎక్కడో ఉన్న ఉత్తర జాన్‌సూకి వెళ్ళాల్సిన పనేముంది?”

“మా బాబాయి చెప్పడం సిటీల్లో రద్దీ ఎక్కువ కాబట్టి దయ్యాలు ఇక్కడకి రాలేవట.”

“మళ్ళీ అవే మూర్ఖపు మాటలు. బ్రతికున్నవాళ్ళకు ఇప్పటికే చాలినన్ని కష్టాలున్నాయి. చచ్చిపోయినవాళ్ళు కూడా వచ్చి చేరితే మన బ్రతుకులెలా ఉంటాయో!”

అప్పటికి వాడి కుటుంబం వాళ్ళున్న గరాజ్ వదిలిపెట్టింది. ప్రభుత్వం రూల్స్ ప్రకారం వాళ్ళ ఇంటిని వాడి తండ్రికి తిరిగి ఇచ్చేరు. అప్పట్నుంచీ, నలుగురు అక్క తమ్ముళ్ళమధ్యా రోజూ గొడవే ఎవరికెన్ని గదులని. అప్పుడే పోలీస్ స్టేషనుకెళ్ళడం వరకూ వెళ్ళింది పరిస్థితి. “కుటుంబం మొత్తం ఒకే గరాజ్‌లో ఇరుక్కున్నంతకాలం బాగానే ఉన్నాం అందరమూ. ఇప్పుడు ఇల్లు తిరిగొచ్చింది. కానీ, వాటాల్లో ప్రతి ఒక్కరూ వాళ్ళకి అన్యాయం జరిగిందంటున్నారు. పరిస్థితి ఇలా మారుతుందని ఊహించుంటే ఆ గరాజ్‌లోనే ఉండేవాళ్ళం జీవితమంతా.”

బ్రతికున్నవాళ్ళకు చాలినన్ని కష్టాలన్నప్పుడు వాడు దీని గురించే మాట్లాడుతున్నాడు. దీన్నుంచి డార్విన్ ఏ సిద్ధాంతం కనిపెట్టేవాడో తెలియదు.

ఆ రోజు, మా పిన్ని ఈ మాటలన్నీ మాట్లాడిన తర్వాత ఆదమరచి నిద్రపోయింది. అవడానికి అది ఏప్రిల్ నెలైనా, చలిగా ఉన్నది. అప్పుడే ఫుట్‌బాల్ ఆడి వచ్చినట్టుగా ఉంది నా పరిస్థితి. నుదుట్నుంచి చెమటలు అలా నేలమీదకి కారుతూ ఉన్నాయి. కాసేపటికి మా పిన్ని గట్టిగా ఆవులించి వంటచేయడానికి లేచింది. రాత్రి భోజనాలప్పుడు అడిగితే తనకి ఏమీ గుర్తు లేదన్నది. దాంతో నా నోరు తెరుచుకుపోయి మళ్ళీ మూయడం కష్టమయ్యింది. అదృష్టవశాత్తూ తనా సమయంలో ఇంట్లో లేనని అన్నది షూలన్. ఉండుంటే నిజంగా ౙడుసుకోనుండేది. ‘భయపడ్డానికేముంది? ఆవిడ మీ అత్తగారు!’ అన్నాడు బాబాయి.

షాంగ్‌హాయ్ పెద్ద సిటీ, రద్దీగానూ మహా గోలగానూ ఉంటుందన్నాడు బాబాయి. “యాంగ్[2]The best way to explain yin and yang may be through a comparison with equivalent terms in Hindu philosophy. In Hindu philosophy, we have five elements (పంచ భూతాలు) and three qualities/characteristics of nature (త్రిగుణాలు) namely — సత్వ (quality of truth, goodness, purity), రజ (longing, activity, passion), తమో (passivity, repose, inertia) గుణాలు. The Chinese philosophy also speaks about five elements but only two qualities of nature — యిన్ and యాంగ్ — instead of the three in Hindu philosophy. yin stands for the dark, mysterious, passive, yielding, cold, soft, and feminine nature while yang represents the illuminated, aggressive, active, controlling, hot, hard, and masculine nature. Water, the softest and the most yielding element, is the supreme symbol of yin where as fire symbolizes yang. Of course, yin and yang do always coexist; however, one may dominate the other. According to the Chinese philosophy, dead people are supposed to prefer the yin and shun the yang. బలంగా ఉంటుంది. అందువల్ల, షాంగ్‌హాయ్‌లోకి రావడానికి చచ్చిపోయినవాళ్ళు భయపడతారు. వాళ్ళకి పల్లెటూళ్ళలో నీటికి సమీపంలో–యిన్ ఎక్కువగా ఉండే ప్రాంతాలిష్టం.”

