ఇప్పుడతను ఇరకాటంలో పడ్డాడు. వనజ పంపిన అర్జీ కాగితాన్ని బుట్టదాఖలు చెయ్యనూ లేడు, దానిమీద చర్య తీసుకోనూ లేడు. డైరెక్టర్ జనరల్‌కి నేరుగా అర్జీ పెట్టుకుని దాని కాపీని డైరెక్టర్‌కి పంపించింది వనజ. అయితే గత సంవత్సరం పొడుగునా వనజ చాలా అర్జీలు పెట్టుకుంది డైరెక్టర్ జనరల్‌కి – తనకి న్యాయం చేకూర్చమనీ, తనకి ఆఫీసులో డైరక్టర్ చేతుల్లో జరిగే చిత్రహింప ఆపు చేయవలసిందనీను. ప్రతి అర్జీతో బాటూ డైరక్టర్ గౌరీశంకర్‌కి వనజమీద కక్ష మరింత ఎక్కువైందేగాని తగ్గలేదు.
మొట్టమొదటిసారి – అంటే సంవత్సరం క్రితం వనజ ధైర్యం చేసి డైరెక్టర్ జనరల్ సారథికి తనకి జరిగిన అన్యాయాన్నంతా పూసగుచ్చినట్లు వ్రాసింది. తనకు రావలసిన ప్రమోషను తనకు రాకుండా చెయ్యటం ఇది రెండవసారి అనీ, మొదటిసారి డైరెక్టర్ అతనికిష్టుడైన ఒకతన్ని పైనుంచి వచ్చినవాణ్ణి సెలక్ట్ చేశాడనీ, ఈసారి అతని కులంవాడని చెప్పి తనకన్న రెండేళ్ళు జూనియర్ అయిన వాడిని సెలక్ట్ చేశాడనీ, తనకున్న ఆరు సంవత్సరాల అనుభవాన్నీ కాదని అనుభవంలేని వాడిని పైకి ప్రమోట్ చెయ్యటం అన్యాయం అనీ, ఇదంతా చేసింది చాలక తన సెక్షను మార్పించి ఆ సీనియర్ పోస్టుకి కొత్తగా సెలక్టయిన తన జూనియర్ క్రింద పని చెయ్యమని ఆదేశించాడనీ, ఈ చర్య మానసికంగా చాలా క్రూరమయింది కాబట్టి తనకి జరిగిన అన్యాయాన్ని సరిచేయవలసిందనీ డైరెక్టర్ జనరల్‌కి వ్రాసింది వనజ.
గౌరీశంకర్ సారథిని ఏదో పనిమీద కలుసుకున్నప్పుడు ‘వనజ సంగతేమిటీ? ఏం జరిగింది?’ అని సారథి ఆరా తీశాడు. గౌరీశంకర్ చాలా తేలిగ్గా కొట్టిపారేశాడు. ఆ వనజకి తెలివితేటలు శూన్యమనీ, ఏ బాధ్యత అప్పగించినా సక్రమంగా నిర్వర్తించలేదనీ, లేకపోతే తాను మాత్రం పరాయివాణ్ణి, జూనియర్నీ ఎందుకు సెలక్టు చేస్తాననీ, తనేకాక సెలక్షన్ బోర్డు అంతకీ వనజ మీద సదభిప్రాయం కలగలేదనీ చెప్పి, ‘సెలక్టు కాకపోవటం వనజ కర్మ! ఆ సంగతి నా కొదిలెయ్యండి. నేను చూసుకుంటాను,’ అన్నాడు తొణక్కుండా. గౌరీశంకర్ చాలా పేరుమోసిన డైరెక్టర్. తెలివైనవాడూ, చురుకైనవాడూ. ఎన్నో క్లిష్టమైన ప్రాజెక్టుల్ని విజయవంతంగా సాధించినవాడూ అని డైరెక్టర్ జనరల్ సారథికి తెలుసు. సరేనని ఊరుకున్నాడు వనజ విషయంలో.
