పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16479

  1. ఊర్మిళాదేవి నిద్ర: ఒక ఆలోచన గురించి lyla yerneni అభిప్రాయం:

    01/11/2012 3:44 pm

    “ఎప్పుడో చిన్నప్పుడు మా ఊర్లో అమ్మలక్కలు మండువా లోగిళ్ళలో పాడుతుండగా విన్న ఊర్మిళాదేవి నిద్ర పాటల శైలి ఇప్పటికీ ఇంకా నాకు బాగా గుర్తుంది. (ఎవరికైనా వినే దమ్ముంటే పాడగలను కూడా!).” -Krishna Rao Maddipati

    పాడండి. ఆకస్మిక ప్రసారం చెయ్యటం ఈ పత్రికకు సాధ్యమే అని తెలిసింది. కృష్ణారావ్! మీపాట ఎందుకు మమ్మల్ని విననీయరు. కవిత్వాలు వ్యాసాలు రాసుకుంటే, రాయటం వస్తుందేమో కాని సంగీతం రాదు. సంగీతం వింటే వస్తుంది. పాడితే వస్తుంది. అని రోహిణీ ప్రసాద్ చెప్పింది చాలా నిజమే.

    మీరు పాడండి. నాకు వినాలని ఉంది.

    కొత్త సంవత్సరం సందర్భంగా ఎక్కడో భారతంలో ఒక చలి ప్రాంతం నుండి నాకు ఫోన్ వచ్చింది. ఆమె వైణికురాలు. ఏమి వాయిస్తున్నాదీ ఇప్పుడు అని నేను అడిగి తెలుసుకుంటుంటే, పినాక పాణి పుస్తకం నుంచి కొన్ని కీర్తనలు నేర్చుకుంటున్నా, నువ్వు రా, నేను వినిపిస్తానంది.

    ఇప్పుడు ఫోన్లో వినిపించమన్నాను. అప్పుడు నాకు అర్థరాత్రి.
    నీకు నిద్ర పోయే సమయం. ఇప్పుడు కాదు -అంది ఆమె.
    లేదు నే వింటానన్నా.
    ఆమెకు హఠాత్తుగా గుర్తు వచ్చింది. నా వీణకు ఒక తీగ తెగిపోయి ఉంది. మార్చాలి.-అంది
    ఎంత సేపు పడుతుంది. తీగ మార్చటానికి? -నా ప్రశ్న
    ఒక అరగంట ఇవ్వు. తీగ మార్చి కొంచెం సాధకం చేసుకుని వినిపిస్తా నంది.
    నేను మళ్ళీ ఫోన్ చేసే లోపలే, తనే ఫోన్ చేసి,

    “వందే వాసుదేవం, శ్రీ హరిం
    వందే వాసుదేవం
    బృందారకాధీక వందిత పదాబ్జం
    వందే వాసుదేవం
    ఇందీవరశ్యామ మిందిరా కుచకటీ
    చందనాంకిత లసచ్చారు దేహమ్
    మందార మాలికా మకుట సంశోభితం
    కందర్ప జనక మరవింద నాభమ్…”

    వీణతో, తన కంఠస్వరం కలిపి పాడితే, నే విని ఈమె నాకు తెలిసిన వ్యక్తేనా అని ఆశ్చర్య పోయాను. నిజంగా చెప్పాలంటే ఆమె నాకు తెలియదు. పదిహేను ఇరవయ్యి సంవత్సరాల పైగా సాధన చేసి వైణికురాలైన ఆమె నాకేం తెలుసు? ఏదో దగ్గిర చుట్టంగా ఆ చనువుతో తెలుసు. ఆమె ఇంకా ఏమేమిటో? నిజంగా నాకేం తెలుసు?

    ఆమెకు తన వీణ నేను వినాలనీ, తను వేసిన బొమ్మలు నేను చూడాలనీ ఎంతో ఉబలాటం. ప్రకృతి అందమైన దృశ్యాలు తనతో పాటు నేను చూడాలని ఆమె ఆశ. వీణ వాయించుకోటం ఆమె నిత్యకృత్యం. ఆమెకు గుర్తింపు అంటే ఏమిటో తెలియదు. పద్మశ్రీల సెరిమొనీలు ఆమెకు పట్టవు.

