పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16474

  1. విముక్తం గురించి పద్మ అభిప్రాయం:

    06/10/2014 4:29 am

    రాధ గారు, మీ కథ బాగుంది.

    కాకపోతే నాదో చిన్న సందేహం: మురళి స్థానంలో మైథిలి, రాధిక స్థానంలో మురళి స్నేహితుడు ఉంటేకూడా ముగింపు ఇలాగే ఉండేదా?

  2. మైదానానికి చెలియలి కట్ట గురించి రవి అభిప్రాయం:

    06/09/2014 7:05 am

    ఎందుకో ఈమాట కొస్తే ఈ వ్యాసం తాలూకు వ్యాఖ్యలు కనబడ్డాయి. కొంతకాలం క్రితం ముఖపుస్తకంలో ఒకానొక గుంపులో ఇదే వ్యాసం చదివినట్టు గుర్తు. అక్కడ చాలా చర్చ నడిచింది. విశ్వనాథను ఏ కొంచమైనా వ్యతిరేకించే చర్చలకు, వ్యాసాలకు, రచనలకు పట్టిన గతి చివరకు అక్కడా పట్టింది. వ్యాఖ్యలు, వ్యాఖ్యాంతరాలు హుళక్కి.

    అదృష్టవశాత్తూ నేను చెలియలికట్ట చదవలేదు. చదివినా చదవకపోయినా ఆయన భావాలు తెలిసినవే కాబట్టి వచ్చిన ఇబ్బందేమీ లేదు.

    అలాగే అదృష్టవశాత్తూ చలం తాలూకు మ్యూజింగ్స్ ను మైదానం కన్నా ముందుగా చదవడం కాస్త మేలయ్యింది. మైదానం లో కనిపించే జుగుప్సను తట్టుకుని బయటపడి అతనేం చెబుతున్నాడని ఆలోచించడానికి ఉపకరించింది.

    అటు చెలియలికట్ట లాంటి గ్రంథరాజాలను చదవలేని నా బోంట్లకు, అలాగే చలం తాలూకు జుగుప్సాతెరను ఛేదించడానికి ప్రయత్నం చేసే వాళ్ళకూ, ఇలాంటి వ్యాసాలు కాస్తో కూస్తో పసందు గా కాకపోయినా ఉపయోగకరంగానే ఉన్నాయని, ఉంటాయని వ్యక్తిగతంగా నాకు తెలిసిన విషయం. అక్కడ వ్యాఖ్యలు కుప్పకుప్పలుగా ఉండటమూ నేను స్వయంగా చూచినదే. ఇందులో పస లేకపోవడం, దానికి కారణం వ్యాఖ్యల లోపం కావడం – “భిన్నరుచిర్హి లోకః” అంతే.

  3. మైదానానికి చెలియలి కట్ట గురించి jayaprabha అభిప్రాయం:

    06/06/2014 12:46 pm

    మీరన్నది నిజమే సుమా! నా అంతట నేనే నా వ్యాసపు ముద్రణల వివరాలను గురించిన సంగతులని మళ్ళి ఇన్నేళ్లకి చెప్పుకోవలసి రావడం! తెలుగు సాహిత్య రంగానికి ఇవాళ మీలాంటి పాఠక వర్గం దొరికాక రచయితలకి పట్టవలసిన “అదృష్టాలు” ఇలాగే ఉంటవి. దాన్ని కూడా స్వీకరించవలసిందే!

  4. మైదానానికి చెలియలి కట్ట గురించి మాగంటి వంశీ అభిప్రాయం:

    06/06/2014 10:42 am

    “పునరపి మరణం, చర్విత చరణం”లా చలం మీద, విశ్వనాథ మీద, వాళ్ళ రచనల మీద ఏం రాసినా అది ముద్రించుకోటానికి, పునర్ముద్రించుకోటానికి అనేక పత్రికలు, చిన్నా చితకా పెద్దా పిన్న తేడా లేకుండా, వాళ్ళు పోటీ పడుతూనే ఉంటారు. అది ఇరవయ్యేళ్ల క్రితమైనా సరే, ఈ రోజైనా సరే అన్నది జగమెఱిగిన సత్యం. సర్క్యులేషనుకు ఢోకా ఉండదు కాబట్టి. దానికి పత్రికల వాళ్ళను తప్పుబడితే అన్నం పుట్టదని నాకు నేను సృష్టించుకున్న ఉవాచ. ఉవాచలు, అవీ మీకు నచ్చకపోవచ్చు.

