మా ఆవిడ ఫ్రెండు వింధ్య వాళ్ళింటికి మొదటి సారిగా డిన్నర్‌కి బయల్దేరాం. మందు ముట్టని వాళ్ళింటికి, అదీ శనివారం డిన్నర్‌కి వెళ్ళాలంటే మహా చిరాకు నాకు! డిన్నర్‌ని లంచికి మార్చాలని ఎంత పోరినా మా ఆవిడ ఒప్పుకోలేదు.
“ఒక్క పూట మందు లేకపోతే ప్రాణం పోదులే…రమేష్ గారు చూడండి…అస్సలు మందు ముట్టుకోరట. ఏ దురలవాటూ లేదట. వింధ్యకు అన్ని పనుల్లో చాలా హెల్ప్ చేస్తాడట. చూసి నేర్చుకోండి” అంటూ బయల్దేరదీసింది.
“ఎవరన్నా నీ మాటలు వింటే, నేనేదో పేద్ద తాగుబోతు ననుకుంటారు. వీకెండు పూట, సర్దాగా రెండు పెగ్గులేస్తే, బాడీ కండీషన్‌లో ఉంటుంది. మనసుకూ కూసింత విశ్రాంతి దొరుకుతుంది…అయినా నేనేమీ మందు కోసం ఏడవడం లేదు…ఉద్యోగం గురించి ఆలోచిస్తున్నా” చెప్పాను.
“అయినా పని చెప్పకుండా జీతం ఇస్తుంటే హేపీగా ఎంజాయ్ చెయ్యక మీరేమిటిలా…”అంది.
రెణ్ణెల్ల క్రితం నేను పని చేస్తున్న కంపెనీలో కొన్ని మార్పులు జరిగాయి. దరిమిలా నన్ను ఒక అప్రధాన శాఖలో పెద్దగా పనిలేని సీటుకు మార్చారు. మేనేజరూ మారాడు.
ఆ మార్పు రెండు మూడు వారాలు బాగానే ఉందనిపించింది. తీరిగ్గా తొమ్మిది తర్వాత వెళ్ళి, సాయంత్రం అయిదు కాగానే వచ్చేయడం…ఆఫీసులో ఉన్నప్పుడు కూడా…జాలీగా ఇంటర్నెట్ బ్రౌజ్ చేసుకుంటూ గడిపేయడం!
ఎప్పుడైనా నేను చేయగల చిన్నా చితకా పనొచ్చినా, మా మేనేజరే చేసేస్తున్నాడు. మొన్నటి దాకా నాలాగే పని చేసి, పదోన్నతి పొందాడు. పాత వాసనలు ఇంకా పోలేదు.
బొత్తిగా పనిలేకుండా పొద్దస్తమానం ఇంటర్నెట్ చూడాలన్నా విసుగే కదా! పైపెచ్చు భయం కూడా మొదలైంది. ఏమీ పనిలేకుండా ఈ కంపెనీ నన్ను ఎంత కాలం పోషిస్తుంది?!
పనెక్కువున్నప్పుడు మేనేజరుకు చెబితే వుపయోగం కానీ, పని లేదని చెబితే ఇంకేమైనా ఉందా?
“ఉద్యోగం గురించి తర్వాత ఆలోచించుకోవచ్చు…ఇక దిగండి. వాళ్ళతో ఇలా మొహాన గంటు పెట్టుకొని మాట్లాడకండి” అంది, కారు పార్కు చేస్తూ.
తలుపేసి వున్నా మసాలా వాసనలు వాకిట్లోకి గుప్పున కొడుతున్నాయి.
గుమ్మం పక్కగా చెప్పులు విప్పేసి, డోర్ బెల్ నొక్కాం.
రమేష్ తలుపు తీసాడు.
లాల్చీ పైజమా, బట్ట తలను కవర్‌చేస్తూ ముందుకు దువ్విన జుట్టు, మొహాన పలకరింపు నవ్వు.
