పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16475

  1. తెలుగులో మొదటి నీతి పుస్తకం: సుమతి శతకం గురించి తః తః అభిప్రాయం:

    03/20/2013 7:45 am

    సుందరం గారూ, తప్పు ఎత్తిచూపినందుకు కృతజ్ఞతలు. వ్యాసంలో “సుమతీ” ని “సుమతి”గా మార్చాము.

    ‘సుమతీ’ ని ‘సుమతి’ గా మార్చమని వ్యాస రచయిత కోరారో లేదొ మీరు చెప్పలేదు.

    “తప్పు ఎత్తిచూపినందుకు”

    “తెలుగుకు సంస్కృతం శత్రువు. ఇంగ్లీష్ కాదు,” అని సంస్కృతంతొ తలంటి పొసుకునే కుటుంబం నుంచి వచ్చి ఫిజిక్స్ లొ డాక్టరేట్ తీసుకున్న ఒక స్నేహితుడితొ నాకు నిత్య చర్చ. వావిళ్ళ ప్రతిలో ‘సుమతి శతకం’ అని ఉండటానికి వావిళ్ళ వారి సంస్కృత భాషా పాండిత్యం కారణం కావచ్చు. బద్దెనో , భీమన్నో అలా ముద్రించమని అడిగి ఉంటారని నేననుకోను. ‘దాశరథీ శతకం’ అనే తెలుగు ప్రజలు పిలుస్తారు. ‘భాస్కరా’ అని ఉన్నా మకుటంలో ‘భాస్కర శతకం’ అనే వాళ్ళు ఆ శతకాన్ని పిలుచుకుంటారు సంస్కృత పండితుడైనా తెలుగు తండ్రి – పేరులో ‘రామశబ్దం’ పెట్టుకున్నా- వాళ్ళ అబ్బాయిని ‘రామ'[సుప్రజా రామ] అని పిలవడు ‘రామా’ అనే పిలుస్తాడు (నిజంగా తెలుగు వాడైతే ). దయచేసి తర తరాలుగా వస్తున్న ప్రజలభాష మీద సంస్కృత వ్యాకరణ భాష రుద్దకండి.

    తః తః

    [మార్చమని వ్యాస రచయిత కోరలేదు. సుందరం, మోహన రావు గార్ల అభిప్రాయాలను పరిశీలించిన పిమ్మట ఇది మేము తీసుకున్న నిర్ణయమే – సం.]

  2. తెలుగులో మొదటి నీతి పుస్తకం: సుమతి శతకం గురించి jayaprabha అభిప్రాయం:

    03/20/2013 12:59 am

    కొన్ని విషయాలని “కుండబద్దలు కొట్టినట్టే” చెప్పాల్సి ఉంటుంది కే.యెస్. రామారావు గారూ!! నాకు “హీరో వర్షిప్” మీద నమ్మకం లేదు. అది తెలుగు సినిమాబాపతు!! నేను వ్యక్తికి నిబధ్ధురాలిని కాను. సాహిత్యానికి నిబధ్ధురాలిని. అంచేత ఎవరు ఏమి రాసినా సరే సరే అని అనుకునే అవసరం నాకు తటస్థపడలేదు. అందుకు నా సాహిత్య ప్రయాణం మొత్తం ఉదాహరణే!! తెలుగు సాహిత్యంలో చెప్పుకోదగిన ఏ కృషీ చెయ్యని అనేకానేక మంది ఇక్కడ తగువుకి దిగి తీర్పులు సైతం చెప్పేటంత పదును చూపించేస్తూంటే జీవితంలో సింహభాగం సాహిత్యం కోసం ఖర్చు పెట్టినవాళ్ళు పైగా “ఊహలు” చేయడంలో ఔనని అనిపించుకున్నవాళ్ళూ మరి కొంచెమైనా మాట్లాడాలి కదా! వాళ్ల మాటలు మీకు నచ్చకపోయినా గానీ 🙂

    ఇంక వ్యంగ్యాలూ, నుడికారాలూ గబగబా వాడేయకండి కే.యెస్. రామారావు గారూ! మీరు ఏం రాసేరో గానీ ఆ వాక్యం ఒక అర్ధాన్ని సైతం అందించలేకపోతున్నది. తెలుగు వాక్యం అలా రాయరు. ఇంక అనవసరమైన వ్యంగ్యం సాహిత్య చర్చకి ప్రతిబంధకం అవుతుంది. “మాటకి మాట తెగులు” అని మీవాళ్ళే కదా తరుచూ ఒక ఉదాహరణని ఇస్తూంటారు. అందువల్ల నా అభ్యంతరాలకి నన్ను వదిలేసి, మీరు ఆ ద్వికర్తృత్వ బద్దెనా భీమనల భుజాల మీంచి ఆ లిఖిత మౌఖిక సుమతీ శతకాల్ని దాని మీద వచ్చిన ఆ విమర్శనీ మీమీ భుజాల మీద మోస్తూ సంతోషంగా ఉండండి.

