గిడుగు వేంకట రామమూర్తి గారి ప్రవేశంతోనే వ్యావహారికా భాషావాదం ఉద్యమ రూపం ధరించింది. ఇది 1910 లో ఆరంభమైంది. ఆ యేడే గురజాడ అప్పారావుగారి ’ముత్యాల సరాలు ’ , ’నీలగిరి పాఠాలు’ వ్యావహారికంలో ప్రకటితమైనాయి. ఆటో ఎస్పెర్సన్ (Otto Jesperson) అనే భాషా శాస్త్రజ్ఞుడు ఇంగ్లీషులో రాసిన ’A Shorter English Grammar’ ను గిడుగువారు వ్యావహారికంలోనికి అనువదించారు. సనాతన పండితులు ఆయన వ్యావహారికవాదాన్ని ’గ్రామ్యభాషావాద’ మని ఆక్షేపింపసాగారు. ’ప్రత్యక్ష పద్ధతి’ (direct method) ద్వారా విద్యాబోధన చేస్తే పఠనపాఠాలు సుకరంగా త్వరగా సాధ్యమవుతాయని నిరూపించి గిడుగువారు డేనియల్ జోన్స్ వంటి జగద్విఖ్యాత భాషావేత్తల మెప్పు సంపాదించారు. సహజంగా సనాతన ధృక్పధంతో బోధించే ఉపాద్యాయులకు ఈ నూతన పద్ధతి వివరించడానికి విశాఖపట్టణంలో ఉపాధ్యాయ సమావేశ మొకటి మే నెలలో ఏర్పాటయింది. అందులో ప్రసంగించిన గిడుగువారు తాము ప్రతిపాదించే నూతన విధానానికి సహాయ సహకారాలు అభ్యర్తిస్తూ పనిలోపనిగా వ్యావహారిక రచనలు ప్రోత్సహించమని , పాఠ్యగ్రంధాలుగా వాటిని నిర్ణయించమని ఉద్భోదించారు. ఆయన వాదానికి వివరణ రూపంలో నవంబరు 24 న ‘గ్రామ్య శబ్ద విచారణ‘ మనే వ్యాసాన్ని గురజాడవారు ప్రచురించారు. గిడుగువారి ఉద్యమ ధోరణికి ఇది ఎంతో సహయకారి అయింది.
గిడుగువారి వాదంలో సిద్ధాంతరీత్యా ముఖ్యమైనవిశేషాలు నాలుగు:
- విద్యావసతులు ఇప్పుడు మునపటిలాగా ఏ కొందరికో పరిమితంకావు కాబట్టి సామూహిక విద్యాసౌకర్యాలకు కావ్యభాష ఉపయోగించదు. ఆధునిక శాస్త్రీయ విషయబోధకు ఆధునిక భాషారూపమేగాని ప్రాచీన కవితైకభాష పనికిరాదు. అందువల్ల బోధనమాధ్యంగా, రచనామాధ్యంగా శిష్టవ్యవహారమే ఉండాలి.
- ప్రత్యక్ష పద్ధతిలాంటి ఆధునిక విద్యాబోధన పద్ధతులను అవలంబిస్తే పఠన పాఠనాల్లో సౌలభ్యం కలుగుతుంది.
- ‘గ్రాంధిక భాష’ అనేది కొక్కొండ వేంకటరత్నం పంతులు, కందుకూరి వీరేశలింగము, వేదం వేంకటరాయశాస్త్రి గార్లవంటి మహామహులకే వంటబట్టలేదని వారిలో వారు అన్యోన్యం నిందించుకుంటున్నప్పుడు సామాన్యులకది కొరుకుడు పడేదికాదు. ఒకనాటి భాషావిశేషం ఈనాటి వ్యవహారానికి దూరమయింది కాబట్టి సౌలభ్యదృష్టితో ప్రయోజనదృష్టితో వ్యావహారికమే ఉపాదేయం.
- పరంపరాగంతంగా చూసినా వ్యావహారిక రచనాసంప్రదాయం ముఖ్యంగా వచనవాజ్మయంలో కనిపిస్తుండగా, చిన్నయసూరి కారణంగా పూర్వ గ్రంధాలను ‘పరిష్కరణ, సంస్కరణ’ ల పేరిట గ్రాంథికీకరించి వికృతీకరించటం జరిగింది. ఇది మన పూర్వులకు మనమే చేసిన అపచారం. చారిత్రకంగా భాషలో మార్పురావటం సహజపరిణామం. కాబట్టి వెయ్యేళ్ళనాటి ‘కావ్యభాష’ నేటి శాస్త్ర బోధనకుగాని వచనరచనలకుగాని పనికిరాదు.
