గిడుగు వేంకట రామమూర్తి గారి ప్రవేశంతోనే వ్యావహారికా భాషావాదం ఉద్యమ రూపం ధరించింది. ఇది 1910 లో ఆరంభమైంది. ఆ యేడే గురజాడ అప్పారావుగారి ’ముత్యాల సరాలు ’ , ’నీలగిరి పాఠాలు’ వ్యావహారికంలో ప్రకటితమైనాయి. ఆటో ఎస్పెర్సన్ (Otto Jesperson) అనే భాషా శాస్త్రజ్ఞుడు ఇంగ్లీషులో రాసిన ’A Shorter English Grammar’ ను గిడుగువారు వ్యావహారికంలోనికి అనువదించారు. సనాతన పండితులు ఆయన వ్యావహారికవాదాన్ని ’గ్రామ్యభాషావాద’ మని ఆక్షేపింపసాగారు. ’ప్రత్యక్ష పద్ధతి’ (direct method) ద్వారా విద్యాబోధన చేస్తే పఠనపాఠాలు సుకరంగా త్వరగా సాధ్యమవుతాయని నిరూపించి గిడుగువారు డేనియల్ జోన్స్ వంటి జగద్విఖ్యాత భాషావేత్తల మెప్పు సంపాదించారు. సహజంగా సనాతన ధృక్పధంతో బోధించే ఉపాద్యాయులకు ఈ నూతన పద్ధతి వివరించడానికి విశాఖపట్టణంలో ఉపాధ్యాయ సమావేశ మొకటి మే నెలలో ఏర్పాటయింది. అందులో ప్రసంగించిన గిడుగువారు తాము ప్రతిపాదించే నూతన విధానానికి సహాయ సహకారాలు అభ్యర్తిస్తూ పనిలోపనిగా వ్యావహారిక రచనలు ప్రోత్సహించమని , పాఠ్యగ్రంధాలుగా వాటిని నిర్ణయించమని ఉద్భోదించారు. ఆయన వాదానికి వివరణ రూపంలో నవంబరు 24 న ‘గ్రామ్య శబ్ద విచారణ‘ మనే వ్యాసాన్ని గురజాడవారు ప్రచురించారు. గిడుగువారి ఉద్యమ ధోరణికి ఇది ఎంతో సహయకారి అయింది.
గిడుగువారి వాదంలో సిద్ధాంతరీత్యా ముఖ్యమైనవిశేషాలు నాలుగు:
- విద్యావసతులు ఇప్పుడు మునపటిలాగా ఏ కొందరికో పరిమితంకావు కాబట్టి సామూహిక విద్యాసౌకర్యాలకు కావ్యభాష ఉపయోగించదు. ఆధునిక శాస్త్రీయ విషయబోధకు ఆధునిక భాషారూపమేగాని ప్రాచీన కవితైకభాష పనికిరాదు. అందువల్ల బోధనమాధ్యంగా, రచనామాధ్యంగా శిష్టవ్యవహారమే ఉండాలి.
- ప్రత్యక్ష పద్ధతిలాంటి ఆధునిక విద్యాబోధన పద్ధతులను అవలంబిస్తే పఠన పాఠనాల్లో సౌలభ్యం కలుగుతుంది.
- ‘గ్రాంధిక భాష’ అనేది కొక్కొండ వేంకటరత్నం పంతులు, కందుకూరి వీరేశలింగము, వేదం వేంకటరాయశాస్త్రి గార్లవంటి మహామహులకే వంటబట్టలేదని వారిలో వారు అన్యోన్యం నిందించుకుంటున్నప్పుడు సామాన్యులకది కొరుకుడు పడేదికాదు. ఒకనాటి భాషావిశేషం ఈనాటి వ్యవహారానికి దూరమయింది కాబట్టి సౌలభ్యదృష్టితో ప్రయోజనదృష్టితో వ్యావహారికమే ఉపాదేయం.
- పరంపరాగంతంగా చూసినా వ్యావహారిక రచనాసంప్రదాయం ముఖ్యంగా వచనవాజ్మయంలో కనిపిస్తుండగా, చిన్నయసూరి కారణంగా పూర్వ గ్రంధాలను ‘పరిష్కరణ, సంస్కరణ’ ల పేరిట గ్రాంథికీకరించి వికృతీకరించటం జరిగింది. ఇది మన పూర్వులకు మనమే చేసిన అపచారం. చారిత్రకంగా భాషలో మార్పురావటం సహజపరిణామం. కాబట్టి వెయ్యేళ్ళనాటి ‘కావ్యభాష’ నేటి శాస్త్ర బోధనకుగాని వచనరచనలకుగాని పనికిరాదు.
ఈ నాలుగు సిద్ధాంతాలనూ సమర్ధిస్తూ దేశ విదేశానుభవాలను ప్రపంచ సారస్వత పరిస్థితులను భాషాశాస్త్ర పరిశీలనలను క్రోడీకరించి ఆయన విశదీకరించేవారు. గిడుగు, గురజాడలు సమకాల విశ్వసారస్వత స్థితిగతులను పరిశీలించిన వాళ్ళు. ఆధునిక సామాజిక పరిస్థితులను సిద్ధాంతాలను పరీక్షించి గోపాలకృష్ణ గోఖలే వంటి మహనీయుల సాంఘిక బౌద్ధిక దృక్పధాలను అలవరచుకున్నవాళ్ళు. వారి ప్రతిపక్షులకు ఏ విధమైన విశాల దృక్పథంగాని ఇరుగు పొరుగుల అనుభవాలను గమనించటంగాని అలవాటు లేదు. ఇదే తీవ్ర వాదోపవాదాలకు దారి తీసింది. దృష్టి భేదాలు అనుభవ భేదాలూ ఘర్షణకు దిగాయి. మద్రాసు విశ్వవిద్యాలయం సెనేటులో తమకున్న సభ్యత్వం పురస్కరించుకుని గిడుగు, గురజాడలు ‘ఆధునిక వచనరచనలు’ మాత్రమే పాఠ్య గ్రంధాలుగా ఉండాలనీ విద్యార్థులు సమాధాన పత్రాలను ఆధునిక శైలిలోనే రాయాలనీ ప్రతిపాదించారు. ఈ సిద్ధాంతాన్ని అంగీకరించిన మొదటితరం కవిపండితుల్లో బుర్రా శేషగిరిరావుగారు , సెట్టి లక్ష్మినరసింహంగారు తమ శక్తికి మించిన ఉత్సాహశక్తి గలవాళ్ళు . వీరిలో రెండోవారు ‘గ్రీక్పురాణకథ ‘ అనే పుస్తకాన్ని అర్ధ గ్రాంథికంలో కృత్రిమ వ్యావహారికంలో రాసి వ్యావహారికోద్యమానికి అశక్త సహాయం చేసి ఇబ్బందులు తెచ్చిపెట్టేరు. ఈ గ్రంథాన్ని ప్రభుత్వం స్కూల్ ఫైనల్ పరీక్షకు ఉపవాచకంగా (Non-detailed Text) నియమించింది. దాంతో పండిత లోకంలో పెద్ద సంచలనం బయలుదేరింది.
విశాఖపట్టణం కళాశాలకు ప్రిన్సిపాలుగా వున్న పి.టి.శ్రీనివాస అయ్యంగారు పాఠ్యగ్రంధంగా ఉండటానికి ‘Indian Practical Arithmetic’ అనే పుస్తకాన్ని 1911 లో వ్యావహారికంలో రాసి ప్రచురించారు. అదే సంవత్సరం ఈ గ్రంథకర్త పీఠికతోనే వేదం వేంకటాచలమయ్యగారి ‘విధి లేక వైద్యుడు’ అనే పుస్తకం వ్యావహారికంలో వచ్చింది. వీటినీ, ముఖ్యంగా బుర్రాశేషగిరిరావుగారి ఉపన్యాసాలనూ, ఆధిక్షేపిస్తూ వావిలికొలను సుబ్బారావు (వాసుదాసు) గారు ’ఆధునిక వచన రచనా విమర్శనము’ అనే పుస్తకం రాసి అందులో వ్యావహారికమంటే గ్రామ్యమేనని వ్యాకరణ శాస్త్ర రీత్యా నిరూపించటానికి ప్రయత్నించారు.
