[1968 ప్రాంతంలో ఆనాటి ప్రముఖ పత్రికల్లో ఒకటైన జ్యోతి మాసపత్రికలో పి. బి. శ్రీనివాస్ తనదైన చమత్కారశైలిలో ఆనాటి ప్రముఖ సంగీతదర్శకులందరిపైనా సుదీర్ఘమైన వ్యాసాలు రాశారు. కేవలం హాస్యమే కాదు, సంగీతపరంగా ఎన్నో విషయాలనే తెలిపేవి యివి. నాకు పాతపాటల గురించి అంత పరిజ్ఞానం లేని కాలంలో ఈ వ్యాసాల్ని ముందు పెట్టుకుని చాలా పాటల్ని సేకరించుకున్నాను. ఆయిన మెచ్చుకున్న ప్రతి ఒక్క పాటా నాకు కూడా తెగ నచ్చేసి, మా యిద్దరి వేవ్ లెంగ్తులూ ఒకటే అనుకునే వాణ్ణి. ఈ వ్యాసాల విలువ మరింత బాగా తెలిసేనాటికి ఇంట్లోని జ్యోతి సంచికలు గల్లంతైపోయాయి. వాటికోసం తీవ్రంగా వెతుకుతున్న రోజుల్లో డా. భార్గవి వీటి ఫోటోకాపీలను అందించారు. వారికి నా ధన్యవాదాలు.
ఈ వ్యాస పరంపరలో వచ్చినవి: హాయిగ పాడుదునా?, రసికజన మనోభిరామ శ్రీ అశ్వత్థామ, స్వరసప్తా చలపతి శ్రీ తాతినేని చలపతి, పాటల టంకసాల శ్రీ ఘంటసాల, స్వరపరాయణ శ్రీ ఆదినారాయణ, వేణు-గానలోలుడు, స్వరాలరాజు టి.వి. రాజు, జనం నోట తన పాట పలికించిన చిలక, జంటస్వరాలు, శ్రీ సుసర్ల దక్షిణామూర్తి. ఇక్కడ మీకందిస్తున్నది హాయిగ పాడుదునా? అన్న సాలూరి రాజేశ్వరరావు పైన రాసిన ప్రారంభ వ్యాసం. – పరుచూరి శ్రీనివాస్.]
[నేను కవిని కాను. గాయకుణ్ణి. రచయితని కాను, రాగాలాపకుణ్ణి. అయినా జ్యోతి సంపాదక వర్గంవారు నన్నీ వ్యాసావళి వ్రాయవలసిందిగా కోరినంతనే వెంటనే కొంత తటపటాయించినా, చిత్రసీమలో నాకు వ్యక్తిగతంగా పరిచయస్తులూ, స్నేహితులూ అయిన సంగీత దర్శకులను గురించి, వారితో నా అనుభవాలను గురించి నా చేతనయిన రీతిని వ్రాయడానికే సంకల్పించుకున్నాను. ఈ రచనల్లో నాకత్యంత ప్రియమైన హాస్యరసం కోసం తాపత్రయమే తప్ప వ్యంగ్యానికేమాత్రమూ తావులేదు. అనుకోకుండా పొరపాటున వ్యంగ్యమెక్కడైనా స్ఫురిస్తే, అది నా తప్పు కాదు. కాకతాళీయమనుకోమని నా మనవి. వ్యక్తుల సుగుణ గణ ప్రశంసతోనే కాని, వారి దోష విచారణ, వివరణలతో మనకు నిమిత్తం లేదు. ఉండకూడదు. వారి కళాకౌశలం, అనుభవవైశిష్ట్యం, సౌశీల్య సౌరభం, సౌజన్యాది సద్గుణ సౌందర్యం మనకు కావలసిన వంశాలు. తదితరాలు కావు. ఎవరి మనసును గాని నొప్పించడం నా ఉద్దేశ్యం కాదు. అభిమతం కాదు. చదువుకుంటూ పోతూ వున్న సమయంలో మధ్య ఎక్కడైనా మీకు నవ్వు వస్తే చిన్నగా, సన్నగా నవ్వుకోండి. లేక పోతే వూరుకోండి. అంతే… ఏ విషయంలోనూ అపార్ధం మాత్రం చేసుకోకండి.
