వేదాద్రిసదశ ముదిలియార్
గోవింద మరారూ, త్యాగరాజుల సమావేశం గురించి ఎన్నో వివరాలు ఎం.ఎస్ రామస్వామి అయ్యర్ సేకరించారు. ఈ గోవిందమరారుతో పాటు వడివేలూ, మరో ట్రావెన్ కోర్ ఆస్థాన విద్వాంసుడు నల్లతంబి ముదిలియార్ వెళ్ళినట్లుగా రాసారు. నల్లతంబి ముదిలియార్ అన్న కొడుకు సులోచన ముదిలియార్ నడివయస్సులో ఉండగా త్యాగరాజుని కలిసాడు. సులోచన ముదిలియార్ తంజావూరు బ్రిటీషువారి దగ్గర పనిజేసేవాడు. ఇతను రహదారులు వేయించేవాడు. వంతెనలు కట్టించేవాడు. ఇతని కొడుకు వేదాద్రిసదశ ముదిలియార్ ట్రావెన్ కోర్ హైకోర్టు ప్రధాన న్యాయాధిపతిగా పనిజేసాడు. తండ్రితో పాటు కలిసి ఇతని చిన్నతనంలో త్యాగరాజుని దర్శించినట్లుగా ఎం.ఎస్. రామస్వామి అయ్యర్‌కి స్వయంగా చెప్పాడనీ రాసారు.
త్యాగరాజు తపాలా బిళ్ళ
ఈ వేదాద్రిసదశ ముదిలియార్ ద్వారా త్యాగరాజు గురించి రామస్వామి అయ్యర్ వివరాలెన్నో సేకరించారు. ఈ సందర్భంలోనే త్యాగరాజు వేదాంత వైఖరి గురించి ఒక ఆసక్తి కరమైన సంఘటనొకటి రాసారు. ఈ సులోచన ముదిలియార్ కి బ్రిటీషు వాళ్ళు తిన్నివెల్లి (తిరునల్వేలి) వంతెన పని అప్పగించారు. ఈ పని మీద తండ్రీకొడుకులిద్దరూ తంజావూరొచ్చారు. అప్పటికే గోవింద మరార్, త్యాగరాజుల సమావేశం గురించి ఎంతగానో విని వుండడంతో తిరువయ్యారు వెళ్ళి త్యాగరాజుని సందర్శించారు. అప్పటికే గోవింద మరారు పండరీపుర యాత్రలో చనిపోయి కొన్ని నెలలయ్యింది. సులోచన ముదిలియార్ ద్వారానే ఈ విషయం త్యాగరాజుకి తెలిసింది. అతిపిన్న వయసులో పోయాడని, “దేవుడు అతని ప్రార్థనలని వినలేదా?” అని త్యాగరాజు బాధపడుతూ ప్రశ్నిస్తే, “సృష్టి సూత్రాలని ఎవరూ మార్చలేరనీ, వాటినెవరూ ఆపలేరనీ చెబుతూ, కేవలం ప్రార్థన వల్ల నియమాలు మారవనీ “- వేదాద్రిసదశ ముదిలియార్ వేదాంత వైఖరిని చెప్పి సులోచన ముదిలియార్ ఊరడించాడనీ, త్యాగరాజు ఆ సందర్భంలో చక్రవాక రాగంలో ఈ క్రింది కృతి చెప్పినట్లుగా రామస్వామి రాసారు.
పల్లవి. సుగుణములే చెప్పుకొంటి
సుందర రఘురామ
అనుపల్లవి. వగలెరుంగ లేకయిటు
వత్తువనుచు దురాశచే (సుగుణములే)
చరణం. స్నానాది సు-కర్మంబులు
వేదాధ్యయనంబులెరుగ
శ్రీ నాయక క్షమియించుము
శ్రీ త్యాగరాజ నుత (సుగుణములే)
ఇదే భావన స్ఫురించేలా వనాళి (లేదా వనావళి) రాగంలో ‘అపరాధములనోర్వ’ కృతినీ కూడా స్వరపరిచినట్లుగా అయ్యర్ చెప్పారు.