    పాఠకుల లలాటాన బ్రహ్మలిఖితమో ఏమో ఈ వ్యాసం అన్నిసార్లు ముద్రించబడటం చాలా గొప్ప విషయం. 🙂 మీ అంతట మీరే ఆ సంగతి చెప్పుకోవాల్సి రావటం జెఱ్ఱిపోతులాటి అదృష్టం. అన్నమయ్య మీద కూడా రాసారా! జై వెంకటేశ్వరా! వెంకటాచలం అటువైపు ఇటువైపు మీవాడేనన్నమాట. వాటికీ కామెంట్లు లేవా? ఇహ కరతలామలకంగానూ, అంజనం వేసినట్టుగానూ పూర్తిగా అర్థమైపోయింది. వివరానికి సహస్ర ధన్యవాదాలు.

    తెలుగులో రాసిన మొదటిది అర్థం కాలేదన్నారు కాబట్టి ఈసారి పాళీ భాషలో రాద్దామనుకుని, మఱొక్కసారి తెలుగులో రాసా! నా వైపు నుండి ఇదే చివరిది అయినా, ఇదీ అర్థం కాలేదా, ఓసారి పింగళివారిని, మాయాబజారులోని కంచి నరసింహారావుగారిని స్మరించుకోవటం ఉత్తమం.

    భవదీయుడు
    మాగంటి వంశీ

  5. మైదానానికి చెలియలి కట్ట గురించి jayaprabha అభిప్రాయం:

    06/06/2014 12:41 am

    లైలా! నా వ్యాసం మీకు నచ్చి నందుకు సంతోషం. మీ వ్యాఖ్య చదివాకనే ఈ నా వ్యాసం ఈమాట లో ఉందని నాకు తెలిసింది. ఎందుకంటే నేను ఈమాట కి నా వ్యాసాలు ఏవీ విడిగా ఎప్పుడూ పంపలేదు. ఈ వ్యాసాన్ని కూడా పంపలేదు. ఈమాట వారు బహుశా దీన్ని ఇక్కడ ఆనాటి తానా పత్రిక నించి ఎత్తి మళ్ళీ ప్రచురించుకున్నట్టున్నారు. అయితే వారీ విషయాన్ని నాకు చెప్పనూ లేదు మరి! నేను నా రచనల విషయం లో సానుకూలమైన అభిప్రాయాలనీ ప్రతికూలమైన అభిప్రాయాలనీ ఇదివరకే సరిపడనంతగా చవి చూసిన దానిని! అందువలన నేను దేనికీ పెద్దగా వింత పడను.

    సంపాదకులకి, వ్యాసం లో అచ్చు తప్పులు చాలా కనబడుతున్నాయి. వాటిని సవరించగలిగితే మీరు బాగుంటుంది కదా? థాంక్స్.

    [జయప్రభగారు, నేను మిమ్మల్ని స్వయంగా అనుమతి అడిగి తీసుకొని వేసుకొన్న వ్యాసం. మేము తానా పత్రికనుండి ఎత్తి వేసుకొన్నారని చెప్పడం సబబు కాదు. — సురేశ్ (సంపాదకుల తరఫున)]

  6. మైదానానికి చెలియలి కట్ట గురించి jayaprabha అభిప్రాయం:

    06/06/2014 12:23 am

    మాగంటి వంశీ అభిప్రాయం నాకు అర్ధం కాలేదు. అది తెలుగు లోనే ఉంది కూడాను పైగా! ఈ వ్యాసాన్ని అనేక సార్లు అడిగి మరీ ముద్రించుకున్న ఇతర పత్రికల వాళ్లనీ. అలాగే ఆ తానా పత్రిక వాళ్లనీ కూడా మీరు తప్పు పట్టాలి 🙂 అదేమిటో కదా? వాళ్లంతా ఇలా “పస” లేని నా వ్యాసాల కొసం ఎందుకని అడిగి తొందర పడ్డారో ఏమో? మీలాంటి వ్యక్తుల సలహాని ముందుగా తీసుకుని ఉండి ఉండవలసింది. ఇకపోతే పదిహేనేళ్ల కిందట అది “మూడోసారి” ప్రచురించ బడింది. ఆవ్యాసం నిజానికి ఇరవైఏళ్ల కిందట ముద్రణ పొందింది మరి. కాక పోతే తెలుగు దేశం లోని పాఠకులు నామీదా నేను రాసిన ఆ వ్యాసం మీద ఎక్కువ నమ్మకం ఉంచినట్టు ఆ వ్యాసం చదివిన వారి అభిప్రాయం ప్రకారం నాకు అర్ధమయ్యిన సంగతి. ఇంక నేను రాసిన అన్నమయ్య పుస్తకాల మీద కూడా ఎక్కడా ఈమాట లో ఏవీ అభిప్రాయాలుండవు:) మరి అవన్నీ కూడా మీరు నిర్ణయించిన ఈమాట లో కనిపించని / లేని అభిప్రాయాలు అనే ఒక కొలబద్ద ప్రకారం “పస” లేని పిప్పి రచనలే కావాలి! కానీ తెలుగు పాఠకులకే ఎందుకనో నా రచనలన్నీ ప్రీతి పాత్రమైనాయి మరి:)

    నేను రాసిన ఆ వ్యాసాన్ని ఇవాళ రాసినా ఒక్క అక్షరం కూడా మార్చకుండా అలాగే రాస్తాను. మీరు నా రచనలని చదివి ఇకమీదట మీ “విలువైన” సమయాన్ని వ్యర్ధం చేసుకోకండి. అవి మీలాంటి వారి కోసం కావు !

  7. మైదానానికి చెలియలి కట్ట గురించి ఉష అభిప్రాయం:

    06/05/2014 6:58 pm

    వంశీగారు,

    ఒక్కమాట- ప్రతీ రచయిత(త్రి)కి తమ దృక్కోణం ఒకటి ఉంటుంది. కనక తనకు భిన్నంగ ఉన్నవి, పేలగా అనిపించినవి ప్రస్తావించటం తప్పేమీ కాదేమో.

    ఈ వ్యాసంలో నాకు నచ్చింది విశ్లేషణ. చాలా సంతులనంగ సాగిందనే చెప్పాలి. ప్రిజుడిస్ ఉందని నేనూ అనుకున్నాను- కానీ పాత్రవిశ్లేషణ అకస్మాత్తుగా యాంటీ క్లైమాక్స్ అయ్యేసరికి నేనూ కొంత ఆశ్చర్యపోయాను. కానీ రెండు పాత్రలు, రచనలు పక్కపక్కన పెట్టి బేరీజు వేసినతీరు బాగుందనే చెప్పాలి. ఒక ప్రఖ్యాత నవల లేదా పాత్ర గురించి జనబాహుళ్యంలో ఉండే భావాలకు విరుద్ధంగ, లేదా భిన్నంగ చెప్పవలసి వచ్చినప్పుడు రచయిత కాస్త జాగ్రత్త పడి నేపథ్యం తయారు చేసుకుంటారు. అందులో తప్పేమీ లేదేమో. ఆమెకట్ల అనిపించింది. చెప్పారు.

    ఇదిగో – మీతో పాటు నాది నాలుగవ అభిప్రాయం. లైలాగారే నన్నూ ఇచటకు పంపారు. (కానీ ఒక కథలో అభిప్రాయమో విమర్శో వ్రాస్తూ మరొక సంబంధంలేని వ్యాసం ప్రస్తావించటం ఏం సబబో మాత్రం నాకు అర్థం కాలేదు. అది ఈ అభిప్రాయవేదిక నియమానికి భంగం కాదా అనిపించింది.) ఏదైనా సరే- ధన్యవాదాలు.

  8. మైదానానికి చెలియలి కట్ట గురించి ఉష అభిప్రాయం:

    06/05/2014 6:47 pm

    నమస్కారం. ముందుగా ఇంత మంచి వ్యాసం, విశ్లేషణాత్మకంగా వ్రాసిన రచయిత్రిగారికి ధన్యవాదాలు.

    “అటువంటి సామాజిక స్థితిలో తప్ప, చలం కన్న అపురూపమైన “మైదానం కల” యదార్థం కాగల అవకాశంలేదు.”

