ఇద్దరు మిత్రులు చిత్రంలో పద్మనాభంగారికి నేను పాడిన, చక్కని చుక్కా సరసకురావే అనే పాటలోని ‘ఉక్కిరిబిక్కిరి అయిపోతానే’ అన్న పదానికి తగ్గట్టుగా, పల్లవి ట్యూను గుక్క తిరక్క ఉక్కిరిబిక్కిరయే ఫక్కీలోనే తయారించారు. మీరూ గమనించే వుంటారుగా! ఈ పాట పాడేందుకు నన్ను పిలిచినపుడు — “ఇలాటి ఫక్తు కామెడీ సాంగ్సు కూడా మీరు పాడాలనీ, ఒక రకమైన పాటలేగాక అన్ని రకాల, వివిధ రసాల గీతాలని మీచేత పాడించాలని నా ఆశయం. మీరు పాడగలరని నా నమ్మకం!” అని చెబుతూ మరీ ఆ పాట కాగితాన్ని నాచేతికందించారు.అన్నట్టుగానే నా చేతనే ఆ పాట పాడించి హిట్టు చేయించారు. న్యాయానికి, ఆయన నాతో అలా చెప్పవలసిన ఆగత్యం లేదు. కాని ఎదుటివారి మనసులో ఎలాటి బేధాభిప్రాయాలూ ఉద్భవించకుండా రాబోయే ప్రశ్నకి ముందుగానే సమాధానం ఇచ్చేస్తుంటారీయన.
రాణీ రత్నప్రభలో ‘అనురాగము విరిసే ఈ రేయి’ అనే అమీర్ కళ్యాణీ రాగంలో రచించిన యుగళ గీతం (డ్యూయెట్) పాడించే ముందు నా చేతా, శ్రీమతి సుశీలగారి చేతా బాగా సాధకం చేయించారు. మధ్యలో నేనాలపించవలసిన శాస్త్రీయమైన సంగతులూ, బిరకాలూ బాగా రిహార్సలు చేయించి వుండడవల్ల టేక్ సమయంలో ఏ అనుమానమూ రాకుండా తేలికగా పాడగలిగాను. ఏ పాటకెన్ని రిహర్సల్సు కావాలో ముందే తేల్చుకొని, తేలికైన వాటికి తక్కువ రిహార్సల్సు తోనే తృప్తిపడినా, క్లిష్టమై, కష్టతరమైన వాటికి పూర్తి సంతృప్తి కలిగేదాకా రిహార్సల్సు చేయించకుండా వదలరు.
వీరికి వచ్చిన వాయిద్యాలు — హార్మోనియం, పియానో, సితార్, ఫ్లూట్, ఎలక్ట్రిక్ గిటార్, మేండొలిన్, తబలా, ఢోలక్‌లు. వీరు అభిమానించే పాశ్చాత్య సంగీత దర్శకులు పారమౌంట్ – విక్టర్ యంగ్, మేక్స్ స్టీసర్, 20త్ సెంచురీ ఫాక్స్ – ఆల్‌ఫ్రెడ్ న్యూమన్, డిమిట్రీ టియాంకెన్, మైకెల్స్ రోదా మొదలగువారు. ఇప్పటికే పాశ్చాత్య, శాస్త్రీయ సంగీతాధ్యయనం చేస్తూ వుండడమనేది వీరికొక హాబీలాంటిది. శ్రావ్యమై, సరళమై, సులభమై, సులలితమైన సంగీతం అందించడంలో వీరిది అందెవేసిన చేయి.
“స్వర్గంగ స్వరగంగయై సర్వదా, నవరసధారావాహినియై స్వర రాజేశ్వరసిత సంగీత సిక్తాసక్త మానస వీధులలో పయనిస్తూ ప్రవహిస్తూ వుంటుందనడం” అతిశయోక్తి అనిపించుకోదు.
