హాయిగ పాడుదునా?

[1968 ప్రాంతంలో ఆనాటి ప్రముఖ పత్రికల్లో ఒకటైన జ్యోతి మాసపత్రికలో పి. బి. శ్రీనివాస్ తనదైన చమత్కారశైలిలో ఆనాటి ప్రముఖ సంగీతదర్శకులందరిపైనా సుదీర్ఘమైన వ్యాసాలు రాశారు. కేవలం హాస్యమే కాదు, సంగీతపరంగా ఎన్నో విషయాలనే తెలిపేవి యివి. నాకు పాతపాటల గురించి అంత పరిజ్ఞానం లేని కాలంలో ఈ వ్యాసాల్ని ముందు పెట్టుకుని చాలా పాటల్ని సేకరించుకున్నాను. ఆయిన మెచ్చుకున్న ప్రతి ఒక్క పాటా నాకు కూడా తెగ నచ్చేసి, మా యిద్దరి వేవ్ లెంగ్తులూ ఒకటే అనుకునే వాణ్ణి. ఈ వ్యాసాల విలువ మరింత బాగా తెలిసేనాటికి ఇంట్లోని జ్యోతి సంచికలు గల్లంతైపోయాయి. వాటికోసం తీవ్రంగా వెతుకుతున్న రోజుల్లో డా. భార్గవి వీటి ఫోటోకాపీలను అందించారు. వారికి నా ధన్యవాదాలు.

ఈ వ్యాస పరంపరలో వచ్చినవి: హాయిగ పాడుదునా?, రసికజన మనోభిరామ శ్రీ అశ్వత్థామ, స్వరసప్తా చలపతి శ్రీ తాతినేని చలపతి, పాటల టంకసాల శ్రీ ఘంటసాల, స్వరపరాయణ శ్రీ ఆదినారాయణ, వేణు-గానలోలుడు, స్వరాలరాజు టి.వి. రాజు, జనం నోట తన పాట పలికించిన చిలక, జంటస్వరాలు, శ్రీ సుసర్ల దక్షిణామూర్తి. ఇక్కడ మీకందిస్తున్నది హాయిగ పాడుదునా? అన్న సాలూరి రాజేశ్వరరావు పైన రాసిన ప్రారంభ వ్యాసం. – పరుచూరి శ్రీనివాస్.]


[నేను కవిని కాను. గాయకుణ్ణి. రచయితని కాను, రాగాలాపకుణ్ణి. అయినా జ్యోతి సంపాదక వర్గంవారు నన్నీ వ్యాసావళి వ్రాయవలసిందిగా కోరినంతనే వెంటనే కొంత తటపటాయించినా, చిత్రసీమలో నాకు వ్యక్తిగతంగా పరిచయస్తులూ, స్నేహితులూ అయిన సంగీత దర్శకులను గురించి, వారితో నా అనుభవాలను గురించి నా చేతనయిన రీతిని వ్రాయడానికే సంకల్పించుకున్నాను. ఈ రచనల్లో నాకత్యంత ప్రియమైన హాస్యరసం కోసం తాపత్రయమే తప్ప వ్యంగ్యానికేమాత్రమూ తావులేదు. అనుకోకుండా పొరపాటున వ్యంగ్యమెక్కడైనా స్ఫురిస్తే, అది నా తప్పు కాదు. కాకతాళీయమనుకోమని నా మనవి. వ్యక్తుల సుగుణ గణ ప్రశంసతోనే కాని, వారి దోష విచారణ, వివరణలతో మనకు నిమిత్తం లేదు. ఉండకూడదు. వారి కళాకౌశలం, అనుభవవైశిష్ట్యం, సౌశీల్య సౌరభం, సౌజన్యాది సద్గుణ సౌందర్యం మనకు కావలసిన వంశాలు. తదితరాలు కావు. ఎవరి మనసును గాని నొప్పించడం నా ఉద్దేశ్యం కాదు. అభిమతం కాదు. చదువుకుంటూ పోతూ వున్న సమయంలో మధ్య ఎక్కడైనా మీకు నవ్వు వస్తే చిన్నగా, సన్నగా నవ్వుకోండి. లేక పోతే వూరుకోండి. అంతే… ఏ విషయంలోనూ అపార్ధం మాత్రం చేసుకోకండి.

మామూలుగా మనం మాట్లాడుకునేటప్పుడు వాడుకుంటూ వుండే దేశీయ పదజాలం అక్కడక్కడ తప్పనిసరిగా వుపయోగించవలసి వచ్చింది. కారణమేమంటే వాటికి తెలుగు తర్జుమా చేసి వ్రాస్తే పిల్లి కర్ధం మార్జాలం అని చెప్పినట్టవుతుందేమోనని నా భయం. అంతే కాని ఇంగ్లీషు, హిందీ, అరవం, ఆదిగాగల పరభాషా పాండిత్య ప్రకర్ష కోసం కాదని మనవి. ఎటొచ్చీ కొన్ని చోట్ల ప్రాస కోసం ప్రాకులాడేనన్న విషయం మీకందరికీ యెలాగూ విదితమైపోతుంది, తప్పో ఒప్పో చెప్పలేను గాని. నేను రైముకి రిథముకి దాసుణ్ణి. ఫోనెటిక్స్ ప్రియుణ్ణి. ఇదే నాలోని ప్రబలమైన దౌర్బల్యం. సాహిత్యపరంగానూ, భాషాపరంగానూ పరికిస్తే, దోషాలు దొర్లుతూ వుండకపోవు గనకనూ ఈ వ్యాసాలలో నేను ప్రాధాన్యమిస్తున్నది సంగీతానికీ, సంఘటనలకీ, వ్యక్తుల తత్వాలకి గనకనూ ఆయా దోషాలను విస్మరించి అనుగ్రహించ గలందులకు పాఠకులు నాచే ప్రార్ధితులు.]

శ్రీ రసాలూరు స్వరాజ్యేశ్వరరావుగారి గురించి తెలియని వారెవరూ తెలుగుదేశంలో వుండరు. తెలుగుదేశంలో మాత్రమే అనుకోవడం దేనికి? చంద్రలేఖ చిత్రం ద్వారా వీరి సుమధురమైన సంగీతాన్ని యావద్భారతదేశమూ విని ఆనందించింది. అభినందించింది. అలాటి జగమెరిగిన జగజ్జెట్టిని గురించి వ్రాయబూనడం నాలాంటి వారికి మహా సాహసమనే అనాలి, న్యాయానికి. అయినా నాకు, వారికిగల వ్యక్తిగత, వ్యాపారిక, కళాత్మక సాన్నిహిత్యాన్ని, స్నేహాన్నీ పురస్కరించుకుని వారితో నాకు కలిగిన కొన్ని అనుభవాలను మీకు తెలియజేయగోరి వ్రాయుట కుపక్రమిస్తున్నాను.

