జానపద సాహిత్యంలో సంవాదాలు
ఆలుమగల మధ్య కలహం ఎంతసేపు అంటే “అద్దం మీద పెసరగింజ వేసినంత సేపు” అని “ఆరిక కూడు ఉడికినంత సేపు” అనే మాటలు లోకవిదితమే. తగవులు రావడం సర్దుకుపోవడం జరుగుతూనే ఉంటుంది. కోపతాపాలు, మధ్యవర్తుల రాయబారాలు సాగుతూనే ఉంటాయి. అయితే మధ్యవర్తులు లేకుంటే మాట్లాడుకోవలసి వస్తే తడికనో, బుట్టనో, పిల్లినో, కుక్కనో మధ్యవర్తిని చేసి మాట్లాడుకునే సందర్భాలుంటాయి. అటువంటిదే ఒక పాట:
భార్య: పొడికి కాంతి లేదు, పుడక మెరుగూ లేదూ, వద్దని చెప్పవే తడికమ్మా
భర్త: పట్టుచీర తెచ్చాను పెట్టె లో పెట్టాను కట్టుకోమని చెప్పు తడికా॥
భార్య: చీరకంచులు లేవు చుట్టు చెంగులు లేవు వద్దని చెప్పవే తడికమ్మా!
అని అనగానే భర్త కొర్రబియ్యం తెచ్చాను, గోంగూర తెచ్చాను వండమని చెప్పవే తడికా అంటాడు. ఆమె వండనని తెగేసి చెబుతుంది. తాటిపండు తెచ్చాను బుర్రగుజ్జు తెచ్చాను తినుమని భర్త చెప్పినా ఆమె తిననని భీష్మించుకుంది. భార్యలను ఎట్లా సంతోషపెట్టాలో భర్తలకు తెలుసును కనుక “సంతలోకి వెళ్ళి సరిగంచు చీరను, అద్దాల రవిక తెస్తా తడికా! అని చెప్పివెళ్ళి, బహుశా తెచ్చినాడేమో వాటిని చూడగానే ఆమె మనసు మారిపోయింది.
తినమనీ చెప్పవే తడికా! తడికా!
అని భర్తను కోరింది. కాని భర్తకు కోపం పోలేదు. అందుకే
వద్దనీ చెప్పవే తడికా! తడికా!!
అని మూతి ముడుచుకున్నాడు. కాసేపటికి ఆమెపై ప్రేమ ముంచుకొచ్చిందేమో
వెయ్యమని చెప్పవే తడికమ్మా
అన్నాడు. ఆమె
రమ్మాని చెప్పవే తడికమ్మా!
అని అతని కోపం పోగొట్టింది. ఇద్దరి అలకలు తీరినాయి. దాంపత్య జీవితంలోని ప్రేమానుభూతులను వ్యక్తం చేస్తుందీ పాట.
జానపద సాహిత్యంలో ఈ రకమైన సంవాదాలు ప్రత్యేకంగా చెప్పుకోదగ్గవి. శివుడు-గౌరమ్మలు, విష్ణు-లక్ష్మీ, అలివేలు మంగమ్మ-వేంకటేశ్వరులు, లక్ష్మీ పార్వతులు, లక్ష్మీ గౌరమ్మలు, రాధాకృష్ణులు, గంగాగౌరులు, కృష్ణుడు-చెంచీతలు, వదినా-మరదళ్ళ, అన్నా చెల్లెళ్ళ సంవాదాలే కాక వేదాంత సంవాదాలు, ఆవు పులి కథా సంవాదాలు, తాడిచెట్టు కొబ్బరి చెట్టు సంవాదాలు మొదలైనవి వైలక్ష్ణ్యమైనవే కాక వైశిష్ట్యాన్ని సంతరించుకున్నాయి. కృష్ణుడు చెంచీతలకు సంబంధించిన సంవాదంలో ఒక రసవంతమైన సన్నివేశం.
ఎందుకొచ్చావే చెంచీతా! ఎవ్వరి దానవే!
చెంచీత: ఎందుల కొస్తే నీకేరా, నేనెవ్వరైతే నీకేరా? ఏట కొచ్చాను మగవాడా నల్లమల నుండి దుప్పేట కొచ్చాను పోపోవోయ్” అంటుంది.
