అద్వైతం

నన్ను నేను కావలించుకోడానికి
దగ్గర చేసిన చేతుల్లోకి నువ్వెలా వచ్చేవ్?

నేను గాల్లోకి విసిరిన ముద్దుల్ని
నేనే పట్టుకొని పెదాలకద్దుకొనే
ప్రయత్నంలో నువ్వెక్కడ్నించి వచ్చేవ్?

ఆత్మస్పర్శలొ మమేకం చెందేటప్పుడు
ఈ తడబాటేమెటి?
జీవన భ్రమణంలో కలిసిపొయిన మనం
ఇద్దరమా? ఒకళ్ళమా?

అప్పుడప్పుడు అద్దం తుడిచి ముఖం చూసుకొన్నప్పుడు
మీసంలేని మగతనం కనిపిస్తుంది
తడువుకొన్న ముఖం మీద కాటిక మరకలు

అప్పుడప్పుడు కట్టుకొన్న పంచె రూపాంతరంచెంది
చీరగా జారి పొతుంది

నఖక్షతాలు, గరుకుగెడ్డాలు, చెక్కేసిన చెక్కిళ్ళు,
అంటుకొన్న బట్టలు,
ముడివేసుకొన్న రాత్రింబవళ్ళు

అలల కొడవళ్ళతో కాలం కోసేసింది
కుప్పగా పడ్డ బతుకుల్లో
భవిష్యత్ బీజాలు వెతుక్కోవాలి

ఇద్దరి నుంచి అద్దరికి ప్రయాణంలో
మనం ఏకవచనమా
బహువచనమా?


ఇంద్రప్రసాద్

రచయిత ఇంద్రప్రసాద్ గురించి:

ఆవంత్స సోమసుందర్ అంతేవాసిగా సాహిత్యంతో ప్రారంభమయిన ఇంద్రప్రసాద్ గారి సాహిత్య ప్రయాణం ఇంకా కొనసాగుతూనే ఉంది. నడిచి వచ్చిన దారి (కవిత్వం 1993), కాలం సైకత తీరం (కవిత్వం 2023), మూడు పడవలు (కవిత్వం 2024) అనే సంకలనాలను ప్రచురించారు.

 ...