    నిజం. ఎందుకంటే అన్ని కథలు నవలలో అన్ని “మంచి మంచి” విషయాలు చెప్పి చివరకు ఆయన మాత్రం రమణాశ్రమంలోకి వెళ్ళి చివరరోజులు వెళ్ళబుచ్చుకున్నాడు. (ఆ స్థలం తన సిద్ధాంతాలకు పారమార్థిక స్థానమైతే కాదు కదా.) తాను వ్రాసేది సత్యమని నమ్మే వ్రాశాడు కదా. కానీ తాను చూపించిన పంథాలో తానే శాశ్వతంగ నడవలేకపోయాడు. ఆ తర్వాత తాను ఏమైనా సామాజిక సత్యాలు, స్త్రీల మనోగతాలు, హృదయాంతర్యాలు తెలుసుకున్నాడేమో- అది సమాజానికి చెప్తే బాగుండేదేమో. ఆయన “కల” ఏంటో అది “నిజమయ్యే అవకాశం” ఎంతో- తెలిసేది.. అప్పుడు రాజేశ్వరి సరైనదో, రత్నావళి సరైనదో తెలిసేది. ఛ. మంచి అవకాశం పోయింది.

    ఇక సాహిత్యం వదిలి, (ఎందుకంటే అదొక సమాజాచరణయోగ్యమైన విషయంగా భావించి ప్రతిపాదించబడింది కనక) ప్రాపంచిక వాస్తవానికి వస్తే, ఒక పురుషుడు ఒకే స్త్రీతో ఉండటం ఆరోగ్యకరమని చాలాకాలం క్రితమే వేలెంటైన్ అనే అతను ప్రతిపాదించాడు. ఆయన ఒక చర్చి ఫాదరు. వేలెంటైన్ డే అంటే ఆయన ఆ రోజు ప్రేమించుకునే స్త్రీపురుషులను చర్చికి పిలిచి, వారికి విచ్చలవిడి జీవితం మంచిది కాదని బోధించి మరీ వివాహం చేయించేవాడు. చివరకు ఆయనను ఆ కారణంగానే చంపేయించారు. మనం అది తెలియక దాన్ని ప్రేమికుల రోజుగా గడుపుకుంటున్నాము. నిజానికి అది వివాహవ్యవస్థను పటిష్టం చేసిన రోజు.

    ఇప్పుడిది ఎందుకు చెప్తున్నానంటే చలం చెప్పినటువంటి జీవితాన్ని అనాదికాలంగా బ్రతుకుతున్న పాశ్చాత్య సమాజాల స్త్రీపురుషులను చూసి వేలెంటైన్ ఏనాడో ఆ వ్యవస్థలోని సురక్షతను, భద్రతను నొక్కివక్కాణించాడు. ప్రస్తుతం ఆ జీవనాన్ని జీవించేవారు ఏ పరిస్థితులలో ఉన్నారో కాస్త గమనిస్తే, ఆయా దేశాలలో కేవలం స్త్రీపురుష సంబంధాల అస్తవ్యస్తత వల్ల ఎన్ని సామాజిక, వైయక్తిక, మానసిక వికృతులు తలెత్తుతున్నాయో- అది అధ్యయనం చేస్తే సత్యం అదే తెలుస్తుంది. చలంగారు ఇంతా చేసి చివరకు రమణాశ్రమానికి ఎందుకు చేరారో అర్థమైతుంది. ఆయన నవలలో ఏం ఉందో కాదు- ఆయన జీవితంలో చివరలో ఏం చేశారో చూస్తే ఆయన మనసులో ధారణల పరిపక్వత ఎంతో, ఆయన సామాజిక అవగాహన ఎంతటిదో తేటతెల్లమౌతుంది. తాను వ్రాసినవి నిజంగ ఈ దేశపు స్త్రీలు ఆచరిస్తే వాటి పరిణామాలు ఎక్కడకు దారి తీస్తాయో- అటువంటి ప్రవృత్తులు కలిగిన పాశ్చాత్య సంస్కృతుల వంక అలా దృష్టి సారించితే చాలు- చక్కగా అర్థమైతుంది.

