శనివారం ‘పేజీ’ ఉంటుంది కాబట్టి, ఆఫీసులో బాగా లేటైంది. మెహిదీపట్నంలో దిగుతున్నప్పటికి పదిన్నర అయివుంటుంది. ఈలోగా నా భార్య ఫోన్ చేసింది: “స్నానం చేస్తవా? వేడినీళ్ళు పెట్టన్నా?”
నేను మామూలుగా రెండు పూటలా స్నానం చేస్తాను. కానీ ఇవ్వాళ ఇంత లేటైంది కాబట్టి, ఇప్పుడు కూడా స్నానం చేస్తానా అని తన అనుమానం. ఎటూ ఇంకో పది, పదిహేను నిమిషాల్లో ఇల్లు చేరతాను కాబట్టి, ‘సరే, పెట్ట’మన్నాను.
దిగేప్పటికి రాత్రి జిల్లా సర్వీసులు, పోయేవాళ్ళు, వచ్చేవాళ్ళు… రద్దీ పలుచబడింది కానీ జనం ఇంకా ఉన్నారు. అయితే, పోలీసులు వేసే ట్రాఫిక్ కంచెకు ఆనుకొని ఒకాయన కూర్చుని వుండటం గమనించాను. అయితే అది కూర్చున్నట్టుగా లేదు, పడిపోతూవుండగా కూలబడినట్టు ఉంది. వయసులో బాగా పెద్దాయన. ‘డెబ్బై ఎనిమిదేళ్ళు’ ఉంటాయి! ఒకాయన ఆయన్ని లేపడానికి ప్రయత్నిస్తున్నాడు. ఎటూ ఒకతను అటెండ్ అవుతున్నాడు కాబట్టి, పైగా ఇంటికి వెళ్ళడానికి ఆలస్యం అవుతోంది కాబట్టి, దాటిపోదామనే అనుకున్నాను క్షణం; కానీ మనసొప్పలేదు.
“ఏమైందండీ?”
“ఏమో, నేను వచ్చేసరికి ఇక్కడ పడిపోయున్నాడు,” అని నాకు చెబుతూ, ముసలాయన్ని పేరు, ఊరు అడుగుతూ మాట్లాడించడానికి ప్రయత్నించాడు. ముసలాయన ప్రశ్న ప్రశ్న కల్లా ‘ఊ’ అంటాడు కానీ జవాబివ్వడు. స్పృహలో లేడా అంటే అదేం లేదు. ఇంక అతనికి విసుగొచ్చో, లేక ఇంకేం కారణమో, అలాగే వదిలేసి వెళ్ళిపోయాడు. దాంతో నేను ఒక్కడినే అయిపోయాను ఇప్పుడు.
“ఏం తాతా, ఎక్కడికెళ్ళాలి?” “ఏ ఊరు మీది?” “ఎక్కడినుంచి వస్తున్నారు?” మళ్ళీ అవే ప్రశ్నలు నేను వేశాను. పెద్దాయన మళ్ళీ అలాగే, ‘ఊ’ అంటాడు, కానీ జవాబివ్వడు. ఇదేం లొల్లిరో!
“ముసలోడు తాగిండంటవా అన్నా?” నా పక్కకు వచ్చి, నేను ఇంతకుముందు నా ముందతనికి ‘సెకండ్’గా నిల్చున్న పొజిషన్లో నిల్చున్న ఒక యవకుడు అడుగుతున్నాడు నన్ను.
ముసలాయన మోచేతికి తగిలించి ఒక చిన్న బ్యాగ్ ఉంది. టక్ చేసుకుని వున్నాడు. పెద్దమనిషి తరహానే కనబడుతున్నాడు. “వాసన ఏం రావట్లేదబ్బా”!
“జేబులో ఫోన్ ఉందా తాతా?” గట్టిగా అడిగాను.
“ఊ”
“ఫోన్?”
“ఊ”
“ఫోన్ తాతా ఫోన్?”
