నవంబరు 5వ తేదీ శశిలేఖలో మ. చిన పురుషోత్తం పంతులుగారు మొదలైన వారున్ను, 7వ తేదీని మా మిత్రులగు మ. లక్ష్మణరావు పంతులు గారున్ను వ్రాసిన లేఖలు చూస్తిని. శశిలేఖ సంపాదకులు నాకు చాలా కాలము నాటి మిత్రులు. చెడుగు చేతామనే ఊహతో ననుగూర్చి యేమిన్ని వ్రాయరు. అచ్చొత్తరు. కాక, యేమి ప్రచురించినా, మా స్నేహమునకు భంగము రాబోదు.
గురజాడ అప్పారావు
(వాడపల్లి శేషతల్పశాయి గారికి కృతజ్ఞతలతో)
విద్వాంసుల ధోరణులు వేరు వేరు రీతుల నుంటవి. హాస్యరసము మీద కొందరి కలం పరుగులిడుతుంది. కొందరి బుద్ధులు దోషాన్వేషణములో వాడి తేరుతవి. మరికొందరి బుద్ధులు తిట్లకు తీరివుంటవి. ఈ మూడు రీతులు చాలినంత లేకపోవడమువల్లనే, మన భాష యిప్పటి యీ దురవస్థలో వున్నదని నా అభిప్రాయము.
కాని, కన్ను కొంచెము తెరచి, యితర దేశములలో భాషలు యెలా పెరుగుతున్నవో, అదిన్ని, గత కాలములో మన దేశ భాషలు యెట్లు పెరిగినవో అదిన్నీ, కాని: శ్రద్ధతో భాషా శాస్త్రమును కరచి, గ్రాంథిక వ్యావహారిక భాషలను పరిశీలించి, మరి తప్పులుపట్ట తలపడితే, ఉభయతారకంగా వుండును. తీర్పులు చెప్పడం సులభం; విద్యాపరిశ్రమ కష్టం.
అంతవరకు ఎవరి స్వాభావానుసారముగా వారిని వ్రాయనిస్తేనే తప్ప, పేపర్లకు యీ పాటి వ్రాయడమూ ఉండదు. అచ్చు ఆఫీసులు మూసి, పత్రికా సంపాదకులు తపస్సుకు కూచోవలసి వస్తుంది.
ఇక మా మిత్రులు మ.లక్ష్మణరావుగారి మాట. మ. రాయప్రోలు సుబ్బారావు పంతులుగారు యేమి వ్రాశారో నేను చూచి యుండలేదు. లక్ష్మణరావుగారి వ్రాతను పట్టి చూడగా వారికి, వాడుక భాషయందు నిరసన భావం వున్నట్టు కనబడుతుంది. ఏలనో? వారు దయచేసి కారణము చెప్పుదురు గాక.
గతకాలములో నవమాష్టం పారాయణము చెయ్యడమందు నిపుణులైన బ్రాహ్మణ ఉద్యోగస్థులు రయితును, రట్రను, పరిపాటిగా, ఒక స్వారస్యమైన తిట్టు తిట్టుతూ వచ్చేవారు. ఇప్పుడైనా కడపెడలను ఆ శబ్దం, వినబడ్డం కద్దు. యీనాడు కొందరు పండితులూ, కవులూ, అట్టిదియే గ్రామ్యోక్తి వొకటీ, గ్రామ్య భాషను గురించి వినియోగించుదురు.
వారిలో తెగబడి దీవించినవారు శ్రీ బాలకవి భోగరాజు నారాయణమూర్తిగారు. వారి వ్రాసిరి.
గీ. “అజుని సృష్టి విచిత్రమేమందు నౌర
ఘనుల నిరుపమ పాండిత్యగరిమ మేమొ
అంబురాశిలోఁ గాలకూటంబు వోలె
గ్రామ్య భాషయు కొత్తగా ప్రబలె నిపుడు.”