ఆయేడు అచ్చయిన పుస్తకాల్లొ వ్యవహారిక వాదాన్ని సమర్ధిస్తూ , గ్రాంథిక వాదాన్ని తీవ్రంగా నిరసిస్తూ, సనాతన పండితులను పూర్తిగా రెచ్చగొడుతూ ఆంగ్లంలో వెలువడ్ద కరపత్రం పి.టి.శ్రీనివాస్ అయ్యంగారి “Life or Death – A Plea for Vernaculars” అనేది . వర్తమానాంధ్ర భాషలోనే విద్యాబోధన జరగాలని వాదించటమే ఈ గ్రంథరచనకు పరమోద్దేశం. ఈ సిద్ధాంతాలను సమర్ధిస్తూ ప్రచారం చేయటానికి ‘ఆంధ్ర సారస్వత సంఘ’ మనే పండితమండలిని విజయనగరంలో స్థాపించటం జరిగింది. విజయనగర కళాశాలాధ్యక్షులు కిళాంబి రామానుజాచార్యులవారు దీనికి అధ్యక్షులుగాను, బుర్రా శేషగిరిరావుగారు కార్యదర్శిగాను ఎన్నికైనారు. కొన్ని సంవత్సరాలుగా వాడుకలో ఉన్న రీతిలోనే గ్రంథ రచన సాగాలని, శిష్ట వ్యవహారంలో ఉన్న భాషే ఈనాటి ప్రామాణిక భాష కాబట్టి అందులోనే పఠన పాఠనాలు జరగాలని ఈ సంఘంవారు తీర్మానించారు.
పై సిద్ధాంతాలవల్ల భాషా సాహిత్యాలు ఆ వ్యవస్థలో పడిపోతాయని , వ్యావహారికమనేది గ్రామ్యమేనని, ఈ నూతన వాదం వల్ల ప్రాచీన సాహిత్యానికి అగౌరవ ప్రమాదాలు జరక్కుండా నిరోధించాలని ఉద్దేశపడిన పండితులు కొందరు జయంతి రామయ్య పంతులుగారి అధ్యక్షతన కాకినాడలో ‘ఆంధ్ర సాహిత్య పరిషత్తు’ (Telugu Academy) స్థాపించారు. వేదం వేంకటరాయశాస్త్రిగారు, కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రిగారు, వావిలికొలను సుబ్బారావుగారు మొదలైన విద్వాంసులీ సంఘంలో సభ్యులు. తమ ఆశయ ప్రచారానికి పూర్వసాహిత్య సేవకూ పనికి వస్తుందని అప్పుడే ‘ఆంధ్ర సాహిత్య పరిషత్పత్రిక’ అనే పత్రికను కూడా సంఘం పేరిట ఆరంభించారు. ఈ సంఘంవారు ఆ యేడు మద్రాసు పచ్చయప్ప కళాశాలలో రెండు రోజులపాటు ప్రథమసాంవత్పరిక సభ నిర్వహించారు. అందులో కాళహస్తి వాస్తవ్యులు శతఘంటము వేంకటరంగశాస్త్రిగారు గ్రామ్యాన్ని ఖండిస్తూ ప్రసంగించగా, గిడుగు వేంకటరామమూర్తిగారు ‘ఆంధ్ర భాషా చరిత్ర’ అనే వ్యాసాన్ని పఠించి శిష్టవ్యావహారికమే ఉపాదేయమని వాదించారు. గ్రాంథిక వ్యావహారిక వివాదం మీద అనేక విద్వాంసులను ఆహ్వానించి గోష్ఠి ఏర్పాటు చెయ్యాలనే నిర్ణయం అప్పుడు తీసుకున్నారు. గిడుగు, గురజాడల వ్యాసాలమీద చర్చలుకూడా జరిగేయి.
ఆ తర్వాత (1911) నవంబరు 24న కందుకూరి వీరేశలింగంగారి అధ్యక్షతన సాహిత్య పరిషత్తువారు ‘గ్రామ్యాదేశ నిరసన సభ’ ను జరిపేరు. అధ్యక్షులవారు భాష ‘నాగరభాష’, ‘గ్రామ్యం’ అని రెండు విధాలుగా ఉంటుందని, ‘నాగరభాష’ సంస్కృతంలాగా పరిష్కృతమయింది కాబట్టి కావ్య రచనకు పూర్తిగా పనికి వస్తుందని, ‘గ్రామ్య’ మనేది ‘పామరవినోదార్ధము’ గ్రంధాల్లో అక్కడక్కడ ‘పాత్రోచిత భాష’ గా మాత్రమే వాడదగిందని సెలవిచ్చారు. పూర్వకాలపు తెలుగు వ్యాకరణాలు పద్యకావ్యాలకోసం ముఖ్యంగా ఉద్దేశింపబడ్డవని, గద్యానికి చిన్నయసూరి బాలవ్యాకరణ మొక్కటే వ్యాకరణమని ఆయన అభిప్రాయపడ్డారు.వ్యావహారిక రచనలకు అనుమతిస్తే ‘మాండలిక’ పదజాలం కావ్యభాషలో చేరి భాషా ‘పరిశుభ్రత ‘ను చెరుస్తుందని వారు వాదించారు. (ఆంధ్ర సాహిత్య పరిషత్పత్రిక. 1-2, పేజీలు 151-58 చూడండి).
జయంతి రామయ్యగారు ఉపన్యసిస్తూ వ్యావహారిక రచనల్లో ‘సులభత’ ఉందని చెప్పటం నిజంకాదని, తెలుగుభాష నన్నయనాటికే స్థిరపడ్డదని, అందువల్ల షేక్‌స్పియర్ కాలం వరకూ మారుతు వచ్చి ఆ మహాకవి ప్రయత్న ఫలితంగా స్థిరపడ్డ ఆంగ్లభాషతో మన భాషకు పరిణామక్రమంలో పోలికేలేదని, ‘గ్రామ్య’ గ్రంధాలు పాఠ్యగ్రంధాలుగా పనికిరావని, వ్యావహారిక కవితను అంగీకరిస్తే మాండలికమయమైన ‘నిస్సారకవిత’ మాత్రమే బయలుదేరి కాలక్రమాన ప్రాచీన సాహిత్యం దుర్భోధమై పోతుందని వివరించారు (ఆంధ్ర సాహిత్య పరిషత్పత్రిక పేజీలు.151-58 చూడండి).
వేమూరి విశ్వనాధశర్మగారు వ్యావహారిక విషయంలో తమకు మూడు విభిన్నాభిప్రాయాలున్నాయని విశదీకరించారు. సగానికి సగం అన్య దేశ్యాలతో నిండిన వ్యవహారికం సుబోధకం కాదని, ఆ పదజాలమైన ఉద్గ్రంథ రచనకు చాలదని, వ్యావహారిక వ్యాకరణ విరుద్ధం కాబటి గ్రాంథిక భాషగా పనికిరాదని ఆయన మొదటి అభిప్రాయం. విసంధి పాటించడంగాని, అర్ధానుస్వార శకటరేఫలను పరిహరించటంగాని అంగీకార్యం కాదనేది రెండో అభిప్రాయం. భాషాంతర పదాలను (సంస్కృతం భాషాంతరం కాదని వారి విశ్వాసం) గ్రంథ రచనలో ప్రయోగించటం సమ్మతం కాదనేది మూడో అభిప్రాయం (ఆంధ్ర సాహిత్య పరిషత్పత్రిక పేజీ 154 చూడండి). గ్రామ్య గ్రాంధిక వివాదాన్ని గురించి తమ అభిప్రాయాలు తెలుపుతూ వ్యవహారిక రచనలు పాఠ్యగ్రంథాలుగా పనికిరావని నిషేదించమని కోరుతూ ప్రభుత్వానికి ఒక వినతిపత్రం సమర్పించాలని కూడ ఆ సభలో నిర్ణయించారు. ఆ వినతి పత్రంలోని ప్రధానాంశాలివి:
- క్రీ.శ. 12వ శతాబ్దినాటి (?!) నన్నయనుండి నేటి వీరేశలింగంగారి వరకూ గ్రాంథిక భాష మారనే లేదు.
- పూర్వ కవులందరూ యత్కించిద్భేదంలేని ఒకే భాషలో రాశారు. అందువల్ల గ్రాంధిభాషకు ఏకరూపత (uniformity), ప్రామాణికత ఉన్నాయి.
- ఆధునికాంధ్రమనే వ్యావహారిక భాషలో ప్రత్యేకసాహిత్యం లేదు.