“ఊ”
లాభం లేదని, ఆయన జేబులో చెయ్యి పెట్టబోయాను. అయితే, ఆయనే నాకంటే ముందు అందులో చేయి పెట్టాడు; కానీ ఫోన్ ఇవ్వడు. “నేనేం ఎత్తుకపోను తాతా!” అని ఇంకా లోపలికి పెట్టాను. ఆయన అంతకంటే బలవంతంగా నన్ను అడ్డుకున్నట్టు అనిపించింది. అయితే, అది అడ్డుకోవడం కాదనీ, నాకు ఆయన సహకారం అందించడానికే ప్రయత్నిస్తున్నాడనీ, శరీరం ఆయన వశంలో లేకపోవడం వల్ల నన్ను తోసేసినట్టుగా నాకు అనిపించిందనీ, తర్వాత నాకు అర్థమైంది.
ఫోన్ తీసుకుని, రీసెంట్ కాల్స్ చూశాను. జవాబు ఎటూ చెప్పేట్టుగా లేడు కాబట్టి, ఆబ్జెక్టివ్ ప్రశ్నలు మాత్రం అడగదలిచాను.
“ఈ శిరీష ఎవరు? మీ బిడ్డనా?”
“ఊ”
అది, ఊ? అని ఎదురు ప్రశ్నలా కాక, ఊ! అని జవాబులా వినిపించింది.
కాల్ చేసి “ఈ నంబర్ ఎవరిదండీ?” అడిగాను.
“మా నాన్నది; ఏమైందండీ?” కంగారుగా అడిగిందామె.
“మెహిదీపట్నంలో పడిపోయి వున్నారు; పిల్లర్ నంబర్ 13 దగ్గర…”
“ప్లీజ్ మీరు అక్కడే ఉండరా! నేను మా అన్నయ్యను పంపిస్తా…”
బర్కత్‌పురాలో ఉంటారు వాళ్ళు. ఈయన పేరు ఎల్లారావు. రిటైర్డ్ డాక్టర్. వరంగల్‌లో ఏదో ఫంక్షన్ ఉంటే వెళ్ళి వస్తున్నారు. అత్తాపూర్‌లో ఇంకో కూతురో, కొడుకో వుంటే అక్కడికి వెళ్తున్నారు.
మళ్ళీ కాసేపట్లో ఆవిడే ఫోన్ చేసింది. “మా వదినవాళ్ళబ్బాయి వస్తున్నాడు. నాన్నకు షుగర్. ప్లీజ్ ఏదైనా ఫ్రూటీలాంటిది కొనివ్వరా… ప్లీజ్?” ప్లీజ్‌ను చివర కూడా యాడ్ చేస్తూ అడిగిందామె.
అదా సంగతి! షుగర్ లెవెల్స్ పడిపోవడం అని వినడమే గానీ, అయితే ఇది అదన్నమాట! నా సెకండ్‌తోపాటు, అప్పటికే థర్డ్, ఫోర్త్ కూడా వచ్చున్నారు– పెద్దాయన్ని వాళ్ళను చూస్తూ వుండమని చెప్పి, పరుగెత్తాను. ఒకషాప్ ముందు కూల్ డ్రింక్స్ అని ఉంది; కానీ అందులో అది లేదు. ఇంకోదాన్లో ఉంటుందనుకున్నాను; లేదు. ఈలోగా ఇంకో నంబర్ నుంచి కాల్ రావడం మొదలైంది, “…ఎక్కడ పడిపోయారండీ?” అంటూ. మామయ్య అందా, నాన్న అందా? పిల్లర్ నంబర్ థర్టీన్ అని చెప్పాను. రోడ్డుకు అటువైపా? ఇటువైపా? రైతుబజార్‌కు ఎంతదూరం? కుడిపక్కా, ఎడమపక్కా? అంటూ వచ్చిన ప్రశ్నలకు జవాబు చెబుతూనే ఇంకో షాపులోకి వెళ్ళాను. నేను అడిగింది కాక ఇంకేదో పేరు చెప్పి, అది ఉందన్నాడు. అది కూడా మామిడి పళ్ళ రసమే కాబట్టి, ఇమ్మన్నాను. యాబై ఇస్తే ముప్పై తిరిగిచ్చాడు. పట్టుకొచ్చి, తాగిపించాం. దానిక్కూడా ఆయనకు శక్తి లేదు నిజానికి, కానీ దాన్ని వెంటనే తాగాలన్న స్పృహ కనబడింది. కాబట్టి, గటగటా తాగడానికి శాయశక్తులా ప్రయత్నించాడు. దాన్నిబట్టే ఇది ఆయనేమీ మొదటిసారి కాదు ఇలా పడిపోవడం అని అర్థమైంది. ఫోన్లో ఆమె చెప్పింది కూడా, ఒక పది నిమిషాల్లో మామూలయిపోతారూ అని.
