ఈమాటలో వ్యాఖ్యలపై ఒక పరిశీలన

ముందుమాట

ఈమాటలో ప్రచురించబడ్డ ప్రతి కథ పైనా, ఒక వ్యాఖ్య రూపంలో తమ అభిప్రాయాన్ని తెలియపర్చే సౌకర్యాన్ని పత్రిక సంపాదకవర్గం పాఠకులకు కల్పించింది. ఈ వ్యాఖ్యలు ఎలా ఉండాలి, ఎలా ఉంటే మంచిది అనే విషయం, పాఠకులకు సూచనలులో ఉంది.

ఈ వ్యాఖ్యలవల్ల మూడు ఉపయోగాలున్నాయి.

  1. తాము అందించిన రచన పాఠకులకు ఏ మేరకు నచ్చిందనే విషయం, పత్రిక సంపాదకులకు తెలియటం. తమకు అందిన పాఠకుల నాడిని పరిగణనలోకి తీసుకుని, అవసరమనిపించిన చోట రచనల ఎంపికలో తగిన మార్పులు చేసుకునే వీలు సంపాదకవర్గానికి కలగటం.
  2. తన రచన పాఠకులని ఎంతవరకు కదిలించిందనే విషయం, రచయితకి తెలిసిరావటం. వ్యాఖ్యలలో వెలిబుచ్చిన అభిప్రాయాలద్వారా తమ రచనలో గుణదోషాలపట్ల ఒక అంచనాకి రాగలగటం.
  3. ఆ రచన చదివిన పాఠకులు తమకు అర్థం కాని విషయాన్ని, తాము పట్టుకోలేని కోణాన్ని; మిగిలిన పాఠకుల వ్యాఖ్యల సహాయంతో అవగాహనలోకి తెచ్చుకోవటం, ఆ రచనని మరింత సమగ్రంగా అనుసరించగలగటం. తద్వారా తమ ఆలోచనాపరిధిని విస్తృతం చేసుకోవటం.

వ్యాఖ్యలపై పరిశీలన ఎందుకు?

ఈమాట సెప్టెంబర్ 2017 సంచికలో గణపతి-అంతుచిక్కని దేవుడు అనే కథ ఉంది. ఈ కథపై పాఠకులు చేసిన వ్యాఖ్యల్లో, ఒకదాని క్రింద (నా వ్యాఖ్యలు కేవలం సరదా కోసమే) అని ఉంది. రచనపై విలువైన అభిప్రాయం వ్యక్తపరచడానికి ఉద్దేశించబడిన స్థలాన్ని, అవకాశాన్ని, సరదా తీర్చుకోవడానికి ఉపయోగించుకోవటమా? అనిపించింది. అలా ఉపయోగించుకోవటం వెనుక ఉద్దేశాన్ని ఒక పాఠకుడు నిస్సంకోచంగా బహిరంగపర్చడం కొంచెం బాధ కూడా కలిగించింది.

పై వ్యాఖ్యతో పాటు, ఈమాట గత ఆరు సంచికల్లో కథలపై మరికొన్ని వ్యాఖ్యలు స్థాలీపులాక న్యాయంగా చూశాను. వాటిని ఈమాట ఇచ్చిన మార్గదర్శక సూచనలతో అన్వయించాను. ఈమాట ఇచ్చిన సూచనలకూ, పాఠకుల ఆచరణకూ మధ్య చాలా తారతమ్యం కనపడింది.

ఈ నేపథ్యంలో, గత ఆరు సంచికల్లో వచ్చిన కథలపైన వ్యక్తపరచబడ్డ వ్యాఖ్యలన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలిస్తే అనిపించింది. వాటినన్నిటినీ ఒకచోట క్రోడీకరించాను. నిశితంగా చదివాను.

ఎన్ని కథలు-ఎన్ని వ్యాఖ్యలు?

గత ఆరు సంచికల్లో వచ్చిన కథలు 29. కాని, సెప్టెంబర్ 2017 సంచికలో కథగా ప్రచురించబడ్డ గణపతి-అంతుచిక్కని దేవుడు అనే రచన తదుపరి భాగాలు, తర్వాత సంచికల్లో వ్యాసాలుగా ప్రచురించబడ్డాయి. అందువల్ల, ఈ రచన మొదటి భాగాన్ని నేను కథగా తీసుకోలేదు. ఈ కథపై 28 వ్యాఖ్యలు ఉన్నాయి. అవి నా విశ్లేషణ పరిధిలోకి తెచ్చుకోలేదు.