మళ్ళీ తనే అన్నాడు. “ఈమధ్యన పల్లెల్లో కూడా అంత ప్రశాంతంగా ఉండడంలేదు. జనాభా పెరుగుతున్నది. జనాలు పెద్ద పెద్ద ఇళ్ళు కట్టుకుంటున్నారు. ఊర్లోకి ఎప్పుడూ కార్లొచ్చిపోతూ గుడ్లుపెట్టే కోళ్ళని బెదరగొడుతుంటాయి. పూర్వం, నక్కలూ పందికొక్కులూ తిరిగేచోటు కాదూ ఇది? మంచుపడిన రోజుల్లో, మీ నాన్న పందికొక్కుల్ని పట్టడానికి గడ్డివాముల దగ్గరకి తీసుకెళ్ళేవాడు నన్ను. ఇప్పుడు చూద్దామన్నా కనబడవు పందికొక్కులు. ఇంకొద్ది రోజులు పోతే చచ్చిపోయినవాళ్ళు ఇక్కడక్కూడా రారు.”

ఆయన మాట్లాడ్డం వింటే దెయ్యాలు కూడా మానవ సంతతి చేతుల్లో అంతరించిపోతాయనిపిస్తుంది–పెద్ద పాండాలకు మల్లే.


మా ఊళ్ళో జరిగింది నేను నమ్మినా నమ్మకపోయినా, నేను మా అమ్మ సమాధి కోసం వెతుకుతానని షూలన్‌తో అన్నాను. దొరికితే ఆవిడ అస్థికల్ని మా ఊళ్ళో మా నాన్నతో పాటూ సమాధి చేస్తానన్నాను. ఎక్కడ వెతుకుతావని అడిగింది షూలన్. మొదట బాంపూఁలో వెతుకుతానని చెప్పా.

“నువ్వో పొరపాటు చేశావు,” అన్నది షూలన్. “ఆరోజు మీ పిన్నినే అడిగుంటే సరిపోయుండేది.”

షాంగ్‌హాయ్‌కి తిరిగివెళ్ళిన వెంటనే బయల్దేరదామనుకున్నాను గానీ ఒకదాని తర్వాత ఒకటి ఏవో పనులొచ్చి పడ్డాయి. జులై దాకా కదలడానికి వీల్లేకపోయింది. షావ్‌డాంగూ నేనూ రైల్వే స్టేషనుకెళ్ళాం. అప్పడు వాడికి వేసవి సెలవులు. నేను టిక్కెట్టు కోసం లైన్లో నిలబడి వాణ్ణి రోడ్డవతల షాపులో ఒక శుభ్రమైన ప్లాస్టిక్ బాగ్ తెమ్మని పంపేను.

“ఎందుకది?” అడిగేడు షావ్‌డాంగ్.

నేనేం చెప్పలేదు. వాడు మా అమ్మనేమని పిలవాలో నాకు తెలీలేదు.

13

రైల్వే ఇన్‌స్పెక్టర్ ఇల్లు ఆ గ్రామం మొదట్లోనే ఉంది. మేము వెళ్ళేసరికి అతను మంచంలో పడి నిద్రపోతున్నాడు. అతన్ని నిద్రలేపడానికి స్టేషన్ మాస్టర్ చాలా కష్టపడాల్సొచ్చింది. రైల్వే ఇన్‌స్పెక్టర్ లేచి మొహం చన్నీళ్ళతో కడుక్కుని ఐదు నిముషాలపాటూ కళ్ళార్పింతర్వాత, అతనికి నా కథ అర్థమయ్యింది.

“కరక్టే! ఈ సంగతి గుర్తొస్తుంది,” అన్నాడతను. “కానీ, నువ్వు ఇప్పుడొస్తున్నావేంటి?”

మా అమ్మ శవాన్ని కనుగొన్న మనిషి ఈ ఇన్‌స్పెక్టరేనట. ఆరోజుదయం అతను ఎప్పట్లానే పట్టాలు తనిఖీ చేయడానికి వెళ్ళాడు. అతని రూటు స్టేషన్ దగ్గిర మొదలయ్యి వంతెన దాటి కొండలదాకా వెళ్తుంది. మొత్తం నాలుగు కిలోమీటర్లు. కొండలదగ్గిర్నించీ అవతలి స్టేషన్ పరిధిలోకి వస్తుంది. అతను తన తనిఖీ ముగించి వెనక్కు వస్తూండగా ఇది జరిగింది. ఆ సమయంలో అతనికి పనేంలేదు. అప్పటికే తనిఖీ అయిపోయింది. వంతెన మీదుగా వెళ్తూ అతను క్రిందకి చూడ్డం జరిగింది. నల్లగా గుట్టగా పడున్నదేదో కనబడిందతనికి. దాంతో అతను వంతెన మొదలైనచోట కాలిబాటన లోయలోకి దిగి వెళ్ళాడు.

