ఏ భాషలోనైనా పడికట్టు మాటలని కొన్ని వుంటాయి. ‘ఆత్మబలం’ అనేది అలాంటివాటిలో ఒకటేమోనని నా అనుమానం! అడపా దడపా మనం వండుకుతినే ఒక కాయను నేతిబీరకాయగా వ్యవహరించడంలేదా! అలాంటి బలమే కావాలి, ‘ఆత్మబలం’ గూడా! సిసలైన భౌతిక దృష్టిలో లెక్కగడితే మనిషికున్న శక్తుల పరిమితి చాలా స్వల్పం! ఏదీ, ఒక పెద్ద రాతిగుండును తలకెత్తుకోమనండి చూద్దాం! చేతుల బలంతో ఒక చిన్న యినుపగుండును పిండిగొట్టమనండి, ఒప్పుకుందాం! అంతెందుకు, పిడికెడు ఉక్కు శనగలు నమిలి, మ్రింగి జీర్ణం చేసుకోవడమైనా సాధ్యం కాదే! వాస్తవం యిదై వుండగా లోకంలో ఎక్కడాలేని ఓ బలం తన అధీనంలో వున్నట్టు ఊహించి, దానికి అందంగా ‘ఆత్మబల’మని పేరుగూడా పెట్టుకున్న మానవుణ్ణి చూస్తుంటే జాలి పుట్టుకొస్తుంది! నా మనోరాజ్యపు వంటింట్లో కూర్చుని రకరకాల అపోహల పాలిటికి తిరుగులేని దివ్య రసాయనాలను తయారు చెయ్యడం నా వృత్తిగాదులెండి, హాబీ! ఆత్మబలమనే అపోహను పోకార్చడం కోసం ఘాటైన ఓ పేటంటు మందును తయారు చెయ్యడానికని ఒక వంటింటి కుందేటితో నాకెంతో కాలంగా అవసరం వుంది. చిరకాలానికి నా కోరిక నెరవేరింది. అయాచితంగా వో వ్యక్తి రంగంలో ప్రవేశించాడు…
అసలింతకూ పిచ్చి వెంకట్రావుగారికన్నా ముందుగా ఆయన కీర్తి మా వూళ్ళో అడుగు పెట్టిందని చెప్పాలి. మడతలు చెరిగి, ముడతలు పడిన దుస్తుల్నయినా ఆయన ఏమాత్రం బిడియం లేకుండా తొడుక్కోగలడు. తల దువ్వుకున్నాడన్న మాట ఆయన జీవిత చరిత్రలో ఎప్పుడో అరుదుగా గానీ కనిపించని విశేషం. శుభ్రంగా ఆయన చొక్కా గుండీలు వేసుకోగా చూసినవాళ్ళు లేరు.
మిట్టమధ్యాహ్నపు మిడిమిడి ఎండలో చెప్పులు లేని వట్టి పాదాలతో తారురోడ్డు పైన నడవగలగడం ఆయనకే చెల్లు! అలాగని యిలాంటి వాలకం వల్ల ఈయన లుబ్ధాగ్రేసరుడని ఒక నిర్ణయానికి రావడానికి సైతం వీల్లేకపోవడమే విచిత్రం! తుఫాన్లు, కరువులు, అగ్నిప్రమాదాల్లాంటి అవాంతరాలు వచ్చినప్పుడు (తన తరువాత వాళ్ళని మొగమాటంలో పెట్టాలన్న దురుద్దేశంతోనే కావాలి!) చందాల జాబితాలో తన అంతస్తుకు మించిన పెద్ద సంఖ్య వేయడం ఈయన రివాజు. అన్నింటికీ మించి ఈయన వ్యక్తిత్వంలో కొట్టవచ్చినట్టుగా కనిపించే ప్రత్యేక లక్షణం ఒకటుంది. అదేమిటంటే- తనను తాను మరచిపోవటం! ఆఫీసు రూంలో కూచుంటే దీపాలు వెలిగి జామురేతిరి గడచినా పని పూర్తయ్యేదాకా పైకి లేవడు. క్లాసులో పాఠం చెబుతుంటే గంట మ్రోగినా చెవిలో పడదు. రోడ్డుపైన ఏమాత్రం పరిచితుడు ఎదురైనా వాడి బాగోగులన్నీ సాకల్యంగా విచారించి, తన మూలంగా అతడికేదైనా తోడ్పాటు అవసరమనిపిస్తే, ఆ పని చేసిపెట్టిన తర్వాత గానీ ఆయన తృప్తిగా నిట్టూర్చడు. ఒకటా రెండా! ఇలా ఎన్నో లీలలు వెంకట్రావుగారివి! అన్నట్లు మరొక ముఖ్యమైన వర్తమానం. వెయ్యికి మించిన విద్యార్థులతో అదొక రాజ్యంలా ఉన్న పెద్ద హైస్కూలు నుంచి ఈయన ఒక మారుమూల కొంపకు కొట్టుకొచ్చాడంటే యిందుకు కారణం గూడా పనిష్మెంట్ ట్రాన్స్‌ఫరేనట!
ఎంత శిక్షకు అంత నేరం వుండివుండాలి. అదేమిటని తెలుసుకోవాలనిపించడం సహజం. రాబోతున్న పై ఉద్యోగిని గురించిన వివరాలను ఆరా తీసి, తెలుసుకోవడంలో నా సహోద్యోగులు చెప్పుకోదగ్గ శ్రద్ధ తీసుకున్నారని, నిస్సందేహంగా చెప్పగలను.
