మల్లే పూల్ మల్లే పూల్

సాయంకాలమైనా
చల్ల మిరపకాయలను
మండిస్తోంది ఎండ

చిట్టి మంటలు
దిరిసెన పూలు
కొమ్మ మీద
డస్సిన కాకి
చెవులు రిక్కించాయి

గడప దిండు మీద
కునుకు తీస్తున్న అమ్మ
కొంగుతో గాలి చెంపలు
వాయిస్తున్న బామ్మ
పంచలో వామన గుంటల్లో
పడిపోయిన అమ్మడు
ఉలిక్కిపడి లేచారు

బడ్డీ కొట్టు దగ్గర
గోల్డ్ స్పాట్ జింగ్ ధింగ్
బారు జడ అమ్మాయి
చలివేంద్రం దప్పికమ్మ
గిరుక్కున తిరిగి చూశారు

నల్లని దోసిలి
తడి గోనె పట్టాల మీది
పూల గుట్టను
ఎగదోస్తుండగా

వీధి మలుపు
తిరుగుతోంది
తోపుడు బండి

ఆ వెనకే
వడగండ్ల వానలా
మల్లే పూల్
మల్లే పూల్
అన్న కేక.