పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16475

  1. స్వప్నలోకచిత్రకారుడు మచాడో గురించి ఏల్చూరి మురళీధరరావు అభిప్రాయం:

    09/21/2013 3:17 am

    యెర్నేని లైలా గారికి
    నమస్కృతులతో,

    మీ సహృదయవాక్యానికి ధన్యవాదాలు. ప్రసక్తింపబడుతున్నది మరువం పువ్వులపై తుమ్మెదలు వాలటం అన్న వాక్యాధికరణం తర్వాత కాబట్టి దానిని పునరుక్తం చేయలేదు. అయినా, లోకసిద్ధంగా భ్రమరావరోహణకు పాత్రంగా మరువానికి పువ్వులుండనప్పటికీ, కావ్యాలలో కవులు మరువానికి పువ్వులను పెద్దవిగా వర్ణింపకపోలేదు. అని నేను సరిగా వ్రాసి ఉంటే, అతివ్యాప్తికి తావుండేది కాదు.

    మీ కొత్తిమీర పువ్వుల ప్రస్తావం, ప్రస్తావన:

    కొత్తిమీర పువ్వుల మైమరపించే సువాసన తనకెంతో ప్రీతిపాత్రమని, అయితే, కొత్తిమీరను నలిపినప్పుడు వచ్చే ఘాటైన వాసన మాత్రం తనకు ప్రాణాంతకంగా అనిపిస్తుందని – రాయప్రోలు సుబ్బారావు గారు అనేవారు. ఇంటర్వ్యూలలో అన్నారు కూడాను. వారితో సహకృతంగా దానిని సౌందర్యద్రవ్యంగా పరిగణించి, “కొత్తిమిరి సొగసును గుస్తరించి” విరివిగా కవితలలో వర్ణించిన తెలుగు కవులు ఇంకొకరిద్దరికంటె ఉండరేమో.

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

    అస్థానపతితంగా పెద్దలకు ఈ హృదయగతాన్ని కూడా మనవి చేస్తున్నందుకు దయతో మన్నింప ప్రార్థన:

    విమర్శనీయం ఎక్కడ కనుపించినా విమర్శకులు విమర్శించటం సరస్వతీతత్త్వమే అని నేనకొంటాను.

    విమర్శలో తర్కసంగతి వల్ల, వ్యక్తివివేకం వల్ల 1) వాద బలం 2) వాది బలం అన్నవి ఎప్పుడూ ఉంటాయి. వాదబలంలోని సౌష్ఠవం, వాదిబలంలోని నిష్ఠురత – రెండూ విద్యార్థులకు శిక్షాప్రణీతాలే. ఆనందవర్ధనుడంతటి మహానుభావుణ్ణి జయంత భట్టు ‘పణ్డితమ్మన్యః’ అన్నాడు. ఆయన విమర్శ కారణంగానే మనము ఆనందవర్ధనుణ్ణి ఆలంకారిక సార్వభౌమునిగానూ; జయంత భట్ట జగదీశ భట్టులను నైయాయిక సార్వభౌములుగానూ శిరసావహిస్తున్నాము.

    కవి కృతితోపాటు విమర్శను అధ్యయనించటమూ – అదెంత ప్రామాణికమైనా, కాకపోయినా – మనకు “రజతగిరి మీఁద హరిహరారాధనంబు”.

    ఒకవేళ విమర్శకవాక్యంలో అసంగతమైన కటుత్వం, అసహృదయత, నిష్కర్షలో ప్రకర్ష ధ్వనించినదనుకొన్నా, అధ్యయనపరులకోసం కవులు, సహృదయులు ఓరిమితో సమాధానం చెప్పక తప్పదు. అదే విమర్శ కాలాంతరంలోనూ వెలువడవచ్చును కనుక.

    కవితావిమర్శలో కవి – విమర్శకుల చర్చలో సాంయాత్రికుల వాకోవాక్యాలలో పారస్పరికత నిర్నిమిత్తం.