    తరువాత స్త్రీస్వేచ్ఛ, శృంగారాది విషయాలకు సంబంధించిన ఆమె అవసరాలు స్త్రీలే ఆలోచించుకోవాలి. ఎంతకాలమని మనువును తప్పు పట్టేది? ఇకనైనా మన్వి పుట్టాలి. స్త్రీలు తమకోసం ఉపయుక్తంగ భావించుుకనే ధర్మాలు, లేదా విలువలు, లేదా నియమాలు, లేదా ఏది కావాలంటే అది- ఆమె ప్రకృతికి, ప్రవృత్తికి విరుద్ధంగ కాక ఏర్పరచుకోవాలి. పురుషుడి దృష్టితో తనను తాను చూసుకున్నంతకాలం స్త్రీకి తానేంటో అర్థం కాదు. కానీ అటువంటి ప్రయత్నాలేవీ ఇన్ని స్త్రీసంఘాలలో ఎవ్వరూ గట్టిగా చేసిన దాఖలాలు లేవు. ఎవరో నన్ను మలిచారు, నేనిలా తగలడ్డాను- అని బాధపడే బదులు తానెలా ఉండదలచుకుందో, తనకేది శ్రేయస్కరమో స్త్రీయే ఎందుకు నిర్ణయించుకోదు? ఆ కాలంలో అంటే కట్టుబాట్లు.. ఇప్పుడైతే ఎవ్వరూ అంతగా పట్టించుకోవట్లేదు కదా.

    ఇన్ని ఆలోచనలు కాదు- ఒక్కటే మాటడుగుతాను. ధర్మం, సంప్రదాయ మార్గంలో చలంగారు చూపిన విధంగ (చూపని కోణాలలో సైతం)ఉండే బాధలున్నాయి. కానీ ఆ గీత దాటివెళితే మాత్రం అంతా సుఖమే ఉందా.. అంతా మంచే ఉందా? అట్ల చేసిన ఎందరు స్త్రీలు నిజంగ స్వతంత్రాన్ని అనుభవించారు? మీ వ్యాసం ద్వితీయార్ధంలో మీరు చెప్పినది అదే కదా. రత్నావళి స్వతంత్రురాలు, సఫలురాలు ఎంత కాదో, రాజేశ్వరీ కాదు కదా. అంటే అక్కడా సమాధానం లేనట్టే కదా. తనకేం కావాలో స్త్రీ ఇప్పటికైనా నిర్ణయించుకోగలిగి, అమలు చేసుకోగలిగే స్థితికి రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను- ధన్యవాదాలు.

  9. విముక్తం గురించి ఉష అభిప్రాయం:

    06/05/2014 5:31 pm

    రాధగారు, నిజం చెప్పారు. కథ నన్ను చాలా విధాలుగా ఆలోచింపచేసింది. సాహిత్యానికి పరమార్థమే అది. మీ ప్రయత్నం పూర్తిగా సఫలమైందని చెప్పగలను. 🙂

    ****

    జయప్రభగారు, ఇక మీ మాటలకు చాలా మటుకు నేను ముందే సమాధానం చెప్పాను. మళ్ళీ చెప్తాను- “ఏది విలువైనదో ఏది శాశ్వతమైనదో దానివెంట మనిషి పోవాలి” అంటే ఏమిటీ?” అంటే అదే.

    “విలువలు మారవూ? సంస్థలు విచ్చిన్నమై కొత్తవి పుట్టవూ? ఏ వ్యవస్థ అయినా మారదా? కొత్త మార్పులు రావా?” —- సంస్థలు, వ్యవస్థలు వేరు.. విలువలు వేరు. అవికూడా విలువలు పోతేనే పోతాయి. విలువలున్నంత సేపు ఏ సంస్థా పతనం కాదు. ఎన్ని మారినా కొన్ని విలువలు ఎన్ని మారినా మారవు. మనిషి మారి విలువలు మారాయనుకుంటాడు.

    “ఈ కధని అలా ఉంచితే కాసేపు, ఈ కధ మీద వచ్చిన అభిప్రాయాలలో మాత్రం ఎక్కువ భయం కనబడుతూంది.” —- నిజం. నాకు అటువంటి ఉత్పాతాలు ఆలోచిస్తేనే భయం వేస్తుంది. అవి పరిష్కారమౌతాయో లేదో తెలియదు. ఈలోపు నిండు జీవితాలు ఎడారిమయమై ఎవరికీ ఆనందం, ఉపయోగం లేకుండా పోతాయి. కళ్ళ ముందు అట్ల అర్థంలేని విషయాలతో విచ్ఛిన్నమైన జీవితాలు చూశాను. అందుకే భయం.