ఈయన భలే తమాషా మనిషి. విచిత్రమైన వ్యక్తి. ఎవరితోనైనా ఇట్టే పరిచయం చేసేసుకుని సరదాగా మాటాడేయగలిగే శక్తి వుంది. ఆ ధోరణిలో నవ్వుతూ నవ్వుతూనే నసాళానికి అంటిపోయే జోకులు బ్రేకు లేకుండానే స్వీట్ కేకుల్లా తెగవేయగలిగే నేర్పు వుంది. వేషభాషలలో చాలా సింపుల్‌గా, సరదాగా వుంటారు. మొదట్లో వీరి చేతిలో సదా గొడుగుండేది. ‘మరొకరు మనకి గొడుగు పట్టవలసిన యోగం మనకుండగా, మనకి మనమే గొడుగెత్తుకోవలసిన అవసరమేమి?’ అనుకునే అహంభావం వీరిలో శూన్యం. నిరాడంబరజీవి. మడచిన ఫుల్‌షర్టూ, గూడకట్టూ, చంకలోనో, చేతిలోనో మ్యూజిక్ ఫైలూ, మ్యాజిక్‌లా ఆకర్షించే మాటల ధోరణి, అనుకరణీయమైన రాగాలకరణీ, సంభాషణలో మధ్య మధ్య నవ్వుల కామాలు — ఇవి వీరి వ్యక్తిత్వంలోని కొన్ని ప్రత్యేకతలు. వీరివద్ద ఇద్దరు తమిళ సహోదరులు సహాయ సంగీత దర్శకులుగా పని చేస్తూ వుంటారు. రాజగోపాల్, కృష్ణన్ అనే ఈ ఇరువురూ శాస్త్రీయ సంగీత ప్రవీణులు. జంటగాయకుల్లాగా వీరిద్దరూ ఒకేసారి పాడుతూ రాజేశ్వర్రావుగారు కట్టిన ట్యూనులు మాకు రిహార్సల్సులో వినిపిస్తూ వుంటే మా అందరికీ భలే యిదిగా వుంటుంది. భాషా వ్యత్యాసం గమనించకుండా వారికి తమ వద్ద పని చేసే సదవకాశం కలిగించారంటే వీరి ఉదారస్వభావాని కదొక ముదావహమైన ఉదాహరణ.

రాజేశ్వర్రావుగారి సంగీతాన్నే కాక, స్వరాలు ధ్వనించే వారి సంభాషణలూ, చమత్కారం స్ఫురించే ఛలోక్తులు గూడా విని ఆనందించడంతో వూరుకోక వాటిని అనుకరించేవారు అత్యధిక సంఖ్యలో వుంటారు. వున్నారు. అలాటివాళ్ళలో నేను గూడా ఒకణ్ణి. వీరి పరోక్షంలో, వీరి సంభాషణలూ అవీ అనుకరిస్తూ మిత్రులందరికీ వినిపిస్తూ, వారితోపాటు నేను గూడా ఆనందిస్తూ వుంటా. మనలో మనమాట. ఆయనకెదురుగా ఎన్నడూ ఇలాటి చేష్టలు చేయలేదనుకోండి. కాని ఒకవేళ అలవాటులో పొరపాటుగా నేనలా చేసినా, ఆయన నన్నపార్ధం చేసుకోరనే ధైర్యం, నమ్మకం నాకున్నాయి. ఏమో! చూడాలి మరి!

రాజేశ్వర్రావుగారి పాట, దాని ప్రాశస్త్యం వర్ణించాలంటే మానవుల తరమా! సాక్షాత్తు వేణు ప్రవీణుడైన ఆ శ్రీకృష్ణుడే ఒప్పేసుకున్నాడాయె. “పాట పాడుమా! కృష్ణా! పలుకు తేనేలొలుకు నటుల” అని రాజేశ్వర్రావుగారు మురళీధరుణ్ణి అడిగినదే తడవుగా, “నీ అంత హాయిగా నేణు పాడగలనా, నువ్వే పాట పాడు. నేను ఫ్లూటు వాయిస్తాను” అనేవాడు. (చూడుడు. ‘జ్యోతి’ కృష్ణాష్టమి ప్రత్యేక సంచిక)

తేనె గొంతు

ఈయన గొంతులో వింత మాధుర్యముంది. పాట సాహిత్యానికి సంగీతాన్ని జతచేర్చి మంచి వరస కట్టి ఈయన స్వంతంగా అనుభవిస్తూ, అభినయిస్తూ పాడి వినిపిస్తూ వుండే సమయంలో నిర్మాతలూ, వారి ఆశ్రితులూ, తదితరులూ ఈ పాటను పాడబోయే నేపథ్య గాయకులు ఈయన పాడేటంత అద్భుతంగానూ పాడి, పాటకి న్యాయం చేకూర్చగలరో లేదో అనే సహజమైన సందేహానికి గురి అవుతూ ఉండడం కద్దు. అంతే కాదు. ఒకే సాహిత్యానికి ఈయన రెండు మూడు వరసలు కట్టి, తమ గళమధురిమ జోడించి, చక్కగా మేళవించి, అనర్గళంగా, తీయగా, హాయిగా, పాడి వినిపిస్తూ వుంటే, ఏ ట్యూనుకా ట్యూనే నచ్చి, దేనిని సెలెక్టు చేసుకోవాలో తెలియక నిర్మాతలు తికమక పడటం కూడా కద్దు. ఇదేమీ అతిశయోక్తే కాదు. ఖచ్చితమైన ఉచితోక్తి, సూక్తి.

ఈ సందర్భంలోనే వీరు సంగీతం సమకూర్చిన అనేక చిత్రాలలోని కొన్ని పాటలు జ్ఞాపకం చేసుకుందాం. అన్నీ తలుచుకుని వాటిని గురించి చర్చ ప్రారంభిస్తే చాలా టైము పడుతుంది. పెద్ద గ్రంథం అవుతుంది. అన్ని చిత్రాలలో లెక్కలేనన్ని పాటలు సృష్టించారన్నమాట. శ్రీకృష్ణలీలలు, యిల్లాలు, బాలనాగమ్మ (జెమినిది కాదు) మొదలైన చిత్రాల్లో వీరు నటించారు. తన పాటలు తనే పాడుకున్నారు. ఇల్లాలు చిత్రంలో “కావ్యపానము చేసి కైపెక్కినానే” అని వీరు చేతులూపుతూ, మత్తు కలిగించేలా పాడుతుంటే నాకు మాంచి సరదాగా వుండేది. దానికోసమే నాలుగు సార్లు ఆ ఫిల్మ్ చూశానని జ్ఞాపకం. కాలక్రమేణా సినిమాల్లో నటించడం, పాడడం మానేశారు. ఆమధ్య ఒక తమిళ చిత్రంలో (బహుశా వాష్విలే ఒరునాళ్ లేక వాషప్పిరందవళ్ చిత్రంలో అనుకుంటా) నేపధ్యగీతం పాడారు. ఈమధ్య సంగీత దర్శకత్వం మీద మాత్రమే శ్రద్ధ వహిస్తున్నారు.