“ఆ సమయంలో నాకు చాలా భయం వేసింది. మా ఎద్దు పడిన లోయ ఓ కుగ్రామం. ఇక్కడివాళ్ళు మాయామర్మం తెలియని రైతులు. మా ఊళ్ళో అంతవరకూ హత్యల్లాంటివి జరగలేదు. నేను పరుగున వెళ్ళి స్టేషన్ మాస్టర్‌కి చెప్పాను. ఈయన కాదు. ఇంతకు ముందతను. అతను టీబీతో పోయాడు కొన్ని సంవత్సరాలక్రితం. అతను నా మాటలు నమ్మలేదు. తను స్వయంగా వెళ్ళి చూసొచ్చాడు. మేము పోలీసు స్టేషనుకి ఫోను చేశాం. సాయంత్రానికల్లా, బాంపూఁ నుంచి ఇద్దరు పోలీసు ఆఫీసర్లు వచ్చేరు. వాళ్ళు శవాన్ని అటూ ఇటూ తిప్పి చూసి చివరికి సమాధి చెయ్యమని చెప్పారు. నేను పల్లెలోకి వెళ్ళి అడిగితే ఎవరూ రాలేదు. చివరికి స్టేషన్ మాస్టర్ ఒక్కొక్క మనిషికీ ఒక రూపాయి ఇస్తానంటే అప్పుడు ముగ్గురు మనుషులు ముందుకొచ్చేరు. ఎలా పూడ్చిపెట్టాలని అడిగేరు వాళ్ళు. ఏదోక గుట్టలో పూడ్చిపెట్టమని చెప్పాన్నేను, ఎలానూ కొద్దిరోజుల్లో ఆ చచ్చిపోయినావిడ కుటుంబం వచ్చి తీసుకువెళ్తారు కదాని.”

ఐతే అతను చాలారోజులు ఎదురుచూసినా ఎవరూ రాలేదట. ఎవరూ రాకపోడానికి వెనకాలో పెద్ద కథుంది. అది అతనికి తెలియాల్సిన అవసరం లేదు.

ఇప్పుడొచ్చేనని అన్నాన్నేను.

“ఇంతకాలానికా!” అన్నాడు రైల్వే ఇన్‌స్పెక్టర్. “ఈపాటికి ఆవిడ ఎముకలు కూడా మట్టిలో కలిసిపోయుంటాయి.”

ఆవిడకి నేనేమవుతానని అడిగేడు. కొడుకునని చెప్పా. మా అమ్మ పేరడగలేదతడు. నేనూ చెప్పలేదు. అతడికి మా అమ్మ ఒక పేరులేని మనిషి.


మేము ఆ పల్లె వెనకాతలకెళ్ళాం. మేము నడుస్తున్న రోడ్డు ఏటవాలుగా పైకెళ్తున్నాది. కొంచెంసేపటికి, ఊళ్ళోని ఇంటికప్పులు, చెట్లూ అన్నీ మా పాదాలకంటే క్రిందకి చేరుకున్నాయి. రైల్వే ఇన్‌స్పెక్టర్ ముందు నడిచేడు. ఆయన నడక వేగం చూస్తే డెబ్భై ఎనభయ్యేళ్ళ ముసలాడిలా కనబళ్ళేదు. చివరకి మేము కొండమీదకి చేరుకున్నం. మా ముందు రాళ్ళూ మట్టీ తప్ప ఏమీ లేవు, తెల్లగుర్రపు సరస్సు చుట్టూ ఉన్న బోడికొండలకు మల్లేనే. ఎండ తీక్షణంగా ఉన్నది. చొక్కా వంటికంటుకుపోయింది.

“వచ్చేశాం!” ముసలి ఇన్‌స్పెక్టర్ ఒకచోట ఆగి తనకి కొంచెం ముందున్న నేలను చూపెట్టాడు. తను వేలు చూపుతున్న వైపు చూశాను. దానికీ దాని చుట్టూ ఉన్న స్థలానికీ తేడా తెలీడంలేదు. అతను చూపుతున్న చోటు కొంచెం మిట్టగా ఉండి దానిమీద నాలుగు గడ్డిపరకలున్నాయి. అది సమాధిలాగ కనబళ్ళేదు. చిన్న మట్టికుప్పలాగుంది.