ఈ నాలుగు సిద్ధాంతాలనూ సమర్ధిస్తూ దేశ విదేశానుభవాలను ప్రపంచ సారస్వత పరిస్థితులను భాషాశాస్త్ర పరిశీలనలను క్రోడీకరించి ఆయన విశదీకరించేవారు. గిడుగు, గురజాడలు సమకాల విశ్వసారస్వత స్థితిగతులను పరిశీలించిన వాళ్ళు. ఆధునిక సామాజిక పరిస్థితులను సిద్ధాంతాలను పరీక్షించి గోపాలకృష్ణ గోఖలే వంటి మహనీయుల సాంఘిక బౌద్ధిక దృక్పధాలను అలవరచుకున్నవాళ్ళు. వారి ప్రతిపక్షులకు ఏ విధమైన విశాల దృక్పథంగాని ఇరుగు పొరుగుల అనుభవాలను గమనించటంగాని అలవాటు లేదు. ఇదే తీవ్ర వాదోపవాదాలకు దారి తీసింది. దృష్టి భేదాలు అనుభవ భేదాలూ ఘర్షణకు దిగాయి. మద్రాసు విశ్వవిద్యాలయం సెనేటులో తమకున్న సభ్యత్వం పురస్కరించుకుని గిడుగు, గురజాడలు ‘ఆధునిక వచనరచనలు’ మాత్రమే పాఠ్య గ్రంధాలుగా ఉండాలనీ విద్యార్థులు సమాధాన పత్రాలను ఆధునిక శైలిలోనే రాయాలనీ ప్రతిపాదించారు. ఈ సిద్ధాంతాన్ని అంగీకరించిన మొదటితరం కవిపండితుల్లో బుర్రా శేషగిరిరావుగారు , సెట్టి లక్ష్మినరసింహంగారు తమ శక్తికి మించిన ఉత్సాహశక్తి గలవాళ్ళు . వీరిలో రెండోవారు ‘గ్రీక్పురాణకథ ‘ అనే పుస్తకాన్ని అర్ధ గ్రాంథికంలో కృత్రిమ వ్యావహారికంలో రాసి వ్యావహారికోద్యమానికి అశక్త సహాయం చేసి ఇబ్బందులు తెచ్చిపెట్టేరు. ఈ గ్రంథాన్ని ప్రభుత్వం స్కూల్ ఫైనల్ పరీక్షకు ఉపవాచకంగా (Non-detailed Text) నియమించింది. దాంతో పండిత లోకంలో పెద్ద సంచలనం బయలుదేరింది.
విశాఖపట్టణం కళాశాలకు ప్రిన్సిపాలుగా వున్న పి.టి.శ్రీనివాస అయ్యంగారు పాఠ్యగ్రంధంగా ఉండటానికి ‘Indian Practical Arithmetic’ అనే పుస్తకాన్ని 1911 లో వ్యావహారికంలో రాసి ప్రచురించారు. అదే సంవత్సరం ఈ గ్రంథకర్త పీఠికతోనే వేదం వేంకటాచలమయ్యగారి ‘విధి లేక వైద్యుడు’ అనే పుస్తకం వ్యావహారికంలో వచ్చింది. వీటినీ, ముఖ్యంగా బుర్రాశేషగిరిరావుగారి ఉపన్యాసాలనూ, ఆధిక్షేపిస్తూ వావిలికొలను సుబ్బారావు (వాసుదాసు) గారు ’ఆధునిక వచన రచనా విమర్శనము’ అనే పుస్తకం రాసి అందులో వ్యావహారికమంటే గ్రామ్యమేనని వ్యాకరణ శాస్త్ర రీత్యా నిరూపించటానికి ప్రయత్నించారు.