    భక్తునికి సాటి భక్తుల భక్తిని విమర్శించే అధికారం లేదని భక్తిశాస్త్రం అంటున్నది. భక్తిపరులకు సాహిత్యం, విమర్శ క్రమప్రథతో స్వస్వరూపాన్ని అనుసంధించే తుల్యపథాలే.

  2. స్వప్నలోకచిత్రకారుడు మచాడో గురించి jayaprabha అభిప్రాయం:

    09/21/2013 1:29 am

    ఇక్కడ అనువాదం లోని విషయాలని గురించి మాట్లాడటం అన్నది విషయం! నేను చినవీరభద్రుని ప్రయత్నాన్ని మెచ్చుకుంటూనే నాకు కనబడిన ఇబ్బందిని ప్రస్తావన చేశాను. తెలుగు చేసినప్పుడూ పైగా దానిని అచ్చువేసినప్పుడు ఇతరులు వారి అభిప్రాయాలని తెలియజేయమనే అర్ధం. “పొగడమని” కాదనుకుంటాను. లైలాకి నచ్చి ఉంDaవచ్చు. అంతమాత్రాన అందరికీ నచ్చాలా? ఒకవేళ Eదన్నా అభ్యంతరాలు ఉన్నప్పుడు ఆ అనువాదకుడు వాటిని గురించి ఆలోచిస్తాడే తప్ప రాసిన వారి “పాండిత్యాన్ని” ప్రశ్నించడు. లైలాకి ఇవి కనిపించలేదో లేక అలాంటివి ఆమెకి ఇష్టమో మరి. లైలా ఏకంగా రాసినవారిని “పులులని” అనడం అంటే అసలు అది ఆమె స్వభావాన్ని గురించి చెప్పుకోవడమే కదా? అంత నిస్ఠూరం దేనికో? నా వరకు అయితే నేను పులినీ కాను వీరభద్రుడు లేడి కూనా కాడు. అనువాదాలు చేయడం మంచిది. కానీ ఎలా చేయడమో అది కూడా ఎంతో ముఖ్యమే! ఏదో ఒకటి రాసేను కదా “ప్రశంసించమంటే” అదేదో సామెత లాగా ఉంటుంది. ఎప్పుడైనా ఏ రాత అయినా చిట్ట చివరికి ఆస్వాదయోగ్యంగా అయితే ఉండాలి. పంటికింద రాయి పడ్డట్టు పదబంధాలు ఇబ్బందిని కలిగించకూడదు. అనువాదం చేయడం మంచి సంగతి. అయితే అది బాగా ఉండేలా చేయడం కూడా అంతే మంచి సంగతి. ఇంక అచ్చువేసినప్పుడు అభిప్రాయాలని ఆశించడమనే అర్ధం! ఐతే అన్నిసార్లూ ఆ అభిప్రాయాలు అనువాదకునికి నచ్చేవే ఉండవు. చదివే పాఠకుల అనుభవం సైతం ఇక్కడ అంతే ముఖ్యం గనక! ఇదే విషయం!

    జయప్రభ.

  3. స్వప్నలోకచిత్రకారుడు మచాడో గురించి lyla yerneni అభిప్రాయం:

    09/20/2013 8:20 pm

    లోకసిద్ధంగా మరువానికి పువ్వులుండనప్పటికీ,కావ్యాలలోకవులు మరువానికి పువ్వులను వర్ణింపకపోలేదు..

    పువ్వులతో కూడిన దారమునకు తావి అబ్బినట్టు – discussion thread పరిమళిస్తున్నది.

    మరువానికి, దవనానికి, వీటిని పూలకోసం పెంచకపోయినా, పూలు ఉంటాయండి. చిన్నవి. తులసి, కొత్తిమీర, పొదీనా, రోజ్మేరీ, ఈ herbs అన్నిటికీ పూలుంటాయి. నడిచే దారుల పక్కన, కొన్నిసార్లు దారులలోనే, నాపరాళ్ళ సందులలో వీటిని నాటితే, నడచినప్పుడల్లా బ్రతుకు ఘుమ్మంటుంది.