గుడిలోపలి విగ్రహాన్ని మూలవిరాట్టుగాను, జిల్లా పరిషధ్యక్షుణ్ణి నేలపైన నడయాడే ప్రత్యక్ష దైవతంగానూ భావించడం, తదనుగుణంగా నడచుకోడం, టెంకాయలోకి వచ్చే నీళ్ళలా పరిషత్తు ఉద్యోగుల్లో చోటు చేసుకునే సుగుణం. ఎన్నికలు జరిగి కొత్త అధ్యక్షుడు ఆఫీసు భవనాలకి అవతారమెత్తి రెండేళ్ళు గడచినా, ఈ ప్రబుద్ధుడు వెంకట్రావుగారు మచ్చుకొకసారైనా శ్రీవారి భేటీకి వెళ్ళలేదంటే, యితడిదంతా ఉలిపికట్టె వాటమని చెప్పటానికి యింకొక దృష్టాంతరం అనవసరం! ‘ఎందరెందరో కొమ్ములు తిరిగినవాళ్ళే వెళ్ళొచ్చారు. మీరూ వెళ్ళిరావాలి. ఆలస్యమైనందుకు కోప్పడతారేమో! ఫరవాలేదు. దాసరి తప్పులు దండముతో సరి!’ అంటూ శ్రేయోభిలాషులు మందలించకపోలేదు. అయితే ఆ హితవునేమీ లెక్కపెట్టకుండా ఈ పిచ్చి వెంకట్రావు మహాశయుడు ‘అయ్యా! చేర్మనుగారయ్యేదీ చెవులపిల్లిగారయ్యేదీ ఆయనతో నాకు పని వుంటేనే నేను వెళ్ళేది. పనిలేకుండా వెళ్ళి గొప్పవాళ్ళ అమూల్యమైన కాలాన్ని పాడుచేసే హక్కు నాకెక్కడుంది?’ అనేశాడట! మరైతే అవిధేయతను సహించడానికైనా ఓ హద్దుంటుంది గదా! వేచిచూసే ఓపిక నశించి స్వయంగా చేర్మనుగారే ఒకసారి స్కూలుపైకి ‘విజిటెత్తి’ వచ్చేశారట! వచ్చింది కారులోనా! మరేమన్నానా! శబ్దం వినిపించగానే గబగబా పరుగెత్తి రావద్దా? చేదోయి పాలలా తలానికి సోకగా నమస్కారం చెప్పవద్దా? దయచేయండి అంటూ సంభ్రమంగా లోపలికి తీసుకెళ్ళే కనీసపు మర్యాదకైనా, కరవు రావడమా! చేర్మనుగారు కారు దిగి మెట్లెక్కి టక్కుటక్కుమంటూ నడుచుకుంటూ వెళ్ళి, ఎట్టయెదుట నిలబడేటంతవరకూ ఈయన గుండ్రాయిలా కుర్చీలో బైఠాయించే వున్నాడట! అప్పుడిక తల పైకెత్తి చూశాడేమో నింపాదిగా లేచి నిల్చుంటూ ఒక నమస్కారం చెల్లించి దిక్కులేని హుందాతనమంతా వెళ్ళబోస్తూ, ‘అయ్యా! కూచోండి,’ అన్నాడట! సరే, ఆయన తల పంకించి వుంటాడు. ఇతగాడితో మాటలెందుకులెమ్మని చక్కా తనదారిని తాను వెళ్ళిపోయి వుంటాడు. ఆయనలా వెళ్ళిపోగానే సహోపాధ్యాయులు ఈయనగారిని చుట్టుముట్టి ఒక వరుస జాడించి పారేశారట! అప్పుడీయన నిజంగానే బిక్కమొగం పెట్టి, ‘ఆగండి బాబూ! ఆగండి! శాంతి శాంతి!’ అంటూ అభయవచనాలు ప్రారంభించేశాడట! ‘అయ్యలారా! మీరందరూ బుద్ధిమంతులు. నా మూలంగా యిక్కడేదో పెద్ద అపచారం జరిగిపోయినట్టు మీరు భావించడం నామట్టుకు నాకు ఒక భ్రమాప్రమాదంగానే తోస్తూవుంది. ఇప్పుడు వచ్చి వెళ్ళిన చేర్మనులాంటి వాళ్ళని కొన్ని వేలమందిని నా యీ చేతులతో నేను మలిచాను. అందుకొకరు నన్ను గౌరవించాలని నేననుకోను. చేర్మనుగారు మాత్రం అవసరం లేని మర్యాదలకోసం అర్రులు చాస్తారని మీరెందుకనుకుంటారో నాకర్థంగాదు. ఆయన గౌరవం ఆయనకు చెల్లించబడింది. మీ పాటుకు మీరు వెళ్ళండి.’ అంటూ ఈయన తనకు బుద్ధి చెప్పడం కోసం వచ్చిన వాళ్ళను మెత్తమెత్తగా దులిపి పంపించేశాడట!
అంతే సంగతులు! పదిరోజులు తిరగకమునుపే ట్రాన్స్‌ఫర్ ఆర్డర్ చేతికందింది.
