గణపతి: అంతు చిక్కని వింత దేవుడు-1

‘అమెరికాలో ఉంటూ మన పిల్లలకు మన పద్ధతులు, సంప్రదాయం ఏం తెలియకుండా పెంచుతున్నాం!’ అని అందరూ ప్రవాస భారతీయుల్లాగే మా ఆవిడ కూడా అప్పుడప్పుడు బాధపడుతూ ఉంటుంది. అందుకేనేమో, మొన్న వినాయక చవితి రోజు తను ఆఫీసుకు, పిల్లలు స్కూలుకు వెళ్ళే తొందరలో ఉన్నా, ప్రొద్దునే లేచి, తలస్నానం చేసి, ఒక చిన్న పసుపు గణపతిని తయారు చేసింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారు చేసిన రంగు బొమ్మలు వాడక పోవడం పర్యావరణ రీత్యా మంచిదని తనూ నమ్ముతుంది కాబట్టి ఇండియన్ స్టోరులో దొరికే రంగు రంగుల గణపతి బొమ్మలు కొనడం ఏనాడో మానివేశాం. అంతలో స్నానం చేసి కిందికి వచ్చిన పిల్లలకు తను తయారు చేసిన గణపతిని చూపించి ఈ రోజు వినాయక చవితి అని, దేవునికి మొక్కుకున్న తరువాతే సిరియల్ తినాలని ఆదేశించింది. వాళ్ళతో పాటు తను కూడా మొక్కుతూ, వాళ్ళ చేత శుక్లాంబరధరం శ్లోకం కరక్టుగా చెప్పించడానికి ఆపసోపాలు పడుతూ ఉంటే, నేను పక్కన నవ్వుతూ నిలబడ్డాను.

“ఉత్సవవిగ్రహంలా నిలబడి ఊరికే నవ్వడమేనా? సాయం చేసేదేమైనా ఉందా?”

నేను నవ్వడం మానేశాను.

“అయినా, అంత నవ్వెందుకొస్తోంది?”

“నువ్వు స్వర్ణకమలం సినిమా చూశావు కదా? అందులో శ్రీలక్ష్మి వినాయకుని పటానికి హారతి పడుతూ- శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం అంటూ ఆంజనేయ దండకం చదువుతుంది గుర్తుందా? అది గుర్తుకు వచ్చి నవ్వుతున్నాను.”

“అదేమిటి, నేను చదివింది ఆంజనేయ దండకం కాదుగా? శుక్లాంబరధరం వినాయకుడి స్తోత్రమే కదా!”

శుక్లాంబరధరం అన్నది వినాయకుడి స్తోత్రమేనని చాలామంది అపోహపడతారు. ఈ స్తోత్రాన్ని జాగ్రత్తగా పరిశీలించి చూస్తే, ఎక్కడా వినాయకుడిని వర్ణిస్తున్న ఆనవాలు లేదు- అంటూ ఆ శ్లోకం పూర్తిగా చదువుతూ ఒక్కో పదాన్నే వివరించాను:

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే!

టీకా: శుక్ల = తెల్లని; అంబర = వస్త్రమును; ధరం = ధరించిన వాడిని; విష్ణుం = విష్ణువును; శశి = చంద్రుని; వర్ణం = రంగు గల; చతుర్ = నాలుగు; భుజం = భుజముల వాడిని; ప్రసన్న = సంతుష్టమైన; వదనం = ముఖము కలవాడిని; ధ్యాయేత్ = ధ్యానింతును; సర్వ = అన్ని; విఘ్న = అడ్డంకులు; ఉపశాంతయే = ఉపశమించుటకు / తొలగి పోవుటకు.

తాత్పర్యం: తెల్లని వస్త్రములు ధరించినవాడిని, విష్ణువును, చంద్రుని వంటి కాంతి గలవాడిని, నాలుగు భుజములు గలవాడిని, సంతుష్టమైన ముఖము గలవాడిని, అన్ని అడ్డంకులు తొలగింప జేయుటకై ప్రార్థిస్తున్నాను.

“చూశావా! ఈ స్తోత్రంలో శుక్లాంబరధరం విష్ణుం అంటే, తెల్లని బట్టలు ధరించిన విష్ణువును ధ్యానిస్తున్నాను– అంటూ స్పష్టంగా విష్ణువు గురించి చెప్పే శ్లోకమే అని తెలిసిపోతుంది.” అన్నాను.

“నిజానికి నా దృష్టిలో గణపతి ప్రాచీన గ్రామదేవతల్లో ఒకడు. వేదాల్లో కానీ, అతి ప్రాచీన సంస్కృత సాహిత్యంలో కానీ గణపతి ప్రస్తావన ఎక్కడా కనిపించదు.”