“బాగున్నారా!” అంటూ చెయ్యి చాపాడు.
కరచాలనం, పలకరింపులు అయ్యాక, రమేష్ నేనూ సోఫాల్లో కూర్చున్నాం.
మా ఆవిడ తను చేసుకొచ్చిన స్వీట్‌ను వాళ్ళ డైనింగ్ టేబుల్ మీద పెట్టొచ్చి నా ప్రక్కన కూర్చుంది.
“వింధ్య ఇప్పుడే వొస్తుంది…మీరేమైనా జ్యూస్ గానీ, సోడా గానీ తీసుకుంటారా?” అడిగాడు రమేష్.
“తనొచ్చాక తీసుకుంటాం లెండి” చెప్పింది శైలు.
“ఇల్లు కనుక్కోవడానికి ఇబ్బంది పడలేదుగా?! అడిగాడు.
“లేదు…ఇక్కడకు దగ్గరలో మా ఫ్రెండొకరున్నారు…నేనప్పుడప్పుడూ ఇటు వేపుకొస్తుంటా” అంది శైలు.
మొదటి సారి వీళ్ళింటికొచ్చాం.
హాలు నీటుగా సర్ది ఉంది. హాలు మధ్యలో ఒక కాఫీ తేబుల్, ఒక గోడకు చిన్న ఫైర్ ప్లేస్, దాని పైన వ్రేళ్ళాడుతూ కళాంజలి వాళ్ళ చతురస్రపు అద్దాల తువ్వాలు…ఆ పక్కనే ఎంటర్టైన్మెంట్ సెంటర్, దాన్లో ఫ్లాట్ పేనల్ టీవీ, డీవీడీ ప్లేయరూ…మిగతా సరంజామా, ఒక గోడ మీద రమేష్ వాళ్ళ పెళ్ళి ఫోటో, మరో గోడ మీద చిన్న పెయింటింగు.
రమేష్ వాళ్ళ పెళ్ళి ఫోటో తీసేసి, మా పెళ్ళి ఫోటో పెడితే మా ఇంట్లో లివింగ్ రూము లానే ఉంటుంది.
నేను దిక్కులు చూడ్డం పూర్తి కాకుండానే వింధ్య వచ్చింది.
సన్నగా, నాజూగ్గా …నీలం చీరలో…అందగత్తే!
మళ్ళీ పలకరింపులు!
“ఏమైనా తాగడానికివ్వనా?”అడిగింది, ఇంగ్లీషులో.
సోఫాలోంచి కాస్త ముందుకు వొంగి, నేను మాట్లాడబోతోంటే, “జ్యూసేదైనా ఇవ్వండి”అంది శైలు…నేనక్కడ ఏమడుగుతానో, వాళ్ళ ముందు తన పరువేమౌతుందోనని!
“మీకిబ్బంది లేకపోతే నాకో కప్పు టీ ఇవ్వండి…”అడిగాన్నేను.
“ఇబ్బందేముంది…పేకెట్ టీ ఓకేనా ?” అంటూ లేవ బోయాడు రమేష్.
“పేకెట్ టీ నా…పోనీ నాక్కూడా జ్యూసే ఇవ్వండి”అన్నాను. పేకెట్ టీ నాకంతగా నచ్చదు.
“నేను టీ పెడతాను…నాక్కూడా టీ తాగాలని పిస్తోంది”అంటూ లేచింది వింధ్య.
శైలు నా వైపు కొర కొరా చూస్తూ, వింధ్యతో బాటు కిచెన్‌లోకి వెళ్ళింది.
“మీరెక్కడ పని చేస్తున్నారు?”అడిగాడు రమేష్.
అతడికి నేనెక్కడ పని చేస్తున్నానో తెలిసేవుంటుంది. అయినా చెప్పాన్నేను.
“మీరెక్కడ”అడిగాను. చెప్పాడు.
“జాబెలా ఉంటుంది” అడిగాను.