జెమినీవారి బాలనాగమ్మకి వీరు సంగీతం ఇచ్చారు. ఇందులోని చాలా పాటలు హిట్స్ అయినాయి. ఆ చిత్రంలో మాయల మరాఠీ భూత ప్రేతాల్ని పూజించే సన్నివేశంలో వీరిచ్చిన రీరికార్డింగ్ ఎఫెక్ట్స్ తలుచుకుంటే ఇప్పటికీ కూడా నా గుండెలు ఢామ్మంటూ వుంటాయి. ఆ సమయంలో థియేటర్లో పసిపిల్లలు ఝడుసుకుని ఆరున్నొక్క రాగం అందుకుని ఆలాపిస్తూ వుండేవారు. ప్రతీ చిత్రంలోనూ, రీరికార్డింగ్ విషయంలో తగు శ్రద్ధ వహించి సన్నివేశాలకి తగిన సంగీతం అందించడంలో వీరు సిద్ధహస్తులు.

ఒక జాబితా: చంద్రలేఖ (తమిళం, హిందీ), నిశాన్, అపూర్వ సహోదరులు (తెలుగు, అపూర్వ సహోదరగళ్ అరవం), మంగమ్మ శపథం (తెలుగు, తమిళం), మిస్ మాలిని, చక్రధారి వగైరా జెమినీ చిత్రాలకి సంగీత సారధ్యం వహించారు. అంతకు ముందు, ఆ తరువాత వారు సంగీత దర్శకత్వం నెరపిన పలు చిత్రాలలో ఇవి కొన్ని: మిస్సమ్మ (తెలుగు, అరవం), విప్రనారాయణ, మల్లీశ్వరి, చరణదాసి (తెలుగు, అరవం), బాలసన్యాసమ్మ కథ, వయ్యారి భామ, మాయాబజార్, అప్పుచేసి పప్పుకూడు, విక్రమాదిత్తన్ (అరవం), అమరదేవి (అరవం), పాసై పిడిత్తవళ్‌ బాగ్యశాలి (అరవం), ఆడపెత్తనం, ఆరాధన, ఆహుతి. (ఈ చిత్రాలలో నేను పాడలేదు.)

భలేరాముడు (తెలుగు), ప్రేమపాశం (తమిళం), భలే అమ్మాయిలు (తెలుగు), ఇరుసహోదరిగల్ (తమిళం), అల్లావుద్దీన్ అద్భుతదీపం (తెలుగు, తమిళం), భక్త జయదేవ, చెంచులక్ష్మి, అవళ్ యార్ (తమిళం), రాణీ రత్నప్రభ, భీష్మ, ఇద్దరు మిత్రులు, కులగోత్రాలు, చదువుకున్న అమ్మాయిలు మొదలైన చిత్రాలలో నేను పాడాను. కొన్ని ముఖ్యమైన పిక్చర్ల పేర్లు వ్రాయడం నేను మరిచిపోయి వుంటాననుకుంటా.

ఇలా అనేక చిత్రాలకి అద్భుతంగా సంగీత ప్రదానం చేసి, ఆబాల గోపాలాన్ని ఆనందింపజేసి అశేష ఆంధ్రావనిలోనూ, ఆరవదేశంలోనూ, ఉత్తరాదినీ కూడా అఖండమైన కీర్తి ప్రతిష్టతల నార్జించారు. సందర్భోచితంగా, కర్ణాటక సంగీతమూ, హిందుస్తానీ బాణీ, స్పానిష్, అరబిక్, హవాయియిన్, ఆదిగా గల విదేశీయ సంప్రదాయాలూ ఉపయోగిస్తూ, కాలానుగుణమైన కొత్త కొత్త పోకడలతో రకరకాల ట్యూనులు సృష్టించి మనందరికీ వినిపించారు. వినిపిస్తున్నారు. ఇంకా ఇంకా వినిపించబోతున్నారు కూడా.

నాటకీయత లోని రమణీయకత దూరమవకుండా పాతపద్ధతీ, పవిత్రతా చెడకుండా కొత్త పంథాలో భవ్యమౌ, నవ్య రీతులలో వీరు చెంచులక్ష్మి, భీష్మ చిత్రాలలోని పద్యాల కమర్చిన రాగ, ప్రయోగాలు గమనించి చూస్తే, నిత్యనూత్నమైన వీరి కల్పనా శక్తిని గ్రహించగలుగుతారు. ఈ విధంగా తనకే సొంతమైన ఒక పద్ధతి ననుసరించి పాట వినగానే ఇది రాజేశ్వర్రావు బాణీ అని శ్రోతలు వెంటనే గుర్తుపట్టగలిగే విధాన, గీతాలకు సంగీతం సందర్భశుద్ధితో సమకూర్చడం ఈయనకు వెన్నతో పెట్టిన విద్య అనడం అసమంజసం కాదు. వింటే రాజేశ్వర్రావు సంగీతం వినాలి తింటే బాదాం హల్వా తినాలి అని కొంతమంది రసికులనుకోవడం నేను చెవులారా విని వున్నాను.

అయిదు రాగాలు

రా.రా. గారికీ అయిదు రాగాలు పంచ ప్రాణాలనవచ్చు. 1. భీంపలాస్, 2. సింధుభైరవి, 3. కాఫీ, 4. కళ్యాణి, 5. పహాడీ. వీరి గీతాలలో ఈ రాగచ్ఛాయలు తరచూ వినవస్తుంటాయి. మిగిలిన రాగాలు వాడరని కాదు. సాధారణంగా లలిత సంగీతంలో ఎక్కువగా వాడబడే రాగాలివే, ఇలాటివే. ఈ ముఖ్య రాగాలలో ఒక్కొక్కదానిలో వేల సంఖ్యలో పాటలు తయారవుతూనే వున్నాయి. మనమూ వింటూనే వున్నాము. ఒక పట్టాన బోరుకొట్టని రాగాలివి. మనకి ముఖ్యంగా వున్నవి ఏడుస్వరాలే అయినా ఆ సప్తస్వరాల వింత కలయికల విభిన్న పరివర్తనల వలన వలననే మనకిన్ని రకాల వరుసలు ఒకే రాగంలో అమర్చుకోవడానికి అవకాశాలు లభ్యమౌతున్నాయి. ఇదే సందర్భంలో ఈ విషయం కూడా గమనించాలి మనం. మనం మన మిత్రులతో ముచ్చటించే సమయంలో “ఒరేయ్ ఫలానా వాడు ఫలానా హిందీ లేక ఇంగ్లీషు ట్యూన్ కాపీ కొట్టేశాడ్రా!” అని అతి తేలికగా మాట్లాడేసుకుంటూ వుంటాం. కాని సర్వదా ఈ అభిప్రాయం తథ్యం కాదు. ఒక్కొక్కప్పుడు ఒకే రాగంలో, ఒకే తాళంలో కూర్చబడే మెట్లు, కొన్ని మెట్ల వరకూ ఒకే విధంగా వున్నట్లు అనిపిస్తాయి. నిజంగా కలసిపోతూ వుంటాయి.