    “కొన్ని విషయాలలో పరిధి దాట వద్దు. అంతే” అంటే ఏమిటో?” —- అంటే దాటవద్దనే అర్థం. పరిధి ఉండేదే దాటకుండా ఉండటానికి. అది మన మంచికే కానీ చెడుకు కాదు. విశృంఖలత్వం ఎవ్వరికీ మంచి చేసిన దాఖలాలు లేవు ఈ సృష్టిలో.

    “అసలు ఏమిటీ వాక్యాలూ? నీతి బోధలు చేయడమూ విధి నిషేధాలు చేయడమూ మతసంస్థల పని. ఏ జమాతే ఇస్లామీవో లేదా అలాంటి మరో మత సంస్థనో అనే మాటలు ఇవి!” —- లేదండీ,మీరు చెప్పిన సంస్థల వారికి, విధినిషేధాలకు- ఈ విలువలకు ఏ సంబంధం లేదు. నీతి బోధ వేరు, విలువల గ్రహింపు వేరు. ఇవి ఒకరి మీద రుద్దేవి కావు. ఎవరికి వారు పరిధులు తెలుసుకుని మెలగవలసినవి. అవి లేని మానవ జీవితానికి ఏ పట్టూ ఉండదు. ఈప్రపంచంలో ఎన్నో సంస్కృతులు వచ్చి పోయినా తరతరాలుగా మన సంస్కృతి జీవంతంగ ఉన్నదే ఆ విలువల వల్ల.

    ఇక, ఈకథలో విషయానికి సంబంధించిన విలువకు వస్తే- భార్యను ఏ కారణంగానైనా బాధపెట్టే అధికారం భర్తకు లేదు- ముఖ్యంగ ఆమె స్వతహాగా చెడ్డది కానప్పుడు- భర్త కోసమై, భర్తే జీవితంగా బ్రతుకుతున్నప్పుడు.. కనక మైథిలికే మురళి మొగ్గాలి, ఆమెకే విలువివ్వాలి. కానీ రాధికతో తన స్నేహం గురించి ఎక్కువ విలువ ఇవ్వకూడదు. అతనిని ప్రేమించి పెళ్ళి చేసుకుందామె. ఆమె బాధలో ఉన్నప్పుడు “నీకు ఇగో, అహం..” వంటి మాటలు చెప్పి మరింత బాధపెట్టకూడదు. అది కనీస మానవత్వం. అది ఒక విలువే. అది మారితే ఆ బంధం విచ్ఛిన్నానికి సిద్ధమైనట్టే.

    “జీవితమే సంక్లిష్టం. ఎప్పుడైనా అది సరళంగా ఎలా ఉంటుందీ?” —- అందుకే దానిని సరళం చేసుకోనే ప్రయత్నమై మనిషి ఆలోచన ఉండాలి కానీ జటిలం చేసుకునే వైపు కాదు. సమస్య వచ్చినప్పుడు దానికి సరైన సమాధానం ఏది.. అది చూడాలి. మైథిలి బాధతీరాలంటే మురళి ఆమెను ఓదార్చాలి. అర్థం చేయించాలి. ఆశ్వాసన ఇవ్వాలి. మనసు విరవకూడదు. మాటలు, భావాలు నిర్మాణాత్మకంగ ఉంటేనే అనుబంధాలు కలకాలం నిలుస్తాయి. అంతే నేను చెప్పదలచింది.

    ****
    ఇక లైలా గారికి-

    “ఒక ఆడది, ఇంకో ఆడదాని నడుము కావిలించుకోటం, గుండెల్లో తల దాచుకోవటం.. Lesbianism.” —- అదేంటి, మీరెప్పుడూ ప్రేమగానో, బాధలో ఓదార్పు కోసమో మీ అమ్మగారిని దగ్గరగా కౌగిలించుకోలేదా? మీ అక్కా చెల్లెళ్ళతో దగ్గరగా ప్రేమ పంచుకోలేదా? అది Lesbianism అంటారా?