మళ్ళీ నెల రోజులు తిరక్కుండా వనజ దగ్గర్నుంచి మరొక అర్జీ వచ్చింది సారథికి. అతను నొసలు చిట్లించాడు. ‘నెలరోజులు తిరక్కుండా మళ్ళీ మీకు అర్టీ పెట్టుకోవలసి రావటం నా దురదృష్టం. నెల రోజులు కూడా ఆ కొత్త సెక్షన్లో నన్ను పనిచెయ్యనివ్వకుండా, నా కొత్త సెక్షన్ హెడ్ చేత (ఇంతకు ముందు నా జూనియర్) నా పని తృప్తికరంగా లేదని రిపోర్టు రాయించారు డైరెక్టర్. నేను ఇక్కడ చేరింతర్వాత ఆరు సంవత్సరాలుగా ఒకే సెక్షన్లో పనిచేశాను. అందులో అనుభవం సంపాదించాను. మరొక సెక్షన్లో పని ఆకళింపు చేసుకోవటానికి అధమం నెలరోజులైనా పట్టదా? ఈ నెలలోగానే నా పని అసంతృప్తికరంగా ఉందని రిపోర్టు రాయించి నన్ను మరో సెక్షన్‌కి బదిలీ చేయడంలో సబబు ఏమైనా ఉన్నదేమో ఆలోచించండి. ఈ విధంగా నా రికార్డు పాడుచేసి నన్ను కావాలని హింసించటం ఎందుకో దయచేసి విచారించవలసిందని ప్రార్థిస్తున్నాను.’ అని మొరపెట్టుకుంది వనజ. సారథి ఈ సారి తనని కలుసుకుని మాట్లాడవలసిందని వనజకి ఉత్తరువు జారీ చేశాడు. వనజ వెళ్ళి మాట్లాడింది సారథితో.
కొంతమంది వందిమాగధులు వెళ్ళి గౌరీశంకర్‌తో ఈ సంగతి చెప్పారు. విని మండిపడ్డాడతను. ‘వెడుతుంది వెడుతుంది. ఇవాళ డైరెక్టర్ జనరల్ దగ్గరకి వెళ్ళింది. రేపు మినిష్టర్ దగ్గరికి వెడుతుంది. దానికేం, పచ్చి భోగంది’ అన్నాడు కోపం పట్టలేక. ఇలా తిట్టాడని కొందరు వెళ్ళి వనజ చెవిలో ఊదారు. వనజ గుండె భగభగమంది. ఆమె సీతామహాదేవి కాదు, అమాంతం అవమాన భారంతో భూమిలో కుంగిపోవటానికి, అలాగే స్థిరంగా నిలబడి మనస్సు రాయి చేసుకుంది. ఆ దెబ్బతో రాజీనామా ఇస్తుందేమో, ఒక పోస్టు అయినా ఖాళీ అవుతుందని ఆశించిన కొలీగ్స్ కొందరు నిరుత్సాహపడి, ‘మొండిఘటం’, ‘సిగ్గులేదు’ అని గొణుక్కున్నారు. వనజకి అన్యాయం జరిగిందని నమ్మిన ఏ కొద్దిమందో ఉన్నప్పటికీ, డైరెక్టర్‌కి అప్రియులవుతారన్న భయంతో వనజకి దూరంగా ఉండేవారు కొందరు. వనజతో కలిసి కాఫీ తాగటానికి కాంటీనుకి వెళ్ళే ఇద్దరు ముగ్గుర్ని పిలిచి గౌరీశంకర్ హితబోధ చేశాడు – ‘అది తుచ్ఛురాలు. దానితో తిరిగితే మీకు ఒరిగేదేమిటి? మీమీద నాకెన్నో ఆశలున్నాయి. శ్రద్ధగా పనిచెయ్యండి. మీకు మంచి పొజిషన్స్ వస్తాయి.’ అని అభయం కూడా ఇచ్చాడు.
ఏదో కొత్త ప్రాజెక్టు విషయం చర్చించటానికి ఓ రోజున గౌరీశంకర్ వనజ పనిచేస్తున్న సెక్షన్ వాళ్ళందర్నీ తన గదిలోకి రమ్మని కబురంపించాడు. వనజని చూడగానే డైరెక్టర్ ముఖం చిట్లించి, ‘సెక్షనంతా ఖాళీ చేసి వస్తే అక్కడ పనెవరు చూస్తారు? నువ్వెళ్ళి నీ పని చూసుకో,’ అన్నాడు. అందరూ తెల్లబోయారు ఆ ధోరణికి. వనజ అరక్షణం నిర్ఘాంతపోయినా, అంతలోనే ధైర్యం తెచ్చుకుని, ‘కొత్త ప్రాజెక్టు గురించి చర్చించటానికి మా సెక్షన్‌లో అందర్నీ రమ్మని కబురంపించారు మీరు. సెక్షన్‌లో నేనూ ఒకర్తినే. నేనూ ఆ ప్రాజెక్టు గురించి తెలుసుకోవలసిన అవసరం ఉంది.’ అంది తల ఎత్తి సూటిగా గౌరీశంకర్ కళ్ళలోకి చూస్తూ.