కృష్ణుడు నీవు వేటకొస్తేనేమి గాని, మాటలాడితేను కోపమా, ముచ్చటాడితేను కోపమా, పలుకు పలికితేను కోపమా చెంచీత అని అడుగుతాడు. చెంచీత “మాటలు మచ్చికలు మాకు సరిపడవు. దగ్గరకి రావొద్ద” ని అంటుంది. కృష్ణుడు
లోకాల కర్తనే చెంచీత
రాధ రుక్మిణి కన్న చెంచీత
చక్కని దానవని చెంచీత
కోరి వచ్చితినేను చెంచీత
అంటూ స్త్రీలు లేక కాదు, పదహారువేల మంది గోపికలు, అష్టభార్యలు తనకిష్టులుగానే ఉన్నారు. వారితో తాను విహరిస్తూనే ఉన్నానని చెప్పి “వాదాడ వస్తినే చెంచీత, భేదమెంచబోకు చెంచీత” అని “నన్ను పెళ్ళాడవే చెంచీత” అని ప్రాధేయపడతాడు. పైగా కమ్మలు కడియాలు, కనకంబు బావిలీలు, మేలైన సొమ్ములు, ఏడుకోట్ల ధనము నిస్తానంటాడు. చెంచీత “ఏడు గూడెములలో ఎన్నంగ కులమైన ఎలపోతురెడ్డి కూతురునని, ఏడుగురు అన్నలు వదినెలు కలదాన్నని పొమ్మని భయపెడుతుంది. వెంటనే కృష్ణుడు:
నాకు వెతకనేల మామగావలెనే
మేనరికమున్నాదే చెంచీత
బంధుత్వమున్నదే చెంచీత
చుట్టరికమున్నదే చెంచీత
కలసి మెలసుందామె చెంచీత
అంటాడు.
చెంచీత కోపంతో నీవు పాన్పు పై పవళించినపుడు నిన్ను పామైనా సెరకదా, నిన్ను తేలైన చెనకదా, నీవు పుట్టినపుడు నీకు సందైన కొట్ట్లేదా అని తిడుతుంది. కృష్ణుడు నీవు తిట్టిన తిట్లన్నీ నాకు అంబులై నాటుతాయి. తల్లిదండ్రులకు ఒక్కడనే నేను అని చెప్పి:
నీకు పనులెల్ల చేసేనే చెంచీత
అని కాళ్ళబేరానికొస్తాడు. చెంచీత చేసేదేమీ లేక కొన్ని వేటకు సంబంధించిన ప్రశ్నలు వేస్తుంది.
కొమ్మ లాగురు పోతునేసేవా?
ఏడు పందుల నేత నేరుతువా?
దుప్పుల వెంటాడి కొట్టేవా?
అనగానే కృష్ణుడు:
కొమ్మ లాగురు పోతునేతూను
ఏడు పందుల చక్కగా నేతూను
దుప్పుల వెంటాడి కొడుదూనూ?
అని సమాధానమిస్తాడు. చెంచీత తృప్తి పడింది.
మచ్చికతో ఉందాము రావోయి
అని అంగీకారం తెలిపింది.
తెలుగువారి కుటుంబాల్లో కనిపించే మేనరికం సంప్రదాయం ఈ పాటలో కనిపిస్తుంది. నరసింహస్వామి, చెంచులక్ష్మికి జరిగిన సంవాదాలు అనేక రూపాల్లో వ్యక్తమైనాయి. ఎంతో మంది భార్యలున్నప్పటికి వాదాడి తన వాదం నిలుపుకోవడానికి పెళ్ళిచేసుకునే భర్తలు, పందెంలో భార్యలను ఒడ్డే భర్తలు, పందెంలో (సొగటాలాటలో) భార్య గెలిచిందని కోపంతో మరొక స్త్రీ ని పెళ్ళి చేసుకునే భర్తలు ఎన్నో పాటలలో కనిపిస్తారు. పురుషాధిక్య సమాజం, ఈ పాటల్లో స్పష్టంగా ప్రతిబింబిస్తుంది.