“మీరు పొరపాటుపడ్డంలేదు కదా?” అడిగేడు స్టేషన్ మాస్టర్.

“పొరపాటా?” అన్నాడు ముసలాయన. “ఆవిడ శవాన్నిక్కడకి తెమ్మన్నది నేనే.”

“అహహ! నేనన్నది… ఇన్ని సంవత్సరాల తర్వాత కదా, మీరు ఇదనుకుని వేరే మనిషి సమాధిగానీ చూపెట్టడంలేదు కదాని.”

“మీకు తెలీకపోవచ్చు. ఈ కొండమీద ఇదొక్కటే సమాధి. ఈ గ్రామానికి చెందిన సమాధులన్నీ అదో ఆ కొండమీదున్నాయి.”

నా వైపు తిరిగి అన్నాడు రైల్వే ఇన్‌స్పెక్టర్. “ఇది బీడు నేల. దీనికి పేరేమీ ఉండేదికాదు. మీ అమ్మనిక్కడ పాతిపెట్టిందగ్గిర్నుంచీ, పల్లెలో దీన్ని ‘ఇల్లులేని దయ్యం సమాధి’ అనే పిలుస్తున్నారు. గడ్డికోసుకోడానికీ, గొర్రెల్ని మేపడానికీ కూడా ఇక్కడివాళ్ళు ఇల్లులేని దయ్యం సమాధికెళ్ళామనే చెప్తారు. పిల్లలు టైము మర్చిపోయి రాత్రి భోజనాలవేళకి ఇల్లు చేరకపోతే తల్లులు తమ మగవాళ్ళను ఇల్లులేని దయ్యం సమాధికే పంపిస్తారు వాళ్ళని తీసుకురమ్మని. దీనిగురించి నేనెలా పొరపాటుపడతాను?”

అతను పొరబడ్డాడని నేననుకోను. ఇక్కడ పరిసరాలు అంత ప్రశాంతంగానూ, అందంగానూ లేకపోయినప్పటికీ ఇది మా అమ్మ సమాధే అయ్యుంటుంది. “ఇంక ఆలస్యం చెయ్యడమెందుకు?” అన్నాను వాళ్ళతో. “నేను మళ్ళీ మధ్యాహ్నం ట్రెయిను పట్టుకోవాలి.”


ఒక పార పట్టుకురావడానికి ముసలి ఇన్‌స్పెక్టర్ పల్లెలోకి బయల్దేరాడు. కొద్ది అడుగుల్లోనే అతడు మా దృష్టినుంచి మాయమయ్యాడు. నేను దూరంగా చూస్తే మళ్ళీ ఆ వంతెన కనబడింది. ఇప్పుడది ఆకాశంలో ఉన్నట్టు కనబడ్డంలేదు. సరిగ్గా నా ముందున్నట్టున్నాది. చెయ్యి చాపితే అందేటట్టుంది. అకస్మాత్తుగా అనిపించింది నాకు. నేను మా అమ్మ సమాధిని వెతకడం ఒక తెగిన పూసలదండను తిరిగి పేర్చడంలా ఉన్నదని. గడ్డపు సన్‌కొక పూస దొరికింది. కామ్రేడ్ గావ్‌కొకటి దొరికింది. రిటైర్డు రైల్వే ఇన్‌స్పెక్టరొకటి పట్టుకున్నాడు. మా నాన్న దగ్గర కూడా ఒకటి ఉన్నది. నేను ఈ పూసలన్నిటినీ కలిపి కూర్చడానికి ప్రయత్నిస్తున్నాను. ఇప్పుడు ఇంకొక్క పూస మట్టుకు మిగిలింది. ఇదే అన్నిటికంటే పెద్దది. బహుశా అది నా కాళ్ళడుగునే పూడ్చిపెట్టబడున్నది.

ఒక పారతో పాటూ తిరిగొచ్చేడు ముసలి రైల్వే ఇన్‌స్పెక్టర్. దాన్ని నాకందజేస్తూ అన్నాడు. “మీతో ఒక విషయం చెప్పాలి. మనకి మీ అమ్మ ఎముకలన్నీ దొరక్కపోవచ్చు. ఈ చుట్టుపక్కల కుక్కలెక్కువ. మీ అమ్మని సమాధి చేసినప్పుడు ఆవిణ్ణి ఓ శవపేటికలో పెట్టలేదు.”