ఉదాహరణకి, బర్మన్‌గారు కూర్చి, కిషోర్ కుమార్ పాడిన దుఖీ మన్ మేరే అనే గీతంలో ‘దర్ద్ హమారా’ అని ప్రారంభమయే రెండు మూడు పంక్తులదాకా అమరిన ట్యూను, నేనంతకు మునుపు కొన్ని సంవత్సరాల క్రితమే విని వున్న ఒకానొక గీతంలోని కొంత భాగంలో యథాతథంగా తాదాత్మ్యం పొంది వుండడం నాకెంతో ఆశ్చర్యం కలిగించింది. నేను ఘంటాపధంగా (సగం లాయరుని లెండి. అంటే లా కోర్సు సగం చదివి వదిలేశాను.) చెప్పగలను. బర్మన్‌గారు నేను విన్న పాత ట్యూను విని వుండడాని కెంతమాత్రం అవకాశం లేదు. ఇలా అవ్యాజంగా ఒకరు చేసిన ట్యూన్స్‌తో అక్కడక్కడ కలిసిపోవడం సంభవిస్తూ వుంటుంది. అలాటప్పుడు గూడా మనం ఆ ఒకరు మరొకరి పాటను కాపీ కొట్టేశారని అనుకుంటాం. ఆ అనుకోవడం ఒకప్పుడు న్యాయం. మరొక్కప్పుడు అన్యాయం అవుతూ వుంటుంది. కనుక ఒక వ్యక్తి మనఃపూర్వకంగానే మరొకరి మాటని గాని, పాటను గాని కాపీ కొట్టారని రుజువుగా మనకి తెలిసే పర్యంతం, ఆ వ్యక్తి కాపీ కొట్టారని అనడం దురంతం అని నా సొంత అభిప్రాయం. మీ రేకీభవిస్తే నాకు సంతోషం. అనగా నా ఉద్దేశ్యం కాపీ కొట్టడం జరగదని కాదు. చాలా అరుదని అంటాను. అంతే. ఎందుకంటే ప్రతికూల పరిస్థితుల ప్రాబల్యానికి లొంగవలసి వస్తే తప్ప ఏ కళాకారుడూ తానింకొక కళాకారుని కళాసృష్టిని కాపీ కొట్టినట్లనిపించుకోవడాని కిష్టపడడు. సరియైన అవకాశాలు దొరికినప్పుడల్లా తన వ్యక్తిత్వాన్ని నిరూపించుకోవడానికే ప్రయత్నిస్తూ వుంటాడు. తన శక్త్యానుసారం విజయం సాధించ గలుగుతాడు.

కొంతమంది మిత్రుల అభిప్రాయం కాపీ సంగీతం కూడా కాఫీ లాగే రుచికరం, భోగ్యం అని. ఇంతకీ కాపీ కొట్టడమనేది వ్యక్తుల మనస్తత్వాన్ని బట్టి, పరిస్థితుల ననుసరించి జరుగుతూ వుంటుంది. వడకట్టి కాఫీ డికాక్షన్ తయారుచేయడంలో కూడా నేర్పు అవసరం. దారి తప్పి చాలాదూరం వచ్చినట్టున్నాను. క్షమించండి. ఏక్సిడెంటు అయ్యేలోపుగా మళ్ళీ దారిలో కొస్తాలెండి.

మరపురాని పాటలు

మల్లీశ్వరి లోని ‘మనసున మల్లెల మాలలూగెనే’ అనే వెన్నెల వెదజల్లే గేయాన్ని మరవగలమా? ‘ఆకాశవీధిలో’ని అందం, ‘ఔనా నిజమేనా’ లోని విరహం, ‘కోతీబావకు పెళ్ళంటా’ లోని కొంటెతనం, ‘ఉరకలు వేయాలి గిత్తలు పరుగులు తీయాలి’ లోని ఉల్లాసం, ఉద్రేకం, ఉత్సాహం, ‘ఎందుకే నీకింత తొందర’లోని మందగమనం, గాంభీర్యం, మనందర్నీ ఆకర్షించి, ఏడిపించి, కితకితలు పెట్టి నవ్వించి, కవ్వించి, ఎంతగా మురిపించాయో, మైమరిపించాయో, మరీ మరీ వినాలనిపించాయో మనందరికీ తెలుసు. మిస్సమ్మ లోని ‘బాలనురా మదనా,’ ‘బృందావనమది అందరిదీ,’ ‘ఏమిటో ఈ మాయ,’ ‘రావోయి చందమామ,’ వగైరా అన్ని పాటలు బ్రహ్మాండమైన హిట్స్ అయ్యాయి. మన మనసును రంజింప చేశాయి. విప్రనారాయణ లోని ‘చూడుమదే చెలియా,’ ‘ఎందుకోయీ తోటమాలీ,’ బహుళ జనాదరణ పొందాయి.

‘ఆహుతి’లో గీతికలు అవొకతరహా. ‘ప్రణయమేపోయేనా బలియై,’ ‘ఊగిసలాడేనయా పడవా,’ పాటలు మననే ఊపేశాయి. భక్త జయదేవలో ‘రాధా మనో రమణా’ మొదలైన పాటలూ, అష్టపదులూ మనని భక్తి పారవశ్యంలో ముంచెత్తాయి. ‘చెంచులక్ష్మి, భీష్మ’ల సంగీతం శాస్త్రీయంగా ఆహ్లాదం కలిగించింది.

భలే రాముడు, భలే అమ్మాయిలు, చిత్రాలు ‘నరసూ’ వారివి. కనుకనే కాబోలు వాటిలోని గీతాలు నరసూ కాఫీలా కమ్మకమ్మగా కుదిరాయి. ఇద్దరు మిత్రులు, చదువుకున్న అమ్మాయిలు, కులగోత్రాలు వగైరా సాంఘిక చిత్రాలు కనుక పాశ్చాత్య బాణీలు కూడా కొన్ని మనకు వినిపించాయి, ఉర్రూతలూగించాయి. వీరివద్ద నేను పాడిన పాటలు నాకూ నచ్చాయ్. మీకూ నచ్చాయి — భయమేలా ఓ మనసా, బంగరు బొమ్మా, అనురాగములొలికే ఈ రేయి, రావేరావే బాలా, చక్కనిచుక్కా సరసకు రావే, ఓహో చక్కని చిన్నది, ఎక్కడ దాచావోయి సిపాయీ, లాటరీలోనా లక్షలు లక్షలు, మనసులోని కోరిక, వగైరా పాటలూ, భీష్మలో కృష్ణుడికీ, చెంచులక్ష్మిలో నారదుడికి పాడిన పద్యాలూ అవీ నాకు మంచి పేరు తెచ్చి యిచ్చాయి. ఇలా ఒక్కొక్క పాట గురించీ రాసుకుపోతుంటే రామాయణమంత పురాణ గ్రంధమూ రాసేయొచ్చు. కాని చోటే చాలదు.

జోకేశ్వరరావు

ఇక రా.రావుగారి ఓరల్ మరియు ప్రాక్టికల్ జోకులూ, ఛలోక్తులూ, సూక్తులూ కొన్ని ఉదహరిస్తాను. వీరి సంగీతమూ, దాని ప్రాశస్త్యమూ అందరికీ తెలుసు. కాని వీరు చేసే వింతలూ, విశేషాలూ, తమాషాలూ కొందరికే తెలిసుంటాయి. అందరికీ తెలిసుండవు. అందుకే వ్రాస్తున్నాను.