తతిమ్మా 28 కథల్లో, 5 కథలపైన అసలు వ్యాఖ్యలే లేవు. మిగిలిన 23 కథలపై మొత్తం 134 వ్యాఖ్యలు ఉన్నాయి. వీటిలో– 1 వ్యాఖ్య ఉన్న కథలు మూడు. 2 వ్యాఖ్యలు ఉన్నవి మూడు కథలు. 3 వ్యాఖ్యలు ఉన్న కథలు అయిదు. 4 వ్యాఖ్యలు ఉన్నవి నాలుగు కథలు. 5 వ్యాఖ్యలు ఉన్న కథలు రెండు. 6 వ్యాఖ్యలు ఉన్నవి రెండు కథలు. 9, 13, 23, 27 వ్యాఖ్యలు ఉన్న కథలు ఒక్కొక్కటి.

రచయితల వ్యాఖ్యలు

తన కథ పట్ల పాఠకులు వ్యక్తం చేసిన అనుమానాలపైన, తన కథలో పాఠకులు ఉందని భావించిన అస్పష్టత మీద; ఆ కథారచయిత సరయిన రీతిలో స్పందిస్తే– ఆ కథని పాఠకులు మరింత సమగ్రంగా అవగాహన చేసుకోగలరు. ఈ అవసరాన్ని దృష్టిలో పెట్టుకునే కాబోలు, ఈమాట ఇచ్చిన సూచనల్లో వ్యాఖ్యలకు రచయితలు స్పందించే విషయం గురించి ఎలాంటి నిబంధనా లేదు.

134 వ్యాఖ్యల్లో, పద్దెనిమిది వ్యాఖ్యలు, ఆయా కథారచయితలు చేసినవే. వీటిలో, నవంబర్ 2017 సంచికలో వచ్చిన కథ జ్ఞాపిక క్రింద రచయిత చేసిన ఒక్క వ్యాఖ్య మాత్రమే ఒక పాఠకుడు వ్యక్తం చేసిన అనుమానాన్ని తీర్చే ప్రయత్నం చేసింది. అంతకు ముందే ఆ బాధ్యత నెరవేర్చిన మరో పాఠకుడికీ, కథ బాగుందన్న ఇంకో పాఠకుడికీ సైతం ఈ వ్యాఖ్య ధన్యవాదాలు తెలిపింది.

మిగిలిన పదిహేడు వ్యాఖ్యల్లో– ఒకే పాఠకుడికి, ఒక రచయిత చెప్పిన రెండు ధన్యవాదాలు కూడా ఉన్నాయి. శేషవ్యాఖ్యలేవీ కథ పట్ల పఠితలు వ్యక్తం చేసిన అనుమానాలని నివృత్తి చేసినవి కావు. పఠిత అవగాహనని పెంచటానికి ఉద్దేశించినవి ఏవీ వీటిలో లేవు. క్లుప్తంగా చెప్పాలంటే ఇవన్నీ, తమ కథలపై సానుకూలంగా స్పందించిన వ్యాఖ్యలకు రచయితలు తెలిపిన ధన్యవాదాలు.

ఒక కథ బాగుందని చెపితే, కథయితకూ పత్రిక సంపాదకవర్గానికీ తమ కథల ఎంపిక పట్ల తృప్తి కలుగుతుంది. ఎక్కువమంది బాగుందన్న కథ, మిగిలిన పాఠకుల్ని చదివేలా చేస్తుంది. కనుక, అలాంటి వ్యాఖ్యల వల్ల నిర్వివాదంగా కొంత ప్రయోజనం ఉంది. కాని, కథని బాగుందని అన్న పాఠకుడికి రచయిత/రచయిత్రి చెప్పిన ధన్యవాదాలతో ఎవరికయినా ఎలాంటి ఉపయోగం ఉందని నేననుకోను.

