పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16475

  1. తెలుగులో మొదటి నీతి పుస్తకం: సుమతి శతకం గురించి తః తః అభిప్రాయం:

    03/28/2013 9:24 am

    Excellent Sri Suresh, you did it. కానీ “ఈముక్క నేను లెక్క పెట్టుకోక ముందు చెప్పాల” అన్న ఎప్పుడో విన్న మాటలు గుర్తొస్తున్నాయి.

    మీరు నా అభిప్రాయంతో కొంతవరకైనా ఏకీభవించారనిపించింది. మీరు రాసిన పద్యం పారడీ అన్నారు. అది దేనికి పారడీ యో మాత్రం నేను గుర్తుపట్టలేకపోయాను.

    తః తః

  2. తెలుగులో మొదటి నీతి పుస్తకం: సుమతి శతకం గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:

    03/27/2013 4:41 pm

    మోహనరావు గారు: ఛందశ్శాస్త్రము ఉపయోగించి కవికాలాదులను పరిష్కరించే దృష్టితో నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. సంస్కృతంలో వేదవాఙ్మయంలోనూ, మహాభారతంలోనూ మూల శ్లోకాలను, ప్రక్షిప్తాలను నిర్ణయించడానికి ఛందస్సును, భాషను ఉపయోగించిన వారున్నారు. తెలుగులో ఛందస్సుపై ఎంతో పరిశోధన చేసిన మీరు తెలుగు కావ్యాలలోని ఛందస్సు గురించి, అది కాలనిర్ణయానికి ఎంతవరకు పనికివస్తుందో చెప్పడానికి అర్హులు. నాకా అర్హత లేదని నాకు తెలుసును కాబట్టే, పేరడీ పద్యం రాసి వదిలేశాను.

    శ్రీ తః తః: అర్ధబిందు ప్రాస పాటించిన ఈ రెండు పద్యాలు ఏ ఏ శతాబ్దాలకు చెందినవో చెప్పగలరా (taken from old world)?

    పూఁతపసిండివంటి వలపున్‌ బచరించు కులంబు నీతికిన్‌
    లేఁత గదమ్మ యిత్తెఱఁగు? లేమ! సురాంగన లెల్ల నిట్టి నీ
    చేఁతకు మెత్తురమ్మ? దయసేయక తిన్నని మేను వెన్నెలన్‌
    వేఁతురటమ్మ? యింత కనువేఁదుఱు సెల్లునఁటమ్మ యింతికిన్‌?

    పోఁడను బ్రాహ్మణుండు యదుపుంగవు వీటికి వాసుదేవుఁడున్
    రాఁడను నింకఁ బోయి హరి రమ్మని చీరెడి యిష్టబంధుఁడున్
    లేఁ డను రుక్మికిం దగవు లే దిటఁ జైద్యున కిత్తు నంచు ను
    న్నాఁ డను గౌరి కీశ్వరికి నావలనం గృప లేదు నేఁడనున్

  3. తెలుగులో మొదటి నీతి పుస్తకం: సుమతి శతకం గురించి మోహన అభిప్రాయం:

    03/27/2013 2:18 pm

    నేను సుమతిశతక కర్త బద్దెనయా లేక భీమకవియా అని చర్చించలేదు. వ్యాస రచయిత వారిరువురిలో ఒకరికి కర్తృత్వము ఆపాదించబడినదని అభిప్రాయపడినట్లు తోచినది. ఇది ఆ కాలమునాటిదయితే, అరసున్న, రఱల ప్రాసలు దీనికి ఉపయోగపడవచ్చునని నా స్వంత అభిప్రాయమును తెలిపినాను. అదే సమయములో వంద పద్యముల data base ఇట్టి పరిష్కరణకు చాల తక్కువ అని కూడ తెలిపియున్నాను. ఛందశ్శాస్త్రములో యతిప్రాసలు ఇట్టి చర్చకు ఉపయోగపడుతుంది. ఉదాహరణకు, ప్రాస సాంకర్యము లేక వ్రాసిన నన్నయ దంత్య తాలవ్య చ-కారమునకు ప్రాస నుంచినాడు. దానివలన మనకు తెలిసిన దేమంటే, నన్నయ కాలములో దంత్య చ-కారము లేదు, అది తిక్కన కాలానికి వచ్చినది. కావ్యగ్రంథ పరిష్కరణలో కూడ ఇలాటి పరికరములు ఉపయోగించబడినవి. కొందరు వారు ప్రతిపాదించిన సిద్ధాంతములను సమర్థించుటకై వీటిని దుర్వినియోగము కూడ చేసియున్నారు. వ్యాసరచయిత తనవద్ద ఉన్న ప్రతులను ఇలాటి ఒక క్రొత్త కోణములో చదివితే ఉపయోగపడుతుందో యేమో అన్నదే యీ అభిప్రాయములను వ్రాయడానికి నన్ను ప్రోత్సహించినది. మిగిలిన విషయములను చర్చించడానికి నాకు విజ్ఞానము లేదని ఇంతకు ముందే చెప్పాను. విధేయుడు – మోహన

