ఈమాట పాఠకులకు నమస్కారం.
ఈమాట నిర్వహించడంలో మాకున్న పెద్ద సమస్య మంచి రచయితలు, కవులు, వ్యాసకర్తల చేతా ఈమాటకి రాయించడం. అలాగే, కొత్త రచయితలతో రాయించడం కూడా. తరచూ రచయితలందరికీ ఈమాటకు రాయమని ఆహ్వానాలు మేము పంపుతుండడం కద్దు. ఏ కారణాల్ల వల్లనైతేనేం, ప్రతీ సంచిక ఒక ఉత్తమ స్థాయిలో రూపొందించాలన్న మా కోరిక పూర్తిగాఎప్పుడో తప్ప తీరదు. కేవలం ఈమాటకే కాదు, సంచిక సంచికకూ సాహిత్యస్థాయిలో హెచ్చుతగ్గులు మరే పత్రికకైనా కూడా చాలా సామాన్యమైన అనుభవమే.
గత కొంతకాలంగా మమ్మల్ని ఇంకో పెద్ద సమస్య పీడిస్తున్నది. ఈ సమస్య అచ్చుపత్రికలకు లేకపోయినా వెబ్ పత్రికలన్నీ ఎంతో కొంత అనుభవిస్తున్నవే. ఆ సమస్య – పాఠకులు రచనలపై అభిప్రాయాలు వెలిబుచ్చుతున్న తీరు. ఈ సమస్య ప్రస్తుతం మరింత తీవ్రమైందనీ, సత్వరమే ఏదో ఒక నివారణ అమలు చేయకుంటే ఈమాట ఆదర్శాలకే దెబ్బ తగిలే ప్రమాదం ఉన్నదనీ మేమనుకుంటూన్నాం. ఒక రచన నచ్చినా, నచ్చకపోయినా తమ అభిప్రాయాలని విశదంగా, విశ్లేషణాత్మకంగా ప్రకటించడం ద్వారా రచయితలకు మేలు చేయాల్సిన పరిస్థితి లేకపోగా, వ్యక్తిగత నిందలూ, ఎత్తిపొడుపులూ, రచనపైనే గాక రచయితలపై, తమ అభిప్రాయాలతో విభేదించినవారిపై సవాళ్ళూ, వెటకారాలతో ఈ అభిప్రాయాల వేదిక అస్థవ్యస్థంగానే ఉంది. ఇక అసంగతమైన అభిప్రాయాలూ తక్కువేమీ కావు. ఈ స్థితికి అందరు పాఠకులు కారణం కారు. కానీ ఏ కొద్దిమందివో తప్పులెన్నడం ఈ సమస్యను నివారించడంలో ఉపకరించదు. అందువల్లనే ఈ నాలుగు ముక్కలూ, అందరికీ చెప్పదల్చుకున్నాం. ఇది ఉపన్యాసంలాగా అనిపిస్తుందేమో, క్షంతవ్యులం, కానీ చెప్పక తప్పట్లేదు.
రచయితలకూ పాఠకులకూ స్నేహపూరితమైన వాతావరణంతో ఒక ఉమ్మడి వేదికగా మనగల్గడం ఈమాట ఆశయాలలో ఒకటి. రచయితలు, కవులు తమ రచనలు ప్రచురించిన తర్వాత వాటి గురించిన చర్చలో పాల్గొనడమా, లేదా అన్నది వారి వ్యక్తిగత విషయం. కొంతమందికి ప్రత్యక్షంగా పాఠకులతో చర్చించడంలో ఉపయోగమున్నదని అనిపించచ్చు. తమ రచనకి వెలుపలగా తాము చెప్పగలిగినదేమీ లేదనీ, అలా చెప్పవలసిరావడం తమ రచనా వైఫల్యమనీ, కేవలం రచన ద్వారానే పాఠకులను చేరాలనే అభిప్రాయమూ వుండచ్చు. ఈమాటకు సంబంధించినంతవరకూ అది పూర్తిగా రచయితల ఇష్టాయిష్టాల సంగతి, ఈ విషయంలో వారికి పూర్తి స్వాతంత్ర్యం ఉన్నది.