ఆయేడు అచ్చయిన పుస్తకాల్లొ వ్యవహారిక వాదాన్ని సమర్ధిస్తూ , గ్రాంథిక వాదాన్ని తీవ్రంగా నిరసిస్తూ, సనాతన పండితులను పూర్తిగా రెచ్చగొడుతూ ఆంగ్లంలో వెలువడ్ద కరపత్రం పి.టి.శ్రీనివాస్ అయ్యంగారి “Life or Death – A Plea for Vernaculars” అనేది . వర్తమానాంధ్ర భాషలోనే విద్యాబోధన జరగాలని వాదించటమే ఈ గ్రంథరచనకు పరమోద్దేశం. ఈ సిద్ధాంతాలను సమర్ధిస్తూ ప్రచారం చేయటానికి ‘ఆంధ్ర సారస్వత సంఘ’ మనే పండితమండలిని విజయనగరంలో స్థాపించటం జరిగింది. విజయనగర కళాశాలాధ్యక్షులు కిళాంబి రామానుజాచార్యులవారు దీనికి అధ్యక్షులుగాను, బుర్రా శేషగిరిరావుగారు కార్యదర్శిగాను ఎన్నికైనారు. కొన్ని సంవత్సరాలుగా వాడుకలో ఉన్న రీతిలోనే గ్రంథ రచన సాగాలని, శిష్ట వ్యవహారంలో ఉన్న భాషే ఈనాటి ప్రామాణిక భాష కాబట్టి అందులోనే పఠన పాఠనాలు జరగాలని ఈ సంఘంవారు తీర్మానించారు.
పై సిద్ధాంతాలవల్ల భాషా సాహిత్యాలు ఆ వ్యవస్థలో పడిపోతాయని , వ్యావహారికమనేది గ్రామ్యమేనని, ఈ నూతన వాదం వల్ల ప్రాచీన సాహిత్యానికి అగౌరవ ప్రమాదాలు జరక్కుండా నిరోధించాలని ఉద్దేశపడిన పండితులు కొందరు జయంతి రామయ్య పంతులుగారి అధ్యక్షతన కాకినాడలో ‘ఆంధ్ర సాహిత్య పరిషత్తు’ (Telugu Academy) స్థాపించారు. వేదం వేంకటరాయశాస్త్రిగారు, కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రిగారు, వావిలికొలను సుబ్బారావుగారు మొదలైన విద్వాంసులీ సంఘంలో సభ్యులు. తమ ఆశయ ప్రచారానికి పూర్వసాహిత్య సేవకూ పనికి వస్తుందని అప్పుడే ‘ఆంధ్ర సాహిత్య పరిషత్పత్రిక’ అనే పత్రికను కూడా సంఘం పేరిట ఆరంభించారు. ఈ సంఘంవారు ఆ యేడు మద్రాసు పచ్చయప్ప కళాశాలలో రెండు రోజులపాటు ప్రథమసాంవత్పరిక సభ నిర్వహించారు. అందులో కాళహస్తి వాస్తవ్యులు శతఘంటము వేంకటరంగశాస్త్రిగారు గ్రామ్యాన్ని ఖండిస్తూ ప్రసంగించగా, గిడుగు వేంకటరామమూర్తిగారు ‘ఆంధ్ర భాషా చరిత్ర’ అనే వ్యాసాన్ని పఠించి శిష్టవ్యావహారికమే ఉపాదేయమని వాదించారు. గ్రాంథిక వ్యావహారిక వివాదం మీద అనేక విద్వాంసులను ఆహ్వానించి గోష్ఠి ఏర్పాటు చెయ్యాలనే నిర్ణయం అప్పుడు తీసుకున్నారు. గిడుగు, గురజాడల వ్యాసాలమీద చర్చలుకూడా జరిగేయి.
ఆ తర్వాత (1911) నవంబరు 24న కందుకూరి వీరేశలింగంగారి అధ్యక్షతన సాహిత్య పరిషత్తువారు ‘గ్రామ్యాదేశ నిరసన సభ’ ను జరిపేరు. అధ్యక్షులవారు భాష ‘నాగరభాష’, ‘గ్రామ్యం’ అని రెండు విధాలుగా ఉంటుందని, ‘నాగరభాష’ సంస్కృతంలాగా పరిష్కృతమయింది కాబట్టి కావ్య రచనకు పూర్తిగా పనికి వస్తుందని, ‘గ్రామ్య’ మనేది ‘పామరవినోదార్ధము’ గ్రంధాల్లో అక్కడక్కడ ‘పాత్రోచిత భాష’ గా మాత్రమే వాడదగిందని సెలవిచ్చారు. పూర్వకాలపు తెలుగు వ్యాకరణాలు పద్యకావ్యాలకోసం ముఖ్యంగా ఉద్దేశింపబడ్డవని, గద్యానికి చిన్నయసూరి బాలవ్యాకరణ మొక్కటే వ్యాకరణమని ఆయన అభిప్రాయపడ్డారు.వ్యావహారిక రచనలకు అనుమతిస్తే ‘మాండలిక’ పదజాలం కావ్యభాషలో చేరి భాషా ‘పరిశుభ్రత ‘ను చెరుస్తుందని వారు వాదించారు. (ఆంధ్ర సాహిత్య పరిషత్పత్రిక. 1-2, పేజీలు 151-58 చూడండి).