  4. తెలుగులో మొదటి నీతి పుస్తకం: సుమతి శతకం గురించి తః తః అభిప్రాయం:

    03/27/2013 2:08 pm

    నమస్కారాలు సురేశ్,

    మీరు రాసిన అరసున్నాల కందం genuine counter example కానేరదు . You could well have brought into the arena a stanza from old world without revealing the date as an example – rather than fabricating one that too with a striking error in ‘yati’.

    మీరు ఇచ్చిన ఉదాహరణ – మీరు రాశారని స్పష్టంగా తెలుస్తూ – కేళికా గేలికా ఇచ్చారు అన్న అనుమానం కలగ చేస్తుంది. మీ లక్ష్యం నెరవేర్చదు.

    తః తః

  5. క్షణికమైన భయం మాటున వొదిగి గురించి భాస్ బాపట్ల అభిప్రాయం:

    03/27/2013 11:25 am

    హైడ్ గారు, బాగుంది. కాదు చాలా బాగుంది.

  6. అడవిదారిలో గాలిపాట – పుస్తక పరిచయం గురించి భాస్ బాపట్ల అభిప్రాయం:

    03/27/2013 11:05 am

    సమీక్ష అర్థవంతం గాను అందంగాను ఉంది.

  7. తెలుగులో మొదటి నీతి పుస్తకం: సుమతి శతకం గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:

    03/27/2013 8:06 am

    భవదీయుడు గారు,

    నేను కావాలనే 21వ శతాబ్దపు వ్యవహారిక భాషలో రాసాను. కేవలం అర్ధబిందు ప్రాస ఉన్నంత మాత్రాన సుమతి శతకాన్ని 11వ శతాబ్దమనడానికి వీల్లేదని, అందులో చర్చించిన అంశాలు, భాషా మొదలైనవి తరువాతి కాలాన్ని సూచిస్తున్నాయని గమనించాలని నా పాయింటు.

    వ్యవహారిక భాషలో శ్రీశ్రీ రాసిన సిరిసిరిమువ్వ కందపద్యాలు నాకు చాలా ఇష్టం. రెండో పాదంలో, నాలుగో పాదంలో చివర గురువు రావడం కోసమని చెప్పన్, చూడన్, భంగిన్ అని సాంప్రదాయికంగా అందరూ వాడితే శ్రీశ్రీ ఈ కింది కంద పద్యాలను వాడుకభాషలో ఎంత చక్కగా నడిపించాడో చూడండి!

    “ఏవేనా కొత్తవి రా
    శావా? చూపించ”మంచు చంపేవాళ్ళం
    తా వినడానికి నేనీ
    జీవత్కృతి నాలపింతు సిరిసిరిమువ్వా!

    బంగాళాఖాతంలో
    సంగీతం పారవైచి సాయంకాలం
    కాంగానే ఆకాశపు
    చెంగావిని త్రాగెనొకడు సిరిసిరిమువ్వా!

    నా పద్యంలో కూడా “మీరీ నాఁడిట”, “పాటించండీ” అని రాయడం ఆ 20-21వ శతాబ్దపు వాడుకభాష చూపించాలనే. కేవలం అర్ధబిందు ప్రాస ఉన్నంత మాత్రాన ఈ పద్యం 11వ శతాబ్దపు పద్యం అయిపోదు కదా? అది చెప్పడమే నా లక్ష్యం.