ఏ భాషలో ఎన్ని వ్యాఖ్యలు

134 వ్యాఖ్యల్లో, కథయితలు చెప్పిన 17 ధన్యవాదాలు తెలుగు లిపిలోనే ఉన్నాయి. మిగిలిన 117 వ్యాఖ్యల్లో 94 వ్యాఖ్యల్లో, కొన్ని ఆంగ్లపదాలు ఉన్నా, వ్యాఖ్యలు మాత్రం తెలుగు లిపిలో ఉన్నాయి. తతిమ్మా 23 వ్యాఖ్యల్లో, పద్నాలుగు ఆంగ్ల లిపిలోనూ, తొమ్మిది తెలుగు లిపిలోనూ రాయబడ్డాయి.

ఒక పాఠకుడు తన వ్యాఖ్యలన్నీ ఆంగ్లలిపిలోనే నమోదు చేసి ఉంటే, తెలుగు సాఫ్ట్‌వేర్ అందుబాటులో లేకపోవటం, తెలుగులో టైప్ చేయలేకపోవటం లాంటి సాంకేతికపరమయిన ఇబ్బందుల్ని ఆటంకంగా చెప్పుకోవచ్చు. కాని ఇలా రెండు భాషల్నీ వాడిన అయిదుగురు పాఠకులు; తెలుగులిపిలో 19 వ్యాఖ్యలు, ఆంగ్లలిపిలో ఒక వ్యాఖ్య, రెండు భాషల్లో కలిపి ఏడు వ్యాఖ్యలూ నమోదు చేశారు.

వ్యాఖ్యల్లో అక్షరదోషాలు

ఎవరు ఏది రాసినా, తాము రాసినదాన్ని ఒకటికి రెండుసార్లు తామే చదివి చూసుకుంటే; అభిప్రాయ వ్యక్తీకరణ సరిగా చేశామా లేదా అనేది మాత్రమే కాకుండా; తాము రాసిందాంట్లో అక్షరదోషాలేమన్నా ఉంటే వాటిని సరిచేసుకునే అవకాశం కూడా చిక్కుతుంది.

కాని, కథలక్రింద కొన్ని వ్యాఖ్యలు ఈ రకమయిన స్వీయపరీక్షకు గురయినట్లు కనిపించదు. ఈ క్రింది అక్షరదోషాలు, ఈ అభిప్రాయాన్ని నిర్ద్వంద్వంగా బలపరుస్తాయి.

1. చాట(చేట) 2. విద్యార్ధి(విద్యార్థి) 3. బద్ధకం(బద్దకం) 4. రాస్తునవి(రాస్తున్నవి) 5. భాద్యతారాహిత్యం(బాధ్యతారాహిత్యం) 6. ఆర్కేనారయణ్(ఆర్కేనారాయణ్) 7. కధావస్తువు(కథావస్తువు), 8. ఎందులొనీ(ఎందులోని) 9. మధు ఛిత్తర్వు(మధు చిత్తర్వు) 10. అర్ధమయింది(అర్థమయింది) 11. కధారచయితగా(కథారచయితగా) 12. బొలెడన్ని(బోలెడన్ని) 13. కధాలోకాన్ని(కథాలోకాన్ని) 14. బాణీలొ(బాణీలో) 15. ఝళిపిస్తానరి(ఝళిపిస్తారని) 16. కలిగె(కలిగే) 17. కవితతొ(కవితతో) 18. అర్ధం(అర్థం) 19. ఊన్నాయో(ఉన్నాయో).

అర్థం కాని అక్షరాలు

ఈ రెండు వ్యాఖ్యల చివర ద. హా., చి న, అనే అక్షరాలు కనపడ్డాయి. వీటి అర్థం తెలీలేదు.

  1. మీ ఎయిర్‌లైన్స్ కథలలో ఈ బండల రహస్యం ఇంకా బాగుందండి. పాపం గుప్తా గారు… ద.హా.
  2. ప్రేమ మీద కొన్ని వందల వేల సినిమా రీళ్ళు, కొన్ని లక్షల పేజీలు అందరూ వ్రాసేస్తుంటే ఇలా ఒక పన్నెండు పారాగ్రాఫుల్లో వ్రాసి మామీద విసిరేస్తే ఎలా చంద్ర గారు! చి న

పాఠకులపై వ్యాఖ్యలు

అభిప్రాయాలు రచయితని లేదా ముఖ్యసంపాదకుడిని సంబోధిస్తూ రాయండి. సాటి పాఠకులను నేరుగా సంబోధిస్తూ రాయకండి– అని ఈమాట, తన సూచనల్లో స్పష్టంగా పేర్కొంది. అయినా ఈ క్రింది కథల దిగువన ఉన్న వ్యాఖ్యల్లో సహపాఠకుడిని నేరుగా ఉద్దేశించి రాసిన వ్యాఖ్యలు ఉన్నాయి. ఇవి ఆ పాఠకులనుంచి మరికొన్ని వ్యాఖ్యలకు దారి తీశాయి.