‘చాటు’ గీతాలు
చిన్నప్పటినుంచీ నాకు వీరి ప్రైవేటు రికార్డులంటే మహాయిష్టం. చల్లగాలిలో యమునా తటిపై శ్యామసుందరుని మురళి అన్న పాటకి సాటి అదే. బహుశా ఈ పాట వినే శ్యామసుందరుడైన ఆ మురళీలోలుడు తనంత బాగా పాడడం అసంభవమని అనుకుని ముందే నిశ్చయించుకుని వుంటాడు రాజేశ్వర రావు ఎప్పుడైనా తనని పాడమని అడిగితే చెప్పవలసిన సమాధానాన్ని. అందుకనే అడిగిన తక్షణమే తపటాయించకుండా జవాబిచ్చాడు. తన వేణుగానాన్ని రాజేశ్వర రావుగారు పై పాటపాడి ఎలాగూ పొగిడేశారు కదా అనే ధైర్యం వుండబట్టే. “నువ్వు పాట పాడు, దాని కీడుగా, జోడుగా, నేను వేణువూదుతాను” అని తెలివిగా బదులు పలికాడు.
ఇంతకీ చెప్పొచ్చే దేమిటంటే, “చల్లగాలిలో” పాటంటే నాకూ ఎంతో ఇష్టం. అంతేకాదు. ఆయన ప్రతీ పాటా నాకు నచ్చేది.
ముఖ్యంగా ఓహో విభావరీ, కోపమేల రాధా, ఆ తోటలో నొకటి ఆరాధనాలయము, కలగంటి కలగంటి కలువరేకులావంటి కన్నులు గల స్వామి కనిపించేనే, తలుపు తీయునంతలోన, రావోయి చందమామ (సినిమాలోది కాదు), గాలివానలో ఎటకే ఒంటిగా, పొదరింటిలో నుండి పొంచి చూచెదవేలా, హాయిగా పాడుదునా చెలీ, పోయిరావే కోకిలా, ఆనందమే లేదా, పాట పాడుమా కృష్ణా పలుకు తేనెలొలుకునట్టు, మున్నగు అన్ని గీతాలూ, భావగేయాలు వారు స్వంతంగా పాడినవీ, ఇతరులతో కలిసి పాడినవీ కూడా నన్ను పరవశుణ్ణి చేసేసేవి. ఈ పాటలన్నీ నేను చక్కగా నేర్చుకుని కాలేజీ ఫంక్షన్‌లోనూ, ఇతర గానసభలలోనూ పాడుతూ వుండేవాడిని. ఆ సమయంలోనే శ్రీ రాజేశ్వర రావుగారు ఏదో సన్మానం సందర్భంలో అని జ్ఞాపకం, కాకినాడకి విచ్చేశారు. ప్రప్రధమంగా నేను వీరిని చూసిందప్పుడే. అప్పటి నా ఆనందం అనిర్వచనీయం. ఆ సందర్భంలో ఆయన రెండు మూడు చోట్ల హార్మోనియం వాయిస్తూ, రాల్గరగు రీతిగా గంధర్వగానం వినిపించి మమ్మల్నందరినీ తన్మయులను చేశారు.
ఆయన పాడిన ప్రతీచోటికి వెళ్ళద్దనుకుని వెళ్ళాను. విని పరవశించాను. వీరి సంగీత సారధ్యంలో నాకు కూడా పాడే సదవకాశం లభిస్తే ఎంత బాగుండును!” అని ఆశ కలిగింది. ఆ ఆశ మొదటిసారిగా నరసూవారి భలేరాముడు చిత్రంలో భయమేలా ఓ మనసా భగవంతుని లీల అనే పాటతో నెరవేరింది. ఆయన వద్ద ఆ పాట పాడుతూ వున్నప్పుడు నేను పొందిన సంతోషం ఇంతా అంతా కాదు. అనంతం. అది నాకు మాత్రమే విదితం. ఇప్పుడీ వ్యాసంలో కథితం. కాని రాజేశ్వర రావుగారితో పరిచయం నాకీ పాట పాడక పూర్వమే లభించింది.