ఆఫీసులకు, స్కూళ్ళకి వెళ్ళాల్సిన వేళ కావడంతో ఆ చర్చ అక్కడితో (తాత్కాలికంగానే) ఆగిపోయింది. పిల్లలచే ఆ శ్లోకం పూర్తిగా చెప్పించి వాళ్ళను స్కూళ్ళలో దింపి మేము మా ఆఫీసులకు వెళ్ళిపోయాం.


సాయంత్రం ఇంటికి రాగానే, “నేను మా నాన్నకు ఫోన్ చేసి వినాయకుడి గురించి అడిగాను. ఆయన ఋగ్వేదంలోనే గణపతిని స్తోత్రం చేసే శ్లోకాలున్నాయని అన్నాడు. గణానాం త్వా గణపతిం హవామహే… అన్న శ్లోకం ఋగ్వేదం లోనే ఉందట.” అంటూ గౌరీ-శంకర సంవాదంలా, ప్రొద్దుటి వాదాన్ని మళ్ళీ తిరగతోడింది మా ఆవిడ.

“మీ నాన్నను తప్పు పట్టడం కాదు కాని, ఋగ్వేదంలో ఆ శ్లోకం బృహస్పతి గురించి చేసే స్తోత్రం, వినాయకుడి గురించి కాదు.” ఎప్పుడో పదేళ్ళక్రితం ఇంటర్నెట్లో చేసిన చర్చ గుర్తు తెచ్చుకుంటూ అన్నాను. ఎందుకైనా మంచిదని, తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రచురించిన సమూల ఋగ్వేద సంహిత పుస్తకం తీసుకువచ్చి ద్వితీయ మండలం లోని 23వ సూక్తములో ఈ శ్లోకం చూపించాను.

గణానామ్ త్వా గణపతిగ్‌ం హవామహే
కవిమ్ కవీనా ముపమశ్రవస్తవమ్।
జ్యేష్ఠరాజమ్ బ్రహ్మణామ్ బ్రహ్మణస్పత
ఆ నః శృణ్వన్నూతిభి స్సీద సాదనమ్॥

టీకా: గణానామ్= గణముయందు; త్వా= నిన్ను; గణపతిగ్‍ం= గణపతిని; హవామహే= ఆహ్వానించుచున్నాము; కవిమ్= కవిని; కవీనామ్= కవులలో; ఉపమ= పోలికలో; అశ్రవస్-తవమ్= మిక్కిలి అధికుడయిన వానిని; జ్యేష్ఠ రాజమ్= పెద్ద రాజు అయిన వాడిని (రాజాధిరాజును); బ్రహ్మణామ్= బ్రహ్మణ్యులలో; బ్రహ్మణస్పతే= బ్రహ్మణస్పతివి; ఆ= అయిన; శృణ్వన్= ఆలకించి; ఊతిభిః= కోర్కెలు తీర్చువాడవై ; సీద= అలంకరించుము; సాదనమ్= ఆసనము/స్థానము.

తాత్పర్యం: గణములకు అధిపతివి, విద్వాంసులలో విద్వాంసుడవు, పోల్చదగిన కీర్తి శ్రేష్టులకు కూడా నీవే పోలికవు, బ్రహ్మణ్యులలో బ్రహ్మణస్పతివి, పెద్దరాజువు/రాజాధిరాజువు అయిన నీవు మా కోర్కెలు తీర్చుటకు, మా ప్రార్థన ఆలకించి ఈ పూజా సమయము నందు ఈ స్థానమును లేక ఆసనమును అలంకరించుము.

నిజానికి ఈ సూక్తానికి అధిదేవత బృహస్పతి/బ్రహ్మణస్పతి. ఈ సూక్తంలో మిగిలిన శ్లోకాలన్నీ బృహస్పతి/బ్రహ్మణస్పతిని ఉద్దేశించి రాసినవే. గణపతి అంటే ఇక్కడ జనసమూహానికి అధిపతి. అంతే. నిజానికి ఇంద్రుణ్ణి కూడా ‘గణపతి’ అంటూ ప్రస్తుతించే శ్లోకం ఋగ్వేదంలోని పదవ మండలంలోని 112వ సూక్తంలో కనిపిస్తుంది:

ని షు సీద గణపతే గణేషు
త్వం ఆహుర్ విప్రతమం కవీనామ్।
న ఋతే త్వత్ క్రియతే కిం చనారే
మహామ్ అర్కమ్ మఘవఞ్ చిత్రమ్ అర్చ॥

తాత్పర్యం: ఆసీనుడవు కమ్ము, గణములయందు గణపతివి; కవులయందు ఉత్తమ విప్రుడవు; నీ ప్రమేయం లేకుండా ఏమి జరగదు: ఓ మహాత్ముడా; అద్భుతమైన వాడా; మఘవంతుడా (శ్రీమంతుడా); ఈ స్తోత్రముతో నిన్ను అర్చించెదను.