ఎంతటి గడుగ్గాయి ఉద్యోగస్తుడైనా తన తప్పు తాను తెలుసుకోవలసిన సందర్భం. ఇక్కడదేం లేకపోయింది. ఈ దుస్థితికి మూలకారణమైన తన బుద్ధిమాలినతనాన్ని నిందించుకొనడం పోయి, ఈ దుర్గతి తాకిడికి లుంగలు చుట్టుకుని కృంగిపోవలసింది పోయి, అప్పటికి బదిలీ ఉత్తరువు ఏ నేషనల్ అవార్డుకో సమానమైనట్టు నిటారుగా తల పైకెత్తుకుని బాణావరానికి విజయం చేశారు వెంకట్రావుగారు!
‘అయ్యో పాపం! ఎంతపని జరిగిపోయిందండీ!’ అంటూ ఓదార్చడం కోసం తనను పరివేష్టించిన ఉపాధ్యాయ బృందాన్ని ఉద్దేశించి, పరిసరాల్లోకి కలయజూస్తూ ఆయన ప్రారంభించేశాడు… ‘ఇదేనటండీ స్కూలు! ఆహా, ఏం పూచాయండీ ఇక్కడ మోదుగు చెట్లు! దూరంగా ఎవడో దేవతా పురుషుడు పడుకున్నట్టు పెద్ద కొండ! దాన్నిండుగా పచ్చని చెట్లు, అక్కడినుంచి మామిడితోపులు. పామీరు ముడిలాంటి మిట్టపైన బడి, హాయిగా ప్రశాంతంగా. మాడల్ స్కూలంటే యిలాగే వుండాలి.’
ఏడవాలో నవ్వాలో తోచిందిగాదు నాకు. బాణావరంలో వున్న ఏకైక అయ్యరు హోటల్లో వరుసగా వారం రోజులపాటు భోజనం చేసినవాడు, అన్నంకన్నా ఆకులలములు మేయడమే సుఖమన్న నిర్ణయానికి రాగలడు. ప్రొద్దుపోయి గాలి కాస్తా చల్లబడితే చుట్టుపక్కల మెట్టపొలాల్లో ఉన్న పాములన్నీ పచారు సల్పడానికి వూళ్ళోకి వచ్చేస్తాయి. ఎండాకాలాల్లో త్రాగడానికి నీళ్ళు దొరికితే బ్రహ్మాండం. చలికాలాల్లో విషజ్వరాలకిది ఇష్టారాజ్యం. వెరసి అన్ని ఋతువులలోనూ పరిత్యజనీయం బాణావరం! ప్రత్యేకించి హైస్కూలు హెడ్మాస్టరుకు ఇక్కడ ఎదురయ్యే అదనపు బాధ ఒకటుంది. ఈ స్కూలుకు పోస్టు చేయబడ్డ ఏ టీచరుకైనా యిదొక మజిలీయేగాని, గమ్యస్థానం కాదు. ఆరుబయల్లో నెలకొల్పబడినప్పటికీ జైలు జైలే! జైలు వార్డెన్లలాంటి ఈ టీచర్లకన్నివిధాలా తగినవాళ్ళే విద్యార్థులు గూడా. వీళ్ళు చదువులపైన పెద్దపెద్ద ఆశలు పెట్టుకోరు. పడుతూ లేస్తూ పదో తరగతి దాకా బండి లాగి, ఓ మోస్తరు చిన్న కొలువును అందిపుచ్చుకోవాలనుకుంటారు. కొట్టినట్టుగా కొడితే ఏడ్చినట్టుగా ఏడుస్తానన్న భార్యాభర్తల ఒప్పందం లాంటిది యిక్కడ గురువులకు శిష్యులకు మధ్య అమల్లో ఉందనుకోవచ్చు. పరిషత్తు వాళ్ళ యాజమాన్యం క్రింద ఎడారులు, ధ్రువ ప్రాంతాలు, శిలామయ ప్రదేశాలు మొదలైనవి లేకపోవడంవల్ల ప్రవాస శిక్ష విధించడానికనువుగా ఇదొక్కటే మిగిలింది! ఈ బడిని బాగు చేసే ప్రధానోపాధ్యాయుడు గతంలో పుట్టలేదు. భవిష్యత్తులో పుట్టడు.
ఇలాంటి హైస్కూలు ఒకటి కేవలం తనకోసంగానే ఏర్పాటై వున్నట్టు వెంకట్రావుగారు అమందానందం వెళ్ళబోస్తూ రావడం మాకందరికీ చాలా ఆశ్చర్యం కలిగించింది. రేయింబవళ్ళు ఆయన ఆఫీసు రూములోనే తిష్టవేసేవాడు. విద్యార్థులు గనుక లాంథరాలు వెలిగించుకొని బడికొచ్చేస్తే రాత్రివేళ గూడా పాఠాలు చెప్పడానికి సిద్ధపడ్డాడు. పారా పలుగూ కడవలూ బకెటూ తెప్పించి సాయంకాలాల్లో పూలతోట పెంపకానికి చర్యలు తీసుకున్నాడు. మరుభూమిలో ‘పచ్చ విప్లవం’ ప్రారంభమైందంటే నమ్మడం కష్టమే! ఇందులో ‘సిన్సియారిటీ’ పాలెంతో, నటన పాలెంతో తెలుసుకునే కుతూహలంతో వోరోజు ఉదయం ఇంకా భళ్ళుమని తెల్లవారకమునుపే స్కూల్లోకి వెళ్ళాను. శుభ్రంగా ముఖాలు కడుక్కుని, పద్మాసనాలు వేసుకుని, చేసిపెట్టిన బొమ్మల్లా కుర్రవాళ్ళు పాఠాలు వల్లించుకుంటున్నారు.