గౌరమ్మ పెళ్ళి పాటలో గౌరమ్మ పెళ్ళీడుకొచ్చింది. ఎవరికిచ్చి చేస్తే బాగుంటుందోనని తల్లిదండ్రులు “ఊరిలో పెద్దలను అడిగి చూదాము, అందరికి మెప్పుగా అతివనిద్దామనుకొని” ఊరిలో బ్రాహ్మణులను, కాపులను, కమ్మవారిని, పెదరెడ్లను, కరణాలను సంప్రదిస్తారు. ఊరిపెద్దలంతా ఒక్కటిగా చేరి
ఎందున్న వాడమ్మ ఏ జాతివాడు
సిరిగలవాడుగా చెన్నొందువాడు
వయసు ప్రాయమువాడు వలపించువాడు
సోగములు నిలువెల్ల కలిగిన వాడు
ఎవ్వడున్నాడమ్మ? ఎందుగలడమ్మా?
అని చర్చించుకొని బాలగౌరమ్మ నడవడి ఘనమైనదని, భక్తి మెండని గౌరమ్మను పిలిపించి ఆమెతో
బాపనికి నిన్నివ్వదలచితిమి మేము
బదులేమి చెప్పెదవు? బాల గౌరమ్మా
అని అడిగారు. గౌరమ్మ నెమ్మదిగా తన మనసు బయట పెట్టింది.
ఆపనుల నేచెయ్య నా తరము గాదు
వరి బలము గురి బలము నే చదువలేను
నీతి మడుగుల చీర నేమడువలేను
ముత్యాల ముగ్గులు నే పోయలేను
అని బ్రాహ్మణులకు తన నివ్వవద్దంది. దానికి సమ్మతించిన పెద్దలు రాజ్యాలు ఏలేటి రాజపుత్రులకిస్తామన్నారు. అది విని గౌరమ్మ
సుక్క పెట్టకపోరు నగరెళ్ళిరారు
రాదారి కొప్పులూ నే చుట్టలేను
రాజులతో సరితూగ రాసరిగ లేను
కత్తులకు తలంబ్రాలు నే బొయ్యలేను
అరచేత ప్రాణాలు పట్టగా లేను
సామగానములకు నే సిద్ధపడలేను
అంటుంది. అయితే కోమట్లకిస్తా మంటారు.
కోమట్ల బేరాలు కొంటె బేరాలు
రొక్కమే సకలంబు రొక్కమే బతుకు
అని కోమట్ల పొందు తనకంగీకారం కాదన్నది. అయితే “దాసులు తమ ధర్మమును తప్పబోరు దాసులే దేశాన్ని కాపాడతారు” వారి కిస్తామంటారు.
ఊళ్ళోని భిక్షములు గుళ్ళోటి నిద్ర
అందరికి దండాలు నే మడువలేను
అడుగడుగునకు వంగి నే నడువలేను
దాసులతో పొందు సుఖము గాదన్న
అని గౌరమ్మ పెద్దలతో పలికింది. వారు ఆమెతో
ఎవరు గావాలమ్మి బాల గౌరమ్మా
నచ్చినవాడిని తెచ్చి పెడతామంటారు. ఒడలెల్ల విభూతి, మెడలో రుద్రాక్షలు, మెడలో నాగులు, నడుముకు పులితోలు, చేతిలో ఢమరుకం ధరించి సిద్ధపట్నంలో శివనంది దగ్గర వేపచెట్టు క్రింద నిలిచి ఉన్న జంగమదేవరకు తాను మనసిచ్చినానని “అతనికి నన్నిచ్చి పెళ్ళి చేయండి” అని కోరుతుంది.
ఇల్లు వాకిలి లేదు బంధువులు లేరు
అని పెద్దలు “జంగాల కోరితివా లింగాల గౌరు” అని తమ అసమ్మతిని తెలిపితే, ఎట్లాంటి వాడైనా అతడే కావాలని
జంగము దేవర దేవదేవూడు
జంగము దేవర నా దేవరన్నా
అని తన మనసులో మాట కచ్చితంగా తెలిపింది. చేసేదేమి లేక గౌరిని జంగమదేవర అయిన శివునికిచ్చి ఘనంగా పెళ్ళి జరిపిస్తారు.
శ్రామిక వర్గ సమాజంలో అన్ని కులాల వారు కలిసికట్టుగా ఉండడం, ఎవరికి ఏ సమస్య వచ్చినా అందరు కలసి సమస్యను పరిష్కరించుకోవడం, ముఖ్యంగా స్త్రీల విషయంలో మధ్య తరగతి స్త్రీలకున్న నిర్బంధాలు పెద్దగా లేకపోవడం, ఇష్టమైన వాడితో పెళ్ళి, లేకపోతే విడిపోవడం, లేదా మారు మనువు లాంటి వాటికి సమాజం ఆమోదం తెలుపడం కనిపిస్తుంది. ఇటువంటి సమాజ చిత్రణే ఈ పాటలో చోటు చేసుకుంది.