కొద్దిరోజుల క్రితం చెన్నపురి నక్షత్ర ప్రదర్శనశాల అనగా స్టార్ థియేటరులో బిమల్‌రాయ్ ‘బందినీ’ చూసేందుకని నేను నా మిత్రుడొకరితో వెళ్ళాను. అక్కడ హైద్రాబాదు నుండి వచ్చిన మిత్రునితో కలిసి అదే పిక్చర్ చూడడానికి వచ్చిన శ్రీ రాజేశ్వర రావుగారు కనిపించారు. పిక్చరు ఆరంభించడానికి ఇంకా ఇరవై నిముషాలవుతుందని తెలుసుకుని, నేను మన ప్రస్తుత వ్యాస నాయకునితో “అలా రత్నా కేఫ్దాకా వెళ్ళి నాలుగు ఇడ్డెన్లు సేవించి వద్దామా సార్? ఆ హోటల్ ఇడ్డెన్లకి స్పెషల్” అన్నాను. దానికాయన మొదట “తిరిగి రావడం ఆలస్యమైపోతే బర్మన్‌గారి టైటిల్ మ్యూజిక్ మిస్ అయిపోతామేమో మాస్టారూ,” అని తరవాత “మిస్ అవంలెండి మనమంతా మిస్టర్లమేగా పదండి” అని జోకారు. మొత్తానికి ఏమైనా సరేనని అందరం హోటలు కేసి దారితీశాం కాలినడకనే. అన్నట్టూ, మరిచాను. మాతో ప్రఖ్యాత హిందీ గేయ రచయితా, కవీ అయిన శ్రీ సరస్వతీకుమార్ దీపక్ కూడా వున్నారు. వారితో మన సాలూరువారు టూటీ ఫూటీ హిందీలో తమాషాగా ముచ్చటిస్తూనే వున్నారు దారి పొడుగునా. మెల్లిగా హోటలు చేరాం. కడుపునిండా మస్తుగా మజాగా యిడ్డెన్లు కొట్టేశాం. త్రేన్చుకుంటూ తిరిగి థియేటరుకి బయలుదేరాం. కాని ఆయన అన్నట్టుగానే పిక్చరు మొదలై అప్పటికే అయిదారు నిమిషాలయింది. టైటిల్ మ్యూజిక్ మిస్సయ్యారు మా మిస్టర్లంతా. “నా వల్లనే ఈ ఆలస్యం అయింది సార్” అన్ రారాగారితో బాధతోనే బిక్కమొగం పెట్టి, గుటకలు మింగుతూ నసిగాను. “సారీ సార”న్నాను. “పోనీయండి సార్. దానికి నష్టపరిహారంగా White Tablets (తెల్లమాత్రలు అంటే ఇడ్లీలు) కమ్మగా భోంచేశాంగా,” అని లోలోపల టైటిల్ మ్యూజిక్ మిస్సయ్యామన్న బాధ బాధిస్తున్నా, నేను కూడా బాధపడడం దేనికని నన్నూరడించడం కోసమనే నవ్వు తెచ్చుకుని నవ్వారు. ఇది వారి సున్నితమైన హృదయానికి తార్కాణం.

ఒకరోజు మేం రిహర్సల్సు చేస్తుండగా వీరికి, వీరి అన్నగారైన శ్రీ హనుమంత రావుగారికీ ఒక చిత్ర విచిత్రమైన సంభాషణ జరిగింది. మాటల సందర్భంలో రా.రా. నౌషాద్‌ని, నౌషాద్ సంగీతాన్ని తెగ పొగడసాగారు. వీరి అన్నగారు “ఏమిటోయ్! నువ్వు చాలా గొప్పవాడివని మన ప్రొడ్యూసర్లు నిన్ను గౌరవించి పిలిపిస్తే నువ్వేమిటి, యింకా ఎవరెవరో నౌషాదు గురించీ, వాళ్ళ గురించీ లంకించుకున్నావు” అని సాగదీశారు. తన తమ్ముణ్ణి అక్కడివాళ్ళెక్కడ అపార్ధం చేసుకుంటారోనన్న భయంలో. దానికి రా.రా. గారేమన్నారో తెలుసా? “నౌషాదుగారు గొప్పవాళ్ళన్నాం గాని, మనం కావన్నామా? ఎవరి గొప్పవారిదే. ఒకరి గొప్పతనాన్ని చెప్పుకున్నందువల్ల తప్పూ లేదు, మనం తగ్గీపోమూ,” అన్నారు. ( ఈ “మనం” అనేది వారు తరచూ ‘నేను’ అనే మాటకి బదులు వాడుతూ వుండే వూతపదం. అంతేగాని అది అహంకార సూచకమని మన మనుకోరాదు). ఇదీ వారి సామర్ధ్యం. ఎవరేమాట అన్నా, వెంటనే దానికి టంకంపొడిలా అతుక్కునేలాగ జవాబిస్తారు. ఇలాటి వాళ్ళనే హిందీలో ‘హాజిర్ జవాబ్ ఆద్మీ’ అంటారు.

మౌఖికంగానే కాక, వీరు క్రియాత్మక హాస్య ప్రదర్శనా ప్రియులూ (Practical Joker), దక్షులూ కూడా. ఒకనాడు వీరి పాటొకటి రిహర్సల్సు చేస్తున్నాం. రిహర్సలు ముగియగానే బాతాఖానీ (ఖూనీ కాదు) లోకి దిగాం. టౌనులో మినర్వా థియేటరులో అప్పుడు పసందైన ఇంగ్లీష్ ఫిలిం ఆల్‌ఫ్రెడ్ హిచ్‌కాక్ ‘సైకో’ ఆడుతూ వుంది. అందరం దానికి వెడదామని నిశ్చయించుకున్నాం. రా.రా. గారి కారు ఆరోజున సర్వీసింగుకనో, మైనర్ ఎడ్జస్ట్‌మెంట్సుకనో వెళ్ళింది. అది తెలిసి నేను వారితో, “ఏం సార్! అయిదు గంటల కల్లా రెడీగా వుండండి. దారిలో మిమ్మల్ని పికప్ చేసుకోవడానికొస్తాను. కలిసి బీచ్ దారిని చల్లగాలిలో పాట పాడుకుంటూ పయనిద్దాం,” అన్నాను. వెంటనే, “ఎందుకు సార్ వృధా శ్రమ, మీరూ, మా అసిస్టెంట్సూ థియేటరు కెళ్ళిపోండి. నేను చిన్న పనొకటి చూసుకుని తిన్నగా ఆటోరిక్షాలో అక్కడికే వచ్చి కలుసుకుంటాను. ఆరు గంటలకల్లా,” అన్నారాయన. “సరే. సార్” అన్నానేను. ఆయన మనసులో ఏదైనా ఫలానా విధాన చేయాలనుకున్నారంటే దాన్ని వ్యతిరేకించి ఎవరెన్ని చెప్పినా ఒక పట్టాన వినరు. విన్నట్టు కనిపిస్తారే తప్ప తననుకున్నట్టే చేస్తారు. అందుకనే నేను మళ్ళీ ఆడగలేదు. అడిగి ప్రయోజనం లేదు.