హెడ్మాస్టరుగారు తొలికోడితో లేచి స్నానానికి వెళ్ళినట్టు తెలిసింది. బస్సు పైన బాణావరానికొస్తుండగా రోడ్డు కల్లంతదూరంలో ఆయనకొక చెరువు కనిపించిందట! చెరువు నీరు ఎంతో స్వచ్ఛంగా వున్నట్టు తోచడంతో యికపైన తనకదే స్నానఘట్టంగా ఆయన నిర్ధారణ చేసేశాడట! వూరికీ చెరువుకూ మధ్య దూరం ఎంతలేదన్నా మూడు కిలోమీటర్లకు తక్కువుండదు.
దారిలో బడి బంట్రోతు సుబ్బన్న ఎదురయ్యాడు. రంగారావు వెళ్ళి అయ్యగారికోసం అప్పటమైన పాలు తీసుకొస్తున్నాడట!
“అదేమిటోయ్ సుబ్బన్నా! అయ్యగారికి ఉండూరు పాలు సరిపడవా!” అన్నాను.
“ఇదొక్కటే గదండీ ఆయనకున్న ఆదరువు! ఉదయం అరపడి పాలు పుచ్చుకుంటే, రాత్రుల్లో మిగిలిన అరపడితోపాటు రెండో మూడో అరటిపళ్ళు పుచ్చుకుంటారు. మధ్యాన్నం ఒకపూట ఏం తింటాడో అదే తినడం! ఈ మారాజొచ్చినప్పటినుంచీ మధ్యాహ్నాల్లో నేను యింటికెళ్ళడం లేదనుకోండి! కారియర్‌లో మిగిలివున్నదేదో నాకూ సరిపోతుంది. ఇక్కడ మాత్రమే కాదులెండి, ఆయనెప్పుడూ యింతేనట! తిండి తినడం కోసం పుట్టినవాడిలా కనిపించడు…” మాట్లాడుతూ కెరటంలా ముందుకు సాగిపోయాడు సుబ్బన్న.
మనిషి పిట్టలా వుంటాడు. పిట్టమేతలతో పొట్టపోసుకోవడం సముచితమే!
హాస్యరసభరితమైన పుస్తకాన్ని చదువుతూ చదువుతూ మధ్యమధ్యలో అందులోని సంఘటనల్ని నెమరుకు తెచ్చుకొని కాసేపు నవ్వుకోడం చదువరులకందరికీ అనుభవంలోని విషయం. మా స్టాఫ్ మెంబర్లకిప్పుడు అలాంటి కాలక్షేపానికి కొదవలేకపోయింది. ‘ఈరోజేం జరిగిందో తెలుసా?’ అంటూ ఒకరు. ఆ ఉదంతం పూర్తయ్యీ కాకమునుపే, ‘మీకు తెలుసునో తెలియదో, మొన్న ఇంకొక తమాషా జరిగింది…’ అంటూ ఇంకొకరు! ఏకిన ప్రత్తిలోనుంచి నూలుపోగును తీసినట్టుగా వెంకట్రావుగారి దినచర్యలనుంచి రకరకాల వినోదోదంతాల్ని వెలికితియ్యడం సహోపాధ్యాయులకొక ‘ఎక్‌స్ట్రాకరిక్యులర్ యాక్టివిటీ’ అయిపోయింది.
పదకొండున్నరకు సరిగ్గా రెండో పీరియడ్ పూర్తవుతుంది. ఓ రోజు ఉదయం పెద్ద ముల్లు ఏడును సమీపిస్తున్నా గంట మ్రోగకపోవడం గమనించి వెంకట్రావుగారు “సుబ్బన్నా, గంట కొట్టు,” అంటూ హెచ్చరిక చేశారు. ‘సుబ్బన్న పోస్టాఫీసుకు వెళ్ళాడండీ, ఇంకా రాలేదు.’ అన్నాడు గుమాస్తా. ‘ట్రెయిన్ లేటయింది గదూ! ఈ టపా రావటమూ లేటే! సుబ్బన్నగూడా డిటో.’ అన్నాడు జూనియరు తెలుగు పండితుడు నాదముని. ‘ఒకరోజు ట్రెయిన్ రాదనుకోండీ! ఆ రోజంతా యితడు పోస్టాఫీసు వదిలిపెట్టి బడికి రాడన్నమాటే గదా!’ అంటూ ఓ ఛలోక్తి విసిరాడు హిస్టరీ అసిస్టెంటు రామసుబ్బారెడ్డి. వాళ్ళల్లో వాళ్ళిలా తర్జనభర్జన పడుతుండగానే టంగుటంగున గంట రెండుసార్లు మ్రోగింది. ‘ఏదీ, సుబ్బన్న వచ్చేశాడా? లేదే!’ అనుకుంటూ వాళ్ళు వరండాలోకి తొంగిచూచేసరికి సుత్తిని యథాస్థానంలో వుంచి హెడ్మాస్టరుగారు తిరిగొస్తున్నారు.