    మా సంభాషణలో, -అన్నమయ్య కీర్తనలలో మాటలు నాకు అన్నీ అర్థం కావు- అని తను అన్నప్పుడు, జయప్రభ రాసిన రెండు పుస్తకాలను నువ్వు తెప్పించుకుని చదువుకోవాలని తనకి చెప్పాను. తప్పకుండా చదవాలి. అప్పుడు నువ్వు ఇంకా బాగా వాయిస్తావు. నీ ఆనందం ఇంకా ఎక్కువవుతుంది, అని నేను చెప్పాను.

    కృష్ణారావ్! మీ పాట “ఈమాట” లో ప్రసారం కోసం నేను ఎదురు చూస్తాను.

    లైలా

  2. వేణునాదం ఆగింది! గురించి rama bharadwaj అభిప్రాయం:

    01/11/2012 2:46 pm

    సంపాదకుల వారికీ, నా లాంటి వ్యక్తుల “అప్రజాస్వామ్యాన్ని” భరించే వారి ఔదార్యానికీ నమస్కరిస్తూ.. నాది మరొక చివరి మాట 🙂 ఈ విషయం మీద వెర్రి రెహమాన్ గారి లాగే నేనూ వ్యాసమ్ చదవగానే తొలుత అభిప్రాయపడి ఆ వ్యాసమ్ మీద ప్రతి స్పందించినా ..భవానీ గారిలాంటివారి వల్ల నీలాపనిందల్ని మోయాల్సివచ్చినా నేనేమీ అనుకోవడమ్ లేదు గానీ “అసందర్భమే” అయినా ఇది నా స్వోత్కర్ష కాదు గనక దీనికి తెలుగుల ఆమోదమ్ సైతం ఉంటుందనే నమ్మకంతో కనీశంగా ఒక కోరికని మాత్రం కోరుతున్నాను. అదేమంటే నేను చాలా మంచి డాక్యుమెంటరీలు చూసేను ఇతర భాషల్లో.. కవుల కళాకారుల చిత్రకారుల మీద. తెలుగులో మాత్రం చెప్పుకోదగ్గ డాక్యుమెంటరీలేవీ నేను చూడలేదు. చూసినవన్నీ నాసిరకంగా ఉన్నవే!

    ఎవరు చేయగలరో నాకు తెలియదు. ఎలా చేయగలరో కూడా నాకు తెలియదు. కానీ చెయ్యాల్సిన అవసరమ్ మాత్రమ్ ఉంది. లేకపోతే రేపెప్పుడో మన మనవల మునిమనవల తరాలకి చూపించుకుందికి కనీసమ్ శుభ్రమైన లఘుచిత్రాలు కూడా లేకపోతే ..రాగల తరాలు ఎవరిని అడగాలీ?? లేదా ఈ తరాల గురిచి వాళ్ళు ఏమని అనుకోవాలీ ఆలోచించాల్సింది మనమే కదా?? వీటికి డబ్బులు కావాల్సి ఉంటుంది గనక ప్రభుత్వాలో సంస్థలో చెయ్యాలి. ఆ దిసగ శక్తి ఉన్నవారు ఎవరన్నా ఆలోచించగలిగితే బాగుణ్ణు.

    భవానీ గారూ! నేను అభిప్రాయాల చోటుని మాత్రమే వాడుకుంటున్నాను. ఇది ఈమాట సంపాదకులు అనుమతించిన జాగా! అన్నిటికన్నా ముఖ్యం నాకు ఏల్చూరి విజయరాఘవ రావు గారి వేణువు అంటే ఇస్టమ్ ఉంది. ఆయనకి నేను కూడా నివాళి చెబుతున్నాను. మౌనంగా!

    రమ.