    తెలుగు ఆడవారు చాలా ఇష్టంతో మరువం, దవనాలను కుంపట్లలో పెంచుతారు. మరువం చిన్ని ఆకులతో సున్నితంగా ఉంటుంది. దవనం కొంచెం ట్విగ్గీగా, సిల్వరీగా ఉంటుంది. రెండూ, పూల మాలలలో, కలర్ కాంట్రాస్ట్ కూ, సుగంధాల మిళాయింపుకూ వాడతారు కద.

    తేనెటీగలూ, సీతాకోకచిలుకలూ, హమ్మింగ్ బర్డ్స్, ఇతర పిట్టలూ రావటానికి తోటలో రకరకాల జాతుల రంగుల పూలూ, పళ్ళ చెట్లూ ఆలోచనతో నాటిస్తారు. పాలినేషన్ సరిగా సాగటానికి, హెర్బల్ గార్డెన్, పూల మడులూ, పక్క పక్కనో, కలగలుపుగానో వెయ్యొచ్చు. అసలు తేనెటీగలు, సీతాకోకచిలుకలూ నిలకడ లేనివి కదా, అవి అన్ని మొక్కలనూ, కాస్తో కూస్తో విజిట్ చేస్తాయి.

    ఇంతకీ, రచనలో ఒక్క ద్రోహ చింతన లేదే? ఎందుకండీ ఎవరైనా వ్యాఘ్రాల్లాగా పొంచి ఉండటం? ఎందుకు ఈ రచన ప్రచురణ యోగ్యం కాదన్నట్టు, నిఘా పెంచితే, ఇట్టి, పొరపాట్లు జరగవన్నట్టు, హెచ్చరికలు? ఏమో, ప్రేతాలని, భూతాలని ఇంకా దర్శించని నాకు, ఒక ‘పురాతనమైన నీడ’ eery గా ఉంది. అసలు ఒక సమకాలీకుడైన రచయిత నాకు ప్రజ్ఞ ఉన్నది అని తనంత తాను చెపితే మనం నమ్మలేమా? అది మనకు బడాయి లాగానూ, నవ్వు కలిగించేది గానూ ఉంటుందా? అతని రచన లోని అందం ఇంకా మసకేసి పోతుందా?

    లైలా

  4. స్వప్నలోకచిత్రకారుడు మచాడో గురించి jayaprabha అభిప్రాయం:

    09/20/2013 2:03 pm

    సంస్కృతం నించి ఒక్కోభాష పదాల అర్ధాలనీ సందర్భాలనీ ఒక్కో రీతిలో గ్రహించింది అన్న విషయం కాస్త పరిశీలిన చేసినా తెలిసే విషయం. కన్నడంలో నవలని కాదంబరి అంటారు. తెలుగులో అలా అనరు. హిందీలో ఉపన్యాస్ అంటారు. అదే పదం తెలుగులో వేరే అర్ధంలో వాడకం చేస్తారు. ఆగ్రహ్ అనే పదం హిందీ లోనీ తెలుగులోనీ ఒకే అర్ధంలో లేదు. ఇలా బోలెడు. అందువలన ఏ భాష వాడుక ఆ భాషదే అవుతుంది. దీన్ని సమర్ధించుకునే వీలేదీ? పాపం వీరభద్రుడికి సురభి మాధవరాయలు అనే వాడు ఇలా పనికొచ్చాడన్నమాట 🙂 అక్కడికి మాధవరాయలు రాస్తే అదేమన్నా ప్రమాణమా ఏమిటి?

