మరియ

“సుందరం సార్! ఆ ఆమ్మాయి మరియకి టి.సి. ఇచ్చి పంపించేయాలని ఆలోచిస్తున్నాను” అన్నారు హెడ్‌మాస్టర్.

“ఏ మరియ?” అడిగాను నేను.

“ఈ స్కూల్లో వెయ్యిన్నొక్క మరియలు ఉన్నారటోయ్? ఏ మరియ అని అడుగుతున్నారే? అదే… పదవ తరగతి లో ఉన్న పిల్ల.”

చదువుతున్న పేపరుని మడిచి పెట్టి ఆ మరియ ముఖాన్ని మనసులో తెచ్చుకోడానికి ప్రయత్నించాను. వచ్చేసింది. ఎప్పుడూ చూయింగమ్ నములుతూ, అలా నమలడం మూలాన ఈ స్కూలును, దానిలో ఉన్న టీచర్లని, విద్యార్థులను, కట్టుబాట్లను, క్రమశిక్షణను అన్నిటినీ లెక్కచేయనట్లు, “నాకు ఎవరూ లెక్క లేదు. మీరంతా నా కాలి గోటికి సమం” అన్నట్టుండి పొగరు, గయ్యాళి తనం కలబోసిన విద్యార్థిని నాకు జ్ఞాపకం వచ్చింది. ఆ అమ్మాయి నా స్టూడెంటే.

“ఎందుకు సార్ టి.సి.?

“ఎందుకా? తమరు ఈ లోకంలోనే ఉన్నారా? తను కూడా మీ స్టూడెంటే కదా?”

“అవును. అప్పుడప్పుడు ఇష్టం ఉంటే ఏదో నా మీద దయ చూపుతున్నట్లు క్లాసుకి వచ్చి వెళ్తుంది.”

“మరి. మీరే చెబుతున్నారుగా? ” అని అంటూ ఇద్దరు మనుషులు మోయవలసిన హాజరు పట్టీ రిజిస్టర్ , ఇంకో రెండు మూడు ఫైళ్ళను నా ముందు పడేశారు.

“చూడండి. మీరే చూడండి. గత ఆరు నెలల్లో లెక్కబెట్టితే సరిగ్గా స్కూలుకు వచ్చింది పన్నెండు రోజులు. ప్రతి నెలా ఇంటికి ఒక లెటర్ పంపిస్తూనే ఉన్నాము. ఆ ఇంటి నుంచి ఒక పురుగైనా మన స్కూలు వైపు తొంగి చూసి లెటర్ పంపించిన సన్నాసి ఎవడూ అని అడిగిన పాపాన పోయిందా? లేదే? నీవెంత? నీ బ్రతుకెంత అన్నట్లు అమ్మాయి ముంగిలా తనకేమీ పట్టనట్టు ఉంది. పోనీ పాపం ఏమైనా మెడికల్ సర్టిఫికెట్ తీసుకొని చేర్చుకుందాం అనుకుంటే అసలు బడికి వస్తే కదా. ఏదో పెద్ద ఆఫీసర్ లాగ స్కూలుకు తనకి ఇష్టం ఉంటే వస్తుంది. అలా వచ్చినప్పుడైనా స్టూడెంట్ లాగా వస్తోందా? ఛ!ఛ! నా నోటితో ఎలా చెప్పను? సైకిల్ మీద మగరాయడిలా ధీమాగా పేంట్ వేసుకొని వస్తుంది. అది కూడా ఎలాంటి పేంట్? బిగుతుగా, ఉన్నదున్నట్లు అందరికీ తెలిసేలా, ఫోటోకి ఫ్రేమ్ వేసినట్లు టైట్‌గా, ఎప్పుడు కుట్లు ఊడి పోతాయేమోనని మనకి భయం కలిగించేటట్లుగా ఉంటుందా డ్రస్. షర్ట్ వేసుకొని వస్తుంది కదా? పై రెండు బటన్లు పెట్టుకోకుండా అలాగే వదిలేయడం ఎందుకట? మెడలో గొలుసొకటి పాములాగా అటూ ఇటూ ఊగుతూ… ఇంత మంది మగ పిల్లకాయలు కూడా చదువుతున్నారే అని కొంచమైనా ఒంట్లో సిగ్గూ శరమూ ఉండాలా వద్దా? దిక్కు మాలిన ఈ స్కూలుకి యూనిఫారం, మన్నూ మశానం ఏమీ లేదు. నాకు తెలుసులే. మీరు కూడా ఈ విషయాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు.”

“సార్!!”

“ఊరుకోవయ్యా. నలభై ఏళ్ళు ఇక్కడే గడిపేశాను. ఐ నో హ్యూమన్ సైకాలజీ. నీ వయస్సెంత?”

“ఇరవైతొమ్మిది సార్.”

“నా సర్వీస్ నలభై ఏళ్ళు.”