లక్ష్మీదేవికి నారాయణునికి సంబంధించిన తలుపు తీసే పాటలో లక్ష్మీదేవిని నారాయణుడు తాను రాగానే తలుపు వేసిన కారణమేమిటని ప్రశ్నిస్తాడు. కారణమేమిటో ప్రత్యేకంగా నేను చెప్పాలా? చెంచీతను నాకు సవతిని చేసినావు. “కొంచెపు జాతి చెంచీత నాకు సవతి యనుచు” చింత పడుతున్నానని చెప్పింది. అందుకే లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలని “కలికి కవాటము దెరిచి నపుడు యీ కంఠహారమిచ్చేనే” అని ఆశ చూపుతాడు. లక్ష్మీదేవి అప్పుడు
చెంత గూడుము స్వామి
అని దెప్పి పొడుస్తుంది. అప్పుడు నారాయణుడు “జిలుగు బుటేదారి చీరెలు దెస్తిని చేకొనవేమే లక్ష్మీ, నన్ను చేకొనవేమే లక్ష్మీ” అని మళ్ళీ ప్రాధేయపడతాడు. అట్లాగే “మల్లెపువ్వుల, విప్ప పువ్వుల దండలు తెస్తిని ఇంకనైనా గైకొనవే” అని అంటే అవన్నీ చెంచీత కిచ్చి కీర్తి గొనవోయి” అంటుంది. ఏమి ఇచ్చినా లాభం లేదనుకొని నారాయణుడు
చేకొనవే లక్ష్మీ! దండమైన చేకొనవే
అంటాడు. అయినా లక్ష్మీదేవి కరగలేదు. పైగా “పెండ్లి కుమారుడైనందుకు నా దీవెనలివిగో స్వామి! నా దీవెనలివిగో స్వామి!” అని వెటకారం చేసింది. నారాయణుడు మరొక మెట్టు కిందికి దిగి “శరణు, శరణు, శ్రీ లక్ష్మీ శరణు, శరణు యిందిరా నీకు, లక్ష్మీ, శరణు యిందిరా నీకు” అని శరణు వేడుతాడు. అప్పుడు లక్ష్మీదేవి నవ్వుతూ ” వాకిలి దీసెద గట్టిగానూ రావోయి” అని తలుపు తీసింది. ఇటువంటి ప్రణయ కలహాలకు సంబంధించిన పాటలు మనస్సును అలరిస్తాయి. ఈ పాటల వెనుక ఏవో మాయమాటలు చెప్పి స్త్రీలను బుట్టలో వేసుకునే పురుషుల స్వభావం, స్త్రీల అసహాయతలు స్పష్టంగా కనిపిస్తాయి.
పెళ్ళికి సంబంధించిన వేడుకల్లో స్త్రీలు పెండ్లి జరిగిన తరువాత వధూవరులను లోపలికి రానివ్వకుండా వాళ్ళ వాళ్ళ పేర్లు చెప్పించడం, వారి అక్కచెల్లెండ్లు వారికి పుట్టబోయే ఆడపిల్లలు తమ ఇంటికి కోడళ్ళుగా రావాలని కోరుకోవడం, ఇప్పుడే ఆ షరతుకు ఒప్పుకోవాలని మాట తీసుకోవడం కనిపిస్తుంది. ఇటువంటి ఆచారాలు అన్నా, చెల్లెళ్ళ సంవాదాల పాటల్లో కనిపిస్తాయి. అన్న చెల్లెలుతో
చెల్లెలు : “తలుపెట్లా దీతునన్న తగువులుండంగా” అంటుంది.