గీ. నిరత మన లక్షణంబుల నెగడుచుండి
ఆంధ్ర భాషతోఁ బోరాట మాడ దొడగె
లంజ సంతతి పొత్తుకై లావు మించి
యౌరసుని తోడఁ బోరాట మాడునట్లు
సీ. నవనవాలంకార నవ్య వైభవమన్న
దలనొప్పియట దీని సరణియేమో
మహిని వ్యాకరణోక్తి మాటలాడుట యన్న
వాంతి యౌనట దీని వరుస యేమొ
సాహిత్య విద్యుక్త సల్లక్షణములన్న
మరి బోసికొను దీని పరణి యేమొ
వివిధ భావ్యాకార వృత్త గీతములన్న
మూల డాగును దీని లీలలేమొ
గీ. తగుదునని తాను గూడను తగవు లిపుడు
సేయగా బూనే దెల్గుతో వేయి యేల
ఆంధ్ర భాషా వధూటి గృహంగణమున
దాసియై మెలగుటకువైన దగునె చెపుడ.
“Appearances are deceptive” అని వొక ఆంగ్లేయోక్తి కలదు. తిట్టగానే, అసూయ కాబోదు, భూషించగానే, అనురాగము కాబోదు. ముద్దు తిట్లూ భక్తి తిట్లూ రసభరితములు. నారాయణమూర్తిగారి తిట్లు కూడా అట్టివేమోయని సందేహం పొడముతున్నది. లేని యెడల అవలక్షణములు వారికవిత్వమందు వారేల వాడుదురు?
వారు ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచికకు వ్రాసిన పద్యములు కాక, శ్రీ రాయబహద్దర్ వీరేశలింగం పంతులుగారి లైబ్రరీని గురించి ఆంధ్ర ప్రకాశికకు వ్రాసిన పద్యములను కూడా నేను చదివితిని. అందు కొన్ని స్వారస్యములు కానవచ్చినవి.
- స్వభాషను దేశమునందునన్ జీవ వినాశ – ఘోరమునుఁ బొందగ నీయక .
- పూజితమై కవీంద్ర సుమ పుష్కలమై ద్విజరాజ పుంజమై చెలంగు నీ రాజమహేంద్ర పట్టణ వర స్థిత బాలక పుస్తకాలయోర్వీజము.
- కల్పతరోపమానమై.
- నవ నవ గ్రంథ సంధానుడై యే కవి
- అతుల తేజ సంయుతంబయి
ఈ సంస్కృత ప్రయోగములు మిక్కిలి సరళములు కావనుకుంటాను. ఇక తెనుగున కళలు ద్రుత ప్రకృతికములతో సంబంధించిన నియమములను వీరు సంస్కరించినట్లు కనపడుతుంది.
- చాల యుపద్రవమయ్యె.
- దేశ భాషలందెల్ల యనుచు
- కథల నవ్వుల కల్లమి కలలబడుట
- భాషను చక్కగా
- అటు చేతురుగాక
ఇది గ్రామ్యమునకు వృత్తి కల్పించుట కదా ? బలియులు బలియురు కావలయును.
పై వ్రాసిన మాటలు, రాయవలసి వచ్చినందుకు చాలా చింతిస్తున్నాను. బాల కవులు ప్రతిభావంతులని వింటిని. మన ప్రాచీన కవుల గ్రాంథిక భాషలో రాయడమన్నది గరిడీ విద్య. భగవంతుడు కాళ్ళు యిచ్చినందుకు సుఖంగా నడవక గెడలెక్కుదురు; యేమి చెయ్యను?
రామాయణమును తెలుగు చేసిన మ. వావిలకొలను సుబ్బారావు పంతులుగారు కూడా ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచికలో గ్రామ్యమును గురించి సరసముగా కొంత ముచ్చటించిరి. “కులటయగు మాత కన్న బతివ్రతయగు మాత యెక్కువ పూజ్యురాలైనట్లు, గ్రామ్య భాష కన్న లాక్షణిక భాషయే ప్రశస్తమని బుద్ధిమంతులెల్ల నంగీకరింతురు. అట్టి సలక్షణ భాష నుపేక్షించినచో గలుగు ననర్ధములు పెక్కులు గలవు. గ్రంథ విస్తర భీతి సంక్షేపించెద. గాని తుదకాంధ్ర పదము నామావశిష్టమగు.”
పర భాషల నేర్చుట కడుపు కూటి విద్యగా నెంచి యింకొక చోట రాయడంలో సుబ్బారావు పంతులుగారు పరభాషల నేర్చుట కేవలం గర్హ్యము కాదనుటకు ప్రమాణముగా యీ క్రింది పద్యమును వుదహరించిరి.