  3. ఊర్మిళాదేవి నిద్ర: ఒక ఆలోచన గురించి rama bharadwaj అభిప్రాయం:

    01/11/2012 2:12 pm

    కృష్ణారావు గారూ!! మీ అందరి ఉత్సాహమూ చూసి నేను సైతమ్ నాకు తెలిసిన సంగతులను ఈ స్థలంలో ప్రస్తావిస్తున్నాను. గానీ అంతకన్నా మెండుగా నాకేమీ తెలియదండీ! నేను ప్రచురిస్తే వెంటనే సదరు విషయాలని ముందుగా మీకే తెలియజేయగలదానను. అంతదాకా మీరు కాస్త ఓపిక పట్టాలి. అయినా ఈమాటలో వ్యాఖ్యలు రాయడానికే శక్తి సరిపోవడం లేదు. ఇంతకన్నా ప్రస్తుతానికి ఘనమైన వేమీ రాయలేను కూడాను. పైగా నాకేదో “చరిత్రకారిణినీ” జానపదవేత్తని, సాహితీ విమర్శకురాలినీ , అనువాదకురాలినీ అనే బహుముఖ ప్రజ్ఞా పాటవాలమీద అటువంటి ప్రదర్శనమీదా నమ్మకమూ లెదు. నాకంత తెలివితేటలూ లేవు. ఏదో మీలాంటి సహృదయులు చదువుతున్నారు కదా అని రాయడం తప్పిస్తే .. నాకు దేనిమీదనైనా రాసే “అర్హత” సైతం లెదు. నా అభిప్రాయాల వల్ల పెద్దగా ఒరిగేది కూడా ఏమీ లేదు గనక బుధజనులు మరీ కోరిన ఎడల నేను ఈ రాసే వ్యాఖ్యలు సైతం మానివేయుటకు నాకు ఎటువంటి అభ్యంతరమున్నూ లేదు కూడాను. అందరి నిశ్చింతే నా నిశ్చింత కూడానూ !!

    కురుక్షేత్రమైతే కృష్ణుణ్నడుగు పానిపట్టైతే పీష్వాలనడుగు ..బుస్సీనడుగు వారినడుగు వీరినడుగు ఆ బ్రహ్మదేవుడినడుగు అని అన్నట్టు ఏదో నా చిన్నప్పుడెప్పుడో కొంచెం కొంచెం ..ఆ యూనివర్సిటీల్లోనీ ఈ యూనివర్సిటీల్లోని వాళ్ళు చెప్పినవీ వీళ్ళు చెప్పినవీ వినిప్పుక్కిటపట్టిన నాలుగు ముక్కలు తప్పితే నేనిప్పుడు అలెన్ డండిస్ నో.. స్టూవర్ట్ బ్లాక్బుర్న్ నో బ్రెండాబెక్ నో ..పీటర్ క్లాస్ నో ఇంకా ఇత్యాదులని ఫుట్ నోట్లలో ఎక్కడ ప్రస్తావించగలననీ గానీ, మీ కుతూహలాన్ని తీర్చేపని మటుకు చెప్పుకోదగినది ఏదీ నేను చెయ్యలేదు. చెయ్యను కూడాను. “హీరోవర్షిప్” లలో తెలుగువారు ఏ దేశంలో ఉన్ననూ వీరులే -అన్న నమ్మకం నాలో నిలిపిన మీకు వందనాలతో..

    సెలవుకోరుతూ..
    రమ.

  4. వేణునాదం ఆగింది! గురించి Bhavani అభిప్రాయం:

    01/11/2012 1:27 pm

    ఎవరైనా గౌరవంతో మౌనమ్ వహించడం పోయిన వారి ఆత్మశాంతి కోసమ్ చేయాలి. అలాంటి సంతాప సమావేశం ఒకటి ఏర్పాటై అక్కడ నిలబడినప్పుడు తప్పకుండా ఆ పని చేయగలం !! దాని గురించి రోహిణీప్రసాద్ నించి నేర్చుకోనఖ్ఖరలేదు. ఆ నాగరికత విద్యాధికులమ్ గా మాకు ఉంది.

    సంతాప సమావేశం లాంటిదే పత్రికాముఖంగా ఇచ్చే నివాళి కూడా. “ఇక్కడ విజయ రాఘవరావు గారు కాదు విషయం.” అంటూ ఆయనకిచ్చే నివాళి సందర్భాన్ని తెలుగులను మేల్కొలిపే బృహత్తర కార్యక్రమం కోసం, అదీ ఈ సందర్భానికి పొసగని స్వరంలో వినియోగించడం బాధాకరం. అందుకు వేరే వ్యాసం రాసుకుని అక్కడ ఈ చర్చ సాగించవచ్చు. అసందర్భ వ్యాఖ్యల్ని కూడా ప్రచురించడం ప్రజాస్వామికమనుకుంటున్నట్లున్నారు సంపాదకులు. నివాళి స్ఫూర్తి చూపిన మోహన గారికి ధన్యవాదాలు.