    గొల్లపూడి వీరాస్వామి ప్రతిని సైతం “గుజిలీ” ప్రతిగానే జమకడతారు లెండి లైలా గారూ!! అమెరికన్ విమర్శకులూ దాన్ని”ప్రమాణం” గా తీసుకోరు 🙂 దాన్ని అటుంచండి. “శతక మంజరి” పేరుతో విక్టరీ పబ్లిషర్స్ ఒక పుస్తకాన్ని వేశారు[2009 లో]. “సుమతీ” శతకం పేరుతోనే!! [దానితో కలిపి మరికొన్ని శతకాలు సైతం అందులో ఉన్నాయి.] దానికి సంపాదకుడు పేర “ఆవంచ శ్రీకంఠుడు” న్యూజెర్సీ [ యుయెస్ యే ] అని మాత్రమే ఒక వివరణ ఉంది. కనీశం తాను రాసిన పీఠిక ఏ రోజున రాసిందీ ఒక తేదీ గాని ఒక సంవత్సరం గాని ఇచ్చుకోలేదు శ్రీ శ్రీకంఠుడు న్యూజెర్సీ యూయెస్యే గారు. అంతకన్నా నిడదవోలు వెంకట్రావు గారు కనీశం ఒక సంవత్సరాన్ని అయినా ఇచ్చారు పైగా ఒక తేదీ మాసంతో సహా ఇచ్చారు. ఆ ప్రతి వెల్చేరుకి దొరకనంత మాత్రానికే నిడదవోలు వెంకట్రావు గారు అబధ్ధం చెప్పారన్నంత సందేహం ఎందుకని కలగాలో నాకు అర్ధం కాలేదు. ఆ అవసరం అసలు నిడదవోలు వెంకట్రావుగారికి ఎందుకని ఉండాలో? అది ముందు అర్ధం కావాలే? పాఠకులని వెర్రివాళ్ళని అనుకుంటే తప్ప.

    ఇంక, 2009లో “సుమతీ” శతకాన్ని తేదీలేని, నెల పేర్కొనని, సంవత్సరం అసలే ఇవ్వని ఒక ముందుమాటతో ప్రచురించిన ఈ న్యూజెర్సీ అమెరికా విద్వాంసునికి మరి కనీశం కొన్ని అంతర్జాతీయ విధానాలలో శిక్షణా దానిని గురించిన పరిజ్ఞానమూ ఉండే ఉండాలి కద 🙂 కానీ అవేవీ కనిపించలేదే పుస్తకం ముద్రణలో గాని ముందుమాట రచనా విధానంలో గాని?? గుజిలీ ప్రతి స్థాయిలోనే ఉన్న ఈ హార్డబౌండ్ కాపీ కన్నా కనీశం కేలండర్లని అచ్చువేసుకునే ఆ గొల్లపూడి వీరాస్వామి మెరుగే అని నేననుకుంటాను!! అమెరికా లోని వాళ్ళు సైతం తెలుగుదేశానికి వచ్చి తెలుగు పుస్తకాలని తెలుగు పధ్ధతుల్లోనే ప్రచురించేసుకుంటూ మళ్ళీ వెనక్కి అమెరికా వెళ్ళి తెలుగు వాళ్ల మీద వాళ్ళ పుస్తక ప్రచురణా విధానాల మీదా విసుర్లు విసరడాన్ని ఒక అలవాటుగా మార్చుకున్నారని స్పష్టంగా అర్ధమయ్యే ఉదాహరణలు నా ముందు కో కొల్లలు!!

    జయప్రభ.

  3. తెలుగులో మొదటి నీతి పుస్తకం: సుమతి శతకం గురించి lyla yerneni అభిప్రాయం:

    03/19/2013 2:26 pm

    వ్యాసంలో “సుమతీ” ని “సుమతి”గా మార్చాము. -ఈమాట సంపాదకులు

    What an action! An acquiescence -at a wong place, at a wrong time.

    ఈ వ్యాసమే (మారే) x సంఘాలు, ఆలోచనలు, ముద్రణలు, అర్థం చేసుకొనే రీతులు -గూర్చి చెపుతున్నది. అచ్చులో అందరి ఇళ్ళల్లోనూ ఎవరో ఒకరు ప్రచురించిన ‘సుమతీశతకము’ అన్న పుస్తకము ఏదో ఒక కాపీ ఉండనే ఉంది. ఐనా, ఈ చర్చలలో – సంపాదకులకు కల్గిన ఒక తీయని ఆత్మపరిశోధక, ఆత్మసంతృప్తాత్మక ఊహ – వారి సొంత ముద్రణలో, ఒక చిన్న పొల్లు మారుద్దామని.

