ఇస్మాయిల్ గారి “పల్లెలో మా పాత ఇల్లు” 70 పేజీల కవితా సంకలనం. ఇందులో ఇంతకు పూర్వం అచ్చుకాని ఇస్మాయిల్ గారి స్వీయకవితలు, ఆయన తెలుగు లోకి చేసిన అనువాదాలూ ఉన్నాయి.
ఈ సంకలనం లో ఇస్మాయిల్ గారి స్వీయ కవితలు మొత్తం ఎనభై పైచిలికున్నాయి. ఏడు పద్యాలు, మూడు తంకాలు, పేజీకి ఆరు చొప్పున అచ్చేసిన డెబ్భైరెండు హైకూలూ ఉన్నాయి. మిగిలినవన్నీ అనువాదాలు. ఏడుగురు జపాను తంకా కవయిత్రుల కవితలు, మరో ఏడుగురు జపాను హైకూ కవయిత్రుల కవితలూ. రష్యా, చిలీ, ఆర్జంటీనా,జర్మనీ, యుగోస్లావియా, ఇటలీ, పోలండ్ నుంచి మరో ఏడు కవితలు. శ్రీనివాస్ రాయప్రోల్ గారి ఇంగ్లీషు కవితల అనువాదాలు మరో ఏడు, తోడుగా ఐదుగురు ఆరబ్ కవులు, ఇంగ్లీషులో రాస్తూన్న గుజరాతీ కవయిత్రి సుజాతా భట్ కవిత ఒకటి, అమెరికన్ కవి విత్తర్ బిన్నెర్ కవిత ఒకటి, ప్రసిద్ధికెక్కిన బెంగాలీ కవి జీబనానంద దాస్ గారి ప్రఖ్యాత బంగాలీ కవిత “బనలతా సేన్” !
ఇస్మాయిల్ గారి కవిత్వంతో ఏ మాత్రం పరిచయం ఉన్నా వారికైనా, ఈ సంకలనం లోమొదటి పద్యం ” పల్లెలో మా పాత ఇల్లు” మనస్సుని వెంటనే ఆకట్టేసుకుంటుంది. ఈ పద్యంలో ఆయన ముద్ర మూర్తీభవించి కనిపిస్తుంది. కవితలోఆర్ద్రత కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. చూడండి:
మన్ను మాత్రం మారలేదు.
గోడలు కూలిపోయాక
చెట్లు మొలిచాయి.
చెట్టుని వాటేసుకుని
పట్టు వదలని తీగ:
మా తాతగారి ఆత్మ!
మిగిలిన ఆయన స్వీయ కవితలు ఆరూ ఆయన మాటలని పూర్తిగా సాన పట్టలేదేమోననిపిస్తుంది – గాలి – అన్న పద్యం మినహా!
పోతే ఆయనరాసినవే, మూడు తంకాలు. జపనీసు ఛందస్సులో తంకా హైకూ కన్నా పాత ప్రక్రియ.
సంప్రదాయికంగా 5 లైనులు ( మొదటి మూడు లైనులూ హైకూ లాగానే!) 31 సిలబుల్స్ తంకాలో ఉంటాయి. అయితే, సంప్రదాయం జపాను కవులే పాటించటం మానేసి చాలా కాలం అయ్యింది.
ఇస్మాయిల్ గారు రాసిన ఒక చురకలాంటి తంకా వినండి:
ఎర్రటి నినాదాల్ని
విప్లవకవిలా విరగ బూసింది.
ఐనా,ఒక్క పిట్టైనా
దీనిపై వాలదు.
ఇస్మాయిల్ గారు ఇంతకన్నా బిగ్గరగా రాజకీయ కవిత్వం చెప్పలేదేమో!
ఆ పైన డెబ్భై రెండు హైకూలు. చదవడానికి కొన్ని చాలా సరదాగా ఉన్నాయి.
మెరుగు పెడుతోంది
వెల్ల గోడ.
పాత స్మృతుల్ని రాల్చి
కొత్తవి తొడిగితే బాగుణ్ణు:
చెట్టు లా.
సందేహిస్తూ ఉదయిస్తాడు:
పిట్టల పాటలు విన్నాక
వెనక్కి పోలేడు సూర్యుడు.
ఆకాశాన్నీ,
పిట్టల పాటల్నీ
వడబోస్తోంది చెట్టు.
చెట్లు పిట్టలూ లేకండా ఇస్మాయిల్ కవితాసంకలనం ఉంటుందా, చెప్పండి!