ఇంకా చెప్పబోతుంటే అఖ్ఖర్లేదని వారించానతణ్ణి. అలాంటి సంఘటనలెరుగనివాణ్ణి కాదు నేను. ఆ రోజుల్లో, పొట్టోడి శవాన్ని జంతువులు రెండుసార్లు బయటకి లాగినై. అవి పొట్టోడి శవాన్ని ముక్కలు ముక్కలు క్రింద కొరికినై. ఒక కాలునైతే మేముండే పాక వరకూ లాక్కొచ్చినై. చివరకి మేం సమాధి మీద పెద్ద బండరాయి కప్పెట్టాల్సి వచ్చింది.

పారతో తవ్వడం మొదలుపెట్టాన్నేను. ఆశ్చర్యకరంగా ఇక్కడ నేలంత గట్టిగా లేదు. పార నా చేతుల్లో కదులుతుంటే మట్టి విరజిమ్మినట్టు పైకొచ్చింది. ఐతే ఎందుకో, ఒక్కసారిగా నా చేతుల్లో సత్తువంతా హరించుకపోయింది. ఇంకోసారి మట్టిపెళ్ళగించడానికి చేతులాడలేదు. పార తన శరీరానికి తగిలి మా అమ్మ బాధతో ఆర్తనాదం చేస్తున్నదని భయమేసింది. ఆ రోజుల్లో, మేం తెల్లగుర్రపు సరస్సుని పూడ్చేటప్పుడు చాలా సమాధుల్ని తవ్వేశాం. మా అందరికీ ఆ చచ్చిపోయినవాళ్ళ ఉసురు తగుల్తుందనీ, మేము దానికి ఫలితమనుభవిస్తామనీ మా ముసలి ఖైదీలు అంటూ వచ్చేరు. బహుశా ఈరోజు నాకా ఉసురే తగుల్తుండవచ్చు ననిపించింది.

స్టేషన్ మాస్టర్ నా చేతుల్లోంచి పారని తీసుకుని తవ్వడం మొదలుపెట్టాడు. తను పారతో మట్టిని తీసి ఒక పక్కన కుప్పలా వేశాడు. మధ్యమధ్యలో పారతో నిలువుగా నేలలో పొడిచి కప్పడున్న ఎముకలు బయటపడేలా చేశాడు. కాసేపటికే ఆ చిన్నమిట్ట కాస్తా గుంతలా తయారయ్యి, గుంత పక్కనే తవ్విపోసిన మట్టి చిన్నకుప్పలా తయారయ్యింది. నేనా మట్టికుప్పమీదకి వంగి అస్థికలేరాను. ఎండ తీవ్రంగా ఉన్నది. నుదుట్నుంచి కారిన చెమట నా నోట్లోకి పోతుంది. స్టేషన్ మాస్టర్ రొప్పుతూ మధ్యమధ్యలో ఆగేడు. మళ్ళీ అంతలోనే అతను నడుం వంచి తవ్వడమూ, మట్టి జల్లులా పైకి రావడమూ మొదలయ్యేది. అంతలో, ఎండ కాంతికి ఉల్కలా తెల్లగా మెరుస్తూ ఏదో వస్తువు బయటపడింది.

మా అమ్మా, నాన్నా, నేనూ ఆఖరిసారిగా కలిసి కూర్చున్నది ఇరవైతొమ్మిదేళ్ళ క్రితం, నేను షాంగ్‌హాయ్ నుంచి తెల్లగుర్రపు సరస్సుకు బయల్దేరడానికి ముందురోజు రాత్రి. మా నాన్న ఉత్తర జాన్సూలో పల్లెటూళ్ళ గురించి పాత కథలు చెబుతుంటే మా అమ్మ చిన్న స్టూలు మీద కూర్చుని నా చొక్కా కాలరు కుడుతున్నది. ఆవిడ అలా కుడుతూ ఏడుస్తూనే ఉన్నది. సూది పట్టుకునున్న ఆవిడ చెయ్యి పైకీ కిందకీ కదుల్తుండగా ఆవిడ వేలికున్న తొడుగు దీపపు కాంతిలో మెరుస్తూన్నది. ఇప్పుడు నా కళ్ళముందు మెరిసిందా వేలితొడుగే.

“ఆగండి!” అన్నాను. “ఇది మా అమ్మే.”

ఆ మట్టికుప్పనుంచి ఆ తెల్లటి వేలితొడుగుని పైకి తీశా.