మామూలుగా మనం మాట్లాడుకునేటప్పుడు వాడుకుంటూ వుండే దేశీయ పదజాలం అక్కడక్కడ తప్పనిసరిగా వుపయోగించవలసి వచ్చింది. కారణమేమంటే వాటికి తెలుగు తర్జుమా చేసి వ్రాస్తే పిల్లి కర్ధం మార్జాలం అని చెప్పినట్టవుతుందేమోనని నా భయం. అంతే కాని ఇంగ్లీషు, హిందీ, అరవం, ఆదిగాగల పరభాషా పాండిత్య ప్రకర్ష కోసం కాదని మనవి. ఎటొచ్చీ కొన్ని చోట్ల ప్రాస కోసం ప్రాకులాడేనన్న విషయం మీకందరికీ యెలాగూ విదితమైపోతుంది, తప్పో ఒప్పో చెప్పలేను గాని. నేను రైముకి రిథముకి దాసుణ్ణి. ఫోనెటిక్స్ ప్రియుణ్ణి. ఇదే నాలోని ప్రబలమైన దౌర్బల్యం. సాహిత్యపరంగానూ, భాషాపరంగానూ పరికిస్తే, దోషాలు దొర్లుతూ వుండకపోవు గనకనూ ఈ వ్యాసాలలో నేను ప్రాధాన్యమిస్తున్నది సంగీతానికీ, సంఘటనలకీ, వ్యక్తుల తత్వాలకి గనకనూ ఆయా దోషాలను విస్మరించి అనుగ్రహించ గలందులకు పాఠకులు నాచే ప్రార్ధితులు.]
శ్రీ రసాలూరు స్వరాజ్యేశ్వరరావుగారి గురించి తెలియని వారెవరూ తెలుగుదేశంలో వుండరు. తెలుగుదేశంలో మాత్రమే అనుకోవడం దేనికి? చంద్రలేఖ చిత్రం ద్వారా వీరి సుమధురమైన సంగీతాన్ని యావద్భారతదేశమూ విని ఆనందించింది. అభినందించింది. అలాటి జగమెరిగిన జగజ్జెట్టిని గురించి వ్రాయబూనడం నాలాంటి వారికి మహా సాహసమనే అనాలి, న్యాయానికి. అయినా నాకు, వారికిగల వ్యక్తిగత, వ్యాపారిక, కళాత్మక సాన్నిహిత్యాన్ని, స్నేహాన్నీ పురస్కరించుకుని వారితో నాకు కలిగిన కొన్ని అనుభవాలను మీకు తెలియజేయగోరి వ్రాయుట కుపక్రమిస్తున్నాను.
ఈయన భలే తమాషా మనిషి. విచిత్రమైన వ్యక్తి. ఎవరితోనైనా ఇట్టే పరిచయం చేసేసుకుని సరదాగా మాటాడేయగలిగే శక్తి వుంది. ఆ ధోరణిలో నవ్వుతూ నవ్వుతూనే నసాళానికి అంటిపోయే జోకులు బ్రేకు లేకుండానే స్వీట్ కేకుల్లా తెగవేయగలిగే నేర్పు వుంది. వేషభాషలలో చాలా సింపుల్‌గా, సరదాగా వుంటారు. మొదట్లో వీరి చేతిలో సదా గొడుగుండేది. ‘మరొకరు మనకి గొడుగు పట్టవలసిన యోగం మనకుండగా, మనకి మనమే గొడుగెత్తుకోవలసిన అవసరమేమి?’ అనుకునే అహంభావం వీరిలో శూన్యం. నిరాడంబరజీవి. మడచిన ఫుల్‌షర్టూ, గూడకట్టూ, చంకలోనో, చేతిలోనో మ్యూజిక్ ఫైలూ, మ్యాజిక్‌లా ఆకర్షించే మాటల ధోరణి, అనుకరణీయమైన రాగాలకరణీ, సంభాషణలో మధ్య మధ్య నవ్వుల కామాలు — ఇవి వీరి వ్యక్తిత్వంలోని కొన్ని ప్రత్యేకతలు. వీరివద్ద ఇద్దరు తమిళ సహోదరులు సహాయ సంగీత దర్శకులుగా పని చేస్తూ వుంటారు. రాజగోపాల్, కృష్ణన్ అనే ఈ ఇరువురూ శాస్త్రీయ సంగీత ప్రవీణులు. జంటగాయకుల్లాగా వీరిద్దరూ ఒకేసారి పాడుతూ రాజేశ్వర్రావుగారు కట్టిన ట్యూనులు మాకు రిహార్సల్సులో వినిపిస్తూ వుంటే మా అందరికీ భలే యిదిగా వుంటుంది. భాషా వ్యత్యాసం గమనించకుండా వారికి తమ వద్ద పని చేసే సదవకాశం కలిగించారంటే వీరి ఉదారస్వభావాని కదొక ముదావహమైన ఉదాహరణ.