  8. తెలుగులో మొదటి నీతి పుస్తకం: సుమతి శతకం గురించి తః తః అభిప్రాయం:

    03/27/2013 3:14 am

    శ్రీ సురేశ్ అరసున్నల పద్యం మీద భవదీయుడు వెలిబుచ్చిన అభిప్రాయం నాకీ కథను గుర్తుకు తెచ్చింది.

    1904 – Charles Darwin
    The Evening News, Saturday, June 11, 1904.

    Man of Science Did Not Bite.

    Miss Daisy Leiter has brought back from London a story about Charles Darwin.

    “Two English boys,” said Miss Leiter, “being friends of Darwin, thought one day that they would play a joke on him. They caught a butterfly, a grasshopper, a beetle and a centipede, and out of the creatures they made a strange, composite insect. They took the centipede’s body, the butterfly’s wings, the grasshopper’s legs and the beetle’s head and they glued them together carefully. Then, with their new bug in a box, they knocked at Darwin’s door.

    “We caught this bug in a field,” they said. “Can you tell us what kind of bug it is, sir?”

    Darwin looked at the bug and then he looked at the boys. He smiled slightly.

    “Did it hum when you caught it?” he asked.

    “Yes,” they answered, nudging one anothre (sic).

    “Then,” said Darwin, “It is a humbug.”–New York Tribune.
    **********
    యథా తథం గా
    ‘An Engineer’s Aspect ‘ బ్లాగు నుంచి
    తః తః

  9. తెలుగులో మొదటి నీతి పుస్తకం: సుమతి శతకం గురించి భవదీయుడు అభిప్రాయం:

    03/26/2013 3:33 pm

    ప్రియమిత్రులు శ్రీ సురేశ్ కొలిచాల గారికి,

    వేఁడుకొనెద విబుధుల నిక
    వాఁడిమి మాటల లకోరి విసరక మీ రీ
    నాఁ డిట యీ వేదిఁ నిలుపు
    పాఁడిని మర్యాదలఁ సరి పాటించండీ!

    అన్న పద్యం మొదటి పాదంలో “ఇక”లో అరసున్న లేదు. రెండవ పాదంలో యతిని సరిచేయాలి. మూడవ పాదంలో “వేదిఁ”, నాలుగవ పాదంలో “మర్యాదలఁ” పదాల చివఱ అరసున్న అవసరం లేదు. గ్రాంథిక భాషా పద్యంలో “పాటించండీ” అని వ్యావహారికాంతం. వాఁడి ధాతువుపై త్వార్థక “ఇమి” ప్రత్యయాంతమైన విశేష్యం “వాఁడిమి” విశేషణంగా ప్రయుక్తమైంది. “మర్యాద”కు బహువచనం మర్యాదాతిక్రమణమే. ఉద్దిష్టార్థంలో పూర్వకవిప్రయోగనిరూఢం కాదు.

    ఇన్ని కారణాల వల్ల ఇది ఇరవై ఒకటవ శతాబ్ది నాటి పద్యమేమో! 🙂 :-).

    తక్కిన విషయాలు తర్వాత. అర్ధబిందుప్రాసతో కవి పద్యరచనా యత్నం బాగుంది!

    ఇట్లు
    భవదీయుడు

  10. తెలుగులో మొదటి నీతి పుస్తకం: సుమతి శతకం గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:

    03/26/2013 3:06 am

    వేఁడుకొనెద విబుధులనిక
    వాఁడిమి మాటల లకోరి విసరక మీరీ
    నాఁడిట యీవేదిఁ నిలుపు
    పాఁడిని మర్యాదలఁ సరి పాటించండీ!

    అర్ధబిందు ప్రాసతో ఉన్న ఈ కందం ఏ శతాబ్దానికి చెందిందంటారు? :-).