మేము వచ్చిన కాలిబాటనే వెనక్కి వెళ్ళాం. ముసలి రైల్వే ఇన్‌స్పెక్టర్ మళ్ళీ ముందున్నాడు. స్టేషన్ మాస్టర్ వెనకాతలా నేను మధ్యలోనూ నడిచేం, సరిగ్గా మేం పైకెక్కినప్పట్లానే. ఐతే ఈసారి నా చేతిలో ఒక ప్లాస్టిక్ సంచీ ఉన్నది. నేను మా అమ్మ అస్థికల్ని సంచిలో వేస్తుండగా, రైల్వే ఇన్‌స్పెక్టర్ ఒక పిడికెడు మట్టి అందించాడు. “దీన్ని కూడా సంచీలో వేసుకో. మీ అమ్మ ఇక్కడ ఇరవయ్యేళ్ళకంటే ఎక్కువ కాలమే ఉన్నది. మీ అమ్మని ఇక్కడి మనిషిగానే భావించవచ్చు.”

మేము పల్లెలోకి తిరిగివెళ్ళింతర్వాత ముసలి రైల్వే ఇన్‌స్పెక్టర్ గుమ్మమ్ముందాగేం. కొంతమంది ఆడవాళ్ళూ పిల్లలూ నా చేతిలో సంచీ వంక కుతూహలంగా చూస్తున్నారు. ఆ ముసలాయన దగ్గర సెలవు తీసుకుంటూ ఇంకోసారి నా కృతజ్ఞతలు తెలుపుకున్నా. కృతజ్ఞతలు చెప్పాల్సిన పన్లేదన్నాడతను. అంతా విధి. గతంలో మా అమ్మని తనే పూడ్చిపెట్టాడు. ఇప్పుడు మళ్ళీ తనే తవ్వి బయటకు తీశాడు. అతడొకసారి కొండపక్క చూసి “ఆ కొండ పేరు మాత్రం మారదు. కొన్ని వందల ఏళ్ళ తర్వాతకూడా ఎద్దు పడిన లోయ జనాలు దీన్ని ఇల్లులేని దయ్యపు సమాధనే పిలుస్తారు.” అన్నాడు.

చైనా దేశపటం చూస్తే ప్రముఖ వ్యక్తుల పేర్లున్న ఊళ్ళు కొన్ని కనబడతాయి. జీ డాన్ తాలూకా, జూ క్వాన్ తాలూకా ఇలాంటివే[3]ఇవి ప్రసిద్ధికెక్కిన కమ్యూనిస్టుల పేర్లు. ఇప్పుడు మా అమ్మ పేరుమీద కూడా ఒక కొండ ఉన్నది. ఒక ఊరికి మనపేరు పెట్టడం మామూలుగానైతే పెద్ద సత్కారంగా భావించవచ్చు. ఐతే మా అమ్మ విషయంలో దీన్ని సత్కారంగా భావించాలో లేదో తెలియదు నాకు.

మేము రైల్వే స్టేషనుకెళ్ళాం. స్టేషన్ మాస్టర్ నాకు షాంగ్‌హాయ్‌కి టిక్కెట్ తీసుకొచ్చాడు. ట్రెయినింకా రాలేదు. నన్ను ప్లాట్‌ఫామ్ మీదకి తీసుకువెళ్ళాడు. ఆ బ్రిడ్జి రెండు కొండలమధ్యన నిలబడుంది. ప్లాట్‌ఫామ్ మీంచి చూస్తే ఆకాశంలో ఉన్నట్లుందది. సూర్యుడప్పుడే పశ్చిమానికి చేరుకున్నాడు. రక్తం చిందుతున్నట్టున్న సూర్యకిరణాలు బ్రిడ్జినంతా ప్రకాశవంతం చేస్తున్నాయి.

స్టేషన్ మాస్టర్ నా ప్రక్కనే నిల్చోనున్నాడు. అతడు కూడా బ్రిడ్జి వంకే చూస్తున్నాడు. బాగా కుర్రవాడతను. పై పెదవికి పట్టిన చెమటడుగున అప్పుడే మొలకెత్తుతున్న మీసపు నల్లదనం కనబడుతుంది. తనది చింగ్ డావ్ అని చెప్పాడు. నాన్ జింగ్ రైల్వే ఇన్‌స్టిట్యూట్ నుంచి 1983లో పట్టా పుచ్చుకున్నాడట. పోస్టింగ్ తీసుకుని ఈ కుగ్రామానికి మొదటసారిగా వచ్చినప్పుడు ఆ బ్రిడ్జి మీంచి దూకాలనిపించిందన్నాడు.