“ఇప్పుడు కాస్త ఓకే! సపోర్ట్‌లో కదా. అర్థ రాత్రి అప రాత్రి అనిలేదు…ఎప్పుడైనా కాల్ రావొచ్చు”అన్నాడు, సోఫాలోంచి తలతిప్పి కిచెన్ వైపు చూస్తూ.
నా జాబ్ గురించి చెబుతుతోంటే, శైలు రెండు జ్యూస్ గ్లాసులు పుచ్చుకుని వచ్చింది. రమేష్‌కి వొకటిచ్చి, తనొకటి తీసుకుని నాప్రక్కన కూర్చుంది. విస్కీ రంగులో ఉంది…ఆపిల్ జ్యూసనుకుంటా.
జ్యూస్ గ్లాస్‌ను కాఫీ టేబుల్ మీద పెట్టి, “ఒక్క నిమిషం…ఇప్పుడే వస్తాను”అని రమేష్ వంటింట్లోకి వెళ్ళాడు.
“మీరూ జ్యూసో…సోడానో తీసుకోవచ్చుగా…ఈ వేళప్పుడు టీ ఏమిటి?” శైలు, గుసగుసగా.
“నిన్ను చేసిమ్మనలేదుగా…” కాస్త లోగొంతుతో.
వంటింట్లోంచి కూడా కాసిన్ని గుసగుసలు, కప్పులు, ప్లేట్లు తీస్తున్న చప్పుళ్ళు వినిపిస్తున్నై.
“వాళ్ళనెందుకు ఇబ్బంది పెట్టడం”
“ఇబ్బందేమీ లేదన్నారుగా?”
చిన్న ట్రేలో మసాలా వడలు, దాన్లోకి చట్నీ తీసుకొచ్చింది వింధ్య.
“ఆయన టీ పెడుతున్నారు. ఇప్పుడే వస్తారు”చెప్పింది.
“అయ్యో పాపం తనకెందుకా శ్రమ…పోనీ నాకూ జ్యూసే ఇవ్వండి”అన్నాను, కాస్త గిల్టీగా.
“అందులో శ్రమేముంది. ఆయన టీ పెట్టడంలో ఎక్స్‌పర్ట్”అంది వింధ్య.
మాటల్లోనే రమేష్ రెండు కప్పుల్లో టీ తీసుకొచ్చాడు.
“మసాలా వడ చాలా బాగుంది” చెప్పాను వింధ్యతో.
“థాంక్యూ…అవి రమేష్ చేశారు”అంది, రమేష్ వైపు చూస్తూ.
“చట్నీ కూడా…” నా మాట పూర్తవకుండానే, “అదీ పూర్తిగా తనే చేసారు” చెప్పింది, నవ్వుతూ.
“వావ్ …దీసార్ యమ్మీ” అంది శైలు, రమేష్‌ని మెచ్చుకోలుగా చూస్తూ!
“థాంక్స్” చెప్పాడు రమేష్ ముసిముసి నవ్వులతో.
“వింధ్యా…యూఆర్ సో లక్కీ” మరో మసాలా వడ అందుకుంది శైలు.
రమేష్ లాంటి వాళ్ళను చూస్తే నాకు పరమ చీదర. చేతి దురదుంటే వండి గుట్టుగా పెళ్ళానికి పెట్టుకోవాలి గానీ ఇలా అందరికీ చాటింపు వేస్తే ఎలా…వీళ్ళింటి గుమ్మం దాటిందగ్గరనుంచీ, మా ఆవిడ నసనెలా భరించడం?!
అప్పటికీ కారులో శైలు హింటు ఇవ్వనే ఇచ్చింది. రమేష్, వాళ్ళావిడకు అన్ని పనుల్లో సాయం చేస్తాడని…చూసి నేర్చుకోమనీను!