    హ. హ. హ.

    ముద్రణల లో మార్పులు, గురించి ప్రశ్నలు:

    నవలలు రాసి ఆంధ్ర విశ్వకళా పరిషత్తు బహుమతి పుచ్చుకుని, ఒకప్పుడు ఆంధ్ర, చెన్నపురి విశ్వ విద్యాలయాలలో తన నవల పాఠ్యగ్రంధముగా చదివించిన అడివి బాపిరాజు, తన నవలలో తెలుగు పేర్లు – నారాయణరావు, జగన్మోహనరావు, విశ్వేశ్వరరావు, రాజేశ్వరరావు – ఇలా రాస్తే; “ఈమాట” రచయితల పేర్లు నారాయణ రావు, వేంకటేశ్వర రావు, మోహన రావు, – ఇలా ముద్రిస్తున్నారు.

    ఈ ‘ఈమాట’ రచయితలు తమ పేర్లు రాసే పద్ధతి మార్చుకున్నారా? ఎందుకు? మార్పు వారికి నచ్చిందా? లేక సంపాదకులు ఈ మనుషుల పేర్లను అచ్చులో మార్చి ప్రచురిస్తున్నారా? ఎవరి ప్రభావం వల్ల ఈ ‘పేరు రాత’ మార్పు వచ్చింది? ఇలా రాయటం తప్పా? రైటా?

    లైలా

    PS: నా దగ్గర ఉన్న గొల్లపూడి వీరాస్వామి సన్ పబ్లిషర్స్ -1990 ప్రచురణలో -సుమతీశతకము అని అట్ట మీద ఉంది. ఈ పుస్తకము ప్రకారం, సుమతీ = ఓ మంచి బుద్ధి గలవాడా!

    పుస్తకము చివరిలో ఇలా ఉంది — ” రాజరాజ మనోజ, దశదిశా భరణ వివేక భూషణ, కవిబ్రహ్మ ఇత్యాది బిరుదాంకిత భద్రభూపాల ప్రణీతంబైన సుమతీ శతకము లఘు టీకా తాత్పర్యము సమాప్తము.”

  4. తెలుగులో మొదటి నీతి పుస్తకం: సుమతి శతకం గురించి కామేశ్వరరావు అభిప్రాయం:

    03/19/2013 2:18 pm

    తెలుగులో ప్రతి అడ్డమైనవాళ్ళూ అన్ని విషయాల గురించీ పరిశోధన పేరుతో తమ ఊహలు ప్రకటించేస్తారు, అని రామారావుగారు, ఇంత సూటిగా ఘాటుగా కాదు కాని, తనదైన రీతిలో మెత్తమెత్తగా వాత పెట్టిన (పోనీ నాకలా అనిపించిన!) తర్వాత కూడా యీ వ్యాఖ్య రాస్తున్నానంటే అది నా మూర్ఖత్వమూ, ముఖకండూతీ తప్ప మరొకటి కాదు. అంచేత పెద్దలు పెద్దమనసుతో మన్నించెదరు గాక!

    ఈ వ్యాసంలో రెండు విషయాలు చాలా విలువైనవిగా నాకు తోచాయి. ఒకటి పద్యశైలీ ఛందోనిర్మాణమూ ఆధారంగా లిఖిత, మౌఖిక సంప్రదాయ లక్షణాలను గుర్తించడం. ఇది మరిన్ని యితర పద్యాల పరిశీలనకు కూడా ఉపయోగపడే పద్ధతి. ముఖ్యంగా, సంక్లిష్టశైలి కనబరిచే పద్యాలు మౌఖిక సంప్రదాయానికి చెందినవి కావని స్పష్టంగా చెప్పే వీలుంది. మరొక విలువైన విషయం, “నీతి” పదానికి ప్రాచీన ఆధునిక కాలాలలో వచ్చిన అర్థవిపరిణామం.

    ఇక, సుమతిశతక కర్తృత్వం గురించి మాత్రం చాలా సందేహాలే మిగిలి ఉన్నాయి.

