వానకూడా వింతే!

చుట్టపు చూపుగా వచ్చినవాళ్ళు
చూసి పోవాలే తప్ప
ఉండి పోకూడదు
గదులు ఖాళీలుండవు
మదులూ ఖాళీలుండవు

కొంప కొల్లేరయినా
ఊరు వేగై అయినా
కొలువు తప్పదు
చెదిరిపోతుందని తెలిసినా
ముస్తాబు తప్పదు

వీధి గుమ్మంలోంచి
వెళ్ళిపోవాల్సిన వానలకి
నగరమెప్పుడూ సిద్ధం కాదు
డ్రైనేజీల్లేని నగరాలు
గొడుగుల్లేని జవరాళ్ళు

తడిసి తడిసి ప్రవహించడమేతప్ప –
వెలుతుర్లేని చీకట్లో
చెప్పకుండా వచ్చి వెళ్ళిపోతే మంచిది
ఉదయానికీ ఉద్యమానికీ
అడ్డు పడకూడదు

వానని ప్రేమించడానికి
ఆకుపచ్చని అడవిని ఊహించడానికి
స్థిమితం కావాలి

ఎప్పుడైనా వాన కురిసినరోజు
సెలవు ప్రకటిస్తే బావుణ్ణు
ఇంటిముందు కాగితప్పడవల్తో
దారాల వానలో
గెంతులేయచ్చు
ఘల్లునమోగే జల్లులో
జవరాలిలా