నేనైతే మా ఇంట్లో వంట గది వైపు వెళ్ళడం చాలా అరుదు. రెండేళ్ళ క్రితం, ఒక్కసారైనా మీరు వంట చేస్తే తిన్నాలని ఉందని మా ఆవిడ పోరుపెట్టగా పెట్టగా…ఒకసారి వంట గదిలోకి వెళ్ళాను. అంతే! మళ్ళీ వంటలో వేలు పెడితే, విడాకులిచ్చేస్తానని శైలు నాకు అల్టిమేటం ఇచ్చింది. ‘హమ్మయ్య’అని ఊపిరి పీల్చుకున్నా!!
వింధ్య తెచ్చిన ఫోటో ఆల్బం చూస్తోంది శైలు.
“జస్టేమినిట్…ఇప్పుడే వస్తాను”అంటూ మళ్ళీ కిచెన్‌లోకి దూరాడు రమేష్.
బహుశా రైసు కుక్కరు ఆన్ చేయడానికి అనుకుంటా!
శైలు, వింధ్య…ఫోటోల లోకంలో ఉన్నారు.
కాసేపు కళ్ళు తేలేసి ఇంటి కప్పుకేసి చూసాను. వాసాల్లెక్కడదామంటే కనిపించడం లేదు.
నా బాధను వింధ్య గమనించినట్లుంది.
“మీకు బోర్ కొడుతున్నట్లుంది…రమేష్ ఇప్పుడే వస్తారు” అంది.
నా వైపు చూస్తూ “చూడండి రమేష్‌గారు ఫోటోలను ఎంత చక్కగా, కామెంట్స్ రాసి మరీ ఆల్బంలో పెట్టారో”అని, వింధ్య వైపు తిరిగి “మా వారికి ఫోటోలు తీయడమంటేనే బద్దకం” అంది శైలు నవ్వుతూ!
నేను నవ్వి వూరుకున్నాను. ఇలాంటివి మా ఆవిడ పదే పదే అన్నా పట్టించుకోని స్థితికి వచ్చేశాను.
చేతులు తుడుచుకుంటూ రమేష్ వచ్చాడు.
“ఈ మధ్య మూవీస్ ఏమైనా చూసారా?”అడిగా, ఏదో ఒకటి మాట్లాడాలని.
“అబ్బే…కొత్తవేమీ చూడలేదండి”అంటూ సోఫాలో సర్దుకుని కూర్చున్నాడు.
“పుస్తకాలేమైనా చదువుతారా”అడిగాను.
“అప్పుడప్పుడూ”
తర్వాత మా మాటలు, హైదరాబాదులో రియలెస్టేటు వైపు, ఆ తర్వాత ఇక్కడే సెటిలవ్వడమా … ఇండియా వెళ్ళిపోవడమా అన్న దగ్గరకొచ్చాం.
ఫోటోలు చూడ్డం అయిపోయినట్లుంది. శైలు వింధ్యలు కూడా మా మాటలు వింటూ కూర్చున్నారు.
“నాకైతే ఈ దేశం అస్సలు నచ్చలేదు. ఎప్పటికైనా ఇండియా వెళ్ళిపోదామనే. మరి మీరు?”అడిగాడు.
“నాకూ పెద్దగా నచ్చలేదు. కానీ నచ్చని వాటినన్నింటినీ వదిలెయ్యలేము కదా!”చెప్పాను నవ్వుతూ.
“అదీ నిజమే”అన్నాడు రమేష్ కూడా నవ్వుతూ!
“ఇక డిన్నర్ చేద్దామా” అంది వింధ్య.
వింధ్య, శైలు వంటకాలను మైక్రోవేవ్‌లో వేడి చేసి, టేబుల్ మీద సర్దారు.
వంటలు బాగున్నాయి.
నేనూ శైలు మొహమాటం లేకుండా, “బిర్యానీ వండర్‌ఫుల్…ఆహా ఏముందండీ రొయ్య వేపుడు…” అనుకుంటూ, లొట్టలేసుకు తింటూంటే…వింద్య మాత్రం మొహమాటానికి తింటున్నట్లు తినింది.