- ఆధునిక భాషకు వ్యాకరణంలేదు (=వ్యాకరణ సూత్రాలు లేవు).
- కాలక్రమాన ఈ ఆధునిక భాష కూడా రాబోయ్యే తరాల వారికి దుర్గ్రాహ్యమవుతుంది.
ఈ విధంగా ఆంధ్రదేశంలోని భిన్న ప్రాంతాల్లో ఉన్న కవిపండిత మేధావులందరినీ పై రెండు సంఘాలవారూ ముగ్గులోకి దింపేరు. ఈ చర్చల వేడి క్రమక్రమంగా పెరుగుతూ వచ్చింది. ఆంధ్రసాహిత్య పరిషత్తువారి అధ్వర్యంలో 1912 మే 15, 16 తేదీలలో చెన్నపట్టణంలొ మరో సభ జరిగింది. దానికి కొమర్రాజు లక్ష్మణరావుగారు అధ్యక్షత వహించారు. పేరు కాశీనాధశాస్త్రిగారు లౌకిక వైదిక సంస్కృత్యాల మధ్య ఉన్నట్లే గ్రాంథిక వ్యావహారికాంధరాల మధ్య ‘వ్యాకరణ సిద్ధ ‘ మైన భేదముందనీ, అధునాతన శిష్ట వ్యవహారాన్ని అంగీకరించాలనీ వాదించారు. వాద ప్రతివాదాల తర్వాత పిల్లల పుస్తకాల్లో మాత్రం విసంధి అంగీకార్యమని, గ్రాంథికమే శరణ్యమని సభవారు తీర్మానించారు. అయితే ఉపయుక్త గ్రంథకరణదేశభాషాసభవారు వి.శఠగోపాచార్యులవారిచేత, తదితరులచేత పరిష్కరింపచేసి పునర్ముద్రించిన 1858 నాటి భూగోళంలోనే విసంధి పాటింపబడింది. అందువల్ల ఈ సభవారు ఆమోదించిన నూతన సంస్కారమేమీ లేనట్లే లెక్క (చూ. గురజాడ అప్పారావుగారు, A Minute of Dissent etc.p.78, esp.70).
ఆ యేడు జూన్‌లో దివాన్ బహద్దూర్ ఎం.ఆదినారాయణయ్యర్‌గారి పీఠికతో వేదం వేంకటరాయశాస్త్రిగారు ప్రచురించిన ‘గ్రామ్యాదేశనిరసన ‘మనే పుస్తకం పైవాదానికి మంచి సమర్ధన గ్రంథంగా వెలువడ్దది. స్కూల్ ఫైనల్ పరీక్షకు కూర్చునే విద్యార్థి ప్రాచీన నవీన పాఠ్య గ్రంథాల్లో వేటినయినా చదవ్వచ్చునని అంగీకరించాలని కోరుతూ, గ్రామ్య గ్రాంథిక వివాదంలో తమ విశ్వాసాలేమో వివరిస్తూ ఆంధ్ర సాహిత్య పరిషత్తువారు అప్పటి మద్రాసు గవర్నర్ సర్ మరె హేమిక్ (Sir Murray Hammik) గారికి ఆగస్టు 7న వినతిపత్రం సమర్పించారు.(చూ.ఆం.సా.ప.ప.,2.1.అనుబంధం.1) తత్ఫలితంగా స్కూల్ ఫైనల్ బోర్డు కార్యదర్శి సెప్టెంబరు 20 తేదీన (G.O.No.3898) విద్యార్థులు సనాతనాధునాతన పాఠ్యగ్రంథాల్లో వేటిలోనైనా పరీక్ష తీసుకొనే అవకాశం అనుగ్రహిస్తూ ఉత్తరువిచ్చాడు. అప్పటి నవీన పాఠ్యగ్రంథాలు మూడు:ఏనుగుల వీరాస్వామయ్యగారి కాశీయాత్రా చరిత్ర, ఆర్డెన్ తెలుగు వ్యాకరణం, సి.పి.బ్రౌన్ పాఠపుస్తకం. ఆ తర్వాత సంప్రాదాయవాదుల ఒత్తిడికి లోనై విద్యార్థులు వైయక్తికంగా ఈ అవకాశం వినియోగించుకోవటనికి వీలు లేదని, ఒక్కొక్క పాఠశాల ఈ రెండు రకాల పుస్తకాల్లో వేటిని చదవాలని నిర్ణయిస్తుందో బడి మొత్తానికి అవే పాఠ్య గ్రంథాలుగా ఉండాలని, మొదటి ఉత్తరువు సవరిస్తూ సెప్టెంబరు 29 న (G.O.3479) మరో ఉత్తరువు జారీ అయింది. ఇది గ్రాంథిక వాదానికి మహావిజయం.
ఇది ఇలా ఉండగా, ఆంగ్లభాషాజ్ఞానమేగాని ఆంధ్రభాషా పరిచయం లేని వారంతా వ్యావహారిక వాదం సమర్ధిస్తున్నారన్న అపప్రథ పోగొట్టడానికి గిడుగువారు ‘ప్రాఁదెనుఁగుంగమ్మ ‘ [1] అనే అచ్చ తెలుగు ఉత్తరాన్ని వృత్తగంధి వచనంలో రాసి ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రికలోనే ప్రచురించారు. గ్రాంథికాంధ్రం – అందునా అచ్చ తెలుగు – ఎంత దుర్గ్రాహ్యమో దురవబోధమో నిరూపించటమే ఆ లేఖా రచనలో ఉద్దేశం. ఆనాటి వైయాకరణుల్లో సర్వోత్తములనిపించుకొన్న మహామహోపాధ్యాయులు తాతా సుబ్బరాయశాస్త్రిగారు ‘ఆంధ్రాభాషా సంస్కరణ’మనే వ్యాసంలొ [2] ఈ వివాద విషయంలో తమ అభిప్రాయాలేమిటో విశదీకరించారు. ఏ భాషనైనా పూర్తిగా సంస్కరిచడమనేది మానవాసాధ్యమని, సంస్కృతానికి పాణీన్యాదుల వ్యాకరణం కూడా పూర్తిగా చాలదని, మన పూర్వులు ఆయాకాలాల్లో శిష్టప్రయోగానుసారంగా వ్యాకరణ సంస్కరణలుచేస్తూ వచ్చారని, ఆధునిక శిష్టప్రయోగాలను బట్టి తెలుగు వ్యాకరణాన్ని సంస్కరించాలని, అన్యదేశ్య పదాలను స్వీకరించకపోతే వ్యవహారహాని సంభవిస్తుందని, శకటరేఫార్ధానుస్వారాలను అక్షర సమామ్నాయం నుంచి తొలగించాలని, శాస్త్ర నిదర్శనలను ఉదాహరిస్తూ వాదించారు. వఝుల చినసీతారామస్వామిశాస్త్రిగారు తమ ‘ఆంధ్రభాష’ అనే వ్యాసంలో [3]తెలుగు భాషకున్న పూర్వవ్యాకరణాలన్నీ అసంపూర్ణాలేనని, మన పూర్వవ్యాకరణసూత్రాలే వేదవాక్యాలని భావిస్తే కావ్య ప్రపంచమంతా గ్రామ్యతా భూయిష్టమవుతుందని, ఒకనాటి గ్రామ్యం ఈనాడు యోగ్యమవుతుందని వాదించారు.
1912 డిసెంబరు 11, 12 తేదీలలొ మద్రాసు, రాజధాని కళాశాలలో వావిలికొలను సుబ్బారావుగారి అధ్యక్షత కింద ‘ఆంధ్ర భాషాభి వర్ధినీ సమాజం’ వారు బుర్రా శేషగిరిరావుగారి ఉపన్యాసాలు ఏర్పాటు చేశారు. మొదటి రోజున ఆంగ్లంలోనూ మరునాడు తెలుగులోను ఉపన్యాసాలు జరిగాయి. అనంతరం సభాధ్యక్షులు ఖండనోపన్యాసం చేస్తూ (ఇది వారి ‘ఆధునిక వచన రచనావిమర్శన’ మనే గ్రంథానికి సంగ్రహం) అక్షర సంఖ్యను బట్టి చూచినా తెలుగు ఇంగ్లీషుకన్న ఏన్నో రెట్లు అభివృద్ధి పొందిన భాష అని తెలుస్తుందని, సంధి పాటించటం అవసరమని, గ్రాంథికభాషలో అన్యదేశ్యాలు అల్పసంఖ్యాకంగాను మాండలికాలు నిశ్శూన్యంగానూ ఉన్నాయని, వ్యావహారికమనే భాషకు ప్రత్యేకించి ఒక వ్యాకరణగాని, నిఘంటువుగాని లేనందున ప్రమాణనిర్ణయాసాధ్యమైన ఆ ‘భాష’ రచనకు పనికిరాదని ఆక్షేపించారు. ‘గ్రామ్యవాదులు’ తరచుగావాడే ‘internal sandhi’ ‘liaision’ అనే మాటలకు వారు చెప్పిన అర్ధం, ఇచ్చిన ఉదాహరణలు, చేసిన విపుల విమర్శా చదివి ఆనందించదగ్గవేగాని ఒకరు చెప్పగలవి కావు.