ఐతే, ఒకవేళ రచయితలు పాఠకులతో చర్చలో పాల్గొనదల్చుకుంటే వారికీ ఆ వెసులుబాటు, పాఠకులుగా మనం కలిగిస్తున్నామా? మన ప్రవర్తన రచయితలకు ఒక సుహృద్భావాన్ని కలిగిస్తున్నదా, మనతో వారి రచనలపై చర్చకు వారిని ప్రోత్సహిస్తున్నదా? సమాధానం లేదనే చెప్పుకోవలసి వస్తుంది. కేవలం రచనను పొగడటమే అయితే ఎవరికీ ఏ కష్టమూ లేదు. ఒక రచన తమకు నచ్చనిది, వివాదాస్పదమైనది, తమ మనోభావాలనీ, తమ సాహితీ సంస్కారాన్నీ ప్రశ్నించేదీ ఐనప్పుడు, అప్పుడు ఆ రచనపై అభిప్రాయాన్ని వెల్లడించడంలో చాలా సహనమూ, సంస్కారమూ, భాషలో ఔచిత్యమూ ఎంతో అవసరం. అభిప్రాయం ఎందుకు రాస్తున్నాను? ఏమాశించి రాస్తున్నాను? దీనివల్ల ఈ వేదికకు లేదా నాకు ఒనగూరేదేమిటి? అభిప్రాయం రాస్తున్నప్పుడు పాఠకులు తమకు తాము వేసుకోవల్సిన ప్రశ్నలివి. ఆఁ, మన్దేం పోయింది! మనం రాసేది రాసేద్దాం. అంత నచ్చకపోతే సంపాదకులు ఎడిటో డెలిటో చేస్కుంటారులే! అనే మనస్తత్వం ఏ రకంగానూ ప్రయోజనకరం కాదు – రచయితకైనా, మనకైనా, ఈమాటకైనా.
ప్రత్యేకించి మనం గుర్తుంచుకోవల్సిన విషయం ఒకటున్నది. అది ఒక రచన అశ్లీలమని మనకనిపించినప్పుడు, ఆ రచనపై అభిప్రాయం వెలిబుచ్చడంలో అశ్లీలతను చూపించరాదన్నది. సమాజం నిర్ణయించిన సభ్యత, నైతికతల నియమనిబంధనలను తోసిరాజనే స్వాతంత్ర్యం ఒక రచయితకే ఉన్నది, కేవలం తన రచనల ద్వారా. అది ఆ రచయిత లేదా కవి సృజనాత్మకతకు సంబంధించినది. (మాటంటే చాలు మనోభావాలు దెబ్బతినడం (అప్పుడప్పుడూ అనక ముందే) సంస్కృతిలో భాగమైపోయిన ఈ రోజుల్లో, సాహిత్యానికి ఆ కుసంస్కారపు సంకెళ్ళు మరిన్ని పడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిదీ కూడా). ఆ స్వాతంత్ర్యం రచనా వస్తువుకు సహజమైనదేనా, అవసరమైనదేనా, లేక రచన ఒక సాకుగా దుర్వినియోగం చేయబడిందా – ఈ ప్రశ్నలు కూడా, ఆ రచన తాలూకు సాహిత్యాంశ పై చర్చలో ఉండవలసిన విషయాలే. ఇవి చర్చించే వారిలో తీవ్రమైన భావావేశాలని కలిగించే ప్రశ్నలే. కానీ సహేతుకమైన విమర్శ ఎంత నిశితంగా వున్నా అంగీకారమే. అవసరమైనప్పుడు మోతాదు మించని వ్యంగ్యం ఆహ్లాదకరమే కాదు, ఆరోగ్యకరం కూడా. స్పష్టత లేకుండా, కేవలం హేళనతో కూడిన వెటకారపు విసురు ఒక తాత్కాలిక సంతృప్తినిస్తుందేమో గానీ, అంతకుమించి అది పూర్తిగా నిష్ప్రయోజనం.