ప్యూనుకే ‘సబ్‌స్టిట్యూటు’గా వ్యవహరించగలిగిన తర్వాత హెడ్మాస్టరుగారు అసిస్టెంటు టీచర్ల కాపాటి ఉపకారం చెయ్యడానికి ముందుకు రావడంలో విడ్డూరమేముంది? టీచరు సెలవు పెట్టడంవల్ల ఏ క్లాసయితే బిడువుగా వుంటుందో అక్కడల్లా ఆయన్ను చూడొచ్చు. నారదుడికి శ్రీకృష్ణపరమాత్ముడు తన అష్ట భార్యల మందిరాల్లో కనిపించినట్టుగా ఒక రూములో ఆరో తరగతి కుర్రాళ్ళకు విదుర నీతి పద్యాలు వివరిస్తూ వెంకట్రావుగారు, ఇంకొక గదిలో ఏడో తరగతికి ఆర్కిమెడిస్ సూత్రం బోధిస్తూ వెంకట్రావుగారు. వేరొకచోట ఎనిమిదో తరగతి గదిలో ద్వివర్ణ సమీకరణలు విశదీకరిస్తూ వెంకట్రావుగారు.
వెంకట్రావుగారి విశ్వరూపాన్ని చూచినకొద్దీ నాకు లోపల్లోపల ఆయన పట్ల అనుతాపం కలిగిన మాట వాస్తవం. తోడి మానవుణ్ణిగా ఆయనకు తగునైన సలహా ఒకటి యివ్వదలచుకున్నాను. వయసులోనూ ఉద్యోగ స్థాయిలోనూ ఆయనకూ నాకూ వున్న తేడాను పురస్కరించుకుని నా సలహాను వీలయినంతలో ఒక విజ్ఞప్తిగానే తీర్చిదిద్దాను. “చూడండి సార్! మీరూ బాగా పెద్దవాళ్ళయిపోయారు. మన శరీరాలు ఉక్కుతో చేసినవేమీ కావు. ఇవి తట్టుకోగల చాకిరీకి హద్దంటూ ఒకటుంటుంది. మీవంటివారు తమకు మాలిన ధర్మాల జోలికి వెళ్ళకపోవడం చాలా మంచిది…”
తన శరీరంవైపొక్కసారి చూసుకుని ఎంతో నిర్లక్ష్యంగా నాలుక చప్పరించేశారు, వెంకట్రావుగారు. “వోయబ్బ! ఈ శరీరానిదేముందిలేవోయ్ రాఘవులూ! ఇదొక పనిముట్టు. దీనితో ఎంత మాగ్జిమమ్ పని చేయించుకోవచ్చో అంతా చేయించుకోవాలయ్యా! బద్ధకం వహించినంత మేరకు యిది త్రుప్పుపట్టి పోతుందనుకో…”
ఈ మనిషికిలా చెప్పినందువల్ల లాభంలేదు. ఇంతకంటే సూటిగానే చెప్పాలి. ‘అయ్యా! శరీరం నీది. కావలిస్తే దాన్ని ఎలాంటి గ్లానికైనా గురిచెయ్యి. నీ యిష్టం. కానీ మానవ జన్మమెత్తిన తర్వాత, అందులోనూ ఒక హైస్కూలుకు హెడ్మాస్టరువైన తర్వాత మనిషికి ఆత్మగౌరవమనేది చాలా ముఖ్యమనే విషయం నీకు తోచకపోవడం దురదృష్టం…’ ఇలా ఎన్నో మాటలు నాలుక చివరిదాకా వచ్చాయి. కానీ యిన్ని మాటలూ చెప్పెయ్యడానికొక సందర్భం రావాలి.
వచ్చింది.
ఓ రోజు వుదయం పదిగంటలప్పుడు నేను స్కూలుకు వెళ్ళేసరికి అప్పటికప్పుడే చేసుకున్న నిర్ణయంపైన కోయగూడెంలో జరుగుతున్న జాతరలా స్టాఫ్‌రూంలో సందడిగా ఉంది. ‘ఏం జరిగిందర్రా, ఏమిటి విశేషం?’ అన్న నా ప్రశ్నకు నవ్వులే సమాధానం. ఒకటి రెండు నిమిషాలు బ్రతిమాలుకున్న తర్వాత ఒక సహోపాధ్యాయుడు, “అదేమిటయ్యా రాఘవులూ! రోకలి తీసుకు రాకుండా వట్టిచేతులతో వచ్చేశావే? అయ్యగారికి పిచ్చి కుదిరిందట, ఇక రోకలి తలకు చుట్టడమే తరువాయి!” అన్నారు.
ఏం జరిగిందేం జరిగిందంటూ మళ్ళీ మొదటికే వచ్చాను.