అన్న: “పట్టు చీరెయు రవికె పసుపు కుంకుమలిస్తు” అంటే
చెల్లెలు “పట్టు చీరెయు రవికె పసుపు కుంకుమ” వొల్లనంటుంది. అన్న వరుసగా చేతికి చాకిట్లు, చంగల్వదండలు, ముక్కుకు ముంగర, ముత్యాల కమ్మలు, కాళ్ళకు కడియాలు, కలవెండి మట్టెలు, కూర్చుండ కుర్చీలు, కుందనపు పాన్‌దాన్లు, పట్టె మంచము, పరుపు, బాలీనులు, ఎక్కేటందుకు ఏనుగులు, ఏలేటందుకు రాజ్యాలు, అడిగిన కట్నాలిస్తానన్నాడు. చెల్లెలు ” అడిగిన కట్నాలన్నీ అలాగే ఇస్తువు గాని అన్నా! నీ బిడ్డను నాకు అరణామిప్పించవయ్య” అని తన మనసులో మాటను చెప్పింది. అన్న మీ వదినెను అడుగుమంటాడు. “మా అన్న మనసు కుదిరి తాను ఇస్తానంటే ఎవ్వరు ఎదురు గనుక” అని చెల్లెలు అనగానే అన్నా వదినెలు మాకు మేనరికం సమ్మతమేనని బిడ్డనిస్తామని చెబుతారు. అప్పుడు చెల్లెలు తలుపు తీస్తుంది.
అప్పగింతల పాటలేగాక అత్తగారి మీద పాటలు కూడా ఎంతో వైవిధ్యంగా ఉన్నాయి.
ఒత్తులు ఒత్తకమ్మ! ఒత్తిగిలి యుండవమ్మా”
అని కొడుకును కన్నానని పొంగిపోవద్దని కొడుకులను కన్నవారికి గోడ పంచలే గతి అని, చిటపటలాడితే చిక్కులు నీకేనని, కన్న బిడ్డలా కళ్ళకద్దుకోమని, కళ్ళకద్దుకుంటే కాళ్ళుపడతానంటుంది. ఇంకా:
సరి దప్పెనా వెనుక! సోలెడు బియ్యమమ్మ
కొండెములన్ని గూర్చి! కొడుకుతో జెప్పకమ్మ
దండన సేయకమ్మ! దయయుంచు గదమ్మ
అంటుందొక గడసరి కోడలు. ఇటువంటి పాటలు సామాజిక స్వరూపాన్ని తెలియజేస్తాయి.
మరొక పాటలో పైకి హాస్యం కనిపించినా, స్త్రీలలో సంసారం పట్ల వైముఖ్యం, నిరసన బహుముఖాలుగా ఎట్లా కనిపిస్తుందో మనం గమనించవచ్చు.
కండ్లు పోతె ముంగిట యుండె మునీశ్వరునకు
పొంగలినే బెడుదు ॥
చంకన యుండె చంటి బిడ్డకు జవలరోగమొస్తే
పూరి వెలుపల పోలేరమ్మకు పొంగలినే బెడుదు ॥
కోటలో యుండే యిద్దరు మరుదులు గుండు
తగిలి చస్తే కోటలో యుండె వీరబ్రహ్మమునకు
పొంగలినే చేయిస్తు ॥
కాశీకి పోయిన అత్తగారు గయలో పడి చస్తే
కాశిలో యుండే విశ్వనాథునకు అభిషేకము చేయిస్తు ॥
జానపద సాహిత్యంలో వ్రతకథలు
జానపద సాహిత్యంలో వ్రతకథలదొక ప్రత్యేక శాఖ. స్త్రీలు తమ భర్తల ఆయుష్షు కోసం, అనురాగం కోసం, సిరిసంపదల కోసం, సంతానం కోసం ఆచరించేవి అయితే ఒక త్రినాథ వ్రతం మాత్రం పురుషులు తమ ఐశ్వర్యం కోసం చేసేది. స్త్రీల వ్రత విధానాలను పార్వతీ పరమేశ్వరులో, స్త్రీ దేవతలో స్త్రీలకు చెబితే, త్రిమూర్తులు ఒక పేద బ్రాహ్మణునికి చెప్పేది త్రినాథ వ్రతం. పురుషులు స్త్రీల సౌభాగ్యం కోసం — అంటే తమ భార్యల అనురాగం కోసమో, అక్కాచెల్లెళ్ళఆయుష్షుకోసమో, తల్లికోసమో — ఏదో ఒక వ్రతం చేసినట్టుగా ఎక్కడా కనిపించదు. వ్రత కథలన్నీ పితృస్వామ్య వ్యవస్థ నుండి పుట్టి స్త్రీలకోసం నిర్దేశింపబడినవి. కనుక పురుషాధిక్యతనే తెలుపుతాయి.