రాజేశ్వర్రావుగారి సంగీతాన్నే కాక, స్వరాలు ధ్వనించే వారి సంభాషణలూ, చమత్కారం స్ఫురించే ఛలోక్తులు గూడా విని ఆనందించడంతో వూరుకోక వాటిని అనుకరించేవారు అత్యధిక సంఖ్యలో వుంటారు. వున్నారు. అలాటివాళ్ళలో నేను గూడా ఒకణ్ణి. వీరి పరోక్షంలో, వీరి సంభాషణలూ అవీ అనుకరిస్తూ మిత్రులందరికీ వినిపిస్తూ, వారితోపాటు నేను గూడా ఆనందిస్తూ వుంటా. మనలో మనమాట. ఆయనకెదురుగా ఎన్నడూ ఇలాటి చేష్టలు చేయలేదనుకోండి. కాని ఒకవేళ అలవాటులో పొరపాటుగా నేనలా చేసినా, ఆయన నన్నపార్ధం చేసుకోరనే ధైర్యం, నమ్మకం నాకున్నాయి. ఏమో! చూడాలి మరి!
రాజేశ్వర్రావుగారి పాట, దాని ప్రాశస్త్యం వర్ణించాలంటే మానవుల తరమా! సాక్షాత్తు వేణు ప్రవీణుడైన ఆ శ్రీకృష్ణుడే ఒప్పేసుకున్నాడాయె. “పాట పాడుమా! కృష్ణా! పలుకు తేనేలొలుకు నటుల” అని రాజేశ్వర్రావుగారు మురళీధరుణ్ణి అడిగినదే తడవుగా, “నీ అంత హాయిగా నేణు పాడగలనా, నువ్వే పాట పాడు. నేను ఫ్లూటు వాయిస్తాను” అనేవాడు. (చూడుడు. ‘జ్యోతి’ కృష్ణాష్టమి ప్రత్యేక సంచిక)
తేనె గొంతు
ఈయన గొంతులో వింత మాధుర్యముంది. పాట సాహిత్యానికి సంగీతాన్ని జతచేర్చి మంచి వరస కట్టి ఈయన స్వంతంగా అనుభవిస్తూ, అభినయిస్తూ పాడి వినిపిస్తూ వుండే సమయంలో నిర్మాతలూ, వారి ఆశ్రితులూ, తదితరులూ ఈ పాటను పాడబోయే నేపథ్య గాయకులు ఈయన పాడేటంత అద్భుతంగానూ పాడి, పాటకి న్యాయం చేకూర్చగలరో లేదో అనే సహజమైన సందేహానికి గురి అవుతూ ఉండడం కద్దు. అంతే కాదు. ఒకే సాహిత్యానికి ఈయన రెండు మూడు వరసలు కట్టి, తమ గళమధురిమ జోడించి, చక్కగా మేళవించి, అనర్గళంగా, తీయగా, హాయిగా, పాడి వినిపిస్తూ వుంటే, ఏ ట్యూనుకా ట్యూనే నచ్చి, దేనిని సెలెక్టు చేసుకోవాలో తెలియక నిర్మాతలు తికమక పడటం కూడా కద్దు. ఇదేమీ అతిశయోక్తే కాదు. ఖచ్చితమైన ఉచితోక్తి, సూక్తి.