  5. ఊర్మిళాదేవి నిద్ర: ఒక ఆలోచన గురించి కామేశ్వరరావు అభిప్రాయం:

    01/11/2012 12:46 pm

    రవి,

    1. “మీ అమ్మా నాన్న ఎలా ఉన్నారు అంటే, మా అమ్మా నాన్న బావున్నారనడం సహజం. ఇక్కడ అది లేదు.”

    ఇక్కడ ఊర్మిళ ప్రశ్నలడగలేదే! లక్ష్మణుడిని భయపెడుతూ వాళ్ళ పేర్లు ప్రస్తావించింది. మళ్ళీ అదే వరసలో వారిని ప్రస్తావించడమే సహజం అనడం నా ఉద్దేశంలో సమంజసం కాదు.

    2. “సీత యనగా నెవ్వరూ [చెప్పుడీ]
    సృష్టిలో నేను యెరుగ”

    దీనికి చాలా పాఠాంతరాలున్నాయి. ఈ “చెప్పుడీ” అన్న పదం మలయవాసినిగారు పాడిన పాటలో కాని, అక్కడిచ్చిన పాట సాహిత్యంలో కాని, ఇల్లిందిల సరస్వతీదేవిగారి పాఠంలో కాని లేదని గమనించండి. సందర్భం వచ్చింది కాబట్టి మరొక విషయం. “అలనాటి పాట ఊర్మిళాదేవి నిద్ర”లో శ్రీమతి సుబ్బులు పాడిన పాటలో కూడా అక్కడ మాట్లాడేది ఒక్క లక్ష్మణుడే అన్నది స్పష్టంగా ఉంది.

    3. “అబ్బే, అలా స్త్రీలు ఉండరు, స్త్రీలెప్పుడు భర్తలను ప్రాణప్రదంగా ప్రేమిస్తూ, గౌరవిస్తూ ఉంటారనుకోవడమే “మేల్ ఇగో” అని నేననుకుంటున్నాను.”

    స్త్రీలెప్పుడూ అలా ఉంటారని నేనెక్కడా అనలేదండి. మళ్ళీ నా వ్యాఖ్య ఒకసారి చదవండి. మీరలా స్త్రీలందరి గురించి సాధారణీకరించడం, దాని ఆధారంగా పాటని అన్వయించుకోడం సమంజసం కాదని మాత్రమే నేనన్నాను.

    4. “రెండవది అవడంలో ఇబ్బందేముందండి?”

    రెండూ కలిపి చెయ్యడంలో ఇబ్బంది ఉంది. అది circular inference అవుతుంది కాబట్టి. వ్యాసంలో చేసిన ప్రయత్నం మొదటిది కాబట్టి, దానితో రెండవది కలపడం సరికాదని నా ఉద్దేశం. అసలు రెండవ దానిలో విడిగా కూడా ఉన్న ఇబ్బంది “స్త్రీ మనస్తత్వము” అనే సాధారణీకరణ. మీరిచ్చిన విశ్వనాథ ఉదాహరణలో మారీచుడు ఒక పాత్ర. ఆ పాత్ర కల్పవృక్షంలో మనకి స్పష్టంగా గోచరిస్తుంది. ఆ పాత్ర చిత్రణకి అనుగుణంగా అక్కడ మారీచుని ప్రవర్తనని అర్థం చేసుకోడంలో ఇబ్బంది లేదు. కాని యిక్కడ మీరు చెపుతున్నది “స్త్రీ మనస్తత్వము” అనే ఒక బ్రహ్మపదార్థం (I mean an abstract thing) గురించిన సాధారణీకరణ! అదీ ఇబ్బంది.