“క్షితిమ్లేచ్చ భాష శ్రుతి గ
ర్హిత మగునట్లేనని ధరిత్రిని దానిన్
మతి రోసి విడువ గూడదు
సతతము వ్యవహార హాని సంధిలు కతనన్”
పై పద్యమున మ్లేచ్చ భాషయని రాయడములో అప్పకవి తురకల భాషను మనస్సులో వుంచుకున్నాడు. ఆ కింది ఉదాహరణములను చూడండి. సుబ్బారావు పంతులుగారు యింగ్లీషు భాషను మనస్సులో వుంచుకొనిరి. గాని శ్రుతి గర్హితమయిన మ్లేచ్చితము, యిది గాని, అదిగాని కాదనుకుంటాను.
పతంజలి వ్యాకరణాధ్యయన ప్రయోజనములను చెప్పడములో, శతపథ బ్రాహ్మణంలోని ముక్కొకటి యెత్తి రాసినారు.
“తేஉసురా హేలయె హేలయ ఇతి కుర్వసతః పరాభవభూవుః
తస్మాబ్రహ్మణేన న మ్లేచ్చితనై నాపభాషితవై !
మ్లేచ్చో హ నా ఏష య దవశబ్దః [1]
మరివొక చోట మహాభాష్యంలో —
“గరీయా నప శబ్దోప దేశః ఏకైకన్య శబ్దస్య బహవో అపబ్రంశాః
తద్యథా గౌరిత్యస్య శబ్దస్య గావీ , గోణీ, గోతా, గోపోతలికేత్యేవ మాదయో పభ్రంశాః “[2]
శ్రుతి దృష్ట్యా, సంస్కృతపు మాట, లోకుల నోట మారి సంస్కృత లక్షణమునకు పొందక పోగా, అట్టి మాట మ్లేచ్చితము లేక అపశబ్దమగును. అంతేగాని తురకమూ, యింగిలీషూ మ్లేచ్చితములు కావనుకుంటాను.
ఉద్యోతంలో నాగోజీభట్టు
“నమ్లేచ్చితవై భాషా విషయమితి భ్రమ నివృత్త్యర్ధం తద్వివరణం నాపభాషితవై ఇతి…
అపశబ్దత్వం వ్యాకరణనుగత శబ్దస్యేష ద్భ్రంశన ఏవ ప్రసిద్ధమితి భావః ॥
నను మ్లేచ్చోనామ పురుష విశేషోవా సకథమపసబ్దో? త అహ ఘణితి ।
నిన్దావచనా న్మ్లేచ్చతేరితి భావః ।
నిన్దాచ శాస్త్ర బోధిత విపరితోచ్చా రణేన పాపసాధనత్వాత్ ।
ఏవంత మ్లేచ్చా ఇత్యస్య నిన్ద్వా ఇత్యర్థ ఇతధిక్ ॥ [3]
వేద దృష్ట్యా అన్య దేశ భాషలకు మ్లేచ్చిత దోషము వర్తించనేరదు. “గ్రామ్యము నందుగల యనేక దోషంబుల గ్రహించియే పూర్వులు ‘అపశబ్దం ప్రయుంజానో యనేక గౌరవం నరకం ప్రజేత్’[4] అని శాసించినారని సుబ్బారావుగారు ఒక బాంబును నాబోట్ల మీద విసర జూడగ అదిపంతులుగారి చేతిలోనే పేలినది. యుక్తమే కదా?
సుబ్బారావు పంతులుగారు రామయణమును తెనిగించినారు. వారి తెనుగు సంస్కృత పదములతో నిండి వున్నది. వీరి సంస్కృత ప్రయోగములలో మ్లేచ్చితములు అక్కడక్కడ కలవు. “గోవీ, గోణీ, ఆణవయతి”[5] ఇత్యాది అపభ్రంశములను పఠించిన శిష్టేతరులకు , లోకసిద్ధి అయినా శరణమైయుండెను. స్వసిద్ధాంత ప్రకారము పంతులుగారికి శరణమూ కానరాదు.