    1. సుమతిశతక కాలం గురించి. ఇది పదిహేడవశతాబ్ది కాలంలో పుట్టిందని చెప్పడానికి బలమైన ప్రమాణాలేవీ నాకీ వ్యాసంలో కనిపించలేదు. సుమతిశతకంలో ప్రస్తావించిన కరణాల, కాపుల వ్యవస్థ ఆధారంగానూ, పద్యాల భాష ఆధారంగానూ, మరి కొన్ని విషయాల ద్వారానూ, వంగూరి సుబ్బారావుగారు దీని కాలాన్ని పన్నెండు, పదిహేను శతాబ్దాల మధ్యకాలంగా నిర్ణయించారు (గ్రంథకర్తతో సంబంధం లేకుండా). అతను చేసిన వాదనలో లోపాలేవీ యీ వ్యాసంలో చూపించ లేదు. అంచేత దాన్ని కాదని, ఇది పదిహేడవశతాబ్దిలో పుట్టినదని అనడానికి ఏమిటి కారణం? “పేరణము” అన్న పదమొక్కటే దీనికి ప్రమాణం అనిపిస్తోంది. అయితే, పేరణము అంటే, దర్జీలచే కుట్టబడిన రవికేనా, ముస్లిములు రాక మునుపు వేరే రకమైన ఆచ్ఛాదన ఉండేది కాదా అన్న విషయాల మీద నాకు అనుమానాలున్నాయి. కనీసం శ్రీనాథుని కాలానికే “ఱవికె” ఉందన్నది అతని రచన ద్వారా తెలుస్తోంది. ఈ “పేరణము” పదం పదిహేడవశతాబ్దికే చెందినదని అనుకున్నా, ఆ ఒక్కటీ ఆధారంగా మొత్తం శతకం ఆ కాలానికి చెంది ఉంటుందని నిర్ణయించడం సమంజసం కాదు. అలాగే, “సుమతీ శతకం ఈ వర్గం నుంచి వచ్చిన పుస్తకం అయ్యుండాలి. కరణాలు లౌక్యులు, రాజనీతిజ్ఞులు అయినా కూడా వాళ్ళు బాహాటంగా పేరు కోసం ప్రయత్నించలేదు. ఎప్పుడూ అణకువగా తెర వెనకనుండే కార్య నిర్వహణం చేసే తమ గుణానికి అనుగుణంగా ఈ సుమతీ శతక కర్త తన పేరు రాసుకోలేదు.” – అన్న వాదనలో కూడా పెద్దగా పస కనిపించడం లేదు. కర్త పేరు మకుటంగా కాని, మొదటి చివరి పద్యాలలో కాని ఎక్కడా పేర్కొనకపోవడం చాలా శతకాలకున్న లక్షణమే, సుమతిశతకానికి ప్రత్యేకం కాదు. శ్రీకాళహస్తీశ్వరశతకం, నారాయణశతకం మొదలైనవన్నీ వీటికి ఉదాహరణలే. అంచేత ఇందులో ప్రత్యేకించి కరణాల స్వభావానికి సంబంధమేమీ లేదు.

    2. మౌఖిక, లిఖిత సంప్రదాయాలలో సుమతిశతకం గురించి. నారాయణరావుగారన్నట్టు, బ్రౌను పాఠమూ, వావిళ్ళవారి ప్రతి ఆధారంగా, సుమతిశతక పద్యాలు, రెండు సంప్రదాయాలలోనూ కనిపిస్తున్నాయని అంగీకరించడంలో ఎలాంటి విప్రతిపత్తీ లేదు. అయితే, ఇది రెండు రకాలుగా జరిగి ఉండే అవకాశం ఉంది. ఒకటి – మొదట లిఖిత సంప్రదాయంలో రచింపబడిన పద్యాలు కాలక్రమేణా ప్రజల నోళ్ళలో నాని మౌఖిక సంప్రదాయంలోకి రావడం. రెండు – మౌఖిక సంప్రదాయంలో పుట్టిన పద్యాలు క్రమేపీ లిఖిత స్వరూపాన్ని సంతరించుకోవడం. నాకు అర్థమైనంత మేర, మొదటి మార్గంలో కర్త > గ్రంథము > పాఠకుడు అనే క్రమం ఉంటుంది, రెండవదానిలో గ్రంథం ముందుపుట్టి, ఆ తర్వాత దానికి ఒక కర్త ఆపాదింపబడడం జరుగుతుంది. మనకి తెలుగులో ప్రచారంలో ఉన్న చాలా చాటువుల విషయంలో ఈ రెండవ పద్ధతి కనిపిస్తుంది. అయితే సుమతిశతకం ఈ రెండు మార్గాలలోనూ ఏ మార్గాన్ని అనుసరించిందని ఎలా నిర్ణయించడం? ఈ వ్యాసంలో నారాయణరావుగారు, ఈ శతకం మౌఖిక సంప్రదాయంలో పుట్టి క్రమేపి లిఖిత స్వరూపం తీసుకుందని భావించినట్టుగా అనిపిస్తోంది. దీనికి తగినంత బలమైన కారణాలేవీ వ్యాసంలో చెప్పినట్టుగా నాకు కనిపించలేదు. లిఖిత సంప్రదాయంలో ఉన్న ఒక సంక్లిష్టశైలి గల పద్యం, ప్రజల నోళ్ళలో పడి సులభశైలిని సంతరించుకొనే అవకాశమే నాకు ఎక్కువగా ఉందనిపిస్తోంది. మౌఖిక సంప్రదాయంలో పుట్టిన పద్యం యథాతథంగా లిఖిత రూపం పొందేందుకు పెద్దగా అభ్యంతరం ఏముంటుంది? వ్యాకరణపరమైన దోషాలని పరిహరించడం జరగవచ్చు కానీ ఛందస్సు నిర్మాణాన్ని తీరికూర్చుని సంక్లిష్టశైలిలోకి మార్చడమనేది జరుగుతుందని ఊహించడం నాకు కాస్త కష్టంగా ఉంది. అదికూడా ఒకటి రెండు పద్యాలు అలాంటి మార్పులు చెందాయంటే వేరే విషయం కాని, ఈ వ్యాసంలో ప్రస్తావించినదాన్ని బట్టి చూస్తే, ఇలాంటి క్లిష్టబంధం కలిగిన పద్యాలు బ్రౌను పాఠంలో చాలానే ఉన్నట్టుగా తెలుస్తోంది. అవన్నీ కూడా మౌఖిక సంప్రదాయంలోనుంచి మార్పు చెంది లిఖిత సంప్రదాయంలోకి రావడం నాకయితే సాధ్యమనిపించడం లేదు. నా దృష్టిలో, ఈ రెండు రకాల పాఠాలనుండి మనం చెప్పగలిగింది ఏమిటంటే – ఈ శతకం లిఖితసంప్రదాయంలో ఏక కవి కృతమైనవే. శతకంలో ఉన్న పద్యాలన్నిటిలోనూ సులువుగా చదువుకొని గుర్తుంచుకోడానికి వీలైనవే ప్రజాబాహుళ్యంలో ప్రచారమయ్యాయి. అలా కానివి లిఖిత రూపంలోనే ఉండిపోయాయి. ఈ క్రమంలోనే కొన్ని క్లిష్టశైలిలో ఉన్న పద్యాలు రూపురేఖలు మారి సరళరూపాన్ని పొందాయి.