ఇస్మాయిల్ గారంటే నాకు చాలా గౌరవం. క్రిందటి శతాబ్దంలో గొప్ప ఆథునిక కవులని చెప్పుకోదగ్గ ఐదుగురిలో ఆయన ఒకడు అని నా అభిప్రాయం. అయితే, ఈ సంకలనం గురించి ఒక మాట చెప్పితీరాలి. ఇస్మాయిల్ గారే ఈ సంకలనం అచ్చువేసుకొనివుంటే, దీనిలో చాలా భాగం అచ్చయేది కాదు, అని నా దృఢ నమ్మకం.
మాటలపొదుపు ఆయన స్వంత సొత్తు! ఆ పొదుపు కొన్ని పద్యాల్లో కావలసినంతగా కనపడక పోబట్టే ఈ సూటి మాట చెప్పవలసి వచ్చింది.
ఇక అనువాదాల గురించి.
జపాను యువ కవయిత్రులు, ముఖ్యంగా తంకాలు రాసిన నాకు తెలిసిన ఒక ఇద్దరు ఫెమినిస్టులూ ఈ సంకలనంలో ఉన్నారు. అనువాదాలగురించి ఒకే ఒక మాట. ముందుగా అనువాదం చక్కని పద్యంలా సాఫీగా నడుస్తూపోవాలి – అంటే అది ఈ అనువాదం చేసిన కవి గొంతుకలోనుంచి వచ్చింట్లుండాలి. మూలంలో భావానికి ఇది ఎంత దగ్గిరగా ఉన్నదీ అన్నది తరువాత విచారించవలసిన విషయం. ఆ విధంగా అంచనా వేస్తే, ఇస్మాయిల్ గారి అనువాదాలు కొన్ని చాలా చక్కగా ఉన్నాయని చెప్పక తప్పదు. ముఖ్యంగా, అకిత్సు ఐ (Ei Akitsu), అమరి హయషి (Amari Hayashi) కవితలు. మచ్చుకి :
ఎన్ని కబుర్లు చెప్పుకున్నా
నువ్వు నువ్వే
నేను నేనే.
స్నానమయాక
ఆవిరి విడిచే రొమ్ముల్ని
ఆత్మకుమల్లే
జాగ్రత్తగా
తుడిచాను. –(అకిత్సు)
వందమందితో పడుకుంటే
విశ్వం నీదవుతుంది:
పొలాల మధ్య
పిల్లెవరో నవ్వుతోంది.
నిజాయితీ లేని
నికృష్టపు పనిచేసి,
నిర్మలమైన కళ్ళతో
నాకేసి ఎలా చూడగలవు? –(హయషి)
( మరీ ఘాటుగా వినిపించే “తంకాలు” పుస్తకం తెప్పించుకొని చదువుకోండి!)
పోతే జపాను హైకూ కవయిత్రులలో, నొబుకొ కట్సుర (nobu ko Katsura) మినహా మిగిలినవి చాలా పేలవంగా నడిచాయి.
ఇక మిగిలిన అనువాదాలగురించి నాలుగు మాటలు. బోర్జెస్ (Borges)అనువాదం -వస్తువులు-, నెరూడా (Neruda) అనువాదం – పరిచ్యుతులు- మనసుని ఆకట్టుకుంటాయి.
ఆరబ్ కవుల్లో ప్రొటెస్ట్ కవిగా ప్రసిద్ధికెక్కిన మహమూద్ దర్వీష్ (Mahmoud Darwish) పద్యాలు రెండు: పాస్పోర్ట్, మూడోగీతం. మూడో గీతం చక్కగా పద్యంలా నడిచింది.బాగుంది. వినండి:
మలచిన రోజున
పచ్చని చేలకి స్నేహితిణ్ణి.
తేనెగా నాపద్యాలు
మారిన రోజున
మూతిపై ఈగలు మూగాయి.
దర్వీష్ రాసిన పాస్పోర్ట్ కి పబ్లిసిటీ ఎక్కువొచ్చింది కానీ, దర్వీష్ అంతకన్న చాలా చురుకైన అందమైన పద్యాలు రాసాడు.
బెస్సైసొ, (Bessaiso) అల్ మగూత్ (Al Magoot) రాసిన పద్యాల్లాంటివి ఈ మధ్యకాలంలో ఆఫ్రికన్ కవులనుండి చాలా వచ్చాయి. కవితల్లో కొత్తదనం ఏమీ లేదనిపించింది,ఈ అనువాదాలు చదువుతూ ఉంటే!