నేను మద్రాసుకు వచ్చిన క్రొత్తలోనే శ్రీ వీణ రంగారావుతో కలిసి వారి గృహానికి వెళ్ళాను, పాడి వినిపించడానికని. పాడాను, వారు విన్నారు. తల వూపారు. తాళం వేశారు. ఎంతో మెచ్చుకున్నారు. ఏ పాట పాడానో సరిగా స్మృతిపథంలో లేదుగాని దీదార్‌లోని ‘ఆసీర్ రే పన్ జాయే అహ్‌దే శబాబ్ కర్‌కే ముఝే , కహా గయా మేరా బచ్‌పన్ ఖరాబ్ కర్‌కే ముఝే’ అనే రఫీ పాట పాడి వుంటాననుకుంటా. ఎందుకంటే అదే ఆనాటి నా ఆడిషన్ సాంగ్. ఎవరు పాడమన్నా అదే పాడేవాణ్ణి. ముఖ్యంగా ఎవరైనా సంగీత దర్శకులు నన్ను పాడమన్నప్పుడు, వారు కట్టిన ట్యూనులు నాకు వచ్చినా వారి కెదురుగా సాధారణంగా పాడేవాణ్ణి కాదు. భయం వల్లనో, మరే కారణం చేతనో వారి పాట వారికే వినిపించాలంటే వణుకు పుట్టేది. ఒక వేళ ఆ పాటని నేను సరిగా పాడలేకపోతే, నా పాటని ఎంత చక్కగా ఖూనీ చేశాడ్రా భగవానుడా, అని బాధపడతారేమోనని భయపడేవాడిని. కనుకనే ఎవరు పాడమన్నా వెంటనే నాకు బాగా అలదాటులో వున్న హిందీ పాటలు, దీదార్ లోవో, బాబుల్ లోవో, అందాజ్, అనోఖే అదా, బర్‌సాత్, ఆవారా వగైరా చిత్రాలలోవో పాటలు జంకూ, బొంకూ లేకుండా బింకంగా పాడేస్తూ వుండేవాడిని. నాపాట విని, మెచ్చుకుని రా. రా. గారు, నిర్మొగమాటంగా ఇలా అన్నారు. “శ్రీనివాస్‌గారూ! మీ పాట నాకు చాలా నచ్చింది. మైకుకి మీ వాయిస్ చాలా బాగా సూట్ అవుతుంది కాని మన ప్రొడ్యూసర్లు ప్రతీసారీ పాత ఆర్టిస్టులే కావాలంటారు సార్. ఏం జేస్తాం? అయినా ప్రయత్నిస్తాం.”
అలా నిజంగానే ప్రయత్నించారు. కొంతకాలం తర్వాత భలేరాముడు చిత్రంలో సాధించారు. దానికి తోడు ఆ చిత్రం లోని రెండు మూడూ పాటలు నావి గూడ హిట్‌సాంగ్స్ అయేసరికి, చిత్రసీమలో నాకు ప్రవేశం దొరకడమే కాక, నా పేరు కూడా స్థిరపడింది. ప్రజలనోటి కలవాటు పడింది. ఈ చిత్రానికి తమిళ వెర్షన్ అయిన ప్రేమపాశం చిత్రంలో, ‘అవన్ అల్లాల్ పువిమేలే అయివుం అశైయాదు’ పాట అరవదేశంలో కూడా నన్ను ప్రజా ప్రియుణ్ణి గావించింది. అయితే భలేరాముడు చిత్రానికి పాడుతుండగా చిన్న తమాషా జరిగింది. శ్రీ రేలంగిగారికి ఈయనే “బంగరుబొమ్మా, భలే జోరుగా పదవే పోదాము పైదేశం చూదాము” అనే పాట పాడించారు. రేలంగి వాయిస్‌కి బాగా సూటవాలనే కోరికతో నాకు బాగా రిహార్సల్సు యిచ్చి, రికార్డింగ్ సమయంలొ కూడా దగ్గరుండి మంచి సలహాలు ఇస్తూ నా గొంతును ప్రత్యేకంగా రికార్డు చేయించారు. దానికి తోడుగా నాకు జన్మ సిద్ధమయిన ఇమిటేషన్ గుణం కొంత సహకరించింది.
ఇహ చూసుకోండి మజా! నమ్మండీ. నమ్మకపోండి.