జయంతి రామయ్యగారు ఉపన్యసిస్తూ వ్యావహారిక రచనల్లో ‘సులభత’ ఉందని చెప్పటం నిజంకాదని, తెలుగుభాష నన్నయనాటికే స్థిరపడ్డదని, అందువల్ల షేక్‌స్పియర్ కాలం వరకూ మారుతు వచ్చి ఆ మహాకవి ప్రయత్న ఫలితంగా స్థిరపడ్డ ఆంగ్లభాషతో మన భాషకు పరిణామక్రమంలో పోలికేలేదని, ‘గ్రామ్య’ గ్రంధాలు పాఠ్యగ్రంధాలుగా పనికిరావని, వ్యావహారిక కవితను అంగీకరిస్తే మాండలికమయమైన ‘నిస్సారకవిత’ మాత్రమే బయలుదేరి కాలక్రమాన ప్రాచీన సాహిత్యం దుర్భోధమై పోతుందని వివరించారు (ఆంధ్ర సాహిత్య పరిషత్పత్రిక పేజీలు.151-58 చూడండి).
వేమూరి విశ్వనాధశర్మగారు వ్యావహారిక విషయంలో తమకు మూడు విభిన్నాభిప్రాయాలున్నాయని విశదీకరించారు. సగానికి సగం అన్య దేశ్యాలతో నిండిన వ్యవహారికం సుబోధకం కాదని, ఆ పదజాలమైన ఉద్గ్రంథ రచనకు చాలదని, వ్యావహారిక వ్యాకరణ విరుద్ధం కాబటి గ్రాంథిక భాషగా పనికిరాదని ఆయన మొదటి అభిప్రాయం. విసంధి పాటించడంగాని, అర్ధానుస్వార శకటరేఫలను పరిహరించటంగాని అంగీకార్యం కాదనేది రెండో అభిప్రాయం. భాషాంతర పదాలను (సంస్కృతం భాషాంతరం కాదని వారి విశ్వాసం) గ్రంథ రచనలో ప్రయోగించటం సమ్మతం కాదనేది మూడో అభిప్రాయం (ఆంధ్ర సాహిత్య పరిషత్పత్రిక పేజీ 154 చూడండి). గ్రామ్య గ్రాంధిక వివాదాన్ని గురించి తమ అభిప్రాయాలు తెలుపుతూ వ్యవహారిక రచనలు పాఠ్యగ్రంథాలుగా పనికిరావని నిషేదించమని కోరుతూ ప్రభుత్వానికి ఒక వినతిపత్రం సమర్పించాలని కూడ ఆ సభలో నిర్ణయించారు. ఆ వినతి పత్రంలోని ప్రధానాంశాలివి:
- క్రీ.శ. 12వ శతాబ్దినాటి (?!) నన్నయనుండి నేటి వీరేశలింగంగారి వరకూ గ్రాంథిక భాష మారనే లేదు.
- పూర్వ కవులందరూ యత్కించిద్భేదంలేని ఒకే భాషలో రాశారు. అందువల్ల గ్రాంధిభాషకు ఏకరూపత (uniformity), ప్రామాణికత ఉన్నాయి.
- ఆధునికాంధ్రమనే వ్యావహారిక భాషలో ప్రత్యేకసాహిత్యం లేదు.
- ఆధునిక భాషకు వ్యాకరణంలేదు (=వ్యాకరణ సూత్రాలు లేవు).
- కాలక్రమాన ఈ ఆధునిక భాష కూడా రాబోయ్యే తరాల వారికి దుర్గ్రాహ్యమవుతుంది.