ఈలోపు మళ్ళీ ఫోనొచ్చింది. చెప్పాను, అవే వివరాలు, అదేలాగా!
అన్నట్టుగానే, ఆయనలో ఎనర్జీ లెవెల్స్ పెరగడం కూడా క్రమంగా కనబడింది. నడుము ఎత్తి కూర్చుని, నెమ్మదిగా తడబడుతూ లేచి, స్థిరంగా నిలబడి, ఆయన మా అందరికీ షేక్‌హ్యాండ్ ఇచ్చారు. ఆ క్రెడిట్ మొత్తం నాకు ఎక్కడో దక్కదోనని, నాకే ఎక్కువ దక్కాలన్నట్టుగా కూడా, ‘ఈ అన్ననే మీకు జ్యూస్ బాటిల్ తెచ్చింది,’ అని ఆ సెకండ్ నన్ను పరిచయం చేశాడు. చిరునవ్వుతూ, నా గదువను ఆత్మీయంగా పట్టుకున్నాడాయన. ఇంకా ఏవేవో వివరాలు, నగరంలో కొత్తగా అద్దెకు ఉంటున్న ఆ విద్యార్థి కాబోలు రాబడుతున్నాడు.
ఆయన వయసు, పేరు, ఇప్పుడు స్థిరంగా నిలబడినప్పుడు చెప్పడం వల్ల తెలిసినవే. బస్సులో ఉన్నప్పుడే ఈయన ఎంతకూ కదలకపోతే, ఆ సెట్విన్ కండక్టరే ఎత్తుకొచ్చి, ఇక్కడ ఇలా కూర్చోబెట్టి వెళ్ళాడట!
ఈలోగా నాకు మళ్ళీ ఫోనొచ్చింది. “అదే చెప్పాను కదండీ, పిల్లర్ నం.13. పోలీసులు ఇలా ట్రాఫిక్కు అడ్డుగా వేశారు చూడండీ, అక్కడే…”
అప్పుడే కార్లో వచ్చిన ఆ ‘మనవడు’ నేరుగా వచ్చి, ఆ తాతయ్య రెక్కను పట్టుకొని, రోడ్డు పక్కగా కారు ఆపాడు కాబట్టి, అది ఎక్కువగా ఆపడం పద్ధతి కాదు అన్నట్టుగా త్వరత్వరగా లాక్కెళ్ళినట్టుగా తీసుకెళ్తూ అంటున్నాడు: “రెండు సార్లు ఇట్లా రౌండు కొట్టాను తెలుసా? ఇక్కడుండి, మీరు రోడ్డుకు అటువైపు ఉన్నట్టు చెప్తారేంటి?”
ఎదురుగా వచ్చి నన్ను కౌగిలించుకున్నంత పనిచేస్తాడేమో అనుకున్నదానికి ఇది పూర్తి విరుద్ధ స్పందన. నాకు నవ్వొచ్చింది. మనుషులకెంతట్లో అసలైన విషయాలు అప్రస్తుతమైపోయి, కొసరు విషయాలు ప్రస్తుతమైపోతాయి!
ఇంటికి వెళ్ళాక, తలుపు తీసి, నేను ఉన్న మూడ్ ఏమిటో తెలిసే అవకాశం లేని నా భార్య అడిగిన మొదటి ప్రశ్న: “నీళ్ళు మసిలీ మసిలీ మానెడైనయ్; ఎప్పుడొస్తాన్నవ్, ఎప్పుడొచ్చినవ్?”
బాత్రూమ్ లోకి వెళ్ళాక, పగలబడి నవ్వాలన్న ఆలోచనను బలవంతంగా అణచుకున్నాను.