గాని, ఉద్యోతంలో “ప్రకరణాచ్చతత్వంగోయం నిషేదః”[6] అని, అహోబల పండితీయములో “అత ఏవ వ్యాకరణ మహాభాష్యే సర్వోప్యప
శబ్ద నిషేదః క్రతు విషయ ఏవ ఇతి ప్రతిపాదితం [7] . ఇటువలెనే శబ్ద కౌస్తుభంలో కూడా మహా భాష్యమందు “యాజ్ఞే కర్మణి ననియమో అన్యత్రా నియమః”[8] ఉద్యోతంలో “యజ్ఞే సుశబ్ద ప్రయోగాద్ధర్మోప శబ్ద ప్రయోగాద ధర్మ ఇతి తత్రైవ తయోః ప్రయోగ నియమః తదతిరిక్త స్థలేతు సుశబ్దాప శబ్దయోః ప్రయోగే అనియమః”[9]
ఇలా రాయడంచేత సుబ్బారావు పంతులుగారి రామాయణమందు నాకు అనాదరణ కలదని భావించకండి. వీరి కవిత్వం సాఫైనది. వారి దైవభక్తి అందరూ యెన్నతగి యున్నది. తెలుగులో వీరి పాండిత్యము అసమానము గాని తెనుగులు నేర్చి, వీరి ఆంధ్రీకరణమును చదువుటకన్న, సంస్కృతంలో మిడిమిడి జ్ఞానం సంపాదించుకొని వాల్మీకి రామయణం చదువుకోవడమే శ్రేయమని నా అభిప్రాయం.
ఆంధ్రపత్రికలో “గ్రామ్యమును నిరసించుచు” వీరు వ్రాసిన వ్యాసమును బ్ర॥ శ్రీ కాశీభట్ల బ్రహ్మయ్యగారు పొగిడి, తమ పత్రికలో ప్రచురించిరి. బ్రహ్మయ్య శాస్త్రిగారు కూడా వ్యావహారిక భాష “అందరి నోటంబడి కులటవలె భ్రష్టత నంది యుండును” అని వ్రాసిరి. బ్రహ్మయ్య శాస్తుల్లుగారి దర్శనము నేను చేసి వుండకపోయినా చాలా కాలమునుండి వారి నెరుగుదును. వారి భాష నిర్దుష్టము. విద్యయు, తత్వాన్వేషణమును వారికి వ్యసనములవుట చేత, మాలో అభిప్రాయ భేదములున్నా వారి యెడల నాకు విశేష గౌరవము కలదు.
వాడుక భాషను గురించిన నా అభిప్రాయములను ప్రమాణములతో విమర్శించిన వారు వీరొక్కరే. సమాధానములు, మరివొక చోట చెప్పదలచితి గాని, వారు ఉదహరించిన యింగ్లీషు పుస్తకములు ప్రస్తుత వాదమునకు ప్రసక్తములు కావు. ఇక వారి వాదమునకు సంస్కృత వ్యాకరణము యెటుల సహకారియో తెలియవలసి వున్నది. కన్నడ గ్రాంథిక భాష మారుచు వచ్చెను గదా? ఆ మారుదలకు ఆ దేశపు శిష్టులు యెటుల వొప్పిరో? తెనుగు గ్రాంథిక భాష మాత్రము మారలేదా?
ఈ మధ్య “యిలస్ట్రేటెడ్ లండన్ న్యూస్” అను పత్రికలో చెస్టర్‌టన్ (Chesterton) అను బుద్ధిశాలి, వైరుధ్యం లేని వినోదము గురించి చమత్కారముగా ముచ్చటించిరి, సీమలో Unionist versus frce trader అనునది. అటువంటిదే. పాత గ్రాంథిక భాషను, సలక్షణముగా వ్రాయవలసినదన్న శాస్తులు గారి మతమునకున్నూ, శిష్టులు యీనాడు వాడుకుంటూ వున్న భాషలో నుంచి క్రొత్త గ్రాంథిక భాషొకటి కల్పించుకోవలసినదన్న నా మతమునకున్నూ వైరుధ్యం యెక్కడ? మా జాగాలే వేరు.
పరిశీలించి చూడగా, శాస్తుల్లుగారికిని, నాకును అభిప్రాయ భేదము చాలా తక్కువ. గ్రాంథిక భాష వాడుక చేసేవారు. దాని నియమములను పూర్తిగా మన్నించవలసినదనే నా అభిప్రాయము. ఆ భాషను సాధించలేని వారు, అనగా లోకానికెల్లా, బ్రహ్మయ్య శాస్తులు గారి వంటి పదిమంది తప్ప కడమందరూ, వాడుక భాషలోనుంచి సులభ సాధ్యమైన వొక క్రొత్త గ్రాంథిక భాషను కలిపించుకుంటే, శాస్తులుగారికి యేమి కొరత?
