అనురాగేక్షణసాయకప్రకరముల్ స్వాంతంబు ఛేదింప, స
ద్వనితాశ్రీర్మహిజావిలోచనధనుర్వైదగ్ధ్యమున్ గాంచి, సం
వినుతప్రాభవశైవచాపమిది యే వీసంబుకౌనంచు, చ
య్యన భంజించిన రామమూర్తి దలతున్ ఆనంద రూపాత్మకున్.
ఠీవా? రాజసమా? ముదావహమ?! పాటీరాది సాలంక్రియా
భావప్రేరకమా? త్వదీయ ధరణంబంచున్ హరిద్రాంబరం
బావేశంబు ఘటింప నారవలువల్ భంగంబుగానెంచి సం
సేవావృత్తి చరించె రాఘవు మెయిన్ శీలోద్ధతుల్నిండగన్.
రణసంరంభమహోగ్రవేళల సురారాతీశహృద్భేదమా
ర్గణసంచారపరాక్రమప్రకట దుర్వారంబునైనట్టి చా
రణధూళట్టుల సోకినంత శిలయున్ రామాకృతింబొందె, ధా
రుణి నీవంటి మనుష్యశైలి గనమే బ్రోచేటి ధర్మాకృతీ.
లంకాపట్టణమేమి సృష్టియొ! భువిన్ రాజిల్లు వైచిత్రి, ని
శ్శంకాదిత్యనివాసజేత యనుచున్ సౌమిత్రి పూనింప, అం
బాంకాత్మీయనివాసదేశములకేపాడౌనటంచున్ కులా
లంకారేడ్యు విభీషణున్ దలచు శ్రీరామున్ మదిన్ వేడెదన్.
తన బాణాహతి తాటకాదిదశమస్తాంతంబు దైతేయతన్
కనుచూపట్టునకందకుండ దునుమన్ కంకప్రపంచంబు వా
సన పట్టున్నటజేరి మారితతనూశాఖంబులంగాంచి భీ
తినినొందంగ, హసించు రాఘవుని హృత్సీమన్ ప్రతిష్ఠించెదన్.
విద్రావవ్యవధానమీక, సమదాభీలాంగలక్ష్యంబులన్
ఛిద్రంబౌగతి సేసి, రావణ తనూశీర్షంబు లక్షించి శ
శ్వద్రీతిన్ ప్రజనించు నేత్రభయదాభ్యాసైకదీక్షానట
ద్రౌద్రాకారము రామభద్రునెదలోదాల్తున్ ప్రసన్నాత్మకున్.
‘వైదేహీ, వినుమోయి! మాకిదె బృహద్వార్తావిశేషంబయెన్
మీ దేశంబున నాగలంచున ధరన్ మీనేక్షణల్ బుట్టరే?’
‘కాదా, నాధ! భవత్ప్రదేశముననేకంగాను పర్మాన్నమే
జోదుల్నివ్వగ?’ నన్న నవ్వు రఘువంశోద్భూతునర్చించెదన్.
హరిణంబైన, మనోహరద్రుచిర దేహాకారమైయున్న, నే
తరదుస్సాధ్యహిరణ్యరాగకిరణాధారంబునైనన్ నిజా
సురమాయాఫలమంచునెంచి జగముల్ చూర్ణింపగా జేయు, ద
త్సురతాతాస్త్రము వైచు రామభయదస్ఫూర్తిన్ మదిన్నెంచెదన్.
ఏ వీరత్వము సాధుసంఘములకున్నిచ్ఛాప్రదంబై, నిశా
జీవప్రాణసమాహరత్సమయదాక్షిణ్యత్వహీనంబునై
దేవవ్రాతమునీంద్రరాజనుతమై దివ్యత్వమైయుండునో
చేవన్నిచ్చుత నట్టి రాఘవమహచ్ఛీలంబు మాకెప్పుడున్
ఈరీతిన్ భవదీయ చింతన మదిన్నెన్నో విధాలైన నా
పోరాటంబులగెల్చి జేయ, రససంపూర్ణంపు రూపంబు దృక్
పారంపర్యములందె గాని, శ్రితనిర్వాణప్రదోద్యుక్త వే
ళారూపంబు తరంబె నీది దలపన్ రక్షింప రా రాఘవా.
[రామరసాయనము పేరిట రాసిన ఈ పద్యాలలో ఒక్కొక్క పద్యమూ శాంతబీభత్సాద్భుతరౌద్రాది నవరసాలలో ఒక్కొక్క రసానికి ఉదాహరణ. ఏ పద్యం ఏ రసానిదో పాఠకులే తెలుసుకొని తెలుపుతారన్న ఊహతో ఏది ఏదో ప్రస్తావించటం లేదు. – సం.]