గ్రాంధిక వాదుల్లో చాలామంది జయంతి రామయ్యగారి లాగానే ఉన్నత రాజకీయోద్యోగాల్లో ఉన్నవాళ్ళే. వాళ్ళ ఒత్తిడి ఎక్కువైనందున మద్రాసు ప్రభుత్వం వ్యావహారికోపయోగాన్ని మరింత సంకుచిత పరుస్తూ 1913 జనవరి 10న (G . O. No. 20) మరో ఉత్తరువు విడుదల చేసింది. ఒక పాఠశాలలోని అధిక సంఖ్యాక విద్యార్థులు గ్రాంధిక వ్యావహారికాల్లో దేనివైపు మొగ్గు చూపుతారో ఆ శైలినే ఆ పాఠశాల మొత్తం అంగీకరించినట్లుగా భావించి సమాధాన పత్రాలమీద ఆ విధంగా గుర్తు రాయాలని పై ఉత్తరువు నిర్దేశించింది. ఇందువల్ల వ్యావహారికంలొ సమాధానాలు రాయటం, రాయకపోవటం అనేవి ప్రధానోపాధ్యాయుల అభిరుచి మీద ఆధారపడవలసి వచ్చింది. సంస్కరణ నేతి బీరకాయగా పరిణమించింది. గ్రాంథికవాదం అధికార బలం మీద ఆధారపడి మరో విజయం సాధించింది. ఈ ప్రభుత్వాదేశానికి ప్రత్యుత్తరంగా గిడుగు వేంకట రామమూర్తిగారు ఆంగ్లభాషలో ప్రచురించిన ‘A Memorandum on Modern Telugu’ అనే కరపత్రం ఆటో యెస్పర్సన్ వంటి ఖండాంతరభాషాశాస్త్రజ్ఞుల ప్రశంసలు కూడా సంపాదించింది. దీనికి ప్రతిగా జయంతి రామయ్యగారు ఇంగ్లీషు భాషలో ’A Defence of Literary Telugu’ అనే కరపత్రం ప్రకటించారు. పానుగంటి లక్ష్మీనరసింహారావుగారి ’గ్రామ్యవాద విమర్శనము’ (ఇది తాతా సుబ్బరాయశాస్త్రిగారి వ్యాసానికి సమాధానం), మల్లాది సూర్యనారాయణశాస్త్రిగారి ’గ్రామ్యమా! గ్రాంథికమా?’, పి. సూరిశాస్త్రిగారు సంకలనం చేసిన ’The Gramya Controversy’ అనే వ్యాసపరంపర ఈ కోవకు చెందినవే. గిడుగు వేంకట సీతాపతిగారి ’సొడ్డు’, గురజాడ అప్పారావుగారు మద్రాసు విశ్వవిద్యాలయానికిచ్చిన ’ఆధునికాంధ్ర వచన’ అనే నివేదిక పై వాటికి ప్రత్యుత్తరాలు. ఆంధ్ర సాహిత్య పరిషత్తువారు తృతీయ వార్షికోత్సవం జరుపుకున్నారు. ఆ సంధర్భంలో ’గ్రామ్య గ్రాంథిక వివాదం’ విషయంలో పరిషన్నిర్ణయం తేల్చుకోవలసి వుంది. పరిషదభిప్రాయాన్ని నిరూపించటానికి గత సంవత్సరం నియమించిన ఉపసంఘంవారి నివేదిక అప్పటికింకా పూర్తి కాలేదు. నివేదిక అందేవరకూ నిర్ణయం వాయిదా వేయాలని గిడుగు గురజాడలు వాదించరుగాని ప్రయోజనం లేకపోయింది. 1912 మే నెల నాటి మద్రాసు పండితగోష్ఠి అభిప్రాయమే పరిషదభిప్రాయమనే తీర్మానం నెగ్గింది.
కొంతమంది గ్రాంథికవాదుల్లోనయినా కొంత వాదశిధిలత రావటం ఈ యేడే ఆరంభమయిందనటానికి కొన్ని ఆధారాలు లభిస్తున్నాయి. నండూరి మూర్తిరాజుగారు ’గ్రామ్యవాద విమర్శన’మనే వ్యాసంలో[4] వ్యావహారికవాదులు చెప్పే ’ధ్వని శాస్త్రమూ’ గ్రాంథికవాదుల ’వ్యాకరణమూ’ భిన్నమైనవనీ ఉభయపక్షాలవారూ రాజీపడి నవీన వ్యాకరణం రాయటం మంచిదనీ ఉద్భోదించారు. ’ఆంధ్రభాషా సంస్కార’ మనే వ్యాసంలో [5]పప్పు మల్లికార్జునుడుగారు ’కొందరు’ పద్యానికి గ్రాంథికమూ,గద్యానికి వ్యావహారికమూ మంచిదంటున్నారని, తమ వాదాన్ని సమర్ధించుకోవటానికి గిడుగువారు చూపిన కావ్య ప్రయోగాల కన్నింటికీ పాఠాంతరాలున్నాయని అటూ యిటూ గాకుండా వాదించారు. కాని శిధిలత వచ్చినా తీవ్రత తగ్గలేదనటానికి 1914 సంఘటనలే తార్కాణం.
1914 నాటి వాదోపవాదాలు మూడు రకాలుగా జరిగేయి : వాటిలొ మొదటివి మద్రాసు విశ్వవిద్యాలయంలొ దానికి సంబంధించిన సంఘాల్లొ జరిగిన వాదోపవాదాలు: రెండోవి బహిరంగసభల్లో జరిగిన ఉపన్యాసాలు : మూడోవి ఆంధ్రాంగ్లభాషల్లో పత్రికల్లో జరిగిన పోరాటాలు. ఆ యేడు జరిగినంత తీవ్రంగా, ముమ్మరంగా అంతకు ముందుగాని ఆ తర్వాతగాని ఖండనమండనాలు జరగలేదు. మద్రాసు విశ్వవిద్యాలయంవారు ఆ సంవత్సరం ‘Composition Committee’ అనే సంఘం నియమించారు. అందులొ మొట్టమొదటి గ్రాంథిక వ్యావహారిక వాదులకు సమప్రాతినిధ్యముండేది. తటస్థులు కొందరు ఉండేవాళ్ళు. ఇంటర్మీడియేట్ పాఠ్యగ్రంథాలుగా ఉండదగిన పుస్తకాలు పట్టికను జి. వెంకటరంగారావుగారు విశ్వవిద్యాలయానికి సమర్పించారు. ఆయా గ్రంథాల్లోని పదజాలాన్ని ప్రాచీనార్వాచీనాలుగా విభజించి, ఆర్వాచీనపదజాలాన్నే ఉపయోగించాలన్న అభిప్రాయం అందరికి ఆమోదయోగ్యమయింది. అయితే ఆ శబ్దాల విభజన నిర్వచల దగ్గర పేచీ వచ్చింది. ఇంతలొ ప్రాంతీయ ప్రాతినిధ్యం సరిగాలేదని ఆందోళనచేసి తమవారు మరియిద్దరు గ్రాంథికవాదులు సభ్యులయ్యేట్లు సాధించుకోగలగటంతో, సంఖ్యాబల ప్రాతిపదికమీద గ్రాంథికానికే అనుకూలనిర్ణయం జరిగింది. ఈ చర్చలూ తీర్మానాలు ఆగస్టు 2, సెప్టెంబరు 6 తేదీల్లో జరిగేయి. అధికారతీర్మానానికి వ్యతిరేకంగా వాదించిన గురజాడవారు తమ వ్యతిరేకతను సుదీర్ఘవ్యాసంలో చర్చించగా మరి ముగ్గురు ఆమోదిస్తూ సంతకాలు చేశారు. The Minute of Dissent to the Report of the Telugu Composition Sub-Committee’ అనే ఆ ఆంగ్లవ్యాసాన్ని వావిళ్ళవారు ఆ యేడే ప్రచురించారు. ఈ రచనకు ప్రధాన హేతువు కొమర్రాజు లక్ష్మణరావుగారు రాసిన ‘A Memorandum on Telugu Prose’ అనే వ్యాసం. వ్యావహారిక వచన రచనా సంప్రదాయం మనకు కొన్ని శతాబ్దాలుగా ఉన్నదని రుజువు చేస్తూ గిడుగు వేంకట రామమూర్తిగారు ’నిజమయిన సంప్రదాయ’మనే చిన్న పుస్తకం రాశారు. కిళాంబి రామానుజాచార్యులుగారు కూడా మరో చిన్న పుస్తకం ఇటువంటిదే రాశారు. ఈ వ్యావహారికవాదాన్ని ప్రతిఘటించటానికి కాకినాడలో జులై 1తేదీన ’ఆంధ్రభాషాసంరక్షక సమాజ’మనే సంఘమొకటి ఏర్పడింది. పురాణపండా మల్లయ్యశాస్తులుగారు, కాశీభట్ల బ్రహ్మయ్యశాస్త్రిగారు మొదలైన పెద్దలిందులో సభ్యులు. వీరు గ్రాంథిక భాషోద్ధరణ దృష్టితో ‘Modern Telugu, క్రొత్త తెలుఁగు-మంచి తెలుఁగు’, ’పులుల దండులు-పూలదండలు’ అనే కరపత్రాలు ప్రకటించారు. కూచి నరసింహంగారు ’వ్యావహారిక భాషాసంప్రదాయవిమర్శనము’ అనే వ్యాసాన్ని ప్రచురించి ఉడతాభక్తిగా ఆంధ్రభాషామతల్లికి సేవ చేశారు.