    ఇంతకు మించి యీ విషయంలో నేను చెప్పగలిగేదేదీ లేదు. చెప్పబూనితే, తెగే దాకా లాగడమే అవుతుంది. కాబట్టి యీ విషయంపై యిది నా చివరి వ్యాఖ్య.

  6. నాకు నచ్చిన పద్యం: ప్రవరుని హిమాలయ దర్శనం గురించి Aravind D అభిప్రాయం:

    01/11/2012 6:37 am

    మాకు ఈ పద్యం పదవ తరగతిలొ ఒక తెలుగు పాఠం లో ఉండేది. ఇక్కడ మళ్ళి ఈ పద్యం చదవగానే అప్పటి స్మృతులు గుర్తుకొచ్చాయి. అలాగే అదే పాఠంలో ఉండే ‘అట జని కాంచె భూమి సురుడు’ అనే మరో అద్భుతమైన పద్యం కూడా మనసులో మెదిలింది. ఈ పద్యం పరిచయం చేసినందుకు మీకు కృతజ్ఞతలు.

  7. ఊర్మిళాదేవి నిద్ర: ఒక ఆలోచన గురించి రవి అభిప్రాయం:

    01/11/2012 5:39 am

    కామేశ్వరరావు గారు,

    ఊర్మిళ ప్రస్తావించిన వరుస ఇది – జనకుడు, సీత, రాముడు, లక్ష్మణుడు. వెంటనే లక్ష్మణుడి చెప్పిన సమాధానంలో వరుస ఇది – రాముడు, జనకుడు, సీత, సీత. సాధారణంగా ఒకవరుసలో ప్రస్తావించిన ప్రశ్నలకు వెంటనే అదే వరుసలో సమాధానం ఇవ్వడం లోకవ్యవహారం. మీ అమ్మా నాన్న ఎలా ఉన్నారు అంటే, మా అమ్మా నాన్న బావున్నారనడం సహజం. ఇక్కడ అది లేదు.

    సీత యనగా నెవ్వరూ [చెప్పుడీ]
    సృష్టిలో నేను యెరుగ

    పైన పంక్తులు కూడా లక్ష్మణుడు ఊర్మిళ భావానికనుగుణంగా చెప్పాడంటే సరిగ్గా పొసగట్లేదు.

    ఇక “మనసుకు నచ్చిన ఊహలు” దీనికి సమాధానం పై పంక్తులు. అసూయ స్త్రీ సహజలక్షణం. సీత ఎవ్వరు అని అంటే ఆమె యెవరో నాకు తెలియదని అసూయచేత విసురుగా ఊర్మిళ చెప్పిందనడంలో అనౌచిత్యమేమున్నది?

    2. >>ఇది కాస్త ప్రమాదకరమైన ఆలోచన. ఒకటి – పురుషుల నిస్సహాయత >>స్త్రీలు ఆనందిస్తారని సాధారణీకరించి సూత్రీకరించడం చాలా తప్పు.

    ఇందులో ప్రమాదకరమూ, అసహజమేముంది? కొంతమంది స్త్రీలు ప్రత్యేకంగా గుమిగూడి (తమదైనలోకంలో మగవాళ్ళు రాని పెరట్లో) తమతమ సంసారం తాలూకు అచ్చట్లు, ముచ్చట్లు చెప్పుకునేప్పుడు (వాళ్ళు ఈ కాలం నాటి హైటెక్ స్త్రీలు కూడా కాదు) తమ మనసులో అణగారిన భావనలను ఉద్యోతిస్తూ చెప్పుకోవడం కద్దు.

    అబ్బే, అలా స్త్రీలు ఉండరు, స్త్రీలెప్పుడు భర్తలను ప్రాణప్రదంగా ప్రేమిస్తూ, గౌరవిస్తూ ఉంటారనుకోవడమే “మేల్ ఇగో” అని నేననుకుంటున్నాను. 🙂

    >>పాటని బట్టి పాతకాలపు స్త్రీల స్థితిగతులని మనస్తత్వాన్నీ ఊహించే్ >>ప్రయత్నం జరుగుతోందా, స్త్రీ మనస్తత్వాన్ని బట్టి పాటని అర్థం చేసుకొనే >>ప్రయత్నం జరుగుతోందా?