‘తెలుసుకుని నువ్వుచేసే నిర్వాకం ఏమీలేదు. నేను వెళ్ళమంటున్నాను – వెళ్ళు!’ అన్నాడు గౌరీశంకర్. కోపంతో అతని గొంతూ, అతని వేళ్ళూ వణికాయి. వనజ మరింత ధైర్యం తెచ్చుకుంది. ‘నేను వెళ్ళను.’ అంది మొండిగా. డైరెక్టర్ మరింత కోపంతో గుప్పెళ్ళు బిగించి టేబుల్ మీద గుద్దుతూ ‘నువ్వుండగా నేను చస్తే ఆ ప్రాజెక్టు గురించి మాట్లాడను. మీరంతా వెళ్ళొచ్చు.’ అన్నాడు సెక్షన్ హెడ్ వైపు చూస్తూ. అందరూ తలలు వంచుకుని గదిలోంచి ఇవతలికి వచ్చేశారు.
అందరికీ అతని ప్రవర్తన చాలా అసమంజసంగా ఉందని అనిపించింది. కానీ ఒక్కరూ ఆ మాట పైకి అనలేదు. ఒకళ్ళిద్దరు మాత్రం సాయంకాలం వనజ ఇంటికివెళ్ళి బాగా పురెక్కించారు. ‘ఏమైనా సరే, మీరు ఊరుకుంటే లాభం లేదు వనజగారూ, ఆ గౌరీశంకర్ తిక్కకుదర్చవలసిందే. మీరు సారథిగారికి మరింత ఘాటుగా రాయండీసారి,’ అని సలహా ఇచ్చారు.
వనజకి గతమంతా మనస్సులో మెదిలింది. తను ఈ ఆఫీసులో చేరిన తరువాత ఒక సంవత్సరం ఎంతో ఉత్సాహంగా గడిచింది. ఎంతో దీక్షగా మనస్ఫూర్తిగా పనిచేసేది. ప్రతి పనినీ శ్రద్ధతో గమనించి డైరెక్టర్ గౌరీశంకర్ తనని అభినందించేవాడు. తనంత అదృష్టవంతురాలు లేదని మురిసిపోయింది. రెండో సంవత్సరం నుంచీ తన పాట్లు ప్రారంభమయ్యాయి. తను చేసే పనిని మెచ్చుకోవటం మానేసి తనని మెచ్చుకోవటం మొదలుపెట్టాడు. మొదట్లో ‘ఈ చీర నీకు బాగుంద’నీ, ‘ఈ రంగులో మెరిసిపోతున్నావ’నీ అంటూ కామెంట్ చేసేవాడు. రెండుమూడుసార్లు స్త్రీ సహజంగా సిగ్గుపడింది. తరువాత తరువాత అర్థంచేసుకుని తీక్షణంగా చూసి తలవంచుకునేది.
అటువంటి ధోరణి తనకి నచ్చదన్న భావం కన్నుల్లో సుస్పష్టం చేసింది. క్రమంగా అతనికి ‘చెయ్యివాటుతనం’ ఆరంభమయింది. ఏ కాగితాలు ఇచ్చేటప్పుడో కావాలని చెయ్యి తగిలించటం మొదలుపెట్టాడు. ఎంత జాగ్రత్తపడినా ఎలాగో తగిల్చేవాడు.
ఓ రోజున పిల్చి ‘నీతో ఒక విషయం మాట్లాడాలి,’ అన్నాడు గంభీరంగా.
‘ఏమిటి చెప్పండి?’ అంది వనజ నమ్రతగా.
‘ఇక్కడ కాదు, పర్సనల్ విషయం. ఇంకెక్కడయినా కలుసుకుందాం. నీకెప్పుడు వీలవుతుందో చెప్పు,’ అన్నాడు.
వనజ గుండె దడదడలాడింది. అదే సంకేతంగా తీసుకుని, ధైర్యం కూడదీసుకుని ‘నాతో అంత రహస్యంగా మాట్లాడవలసినవేమున్నాయ్? మాట్లాడేదేదో ఇక్కడే మాట్లాడండి.’ అంది.
ఈ లోపల ఎప్పుడు చెయ్యి ముందుకి చాచాడో తెలియదు. హఠాత్తుగా వనజ వేళ్ళమీద అతని వేళ్ళు స్పృశించాయి. షాక్ కొట్టినట్లు వెనక్కి లాక్కుని కుర్చీలోంచి లేచింది. ‘క్షమించండి, మీరనుకునే రకం మనిషిని కాదు నేను.’ అని చరచరా ఇవతలికొచ్చేసింది.
అప్పటి నుంచి మొదలైంది గౌరీశంకర్‌కి వనజంటే మంట. ప్రతి పనినీ ప్రత్యేకంగా పరిశీలించి విమర్శించటం మొదలుపెట్టాడు. వనజకి ఒక్కొక్కప్పుడు రాజీనామా ఇవ్వాలన్నంత ఉద్రేకం కలిగేది. కానీ, తన మీద ఆధారపడ్డ తల్లినీ, తమ్ముణ్ణీ తలుచుకుని దుఃఖాన్ని దిగమింగుకుని పనిలో నిమగ్నమయ్యేది. ఒకోసారి తనని తానే సమాధానపరచుకునేది. ఆడదానికి ఎక్కడికి వెళ్ళినా ఇంతేకదా, ఈ అధికారి కాకపోతే మరొక అధికారి! ఆత్మరక్షణ చేసుకోగల స్థోమత, ఎక్కడయినా సర్దుకుపోగల తత్వం ఉండాలిగాని, ఆఫీసు మారినంత మాత్రాన మనుషుల నైజగుణాలు మారుతాయా – అనుకుని ఒక విధమయిన నిర్లిప్తత అలవరచుకుంది. అయిదు సంవత్సరాలు అలాగే గడిపింది.