“ఒక్కోసారి మన ముందు చీకటి మాత్రమే కనబడుతుంది. ఆ చీకటికి అంతం ఉన్నట్లు తోచదు. అటువంటప్పుడు ఆత్మహత్య మాత్రమే శరణ్యమనిపిస్తుంది. అయితే ఒకసారి ఆ చీకటి గుయ్యారంలోంచి బయటపడి వెనక్కి చూసుకుంటే మాత్రం బ్రతికున్నందుకు చెప్పలేనంత ఆనందమేస్తుంది. ఆ చీకట్లోంచి ఎలా బయటపడ్డామా అని ఆశ్చర్యమూ భయమూ వేయొచ్చు. కానీ మనమందులోంచి బ్రతికి బయటపడ్డామన్నదే ముఖ్యం.” చెప్పేను.

“మీ మాటలు ఖచ్చితంగా జ్ఞాపకం పెట్టుకుంటాను.” నేను రైల్వే మినిస్టర్నన్నంత భక్తిగా అన్నాడు.

14

బాంపూఁ నుంచి నాన్ జింగ్ వెళ్ళే పాసెంజర్ రైలు అంత రద్దీగా ఉండగలదనుకోలేదు నేను[4]షాంగ్‌హాయ్‌కి నాన్‌జింగ్ గుండా వెళ్ళాలి. సీట్లన్నీ నిండిపోయి కారిడార్లో నిలబడిపోయున్నారు పాసెంజర్లు. లోపలికి వెళ్ళమని పాసెంజర్లని అదిలించేడు రైల్వే కండక్టర్. తర్వాత కంపార్ట్‌మెంట్ తలుపు వేసి తన చిన్న ఆఫీసు గదిలోకి మాయమైపోయాడు.

ట్రెయిను స్టేషన్ని వదిలిపెట్టి ఖంగుఖంగుమని చప్పుడు చేస్తూ బ్రిడ్జెక్కింది. నేను కిటికీకి మొహంపెట్టి క్రిందకి చూశాను. లోతైన లోయ తప్పితే బ్రిడ్జి కనబళ్ళేదు. ఈ బ్రిడ్జే లేకపోతే మా అమ్మ మరణించేది కాదేమో.

నేను తలుపు దగ్గిరకి నడిచేను. అక్కడ కొంచెం ఖాళీగా ఉన్నది. ఒక యువకుడు నేలమీద న్యూసు పేపరు వేసుకుని కూర్చున్నాడు. పక్కనే ఏడెనిమిది బ్యాగులున్నాయి. నా ప్లాస్టిక్ బ్యాగ్‌ని ఒక మూల ఉంచి తలుపుకి చేరబడ్డాన్నేను. మా అమ్మ ఇక్కడ్నుంచే కిందకి పడిపోయింది. ఆ రాత్రి గనుక ఆ మూడువందల ఎనభై ఒకటో నంబరు ట్రెయిను ఇంత రద్దీగా ఉండుంటే ఆవిడ చనిపోయుండేది కాదేమో.

అసలు, ఆవిడ నన్ను చూడ్డానికి తెల్లగుర్రపు సరస్సుకి బయల్దేరకపోతే తను చనిపోయుండేది కాదు. నేను వెనక్కి వెళ్ళి ఫాక్టరీలో చేరిన కొంతకాలానికే, ఏదో జీతం పెంపు విషయమై ఫాక్టరీ హ్యూమన్ రిసోర్సెస్ డిపార్ట్‌మెంటుకి వెళ్ళాను. అక్కడున్న గుమస్తా ఫైల్ కాబినెట్లో చాలా దీక్షగా వెతికి పాతబడి పసుపురంగుకి మారిన జీ.ఓ.ని బయటకు తీశాడు. “ఇంతకీ నువ్వు ఇప్పుడెందుకొచ్చేవ్?” బుర్ర గోక్కుంటూ అడిగేడా గుమస్తా. “మీ కేసులన్నీ చాలాకాలం క్రిందటే పరిష్కారమయినై కదా?”

గుమాస్తా చూపెట్టిన లైన్లవైపు చూసేన్నేను. “…రాజకీయ పరిజ్ఞానం కొరవడి తప్పు అభిప్రాయాలు వ్యక్తంచేసిన కార్మికుల విషయంలో, మనం వారికి సరైన శిక్షణనివ్వడంపై దృష్టి కేంద్రీకరించాలి. ఇటువంటి కార్మికులను సామ్యవాదానికి గాని, (కమ్యూనిస్టు) పార్టీకి గాని, సమాజానికి గానీ వ్యతిరేకులుగా ముద్ర వేయరాదు. ఇప్పటికే శిక్షకుగానీ క్రమశిక్షణకుగానీ గురిచేయబడిన కార్మికుల విషయంలో దానిని వెంటనే రద్దు చేయవలెను…” అంటే, ఈ యాంటి-రైటిస్ట్ మూవ్‌మెంట్లో నేను ఇలా శిక్షించబడాలని ఎవరి ఉద్ధేశ్యమూ కాదన్నమాట.