సరిగా మా (స్వరాలనుకోకండి… ఊ) అనుకున్న సమయానికే నేనూ, వారి సహాయకులూ మినర్వా వద్ద చేరాం. ఆరు గంటలయింది కాని రావుగారి జాడ దొరకలేదు. ఆరూ అయిదూ, పది, పదిహేనూ, ఇరవై… ఇరవై ఐదు అయింది. ఆట ఆరంభమయేది ఆరున్నరకి. ఇంకా అయిదు నిమిషాలే వుందిక. మాకు గాభరా పుట్టింది. కొంపదీసి మా మాటే మరచిపోయి మరోచోటి కెక్కడికైనా దయచేశారేమో అని హడిలిపోయాం. ఇంతలో ఆరున్నరైంది. పిక్చర్ ప్రారంభమైపోయింది. మాలో ఆరాటం పోరాటం సాగించసాగింది. అయినా, అసలాయన వస్తేగాని ఆట చూడకూడదని నిశ్చయించుకున్నాం. అలాగే నిలుచున్నాం. నిముషమొక యుగంగా, మందంగా, బరువుగా గడిచింది. మర్నాడే ఈ పిక్చర్ మారిపోతుంది. రెండో ఆటకైనా వెడదామా అంటే మాకు మర్నాడుదయానే రికార్డింగు ఫిక్సయింది. అదీగాక అడ్వాన్సు బుకింగు ఫుల్లయిపోయిందప్పటికే. అప్పటికే రెండు రోజులకి లోయర్ క్లాసులకి, పెద్దాపురం చేంతాడంత పొడుగాటి క్యూ నిలబడి వుంది. ఆఖరి రోజున అంతమంది జనం పోగయారా ఫిలిం చూసేందుకు. ఈ ఆటకే మాకు నాలుగు టిక్కట్లు దొరికేసరికి తల ప్రాణం తోకకి వచ్చేసింది. ఎవరో కేన్సిల్ చేయబట్టి అవైనా దొరికాయి అదృష్టవశాత్తు. అందుకని మా ఆందోళన మరీ అధికమైంది. ఆరున్నరల్లా మెల్లిగా ఏడున్నరైంది. మా కళ్ళనిండా కన్నీరైంది. కానీ ఇంగ్లీష్ పిక్చర్ కనక ఇంటర్వెల్ తర్వాతే ఒరిజినల్ పిక్చరు స్టార్టవుతుందని తెలిసింది. ఇంటర్వెల్ వరకూ, ఆస్ప్రో అడ్వర్టయిజ్‌మెంట్లూ అవీ తలనొప్పి పుట్టించి, ఆడియన్స్ పని పట్టించి, ఆస్ప్రోకి పని కల్పించి దాని డిమాండు బాగా పెంచేస్తాయి అని మేమెరుగుదుము. అసలాట (ఒరిజినల్ పిక్చర్) ఆరంభించేలోగా వారు వచ్చినా చాలునని ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఎదురుచూస్తూ నిలుచునే వున్నాం. ఎంతకీ రాకపోయేసరికి నిరాశ పూరిత హృదయారవిందులమై, కళ్ళుండి కూడా పిక్చర్ చూడలేని అంధులమై, ఇంటిదారి పట్టడానికే నడుం కట్టాం. ఇష్టం లేకుండానే నా చెయ్యి కారు స్విచ్ ఆన్ చేసి, స్టార్ట్ చేసింది.

ఇంతలో ‘ఆటో’ శబ్దం వినిపించేసరికి ఎగిరిపోయిన మా ప్రాణాలు తిరిగి వచ్చాయి. ఆటోలోంచి అర్జంటుగా దిగుతూ “సారీ సార్. మీరు నాకోసం ఇంకా కాచుకుని వుంటారేమోనని నేనింత ఆలస్యమైనా వచ్చేశాను. లేకపోతే అస్సలు రాలేకపోయేవాణ్ణి. అంతపని జరిగింది,” అన్నారు మా సస్పెన్సును క్లెయిమాక్సుకు తెస్తూ. “ఏం జరిగింది సార్” అని నేనూ, “ఎన్న అయిడిచ్చి సార్” అని అరవ సోదరులూ ఒకేసారి ఆరుద్రాగా, సారీ ఆదుర్దాగా, ఏకగ్రీవంగా శ్రుతి కలిపి అడిగేశాం. “ముందు పిక్చర్ చూద్దాం పదండి సార్” అని సినిమా అయిన పిదప ఇల్లు చేరేదారిలో తన ఆలస్యానికి గల కారణ వివరణం చేయసాగారు. “ఏం చేయమంటారు సారూ! ఎంతకీ ‘ఆటో’ దొరకలేదు. ఆటో కోసం టాక్సీ వేసుకుని ఊరంతా తిరిగి తిరిగి, వెతికి వెతికి చివరికి మిమ్మల్ని కలుసుకున్న పది పదిహేను నిముషాల క్రితం ఈ ఆటోని పట్టుకున్నాం. అందుచేతనే అప్పటికైనా రాగలిగాం,” అన్నారు.

“పోనీ టాక్సీలోనే వచ్చేయకపోయారా?” అన్నాం. “మీకు మాటిచ్చాం గదా సార్ ‘ఆటో’లో వస్తామని. మాట నిలబెట్టుకున్నాం,” అన్నారు విజయగర్వంతో. మాకు ఏడుపూ, నవ్వూ కలిసి వచ్చాయి. అదీ వారి వరస.

ఇద్దరు మిత్రులు చిత్రంలో పద్మనాభంగారికి నేను పాడిన, చక్కని చుక్కా సరసకురావే అనే పాటలోని ‘ఉక్కిరిబిక్కిరి అయిపోతానే’ అన్న పదానికి తగ్గట్టుగా, పల్లవి ట్యూను గుక్క తిరక్క ఉక్కిరిబిక్కిరయే ఫక్కీలోనే తయారించారు. మీరూ గమనించే వుంటారుగా! ఈ పాట పాడేందుకు నన్ను పిలిచినపుడు — “ఇలాటి ఫక్తు కామెడీ సాంగ్సు కూడా మీరు పాడాలనీ, ఒక రకమైన పాటలేగాక అన్ని రకాల, వివిధ రసాల గీతాలని మీచేత పాడించాలని నా ఆశయం. మీరు పాడగలరని నా నమ్మకం!” అని చెబుతూ మరీ ఆ పాట కాగితాన్ని నాచేతికందించారు.అన్నట్టుగానే నా చేతనే ఆ పాట పాడించి హిట్టు చేయించారు. న్యాయానికి, ఆయన నాతో అలా చెప్పవలసిన ఆగత్యం లేదు. కాని ఎదుటివారి మనసులో ఎలాటి బేధాభిప్రాయాలూ ఉద్భవించకుండా రాబోయే ప్రశ్నకి ముందుగానే సమాధానం ఇచ్చేస్తుంటారీయన.

రాణీ రత్నప్రభలో ‘అనురాగము విరిసే ఈ రేయి’ అనే అమీర్ కళ్యాణీ రాగంలో రచించిన యుగళ గీతం (డ్యూయెట్) పాడించే ముందు నా చేతా, శ్రీమతి సుశీలగారి చేతా బాగా సాధకం చేయించారు. మధ్యలో నేనాలపించవలసిన శాస్త్రీయమైన సంగతులూ, బిరకాలూ బాగా రిహార్సలు చేయించి వుండడవల్ల టేక్ సమయంలో ఏ అనుమానమూ రాకుండా తేలికగా పాడగలిగాను. ఏ పాటకెన్ని రిహర్సల్సు కావాలో ముందే తేల్చుకొని, తేలికైన వాటికి తక్కువ రిహార్సల్సు తోనే తృప్తిపడినా, క్లిష్టమై, కష్టతరమైన వాటికి పూర్తి సంతృప్తి కలిగేదాకా రిహార్సల్సు చేయించకుండా వదలరు.