ప్రమోషన్ రావలసిన సమయం ఆసన్నమైంది. సీనియర్ పోస్టులు రెండు కొత్తగా ఏర్పడ్డాయి. ఎడ్వర్టైజ్ చేశారు. మొదటిసారి తనూ మరి కొందరితో పాటు అప్లై చేసింది. ఇంటర్వ్యూలో తను నెగ్గలేదు. పైనుంచి ఎవరో కొత్తమనిషిని సెలక్టు చేశారు. కొంచెం బాధపడి ఊరుకుంది. రెండో పోస్టుకి ఎడ్వర్టైజ్ చేసినప్పుడు తను అంతగా పట్టించుకోలేదు. ఇక ఆఖరి రోజున గౌరీశంకర్ వనజని పిలిచి ‘నువ్వు అప్లై చెయ్యలేదేం?’ అని అడిగాడు. వనజ మాట్లాడకుండా తలవంచుకుంది.
‘మాట్లాడవేం? అప్లై చేయమని బతిమాలించుకోవాలా?’ అన్నాడు. గొంతు సౌమ్యంగానే ఉంది. అతన్ని ఎలా అర్థంచేసుకోవాలో తెలియక మౌనందాల్చింది. ‘ఇవాళ సాయంకాలంలోపుగా అప్లికేషన్ నా చేతికియ్యి. నీ సెక్షన్ వర్క్ గురించి పుస్తకాలు క్షుణ్ణంగా చదువు, బాగా ప్రిపేరయి రావాలి ఇంటర్వ్యూకి. తరువాత నన్నని లాభంలేదు.’ అన్నాడు. సరేనని బుర్ర ఊపి బయటపడింది. అప్పటికే గుసగుసలు ఆరంభమయినాయి వనజ ఇంకా అప్లై చేయలేదని. ఎలాగో సాయంకాలం లోగా అప్లికేషన్ టైప్ చేయించి ఇచ్చింది డైరెక్టరుకి. నెల్లాళ్ళపాటు ఇంటర్వ్యూకి కష్టపడి తయారైంది.
ఇంటర్వ్యూలో ఒకాయన మొదట అడిగాడు, ‘ఏ సెక్షన్‌లో పనిచేస్తున్నావ్?’ అని. చెప్పింది. ఎన్నాళ్ళ నుంచి పని చేస్తున్నావని అడిగాడు. ‘ఆరేళ్ళనుంచి’ అని చెప్పింది. అంతలో డైరెక్టర్ గౌరీశంకర్ అందుకుని ఫలానా ప్రాజెక్టు ప్రారంభించటంలో గల ఉద్దేశాలేమిటి? అని అడిగాడు. తన సెక్షన్‌కి సంబంధించిన ప్రశ్న కాదది. జ్ఞాపకం చేసుకుని కొంచెం తడుముకుంటూ చెప్పింది.
‘ఏ ప్రొసెస్ ప్రకారం వేస్టేజ్ తక్కువవుతుంది?’ అని అడిగాడు ఆ ప్రాజెక్టు గురించే. వనజ జవాబు చెప్పలేకపోయింది.
‘ఆరు సంవత్సరాలనుంచీ ఇక్కడ పని చేస్తున్నావు. నీ చుట్టూ ఏం జరుగుతున్నదో తెలుసుకోవాలనే కుతూహలం కూడా లేదన్న మాట!’ అన్నాడు గౌరీశంకర్ నిరసనగా. వనజ ఏదో చెప్పబోయే లోపలే ‘ఇహ నువ్వెళ్ళొచ్చు’ అన్నాడు. నమ్మలేనట్లుగా తక్కిన సెలక్షన్ బోర్డు మెంబర్సు వైపు చూసింది వనజ. వాళ్ళు గౌరీశంకర్ వైపు చూశారు. అతను ‘ఊ…’ అన్నాడు – ఇంకా వెళ్ళవేం – అన్నట్లుగా.