    ఈ చర్చలలో లేవనెత్తిన భాషాశాస్త్ర సంబంధమైన విషయాల గురించి రెండు ముక్కలు:

    1. కామేశ్వరరావు చెప్పినట్టు “సుమతీశతకం” వంటి మాటలలో దీర్ఘం నిజానికి సంస్కృత భాషా ప్రభావం వల్ల వచ్చినదే. భాషాశాస్త్రంలో ఇలాంటి రూపాలను అతిదేశ (analogy) రూపాలు అని అంటారు. అన్యభాషా వ్యాకరణం పూర్తిగా తెలియనప్పుడు కొత్త పదాలను, సమాసాలను తెలిసిన ఇతర పదాల సామ్యం ఆధారంగా నిర్మించే ప్రక్రియకు ఈ పేరు. ఇంకొన్ని ఉదాహరణలు:

    “రఘోత్తమ” అని పలకడం తెలుగుదేశంలో చాలాచోట్ల కనిపిస్తుంది. త్యాగరాజ కృతిని “రమించువారెవరురా రఘోత్తమా నిను వినా” అని చాలా పేరుమోసిన గాయకులే పాడారు. రఘోత్తమరెడ్డి, రఘోత్తమరావు అన్న పేర్లుగలవారు ఆంధ్రదేశంలో కోకొల్లలు. అయితే, ‘రఘోత్తమ’ అన్నది కూడా అతిదేశ (analogical) రూపమే. నిజానికి రఘు + ఉత్తమ = రఘూత్తమ (సవర్ణదీర్ఘ సంధి) కావాలి. కానీ, సర్వోత్తమ-, నరోత్తమ- వంటి పదబంధాలకు సామ్యంగా ‘రఘోత్తమ’ అన్న నిర్మాణం జరిగిందని చెప్పుకోవచ్చు.

    ఇటువంటిదే భానోదయం. నిజానికి ఇది భాను + ఉదయం = భానూదయం కావాలి. కానీ, చంద్రోదయం, సూర్యోదయం వంటి పదాల సామ్యంతో ‘భానోదయం’ అని పలుకడం కద్దు.

    2. “-అక” “-అకుండా” ప్రత్యాయాల వాడుక గురించి నారాయణరావు గారు ఆసక్తికరమైన వివరణ ఇచ్చారు. భాషాపరిణామ దశలలో ఈ రకమైన మార్పు బహుశా మధ్యతెలుగు యుగంలో వచ్చిఉండాలి. అయితే, ద్రావిడ భాషలలో వ్యతిరేక ప్రత్యయం -అ-/-ఆ-. ‘నేను ఆడను’ అన్న వాక్యంలో ఆడను = ఆడు ‘to play’+ -అ- negative affix + -ను ‘ఉత్తమ పురుష ప్రత్యయం’. పూర్వకాలీనత్వాన్ని సూచించే క్త్వార్థక అసమాపక (non-finite) క్రియల్లో మాత్రం వ్యతిరేకార్థంలో -అ- తో పాటు -క- ప్రత్యయం తోడైతుంది. చెప్పక-, చేయక-, విప్పక-, తప్పక- మొదలైనవి ఉదాహరణలు.

    మధ్య తెలుగుయుగంలో వాడుకలోకి వచ్చిన ‘చెప్పకుండా-‘ వంటి క్రియాపదాల్ని విభజన చేస్తే ఇలా ఉండవచ్చని నా ఊహ: చెప్పకుండా- = చెప్పు ‘to say’ + -అ- + -క- + -ఉండు- ‘auxiliary verb’+ -ఆ- శత్రర్థక durative aspect’. నారాయణరావుగారు ఇచ్చిన ‘చెప్పకుండా’ ‘చదవకుండా’ ‘పడిపోకుండా’ వంటి పదాల ప్రయోగాలకు ఉదాహరణలుగా ఇచ్చిన వాక్యాలను తుమున్నర్థక (gerund) రూపాలలో రాస్తే ఈ పదాలలో అంతర్లీనంగా ఉన్న -ఉండు- బహిర్గతమౌతుంది.

    చెప్పకుండా వెళ్ళిపోయాడు — చెప్పకుండుట తప్పు కదూ!
    చదవకుండా మాట్లాడకండి — వ్యాసం పూర్తిగా చదువకుండుట నేరమే కదా!
    పడిపోకుండా నిలుస్తుందా — ఎంతో ప్రభుత్వ ధనం వెచ్చించి కట్టిన ఈ వంతెన వర్షాలకు పడిపోకుండుట న్యాయమే కదా!

    నా ఊహలో ఏదైనా పొరపాటు కనిపిస్తే, చెప్పకుండా ఉండకండి.