బహుశా డైటింగేమో! ఏదో నేనూ, మా ఆవిడా డైటింగంటే అర్థముంది కానీ, అంత స్లింగా వుండీ వింధ్య ఎందుకు డైటింగ్ చేస్తున్నట్లో!
అదే అడిగాను నేను.
“స్లింగా ఉండడానికే”అంది మా ఆవిడ. వింధ్య మాత్రం నవ్వి ఊరుకుంది.
రమేష్‌కి చెప్పాను వంటలదిరాయని.
“అదేవిటి, కష్టపడి వండింది వింధ్య అయితే…”అని శైలజ అంటూంటే,”వంటంతా రమేషే చేసారు” అంది వింధ్య.
“నిజంగా…ప్చ్ మా వారికి కాఫీ పెట్టుకోవడం కూడా సరిగ్గారాదు”అంది శైలు, నిట్టూరుస్తూ.
నాకెక్కడ కాలాలో అక్కడ కాలింది. నన్నొక అప్రయోజకుడి కింద, ఏమీ చాతకాని దద్దమ్మగా శైలు చూపడానికి ప్రయత్నిస్తుంటే!
ఎవడి టాలెంటు వాడికుంటుంది!
కాఫీ బాగాచేసే వాళ్ళు, నాలాగా కాక్‌టైల్స్ కలపగలరా?!
“ఎంతైనా మీరు చాలా లక్కీ వింధ్య”అంది శైలు.
“లక్కీనా…అంటే?” అడిగింది వింధ్య.
ముగ్గురం ఒక్క సారే తలలెత్తి వింధ్య వైపు చూసాం.
సన్నగా నవ్వుతోంది వింధ్య.
“అంటే…రమేష్‌లాగా ఇంత బాగా వంటలు చేసే హస్బెండ్ దొరకడం అదృష్టం కాదా?”
“వంటే కాదండోయ్ ఇంటి పనులూ తనే చేస్తారు…షాపింగూ తనే…నన్నిక్కడి పుల్ల తీసి అక్కడ పెట్టనివ్వరు”
“అయితే మీరు డబల్ లక్కీ”
రమేష్ ముసి ముసిగా నవ్వుకుంటున్నాడు.
“వంట చేయడం మీ హాబీనా”అడిగాను రమేష్‌ని.
అవునన్నట్లు తలూపి “చదువుకునే రోజులనుంచి అలవాటు” అన్నాడు.
“మీ ఇంట్లో…అంటే పెళ్ళి కాక ముందు…వంట చేసే వారా?”
“మా అమ్మ నన్ను అసలు వంట ఇంట్లోకి రానిచ్చేది కాదు”చెప్పాడు.
ఇప్పుడు ఛాన్సొచ్చింది కాబట్టి వంట గదిని వదలడంలేదన్న మాట!
“మీరింత బాగా వంట చేస్తున్నారు కదా … పార్టీలకి ఏవైనా కేటరింగులు చెయ్యొచ్చుగా…కావాలంటే నేను మార్కెటింగ్ చేస్తా…”అన్నా నవ్వుతూ.
“ఎదో ఇంట్లోకైతే చెయ్యగలం గానీ కేటరింగులదాకా రాదులెండి”అన్నాడు, మంచి నీళ్ళు తాగుతూ – నా మాటల్లో వెటకారమేమైనా తగిలిందేమో!
వింధ్యతో పాటు అందరం శైలు తెచ్చిన స్వీట్ తిన్నాక, మేము కారెక్కి ఇంటి దారి పట్టాం.
“ఇందాక వింధ్య చెప్పింది విన్నారుగా…ఇంట్లో తనను ఒక్క పనీ ముట్టుకోనివ్వరట. రోజూ ఇంటి పనీ, వంట పనీ అతడే చేస్తాడట” అంటూ మొదలెట్టింది శైలు.
“వింధ్యకేమైనా హెల్త్ ప్రోబ్లెంసా”అడిగాను.