వనజకి కళ్ళనీళ్ళ పర్యంతమయింది. తన సెక్షన్ వర్క్ గురించి ఒక్క ప్రశ్న కూడా వెయ్యలేదు. తన అనుభవంతో సంపాదించిన విజ్ఞానాన్ని ప్రదర్శించటానికి రవంత అవకాశం కూడా ఇవ్వలేదనిపించింది. ఊరుకున్నదాన్ని పిలిచి అప్లై చెయ్యమనీ, సెక్షన్ గురించి పుస్తకాలు చదవమనీ ప్రత్యేకం సలహా ఇచ్చిన పెద్దమనిషి ఇంటర్వ్యూలో అలా కర్కశంగా ఎందుకు ప్రవర్తించాడో అర్థంకాలేదామెకి. ఏదో అన్యాయం జరిగిందని మాత్రం మనస్సు మూలిగింది. ఆ రాత్రి అన్నం సయించలేదు. తల్లి ఎంత బ్రతిమాలినా భోజనానికి లేవలేదు. చివరికి తమ్ముడు వచ్చి ‘అక్కా, నువ్వు తినకపోతే నేను తినను.’ అని దీనంగా మొహం పెడితే కళ్ళనీళ్ళు తిరిగి వాడి కోసం పీట మీద కూర్చుని ఏవో నాలుగు మెతుకులు నోట్లోకి తోసింది.
మర్నాడు ఆఫీసులో అందరూ అనుకుంటూంటే అప్పుడర్థమయింది తనకి జరిగిన అన్యాయం ఏమిటో. గౌరీశంకర్ తన కులంవాణ్ణీ, తనకు కావలసినవాణ్ణీ ప్రమోట్ చెయ్యటం కోసం వనజని కావాలనే ఇంటర్వ్యూలో చిన్నచూపు చూశాడనీ, బోర్డ్ మెంబర్సుకి ముందుగానే హింటిచ్చాడనీ అంతా గుసగుసలాడుకున్నారు. ‘ఏడు కొండలవాడా, నేనేం పాపం చేశానని నాకీ శిక్ష విధించావు!’ అని వాపోయింది వనజ.
ఇద్దరు కొలీగ్స్ సాయంకాలం వనజ ఇంటికొచ్చి ఆయాచితంగా సలహా ఇచ్చారు – ‘మీరు ఊరుకోకండి. మీకు జరిగింది అక్షరాలా అన్యాయం. డైరెక్టర్ జనరల్‌కి అర్జీ పెట్టుకోండి. ఈ గౌరీశంకర్ గీర అంతా అణుగుతుంది.’ అన్నారు.
‘ఎందుకొచ్చిన గొడవలెండి. ఏదో నా కర్మ! నాకు ప్రమోషన్ వచ్చే రాతలేదు. ఆయన మాత్రం ఏం చేస్తాడు!’ అంది వనజ విరక్తిగా.
‘మీరలా సన్యసిస్తే లాభం లేదు వనజగారూ. ఇవాళ మీకు జరిగింది అన్యాయం, రేపు మాకు జరుగుతుంది. మొగ్గలోనే తుంచాలి చీడపడితే. గౌరీశంకర్ మీకు అన్యాయం చేశాడు. మీరు మీ కర్మ అనుకుంటే లాభం లేదు. క్రియాపూర్వకంగా మీరతనికి పాఠం నేర్పాలి.’ అన్నారు వాళ్ళు. అని, వాళ్ళే ఏమేం రాయాలో కూడా చెప్పి డైరెక్టర్ జనరల్‌కి వనజ చేత అర్జీ పెట్టించారు. కాపీ డైరెక్టర్‌కి వెళ్ళింది.
అప్పటి నుంచి మొదలైంది డైరెక్టర్‌తో ప్రచ్ఛన్నయుద్దం. అదంతా మనస్సులో మెదిలింది వనజకి. డైరెక్టర్ తన సెక్షన్ వాళ్ళందర్నీ కొత్త ప్రాజక్ట్ చర్చించటానికి పిలిచి తనొక్కర్తెనీ వెళ్ళిపొమ్మనగానే వనజ మనస్సు కుతకుతలాడింది ప్రతి కక్షతో. ఈ సంగతంతా పూసగుచ్చినట్లు డైరెక్టర్ జనరల్ సారథికి రాసింది. క్రిందటిసారి తను ఆయన్ని కలుసుకున్నప్పటి నుంచీ నలుగురి ముందూ తన గురించి ఉచ్చరించరాని నీచమయిన మాటలు మాట్లాడుతున్నారనీ, తనతో కలిసిమెలిసి తిరగొద్దని తన కొలీగ్స్ అందరికీ నూరి పోస్తున్నారనీ, ప్రతి విషయంలోనూ తనని ప్రత్యేకంగా కించపరుస్తున్నారనీ, ఈ చిత్రహింసను అరికట్టవలసిందనీ, లేకుంటే తను ప్రాణత్యాగం చెయ్యవలసి వస్తుందనీ, అందుకు బాధ్యత ఎవరిదో తను వివరించనక్కర్లేదనీ ఘాటుగా రాసింది.