రెండోదైన సభారంగం ఈ వివాద విషయంలోకి సామాన్య ప్రజలనూ అనిశ్చితంగా ఉన్న పండితులనూ ఆకర్షించటం మొదలుపెట్టింది. వ్యావహారికవాదులు ఎలమంచిలిలో జరిపిన విద్వత్సభలో శిష్టవ్యావహారికం గ్రామ్యం కాదనే వఝుల చిన సీతారామస్వామిగారి తీర్మానం నెగ్గింది. ఆగస్టు 3 న వర్లాకిమిడి కళాశాలలో బి.మల్లయ్యశాస్త్రిగారి అధ్యక్షతన సమావేశమైన విద్వాంసులూ, ఆగస్టు 27 న ఆంధ్ర సారస్వత పరిషదధ్వర్యువంలో వై. నారాయణమూర్తిగారి అధ్యక్షతన విజయనగరంలో జరిగిన వార్షికోత్సవలొ పాల్గొన్న పండితులూ పై వాదం సమర్ధించారు. చారిత్రక ధృక్పథంలో భాషాధ్యయనం చేయటం అవసరమని, పాఠ్యక్రమబోధనాభ్యవనాలు ఆధునిక భాషారూపంలోనే జరగాలని నారాయణమూర్తిగారు ఉపన్యసించారు. ఈ సభలకు పోటీగా 23-6-1914 న కాకినాడలో మొదలుపెట్టి, 23-8-1914 లో అన్నవరం సమావేశంతో ముగించిన గ్రాంథికవాది సభా కార్యకలాపాలు ఆ మధ్యకాలంలో 24 బహిరంగ సభలు జరిపి తమ వాదబలం నిరూపించాయి. గ్రాంథికవాదాన్ని సమర్ధిస్తూ చాలామంది న్యాయవాదులూ రాజకీయోద్యోగులూ కొందరు రచయితలూ ప్రసంగించారు. ఈ సమావేశాల విషయంలో గమనార్హమైన విశేషాలు మూడూ కనిపిస్తాయి:
- సంస్కృత భాషాపాండిత్యం ఎక్కువగా ఉన్నవాళ్ళు వ్యావహారికాన్నే సమర్ధించారు.
- గంజాం వర్లాకిమిడి జిల్లాల్లో వ్యావహారిక వాదానికి బలం చేకూరగా, కృష్ణా గోదావరి మండలాల్లొ గ్రాంథిక వాదానికి మద్ధతు లభించింది.
- గ్రాంథిక వాదానికి అండగా నిలిచిన వారిలో అత్యధిక సంఖ్యాకులు ’పలుకుబడి’ కలవారేగాని తెలిసినవారు కారు.
ఈ మహా యుద్ధానికి మూడో రంగం పత్రికలు. పత్రికలవారు స్వయంగా ఏమీ కల్పించుకోలేదు గాని ప్రజాకర్షణ గమనించి రెండు పక్షాలవారూ చేసిన విమర్శన,ప్రతివిమర్శనలను, జరిపిన సభావిశేషాలను ప్రచురించారు. [6]ఉభయ పక్షాల వారిలోనూ ఏ కొందరో తప్ప చాలాభాగం మారుపేర్లతో వ్యాసాలు రాశారు. ఈ వాదాలమీద లోకానికి కలిగిన సదభిమాన దురభిమానాలను రొక్కరూపంలో సంపాదించుకోదలచిన ‘స్కేప్ అండ్ కంపెనీ ‘ (కాకినాడ)వారు ఆయా సమావేశవిశేషాలు, వదప్రతివాదాలు క్రోడీకరించి గ్రంధస్థం చేసి “Arguments for and against Modern Telugu” అనే పేర ప్రచురించారు. ప్రత్రికాముఖంగా వెలువడ్డ ఆనాటి వాదవివాదాల్లో ముఖ్యమైనవి ‘ఒక తెలుగు హెడ్‌మాస్టర్’ గారు[8] ‘ఒక తెలుగు మెడలిస్టు’ గారు[9], గ్రాంథికాన్ని సమర్ధిస్తూ రాసినవి: ఒక ‘మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్’ గారిచ్చిన సమాధానాలు[10]. వాద విషయం ఎలావున్నా వాదతీవ్రత విషయంలో గ్రాంధికవాదులదే పైచెయ్యి. వారి వాదంలోని ప్రధానాంశాలివి :
- వ్యావహారికమనేది నింద్యగ్రామ్యం. అందులో కుల,మత, వృత్తి, ప్రాంత భేదాలవల్ల ఏకరూపత లేదు.ఈ మాండలికాల వల్ల అదిసులభంగా అర్ధంకాదు.
- గత వెయ్యేళ్ళుగా గ్రాంథికం మారలేదు.
- వ్యావహారికం వ్యాకరణవిరుద్ధం కాబట్టి ప్రామాణికం కాదు.
- వ్యావహారికం వల్ల ప్రాంతీయభేదాలేర్పడి ఆంధ్రోధ్యమం దెబ్బతింటుంది. కాబట్టి అది అనంగీకార్యం.
- ఆధునికభాషకు ప్రత్యేకంగా తనదని చెప్పుకోగల వ్యాకరణంగాని, సాహిత్యంగాని నిఘంటువుగాని లేవు. కాబట్టి అది రచనకూ పఠనపాఠనలకూ పనికిరాదు.
- ఆంగ్లభాషలాగా తెలుగు భాష మారుతూ ఉండేదికాదు. తెలుగులో లిఖిత వాగ్రూపాలకున్న భేదాలు ఇంగ్లీషులో వాటికున్న భేదాలకన్నా చాలా ఎక్కువ.
- వెయ్యేళ్ళ క్రితమే ‘స్థిరపడ్డ’ తెలుగును ‘కోయ, సవర, చచ్చట’ భాషల్లాంటి కేవలవ్యవహారదశకూ ఆటవికస్థితికి దించరాదు.
- గ్రాంథికాన్ని నీచస్థితికి దించేకన్నా వ్యావహారికాన్ని ఉచ్చస్థితికి తేవటం మంచిది.
- వ్యావహారికాన్ని అంగీకరిస్తే కాలక్రమాన ప్రాచీన సాహిత్యం అర్ధం కాకుండా పోవటమేగాక నశించికూడా పోతుంది.