    3. నారాయణరావుగారు “ప్రతి పుస్తకానికి చారిత్రకంగా గుర్తించదగిన ఒక కర్త ఉండాలి అనేది ఆధునిక విద్యావంతులకు అలవాటైపోయిన ఒక భావం” అని చెప్పిన తరువాత కూడా ‘సుమతిశతకం రాసింది భీమనా? బద్దెనా?’ అన్న అంశంపై ఇంత సుదీర్ఘమైన చర్చ ఆశ్చర్యాన్నే కలిగించింది. నాకు అర్థమైనంతవరకూ, ఆయన దృష్టిలో సుమతిశతకంగా కొంతకాలంనుండీ రెండు వేర్వేరు పాఠాలు అభివృద్ధి చెందాయని, వాటికి రెండు వేర్వేరు వర్గాలు తమ తమ అవసరాలకనుగుణంగా బద్దెనను, భీమనను గ్రంథకర్తలుగా ఆపాదించారని ఆయన వాదన.

    సుమతి శతకం వాగ్వ్యవహారంలో ప్రచారం అయిన పాఠం ఒకటి, లిఖిత పూర్వకంగా ప్రచారమైన పాఠమొకటి రెండు పాఠాలు ఉన్నాయని, సౌలభ్యం కోసం ఒకదానికి వావిళ్ళ సుమతి శతకమని, రెండవ దానికి బ్రౌన్ సుమతి శతకమని పేరు పెట్టి వాటిని పరిశీలించానని మీరు గమనించారు. లౌకికంగా పైకి రావడానికి సాధికారమైన గ్రంథంగా సుమతి శతకం వుండాలని పూనుకున్న కరణాలు తమ పాఠానికి బద్దెన పేరు పెట్టుకున్నారు. వివేకవంతుడైన రాజ్య పరిపాలకుడుగా బద్దెనకు ఉన్న ప్రఖ్యాతి అతను కర్త అయితే వాళ్ళకు ఉపయోగపడుతుంది.

    మౌఖిక సంప్రదాయంలో సుమతిశతకానికి భీమనకు గ్రంథకర్తృత్వం ఆపాదించడంపై నారాయణరావు చెప్పిన ఈ కింది వివరణ కూడా సబబుగానే తోస్తున్నా, కామేశ్వరరావు లేవనెత్తిన కొన్ని ప్రశ్నలకు నారాయణరావుగారో, ఆయన సిద్ధాంతం పూర్తిగా తెలిసిన వారెరైనా సమాధానాలు ఇస్తే చదవాలని ఉంది.

    ఇక పోతే వాగ్వ్యవహారంలో కరణాలకన్నా ఎక్కువ మందిలో పేరు తెచ్చుకున్న సుమతి శతకానికి శాస్త్ర స్థాయి రావాలంటే భీమన్న పేరు పనికొస్తుంది. ఉదాహరణకి అప్పటికి శాస్త్రాలుగా పేరు పొందిన పుస్తకాలన్నీ చారిత్రకంగా ఫలానా అని చెప్పడానికి వీలులేని ఒక గొప్ప వ్యక్తి పేరుతో వున్నవే. మనువు, కౌటిల్యుడు, భరతుడు, వాత్సాయనుడు, వీళ్ళందరు ఋషులనే పేరే కాని వాళ్ళ చారిత్రక వ్యక్తిత్వాలని గురించి మనకేమి తెలియదు. ఆలా తెలియక పోవడం వల్లనే ఆ శాస్త్రాలకి అంత ప్రామాణికత వచ్చింది. భీమన పేరు అలాటిది. శాపానుగ్రహ సమర్థుడైన భీమన వశ్యవాక్కు కాబట్టి అతని పేరు ఈ సుమతి శతకానికి శాస్త్ర స్థాయిని సంపాదించి పెడుతుంది. అతనెప్పుడు పుట్టాడో, ఎన్నాళ్ళు బతికాడో, ఎక్కడ ఉన్నాడో చారిత్రకంగా తెలియక పోవడం, అతనికి అతి మానవమైన శక్తులు ఉండడం ఈ శతకానికి శాస్త్ర స్థాయి రావడానికి అవసరం.