దేశాంతరంబోయిన భర్తల కోసం “దంపతుల తాంబూలపు నోము”, భర్త ఆదరణ కోసం “పువ్వుల తాంబూలపు నోము”, శరీరం వాసనగా ఉండడం వల్ల భర్త ఆదరించక పోతే దానికోసం “గంధం తాంబూల నోము”, వేశ్యాలోలుడైన భర్తను మందలించడం కోసం “కైలాసగిరి నోము”, మతి తప్పి ఎటో వెళ్ళిపోయిన పిచ్చి భర్తకోసం “కుంకుమ గౌరీ నోము”, భర్త కాశీకి వెళ్ళి తిరిగి రాకపోతే “కరుళ్ళ గౌరీ వ్రతం”, పడుచు మొగుడు రావడం కోసం “అట్లతద్ది నోము”, గుడ్డితనం పోవడానికి “కాటుక గౌరి నోము”, అన్నదమ్ముల ఆయుష్షుకోసం “బచ్చలి గౌరీ నోము”, ధైర్యంకోసం “ధైర్య గౌరీ నోము”, గండాలు పోగొట్టుకోవడం కోసం “గండాల గౌరీ నోము” ఆలుమగలు అనురాగంగా ఉండడం కోసం ” అంగరాగాల నోము”, సవతి తల్లి ప్రేమకోసం “కన్నె తులసమ్మ నోము”, సంసార శుభం కోసం “ఐదు పువ్వుల తాంబూలం నోము”, ఇంకా మిగిలిన నోములన్నీ ముత్తైదువ తనకోసం, సంతానం కోసం, అదీ మగ సంతానం కోసం, సిరిసంపదలకోసం ఆచరించేవి. వైధవ్యం, సంతానం లేకపోవడం వంటివి స్త్రీల ఆత్మ విశ్వాసాన్ని దెబ్బ తీస్తాయి. అన్నీ కలిగిన స్త్రీల పట్లనే వివక్ష చూపుతున్న సమాజం, తమ పట్ల ఇంకెంత క్రూరంగా ఉంటుందోనన్న (అభద్రతా) భావం నుండే వ్రతవిధానాలు పుట్టుకొచ్చాయి. వ్రత కథలను పరిశీలించినప్పుడు మరొక రూపంలో ఉన్న స్త్రీల సమస్యలుగానే ఇవి గోచరిస్తాయి. వీటికి పరిష్కార మార్గాలు సమాజంలోనే వెతుక్కోవాలి. వీటి ఆచరణలో పితృస్వామ్యం విధించిన ఆంక్షలు, ఆంక్షాతిక్రమణల ఫలితాలు ప్రాచీన మానవ మనస్తత్వాన్ని, మత స్వరూపాన్ని, స్త్రీల అసహాయతలను తెలియజేస్తాయి.
ఈ విధంగా వివిధ జానపద సాహిత్య ప్రక్రియలు రాజకీయ సామాజికార్థిక సంబంధాలను, కుటుంబ సంబంధాలను, స్త్రీల భావానుభూతులను, వ్యక్తిత్వాన్ని ఎంతో శక్తివంతంగా తెలుపుతున్నాయి.
ఉపయుక్త గ్రంధాలు
- మున్నీరు, వివిధ మంగళ హారతులు – నేదునూరి గంగాధరం-ప్రాచీన గ్రంధావళి, రాజమహేంద్రవరం 1973
- మన పల్లెటూళ్ళ పాటలు – అమ్మాపురం, జానపద గిరిజన విజ్ఞాన పీఠం, వరంగల్ 2004
- తెలుగు సాహిత్యంలో పౌరాణిక గేయ గాథలు – సుబ్బలక్ష్మీ – అముద్రిత సిద్ధాంత గ్రంథం
- ఒగ్గు కథ – సాహిత్యానుశీలన – కె. సతీష్ కుమార్, అముద్రిత సిద్ధాంత వ్యాసం
- తెలంగాణ స్త్రీల పాటలు – సి. హెచ్. సత్యంరాజు
- వ్యాస లతిక – రావి ప్రేమలత, 2002
- స్త్రీల పాటలు – పరిశీలన – శిష్టాలక్షి నరసమ్మ – అముద్రిత సిద్ధాంత గ్రంథం
- ఆయా ప్రాంతాలలో ఈ రచయిత జానపదుల నుండి సేకరించినవి.