ఇలా త్యాగరాజుని సందర్శించిన ఎంతోమంది ద్వారా ఎన్నో వివరాలు సేకరించిన ఎం.ఎస్.రామస్వామి అయ్యర్ చరిత్ర తేదీలకీ, సాంబమూర్తి చెప్పిన వాటికీ ఎక్కడా పొంతన లేదు. త్యాగరాజూ, గోవిందమరారూ 1838లో కలిసారన్నట్లుగా రామస్వామి అయ్యర్ రాసారు. రామస్వామి అయ్యర్ చెప్పిన సంవత్సరం కొంచెం అనుమానాస్పదంగానే అనిపిస్తుంది. ఒక పక్క సులోచన ముదిలియార్ కలిసింది 1843 ఆగస్టులో అని చెబుతూ, ఆప్పట్లోనే వారిద్దరి కలయిక వార్తా అనేకమంది ఎంతగానో చెప్పుకున్నారనీ, మరోవైపు గోవిందమరారూ, త్యాగరాజు కలిసిన సంవత్సరం 1838 అని చెప్పారు. సాంబమూర్తి మాత్రం ఈ సంఘటన 1843లోనే జరిగిందని రాసారు తప్ప ఆధారాలివ్వలేదు. ఇది 1843 సంవత్సరం మొదట్లో జరిగినట్లు భావించడానికి ఆస్కారమెక్కువగా వుంది.. ఎందుకంటే అదే సంవత్సరం సుమారుగా జూన్, జులై కాలంలో గోవింద మరార్ పండరీపుర యాత్రలో చనిపోయాడు. ఈ సంగతి ట్రావెన్కోర్ రాజాస్థాన చరిత్ర ప్రతుల్లో ఉంది. ఇదే విషయాన్ని తిరువనంతపురానికి చెందిన టి. లక్ష్మణ పిళ్ళై త్యాగరాజుపై రాసిన వ్యాసాల్లో ప్రస్తావించారు. అందులో ఈ వేదాద్రిసదశ ముదిలియార్ త్యాగరాజుని కలిసినట్లుగా వుంది. ఈయన చెప్పిన తేదీలూ, సంవత్సరాలూ రామస్వామి అయ్యర్ చెప్పిన వాటితో సరిపడ్డాయి. ఇద్దరూ 1838 అని తప్పుగా పొరబడ్డారు.
అలాగే గోవిందమరార్ తో పాటు వడివేలు కూడా వెళ్ళినట్లుగా రామస్వామి అయ్యర్ రాస్తే, సాంబమూర్తి మాత్రం ఇద్దరూ విడివిడిగా కలిసినట్లు రాసారు. రామస్వామి అయ్యర్ పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ శిష్యుడు. ఈయనేమో వీణ కుప్పయ్యర్ శిష్యుడు. కాబట్టి రామస్వామి అయ్యర్ చెప్పిన వివరాలు వాస్తవానికి దగ్గరగా ఉండే అవకాశముంది. వాలాజపేట శిష్యులు పొందుపరిచిన త్యాగరాజు జీవిత వివరాల్లో గోవింద మరారు గురించుంది. గోవింద మరారుని ప్రస్తుతించే సందర్భంలో ఎందరో మహానుభావులు కృతిని త్యాగరాజు పాడినట్లుగా చెప్పారు. సులోచన ముదిలియార్, త్యాగరాజు కలిసిన సందర్భాన్ని ఆసక్తికరమైన సంభాషణలతో రామస్వామి అయ్యర్ ఎంతో నాటకీయంగా రాసారు.
వికటకవి కృష్ణయ్యర్
తంజావూరు రాజు శరభోజి ఆస్థానంలో వికటకవి కృష్ణయ్యర్ అనే ఒక విదూషకుడుండేవాడు. త్యాగరాజన్నా, ఆయన పాటన్నా ఈయనకి ఎంతో ఇష్టం. ఈయన వచ్చినప్పుడల్లా త్యాగరాజు శిష్యులతో కలసి కచేరీ ఇచ్చేవాడు. ఓ సారి కచేరీలో హరికాంభోజి రాగంలో ‘దినమణి వంశ తిలక లావణ్య’ కృతిని స్వరపరచి త్యాగరాజు పాడుతుంటే, అక్కడే కూర్చున్న ఒక ప్రేక్షకుడు ఈ ప్రయోగం తప్పనీ, లావణ్య అన్న పదం విశేషణమనీ, కాబట్టి అది ఒక వస్తువు ముందుండాలనీ, కచేరీలో పక్కనున్న వారితో గట్టిగా చెబితే అది త్యాగరాజు చెవిన పడింది. ఆ పాట ముగించేక, ‘దినమణివంశ లావణ్య తిలకా’ అని సాహిత్య పరంగా అర్థం చేసుకోవాలని త్యాగరాజు వివరణిచ్చాడంటూ కృష్ణయ్యర్ తంజావూరు రాజదర్బారులో ఎంతో హాస్యంగా చెప్పాడని, వేదాద్రిసదశ ముదిలియార్ చెప్పినట్లుగా టి.లక్ష్మణ పిళ్ళై రాసారు. సాంబమూర్తి కథనంలో వికటకవి కృష్ణయ్యర్ రావడమూ పాట కచేరీ విషయమూ వేర్వేరుగా రాసారు.
ఒక ఉత్తర దేశపు విద్వాంసుడు
ఓసారి ఉత్తరదేశం నుండి ఒక హిందూస్తానీ సంగీత విద్వాంసుడు తంజావూరు సందర్శించినపుడు, అతని అభ్యర్థనపై, కళ్యాణి రాగంలో ‘సుందరి నీ దివ్య స్వరూపమును’ కృతిని ధర్మసంవర్ధినీ ఆలయంలో పాడితే, తన వద్దనున్న బంగారమూ, కానుకలూ అన్నీ త్యాగరాజుకి కానుకగా ఇచ్చాడనీ సాంబ మూర్తి ‘ది గ్రేట్ కంపోజర్స్’ లో రాసారు, కానీ పేరు చెప్పలేదు. ఏవరికైనా పేరు ప్రఖ్యాతులొచ్చాక వారిమీద అనేక కథలు పుట్టుకు రావడం సహజం. అలాంటిదే ఈ కథ అని అనుకోవాలి.