- ఆధునిక భాషలో ఉన్న ఒకటి రెండు పుస్తకాలకన్నా నన్నయభాషే సులభంగా అర్ధమవుతుంది. కాబట్టి గ్రాంథికమే ఉపాదేయం.
‘మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్’ గారు వీటన్నింటికీ క్లుప్తమయిన సమాధానాలు ఇచ్చారు. మన పూర్వ వచనరచనా సంప్రాదాయం వ్యావహారికమేనని, భాష కెప్పుడూ వ్యాకరణముంటుందని, ‘శిష్టానా ముక్తౌ సూత్రాణా మభావే అనుశాసనకారిణ ఏవ దండనీయా’ అన్న దండి వాక్యాన్ని స్మరించమని. భాష మరదనటం మారలేదనటం అనూహ్యమని, రాజకీయోధ్యమాలకూ శాస్త్రచర్చలకూ సంబంధం లేదని – ఇలా ఎన్నో మొరబెట్టినా వినిపించుకున్న వారు లేరు విమర్శించినవారేగాని. ఇంత దూకుడుగా ఉద్ధృతంగా వచ్చిన గ్రాంథికవాద మహాప్రపంచం గ్రాంథిక పాఠ్యగ్రంధాలు రాగానే ఒక్కసారిగా ఎండిపోయింది! కథ కంచికి పోయిందనుకున్నారేమో !
వేదం వేంకటరాయశాస్త్రిగారి ‘ఆంధ్రభాషా సర్వస్వార్హ నియమ కతిపయములు ‘ 1915 లో వెలుగు చూశాయి. గ్రామనామాలు, మాండలికాలు, కొన్ని గ్రామ్యాలు, అస్ఫుటగ్రామ్యత్వా లయిన పదాలు ప్రయోగవ్యవహారరూఢీ సంపాదించిన అన్యదేశ్యాలు నిఘంటువుల కెక్కాలని, భాషాశాస్త్రం పరమపఠనీయ శాస్త్రమని, దానివల్ల శబ్దవ్యుత్పత్తులు పరిస్ఫుటంగా తెలుస్తాయని వారు అభిప్రాయపడ్డారు. ‘పాశ్చాత్య కళాసంకేతాంధ్రపదాలను’ అనుబంధంగా ఇవ్వాలని, తెలుగుకు నూతనాక్షర గ్రహణం పనికిరాకపోయినా అన్యదేశ్యశబ్దానువాదంలో మాత్రం భాషాంతరా పూర్వవర్ణగ్రహణం ఉపాదేయమేనని వారు విశ్వసించారు. అంటే ఆయన దృష్టిలో పెద్ద మార్పులు రావటం మొదలైనట్లు. అయితే 1915లో గత సంవత్సర యుద్ధచిహ్నాలు సమసిపోయాయి. 1916 నవంబరు 19 న కొవ్వూర్లో జరిగిన సారస్వత మహసభలో వర్ధమాన మహాకవులు దివాకర్ల తిరుపతి శాస్త్రిగారు, కందుకూరి వీరేశలింగంగారు, చిలుకూరి వీరభద్రరావుగారు మొదలైన విద్వాంసులు పాల్గొన్నారు. అప్పటికి వీరేశలింగంగారి దృక్ఫథంలో కూడా చాలా పెద్ద మార్పు వచ్చింది. ఆ సభవారు నూరేళ్ళుగా పెద్ద వాడుకలో ఉన్న మాటలన్నీ నిర్దుష్టాలని, పూర్వ(కవి) ప్రయోగాలు లేకపోయినా దేశవ్యాప్తంగా ఉన్న రూపాలు సాధువులేనని తీర్మానించారు. ‘గ్రంధాలయ సర్వస్వము’ లో (సంపుటి:2, సంచిక:1) ‘ఆంధ్రభాష ‘ను గురించి తర్కిస్తూ వఝుల చినసీతారామస్వామిగారు ఆంధ్ర వ్యాకరణ పునారచన అవశ్యకమని సూచించారు. గ్రాంథికవాదానికి కంచుకోటలైన వేదం, కందుకూరిల దృష్టిలొ వచ్చిన మార్పు దాన్ని దుర్బలీకరించింది.
గిడుగువారు 1919 లో ‘తెలుగు’ పత్రికను స్థాపించి తమ ఉద్యమాన్ని యధావిధిగా సాగిస్తూనే వచ్చారు. ఆ యేడు ఫిబ్రవరి 28వ తేదీన, అంతవరకూ గ్రాంథిక వాదానికి మూల విరాట్టుగా ఉన్న వీరేశలింగంగారు వ్యావహారిక భాషావాదాన్ని అంగీకరించి ‘వర్తమానవ్యావహారికాంధ్రభాషాప్రవర్తకసమాజము’ స్థాపించి తామే అధ్యక్షులై వ్యావహారికానికి వ్యాకరణగ్రంథం రాస్తామన్నారు. గ్రాంధికవాదానికిది గొడ్డలిపెట్టయింది. ఈ సమాజానికి జయంతి గంగన్నగారు కార్యదర్శులైనారు. ఈ నూతన పరిణామాన్ని భరించలేక వేదం వేంకటాయశాస్త్రిగారి వంటి విద్వాంసులు కూడా పేరెత్తకుండా వ్యక్తి దూషణలోకి దిగవలసి వచ్చింది. [7] ఇది చివరి ప్రయత్నమేగాని ఫలవంతం కాలేదు: గ్రాంథికవాదం తిరుగు ముఖం పట్టింది.
1924 నుంచీ వెలువడుతున్న సాహిత్యపత్రిక ‘భారతి’ ఉభయపక్షాల రచనలకు సమప్రాధాన్యం ఇస్తుండేది. ఆంధ్ర సాహిత్య పరిషత్తువారు కూడా కొండ దిగి 1924 అక్టోబర్ 13వ తేదీన తమ వ్యావహారిక భాషా బహిష్కారాన్ని రద్దు చేశారు: గిడుగు పిడుగు అప్పటికే విశ్రమించలేదు. పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రిగారు సూత్రధారులుగా 1933 మార్చి 10-12 తేదీల్లో జరిగిన ‘అభినవాంధ్ర కవిపండితసభ’ చిలుకూరి నారాయణరావుగారి అధ్యక్షతన సమావేశమై ఆధునిక వ్యావహారికమే ‘బోధనభాష’గా ఉండాలని తీర్మానించింది. (నవ్యాంధ్ర సాహిత్య వీధులు, 3. 553-55). ఆ యేడు డిసెంబరులో గిడుగువారు ప్రకటించిన ‘గద్యచింతామణి’ మొదటి భాగం వెలువడింది. తెలుగువారి వచనరచనా సంప్రదాయం 16-20 సతాబ్దాల మధ్య ఏ విధంగా వికసించిందో ససాక్షికంగా నిరూపించి వ్యావహారికవాదానికి ఇతోధికరచారగౌరవాలను కల్పించి ఆ మహాసంకలన గ్రంథం సనాతన పండిత మండలికి గండికొట్టింది.
1936 లో ‘నవ్య సాహిత్య పరిషత్తు’ వెలిసింది. అభినవాంధ్రకవిపండితుల్లో వ్యావహారికవాదులందరూ ఇందులో చేరేరు. పరిషత్తు ‘ప్రతిభ’ అనే సాహితీ పత్రికను నడపటం మొదలుపెట్టింది. వ్యావహారిక రచనలు పుంఖానుపుంఖంగా రావటం మొదలయింది. 1937 లో ‘జనవాణి’ అనే దినపత్రికకు సంపాదకత్వం వహించి తాపీ ధర్మారావుగారు మొటమొదటిసారిగా వ్యావహారికాన్ని పత్రికాభాష చేసారు.ఈ రచనా విధానానికి, ఈ భాషావాదానికి ప్రజామోదం లభించింది. తల్లావజ్ఘల శివశంకరశాస్త్రిగారివంటి ఆధునిక విద్వత్కవులు శిష్టవ్యవహారమంటే సభాసాధుభాష అని, గద్య గేయ రచనలకు ఇది వినా మరో మార్గం లేదని, మాండలిక రూపాలు అపరిహార్మాలని వాదించారు (నవ్యాంధ్ర సాహిత్య వీధులు, 3. 553-55). గ్రాంథికం ‘సరళ గ్రాంథిక, సులభ గ్రాంథికాది’ అవతారాలెత్తుతూ గతానుగతికమైన అప్రతిభ రచనల్లో మిగిలిపోయింది. వ్యావహారిక భానూదయం భరించలేని దివాంధాలు విశ్వవిద్యాలయరక్షణలో పాఠ్యగ్రంధాల్లో తలదాచుకోవలసిన దుస్థితి వచ్చింది. పరిణామశీలమైన కాలం తన శక్తి నిరూపించింది. 1949 లో ‘తుది విన్నపము’ చేస్తూ గిడుగు వేంకట రామమూర్తిగారు ఆశించిన ప్రయోజనాలన్నీ ఇప్పటికీ పూర్తిగా నెరవేరకపోయినా ఆధునిక సాహిత్యంలో ఆధునికభాషా రూపాలకు సింహపీఠం లభించి తీరింది.