ఈ సందర్భంలోనే వీరు సంగీతం సమకూర్చిన అనేక చిత్రాలలోని కొన్ని పాటలు జ్ఞాపకం చేసుకుందాం. అన్నీ తలుచుకుని వాటిని గురించి చర్చ ప్రారంభిస్తే చాలా టైము పడుతుంది. పెద్ద గ్రంథం అవుతుంది. అన్ని చిత్రాలలో లెక్కలేనన్ని పాటలు సృష్టించారన్నమాట. శ్రీకృష్ణలీలలు, యిల్లాలు, బాలనాగమ్మ (జెమినిది కాదు) మొదలైన చిత్రాల్లో వీరు నటించారు. తన పాటలు తనే పాడుకున్నారు. ఇల్లాలు చిత్రంలో “కావ్యపానము చేసి కైపెక్కినానే” అని వీరు చేతులూపుతూ, మత్తు కలిగించేలా పాడుతుంటే నాకు మాంచి సరదాగా వుండేది. దానికోసమే నాలుగు సార్లు ఆ ఫిల్మ్ చూశానని జ్ఞాపకం. కాలక్రమేణా సినిమాల్లో నటించడం, పాడడం మానేశారు. ఆమధ్య ఒక తమిళ చిత్రంలో (బహుశా వాష్విలే ఒరునాళ్ లేక వాషప్పిరందవళ్ చిత్రంలో అనుకుంటా) నేపధ్యగీతం పాడారు. ఈమధ్య సంగీత దర్శకత్వం మీద మాత్రమే శ్రద్ధ వహిస్తున్నారు.
జెమినీవారి బాలనాగమ్మకి వీరు సంగీతం ఇచ్చారు. ఇందులోని చాలా పాటలు హిట్స్ అయినాయి. ఆ చిత్రంలో మాయల మరాఠీ భూత ప్రేతాల్ని పూజించే సన్నివేశంలో వీరిచ్చిన రీరికార్డింగ్ ఎఫెక్ట్స్ తలుచుకుంటే ఇప్పటికీ కూడా నా గుండెలు ఢామ్మంటూ వుంటాయి. ఆ సమయంలో థియేటర్లో పసిపిల్లలు ఝడుసుకుని ఆరున్నొక్క రాగం అందుకుని ఆలాపిస్తూ వుండేవారు. ప్రతీ చిత్రంలోనూ, రీరికార్డింగ్ విషయంలో తగు శ్రద్ధ వహించి సన్నివేశాలకి తగిన సంగీతం అందించడంలో వీరు సిద్ధహస్తులు.
ఒక జాబితా: చంద్రలేఖ (తమిళం, హిందీ), నిశాన్, అపూర్వ సహోదరులు (తెలుగు, అపూర్వ సహోదరగళ్ అరవం), మంగమ్మ శపథం (తెలుగు, తమిళం), మిస్ మాలిని, చక్రధారి వగైరా జెమినీ చిత్రాలకి సంగీత సారధ్యం వహించారు. అంతకు ముందు, ఆ తరువాత వారు సంగీత దర్శకత్వం నెరపిన పలు చిత్రాలలో ఇవి కొన్ని: మిస్సమ్మ (తెలుగు, అరవం), విప్రనారాయణ, మల్లీశ్వరి, చరణదాసి (తెలుగు, అరవం), బాలసన్యాసమ్మ కథ, వయ్యారి భామ, మాయాబజార్, అప్పుచేసి పప్పుకూడు, విక్రమాదిత్తన్ (అరవం), అమరదేవి (అరవం), పాసై పిడిత్తవళ్ బాగ్యశాలి (అరవం), ఆడపెత్తనం, ఆరాధన, ఆహుతి. (ఈ చిత్రాలలో నేను పాడలేదు.)
భలేరాముడు (తెలుగు), ప్రేమపాశం (తమిళం), భలే అమ్మాయిలు (తెలుగు), ఇరుసహోదరిగల్ (తమిళం), అల్లావుద్దీన్ అద్భుతదీపం (తెలుగు, తమిళం), భక్త జయదేవ, చెంచులక్ష్మి, అవళ్ యార్ (తమిళం), రాణీ రత్నప్రభ, భీష్మ, ఇద్దరు మిత్రులు, కులగోత్రాలు, చదువుకున్న అమ్మాయిలు మొదలైన చిత్రాలలో నేను పాడాను. కొన్ని ముఖ్యమైన పిక్చర్ల పేర్లు వ్రాయడం నేను మరిచిపోయి వుంటాననుకుంటా.