వీరికి వచ్చిన వాయిద్యాలు — హార్మోనియం, పియానో, సితార్, ఫ్లూట్, ఎలక్ట్రిక్ గిటార్, మేండొలిన్, తబలా, ఢోలక్‌లు. వీరు అభిమానించే పాశ్చాత్య సంగీత దర్శకులు పారమౌంట్ – విక్టర్ యంగ్, మేక్స్ స్టీసర్, 20త్ సెంచురీ ఫాక్స్ – ఆల్‌ఫ్రెడ్ న్యూమన్, డిమిట్రీ టియాంకెన్, మైకెల్స్ రోదా మొదలగువారు. ఇప్పటికే పాశ్చాత్య, శాస్త్రీయ సంగీతాధ్యయనం చేస్తూ వుండడమనేది వీరికొక హాబీలాంటిది. శ్రావ్యమై, సరళమై, సులభమై, సులలితమైన సంగీతం అందించడంలో వీరిది అందెవేసిన చేయి.

“స్వర్గంగ స్వరగంగయై సర్వదా, నవరసధారావాహినియై స్వర రాజేశ్వరసిత సంగీత సిక్తాసక్త మానస వీధులలో పయనిస్తూ ప్రవహిస్తూ వుంటుందనడం” అతిశయోక్తి అనిపించుకోదు.

‘చాటు’ గీతాలు

చిన్నప్పటినుంచీ నాకు వీరి ప్రైవేటు రికార్డులంటే మహాయిష్టం. చల్లగాలిలో యమునా తటిపై శ్యామసుందరుని మురళి అన్న పాటకి సాటి అదే. బహుశా ఈ పాట వినే శ్యామసుందరుడైన ఆ మురళీలోలుడు తనంత బాగా పాడడం అసంభవమని అనుకుని ముందే నిశ్చయించుకుని వుంటాడు రాజేశ్వర రావు ఎప్పుడైనా తనని పాడమని అడిగితే చెప్పవలసిన సమాధానాన్ని. అందుకనే అడిగిన తక్షణమే తపటాయించకుండా జవాబిచ్చాడు. తన వేణుగానాన్ని రాజేశ్వర రావుగారు పై పాటపాడి ఎలాగూ పొగిడేశారు కదా అనే ధైర్యం వుండబట్టే. “నువ్వు పాట పాడు, దాని కీడుగా, జోడుగా, నేను వేణువూదుతాను” అని తెలివిగా బదులు పలికాడు.

ఇంతకీ చెప్పొచ్చే దేమిటంటే, “చల్లగాలిలో” పాటంటే నాకూ ఎంతో ఇష్టం. అంతేకాదు. ఆయన ప్రతీ పాటా నాకు నచ్చేది.

ముఖ్యంగా ఓహో విభావరీ, కోపమేల రాధా, ఆ తోటలో నొకటి ఆరాధనాలయము, కలగంటి కలగంటి కలువరేకులావంటి కన్నులు గల స్వామి కనిపించేనే, తలుపు తీయునంతలోన, రావోయి చందమామ (సినిమాలోది కాదు), గాలివానలో ఎటకే ఒంటిగా, పొదరింటిలో నుండి పొంచి చూచెదవేలా, హాయిగా పాడుదునా చెలీ, పోయిరావే కోకిలా, ఆనందమే లేదా, పాట పాడుమా కృష్ణా పలుకు తేనెలొలుకునట్టు, మున్నగు అన్ని గీతాలూ, భావగేయాలు వారు స్వంతంగా పాడినవీ, ఇతరులతో కలిసి పాడినవీ కూడా నన్ను పరవశుణ్ణి చేసేసేవి. ఈ పాటలన్నీ నేను చక్కగా నేర్చుకుని కాలేజీ ఫంక్షన్‌లోనూ, ఇతర గానసభలలోనూ పాడుతూ వుండేవాడిని. ఆ సమయంలోనే శ్రీ రాజేశ్వర రావుగారు ఏదో సన్మానం సందర్భంలో అని జ్ఞాపకం, కాకినాడకి విచ్చేశారు. ప్రప్రధమంగా నేను వీరిని చూసిందప్పుడే. అప్పటి నా ఆనందం అనిర్వచనీయం. ఆ సందర్భంలో ఆయన రెండు మూడు చోట్ల హార్మోనియం వాయిస్తూ, రాల్గరగు రీతిగా గంధర్వగానం వినిపించి మమ్మల్నందరినీ తన్మయులను చేశారు.

ఆయన పాడిన ప్రతీచోటికి వెళ్ళద్దనుకుని వెళ్ళాను. విని పరవశించాను. వీరి సంగీత సారధ్యంలో నాకు కూడా పాడే సదవకాశం లభిస్తే ఎంత బాగుండును!” అని ఆశ కలిగింది. ఆ ఆశ మొదటిసారిగా నరసూవారి భలేరాముడు చిత్రంలో భయమేలా ఓ మనసా భగవంతుని లీల అనే పాటతో నెరవేరింది. ఆయన వద్ద ఆ పాట పాడుతూ వున్నప్పుడు నేను పొందిన సంతోషం ఇంతా అంతా కాదు. అనంతం. అది నాకు మాత్రమే విదితం. ఇప్పుడీ వ్యాసంలో కథితం. కాని రాజేశ్వర రావుగారితో పరిచయం నాకీ పాట పాడక పూర్వమే లభించింది.

నేను మద్రాసుకు వచ్చిన క్రొత్తలోనే శ్రీ వీణ రంగారావుతో కలిసి వారి గృహానికి వెళ్ళాను, పాడి వినిపించడానికని. పాడాను, వారు విన్నారు. తల వూపారు. తాళం వేశారు. ఎంతో మెచ్చుకున్నారు. ఏ పాట పాడానో సరిగా స్మృతిపథంలో లేదుగాని దీదార్‌లోని ‘ఆసీర్ రే పన్ జాయే అహ్‌దే శబాబ్ కర్‌కే ముఝే , కహా గయా మేరా బచ్‌పన్ ఖరాబ్ కర్‌కే ముఝే’ అనే రఫీ పాట పాడి వుంటాననుకుంటా. ఎందుకంటే అదే ఆనాటి నా ఆడిషన్ సాంగ్. ఎవరు పాడమన్నా అదే పాడేవాణ్ణి. ముఖ్యంగా ఎవరైనా సంగీత దర్శకులు నన్ను పాడమన్నప్పుడు, వారు కట్టిన ట్యూనులు నాకు వచ్చినా వారి కెదురుగా సాధారణంగా పాడేవాణ్ణి కాదు. భయం వల్లనో, మరే కారణం చేతనో వారి పాట వారికే వినిపించాలంటే వణుకు పుట్టేది. ఒక వేళ ఆ పాటని నేను సరిగా పాడలేకపోతే, నా పాటని ఎంత చక్కగా ఖూనీ చేశాడ్రా భగవానుడా, అని బాధపడతారేమోనని భయపడేవాడిని. కనుకనే ఎవరు పాడమన్నా వెంటనే నాకు బాగా అలదాటులో వున్న హిందీ పాటలు, దీదార్ లోవో, బాబుల్ లోవో, అందాజ్, అనోఖే అదా, బర్‌సాత్, ఆవారా వగైరా చిత్రాలలోవో పాటలు జంకూ, బొంకూ లేకుండా బింకంగా పాడేస్తూ వుండేవాడిని. నాపాట విని, మెచ్చుకుని రా. రా. గారు, నిర్మొగమాటంగా ఇలా అన్నారు. “శ్రీనివాస్‌గారూ! మీ పాట నాకు చాలా నచ్చింది. మైకుకి మీ వాయిస్ చాలా బాగా సూట్ అవుతుంది కాని మన ప్రొడ్యూసర్లు ప్రతీసారీ పాత ఆర్టిస్టులే కావాలంటారు సార్. ఏం జేస్తాం? అయినా ప్రయత్నిస్తాం.”