“పేంట్ షర్ట్ వేసుకొని రాకూడని రూల్ ఏమీ లేదు కదా సార్.”

“అందుకని? విప్పుకొని రావచ్చని రూల్ ఉందా మరి? పద్దెనిమిదేళ్ళు నిండి పోయాయి సార్ తనకి. ఒక్కో క్లాసులో రెండేళ్ళు కూర్చుని కూర్చుని ఇప్పుడే టెన్త్‌కి వచ్చింది. మా కాలంలో అయితే పద్దెనిమిదేళ్ళకి చంకలో ఒకటి, చిటికెన వేలు పట్టుకొని ఒకటి, అది చాలదన్నట్లు మళ్ళీ పుల్ల మామిడి కాయను కొరుకుతూ ఉంటారు. పోయిన సారి, అదేనయ్యా… పోయిన నెలలో పోతే పోనీ అన్నట్లు ఒకసారి స్కూలుకి వచ్చింది కదా. అప్పుడు ఏం చేసిందో తెలుసా? నలుగురు జులాయి వెధవలతో సైకిల్ మీద కూర్చుని ఐస్‌క్రీం తింటూ, నవ్వుతూ మాట్లాడుతూ ఉందట. మన హిస్టరీ సార్ మహాదేవన్ ఉన్నారు కాదా, ఆయన ఒక వెర్రి బాగులవాడు. స్కూల్ ముందు, మన స్టూడెంట్ ఇలా పరువు తక్కువగా నడుచుకోవచ్చా అని దగ్గిరికి వెళ్ళి, “ఇలా ప్రవర్తించడం తప్పు. లోపలికి రా మరియా” అని నయంగా చెప్పారట. ఆ అమ్మాయి ఏం చెప్పిందో తెలుసా?”

“చెప్పండి సార్.”

“మీకు అసూయగా ఉందా సార్ అని అడిగేసిందట, ఆ జులాయి వెధవల ముందే. పాపం ఆయన కన్నీళ్ళు పెట్టుకోవడం ఒక్కటే తక్కువగా అన్నట్లు నా దగ్గిరికి వచ్చి మొర పెట్టుకున్నాడు. స్కూలు కాంపౌండులో జరిగే వ్యవహారాలకి మాత్రమే మీ బాధ్యత. బైట జరిగే విషయాల్లో మీరు నన్ను కంట్రోలు చేయాలనుకోవడం కుదరదని ముఖం మీద కొట్టినట్లుగా చెప్పింది. అదీ ఎవరి దగ్గర? సాక్షాత్ ఈ నర్సింహుడి దగ్గర.”

హెడ్‌మాస్టర్‌కి ముఖం ఎర్రగా మారింది. ముక్కు పుటాలు అదిరాయి.

“ఇంతే కాదు. ఇంకా ఉంది వినండి. నిన్న సాయంత్రం పి.టి. సార్ దగ్గర గొడవ పెట్టుకుంది. అతగాడు ఇలా చెయ్యకూడదు ఇలా వంచాలి అని ఆ అమ్మాయి చేయి పట్టుకుని చూపించ బోయాడట. అలా చూపించేటప్పుడు తెలియకుండా చెయ్యి తగలకూడని చోట తగిలింది కాబోలు. ఆమె ఏమని అడిగింది తెలుసా?”

“నన్ను ముట్టుకోకుండా చెప్పండి సార్ అని చెప్పి ఉంటుంది.”

“మనిషిగా పుట్టి ఉంటే అలాగే చెప్పి ఉంటుంది. కాని ఈమె ఏమన్నదటో తెలుసా?” హెడ్‌మాస్టర్ తల పట్టుకొని అలాగే కూర్చున్నారు. ఆయన ముఖం నిండా చెమటలు పట్టాయి.

“సార్! మీ పెళ్ళాం దగ్గర మీరు పడుకోవడం లేదా అని అడిగేసింది. పాపం! ఆదెబ్బతో మన పి. టి. సార్ పద్మనాభన్ లాంగ్ లీవ్ పెట్టి వెళ్ళిపోయాడు. నేను కూడా పిల్లా జెల్లా కలవాడినే. రాక్షస జాతికి చెందిన ఇలాంటి పిల్లలని మేపుతూ బ్లడ్ ప్రెషర్ తెచ్చుకుంటూ అల్లాడటం నావల్ల కాదు బాబూ. ఆ అడ్డ గాడిదను పంపించేసి శాంతిగా బతుకుతాను.”

“ఇప్పుడు టి. సి. ఇచ్చి పంపించేస్తే తను స్కూల్ ఫైనల్ పరీక్షలు రాయడం కుదరదు సార్. ఆమె భవిష్యత్తు పాడై పోతుంది.”

“ఆ గాడిదకే దాని గురించి చింత లేదు. మీ కెందుకు?”