“అబ్బే అవేమీ లేవు”
“మరి రమేష్ కేమైనా”అంటూ కణతల మీద వేళ్ళను ‘నట్లు’ బిగిస్తున్నట్లు తిప్పాను.
“అందరూ మీలాగా అనుకుంటున్నారా…రమేష్‌కు వింధ్యంటే ప్రేమ…అందుకే అపురూపంగా చూసుకుంటున్నాడు”
“వింధ్య లాంటి అందమైన పెళ్ళాముంటే, నేనూ అలాగే నాజూగ్గా షోకేసులో బొమ్మ లాగా చూసుకునే వాణ్ణి”అంటూ, కారు సీటులోనే శైలుకు కాస్త దూరంగా జరిగాను.
అయినా నెత్తి మీద ఒకటి పడింది.
“పెళ్ళైన కొత్తలో నేనూ అంతకంటే అందంగా నాజూగ్గా ఉండేదాన్ని. ఇప్పుడు మీరెలా ఉన్నారో ఒక్కసారి అద్దంలో చూసుకుని అప్పుడు మాట్లాడండి”అంది.
“మన పెళ్ళై, ఇక్కడకొచ్చిన కొత్తల్లో…బట్టలుతకడానికి, గిన్నెలు కడగడానికి మెషిన్లు, ఇరవైనాలుగ్గంటలూ కరెంటు…ఏమీ తోచడం లేదు బాబోయ్ అని వాపోయే దానివి గుర్తుందా”అడిగాను.
శైలు ఏమీ మాట్లాడలేదు.
“అయినా నువ్వు వాళ్ళింట్లో పదే పదే అన్నట్లు, వింధ్య అంత లక్కీ కాదేమో!” అన్నాను ఇంటి ముందు కారు పార్క్ చేస్తూ.
“అలా అని ఆవిడ మీకు చెప్పిందా? ఏదో పెద్ద సైకాలజిస్టులా పోజు కొడతారు” అంది శైలు.
అక్కడితో ఆ టాపిక్ వదిలేసినా, మా ఆవిడ మాత్రం వింధ్య అదృష్టం గురించి రోజు కొక సారైనా తలుచుకునేది.
నాలుగైదు వారాల తర్వాత, శైలు డెంటిస్ట్ అపాయింట్‌మెంట్ కి వెళ్ళాల్సొచ్చింది.
ఉన్నది ఒకే కారు. నాక్కూడా అదే రోజు మరో కంపెనీలో ఇంటర్వ్యూ ఉంది.
అపాయింట్మెంటు వాయిదా వేయించుకుంటావా అనడిగితే – అంత అవసరంలేదు, వింధ్య వాళ్ళింటికి దగ్గరే క్లీనిక్, నన్ను వాళ్ళింటి దగ్గర దిగబెట్టి మీరాఫీసుకు వెళ్ళి, సాయంత్రం వచ్చేప్పుడు దారిలో నన్ను పికప్ చేసుకు రావచ్చని చెప్పింది.
రెండు మూడు గంటలు వాళ్ళింటికి డిన్నర్‌కి వెళితేనే – నాలుగైదు రోజులు బుర్ర తినేసింది. ఇప్పుడు ఏకంగా ఎనిమిదీ తొమ్మిది గంటల పాటు – వాళ్ళింటి దగ్గర వొదిలేస్తే – అదీ నేను లేకుండా!!
మార్గాంతరం లేక, శైలును వింధ్య వాళ్ళింటి దగ్గర దింపి నేను అఫీసుకు వెళ్ళా.
సాయంత్రం, శైలును పికప్ చేసుకుని వస్తూ, నాకింకొక కంపెనీలో ఆఫర్ వచ్చిన సంగతి చెప్పి, రాత్రికి కోడి వేపుడు చేస్తే కులాసాగా మందు కొడతానన్నాను.