వాడుక భాషను కులట అని మర్యాదచేసే పండితులు దానిని దూరముగా విసర్జించక యేల వాడుక చేతురో? వారు ‘యాంటీనాచ్’ కారు గాబోలును.
ఇక కళింగ దేశ చరిత్ర మాట: దానిని గురించి మా మిత్రులు నాతో ముచ్చటించినప్పుడు, వారు కోరకముందే, వారి నిర్ణయములను యెరిగిన వాడనౌట చేత, యిదివరకు నలుగురు వ్రాస్తూ యున్న భాషనే వ్రాతునంటిని. అట్టి వొప్పుదలకు కారణము దేశమున చరిత్ర జ్ఞానము విరివి కావలెనని మా మిత్రులు చేస్తూవున్న మహోద్యమమునకు తోడ్పడను అభిలాషే. అంతేగాని ఇప్పుడు గ్రంథకర్తలు వ్రాస్తూవున్న అత్యంత కృత్రిమ భాషకంటె, బ్రాహ్మణాదులు వాడుకునే భాష మంచిదని తెలియక కాదు.
ఇప్పుడు లక్ష్మణరావు పంతులుగారు నాకు వొక చిక్కు తెచ్చిపెట్టినారు. వారు రాసిన లేఖలో లక్షణ ప్రయుక్తమనే మాటొకటి ప్రయోగించారు. యీ లక్షణం స్వభావం యెట్టిదో వారు కొంచము శ్రమ చేసి పత్రికాముఖంగా లోకానికి వ్యక్తీకరిస్తే ఉపయోగంగా ఉంటుంది.
వ్రాతను బట్టి పోల్చుకుందామని, విజ్ఞాన చంద్రికా గ్రంధమాలలో చటుక్కున చేతికి వచ్చిన ఆంధ్రుల చరిత్రను తీసి చూస్తిని. దానిలో భూమిక మా మిత్రులు రాసినదే. మొదటి వాక్య కబందమును చదివి చూడగా భాష లక్షణానుసారంగా వున్నట్లు నాకు కానరాలేదు. “అనియు మాద్గ్రామ్యంహి యత్యపభ్రమంశః [10] అనే లక్షణము ప్రమాణం అయిన యెడల ఈ భాషకు గ్రామ్యత గట్టిగా పట్టి వున్నది. గ్రామ్యంలో దిగిన వెనుక ఆగడం యెక్కడో!
అది అటుండగా గ్రామ్యశబ్దార్థం యేమిటి? “శతాంధాః కూపం ప్రవిశంతి”[11] వొకడన్నాడని వొకడండమేనా, తత్వవిచారంకద్దా? సంస్కృత భాషా కావ్యదోషము. అహోబల పండితులు దీనిని గురించి కొంత రాసినారు (రాజా భుజంగరావుగారి పుస్తకములో 117 పేజీ చూడంది.)
గ్రామ్య శబ్దానికి సాధారణమైన అర్ధము మోటు. ఈ శబ్దమునకు విరోధి “నాగరము, నాగరికము, నాగరకము.” యింగ్లీషులో నాగరికము Polite, refined అందురు. గ్రామ్యము Low, vulgar అందురు.
“శబ్దేపి గ్రామ్యతాస్త్యేవ సాసభ్యేతర కీర్తనాత్” శిష్టులు రాత్రీ పగలు వాడుకచేసే భాషను గ్రామ్యమనడము, అనాలోచితమనుకుంటాను. అదే గ్రామ్యమౌట నిజమైతే ఇప్పటి మన గ్రంథకర్తలంతా గ్రామ్య జనమే. ఒక్క మహామహోపాధ్యాయులు తర్క “పామరాది ప్రయుక్తం యత్తద్గ్రామ్య మభిధీయతే.”[12]
గనుక యిటుపైని బ్రాహ్మణాదులు వాడుకునే నాగరికమైన భాషను పండితులు గ్రామ్యమనక పోవడము ఉచితమని భావిస్తాను. నాగరకమని దానికి పేరుపెట్టి గ్రామ్యమును వొక చీడి దించితే, శబ్దౌచిత్యము సాధితమౌతుంది.