ఈ విధంగా ఆంధ్రదేశంలోని భిన్న ప్రాంతాల్లో ఉన్న కవిపండిత మేధావులందరినీ పై రెండు సంఘాలవారూ ముగ్గులోకి దింపేరు. ఈ చర్చల వేడి క్రమక్రమంగా పెరుగుతూ వచ్చింది. ఆంధ్రసాహిత్య పరిషత్తువారి అధ్వర్యంలో 1912 మే 15, 16 తేదీలలో చెన్నపట్టణంలొ మరో సభ జరిగింది. దానికి కొమర్రాజు లక్ష్మణరావుగారు అధ్యక్షత వహించారు. పేరు కాశీనాధశాస్త్రిగారు లౌకిక వైదిక సంస్కృత్యాల మధ్య ఉన్నట్లే గ్రాంథిక వ్యావహారికాంధరాల మధ్య ‘వ్యాకరణ సిద్ధ ‘ మైన భేదముందనీ, అధునాతన శిష్ట వ్యవహారాన్ని అంగీకరించాలనీ వాదించారు. వాద ప్రతివాదాల తర్వాత పిల్లల పుస్తకాల్లో మాత్రం విసంధి అంగీకార్యమని, గ్రాంథికమే శరణ్యమని సభవారు తీర్మానించారు. అయితే ఉపయుక్త గ్రంథకరణదేశభాషాసభవారు వి.శఠగోపాచార్యులవారిచేత, తదితరులచేత పరిష్కరింపచేసి పునర్ముద్రించిన 1858 నాటి భూగోళంలోనే విసంధి పాటింపబడింది. అందువల్ల ఈ సభవారు ఆమోదించిన నూతన సంస్కారమేమీ లేనట్లే లెక్క (చూ. గురజాడ అప్పారావుగారు, A Minute of Dissent etc.p.78, esp.70).
ఆ యేడు జూన్‌లో దివాన్ బహద్దూర్ ఎం.ఆదినారాయణయ్యర్‌గారి పీఠికతో వేదం వేంకటరాయశాస్త్రిగారు ప్రచురించిన ‘గ్రామ్యాదేశనిరసన ‘మనే పుస్తకం పైవాదానికి మంచి సమర్ధన గ్రంథంగా వెలువడ్దది. స్కూల్ ఫైనల్ పరీక్షకు కూర్చునే విద్యార్థి ప్రాచీన నవీన పాఠ్య గ్రంథాల్లో వేటినయినా చదవ్వచ్చునని అంగీకరించాలని కోరుతూ, గ్రామ్య గ్రాంథిక వివాదంలో తమ విశ్వాసాలేమో వివరిస్తూ ఆంధ్ర సాహిత్య పరిషత్తువారు అప్పటి మద్రాసు గవర్నర్ సర్ మరె హేమిక్ (Sir Murray Hammik) గారికి ఆగస్టు 7న వినతిపత్రం సమర్పించారు.(చూ.ఆం.సా.ప.ప.,2.1.అనుబంధం.1) తత్ఫలితంగా స్కూల్ ఫైనల్ బోర్డు కార్యదర్శి సెప్టెంబరు 20 తేదీన (G.O.No.3898) విద్యార్థులు సనాతనాధునాతన పాఠ్యగ్రంథాల్లో వేటిలోనైనా పరీక్ష తీసుకొనే అవకాశం అనుగ్రహిస్తూ ఉత్తరువిచ్చాడు. అప్పటి నవీన పాఠ్యగ్రంథాలు మూడు:ఏనుగుల వీరాస్వామయ్యగారి కాశీయాత్రా చరిత్ర, ఆర్డెన్ తెలుగు వ్యాకరణం, సి.పి.బ్రౌన్ పాఠపుస్తకం. ఆ తర్వాత సంప్రాదాయవాదుల ఒత్తిడికి లోనై విద్యార్థులు వైయక్తికంగా ఈ అవకాశం వినియోగించుకోవటనికి వీలు లేదని, ఒక్కొక్క పాఠశాల ఈ రెండు రకాల పుస్తకాల్లో వేటిని చదవాలని నిర్ణయిస్తుందో బడి మొత్తానికి అవే పాఠ్య గ్రంథాలుగా ఉండాలని, మొదటి ఉత్తరువు సవరిస్తూ సెప్టెంబరు 29 న (G.O.3479) మరో ఉత్తరువు జారీ అయింది. ఇది గ్రాంథిక వాదానికి మహావిజయం.