అచ్చు పత్రికలవారు వచ్చిన అభిప్రాయాలన్నీ ప్రచురించరు వారికి నచ్చినవి తప్ప, ఇది స్థలాభావం వల్ల కూడా. అలాగే ప్రతీ అభిప్రాయమూ సంపాదకుడిని సంబోధిస్తూ ఉంటుంది. ఇందువల్ల పరస్పర వాగ్వివాదాలకు తావు వుండదు. అంతేకాక, ఉత్తర ప్రత్యుత్తరాలలో వున్న జాప్యం వలన సాధారణ పాఠకులకు చర్చలో పాల్గొనే అవకాశం అంతగా వుండదు కూడా. ఎలెక్ట్రానిక్ పత్రికలకు ఈ నిర్బంధాలు లేవు. ఒక రచన చదవగానే పాఠకులు వారి అభిప్రాయాలను మిగతా పాఠకులతో, రచయితతో, పత్రికతో పంచుకోవచ్చు. నిష్కర్షగా తమ అభిప్రాయాలు చెబుతూ చర్చలో పాల్గొనవచ్చు. స్థలాభావమేమీ లేకపోవడం వలన తమ జవాబులు విస్తృతంగా రాయవచ్చు. కొన్నిచోట్ల మినహా, అభిప్రాయం ఎవరిది అనేది ముఖ్యం కాదని నమ్మేవారు ఇవన్నీ తమ ఉనికి గోప్యంగా వుంచుకునే చేయచ్చు. అంటే, పాఠకుల అభిరుచులూ ఇష్టాయిష్టాలను బట్టి, అందరూ చర్చలో పాల్గొనవచ్చు. మరైతే, ఈ చర్చావేదికల స్థాయి ఇలా పతనం కావడానికి కారణమేమిటి?
ఏదైతే వరమో అదే శాపంగా మార్చుకోవడం వల్ల ఇలా జరుగుతోంది. ఒక సౌకర్యాన్ని దుర్వినియోగం చేసుకోడం వల్ల జరుగుతోంది. ముఖ్యంగా, ఒక నమ్మిక కోసం తమ ఉనికిని గోప్యంగా వుంచుకునే వెసులుబాటును చీకటిలో నిలబడి మిగతావారిపై బురద జల్లడానికి వాడుకోవడం (తమ అభిప్రాయాలని వెలుగులో నిలబడి ప్రకటించలేని అధైర్యం కూడా కావచ్చునేమో), తాము రాసినదాన్ని ఒకసారి మళ్ళీ చదువుకుని సరిదిద్దుకునే ఓపిక ఓర్పూ లేకపోవడం, ప్రతివిమర్శను ఆహ్వానించలేకపోవడం, తన అభిప్రాయాన్ని విశదంగా ప్రకటించటం కంటే పక్కవారిని నిందించడంలో ఎక్కువ శ్రద్ధ చూపించడం, సాత్వికులపై అఘాయిత్యం చేసి సాహిత్యచర్చను భ్రష్టం చేయడం… చీరలు నూరు టంకములు చేసెడివైనను పెట్టెనుండగా చేరి చిరుంగ గొరుకు చిమ్మట కేమి ఫలంబు అనడిగిన భాస్కరుడిలాగే… ఇలా మనకు కనపడుతూ అర్ధం కాని కారణాలెన్నో. దురదృష్టవశాత్తూ ఇది ఈ-లోకంలో అనివార్యమైన పరిస్థితి.