సంగీత త్రిమూర్తులు
త్యాగరాజు కాలం (1767 – 1847) లోనే సంగీతంలో అనేకమంది ప్రజ్ఞావంతులు ప్రపంచం నలుమూలలా జన్మించారు. తంజావూరు రాజ్యంలో 1700 – 1850 కాలంలోనూ, దక్షిణాదిన కొన్ని రాజ్యాల్లోనూ కర్ణాటక సంగీతం వెల్లి విరిసింది. కర్ణాటక సంగీతానికొక రూపూ, పద్ధతీ వచ్చిందీ కాలంలోనే! త్యాగరాజు జన్మించిన కాలంలోనే తిరువారూర్లో మరో ఇద్దరు సంగీత దిగ్గజాలు పుట్టారు. ఒకరు శ్యామ శాస్త్రి, రెండో వారు ముత్తు స్వామి దీక్షితార్. త్యాగరాజుతో కలిపి ఈ ముగ్గుర్నీ ‘సంగీత త్రిమూర్తులు’ (మ్యూజికల్ ట్రినిటీ) అని అంటారు. శ్యామశాస్త్రి 1762 లో పుడితే, 1776 లో ముత్తుస్వామి దీక్షితార్ పుట్టాడు. ఇందులో చిత్రం ఏమిటంటే ఈ ముగ్గురు వాగ్గేయకారులూ తిరువారూర్లోనే పుట్టారు. దాదాపు ఒకే సమయంలోనే జీవించారు. త్యాగరాజు చిన్నతనంలోనే తిరువయ్యారు మకాం మారిస్తే, శ్యామశాస్త్రి కుటుంబీకులు తంజావూరు వెళ్ళారు. చిన్నతనం అంతా తిరువారూర్ లోనే గడిపిన ముత్తుస్వామి దీక్షితార్ యుక్త వయసులో ఉండగా కొంతకాలం కాశీ లో గడిపాడు.
ఈ ముగ్గురూ ఒకే కాలం వారయ్యుండడం వల్ల “వీరు కలిసారా?”, “ముగ్గురికీ ఒకరికొకరు పరిచయముందా?” అన్న ప్రశ్న సహజంగా పుడుతుంది. ఈ వివరాలు తెలుసుకునే ముందు శ్యామశాస్త్రీ, ముత్తుస్వామి దీక్షితార్ల గురించి కొంత తెలుసుకోడం సముచితంగా ఉంటుంది.
శ్యామశాస్త్రి
శ్యామశాస్త్రి పూర్వీకులు తెలుగు వాళ్ళు. వీరు తంజావూరు రాజ్యానికి వలస వచ్చారు. శ్యామశాస్త్రి తండ్రి విశ్వనాధ అయ్యర్ వృత్తిరీత్యా అర్చకుడు. అప్పటి తంజావూరు రాజు తుల్జాజీ పిలుపు మీద విశ్వనాధ అయ్యర్ తంజావూరు కామాక్షి మందిరంలో అర్చకుడిగా నియమింపబడ్డాడు.
శ్యామశాస్త్రి కుటుంబంలో ఎవరికీ సంగీతంలో ప్రవేశం పెద్దగా లేదు. కాశీ నుండి సంగీత స్వామి అనే సాధువొకాయన చాతుర్మాస దీక్షకై తంజావూరొచ్చినపుడు శ్యామశాస్త్రికి సంగీతంలో వున్న ఆసక్తి చూసి సంగీతం విద్య నేర్పాడు. కేవలం మూడు నెలల్లోనే సంగీతంలో ప్రావీణ్యం సంపాదించడం చూసి సంగీతస్వామి, తంజావూరు ఆస్థాన విద్వాంసుడైన ఆదియప్పయ్య దగ్గర సంగీతం నేర్చుకోడానికి కుదిర్చాడు. తండ్రి తదనంతరం శేష జీవితమంతా బంగారు కామాక్షి దేవాలయ అర్చకుడిగానే గడిపాడు. సుమారు రెండు వందలకి పైగా కీర్తనలు తెలుగు, సంస్కృత, తమిళ భాషల్లో స్వరపరిచాడు. ఈయనకి అతి తక్కువ మంది శిష్యులున్నారు. వీరిలో ఈయన కొడుకు సుబ్బరాయ శాస్త్రీ, పెరంబూర్ కృష్ణయ్యర్, అలుసూర్ కృష్ణయ్యర్, దాసరి ముఖ్యులు. పంజుశాస్త్రి, సుబ్బరాయ శాస్త్రీ ఈయన కొడుకులు. పెద్దకొడుకు పంజుశాస్త్రి కామాక్షి ఆలయంలో అర్చకత్వం చేసేవాడు. రెండో కొడుకు సుబ్బరాయశాస్త్రి త్యాగరాజు చివరి దశలో ఆయన వద్ద సంగీతం నేర్చుకున్నాడు.