    నాకు స్పానిష్ రాదు గనక నేను వీరభద్రుని అనువాదం లోంచి మచాదోని చదవ బోయాను. కాకపోతే ఆయన రాసిన తెలుగు లోంచి నాకు మచాదో కొరుకుడు పడలేదు. కొంపదీసి నాకు తెలుగు కూడా తెలియదని అనుకోడు కదా చినవీరభద్రుడు? “మహాప్రజ్ఞ చేసే మిరకిల్” ఆ ప్రజ్ఞ సంగతి దేవుడెరుగు గానీ అసలు ఈ పదబంధం ఏమిటబ్బా? ఇదేదో “తిలకాష్ట మహిషబంధం” కన్నా చిక్కుగా ఉందే!

    జయప్రభ.

  5. స్వప్నలోకచిత్రకారుడు మచాడో గురించి ఏల్చూరి మురళీధరరావు అభిప్రాయం:

    09/20/2013 12:33 pm

    ఈ సంక్షిప్తలేఖలో ప్రసక్తింపబడుతున్నది ఉపరి చర్చాగతంగా వచ్చిన మరువం పైని భ్రమరావరోహణమన్న విషయానికి సంగతం:

    1) సురభి మాధవరాయల చంద్రికా పరిణయంలో నాయిక కైశ్యంలో మరువాన్ని అలంకరించుకోగా తుమ్మెదలు వాలిన వర్ణన ఉండినట్లు కనబడలేదు. నా దగ్గరున్నది వెల్లాల సదాశివశాస్త్రులు, అవధానం శేషశాస్త్రుల వారల అద్భుతమైన వ్యాఖ్యతో ఉన్న 1904 నాటి ముద్రణ. అందులో లేదు.

    2) లోకసిద్ధంగా మరువానికి పువ్వులుండనప్పటికీ, కావ్యాలలో కవులు మరువానికి పువ్వులను వర్ణింపకపోలేదు. ఒక ఉదాహరణ:

    వహ్నేః శక్తిర్జలమివ గతాఽదర్శనాద్దాహవృత్తే
    ర్నిత్యోద్గన్ధౌ నవమరువకే వర్తతే పుష్పకార్యమ్
    శీతాత్ త్రాసం దధదివ రవిర్యాతి చాశాం కృశానో
    ర్నీహారార్తా ఇవ చ దివసాః సామ్ప్రతం సఙ్కుచన్తి.
    – రాజశేఖరుని బాలరామాయణం (5-37)

    అని. దీనికి తిరుపతి వెంకటకవుల అనువాదం:

    చలి భరియింపలేక రవి సత్వరుఁడై చనుఁ బావకాశకున్;
    జ్వలునుఁడు నీరువోలెఁ గడుఁ జల్లనివాఁడయి యుండుఁ; బూవు మొ
    గ్గలు వికసించు నా మరువకంబులయంద హిమానికిం దినం
    బులు భయమందెనో! యనఁగఁ బొల్పఱు రాత్రులు వృద్ధిఁజెందఁగన్.

    3) లోకవిరుద్ధ మైనప్పటికీ నిర్గంధ కుసుమాలపై తుమ్మెదలు వచ్చి వ్రాలటం కూడా కవిసమయాలలో కవుల వర్ణనలలో ఉన్నదే. ఒక ఉదాహరణ:

    కింశుకం సుగంధరహితమన్నది లోకసిద్ధం:

    రూపయౌవనసంపన్నాః విశుద్ధకులసంభవాః
    విద్యాహీనా న శోభన్తే నిర్గంధా ఇవ కింశుకాః.

    అని. దీనికి జంధ్యాల పాపయ్యశాస్త్రి గారి తెలుగుసేత –

    జవ్వనంబుఁ గలిగి, సౌందర్యమును గల్గి,
    కలిమిఁ గలిగి, విద్యఁ గనని జనులు
    గంధరహిత కింశుక ప్రసూనంబులు
    లలితసుగుణజాల! తెలుఁగుబాల!!