    3. బద్దెన, భీమన గురించి. లిఖిత సంప్రదాయంలో సుమతిశతకానికి బద్దెన, మౌఖిక సంప్రదాయంలో భీమన కృతికర్తలయ్యారని ఊహించడానికి, వ్యాసంలో యిచ్చిన వివరణ అంత నమ్మశక్యంగా అనిపించ లేదు. దానికి చెప్పిన కారణాలు కూడా అంత నమ్మదగ్గవిగా కనిపించ లేదు. అసలు తిమ్మకవి ప్రస్తావించిన, అలాగే ఒక సుమతిశతక పద్యంలో ఉన్న “భీమకవి”, “వేములవాడ భీమకవే”నా కాదా అన్నదే పెద్ద అనుమానం. ఇక దాని ఆధారంగా ఆ భీమకవిని మౌఖిక సంప్రదాయంలో సుమతిశతకానికి ఎందుకు కర్తగా సృష్టించారన్న ఊహలు సాగించడం మరీ దూరాన్వయం అనిపించింది. దీనికన్నా, బద్దెనకున్న బిరుదాలలో “భీమ” అన్నది ఒకటి కాబట్టి, ఇక్కడ పేర్కొనబడిన “భీమకవి” అతనే అన్న ఆలోచనే సజావుగా అనిపిస్తోంది నాకు. అలాగే బద్దెన గురించిన ఊహ కూడాను. ఈ వ్యాసం తెలుగు అనువాదంలో దొర్లిన ఒక పొరపాటు, “బద్దెన కర్త అని చెప్పే సుమతీ శతక పద్యం బిగువైన లిఖిత శైలిలో వుండడం,”. బద్దెన కర్త అని చెప్పే పద్యం సుమతిశతక పద్యం కాదు, నీతిశాస్త్రముక్తావళి లోనిది. తాము సృష్టించిన సుమతిశతకానికి బద్దెనను కర్త చెయ్యడం కోసం నీతిశాస్త్రరత్నావళిలో ఈ పద్యాన్ని కరణాలు ప్రక్షిప్తం చేసి ఉంటారా?! ఇక, శైలికి సంబంధించి నారాయణరావుగారు చేసిన పరిశీలనకు విరుద్ధమైన ఉదాహరణ ఒకటి వంగూరి సుబ్బారావుగారు తమ శతక కవుల చరిత్రములో చూపించి ఉన్నారు. దాన్ని నారాయణరావుగారు చూడలేదో, చూస్తే యీ వ్యాసంలో ఎందుకు ప్రస్తావించ లేదో తెలియదు. సుమతిశతకం (వావిళ్ళవారి ప్రతిలో) యీ పద్యం ఉంది:

    పతికడకు, దన్ను గూర్చిన సతికడకును, వేల్పు కడకు, సద్గురు కడకున్
    సుతుకడకు, రిత్తచేతుల మతిమంతులు చనరు నీతిమార్గము సుమతీ

    ఆంధ్రపరిషత్తు పుస్తకభాండాగారంలో ఒక తాటాకు ప్రతిలో ఇదే పద్యం ఇంకొక రూపంలో యిలా ఉందని సుబ్బారావుగారు అన్నారు. అది:

    సుతుకడకు, తన్ను గూర్చిన సతికడకును, వేల్పు కడకు సద్గురు కడకున్
    మతియుతులు రిత్త చేతుల పతికడకుం బోవ జనదు బద్దె నరేంద్రా!

    ఇది ప్రాచీన ప్రతి అనే సుబ్బారావుగారు చెప్పారు. ఇది అచ్చంగా ఆశు సంప్రదాయంలో ఉన్న పద్యమే. అంటే మౌఖిక సంప్రదాయంలో కూడా బద్దెన కృతికర్త అనే ప్రచారం ఉందని దీని బట్టి భావించ వచ్చును కదా?
    అసలీ వివరణ అంతా, సుమతిశతకం మౌఖిక సంప్రదాయం నుండి లిఖిత సంప్రదాయానికి వెళ్ళిందన్న విషయంపై ఆధారపడినది. లిఖిత సంప్రదాయంనుండి మౌఖిక సంప్రదాయంలోకి వచ్చినది అనుకుంటే, అది బద్దెన కృతమనీ, బద్దెనకున్న ఒక బిరుదు “భీమ” కాబట్టి కొన్ని చోట్ల దీని కర్త భీమకవిగా పేర్కొనబడినదని భావించడం అన్నిటికన్నా సజావైన ఊహగా నాకు తోస్తోంది.

  5. క్షణికమైన భయం మాటున వొదిగి గురించి Janaki Padhuka అభిప్రాయం:

    03/19/2013 11:48 am

    చాలా బాగుంది

    అభినందనలు

  6. తెలుగులో మొదటి నీతి పుస్తకం: సుమతి శతకం గురించి Madhav అభిప్రాయం:

    03/19/2013 11:30 am

    సుందరం గారూ,

    తప్పు ఎత్తిచూపినందుకు కృతజ్ఞతలు. వ్యాసంలో “సుమతీ” ని “సుమతి”గా మార్చాము.

    ఈమాట సంపాదకులు

  7. తెలుగులో మొదటి నీతి పుస్తకం: సుమతి శతకం గురించి మోహన అభిప్రాయం:

    03/18/2013 7:25 pm

    ఆలోచనలను రేకెత్తించే చక్కని వ్యాసము, నారాగారికి జోహారులు.

    (1) సుమతి అనే పదము పుం, స్త్రీ, నపుంసక లింగాలకు వర్తిస్తుంది (ఆంధ్రభారతి సైటులోని సంస్కృత నిఘంటువును పరిశీలించవచ్చును). సామాన్యముగా దీనిని సుమతి శతకము అని పిలుస్తారు, వావిళ్ల వారి పుస్తకములో కూడ (రెండవ చిత్రము) సుమతి శతకము అనియే ఉన్నది. సుమతీ అన్నది సంబోధనాంతర్గతమైన మకుటము. సుమతీ శతకము అంటే కామేశ్వరీ శతకములోని విధముగా సుమతి స్త్రీలింగమవుతుంది. కాలిదాసు, కాలీదాసు లాటిది ఇది. సుమతి అనే పదానికి జైన గురువు అని కూడ అందులో అర్థము ఉన్నది. మల్లియ రేచా అన్నట్లు, సుమతీ అనేది కూడ ఒక జైనునినికి సంబోధనయా?

    (2) In the book “Education and the disprivileged – Nineteenth and twentieth century India”, on page 113 (this may be checked in google books), in a reference, it is stated as follows:
    For instance, at Rajahmundry the books used in schools and colleges were, in addition to the Vedas and Sastras, the Balaramayanam, Rukmini kalyanam, Kristna Satakam, Sumati Satakam, Vasu Charitra, Manucharitra, Bhagavatam, Gajendra Moksham, etc. For details see report from the Collector, Rajamundry, to the Board of revenue dated Septemeber 19, 1823, Tamil Nadu state Archives, BRP, Vol. 963, pro. 2.10.1823, pp 8520-8525, Nos. 29-30.
    అంటే 1823 నాటికే ఇవి ప్రచురించబడినాయా?