అలా నిజంగానే ప్రయత్నించారు. కొంతకాలం తర్వాత భలేరాముడు చిత్రంలో సాధించారు. దానికి తోడు ఆ చిత్రం లోని రెండు మూడూ పాటలు నావి గూడ హిట్‌సాంగ్స్ అయేసరికి, చిత్రసీమలో నాకు ప్రవేశం దొరకడమే కాక, నా పేరు కూడా స్థిరపడింది. ప్రజలనోటి కలవాటు పడింది. ఈ చిత్రానికి తమిళ వెర్షన్ అయిన ప్రేమపాశం చిత్రంలో, ‘అవన్ అల్లాల్ పువిమేలే అయివుం అశైయాదు’ పాట అరవదేశంలో కూడా నన్ను ప్రజా ప్రియుణ్ణి గావించింది. అయితే భలేరాముడు చిత్రానికి పాడుతుండగా చిన్న తమాషా జరిగింది. శ్రీ రేలంగిగారికి ఈయనే “బంగరుబొమ్మా, భలే జోరుగా పదవే పోదాము పైదేశం చూదాము” అనే పాట పాడించారు. రేలంగి వాయిస్‌కి బాగా సూటవాలనే కోరికతో నాకు బాగా రిహార్సల్సు యిచ్చి, రికార్డింగ్ సమయంలొ కూడా దగ్గరుండి మంచి సలహాలు ఇస్తూ నా గొంతును ప్రత్యేకంగా రికార్డు చేయించారు. దానికి తోడుగా నాకు జన్మ సిద్ధమయిన ఇమిటేషన్ గుణం కొంత సహకరించింది.

ఇహ చూసుకోండి మజా! నమ్మండీ. నమ్మకపోండి.

మద్రాసు పారగన్ థియేటరులో భలే రాముడు ప్రివ్యూ చూస్తుండగా, మధ్యలో నేను పాడిన ‘బంగారుబొమ్మ’ పాట వచ్చింది. రేలంగి అద్భుతంగా అభినయించారు. అభినయించడంతో ఆగక, రేలంగే పాట కూడా పాడేశారేమో ననిపించింది. నిజంగా పాట మధ్యలో ఒక బిరకా సంగతి వచ్చేదాకా నా ప్రాణాలు ప్రాణాలలో లేవు. కొంపదీసి నాకు తెలియకుండానే రేలంగి తనే పాడేశారేమో ననిపించింది. మొత్తానికే నేను పాడినదే చిత్రంలో వుందని తెలిసిన తర్వాత మహదానందం అనుభవించాను. నిష్కారణంగా మంచి పాప్యులర్ అయే పాట పోగొట్టుకున్నానేమో అని నేను పడ్డ భయం తొలగిపోయింది. ప్రీవ్యూ అవగానే రా. రా. గారు, “శ్రీనివాస్ గారూ, మీ వాయిస్ రేలంగికి సెంట్ పర్సెంట్ సూటైపోయింది సార్,” అన్నారు. కాని రేలంగికి మాత్రమే సూటవుతుంది అనుకుని ఆయనకు మాత్రమే పాడించాలనే నిర్ణయానికి రాకుండా, రా. రా. గారు మిగతా చాలామంది ఆర్టిస్టులకి, హీరోలకీ గూడా నాచేత పాడించారని మీకూ తెలుసు. ఈ ‘సూట్’ అవడమనేది చాలా విచిత్రమైన విషయం. అలవాటు మీదే ఎక్కువగా ఆధారపడి వుంటూంది. అంతే. సర్వసాధారణంగా ఒక పురుష గాత్రం, మరో పురుషగాత్రంతో సరిపోతుంది. మరీ కీచుమనేటంత వృత్యాసం వుంటే తప్ప. ఆ మాట కొస్తే ఒకే వ్యక్తి పాడేటప్పుడూ, మాట్లాడేటప్పుడూ గొంతులో కొంత తేడా అగుపిస్తుంది. కనక న్యాయానికి పురుషుడి గాత్రం మరో పురుషుడి గాత్రానికి సరిపోవాలి. కాని, మన అభిప్రాయాలు ఎవరికి కావాలి? ఎవరి అభిప్రాయాలు వారివే. ఒకరు మరొకరితో ఎన్నడు ఎప్పుడూ ఏకీభవించరు. సర్వదా, సత్వథా, భిన్నాభిప్రాయులవడానికే ప్రయత్నిస్తారు. ఇది మానవ ప్రకృతి. సహజమైన స్వభావం. సరే మళ్ళీ దారికొస్తా. దారి తప్పి, తిరిగి దారిలో పడటం గూడా సహజమైన మానవ స్వభావమేగా! “టు ఎర్ ఈజ్ హ్యూమన్!”

భలేరాముడు తదుపరి నరసూ వారి భలే అమ్మాయిలు లోగూడా ‘నిసరిమపా, లాటరీలోన లక్షలు లక్షలు సాధించానీనాడు’ అనే పాటా, ‘నాణెమైన సరుకుంది లాహిరి’ అనే పాటా పాడాను. ఈ రెండు భలే చిత్రాల్లోనూ భలే మంచి పాటలు. భలే బాగా పాడినవి మొదలు. వీరి వద్ద చాలా పాటలు పాడాను అని ఇదివరకే మీకు తెలిపానుగా. అమరశిల్పి జక్కన్న (కన్నడం), బొబ్బిలి యుద్ధం మొదలైన రాబోయే చిత్రాలలో కూడా పాడాను. భవిష్యత్తులో వీరి పాటలేవేని పాడగలిగే అవకాశాలు సంభవిస్తాయో, సంప్రాప్తిస్తాయో మీకూ, నాకూ కూడా తెలియదు. ఆయనకే తెలియదు. సర్వకాల సర్వజ్ఞుడైన సర్వేశ్వరుడొక్కడికే తెలియాలి. ఆ విషయం తత్కాల పరిస్థితులపైన ఆధారపడి వుంటుందన్న విషయం మాత్రం మనందరికీ తెలుసు.