ఫస్టు అసిస్టెంటు సదాశివయ్య సూర్యోదయాన్ని కళ్ళజూచి ఎరుగని వ్యక్తి. ఎనిమిదికో ఎనిమిదిన్నరకో అదీ ఆ పూట బడి వుందని జ్ఞాపకం వస్తేగాని అతడు మంచాన్ని వదిలిపెట్టడు. అలాంటి సదాశివయ్యకీరోజు వుదయం అయిదు గంటలకే నిద్రాభంగం కలిగింది. ఈ దురాగతానికి కారకుడు మరెవ్వరో కాదు; సాక్షాత్తుగా హెడ్మాస్టరు వెంకట్రావుగారు. తలుపు దబదబా బాది, ఇంటావిడ వచ్చి తలుపు తీయగానే సుడిగాలిలా లోపలికి వెళ్ళి ఈయన ఫస్ట్ అసిస్టెంటును నిద్ర లేపేశాడట! “సదాశివం! ఇదిగోనయ్యా లీవు లెటరు. రెండు రోజులపాటు నువ్వు ఇన్-చార్జీగా స్కూలు చూచుకోవాలి, నేనర్జంటుగా వూరు వెళ్తున్నాను. టీచర్సు రిజెస్టరులో నా పేరుకెదురుగా ఎర్రసిరాతో ‘సిఎల్’ గుర్తించడం మరచిపోవద్దు. ఐనా తెల్లవారిపోతుండగా యింకా నిద్రేమిటి? ఈపాటికి కలకత్తాలో నాలుగు బారల ప్రొద్దెక్కి వుంటుంది…” అంటూ అదే దూసుకపోవడం బస్‌స్టాండువైపు!
‘కలకత్తాలోకన్నా రంగూన్‌లో, కౌలాలంపూరులో, టోకియోలో యింకా ముందుగానే తెల్లవారిపోతుంది. అందుకని రాజశ్రీ హెడ్మాస్టరుగారు చెప్పేదేమిటి? ఈ భూప్రపంచంపైన ఏ మానవుడైనాగానివ్వు, ఏ వేళప్పుడైనాగానివ్వు నిద్రపోవడానికి వీల్లేదనేగదా!’ ఎవరికి తోచిన వ్యాఖ్యానాలు వాళ్ళు రువ్వుతున్నారు. ఒకరికంటే ఒకరు నవ్వుతున్నారు.
వెంకట్రావుగారు బాణావరానికి వచ్చి మూడు నెలలయితే, చివరి మూడు నెలల్లో మా యిద్దరికీ మధ్య సాన్నిహిత్యం కాస్తా చిక్కబడింది. మరేంలేదు. వికారమైన ముఖానికొక అందమైన ‘మాస్క్ ‘ తగిలించినట్లుగా సకాలంలో తగు సలహాలివ్వడం ద్వారా, చేయిమించి పోయినప్పుడు కొన్ని కొన్ని సర్దుబాట్లు చేయడంద్వారా నేను హెడ్మాస్టరుగారి ప్రవర్తనకు మెరుగులు దిద్దడానికి ప్రయత్నించాను. చివరి పదీపదిహేను రోజుల్లో అందులో కొంతవరకూ కృతకృత్యుడినయ్యాను గూడా! కానీ అంతలోనే మళ్ళీ ఓ తప్పుటడుగు! నిజంగానే నాకు తల కొట్టివేసినట్టయింది.
వూరునుంచి తిరిగి రాగానే నాకు దొరికిన మొదటి అవకాశంలో నేను వెంకట్రావుగారిపైన విరుచుకుపడ్డాను.
“మీరు నన్ను గురించి ఏమైనా అనుకోండిసార్, ఫరవాలేదు. నేను చెప్పదల్చుకున్నదేదో చెప్పేస్తాను. మీరు చేసే పనులు నాకేమీ బాగుండడంలేదు. సంఘంలోని ఒక్కొక్క మనిషికీ అతడీవిధంగా మాత్రమే నడచుకోవాలని కొన్ని నియమాలుంటాయి. ఇంగ్లీషులో రూల్సు అనుకోండి, నాకేమభ్యంతరం లేదు. ఒకవేళ మీరు మరచిపోయినా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మీరొక విద్యాసంస్థకు పెద్దగా వున్నారు. సెలవు పెట్టదలచుకుంటే ప్యూను ద్వారా ఫస్ట్ అసిస్టెంటుకు కబురుపెడతారు. అతడు రాగానే తాళంచెవులు అప్పగించి మీ పనిపైన వెళ్తారు. అంతేగానీ, స్వయంగా అసిస్టెంటు టీచరు యింటికి వెళ్ళి తలుపు దబదబా బాదే హెడ్మాస్టరుంటాడా ఎక్కడైనా! ఒక టీచరు సెలవులో వున్నందువల్ల అతడి క్లాసు ఖాళీగా వున్నప్పుడు పనిలేకుండా వున్న యింకొక టీచరును యాక్టింగు వర్కుకు వెయ్యడం రివాజు! అలా కాకుండా తగుదునమ్మా అని ఆల్‌రౌండు మాస్టరులాగా అన్ని క్లాసులూ మీరే తీసుకుంటారా! అన్నింటికన్నా ఘోరమైన విషయం, హెడ్మాస్టరుగా మీకుండవలసిన హుందాతనమంతా నట్టేట్లో కలిపి, సీట్లోనుంచి లేచివెళ్ళి గంట కొట్టి వస్తారటండీ మీరు!”