ఆధారాలు
- ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక, సంపుటి 2, సంచిక 3 పేజీలు. 256-274
- ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక, సంపుటి 2, సంచిక 3 పేజీలు. 275-285
- ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక, సంపుటి 2, సంచిక 3 పేజీలు. 386-391
- ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక, సంపుటి 3, సంచిక 4 పేజీలు. 137-157
- ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక, సంపుటి 3, సంచిక 5 పేజీ. 183
- ది హిందూ, 1914 జులై 3,9,10,13,15,17,20,23,29,30 తేదీలు
ది హిందూ, 1914 ఆగస్టు 3,4,10,12,13 తేదీలు
ఆంధ్ర పత్రిక, 1914 జులై 13,24,29 తేదీలు
ఆంధ్ర పత్రిక ఆగస్టు 1914 12,17 తేదీలు. - ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక: ఆంధ్ర సాహిత్యపరిషదష్టమ సమావేశం, జూన్ 7, నెల్లూరు
- హెడ్‌మాస్టర్‌గారి చర్చలు – ది హిందూ, 21-7-1914, 1-9-1914, 18/19-6-1914
- మెడలిస్టుగారి చర్చలు – ది హిందూ, 20-7-1914
- మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ గారి సమాధానాలు – 9-7-1914
గ్రాంథికభాషావాదులు చాలాకాలం నిశ్శబ్దంగా ఉండి 1958-60 లలో ఒకసారి, తిరిగి 1965-70 లలో ఒకతూరి, అప్పుడప్పుడు, అక్కడక్కడ అనుకూల పరిస్థితిలో తల ఎత్తుతూ దించుతూ దోబూచులాడటం ఆరంభించారు. శాస్త్రవిచారణవల్ల సాధించలేని విజయాలను, సాహితీ సృష్టి వల్ల సమకూర్చుకోలేని శక్తిని, రాజకీయ, సాంఘిక సమస్య లేవైనా అనుకూలపడినప్పుడు పునస్సంపాదించుకోదలిచినట్లు కనిపిస్తుంది. ‘జయంతి’ పత్రికను స్థాపించిన తొలి రోజుల్లో ఇలాటి ప్రయత్నమొకటి జరిగింది. సంపాదకులు ఒకవంక శిష్ట వ్యావహారికానికి ‘ప్రజామోదం’ లభించిందని చెబుతూనే రెండోవైపు దుష్టప్రయోగాలతో నిండిన ఈ సారస్వతానికి ఒక ‘వ్యవస్థ’ కలిపించటమే తమ లక్ష్యమని ప్రకటించారు (చూ.జయంతి, 1958 నవంబరు, సంపాదకీయము).
1959-60 సంవత్సరాల ‘జయంతి’ సంచికల్లో ముఖ్యంగా జువ్వాడి గౌతమరావుగారు (59 మే: వ్యవహారభాష – వ్యాకరణము : 60 ఫిబ్రవరి” పత్రికారచన – సాహిత్యము) కుల ప్రాతిపాదికను, ప్రాంత ప్రాతిపదికను తెచ్చిపెట్టి సరికొత్త పాతవాదాల ద్వారా వ్యావహారికాన్ని ధ్వంసం చేయాలని ప్రయత్నించారు. వ్యావహారికమనేది ‘కృష్ణాజిల్లా బ్రాహ్మణభాష’ అని, తమ ప్రాంతీయ భాష తమకుండగా దాన్ని విసర్జించి తాము ఈ మండలాంతర కులాంతర భాషారూపానికి దాస్యం చేయవలసివచ్చిందని (ఎవరు నిర్బంధించారో చెప్పలేదు). తమ తమ మాండలికాల్లొ రాయటానికి ఇతర జిల్లాలవారు ‘జంకుతా’ రని, కావ్య భాషకు వ్యాకరణం రాయటమే అసాధ్యమైనప్పుడు ‘దారీ తెన్నూ లేని’ వ్యావహారిక విషయం చెప్పనక్కరలేదని, వ్యావహారికం అంతా గ్రాంథికమే కాబట్టి తామేదో కొత్త బాషను వాడుతున్నామని వ్యావహారికవాదులు ఆత్మవంచన చేసుకుంటున్నారని, ఇప్పుడు శిష్టులనేవారే లేరని వాపోయారు.
వారి రెండో వ్యాసంలో ‘కొత్తపాత’ శబ్దాలూ, ‘సర్వపనుల’ వంటి సలక్షణ సమాసాలు, ప్రమాణముగా ‘యేలగైకొనవలయును’ వంటి సుసంధులు, ‘భాషలోనుంచి’ వంటి సాధువిభక్తులూ ఎక్కడ చూసినా కనిపిస్తాయి. నేటి వ్యావహారిక రచనలేగాని పల్లెటూరి నుడికారాలున్నవి లేకపోతున్నవని, పత్రికలది(తమది తప్ప) ‘బాధ్యాతారహితమైన ప్రవర్తన’ అని, ‘సంస్కృతమును విడిచిన తెలుగుభాషలే’దని, ‘పదబాహుళ్యము ఇంగ్లీషులో కన్న సంస్కృతములో నధిక’ మని, వ్యావహారికవాదంవల్ల ప్రాచీనకావ్యాల మీద గౌరవం నశిస్తున్నదని, ‘భాషావ్యవస్థ’ చెడిపోతున్నదని ఆక్రోశించారు. ఈ సూక్తులన్నింటికీ కొండముది శ్రీరామచంద్రమూర్తిగారు, జలాంతశ్చంద్రచపలగారు సవివరంగా సమాధానాలిచ్చారు (చూ.జయంతి : చర్చావేదిక, ఆగస్తు 1959).
‘ఆంధ్రభాష-అవ్యవస్థ’ అనే వ్యాసంలో (చూ. జయంతి, 1969 ఏప్రిల్,పే.33-36) ‘గాండీవి’ గారు ఆకుకు అందని పోకకు పొందని భావాలు వెలిబుచ్చారు. పరస్పర విరుద్ధవివాదాల సంగతి అటుంచి వారు కనుక్కొన్న చారిత్రక సత్యాలివి: శిష్టవ్యావహారికం ప్రాచీనకవిసమ్మతం కాదు; దానికి వ్యాకరణగ్రంథం రాయనక్కరలేదు; గ్రాంథికానికే ఒక వ్యవస్థ లేదు; ముద్రణం ముందు ‘సుపరిష్కృతం’ కావాలి; ‘ఏవో కొన్ని సామాన్యసూత్రముల నామోదించి యెల్లరు నొకేరీతి వ్యావహారికము వ్రాయునట్లు కృషి చేసిన బాగుండునేమో’(పే.36). ‘ఏవో కొన్ని సూత్రాల’ కోసమే ఆరాటమైతే రవిపాటి గురుమూర్తిగారు, పారనంది రామస్వామిగారు, మల్లాది సూర్యనారాయణశాస్త్రిగారి వంటి పూర్వులవీ వడ్లమూడి గోపాలకృష్ణయ్య గారి వంటి ఆర్వాచీనులవి వ్యాకరణ గ్రంథాలున్నవని తెలియదో, అవి పనికిరావో వ్యాసకర్తలే చెప్పాలి. కాని ఈ చర్చలు ఏ కొద్దిమందినో ఆకర్షించినందువల్ల పెద్ద కోలాహలమే జరగలేదు.