    రెండవది అవడంలో ఇబ్బందేముందండి? మీరు సూచించిన విశ్వనాథ మారీచుని ఉదాహరణ ఇందుకు ఉపయోగపడుతుంది. లక్ష్మణాగ్రజా అని ఒక రాక్షసుడు చస్తూ అరిచాడంటే సందర్భాన్ని బట్టి సాధారణ లౌకికార్థంలో అది అనౌచిత్యం. (ప్రాణబాధలో ఉన్నప్పుడు ఎదుటివాని పేరుతో కాక, లక్ష్మణాగ్రజా అని అనడం, అలా అనడం ద్వారా రావణున్ని మోసపుచ్చాలనుకోవడం తదితరాలు అనౌచిత్యకారణాలు) దాని ఔచిత్యం తెలియాలంటే మారీచుని స్వభావం, రామభక్తి తెలియాలి. అంటే అతని మనస్తత్వాన్ని బట్టి రచననుఅర్థం చేసుకోవాలి.

    ఇక్కడా అలాంటిదే. స్త్రీ మనస్తత్వాన్ని బట్టి పాట అర్థం చేసుకోవాలి అనడంలో అసంగతం ఏమిటి?

  8. ఊర్మిళాదేవి నిద్ర: ఒక ఆలోచన గురించి TahaTaha అభిప్రాయం:

    01/11/2012 3:45 am

    హత హత గారూ మిగతా విషయాలు కాస్త పక్కన బెట్టి ఇప్పుడు మీరు రాసిన చివరి వాక్యం ఒకసారి చూద్దాం:

    “పాఠకుడు ఊహిస్తున్న విషయాన్ని రచయిత బలపరచడం ద్వారా రచన పాఠకునికి చేరువౌతుంది”

    పాఠకుడు రకరకాలుగా ఊహించుకొనే ఆవకాశం ఉంటుందా ఉండదా అప్పుడు ఎట్టి ఊహని రచయిత బలపరుస్తాడు? తన తలకాయలో ఉన్న ఊహనేనా, మరొకదాన్నా? కొచెం ఆలోచించండి. ‘మనకి తెలుసు’ అనే బదులు ‘మనం ఊహించుకోవచ్చు’ అంటే రచయిత కొంచం నిజాయితీ గా ఉన్నట్టు తెలుస్తుందా లేదా చెప్పండి. తః తః,శాస్త్ర జ్ణులు ఎప్పుడు “we know” అంటారో కాస్త తెలిసిన మనిషే . ఇక ‘టెక్నిక్’ అంటారా ఒప్పుకుంటాను.

  9. వేణునాదం ఆగింది! గురించి rama bharadwaj అభిప్రాయం:

    01/11/2012 12:47 am

    ఎవరైనా గౌరవంతో మౌనమ్ వహించడం పోయిన వారి ఆత్మశాంతి కోసమ్ చేయాలి. అలాంటి సంతాప సమావేశం ఒకటి ఏర్పాటై అక్కడ నిలబడినప్పుడు తప్పకుండా ఆ పని చేయగలం !! దాని గురించి రోహిణీప్రసాద్ నించి నేర్చుకోనఖ్ఖరలేదు. ఆ నాగరికత విద్యాధికులమ్ గా మాకు ఉంది.

    ఇక్కడ విజయ రాఘవరావు గారు కాదు విషయం. విజయ రాఘవ రావు గారి మీద గొప్ప గౌరవం నాకుంది. ఆయన వేణువాద్య మాధుర్యమ్ నా చెవికి తెలుసు.

    ఇక్కడ వ్యక్తులని గురించి మాట్లాడటం లేదు. సందర్భాన్ని గురించి మాట్లాడుతున్నారు. ఒక గొప్ప వ్యక్తిని గురించి తలుచుకోవడంలోని సందర్భమ్ గురించి. ఆ విషయం మీద ఉన్న పరిమితులు… ఇబ్బందులూను. పదేపదే ఒకటే చట్రం లోంచి వ్యక్తులని తలుచుకుంటూంటే అందులోని సున్నితత్వం మందగించే అవకాశం ఉంది గనక. అది మంచిది కాదు గనక.