ఇంగ్లీషులో రాసిన తెలుగు కవి శ్రీనివాస్ రాయప్రోల్. –
ఆడవాళ్ళు
ముసిలి వాళ్ళయే
పద్ధతొకటుంది —
అనే వచన వాక్యాన్ని నాలుగు ముక్కలుగా విరగ్గొ ట్తబడితే వచ్చిన పద్యం – దీని మకుటం గూడా అదే! పద్యం అని — ఇదీ ఫెమినిస్ట్ పద్యమే! ఇది పద్యంగా ఇస్మాయిల్ గారి కవితల్లోకి రావడం కొంచెం ఆశ్చర్యంగానే ఉంది. అతనిదే, మరకకటి! -మేజామీద నారింజ- బహుశా ఆబ్ స్ట్రాక్ట్ కవిత్వం అయి ఉండాలి.
ఆఖరిగా, ప్రఖ్యాత బంగాలీ కవి జీబననంద దాస్ (Jibanananda Das) గారి “బనలతా సేన్” అన్న కవిత. ఇది చాలా ప్రసిద్ధికెక్కిన కవిత. ఈ కవిత 1942 లో వచ్చింది. ఈ కవితని కంఠతా పట్టి — “హజార్ బొచ్చోర్ ధొరెయ్ ఆమి” … — అంటూ గట్టిగా గొంతెత్తి చదవని బంగ్లా మిత్రుణ్ణి నేను ఇంతవరకూ చూడలేదు. 1937 లోనే వచ్చిన “కవితా! కవితా!” తెలియని తెలుగు వాడు ఉంటాడేమో కానీ, బనలతా సేన్ పద్యం రాని బంగ్లా బాబూ దొరకడు. ఈ పద్యం అన్ని భాషల్లోకీ అనువదించబడింది. అంతే కాదు, ఎంతోమంది ప్రసిద్ధికెక్కిన బంగ్లా కవులు దీన్ని ఇంగ్లీషు లోకి అనువదించారు. తెలుగులో ఇస్మాయిల్ గారి అనువాదం — మూలంలో ఉన్న సంస్కృత పదాల ధ్వనిని అనుసరించడంవల్ల వల్లనో ఏమో తెలియదు – పద్యం బాగానే నడిచిందికానీ, ఇస్మాయిల్ గారి అనువాదముద్రలేని కవితగా వినిపించింది.
ఈ సంకలనం మీద నాదొక పెద్ద ఫిర్యాదు. అనువాదకవులగురించి ఏ విధమైన వివరణా ఇవ్వకపోవడం. కొంతమంది యూరోపియన్ కవులు తెలుగు పాఠకులకి తెలిసిన పేర్లే అయినా, ముఖ్యంగా జపాను కవుల గురించి, ఆ కవితా వైఖరి గురించీ సంకలన కర్తలు నాలుగు మాటలు చెప్పితే బాగుండేది. కనీస పక్షంగా కవుల పేర్లు, వారికవితల టైటిళ్ళు ఇంగ్లీషులో కూడా ఇచ్చి ఉంటే అనువాద కవిత్వంలో ఉత్సాహం ఉన్నవాళ్ళు ఇంటర్నెట్లో ఈదడం తేలిక అయ్యేది.
ఇస్మాయిల్ గారి భక్తులు నామీద విరుచుక పడ్డా, ఈ సంకలనం గురించి నేను చెప్ప దలచుకున్నది (చర్వితచర్వణం అని ఆరోపించినా సరే!) చెప్పి తీరాలి. ఇస్మాయిల్ గారే బ్రతికి ఉంటే ఈ సంకలనం ఇంతకన్నా ఎక్కువశ్రద్ధతో చదువరికి సులువుగా ఉండేట్టు ప్రచురించి ఉండేవారనుకుంటాను!
నిజంగా ఆఖరి మాట. ఈ రకమైన కవిత్వం మీద ఆసక్తి ఉన్నా లేకపోయినా, కనీసం ఇస్మాయిల్ నాస్టాల్జియా కోసమన్నా, ఈ సంకలనం తెప్పించుకొని చదువుతారని నా కోరిక!
పల్లెలో మా పాత ఇల్లు : ఇస్మాయిల్
దేశి బుక్స్- నవంబర్ 2006
ప్రాప్తి స్థానం: తమ్మినేని యదుకులభూషణ్,
14 Ashley Ct., Somerset, NJ 08873
email: thammineni@lycos.com
వెల: పది డాలర్లు