ఈ దశమ మండలపు 112వ సూక్తంలో అన్ని శ్లోకాలు ఇంద్రుణ్ణి స్తుతిస్తున్నవే. కాబట్టి ఈ స్తోత్రం కూడా మనం ఏనుగు ముఖంతో ఉన్న గణపతిని ప్రార్థించే శ్లోకం కాదు అని సులభంగానే గ్రహించవచ్చు.

“మరైతే, దేవతలందరూ వినాయకుణ్ణి ప్రథమ దేవుడిగా పూజిస్తారు, అని మనకు చిన్నప్పటి నుండి చెప్పారు కదా! మన సినిమాల్లో, కావ్యాల్లో కూడా గణపతినే మొట్టమొదటగా స్తుతిస్తారు. ఇవన్నీ తరువాత వచ్చినవేనా?” కుతూహలంగా అడిగింది మా ఆవిడ. (అడిగిన వెంటనే నాలుక కరుచుకుంది ఎప్పట్లానే.) దీర్ఘంగా ఊపిరి పీల్చుకున్నాను.

“సంస్కృత మహాభారతంలో గజముఖుడైన గణపతి ప్రస్తావన లేదు. మహాభారతంలో శివుడిని ఒకసారి గణేశునిగా ప్రస్తుతించిన శ్లోకం ఉంది. అంతేకాక, విష్ణువును గణేశ్వరునిగా కీర్తించడం కూడా కనిపిస్తుంది. వీరశైవులైన లింగాయతులు కూడా ఎక్కడా గణపతిని శివుని సుతునిగా ప్రస్తావించరు.శివుడు వారికి పరమేశ్వరుడైనా, వినాయకుడు దేవుడు కాదు వారికి. అలాగే, మన తెలుగు కావ్యాల్లో నన్నయ్య రాసిన మొట్టమొదటి పద్యంలో, శ్రీవాణిగిరిజాశ్చిరాయ… అంటూ త్రిమూర్తులైన బ్రహ్మవిష్ణుమహేశ్వరులను శ్రేయస్సు కోసం ప్రార్థిస్తూన్న ఈ పద్యంలో లక్ష్మీ, పార్వతి, సరస్వతుల ప్రస్తావనే తప్ప గణపతి/విఘ్నేశ్వరుని ప్రస్తావన ఎక్కడా కనిపించదు. అలాగే, తిక్కన మొదటి పద్యమైన శ్రీయన గౌరి నా బరగుచెల్వకు జిత్తము… అంటూ శ్రీ గౌరి ప్రస్తావనతో ప్రారంభించి, హరిహర స్తుతితో తన భారతాంధ్రీకరణను ప్రారంభించాడు. ఈ ప్రారంభ పద్యాల్లో ఎక్కడా గణపతి ప్రస్తుతి కనిపించదు. అయితే, ప్రబంధయుగంలో మాత్రం వినాయకుని ప్రస్తుతి, అవతారిక పద్యాల్లోనే మనకు కనిపిస్తుంది. పెద్దన రాసిన అంకముజేరి శైలతనయాస్తన దుగ్ధములానువేళ… చాలా ప్రసిద్ధమైన పద్యం. పోతన, కేతన అవతారిక పద్యాల్లో కూడా వినాయకుని స్తుతి కనిపిస్తుంది. నన్నెచోడుడు కూడా వినాయకుని స్తుతించాడు కానీ, అతడు నన్నయ్య సమకాలికుడంటే నేనొప్పుకొను.

అయితే, మరి ఈ గణపతి అనే దేవుడు ఎక్కడినుండి వచ్చాడు? వేదాలలో ఏ మాత్రం కనిపించని వినాయకుడు హిందూమతంలో ఇంతగా ప్రముఖ స్థానం ఎలా సంపాదించాడు?

గణపతి ఇప్పటికీ అంతు చిక్కని వింతదేవుడు. అయితే, గణపతి పుట్టుపూర్వోత్తరాల గురించి; ఇతిహాస, పురాణ కాలంలో గణపతిని వర్ణించిన వివరాల గురించి; బుద్ధ వాఙ్మయంలో గణపతి ప్రస్తావన గురించి; ఇతర కావ్యాల్లో, శాసనాల్లో గాణాపత్య తెగల గురించి ఇప్పటిదాకా మనకు తెలిసిన వివరాలు — వాటిగురించి పలుపండితులు వెలిబుచ్చిన అభిప్రాయాలు అన్నీ నీకు వివరంగా వివరిస్తాను. ముందు డిన్నర్ కానిద్దామా?”

(సశేషం)