ప్రాసక్రీడాశతకము

ద్రావిడ ఛందస్సులో ప్రాస అతి ముఖ్యమైనది. కన్నడ మలయాళ భాషలలో అక్షరయతి సామ్యమును అనుసరించకపోయినా ద్వితీయాక్షర ప్రాసను మాత్రము తప్పకుండ పాటిస్తారు. అందుకే ఆ భాషలలో జాతులు తప్ప ఉపజాతులు లేవు. ఉన్నట్లుండి ప్రాసతో ఆడుకోవాలనే ఒక సరదా పుట్టింది. దాని ఫలితమే ఈ పద్యాలు. ఈ పద్యపు ప్రతి పాదములో 14 మాత్రలు. నాలుగు, ఐదు, ఐదు మాత్రల స్వరూపము తీసికొంటే అప్పుడు అది సంపఁగి అనే పద్యములోని అర్ధ పాదము అవుతుంది (చూ. చంపకోత్పలమాలల కథ). కాని క్రింది పద్యాలలో ప్రాసకే ఎక్కువ ప్రాముఖ్యము. అది కూడ ఎక్కువగా ఒకే అక్షరాలతోడి ద్విప్రాస (2, 3 అక్షరాలు), త్రిప్రాస (2,3,4 అక్షరాలు). అందువల్ల పదాలను ఎల్లప్పుడు అలా విడదీయుట సాధ్యము కాలేదు. మొదటి పాదములో మొదట వచ్చే పదము, తరువాతి పాదములోని మొదటి అక్షరాలుగా ఉంటాయి. ఈ అక్షరాలకు ముందు ఉండే అక్షరము(ల)తో, అనగా ముందటి పాదములోని చివరి అక్షరము(ల)తో పదము ఏర్పడుతుంది. ఒకే పదమును ఉపయోగించినప్పుడు దాని అర్థము వేరుగా ఉంటుంది. అలంకార రీత్యా యిది యమకము. నా ఈ చిన్న ప్రయత్నమును పాఠకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను. కొన్ని పదముల సేకరణకు ఆంధ్రభారతి సైటులోని నిఘంటుశోధన ఉపయోగపడినది. ఆ సైటు నిర్వాహకులకు నా ప్రశంసాపూర్వక కృతజ్ఞతలు.


శ్రీయన శ్రీదేవి సిరుల నిడు
శ్రీయన శ్రీవాణి చదువు లిడు
శ్రీయన శ్రీసతియు కాపాడు
శ్రీయన నా కవితలే పాడు … 1

వాణీ, సుందరతర వర గీ-
ర్వాణీ, వందనము లశరీర-
వాణీ, వేదవేణీ, కీర-
వాణీ, వరదాయి భారతీ … 2

కంటిని శ్రీశైలమందు ము-
క్కంటిని, మధురాపురిన్ మచ్చె-
కంటిని, శేషాద్రిపై దమ్మి-
కంటిని, కంటి సౌభాగ్యమై … 3

(ముక్కంటి = శివుడు, మచ్చెకంటి = మీనాక్షి, తమ్మికంటి = విష్ణువు )

కందము కవితలకు జెల్లు, మా-
కందము పికములకు నిల్లు, తెలి
కందము నింగిలో గను, మూల-
కందము బ్రదుకులో విను నీవె … 4

(కందము = పద్యము, మేఘము; మాకందము = మామిడి; మూలకందము = ఆధారము)

కంబు గళంబున స్వరంబు, లే-
కంబుగ హాయి గల్గించె, శో-
కంబు గతించె, నూత్నంబు లో-
కంబు, కనులముందు నాకంబు … 5

కతలను చెప్పనా, నీ కడ్డు-
కతలను చెప్పనా, పలు పిట్ట-
కతలను చెప్పనా, తందాన-
కతలను చెప్పనా, చెప్పవా … 6

కమ్మల జదివేవొ, బంగారు
కమ్మల నా రాణి, చాలు చిలు-
కమ్మలతో నాట, రమ్ము కన-
కమ్మయు దయ జూపు మనపైన …7

కలములు కవితలను వ్రాయు బు-
ష్కలముగ, వికలమగు మనసుల శ-
కలముల సకలముగ జేయు, కల-
కలమును గల్గించు వెల్గించు … 8

(శకలము = తునక)

కరములు వరములకు వార్ధు, ల-
క్కరములు కవిత కిడు హృదయ, మా-
కరములు తనువు సొగసులకు, భీ-
కరములు లేక నీవు రజనులు … 9

(అక్కరము = అక్షరము; ఆకరము = ఉనికి)

కలలో భయమేలకో, పీడ-
కలలో కెవ్వుమని యఱచేవు
కలకల మని నవ్వు, ముదము ని-
క్కలయగు కడు మోద మొందగా … 10

(నిక్కల = నిజమగు కల)

కలిలో, మాడుచుండు పెను యా-
కలిలో, వీడకుండు నొక తన-
కలిలో, జేయుచుండు చిఱు తె-
క్కలిలో, తప్పులేమి గలవో … 11

(తనకలి = చిక్కు; తెక్కలి = దొంగతనము)

కళికలు విరి మొగ్గలు, మఱి యు-
త్కళికలు పెద్ద యలలు, కళికో-
త్కళికలు రగడలను ఛందములు
కళికలు కలికి రతనమ్ములే … 12

కారము వాడి చూపులగు, నా-
కారము శ్వేతచంద్రికగు, సం-
స్కారము మందహాసములు, ప్రా-
కారము ప్రేమ సన్నిధి గదా … 13