వర్షానంతరం

బూడిద రంగు బద్ధకాన్ని కప్పుకుని
నల్లని మబ్బుల కంబళీ లోంచి
మసక మసకగా ఈ రోజు తెల్లవారింది

అలిగిన ప్రేయసి చిరుకోపంతో
అనాయాసంగా సంధించే
కటు వ్యంగ్యోక్తి బాణాల్లా
చురుక్కున గుచ్చుకునే
సన్న సన్నని వాన చినుకులతో
ఈ ఉదయం ప్రారంభమయ్యింది.

పరాకు చెలికాడి
ఉదాసీన గాంభీర్యం తో
పచ్చని పచ్చికను కవచంలా ధరించి
భూమి ఈ ఏకపక్ష యుద్ధానికి సన్నద్ధమయ్యింది.

సన్నని వానచినుకులతో
సుకుమారంగా మొదలైనా
ఒక్కసారిగా
తన భావావేశపు జడివాన జడలతో
భూమిని ఉక్కిరి బిక్కిరి చేస్తూ కొంతసేపు
ఆకాశం అవిరామం గా వర్షిస్తూనే ఉంది

వర్షానంతరం శాంతించిన ఆకాశం
చిరుగాలుల చల్లని వ్రేళ్ళతో
దాడికి తడిసి చెల్లాచెదురైన
లేత రెమ్మల ముంగురులను
అలవోకగా స్పర్శిస్తుంది

అప్పటివరకూ
సంధించినవి వారుణాస్త్రాలూ,వాయవ్యాస్త్రాలే అయినా
స్పర్శానంతరం
పరవశపు పారిజాతాలు
చిరునవ్వుల సన్న జాజులు
సౌఖ్యపు సంపెంగ మొగ్గలు
పుష్పించిన పరిమళపు తుఫానులై
రెమ్మలచివర్లలో
నవ్వుతూ పలుకరిస్తాయి.

రచయిత వైదేహి శశిధర్ గురించి: జన్మస్థలం గుంటూరు జిల్లా నరసరావుపేట. నివాసం న్యూ జెర్సీలో. వైద్యరంగంలో పనిచేస్తున్నారు. చాలా కవితలు ప్రచురించారు. ...