ఇలా అనేక చిత్రాలకి అద్భుతంగా సంగీత ప్రదానం చేసి, ఆబాల గోపాలాన్ని ఆనందింపజేసి అశేష ఆంధ్రావనిలోనూ, ఆరవదేశంలోనూ, ఉత్తరాదినీ కూడా అఖండమైన కీర్తి ప్రతిష్టతల నార్జించారు. సందర్భోచితంగా, కర్ణాటక సంగీతమూ, హిందుస్తానీ బాణీ, స్పానిష్, అరబిక్, హవాయియిన్, ఆదిగా గల విదేశీయ సంప్రదాయాలూ ఉపయోగిస్తూ, కాలానుగుణమైన కొత్త కొత్త పోకడలతో రకరకాల ట్యూనులు సృష్టించి మనందరికీ వినిపించారు. వినిపిస్తున్నారు. ఇంకా ఇంకా వినిపించబోతున్నారు కూడా.
నాటకీయత లోని రమణీయకత దూరమవకుండా పాతపద్ధతీ, పవిత్రతా చెడకుండా కొత్త పంథాలో భవ్యమౌ, నవ్య రీతులలో వీరు చెంచులక్ష్మి, భీష్మ చిత్రాలలోని పద్యాల కమర్చిన రాగ, ప్రయోగాలు గమనించి చూస్తే, నిత్యనూత్నమైన వీరి కల్పనా శక్తిని గ్రహించగలుగుతారు. ఈ విధంగా తనకే సొంతమైన ఒక పద్ధతి ననుసరించి పాట వినగానే ఇది రాజేశ్వర్రావు బాణీ అని శ్రోతలు వెంటనే గుర్తుపట్టగలిగే విధాన, గీతాలకు సంగీతం సందర్భశుద్ధితో సమకూర్చడం ఈయనకు వెన్నతో పెట్టిన విద్య అనడం అసమంజసం కాదు. వింటే రాజేశ్వర్రావు సంగీతం వినాలి తింటే బాదాం హల్వా తినాలి అని కొంతమంది రసికులనుకోవడం నేను చెవులారా విని వున్నాను.
అయిదు రాగాలు
రా.రా. గారికీ అయిదు రాగాలు పంచ ప్రాణాలనవచ్చు. 1. భీంపలాస్, 2. సింధుభైరవి, 3. కాఫీ, 4. కళ్యాణి, 5. పహాడీ. వీరి గీతాలలో ఈ రాగచ్ఛాయలు తరచూ వినవస్తుంటాయి. మిగిలిన రాగాలు వాడరని కాదు. సాధారణంగా లలిత సంగీతంలో ఎక్కువగా వాడబడే రాగాలివే, ఇలాటివే. ఈ ముఖ్య రాగాలలో ఒక్కొక్కదానిలో వేల సంఖ్యలో పాటలు తయారవుతూనే వున్నాయి. మనమూ వింటూనే వున్నాము. ఒక పట్టాన బోరుకొట్టని రాగాలివి. మనకి ముఖ్యంగా వున్నవి ఏడుస్వరాలే అయినా ఆ సప్తస్వరాల వింత కలయికల విభిన్న పరివర్తనల వలన వలననే మనకిన్ని రకాల వరుసలు ఒకే రాగంలో అమర్చుకోవడానికి అవకాశాలు లభ్యమౌతున్నాయి. ఇదే సందర్భంలో ఈ విషయం కూడా గమనించాలి మనం. మనం మన మిత్రులతో ముచ్చటించే సమయంలో “ఒరేయ్ ఫలానా వాడు ఫలానా హిందీ లేక ఇంగ్లీషు ట్యూన్ కాపీ కొట్టేశాడ్రా!” అని అతి తేలికగా మాట్లాడేసుకుంటూ వుంటాం. కాని సర్వదా ఈ అభిప్రాయం తథ్యం కాదు. ఒక్కొక్కప్పుడు ఒకే రాగంలో, ఒకే తాళంలో కూర్చబడే మెట్లు, కొన్ని మెట్ల వరకూ ఒకే విధంగా వున్నట్లు అనిపిస్తాయి. నిజంగా కలసిపోతూ వుంటాయి.