నేనా జీ.ఓ.ని చేతిలోకి తీసుకుని మొదటినుంచి చివరిదాకా చదివేను. దానిమీద ప్రభుత్వంవారి ఎర్రని అధికార చిహ్నమున్న ముద్ర ఉంది. తేదీ: 1959 ఫిబ్రవరి. అంటే నేను తెల్లగుర్రపు సరస్సుకు వెళ్ళిన ఆరునెల్లకే!

నేను అప్పుడే షాంగ్‌హాయ్‌కి తిరిగివచ్చుంటే, మా అమ్మ చనిపోయుండేదే కాదు. మరి ఈ జీ.ఓ. గురించి మేమింతకాలమూ వినకపోవడానికి కారణాలు తెలియవు. ఫార్మ్ అధికార్లు దీని గురించి మాకు చెప్పడం మర్చిపోయేరో లేక మమ్మల్ని అలా–కొండల్ని తవ్వి సరస్సుని నింపి–ప్రకృతిని మార్చే పన్లో ఉంచాలని వాళ్ళనుకున్నారో.

వీటిలో ఏ ఒక్కటి జరిగినా–ఆ బ్రిడ్జి లేకపోయినా, ఆ ట్రెయిన్నిండా పాసెంజర్లున్నా, ఆవిడ నన్ను చూడ్డానికి బయల్దేరకపోయినా, ఆవిడ బయల్దేరే లోపలే నేను తిరిగి వచ్చున్నా–మా అమ్మ అప్పుడు చనిపోయుండేది కాదేమో. ఐతే ఆవిడ అప్పుడు చనిపోయుండకపోయినా, ఈపాటికి చనిపోయే ఉండేది. ప్రతీ ఒక్కరూ మరణించాల్సిందే. జీవించడానికేం మిగలకపోవడం వల్లనో, కేన్సర్ వల్లనో, రోడ్డు ప్రమాదం వల్లనో… నాకు హు హాన్ హైవే ప్రమాదంలో కాలి చనిపోయినవాళ్ళు గుర్తొచ్చారు. వాళ్ళంతా సెలవులు గడపడానికి హంగ్ జో కెళ్తున్న టూరిస్టులు. ప్రమాదానికి ఒక్క క్షణమ్ముందు వాళ్ళు కొండలెక్కడం గురించో, పడవలో షికారుకెళ్ళడం గురించో, లేక ప్రసిద్ధికెక్కిన హన్ చేపల్ని పట్టడం గురించో మాట్లాడుకుంటూ ఉండుంటారు. తర్వాతి క్షణంలో, వాళ్ళంతా పెనంలో వేగుతున్న బలిసిన బాతుల్లా తయారయ్యారు.

వాళ్ళ కుటుంబాలకి గవర్నమెంటునుంచి ఎక్స్‌గ్రేషియా వచ్చుండాలి. దీని గురించి కూడా ఒక జీ.ఓ. ఉందని విన్నాను ఎవరికెంత ఎక్స్‌గ్రేషియా అని–చైనీస్‌కి రెండువేల రూపాయలూ, ఫారినర్స్‌కి ముప్పైవేల రూపాయలూ.


సాయంత్రపు ఎండ తలుపుకున్న కిటికీగుండా లోపలికి వచ్చి నా వేలికున్న తొడుగు మీద పడుతున్నది. ఆ ఎండ దానిమీద ప్రతిఫలించి ట్రెయిన్ సీలింగ్ మీద ఓ తెల్లని సీతాకోకచిలుకకు మల్లే కదులుతున్నది. ఈ తొడుగు దేంతో తయారయిందో నాకు తెలియదు గానీ, ఇరవయ్యేడేళ్ళు భూమిలో కప్పడి ఉన్నాకూడా ఇంతబాగా మెరుస్తున్నది. ఇందులో బంగారమో వెండో ఉందేమో. అదే నిజమైతే, షులాన్‌కి ఒక మంచి ఉంగరం చేయించాలి.

“అరె! ఏంటదీ? ఏడుస్తున్నావా?” అన్నాడు నేలమీద కూర్చోనున్న యువకుడు.

పిచ్చిపిచ్చిగా మాట్లాడొద్దని చెప్దామనుకున్నా. కానీ “ఛా” అని ఊరుకున్నా.

తల పక్కకు తిప్పుకుని మొహం కిటికీ వైపు పెట్టా.

నేన్నిజంగానే ఏడ్చాననుకుంటా.

(సమాప్తం)

అధస్సూచికలు[+]