    వారిరువురు కథలో ఆ సన్నివేశంలో చేసేది- అవతలివారి బాధ తెలిసి అది తీర్చాలనే హృదయపూర్వకమైన నిండు మానవత్వ భావనతో- ఓదార్చుకోవటమే కానీ వేరే (చవకబారు శారీరిక కోరికో, వ్యామోహమో) కాదు. మురళితో చక్కని అనుబంధం కలిగిన మైథిలికి రాధికతో ఆ పని చేయాల్సిన అవసరం లేదు. ఆ మాత్రానికే అంత ప్రతిక్రియ అవసరం లేదేమో. అసలు Lesbians మగవారిని పెళ్ళి చేసుకుంటారా? దయ చేసి ఉన్నతమైన మానవభావాలకు అసహ్యమైన రంగులు పూయకండి. కథలో కానీ కథనంలో కానీ అయితే కచ్చితంగ మీరన్న భావన లేదు. ఉంటే అది చూసేవారి కళ్ళలో ఉండవచ్చు.

  10. మనకు తెలియని బ్రౌన్ దొర: ఛాల్స్ ఫిలిప్ బ్రౌన్ గురించి Srinivas Vuruputuri అభిప్రాయం:

    06/05/2014 2:23 pm

    ఓ మూడేళ్ళ నుంచి కాబోలు వెల్చేరు, పరుచూరి ద్వయం రాయనున్న బ్రౌన్ వ్యాసం గురించి వింటూ ఉన్నాను. ఎట్టకేలకు వెలుగులోకి వచ్చిన ఈ వ్యాసం ఆనాటి పండితుల స్థితి గతుల గురించి, బ్రౌన్ వ్యక్తిత్వపు వెలుగు నీడల గురించి, తన కృషి తదనంతర తరాలపై చూపిన ప్రభావం గురించి, వలసవాదపు ఛాయలను దాటుకొని కొత్త ప్రశ్నలు వేసుకోవాల్సిన ఆగత్యం గురించి చాలా వివరంగానే చర్చించింది.

    బ్రౌన్ పరిష్కరణ/సంస్కరణ పద్ధతుల గురించి ఇంకాస్త రాయాల్సిందేమో. శ్రీనివాస్ గారు ఓరియెంటల్ లైబ్రరీలో ఏం చూసారో స్పష్టపడలేదు (బ్రౌన్ కాగితపు ప్రతులు అక్కడ ఏ ఆలనాపాలనా లేకుండా అరలలో పడి మగ్గుతున్నాయన్న విషయం కాకుండా).

    బ్రౌన్ కృషిలో మీరు ఎత్తి చూపిన రెండు ప్రధాన దోషాలు – బండి ర, అర సున్నలను “సంస్కరించటం”, మన సాహిత్యానికి సరిపడని పద్ధతులను ప్రవేశపెట్టటం (గ్రంథకర్తృత్వ నిర్ణయాలు, క్రిటికల్ ఎడిషన్ రూపొందించే పనిలో పడి, ఇక్కడి సాహిత్య స్వభావాన్ని గమనించకపోవటం). ఈ రెంటిలోనూ రెండవదే తీవ్రమైన అభియోగంలా అనిపించింది. ఐతే ఇందుకు మనం బ్రౌన్‌ని తప్పుపట్టాలా లేక అది ఆనాటి చదువుల కారణంగా, అప్పటి అవగాహనల వల్లా ఏర్పడిన పరిమితిగా సర్దుకుపోవాలా?

    వేమన పద్యాల పట్ల బ్రౌన్ అభిమానాన్ని మీరు “బ్రాహ్మణ వ్యతిరేకత”కి ఆట్రిబ్యూట్ చేసారు. వేమన పద్యాలకి బ్రౌన్ రాసిన పీఠిక చదువుతుంటే అలా అనిపించలేదు (“For some parts of this comment written in Telugu, I am indebted to two very learned Bramins who taught me the language, its grammar and prosody. They are Tippabhotla Venkata Siva Sastri of Masulipatnam and Advyta Brahmia, the Pandit belonging to the court in which I have the honour of being assistant judge.” అని కూడా రాసారు కదా?).

    మీ వ్యాసం చదివాక బంగోరె “బ్రౌన్ లేఖలు” మళ్ళీ చదవటం మొదలు పెట్టాను. ఆసక్తికరమైన వ్యాసాన్ని రాసినందుకు అభినందనలతో

    శ్రీనివాస్