సారథి ఈ సారి గౌరీశంకర్‌ని పిలిపించి, ‘ఏమిటయ్యా ఇదంతా? ఆ వనజంటే మీకెందుకీ కక్ష?’ అన్నాడు నవ్వుతూనే. గౌరీశంకర్ కూడా అదేదో జోక్ అయినట్లుగా పకపకానవ్వేసి ‘ఏమిటండీ మీరు కూడా అదే మాటంటారు! అధికారులమన్న తరువాత ఇలాంటి వాళ్ళనెంతమందినో ఎదుర్కోవాల్సి వస్తుంది. చాకులాంటి యువకుల్ని సంస్థల్లోకి తీసుకురావాలనీ, సంస్థని వృద్ధి చెయ్యాలనీ, దేశ సౌభాగ్యానికి పాటుపడాలనీ మీరే ఉపన్యసిస్తుంటారు కదా! వనజలాంటి మొద్దమ్మాయిల్ని పైకి తీసుకొచ్చి బాధ్యతలప్పగిస్తే ఇంక పనులేం సాగుతాయి ముందుకి!’ అన్నాడు.
‘నేనా అమ్మాయితో మాట్లాడిచూశాను. బుద్ధిమంతురాలిలాగే ఉంది. తెలివైనదానిలాగే తోచింది,’ అన్నాడు సారథి గౌరీశంకర్ మాటల్ని నమ్మలేనట్లు ముఖం పెట్టి.
‘ఆ, పైపై మెరుగులు చూసి మోసపోకూడదండీ. కాకపోయినా, ప్రతి చిన్న విషయానికీ నన్నుకాదని మీ దగ్గరికి పరిగెత్తుకొస్తూంటే ఇహ నా ఆఫీసులో క్రమశిక్షణ ఏముంటుంది? నా సంస్థకి మంచేదో చెడోదో నాకామాత్రం తెలియదా?’ అన్నాడు గౌరీశంకర్ బింకంగా.
నిప్పు లేకపోతే పొగ ఎందుకొస్తుంది – అని మనస్సులో అనుకుని సారథి పైకి మాత్రం ‘ఏమైనా, ఇకముందైనా ఇలాంటివి జరక్కుండా చూసుకోండి గౌరీశంకర్!’ అని మర్యాదగా మందలించి ఊరుకున్నాడు.
వనజని పిలిపించి ఆ అమ్మాయికి కూడా కొంత ఉపదేశం చేశాడు సారథి. ‘అమ్మాయ్! అధికారి అన్న తరువాత కొన్ని నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది సంస్థ మంచీచెడూ ఆలోచించి. అందులో ఎవరికో ఒకరికి ఎప్పుడో ఒకప్పుడు అన్యాయం జరిగినట్లు అనిపించకమానదు. కొంచెం అర్థంచేసుకోవటానికి ప్రయత్నించు. గౌరీశంకర్‌కి నీ మీద ఏదో ప్రత్యేకమయిన కక్ష ఉందని భ్రమించి అనవసరంగా మనస్సు కలుషితం చేసుకోకు. నీ సామర్థ్యమే దెబ్బతింటుంది. శ్రద్ధగా నీ పని నువ్వు చూసుకో. నీకేవిధమయిన అన్యాయం జరక్కుండా నేను చూస్తాను.’ అని అప్పటికి అభయమిచ్చి పంపించాడు డైరెక్టర్ జనరల్.
ఆరు నెలలు కాస్త ప్రశాంతంగా జరిగిపోయాయి. గౌరీశంకర్ కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకునీ, నోరుకట్టుకునీ వనజని పట్టించుకోనట్లు నిర్లక్ష్యంగా మాత్రం ఉంటూ వచ్చాడు. ఈ లోపల ప్రసాద్ అనే అతను స్వంతంగా స్కాలర్షిప్ సంపాదించి జర్మనీ వెళ్ళాడు ట్రెయినింగ్ కోసం. అతను జర్మనీ నుంచి రాసిన ఉత్తరాలు చూసి అతను చేస్తున్న కృషికి గౌరీశంకర్ ముగ్ధుడైపోయి అందరితోనూ ప్రసాద్ గురించి గర్వంగా చెప్పటం మొదలుపెట్టాడు. అతను జర్మనీ నుంచి తిరిగి వచ్చినప్పట్నుంచీ, అతను వనజతోటివాడే అయినా, అతన్ని సీనియర్ ఆఫీసర్‌లాగ చూడటం ఆరంభించాడు గౌరీశంకర్.