జులై 2017: పిచ్చి వెంకట్రావు, 10/17: శిక్ష, Rxమారేజ్.

పొగడ్తలు

విమర్శనము అంటే శబ్దార్థచంద్రిక ఇచ్చిన ఒక అర్థం పర్యాలోచనము. ఈ పదానికి అర్థం, చక్కగా ఆలోచించుట. వ్యాఖ్యలు రాసే విషయంలో; ఈమాట ఇచ్చిన సూచనల్లో అంతర్లీనంగా ఉన్న భావం, పాఠకులని చక్కగా ఆలోచించి వ్యాఖ్య రాయమనే. వ్యాఖ్య, ఒక రచనపై పాఠకుడి విమర్శ. విమర్శ అంటే ప్రతికూలస్పందన ఒక్కటే కాదు- సానుకూలస్పందన కూడా. పొగిడినా, తెగిడినా అది సహేతుకంగా ఉండాలి. ధన్యవాదాలు పోను మిగిలిన 116 వ్యాఖ్యల్లో 90 వ్యాఖ్యలు కథ బాగుందని చెప్పినవే. వాటిలో ఒక పొగడ్తలో ప్రశ్న, ఒక దానిలో రచయితకి సలహా, మరొకదానిలో ఈమాట పత్రికకి సలహా సైతం ఉన్నాయి.

కథాంశాన్ని వదిలేసిన వ్యాఖ్యలు

మిగిలిన వాటిల్లో, కొన్ని వ్యాఖ్యలు; రచనలో ఉన్న ప్రధాన విషయాన్ని వదిలేసి మిగిలిన విషయంపై విస్తృత చర్చ చేసినవి. ఉదాహరణకి రెండు కథలపై కొన్ని వ్యాఖ్యలు.

మొదటిది: పూర్ణిమ తమ్మిరెడ్డిగారి కథ Rxమారేజ్. ఈ కథలో ప్రధానాంశం ఒక స్త్రీ, తన అందవిహీనత వలన అవివాహితగా మిగిలిపోవటంతో ఆమెలో కలిగిన అంతర్మథనం. కాని, ఈ కథపై వ్యక్తపరచబడ్డ వ్యాఖ్యల్లో, అయిదు వ్యాఖ్యలు అసలు కథాంశాన్ని వదిలేసి, కథలో ప్రస్తావించబడ్డ ప్రిస్క్రిప్షన్‌లో రాయబడ్డ వివరాల గురించి విపులంగా చర్చించటానికి ప్రయత్నం చేశాయి. ఒక వ్యాఖ్య మాత్రమే తన అస్తిత్వాన్ని బలంగా నిరూపించుకోవటానికి, అది తప్ప మిగిలిన కథలో ఇంకేమీ కనపడలేదా? అంటూ సూటిగా, కచ్చితంగా ప్రశ్నించింది. దానిపై ఎలాంటి స్పందనా లేదు.

రెండవది: మధురాంతకం రాజారాంగారి కథ పిచ్చి వెంకట్రావు. ఈ కథలో ప్రధానపాత్ర వెంకట్రావు. ఇతివృత్తం వెంకట్రావు ప్రవర్తనా, ఆయన గత, వర్తమాన జీవితమూ. వీటిద్వారా రచయిత మనకు చెప్పదలుచుకున్న విషయం, ఒక వ్యక్తి బాహ్యజీవితాన్ని ఆధారం చేసుకుని అతడి వ్యక్తిత్వాన్నీ, వ్యక్తితత్వాన్నీ అంచనా వేయకూడదని; ఆ రకమయిన ప్రయత్నాలు, అందరి విషయాల్లోనూ సఫలీకృతం కావనీ.

ఈ నిజాన్ని నిరూపించటానికి రచయిత ఎంత కథనం సాగించారనేది వదిలేసి బాణావరం అనే ఊరు ఎక్కడ ఉందనేదాని చుట్టూ కొన్ని వ్యాఖ్యలు దృష్టి సారించాయి.