“అనియద్గ్రామ్యం హి యత్వపభ్రశః”[13] అని కొందరనగలరు. ఆ మాటకు వస్తే, నియమం లేని భాషే వుండదు. వొక వేళ వుండుననుకున్నా, గ్రామ్య భాషకు వొక నియమం చేసుకుంటే, గ్రామ్యత పోవలెను. యీ కారిక రాసిన వైయాకరణుడు అయితేనేమి, అహోబల పండితుడైతేనేమి, సంస్కృత లక్షణానుసారంగా, తెనుగుకు లక్షణం కల్పించకోరి, అసందర్భములు కల్పించుకున్నారు.
కాదంటిరా, నియమమంటే యేమిటో, సంస్కారం అంటే యేమిటో, వాటి స్వభావ మెట్టిదో వాటి చరిత్ర యెట్టిదో స్పష్టముగానూ విపులముగానూ యెవ్వరేని ఉపన్యసించి మమ్ముల తరింపజేతురు గాక. సంకేతిక సుప్రసిద్ధ పదములు కూడా యెట్టివో తెలియగోరితిని.
గ్రామ్య, మ్లేచ్చిత, అపభ్రంశ శబ్దములను గురించి ముందు వ్రాసెదను. గ్రామ్యమును గురించి మా మిత్రులు బ్రహ్మశ్రీ వేదం వేంకటరాయ శాస్తులవారు చాటలు చెరిగి చర్చించినారు. వారు గ్రామ్య భాషను రాసిన కొన్ని పాటలు బర్న్‌స్ అను మహాకవి పాటలను పోలియున్నవి.
గ్రామ్య భాషను గురించి యెవరేమి ప్రచురించినను దయచేసి ఆ పత్రికలు నాకు పంప వేడెదను. గ్రామ్య భాషా చర్చ గోరిన పత్రికా సంపాదకులు గ్రామ్యమును గురించి, నా వ్యాసములు వారి పత్రికలలో యెత్తి ప్రచురింతురు గాక!
ఇంతవరకు వ్రాసిన పిదప మా మిత్రులొకరు శ్రీ బాలకవిగారి విమలాదేవి అను నవలను నాకిచ్చిరి. స్థాలీపులాక న్యాయముగా పరిశీలించ ఈ ప్రయోగములు కానవచ్చినవి
- అనవసరమైన చోట్లను అనగా అనుకరణములేని చోట్ల అన్యదేశములు.
సూచీ పత్రములో ఔరంగజేబు ఖాయిలా; యా ఖుదా యా అల్లా; హుషారీ, ఖత్తల్ – ఇట్టివి చాలా కలవు. - సంధి విసంధులు తోవలు కానరావు
వఱకు ఆంధ్రోపాధ్యాయ పదవి; గ్రంథకర్తను అగు; సమగ్ర సృష్టియనియు, ఇందు; ఇప్పుడు; ఇందిర; ఇట్లు, ఉదయమున; గార్లు; ఆశ్చర్యాతిరేకముచేత, రాజసింహుడు; అతని ఏమి యీ యన్యాయము; ఇంతలో నారాజభటులు ఆ పురుషుని ఈడ్చుకొని బాటసారిని సమీపించిరి. - తనకుగల – నుత్సాహము; విరిచి గట్టి; నాకిదియే ప్రథమ ప్రయత్నమని దెలుపుచుండ; రాజ్యమునకు వారసననియు, (వారిన్ లేక వారిన) చంద్రావతి మహారాణిబట్టి తెచ్చిన యాతడు సంతోషాతిశయమున.
- న్యాయమైన ఆడుది; సాటి వంశజుడే; అన్యధా తలంచి; సంరక్షణ స్మరణ; ఈ ప్రయాస కూడ; కుంభకర్ణుని పాత్ర; అర్ధపూర్ణ దృష్టి; సృష్టింపబడె; అంతా రామమయం (మిగిలిన పాట సంస్కరింపబడినది); నీవు చింతాక్రాంతయై; దండన; ఘటనము; సాహాయము; జాగ్రత్తగా; అసహ్యపరుడు (అసహ్య పాత్రుడనుటకు) ఇతరత్ర; తన తదంతరము; కుమారిత; భగవాన్ వశిష్టుల వారు; ఆపద నివారణోపాయము; ఆడపడుచు.