    లోకవిరుద్ధమైనా గంధరహిత కింశుకం మీదికి తుమ్మెదలు వచ్చి వ్రాలిన వర్ణన ఒకటి:

    సామ్యం సమ్ప్రతి సేవతే విచకిలం షాణ్మాసికై ర్మౌక్తికై
    ర్బాహ్లీకీ దశనచ్ఛటారుణతరైః పత్త్రై రశోక శ్చితః
    భృఙ్గాలఙ్ఘితకోటికింశుక మిదం కిఞ్చిద్వివృన్తాయతే
    మాఞ్జిష్ఠస్తబకైశ్చ పాటలతరో రన్యైవ కాచిల్లిపిః.
    – రాజశేఖరుని విద్ధ సాలభంజిక (1 – 12)

    దీనికి జనమంచి వేంకట రామయ్య గారి తెలుగుసేత:

    ఇదె షాణ్మాసికమౌక్తికాళి కెనయై యింపొందెడున్ మల్లెపూ;
    లిదె తేఁటుల్ పయి వ్రాలఁ గింశుకసుమం బీషద్వివృంతం బగున్;
    ఇదె బాహ్లీకిరదచ్ఛదారుణములై యేపారుఁ గంకేళికా
    చ్ఛదముల్; రక్తగుళుచ్ఛముల్ నవరుచిన్ సంధించెడున్ బాటలిన్.

    ఇటువంటివి ఇంకా అనేకం ఉన్నాయి. కవిసమయం కాబట్టి మరువం పైని భ్రమరావరోహణమన్న కల్పన అంగీకార్యమే అనుకొంటాను.

  6. స్వప్నలోకచిత్రకారుడు మచాడో గురించి తఃతః అభిప్రాయం:

    09/20/2013 8:10 am

    నేను మలయాళీ నైతే నాకు ‘బాల్యకాలం’ odd గా వినిపించేది కాదేమో. ‘పెద్ద కాలము’, ‘పిదపకాలం’ లాగా ‘బాల్యకాలం’ తెలుగు కు సొంతం గా అనిపించలేదు. పైగా కాలానికి సంబంధించి ‘బాల్యకాలం’లో కొంత superfluity ఉన్నట్టనిపించింది.

    తఃతః

  7. రక్తకన్నీరు గురించి mallikarjuna sarma అభిప్రాయం:

    09/20/2013 6:00 am

    శ్రీనివాస్ గార్కి కృతజ్ఞతలు. ఇంత ప్రఖ్యాత నాటకాన్ని చూసే అదృష్టం లేని నాలాంటి వాళ్లకిది నిజంగా ఒక కానుక. రేడియో నాటకంగా రూపొందినట్లున్నది. స్టేజి నాటకం అయితే నిడివి ఇంకా వుంటుంది కదా. కె.వెంకటేశ్వరరావు గారు గిరీశంగా చేసిన కన్యాశుల్కం నాటకం భవిష్యత్ లో శ్రీనివాస్ గారు అందించగలరని ఆశిస్తూ…

  8. స్వప్నలోకచిత్రకారుడు మచాడో గురించి V.Ch.Veerabhadrudu అభిప్రాయం:

    09/20/2013 4:54 am

    ఈ చర్చ ముగిసిపోయిందనుకున్నాను గానీ, ఇంకా కొనసాగుతున్నందుకు ఆశ్చర్యంగానే ఉంది. ఒకటి రెండు వివరణలు ఇవ్వవలసి ఉందనిపించింది.

    1) బాల్యకాల అనే పదబంధంలో లోపమేమిటో నాకు తెలియలేదు. వైకం బహమ్మద్ బషీర్ గొప్ప మళయాళ రచయిత.ఆయన ఒక రచన పేరు బాల్యకాలసఖి. అది మళయాళ పదబంధమంటారా, తెలుగు మీద ఉన్నదానికన్నా సంస్కృత ప్రభావం మళయాళం మీద మరీ ఎక్కువ అన్నది అందరికీ తెలిసిందే.