ఇతర వ్యాఖ్యలు

వీటికి తోడుగా, కొన్ని ఇతర వ్యాఖ్యలు ఏం చేశాయో కూడా పరిశీలిద్దాం.

ఆగస్టు 2017-హైకూ: కథపై ఉన్న ఒక వ్యాఖ్య కథ గురించి కాకుండా, రచయిత ఇప్పుడు మన మధ్య లేకపోవడం గురించి పరోక్షంగా చేసింది.

జులై 2017-గెలుపు: కథపై ఉన్న వ్యాఖ్యల్లో ఒకదానిలో-తెలుగులో ఉన్న భాగం, ఆ కథ రచయిత కథనాన్నీ, శిల్పాన్నీ పొగిడినది. ఇంగ్లీషులో ఉన్న భాగం-ఆ కథారచయిత ఇప్పుడు రాస్తున్న కథాంశాలని స్పృశిస్తూ, ఇకముందు రాయబోయే కథల్లో ఈ ధోరణి మారాలని సలహా ఇచ్చినది.

సెప్టెంబర్ 2017-Breakrooమోపాఖ్యానం, అక్టోబర్ 2017-Walmart: ఈ కథలపై ఉన్న వ్యాఖ్యల్లో ఒక్కొక్కటి, కథయిత తన కథకి ఇచ్చిన ముగింపుతో తృప్తి చెందకుండా; పాఠకుడిగా తాను ఇవ్వదలుచుకున్న ముగింపును రాసినది.

సెప్టెంబర్ 2017-బ్రేకప్: ఈ కథమీద ఉన్న రెండు వ్యాఖ్యల్లో ఒకటి, చదివిన కథని చెత్తకథగా అభివర్ణించినది. రెండోది, ఆ వ్యాఖ్య చేసిన పాఠకుడి అభిప్రాయానికి మద్దతునిస్తూ, అక్కడితో ఆగకుండా, ఈమాట సంపాదకవర్గానికి ఉద్దేశాలని ఆపాదించినది, ఆ కథ ప్రచురించబడటానికి కారణాలని ఊహించినది.

నవంబర్ 2017 సంచికలో వచ్చిన బండలు కథపై ఉన్న వ్యాఖ్య కొంత వ్యంగ్యం ధ్వనించినది.

అక్టోబర్ 2017 సంచికలో వచ్చిన Rxమారేజ్‌పై ఒక వ్యాఖ్య పూర్తిగా ఇంగ్లీషులో ఉన్నది. ఇందులో మూడు భాగాలున్నాయి. చివరి రెండు భాగాలూ, సాటి పాఠకుల వ్యాఖ్యలపై చేసిన వ్యాఖ్యలు. మొదటి భాగం దాని అర్థం తెలుసుకోవటంలో నా వైఫల్యాన్ని ఎత్తిచూపినది.

చివరి మాట

నా వడపోతలో మిగిలినవి ఏడే ఏడు వ్యాఖ్యలు. అవి ఇవి.

అక్టోబర్ 2017 కథ Rxమారేజ్: అయిదు వ్యాఖ్యలు.
జులై 2017 కథ గెలుపు: ఒకటి.
జులై 2017కథ పిచ్చి వెంకట్రావు: ఒకటి.

ఇవి మాత్రమే తాము చదివిన కథ తమకు ఎందుకు నచ్చిందో/నచ్చలేదో, కనీసం తమ దృక్పథంనుంచి వివరంగా బలంగా చెప్పినవి. ఈమాట సూచనలకి కొంతవరకూ కట్టుబడి, నిర్దేశించిన ఫలితాన్ని సాధించటానికి తమ శక్తి మేరకు ప్రయత్నించినవి.

తూర్పారపట్టగా వ్యాఖ్యలరూపంలో మన చేతికొచ్చిన వాక్యధాన్యరాశులే, మనం అక్షరసేద్యం ఎంత బాగా చేశామో చెప్పేది!

టి. చంద్రశేఖర రెడ్డి

రచయిత టి. చంద్రశేఖర రెడ్డి గురించి: ఖమ్మం జిల్లాలోని వైరాలో జన్మించిన చంద్రశేఖర రెడ్డి ఉద్యోగవిరమణానంతరం వైరాలోనే విశ్రాంతజీవనం గడుపుతున్నారు. పుస్తక పఠనం, చిత్రలేఖనం, సంగీత శ్రవణం ఆయన అభిరుచులు. ...