ఎట్టఎదుటి ఆకారంలో కదలిక లేదు. నిశ్చలమైన ముఖభంగిమను బట్టి చూస్తే ఆయన నా మాటల్ని సాకల్యంగా విన్నట్టే తోచింది. కుర్చీలో సర్దుకుని కూర్చున్న తీరు, సులోచనాలను సవరించుకున్న తరహా, పైపెదవి క్రింది పెదవితో ముడిపడుతూ విడివడిన పద్ధతి, ఈ చిన్నెల ద్వారా ఆయనలో ఏదో తిరుగుబాటు ప్రకోపిస్తూ వున్న జాడల్ని పసిగట్టాను. ఇన్ని దినాలుగా నాకు పరిచితుడైన ఈ వ్యక్తిలో యింతవరకూ నా వూహకందని విలక్షణాలేవో పొంగి పొరలివచ్చి, నన్ను ముంచివేయబోతున్నట్టుగా వుంది. “మిస్టర్ రాఘవులూ!” అంటూ పిలుపు వినిపించేసరికి వులిక్కిపడకుండా వుండలేకపోయాను. “నీకొకడు ప్యూనైతే నువ్వింకోడికి ప్యూనా! ఎంత మంచి ప్యూన్ల ప్రపంచమయ్యా మీది! తనకు సెలవు కావలసివస్తే సదాశివయ్య నా దగ్గరికొస్తుండగా లేనిది దారిలో ఉన్నాడు గదా అని నేనతడితో ఒక మాటచెప్పి వెళ్ళేసరికి నాకెక్కడలేని తలవంపులొచ్చాయనేనా నువ్వనేది! గోళ్ళు గిల్లుకుంటూ కూర్చున్న విద్యార్థుల్ని వెదికిపట్టి, వాళ్ళకు నాలుగు ముక్కలు చెప్పడానికి గూడా నా హెడ్మాస్టరుగిరీ అడ్డొస్తుందంటావా? పోతే, ప్యూనొచ్చేదాకా నువు గంట మ్రోగగూడదంటావు, ఎందుకు బాబూ! మహాత్ముడు పాకీపని చేయడం గొప్ప ఆదర్శంగా తలపోయడం లేదా నువ్వు? వ్యక్తిత్వం నుంచి ఉద్యోగాన్ని మైనస్ చేసి సంతకు తీసుకెళ్తే, ఎర్రని ఏగానీ చెయ్యని నేను ఒకసారి బడిగంట కొట్టడంవల్ల నువ్వు చెబుతున్న ‘రూలు’కు ఎక్కడలేని సేగి వచ్చిపడిందా? నాన్సెన్స్! ఈ బోడిరూలు సంగతి నాతో చెప్పొద్దు. ఏమిటయ్యా నీ రూలు? ఎవడు చేసిందీ రూలు? మొదట మనిషి. తరువాత రూలు. మనిషి చేసిన ‘రూల్సును’ మనిషి కోసం అతిక్రమిస్తే తప్పని నేననుకోను. అవసరమైతే నేనామాత్రం పనిచెయ్యడానికి వెనుదియ్యను గూడా! ఏ లౌకిక శక్తీ నన్ను అడ్డుకోలేదు…”
కింగ్‌కాంగు, గామా, కోడి రామ్మూర్తుల్లాంటి వాళ్ళెవరైనా యిలా ఒక సవాలు విసిరితే ఆ దారి వేరు! తమ శారీరక బలమైనా వారికి ఆసరాగా వుండివుండేది. ఒక మాదిరి దృధకాయుడు భుజాలపైన చేయి వేసి అదిమితే అమాంతంగా భూగర్భంలోకి కృంగిపోయేట్టున్న అబ్బనాకారపు మనిషి ఏ బలాన్ని నమ్ముకుని యింతింతలేసి మాటలు మాటాడేటట్టు?
నాకప్పుడనిపించింది.
పేరుకు ముందుగా ‘పిచ్చి’ అన్న విశేషణం తగిలించడంతో లోకం ఈ తిక్కమనిషిని సముచితంగానే సన్మానించింది… అని!
ఐతే వెంకట్రావుగారు నిజంగా పిచ్చివాడే కావడానికిన్నీ కాకపోవడానికిన్నీ వున్న మధ్య దూరమేపాటిదో నాకా క్షణాన బోధపడలేదు. ఆయన పిచ్చితనాన్ని గురించి నికరంగా ఒక నిర్ధారణకు రావలసిన అగత్యం రానున్న కొద్ది రోజుల్లో పొంచివుందని గూడా నేనప్పట్లో వూహించలేదు.
ఏం జరిగిందంటే…
ఓ రోజు వుదయం మామూలుగానే బడి ప్రారంభమైంది. ఇంటర్వెల్లో కుర్రవాళ్ళు బయటికి వెళ్ళిన తరువాత మూడో పీరియడ్ జరుగుతోంది. మెయిన్ బిల్డింగుకు దూరంగా చెట్లక్రింద కూచోబెట్టి, విద్యార్థులచేత కాంపోజిషన్ వ్రాయిస్తూ నా పనిలో నేను నిమగ్నుడనైవుండగా పెద్దపెట్టున గగ్గోలు చెలరేగడం వినిపించింది. కొందరయ్యవార్లు, విద్యార్థులు గూడా క్లాసులు వదలిపెట్టి కలసి కట్టగట్టుకుని స్టాఫ్‌రూము వైపు పరుగెత్తుతున్నారు. ఆ అలజడిలో అసలు విషయమేమిటో తెలుసుకోవడానికైనా వీలుకావడం లేదు. ఎదురీత గొట్టి, ఏటిపైకి వ్రాలిన కొమ్మను పట్టుకొన్నట్టుగా జనాన్ని తోసుకుంటూ వెళ్ళి స్టాఫ్‌రూమ్ కిటికీ దగ్గరికి చేరుకోగలిగాను. ఎగశ్వాస, దిగశ్వాసల వురవడితో రొప్పుకొంటూ డ్రాయింగు మాస్టరు మురహరి లోపలి బెంచీపైన పడివున్నాడు.