ఇవన్నీ తప్పులని నా అభిప్రాయమని కాదు “అపశబ్ద భయం నాస్తి అప్పలాచార్య సన్నిధే”[14] అని చెప్పే వుంచాడు. బాలకవుల ప్రయోగసరణి కవిత్రయమువారి సరణికి చాలా దూరమనుకుంటాను.
అథస్సూచికలు
- అసురులు హే అరయః హే అరయః అని అనడానికి బదులు హే అలయః హే అలయః అని అనడం వల్ల పరాజయం పొందారు. హే అని ఫ్లుతంగా ఉచ్చరించాలి. ఫ్లుతం అయితే హే అరయఁ అనాలి గాని, హేఅలయః అనరాదు. ఇదొక తప్పు. మరొకటి అరయః (శత్రువులు) అనడానికి మారు అలయః అని రకు/మారుల వాడడం. అందువల్ల పరాజయం పొందారు.కనుక తప్పులు పలుకరాదు. మ్లేచ్చమంటే అపశబ్దం.
- అపశబ్దంగా మారడం సహజం. అపశబ్దంగా ఉచ్చరించడమనే అలవాటు బలమైంది. ప్రతి శబ్దానికి అపభ్రంశాలు ఎన్నో ఉంటాయి. ఉదాహరణకు గౌః అనే పదానికి గావీ, గోణీ, గోతా, గోపాతలికా మొదలయినవి అపభ్రంశ పదాలు.
- నమ్లేచ్చితవై అంటే, మ్లేచ్చ భాషా విషయమేమో అని భ్రమ పడరాదని , దానిని నివారించడానికే నాపభాషితవై అని వివరించారు పతంజలి.నమ్లేచ్చితవై అంటే అపశబ్దం పలుకరాదు – అని అర్ధం. అపశబ్దమంటే వ్యాకరణానికి అనుగుణమైన శబ్దోచ్చారణము చేయకపోవడం, మ్లేచ్చ అంటే మనిషా, దేశమా? రెండూ కాదు. మ్లేచ్చ అంటే తప్పు అని అర్ధం. తప్పు చేయరాదు. వ్యాకరణ శాస్త్రానికి విరుద్ధమైన ఉచ్చారణ చేయడమనే తప్పు వల్ల పాపం కలుగుతుంది. ఇంతకూ మ్లేచ్చ అంటే తప్పుగాని మరొకటి కాదు.
- అపశబ్దం ప్రయోగించేవాడు రౌరవ నరకంలో పడతాడు.
- గావీ, గోణి,అణవయతి – గౌః అనే పదానికి గావీ, గోణీ అనేవి అనయతి అనేదానికి అణవయతి అనేవి అపభ్రంశ రూపాలు.
- సందర్భాన్ని బట్టి ఈ నిషేధం క్రతువుకు యజ్ఞానికి సంబంధించినదే. యజ్ఙభాగమే.
- అందువలన వ్యాకరణ మహాభాష్యంలో అపశబ్ధ నిషేదమంతా యజ్ఞానికి సంబంధించినదే అని ప్రతిపాదమైంది.
- యజ్ఞ కర్మలోనే ఆ నియమం గాని, ఇతరత్రా ఆ నియమం లేదు.
- యజ్ఞంలో సుశబ్దం వాడితే ధర్మం కలుగుతుంది. అపశబ్దం వాడితే అధర్మం కలుగుతుంది. అందువల్ల అక్కడే యజ్ఞంలోనే ప్రయాగ నియమం. ఇతర స్థలాలలో సుశబ్ద అశబ్ద ప్రయోగ నియమం లేదు.
- ఒక గుడ్డివాడిని నమ్మి వంద మంది గుడ్డివారూ బావిలొ పడుతారు.
- సభ్యం కాని వాటిని – అనాగరకమైన వాటిని పలుకడం వల్ల శబ్దంలో గ్రామ్యత్వమనేది ఉండనే ఉంది.
- పామరులు మున్నగువారు వాడేభాషను గ్రామ్యమంటారు.
- నియమం లేకపోతే గ్రామ్యం, అనే అపభ్రంశం.
- అప్పలాచార్యుల వద్ద అపశబ్దమనే భయమే (మాట) లేదు.