మద్రాసు పారగన్ థియేటరులో భలే రాముడు ప్రివ్యూ చూస్తుండగా, మధ్యలో నేను పాడిన ‘బంగారుబొమ్మ’ పాట వచ్చింది. రేలంగి అద్భుతంగా అభినయించారు. అభినయించడంతో ఆగక, రేలంగే పాట కూడా పాడేశారేమో ననిపించింది. నిజంగా పాట మధ్యలో ఒక బిరకా సంగతి వచ్చేదాకా నా ప్రాణాలు ప్రాణాలలో లేవు. కొంపదీసి నాకు తెలియకుండానే రేలంగి తనే పాడేశారేమో ననిపించింది. మొత్తానికే నేను పాడినదే చిత్రంలో వుందని తెలిసిన తర్వాత మహదానందం అనుభవించాను. నిష్కారణంగా మంచి పాప్యులర్ అయే పాట పోగొట్టుకున్నానేమో అని నేను పడ్డ భయం తొలగిపోయింది. ప్రీవ్యూ అవగానే రా. రా. గారు, “శ్రీనివాస్ గారూ, మీ వాయిస్ రేలంగికి సెంట్ పర్సెంట్ సూటైపోయింది సార్,” అన్నారు. కాని రేలంగికి మాత్రమే సూటవుతుంది అనుకుని ఆయనకు మాత్రమే పాడించాలనే నిర్ణయానికి రాకుండా, రా. రా. గారు మిగతా చాలామంది ఆర్టిస్టులకి, హీరోలకీ గూడా నాచేత పాడించారని మీకూ తెలుసు. ఈ ‘సూట్’ అవడమనేది చాలా విచిత్రమైన విషయం. అలవాటు మీదే ఎక్కువగా ఆధారపడి వుంటూంది. అంతే. సర్వసాధారణంగా ఒక పురుష గాత్రం, మరో పురుషగాత్రంతో సరిపోతుంది. మరీ కీచుమనేటంత వృత్యాసం వుంటే తప్ప. ఆ మాట కొస్తే ఒకే వ్యక్తి పాడేటప్పుడూ, మాట్లాడేటప్పుడూ గొంతులో కొంత తేడా అగుపిస్తుంది. కనక న్యాయానికి పురుషుడి గాత్రం మరో పురుషుడి గాత్రానికి సరిపోవాలి. కాని, మన అభిప్రాయాలు ఎవరికి కావాలి? ఎవరి అభిప్రాయాలు వారివే. ఒకరు మరొకరితో ఎన్నడు ఎప్పుడూ ఏకీభవించరు. సర్వదా, సత్వథా, భిన్నాభిప్రాయులవడానికే ప్రయత్నిస్తారు. ఇది మానవ ప్రకృతి. సహజమైన స్వభావం. సరే మళ్ళీ దారికొస్తా. దారి తప్పి, తిరిగి దారిలో పడటం గూడా సహజమైన మానవ స్వభావమేగా! “టు ఎర్ ఈజ్ హ్యూమన్!”
భలేరాముడు తదుపరి నరసూ వారి భలే అమ్మాయిలు లోగూడా ‘నిసరిమపా, లాటరీలోన లక్షలు లక్షలు సాధించానీనాడు’ అనే పాటా, ‘నాణెమైన సరుకుంది లాహిరి’ అనే పాటా పాడాను. ఈ రెండు భలే చిత్రాల్లోనూ భలే మంచి పాటలు. భలే బాగా పాడినవి మొదలు. వీరి వద్ద చాలా పాటలు పాడాను అని ఇదివరకే మీకు తెలిపానుగా. అమరశిల్పి జక్కన్న (కన్నడం), బొబ్బిలి యుద్ధం మొదలైన రాబోయే చిత్రాలలో కూడా పాడాను. భవిష్యత్తులో వీరి పాటలేవేని పాడగలిగే అవకాశాలు సంభవిస్తాయో, సంప్రాప్తిస్తాయో మీకూ, నాకూ కూడా తెలియదు. ఆయనకే తెలియదు. సర్వకాల సర్వజ్ఞుడైన సర్వేశ్వరుడొక్కడికే తెలియాలి. ఆ విషయం తత్కాల పరిస్థితులపైన ఆధారపడి వుంటుందన్న విషయం మాత్రం మనందరికీ తెలుసు.