మనకేమొచ్చింది అని పట్టించుకోకుండా నేను ఉండలేను. అది నా స్వభావం కాదు. అదీ గాక, మరియ చిన్న పిల్ల, మేకపిల్ల లాంటి అమ్మాయి… ఏ పాపం చేసింది? ఒక వేళ అలా చేసిందే అనుకున్నా ఆమె మీద రాళ్ళు రువ్వడానికి నేనేమైనా తప్పేమీ చేయని యోగ్యుడినా?

నేను నా భార్య సుమతితో ఈ విషయం చెప్పాను. తను కూడా మా హెడ్‌మాస్టర్ లాగానే అన్నది.

“మీ కెందుకు ఈ గొడవంతా? మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆ పిల్ల పొగరుబోతు లాగా అనిపిస్తోంది. మిమ్మల్ని కూడా లెక్క చేయకుండా గబుక్కున ఓ మాట అంటే?” అన్నది.

ఆమెను ఎలాగో ఒప్పించి తనను కూడా తీసుకుని ఆ రోజు సాయంత్రం మరియ ఇంటికి వెళ్ళాను.

మా ఇంటి నుంచి మరీ ఎక్కువ దూరం లేదు ఆ అమ్మాయి ఇల్లు. రైల్వే స్టేషనుకి ఎదురుగా వరుస ఇళ్ళలో, వాకిట్లో అరుగుతో కూడిన పాత కాలపు పెంకుటిల్లు. లోపల ఖరీదైన సోఫాలు, కుర్చీలు ఉన్నాయి. కాని ఒక పద్ధతి లేనట్లు చెదురు మదురుగా ఉన్నాయి.

“మరియా!” అని పిలిచాను. రెండు మూడు సార్లు పిలిచిన తర్వాతే “ఎవరూ?” అంటూ లోపలి నుంచి గొంతు వినిపించింది. రేగిన జుట్టు, నిద్ర లేచిన కళ్ళు, నలిగిన బట్టలతో, షర్ట్, లుంగీతో బైటికి వచ్చింది మరియ.

నన్ను చూసిన ఆశ్చర్యం బాహాటంగానే ఆమె ముఖంలో కనబడింది. నా భార్యను కూడా చూసి ఆమె ఆశ్చర్యం రెండింతలు అయి ఉండచ్చు.

“రండి సార్! రండి. కూర్చోండి’ అని అంటూ మా ఇద్దరికీ స్వాగతం పలుకుతూ కుర్చీలను సరి చేసింది. సోఫాలో నేను సుమతి కూర్చున్నాము. ఎదురుగా ఉన్న కుర్చీలో తనను కూర్చోమనగానే వచ్చి కూర్చుంది.

“నిద్ర నుంచి లేపేశామా?” అన్నాను.

“ఫరవాలేదు సార్” సిగ్గు పడుతూ తల దించుకుంది. నుదిటిన పడిన జుట్టును పైకి తోసింది.

“మీరు ఈ వైపు… ఎలా?”

“ఊరికే. బీచ్‌కి వెళదామని బయలు దేరాము. దారిలోనే ఉంది కదా మీ ఇల్లు. చూసి చాలా రోజులైయ్యిందని చెప్పా పెట్టకుండా వచ్చేశాము. పిలవని పేరంటం! ఒంట్లో కులాసాగా లేదా?”

“అమృతాంజనం వాసన వస్తోందా సార్? కొంచం తలనెప్పిగా ఉంటేనూ… ఏమైనా తాగుతారా సార్. కాఫీ టీ..”

“అన్నీ అయ్యాయి. ఇంట్లో ఎవరూ లేరా?”

“ఇల్లా సార్ ఇది? ఇల్లు అంటే అమ్మా, నాన్నా ఉండాలి. నాన్న ఎప్పుడో పోయాడు. పోయాడు అంటే చచ్చిపోయాడని కాదు. మమ్మల్ని వదిలి వెళ్ళి పోయాడు. అమ్మ మమ్మల్ని పూర్తిగా వదిలేయలేదు. అప్పుడప్పుడూ మేము కలుసుకుంటూ ఉంటాము. రెండు మూడు రోజులకోసారి మేము ఒకరిని ఒకరు చూసుకుంటే మరీ ఎక్కువ. అమ్మ పోకడ అది. అందుకే ఇది ఇల్లా అని అన్నాను. నాకేమో ఏదో లాడ్జ్‌లో ఉన్నట్లు అనిపిస్తుంది.”

నాకు ఏదో ఇబ్బందిగా అనిపించింది. రాత్రి వేళల్లో సొట్టలు పడిన అల్యూమినియం గిన్నెతో బిచ్చానికి వచ్చే చిన్న పిల్లను చూస్తున్నట్లు అనిపించింది ఆ క్షణం.

“వేళకి తిండి తిప్పలు ఎలా జరుగుతున్నాయి?’