కొద్ది రోజులకే ఒక సీనియర్ ఆఫీసర్ రెండు నెలలు సెలవు పెట్టాడు. ఆ సెలవు సమయంలో ప్రసాద్‌ని ప్రమోట్ చేసి అతన్ని సెక్షన్ హెడ్‌గా చెయ్యాలని గౌరీశంకర్ ఆలోచించాడు. ఇలా జరగొచ్చునని ముందుగానే ఊహించి వనజ శ్రేయోభిలాషులు వనజకి సలహా ఇచ్చారు, డైరెక్టర్ జనరల్‌కి ముందుగానే అర్జీ పెట్టుకోమని. తన సీనియారిటీని గుర్తించి ఈ లీవ్ వేకెన్సీలో తనని ప్రమోట్ చెయ్యవలసిందిగా అర్జీ పెట్టుకుంది వనజ డైరెక్టర్ జనరల్‌కి. డైరెక్టర్‌కి కాపీ పంపించింది.
గౌరీశంకర్ ఇప్పుడు ఇరకాటంలో పడ్డాడు. ఈ సమయంలో దాని మాట నెగ్గిందంటే ఇక దానికి పట్టపగ్గాలుండవు. రూలు ప్రకారం లీవ్ వేకెన్సీలో వనజకే ప్రమోషన్ రావాలని తెలుసు. కానీ, ప్రసాద్ క్వాలిఫికేషన్స్ ముందర ఈ వనజ ఎందుకు పనికొస్తుంది? ఇటువంటి పరిశోధనా సంస్థల్లో పని చెయ్యటం ప్రధానం కాదు. ప్రసాద్‌కే ఇవ్వాలి ఈ ప్రమోషన్ – అని గౌరీశంకర్ మనస్సు ఘోషించింది.
తన మనస్సులోని ఆరాటాన్ని తగ్గించుకోవటానికి ఇద్దరు ముగ్గురు వందిమాగధుల్ని పిలిచి సంప్రదించాడు – ఈ విషయమై. అందరికీ మనస్సులో వనజకే రావటం న్యాయం అనిపించినా, ఉన్నమాట అని డైరెక్టర్‌కి అయిష్టం కలిగించటానికి జంకి నోరెత్తలేదు. ఒకతను కొంచెం ధైర్యం చేసి, విషయాన్ని ఎంతో తేలిగ్గా కొట్టిపారేస్తున్నట్లు పోజు పెట్టి ‘వెధవది రెండునెల్లే కదండీ, ఆవిడ మొహాన్ని పారేస్తే పోలే! ఎందుకొచ్చిన గొడవ’ అన్నాడు. మరొకతను అడ్డొచ్చి ‘అమ్మమ్మ! అలా అనుకోకోయ్! రేప్పొద్దున్న మరో అవకాశం వస్తే ఈ రెణ్ణెల్ల అనుభవమే ఆదుకుంటుంది సీనియారిటీ లిస్టులో.’ అని విశదీకరించాడు. డైరెక్టర్ చిరునవ్వు నవ్వాడు అతని మేధావి బుర్రని మెచ్చుకుంటూ. చివరికి మూడో అతను మరింత ఆలోచించి ‘పోనీ, కొన్నాళ్ళు నాన్చెయ్యండి ఆ తరువాత వేకెన్సీ ఫిలప్ చెయ్యాల్సిన అవసరం లేదు. పని సాగిపోతోంది అని చెప్పొచ్చు.’ అన్నాడు.
ఈ సలహా బ్రహ్మాండంగా ఉందనుకున్నాడు డైరెక్టర్ – పాము చావకుండా కర్ర విరక్కుండా! డైరెక్టర్ జనరల్ వచ్చేవారం అమెరికా వెడుతున్నాడు. మరో మూడునెల్లదాకా రాడు. ‘ఈ వారం రోజులూ మాట్లాడక ఊరుకుంటే సరి’ అనుకున్నాడు. మనస్సులో బిక్కుబిక్కుమంటూనే ఉన్నా, పైకి ఛాతీ విరుచుకున్నాడు తన తడాఖా చూసుకోమన్నట్లు. అమెరికా వెళ్ళేందుకు ముందురోజు గౌరీశంకర్‌ని కలుసుకోవటానికి స్వయంగా వచ్చాడు సారథి.
గౌరీశంకర్ ఆయనకి అడుగులకి మడుగులొత్తుతూ సంస్థలో జరుగుతున్న కార్యక్రమాలన్నిటినీ చూపించాడు. అన్ని సెక్షన్లలోకి తీసుకువెళ్ళి, అక్కడ పనిచేస్తున్న వాళ్ళందరితో సమయోచితంగా మాట్లాడాడు సారథి. వనజని చూడగానే “బావున్నావా వనజా?’ అని ఆప్యాయంగా అడిగాడు. గౌరీశంకర్ ముఖం అప్రసన్నంగా మరోవేపుకి తిప్పుకున్నాడు.