    (3) బద్దెన వ్రాసినాడా, భీమన వ్రాసినాడా అనే విషయము పూర్తిగా తెలియకపోయినా, ఇది నన్నయ, నన్నెచోడుల కాలము నాటిదని చెప్పవచ్చును. ఎందుకంటే ప్రాస సాంకర్యము లేదు. బండి ర ప్రాస, అర్ధబిందు ప్రాసలలో సాంకర్యము లేదు. పద్యములను సులభము చేయుటకై తరువాత ర, ఱల సంకర ప్రాసను ఉపయోగించినట్లున్నది.

    విధేయుడు – మోహన

  8. తెలుగులో మొదటి నీతి పుస్తకం: సుమతి శతకం గురించి K.V.S. Ramarao అభిప్రాయం:

    03/18/2013 6:21 pm

    తెలుగు సాహిత్య విమర్శా రంగం గురించి ఒక విమర్శకురాలిగా జయప్రభ గారు అద్భుతమైన మాట చెప్పారు. అమెరికన్ల నుడికారంలో చెపాలంటే “she just hit the nail on the head”. “ఎవరు చెప్పేవైనా అవి వారి వారి భావాలు వారి వారి ఊహలూ మాత్రమే!” తెలుగు విమర్శకులు ప్రతివారూ ఎందుకు భారతాన్ని ఆంధ్రీకరించటం మొదలుపెట్టింది నన్నయ్యేనా మరొకరా అని మొదలుపెట్టి సాహిత్యానికి సంబంధించిన ప్రతి విషయాన్ని తమకు తాముగా (ఉ)పరిశోధించందే వదలరు అనే మీమాంస చాలాకాలంగా వుంది నాకు. ఇప్పటికి సమాధానం దొరికింది – అందరివీ ఊహలే కాబట్టి ఒకరు చెప్పింది మరొకరు వినరు, కనరు గనక ఎవరికి వారే అన్నీ శోధించుకోవాలన్న మాట. ఊహల్లో ఎవరు ఎవరికి తీసిపోతారు గనక? ప్రగతికి సూటైన మార్గం ఖచ్చితంగా ఇదే !

  9. తెలుగులో మొదటి నీతి పుస్తకం: సుమతి శతకం గురించి RVS Sundaram అభిప్రాయం:

    03/18/2013 11:17 am

    సుమతి శతకం గురించి విభిన్నమైన అభిప్రాయాలు రావటం బాగుంది.

    సుమతీ శతకం అనకూడదని రాస్తే నేనొక పిచ్చివాడినని కొందరు భావించినట్లుంది. పండితులు తప్పు చేస్తే వందమంది దాన్నే అనుకరిస్తారు. రామ శతకం అనటానికి రామా శతకం అనటానికీ భేదం ఉంది. పుల్లింగాన్ని స్త్రీలింగంగా మార్చకూడదు. పండితులు అచ్చువేసిన ఏ పుస్తకం లోను సుమతీ శతకం అని లేదు.

    తెలుగులో అచ్చు వేసిన మొదటి వాడు బ్రౌన్ కాదు. 1728 నాటికే తెలుగు ముద్రణ ఉంది. బెంజమిన్ షూల్జ్ తన వ్యాకరణాన్ని అచ్చుకు సిద్ధం చేశాడు. అతను కొన్ని కారణాలవల్ల అచ్చు వెయ్యలేదు కాని తెలుగు అచ్చుకు అప్పటికే అవకాశం ఉంది. దాఖలాల్ని బట్టి తెలుగులో అచ్చయిన మొదటి పుస్తకం శ్రీరాంపూర్ మిషన్ ప్రెస్స్ లో 1813లో అచ్చయిన తెలుగు వ్యాకరణం. కాని అంతకు ముందే తెలుగు పుస్తకాలు అచ్చయ్యాయి. బహుశా షూల్జ్ జర్మనీలోని హాలేలో మొదటి తెలుగు పుస్తకాన్ని అచ్చు వేశాడు.

    సుమతి శతకం రాసింది భీమన లేక బద్దెన అనే రెండు అభిప్రాయాలు ఎక్కువగా ఊహలతో కూడినవే. సుమతి అనే జైన కవి రాశాడనే ఊహని ఎందుకు కొట్టిపడెయ్యాలో అర్థం కాదు. లౌకిక శాస్త్రాలను ఎక్కువగా రాసిన వాళ్ళు జైనులు. సుమతి, రత్నశ్రీ లాంటి పేర్లు జైనులవి,బౌద్ధులవి. సుమతి శతకం సుమతులకయితే నీతులు చెప్పాల్సిన పనిలేదు. అది ఆత్మ సంబోధన (వేమనలాగా) అయిఉండాలి లేదా గురువుని సంబోధించి ఉండాలి. శ్రీరాముని పద్యం తర్వాత చేరింది. సుమతి శతకం జైన రచన అనే అవకాశాన్ని కూడా పరిశీలించాలి.

