విమర్శా శిల్పి వల్లంపాటి అస్తమయం

vallampATiఆధునిక తెలుగు సాహిత్య విమర్శకుడు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత వల్లంపాటి వెంకటసుబ్బయ్య గారు జనవరి 2, 2007 మంగళవారం నాడు చిత్తూర్ జిల్లా మదనపల్లె లో కన్నుమూశారు. వల్లంపాటి గారు కవిగా, కథకుడిగా, సాహితీ విమర్శకుడిగా సుప్రసిద్ధులు. రొంపిచెర్లలో 1937లో జన్మించిన వల్లంపాటి వెంకటసుబ్బయ్య కథకుడిగా తన సాహితి ప్రయాణాన్ని ప్రారంభించారు. పరిష్కారం, మిథ్య మొదలైన కథానికలు 40 దాకా ప్రచురించారు. ఆయన రాసిన ఇంధ్రధనస్సు, దూర తీరాలు నవలలు ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో బహుమతులు పొందాయి. అనువాదకుడిగా కుడా ఆయన ప్రసిద్ధులు. ఇంగ్లీషు నుంచి, కన్నడం నుంచి తెలుగులోకి ఎన్నో గ్రంధాలు, కథలు అనువదించారు. తస్లీమా నస్రీన్‌ రచించిన “లజ్జ”, బ్రిటిష్‌ రచయిత ఇ.హెచ్‌.కార్‌ (E.H. Carr) రచించిన “చరిత్ర అంటే ఏమిటి…?” ఆయన చేసిన అనువాద రచనలలో కొన్ని. “నవలా శిల్పం”, “కథాశిల్పం” “విమర్శా శిల్పం” వీరి విఖ్యాత రచనలు. “కథాశిల్పం” 1999లో కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి కూడా పొందింది. వారికి స్మృత్యంజలిగా ఆయన ఈమాట కు రాసి ఇచ్చిన రెండు చక్కటి వ్యాసాలను వెల్చేరు గారి నివాళి తోపాటు మా పాఠకులకు తిరిగి అందిస్తున్నాము.