ప్రతీ సంచికా ప్రతీ పాఠకుడికీ నచ్చేలా ఉండాలనుకోవడం ఎంత వ్యర్థాదర్శమో, ప్రతీ పాఠకుడు ఆదర్శవంతంగా వుండాలనుకోవడం కూడా అంతే. ఎంతో నిగ్రహంతో ఆధారాలూ రుజువుల సాయంతో జరిగే శాస్త్రచర్చల్లో కూడా వ్యక్తిగత ఆవేశాలు బైటపడటం అప్పుడప్పుడూ జరుగుతున్నదే. అందువల్ల, మనం ఒక నిర్దిష్టమైన ఆశయంతో పని చేస్తున్నప్పుడు కొన్ని నిబంధనలూ, నియమాలూ తప్పనిసరి అవుతై. ఇక్కడ ఒక చిక్కుంది. ఈ నియమాలు భావ ప్రకటనా స్వేచ్చని నిర్బంధించేవిగా వుండకూడదు. అలా అని అనియంత్రిత స్వేచ్చ కూడా కూడదు. మరి ఇంకెలా?
ఈమాట సంపాదకుల మధ్య ఈ ప్రశ్న పై చర్చ ఎప్పటినుండో జరుగుతున్నది. ఈ ప్రయత్నంలో భాగంగానే ఇప్పటికే కొన్ని పద్ధతులు పాటిస్తున్నాం – అభిప్రాయాలలో అనుచితమైన వాక్యాలని తీసివేయడం, రచనకు ఏ సంబంధమూ లేని అభిప్రాయాలని ఏరివేయడమూ, ఇలా. ఐతే, అభిప్రాయాలు చర్చగా మారినప్పుడు ఈ మితపాటి పరిష్కరణ సరిపోతున్నట్లు అనిపించదు. అసలు అభిప్రాయవేదిక ఒక సామూహిక చర్చావేదికగా అనివార్యంగా మారడంలోనే ఈ చిక్కుంది. ఈమాట ఆదర్శాలకు ఆయువుపట్టైన చర్చలని ఒదులుకోలేం, వెబ్ పత్రిక సౌకర్యాలని కాదనుకోలేం కూడా. అందువల్ల, ఈ సంచికనుండీ కొన్ని మార్పులు ప్రవేశపెడుతున్నాం.
- ప్రత్యేకంగా ఈమాటలోనే ఒక సాహిత్య చర్చావేదికను ఏర్పాటు చేశాం.
- ఈమాట రచనలపై అభిప్రాయాలు రాసేవారికై ఒక నియమావళిని ప్రవేశపెడుతున్నాం.
సాహితీ వాగ్వివాదాలనూ, రచనలపై కేవలం అభిప్రాయాలనూ ఇలా వేరుచేయడం ప్రస్తుతం మేము పాటిస్తున్న పద్ధతికంటే మంచి ఫలితాలిస్తుందనే ఆశిస్తున్నాం. ఐతే, మరింత మెరుగైన పద్ధతులు అన్వేషించడం కొనసాగుతూనే వుంటుంది. చివరిగా, మేమెన్ని నియమాలు పెట్టినా, ఎన్ని కొత్తమార్గాలు వెతికినా, పాఠకులుగా మీ సహాయ సహకారాలు లేనిదే ఏ ప్రణాళికా విజయవంతం కాదు. ఈమాటను మరింత మెరుగుగా తీర్చిదిద్దడానికి మీ తోడ్పాటు ఎంతో అవసరం. అది మాకెప్పుడు వుంటుందనే ఆశిస్తున్నాం, వుండాలనే కోరుకుంటున్నాం.
ఈ సందర్భాన్ని అవకాశంగా తీసుకొని ఈమాట పాఠకులైన మిమ్మల్ని ఈ విషయంపై చర్చకు ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. మీ అభిప్రాయాలు వివరంగా మాకు చెప్పండి, – మా అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తున్నారా లేక ఈమాట అభిప్రాయవేదిక ఇప్పటిలానే ఉండాలని అనుకుంటున్నారా? కాని పక్షంలో, ఈ కొత్త పద్ధతి మీకు సమ్మతమేనా? ఏ నియమాలు అవసరం, ఏవి కావు? పోతే, చర్చావేదిక ఎలా వుంటే బాగుంటుందని మీరనుకుంటున్నారు? ఈమాటలో మీ పాత్రను మీరే నిర్వచించి మాతో నిర్వహణలో సహకరించమని మా విన్నపం.