  10. తెలుగులో మొదటి నీతి పుస్తకం: సుమతి శతకం గురించి jayaprabha అభిప్రాయం:

    03/17/2013 1:58 pm

    చర్చ సుమతీ శతకం కర్తృత్వాన్ని గురించి నేను కవిగా నాకు సైతం దాన్ని ఆపాదించుకుని చెప్పిన మరొక అభిప్రాయం తర్వాత మీ జవాబు. మీ వివరణలో నాకు తెలీని ఒక కొత్త సంగతి అంటూ ఏదీ లేదు. తెలుగు మీద జరుగుతున్న చర్చకి pan indian examples ఇవ్వడం ద్వారా మీరు తెలుగులో ఇవ్వదగ్గ ఏ ఉదాహరణలు లేవని చెప్పినట్లయ్యింది. నాకు నీలకంఠ గురించి తెలియడం కన్నా తెలుగు సాహిత్యం గురించి పాతకాలం లోని పండితులు ఏమని భావించిందీ తెలియడమే ఎక్కువ ముఖ్యం. అది “అన్నీ తెలిసిన” శ్రీనివాస్ లాంటి వారికి ఇది కూడా తెలుసేమో మరి. తామిచ్చిన అంత సుదీర్ఘ వివరణలో తెలుగుకి సంబంధించి కూడా వివరంగా తెలుగులోనే చెప్పి ఉంటె ఎక్కువ బాగుండేది.

    ఇంక Anglo-american intelligentsia చెప్పే మాటల మీద అంత ఆసక్తి లేదు నాకు. స్వయంగా ఆలోచించుకోగల్గిన సామర్థ్యం ఉన్న దానిని గనక. నా అభిప్రాయాన్నీ నా ప్రశ్ననీ “popular view” అని ఒక స్వీపింగ్ కామెంట్ చేయడం అన్నది ఎదటి వాళ్ల వ్యాఖ్యల్ని వాళ్ల ప్రశ్నల్నీ ఊరికే టోన్ డౌన్ చేసే ఒక ఇగోయిజం గా మాత్రమే రూపుకడుతుంది.

    ఇంక జపాన్ లోనూ చైనా లోనూ “ప్రింట్ కల్చర్” ఉందా లేదా అన్నది కాదే విషయం. చైనా లో ఉంటే తెలుగులో ఉన్నట్టా? తెలుగులోకి “ప్రింట్ కల్చర్” తెల్లవాళ్ల తో రాలేదా? అలా అయితే బ్రౌన్ కన్నా ముందు తెలుగు లోని రాత ప్రతులని ముద్రించినవారెవ్వర ? ఎవరికైనా తెలిస్తే చెప్పండి తెలుసుకుంటాను. బ్రౌన్ కి ముందు తెలుగులో తాటాకు పుస్తకాలు వాటి పుత్రికలూ విరివిగా ఉన్నాయా లేవా అన్నది కూడా కాదు ఇక్కడి విషయం. సాహిత్యాన్ని ప్రింట్ లోకి తెచ్చిన బ్రౌన్ మీద అంత తక్కువ అభిప్రాయం సైతం ఎవరికీ ఉండనఖ్ఖరలేదనుకుంటాను. బహు బాగుంది! ఎడిసన్ కనుక్కోకుంటే కరెంటుని ఎవరో ఒకరు వచ్చి కనుక్కుని ఉండేవారేమో! కానీ కనుక్కున్నాడు కదా! అంచేత ఇలాంటి మాటలకేం ఎన్నైనా అనుకోవచ్చు! మన ముందు ఉన్న ఉదాహరణలని బట్టి మాత్రమే మాట్లాడతాము. అయితే గియితేల బట్టి కాదు.

    నాకున్న అభిప్రాయాల్ని నేను స్పస్టంగానే చెప్పేను గనక మరి నాకు మాట్లాడవలసింది ఏమీ లేదు. నా ప్రశ్నలూ నా సందేహాలూ ఎక్కడివి అక్కడే ఉన్నాయి. ఉంటాయి కూడానూ! పుస్తకం పరిష్కరణ మీద కవుల కర్తృత్వాల మీదా సవాలక్ష అభిప్రాయాలు ఎన్నో ఇప్పటికే ఉన్నాయి. ఈ విషయం మీద ఇప్పటి దాకా ఏకాభిప్రాయం అంటూ ఏదీ లేదు అన్నది సాహిత్య విమర్శకులకందరికీ తెలుసు. ఎవరు చెప్పేవైనా అవి వారి వారి భావాలు వారి వారి ఊహలూ మాత్రమే!

    జయప్రభ.