1965 నుంచి వచ్చిన వాదోపవాదాలు పాఠ్యపుస్తకాల ‘శైలి’ విషయంలో వచ్చాయి. అంతవరకూ పాఠ్యగ్రంథాలన్నీ సరళగ్రంథికంలోనో అర్ధగ్రాంథికంలోనో ఉంటుండేవి. ఆంధ్రప్రదేశావతరణవల్ల తెలుగు నేర్చుకోవలసినవారు రెండు రకాలవారైనారు : తెలుగు మాతృభాషగా కలవారు, లేనివారు. ఆంధ్రేతరులు తెలుగు నేర్చుకోవటం నిత్యవ్యవహారంలో ఇబ్బంది లేకుండటానికే కాబట్టి వాళ్ళ కోసం రాసిన పాఠ్యగ్రంథాల్లో వ్యావహారికమే వుండాలని భద్రిరాజు కృష్ణమూర్తిగారు వాదించి గ్రాంథిక పుస్తకం తమ చేతిమీదుగా అచ్చుకారాదని అభ్యంతరం లేవదీశారు. ప్రభుత్వం ఈ విషయంలో ఏకాభిప్రాయం సాధించాలన్న సంకల్పంతో అన్ని రంగాల్లోని విద్వాంసుల కవుల ప్రతినిధులతో తిరుపతిలో ఒక సభ జరిపింది. అనేక తర్జన భర్జనలయిన తర్వాత పింగళి లక్ష్మీకాంతంగారి అధ్యక్షతన ఆ సమావేశం వారు ఒక రాజీకి వచ్చారు. మొదటి భాషగా తెలుగు నేర్చుకునే వాళ్ళ తెలుగు వాచకాల్లో సరళ గ్రాంథికం ఉండాలని. రెండోభాషగా నేర్చేవాళ్ళుగాని శాస్త్రవిషయాలను తెలుగులో నేర్చే తెలుగు విద్యార్థులు గాని చదివే పాఠ్యగ్రంథాల్లో శిష్ట వ్యావహారికమే వుండాలను సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఈనిర్ణయాన్ని ప్రభుత్వంవారు ఆమోదించి ఆయా శైలీ భేదాలను వివరణాత్మకంగా నిరూపించటానికి ఆ లక్ష్మీకాంతంగారినే అధ్యక్షులు చేసి ఒక ఉపసంఘాన్ని నియమించారు. ఆ సంఘంవారు 1966 నాటికి తమ పని నెరవేర్చారు. గ్రాంథికవ్యావహారికాలను శైలీభేదాలుగా గుర్తించి వీటిని వివరించే సంఘాన్ని శైలీ సంఘం (Style Committee) అని ప్రభుత్వం వ్యవహరించింది. తెలుగును రాజభాష చేయదలిచిన ప్రభుత్వానికి ఈ నిర్ణయాలు చాలా అవసరం.
తెలుగును అధికార భాషగా గుర్తిస్తూ 1966 లో ఆంధ్రప్రదేశ్ అధికార భాషా చట్టం (తొమ్మిదో చట్టం) శాసించింది. ఇలా చేయటంలోని కష్టసుఖాలను పరిశీలించి సలహా యిమ్మని ప్రభుత్వంవారు అప్పటి విద్యాశాఖ కార్యదర్శి జె.పి.యల్ గ్విన్ అధ్యక్షతన మరో సంఘం నియమించింది. (G.O. No. 3051, 1966 డిసెంబర్ 28). గ్విన్ సంఘంవారు ముఖ్యంగా ఆంధ్రేతరులకు తెలుగు నేర్పటానికీ, ఆ భాషను ఆధునీకరించటానికీ , విశ్వవిద్యాలయాల్లో తెలుగును బోధనభాషగా చేయటానికి, పరిపాలన వ్యవహారాలకు కావలసిన సాంకేతికసహాయం అందివ్వటానికీ ఒక స్వతంత్ర సంస్థను నెలకొల్పవలసిందని సూచించారు. వారే భద్రిరాజు కృష్ణమూర్తిగారి సూచనలమేరకు (పాఠ్యగ్రంథాలతో సహా) ఆ సంస్థ ప్రచురణ లన్నింటిలోనూ లక్ష్మీకాంతం సంఘంవారు నిర్దేశించారు (చూ గ్విన్ కమిటీ నివేదిక, 5.27, పే.19). రాష్ట్ర ప్రభుత్వంవారు ఈ సూచనలను ఆమోదించి వాటిని అమలుపరచటానికి ‘తెలుగు అకాడమీ’ అనే సంస్థను 1968 ఆగస్టు 5 న స్థాపించారు. ఆ సంస్థవారు ఇంటర్మీడియట్ పాఠ్య గ్రంథాలను తెలుగులో రాయిస్తున్నప్పుడు మళ్ళీ గ్రాంథికభాషావివాదం తల యెత్తింది. సంఘాలు, ఉపసంఘాలు చర్చోపచర్చలు చేసిన తర్వాత శిష్ట వ్యావహారికాన్నే కొన్ని మార్పులతో వాడుక చెయ్యాలని అంగీకరించి అమలు జరిపేరు. ఆ సమయంలో ఈ వివాదం పత్రికల కెక్కినా, గ్రాంథికాన్ని పునఃప్రతిష్టాపించాలనే ప్రయత్నాలు ఏకముఖంగా జరుగుతున్నా, అవి నెరవేరవనే విశ్వాసం ఆశాభావం ఉన్నా, శాస్త్రీయ చర్చలవల్లగాక ఇతర మార్గాల్లో తమ వాదాన్ని నిలుపుకోవలసిన పరిస్థితికి వచ్చినందుకు గ్రాంథికవాదులను చూసి జాలిపడాలి. ఈనాడు రేడియోల్లో, పత్రికల్లో, సాహితీ రచనల్లో, సినిమాల్లొ అనుక్షణం వాడుకలొ వుండి ప్రజాసామాన్యానికి అందుబాటులో ఉన్న వ్యావహారికవాదాన్ని ఏ శక్తీ ఎక్కువకాలం బహిష్కరించలేదు.
పరంపరగా సనాతనత్వానికి కంచుకోటలుగా ఉన్న విశ్వవిద్యాలయాల్లో (ముఖ్యంగా అందులోని తెలుగు శాఖల్లో) కూడా వ్యావహారిక రచనలే చేస్తున్నవారు అధికసంఖ్యలో ఉన్నారు. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం తెలుగుశాఖ Ph.D. పట్టానికి రాసే పరిశోధన వ్యాసాల్లో కూడా 1969 లో శిష్ట వ్యావహారికం అంగీకరించింది. 1971 లో పురిపండా అప్పలస్వామి గారు చేసిన ప్రయత్నాల ఫలితంగా ఆంధ్రవిశ్వకళాపరిషత్తువారు అన్నిస్థాయుల్లో వ్యావహారీకం ప్రవేశపెట్టే విషయం పరిశీలించటానికి ఎం.ఆర్.అప్పారావుగారి అధ్యక్షతన ఒక సంఘం నియమించారు. మెట్రిక్యులేషన్ నుంచి ఎం.ఏ. వరకు క్రమంగా ఆ వ్యావహారికం ప్రవేశపెట్టే విధానం సూచిస్తూ 1973 జులైలో ఆ సంఘంవారు నివేదిక సమర్పించారు. 1974 నవంబరులో ఆ నివేదికను ఆమోదించి ఆ తీర్మానాలు అమలు జరపటానికి మరో స్థాయీ సంఘం నియమించారు గాని అది 1975 ఏప్రిల్‌లో మొదటి సమావేశం జరిపిన తర్వాత మరి సమావేశం కాలేదు. 1973 లో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖవారు తెలుగును ద్వితీయభాషగా బోధించేటప్పుడు వ్యావహారికమే వాడాలని ఆదేశించారు (G.O. Ms.No. 384 of 27.4. 1973). తీర్మానాల దారి తీర్మానాలదే గాని ఆచరణ నత్తనడకలు నడుస్తున్నది. అసలు నడుస్తుంటే, విద్యార్థులు మాత్రం అర్ధగ్రాంథికంలో రాస్తున్నారు. కాలక్రమాన విశ్వవిద్యాలయాలు ఆమోదించినా, మానినా వ్యవహారికం చోటు చేసుకుంటుంది. ఒకటి నిజం. వ్యావహారికానికి వ్యతిరేకత తగ్గుతున్నది. గ్రాంథికానికి అనుకూలత సన్నగిల్లుతున్నది. కాలప్రవాహం అగనట్లే భాషా ప్రవాహమూ ఆగదు. ఆపలేరు. ఇది చరిత్ర. చరిత్ర నేర్పే పాఠం.