    విజయరాఘవ రావు గారి వంటి గొప్ప వేణువాద్య విద్వాంసుని గురించి సంగీత రంగలోని ఇతరులెవరైనా ఈ సరికే మరింతగా “తెలుగున” రాసి ఉండవలసింది. ఆయన సంగీత రంగంలో కర్నాటకమ్ లో ఉన్నవాడు కాడు గనక ఇక్కడి వాళ్ళు రాయలేదో , లేక మరి ఎప్పట్లానే తెలుగు వాళ్ళ అలసత్వమో అనుకోవాలి. తెలుగునేలకి దూరంగా ఉన్నవారు కావడం విజయరాఘవ రావు గారి గురించి ఎక్కువ తెలుగు వారికి తెలియకపోవడానికి గల కారణాలు అని కూడా పూర్తిగా అనను. తెలుగు వాళ్ళకి వాళ్ళలోని విశిష్టతని సకాలంలో గుర్తించే అలవాటు లేదు. దీని గురించి నేను అంటున్నాను. పదే పదే అంటున్నాను ఎందుకంటే మరొక ప్రతిభావంతుడైన తెలుగు వ్యక్తి విషయంలో అయినా వాళ్ళు పోయేకా కాక ముందే తెలుగులు మేల్కొంటే బాగుంటుందని.. తెలుగు పత్రికలూ .. ఇతర మీడియా కూడా! మనకి ఒక కవి మీద గానీ తెలుగు నేల మీద ప్రభవించిన ఒక మంచి కళాకారుని మీద గాని చక్కటి డాక్యుమెంటరీ లేదు. దీనికి ఏమనాలి? టెక్నాలజీ లోపమైతే పూడ్చుకుంటాం! కానీ అది మనుష్యులలోని లోపమే అయితే ఎట్లా?? ఇతర భాషలలో ఈ రకమైన అలసత్వం లేదు. దీని గురించి కూడా మాట్లాడాలి. అది సందర్భాన్ని బట్టైనా మాట్లాడాలి. ఒక వ్యక్తి వ్యాసం రాయడం లేదా రాయక పోవడమ్ కాదిక్కడి సంగతి.

    అయితే విజయరాఘవ రావు గారికి బయట మంచి గుర్తింపు ఉంది. అన్ని అవార్డులూ ఆయనని వరించాయి. తెలుగువారినించి తప్ప. అదీ నా చింత . అందుకే చింత. దాని గురించి “మౌనంగా” ఉండటం కన్నా మాట్లాడటమే మంచిది ఎవరైనా..ఎప్పుడైనా ఎక్కడైనా .. ఇందులో ఎవరికీ విబేధం ఉండనవసరం లేదు. ఇక్కడ “మౌనానికి” అదనపు విలువ ఏమీ లేదు.

    రమ.

  10. వేణునాదం ఆగింది! గురించి మోహన అభిప్రాయం:

    01/10/2012 11:52 pm

    విజయరాఘవరావుగారిని గురించి మరి కొన్ని విశేషాలు – భారతదేశానికి స్వాతంత్ర్యము సిద్దించినప్పుడు ఎఱ్ఱకోటలో మొట్టమొదట 1947 ఆగస్టు 15 రోజు ఆర్చెస్ట్రాను కండక్టు చేసినది వీరే. ఇతని ఒక పెన్సిలు రేఖాచిత్రాన్ని యిక్కడ చూడగలరు. ఇతని ఒక LP రికార్డు చిత్రాలను యిక్కడ చూడ వీలగును. వీరు వ్రాసిన పుస్తకాలలో విజయాంజలి (ఈ పుస్తకాన్ని మానవాళికి అంకితము చేసారు), అభ్యుత్థానము ఉన్నాయి. వీరి కథాసుధ అనే ఒక కథను ఇక్కడ చదువవచ్చును. అతడు వ్రాసిన ఒక కవిత –

    ఔనమ్మా సంగీత తరంగాలు
    గాలిలో తేలుతున్నాయి
    తాన్సేనులు, టాగూరులు
    గాంధీలు, నెహ్రూలు
    వాళ్లేనమ్మా నీ దిగ్దర్శకత్వంలో
    ఈ జీవిత సంగీతపు
    మల్‌హారులు, హిందోళాలు

    విధేయుడు – మోహన