మొక్కుబడిగా కంగ్రాట్సని చెప్పింది. మందు మాట వింటూనే గయ్యిమని లేచే శైలు అలా డల్‌గా ఉండడం చూసి “ఏమైంది…నీ పళ్ళన్నీ పీకేయాలన్నాడా డాక్టర్” అనడిగా.
లేదంది.
“మరెందుకలా…అంత దీనంగా ఉన్నావ్? వింధ్య నువ్వూ దెబ్బలాడుకున్నారా?”అడిగా.
“అదేమీలేదు…వింధ్య గురించి ఆలోచిస్తోంటే బాధేస్తోంది”
కారు కాస్త స్లో చేసి “ఏమైంది…ప్రొద్దుట మనం వెళ్ళినప్పుడు బాగానే ఉందిగా”అడిగాను, ఆశ్చర్యంగా!
“చూడ్డానికి బాగానే ఉందిలే…మధ్యాహ్నం తనే వంట చేసింది”
“ఒక్క పూట వంట చేస్తే తనేమీ కరిగి పోదు…అయినా రోజు రమేషేగా చేతులు కాల్చుకునేది” అన్నా!
“అది కాదు. రమేష్ ఆఫీసుకెడుతూ చేసి పెట్టిన కూరలు అన్నమూ ఉంది. వాటిని ట్రాష్‌లో పడేసి తను ఫ్రెష్‌గా వొండింది. చాలా బాగా చేసింది.”
శైలు మాటల్లోని గాంభీర్యాన్ని గమనించాక, ఇదేదో సీరియస్ వ్యవహారమేననిపించింది.
“రమేష్‌కు వింధ్య చేసిన వంట నచ్చదట…ఒక్క వంటే కాదు…తనేమి చేసినా నచ్చదట…అన్నింటికీ వంకలు పెట్టి, తను మళ్ళీ చేస్తాట్ట. చివరకు, ఇంట్లోంచీ బయటకెళ్ళేప్పుడు తలుపు తాళం కూడా తనే వేస్తాట్ట..వింధ్య కూర్చునే వైపు కారు తలుపు కూడా, తనే తెరిచి తనే వేస్తాడట. అలాగని కోప్పడ్డం, తిట్టడం, కొట్టడం లాంటివి చేయడట…కానీ అన్ని పనులూ తనే చేస్తాడట”అంది.
మళ్ళీ శైలునే “ఎన్నాళ్ళిలా అని వాపోయింది వింధ్య”అంది.
ఒక పనిని అందరూ ఒకేలాగా చేయరు. ఒకరు చేసిన పని మరొకరికి నచ్చక పోవడంలో పెద్దగా ఆశ్చర్యపడాల్సింది లేదు. అలాగని ఎదుటి వాళ్ళను ఏమీ చేతకాని వాళ్ళలా నిరూపించే ప్రయత్నమే బాధాకరం!
అదృష్టానికి దురదృష్టానికి అంతరం ఎలా ఉంటుందో శైలుకు చెప్పాలన్న కోరికను బలవంతానా ఆపుకొని “నీతో వాపోతే ప్రయోజనమేమిటి? ఎవడి బాధలు ఎవడు పట్టించుకుంటాడు. రమేష్‌తో మాట్లాడితే ఏమైనా ఉపయోగముంటుందిగాని”అన్నాను.
“ఇంతకు ముందు చాలా సార్లు మాట్లాడిందట. ఫైనల్‌గా ఇంకో సారి మాట్లాడతానంది. వింధ్య వాలకం చూస్తుంటే, దేనికైనా సిద్ధమనిపించింది”చెప్పింది.
రెండు నిమిషాల మౌనం తర్వాత, నేనే మాట్లాడాను.
వింధ్య కూడా చదువుకున్నదేగా…తన బతుకు తను బతకడానికి అంతగా సమస్యలుండక పోవచ్చు. పెద్దగా పరిచయం లేక పోయినా, ఆ అమ్మాయి పరిస్థితి తల్చుకుంటుంటే నాక్కూడా బాధేస్తోంది” అంటూ, కార్ పార్క్ చేసాను.*