చాలా దయనీయ గాథ మురహరిది. స్వయంగా తనదేమో మెతక మనసు. మృగాలలాంటి మనుషుల మధ్య జీవనం. బాణావరానికి మూడుమైళ్ళ దూరంలోవున్న స్వగ్రామం నుంచి ప్రతిరోజూ బడికివచ్చి వెళ్తుంటాడు. నాలుగు మాసాల క్రిందట కోర్టులో వుండిన కేసొకటి తనకు వ్యతిరేకంగా తీర్పు రావడంతో అతడు మానసికంగా బాగా దెబ్బతిన్నాడు. దానికితోడు పెద్ద జబ్బు చేసింది. ‘రక్తహీనత’ అన్న కారణంతో పసిరికలు వచ్చిందన్నారు. రెండునెలలపాటు రాణీపేట ఆసుపత్రిలో వుండివచ్చాడు. లేతవయసు పెళ్ళాంతో బాటుగా నలుసులలాంటి యిద్దరు పిల్లలు గూడా వున్నారు. మురహరి ఉద్యోగమొక్కటే ఆ కుటుంబానికున్న జీవనాధారం.
నాటువైద్యుడు నాగాచారి గసపోసుకుంటూ వచ్చాడు. తన తాత ముత్తాతలు చేసిపెట్టిపోయిన కట్టుమాత్రలతో బాణావరం జబ్బులపైన రకరకాల వింత ప్రయోగాలు చేయడం అతడి ప్రత్యేకత. ప్రాణభయం వుందనిపిస్తే అతడు రోగి దరిదాపుల్లోనే ఉండడు. ఒళ్ళంతా చలువలు చలువలు క్రమ్ముకపోతూ వుండడాన్ని బట్టి, నాడి మందగించడాన్ని బట్టి నాగాచారి పెదవి విరిచేశాడు. ‘రెండు గంటల టైములో గవర్నమెంటు ఆసుపత్రికి తీసుకెళ్ళాల్సివుంది. బలమైన ఇంజక్షన్లిచ్చి గ్లూకోజు గూడా ఎక్కిస్తే ఆ పైన అంతా దైవాధీనం. మొత్తం పైన యముడితో కటాబొటీగ పోట్లాడవలసిన పరిస్థితి…’ అని తేల్చి చెప్పేశాడు.
మధ్యాహ్నం దాటిన తరువాత గానీ బాణావరం నుంచి పట్నానికి బస్సులు లేవు. ఇప్పటికిప్పుడు రైలు మాత్రం వుంది. అది పన్నెండు ముప్పావుకల్లా స్టేషను వదిలిపెడుతుంది.
ఆలోగా పేషంటును స్టేషను దగ్గరికి చేరవెయ్యగల్గడం సాధ్యమేనా?
కష్టం.
సాధ్యంకాదు.
బాణావరంలో జట్కాలు లేవు. ఎద్దులబండే శరణ్యం.
తలచుకున్నపాటున బండి ఎక్కడ దొరుకుతుంది?
సందేహాల కతీతంగా ఈ ప్రాంతంలో ఎక్కడో బండి ఒకటి వుండితీరాలి- అన్న నమ్మకం ఒక్క హెడ్మాస్టరుగారి ముఖంలో మట్టుకే కనిపించింది. జండాకొయ్య కోసం కట్టిపెట్టిన ఎత్తయిన తిన్నెపైకెక్కి ఆయన నాలుగు వైపులకు పరకాయించి చూచారు. పొలాల్లోకి ఎరువు తోలుకుని వెళ్ళి ఖాళీగా తిరిగొస్తున్న బండి ఒకటి తుప్పల చాటున దోబూచులాడినట్లుగా కనిపిస్తూ వుంది.
“రాఘవులూ! అదిగోనయ్యా బండి. పరుగెత్తు. అడ్డదారి పట్టుకుని పొలాల పైన్నే తోలుకొచ్చేయమని చెప్పు. ఇక్కడున్నట్టుగా రావాలి.”
అదృష్టవశాత్తు బండి తోలుతున్న రైతు నాకు పరిచితుడే! మీదు మిక్కిలి వాళ్ళబ్బాయి ఒకడు హైస్కూలులో చదువుతున్నాడు గూడానేమో. చెప్పగానే అతడు నా పిలుపునందుకున్నాడు. ఆఘమేఘాలపైనే తోలుకుంటూ వచ్చి బండిని స్కూలు గేటు దగ్గర నిలిపివేశాడు.
జబ్బు మనిషిని చేతులపైన బండిలోకి తీసుకెళ్ళడం జరిగింది.
కదిలిన బండిలోకెక్కి కూర్చుంటూ హెడ్మాస్టరుగారు నన్నొక్కణ్ణి మాత్రం తన వెంట రమ్మన్నారు. స్టేషనుదాకా వచ్చి రైలెక్కించి వచ్చేస్తామని చెబుతూ అయిదారుగురు విద్యార్థులు మాత్రం నాతోబాటుగా బండిని వెంబడించారు.