    2) మరువం, దవనం అనే పేర్లని నేను ఉద్దేశ్యపూర్వకంగానే వాడాను. కవి మాట్లాడుతున్న సుగంధం కేవలం పుష్పజాతుల సుగంధం మాత్రమే కాదు, అదీకాక, ఈ వ్యాఖ్యలు చదివి చింతిస్తున్న నన్ను రాళ్ళబండి కవితాప్రసాద్ ఇటువంటి పదప్రయోగాలు గతంలో కూడా ఉన్నాయని, వెంటనే తన ధారణలోంచి సురభి మాధవరాయకవి అనే 18వ శతాబ్దపు కవి తన చంద్రికాపరిణయం అనే ప్రబంధంలో నాయిక తన కొప్పులో మరువం తురుముకున్నప్పుడు దాని మీద తుమ్మెదలు వాలాయని రాశాడని అన్నారు.

    3) ఇక తమ్మినేని యదుకులభూషణ్ గారికి నవ్వు తెప్పించిన నా పదప్రయోగం ‘పురాతమైన నీడ’లో నవ్వు తెప్పించిందేమిటో నాకు అర్థం కాలేదు. ఘోష్ట్ అనే పదానికి ప్రేతమనే అర్థమో, దెయ్యమనే అర్థమో గూగుల్ సెర్చ్ చూడకుండా కూడా స్ఫురించేవే. కాని కవి హృదయం అర్థమయితే తప్ప ‘పురాతనమైన నీడ’ అనే అర్థం స్ఫురించదు. కేవలం స్పానిష్ వాచకాన్ని ఇంటర్నెట్ ముందు కూచుని బాబిలోన్ ట్రాన్సలేటింగ్ టూల్ నొక్కితే వచ్చే అర్థం ప్రేతమని మాత్రమే ఉంటుంది. కాని మొత్తం కవిని చదివి కొన్నాళ్ళ పాటు మరే ధ్యాసా లేకుండా గడిపితేగాని ‘పురాతనమైన నీడ’ అన్న మాట స్ఫురించదు.నిజంగానే మహాప్రజ్ఞ చేసే మిరకిల్ ఇది.

    ఇంతకీ తెలుగులో ఇందరు స్పానిష్ మహాపండితులు ఉండి కూడా నాకు ఇన్నాళ్ళ పాటు మచాడో పేరు ఎందుకు తెలియలేదో?

  9. నాకు నచ్చిన పద్యం: దాశరథి మించుకాగడా గురించి తః తః అభిప్రాయం:

    09/20/2013 1:03 am

    ఈ పద్యం రాసిన దాశరథి కవికి, వీణ వాయించటం గాని, నృత్యం గాని వచ్చునా అండి

    సొంత పేరు తోనో వింత పేరు తోనో, సమాధానం తెలిసీ చెప్పకపొతే తల పగిలి పోతుందేమోనన్న భయం ఉన్నా, తెలియని వానికి చెప్పినా తెలియదని తెలుసు కాబట్టి చెప్పను. ఈ అభిప్రాయం అచ్చేయక పోయినా నొచ్చను.

    తఃతః

  10. నాకు నచ్చిన పద్యం: దాశరథి మించుకాగడా గురించి lyla yerneni అభిప్రాయం:

    09/19/2013 8:03 pm

    ఈ పద్యం రాసిన దాశరథి కవికి,వీణ వాయించటం గాని,నృత్యం గాని వచ్చునా అండి?

    ఈగ ఇల్లలుకుతూ తన పేరు మర్చిపోయినట్టు కాక,తమ సొంతపేరు తమకు ఇంకా గుర్తున్నవారు మాత్రమే జవాబివ్వ ప్రార్ధన.

    (ఇక మీదట,ఈ మేగజీన్ లో తమ సొంత పేరుతో రాసేవారిని మాత్రమే చదవాలని నేను నిర్ణయించుకున్నాను.అజ్ఞాతకాలం గడువు ఐపోయింది.)

    లైలా