ఆ మర్నాడు తన టేబుల్ మీదికి వచ్చిన ఉత్తరాన్ని చూసి నిర్ఘాంతపోయాడు గౌరీశంకర్. ‘శ్రీ జాకబ్ సెలవు తీసుకోవటం వల్ల ఏర్పడిన ఖాళీ జాగాలోకి కుమారి వనజని రూల్సు ప్రకారం ప్రమోట్ చెయ్యవలసింది.’ అని డైరెక్టర్ జనరల్ డైరెక్టరుకి ఉత్తరువు జారీచేశాడు. గౌరీశంకర్ పళ్ళు పటపట నూరాడు. ‘ఇల్లు అలగ్గానే పండుగైపోదు, నేనూ చూస్తాను దీని అంతేమిటో. ఇటువంటి సంస్థ స్వవిషయాల్లో కూడా డైరెక్టర్‌కి నిర్ణయాధికారం ఎందుకు లేదో నేనూ తేల్చుకుంటాను మినిస్టర్ దాకా వెడతాను. అవసరమైతే ప్రధానమంత్రి దాకా వెడతాను’ అని శపథం తీసుకున్నాడు.
ఆఫీసు ఆర్డరు వనజ చేతికి అందకపోయినా ఆ వార్త అప్పుడే అందరికీ చేరిపోయింది. వనజని ఆఫీసులో అందరూ అభినందించారు. గౌరీశంకర్ చూడకుండా ఒకతను రహస్యంగా అన్నాడు – ‘ఇప్పుడు మన గౌరీశంకర్‌గారి ముఖం చూడాలి!’ అని. మరొకతను లేచి ‘ఈయనగారు తనే సర్వధికారిననీ, సృష్టికర్తననీ అనుకుంటాడు! తనేం చేసినా కిందవాళ్ళు నోరు మూసుకుని అనుభవించాలనుకుంటాడు! ఇప్పుడు తెలిసొస్తుంది ఎవరు కర్త! ఎవరి కర్మ! ఎవరి క్రియ!’ అన్నాడు వెటకారంగా.
ఈలోపుగా డైరెక్టర్ పిలుస్తున్నాడని వనజకి కబురొచ్చింది. డైరెక్టర్ కోపపు మంటల్ని ఎలా తట్టుకోవాలా అని ఆలోచిస్తూ వనజ బిక్కుబిక్కుమంటూ అతని గదిలోకి వెళ్ళింది. కాని ఆమె ఎదురు చూసినట్లుగా గౌరీశంకర్ చూపులు నిప్పులు కక్కటంలేదు. చాలా సౌమ్యంగా కనిపించాడు. కుర్చీలో కూర్చోమన్నాడు.
‘వెల్! ఐ మస్ట్ కంగ్రాచ్యులేట్‌యూ!’ అన్నాడు. మరొకరన్నట్లయితే సంతోషంతో చిరునవ్వు నవ్వేదే, కాని అతని ఎదుట చిరునవ్వు నవ్వటానికి ఆమె పెదవులు నిరాకరించాయి. నమ్రతగా తలవంచుకుంది.
‘ఆ చేసేదేదో ఆయనతో చేసే బదులు నాతోనే చేస్తే సరిపోయేది కదా!’ అన్నాడు.
‘ఏమిటి?!’ అంది నిర్ఘాంతపోతూ.
ప్రమోషన్ ఆర్డర్ కాగితాన్ని అందించటానికి చెయ్యి ముందుకి చాచాడు. అందుకోబోతుంటే ఆమె వేళ్ళని పట్టుకున్నాడు.
తక్షణం చెయ్యికాలినట్లుగా వెనక్కి గుంజుకుని సీటులోంచి లేచి నిలబడింది. ఆర్డర్ కాగితాన్ని తీసుకోకుండా ‘యూ క్రూక్’ అని మనస్సులోనే బుసకొట్టి బయటికి వచ్చేసింది.
డైరెక్టర్ జనరల్ ఇచ్చిన ఆర్డరుని డైరెక్టర్ వనజకి అందజేస్తూంటే అతని ముఖం ముడుచుకుపోవటం చూసి విజయగర్వంతో మందస్మితంతో ఇవతలికి వస్తుందని చూస్తున్న కొలీగ్స్ వనజ ముఖాన్ని చూడగానే తెల్లబోయారు.
కోపంతో ఆమె ముఖం కందగడ్డలా అయింది. ఉబుకుతూన్న కన్నీళ్ళు కొలీగ్స్ కంటపడకుండా వనజ గబగబా క్లోక్ రూమ్‌లోకి వెళ్ళిపోయింది.
(ఈ కథ ‘అంతర్జాతీయ స్త్రీ సంవత్సరానికి’ అంకితం.)
(జ్యోతి, దీపావళి సత్యేక సంచిక, 1975నుంచి పునర్ముద్రణ.)