కళావర్ రింగ్ పాడిన పాటలు, చింతామణి నాటకం పద్యాలు

కళావర్ రింగ్ (1908-1964) అన్న పేరు నేను మొదటిసారి విన్నది 1981-82 ప్రాంతాల్లో. ఇదేదో గమ్మత్తుగా ఉందే అనుకున్నాను. తరువాత మరో మూడేళ్లకు చదువుకోసం మద్రాసు వెళ్లినప్పుడు వి.ఎ.కె.రంగారావుగారి దగ్గర ఆయనే ప్రచురించిన భువనవిజయం (1971, ఇది ఘంటసాల ఇంగ్లండు, జర్మనీ, అమెరికా దేశాలలో కచేరీలు ఇవ్వడానికి వెళ్తున్న సందర్భంలో ప్రచురించబడింది.) అన్న పుస్తకంలో ఆవిడ ఫోటో, ఆవిడ గురించి ఘంటసాల చెప్పిన కొన్ని మాటలు, ముఖ్యంగా ఆవిడ ఘంటసాలకి విజయనగరంలో ఎలా సహాయపడింది, చదివిన తర్వాత పేరున్న వ్యక్తే అని అర్థమయ్యింది. ఆవిడ అసలు పేరు సరిదె లక్ష్మీ నరసమ్మ. ఆవిడ గురించిన మరికొన్ని వివరాలు ఇప్పుడు తెలుగు వికీపీడియాలో ఉన్నాయి.

గురజాడ కన్యాశుల్కంలో మధురవాణి పాత్రకు కళావర్ రింగ్ ప్రేరణ అని వాదన ఒకటి ఉంది. కానీ అది నిజం కాదు. కన్యాశుల్కం మొదటి కూర్పు 1897లోను, రెండవ కూర్పు 1909లోను అచ్చయ్యాయి. కళావర్ రింగ్ అన్న పేరు రావటానికి ఒక శృంగార పురుషుని చేతికున్న కళావర్ మార్కు ఉంగరం కావాలి అని మారాం చేస్తే అతడు ఆవిడను చేరదీసినట్లు, అప్పటి నుండి ఆ పేరు స్థిరపడిపోయినట్లు చెప్తారు. తొలిగా విజయనగరంలో మేజువాణీలలో చేసిన నృత్యాలతో పేరు పొందిన తరువాత నాటకాల్లో నటించడం, హరికథలు కూడా చెప్పటం జరిగింది. ఆమె రాసిన ‘రాతిరి నాటకమయినది మొదలుగా రాదు కదా నిదుర’ అన్న పాట బాగా ప్రాచుర్యం పొందింది. రంగారావుగారు చెప్పిన దాని ప్రకారం (చూ. ఆలాపన) ఆమె మొత్తం గ్రామఫోను కంపెనీలకి ఎనిమిది పాటలు–నాలుగు రికార్డులు–పాడారు. నా దగ్గరున్న 6 పాటల్లో నాలుగు పాటలు ఈ సంచికలో. ఈ పాటలలో రెండు తొలినాటి గ్రామఫోన్ గాయకులు అన్న సంకలనాల్లో కూడా చేర్చబడ్డాయి.

కళావర్ రింగ్ ఫోటో, ఆవిడ పాడిన ఒక పాట ఇక్కడ. ఈ ఫోటో భువన విజయం పుస్తకంలోనిదే.

కళావర్ రింగ్‌తో పోలిస్తే పులిపాటి వెంకటేశ్వర్లు (1890-1972), వేమూరి గగ్గయ్య (1895-1955), గండికోట జోగినాథం, పువ్వుల రామతిలకం పేర్లు తరచుగా వినపడేవి. పులిపాటి, గగ్గయ్య చాలా ఏళ్లు తెలుగు మాట్లాడే ప్రాంతాలలో నాటక ప్రదర్శనలు ఇవ్వడమే కాకుండా తెలుగు సినిమా తొలిరోజుల్లో (1933-1948) చాలా చిత్రాలలో నటించారు. అలాగే వారిద్దరు పాడిన చాలా పాటలు, పద్యాలు కూడా రికార్డులపై విడుదలయి మొన్నమొన్నటి వరకు కూడా తేలికగా అందుబాటులో ఉండేవి. రామతిలకం జీవించిన కొద్దికాలంలోనే గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొంది. చివరిగా గండికోట జోగినాథం రేలంగి వెంకటరామయ్యకి గురువుగా ప్రసిద్ధుడు.

ఈ సంచికలో ఈ నలుగురూ కాళ్ళకూరి నారాయణరావు రాసిన చింతామణి నాటకంనుండి పాడిన కొన్ని పద్యాలు, సంభాషణలు ఇస్తున్నాను. రాబోయే సంచికల్లో వీరు పాడిన మరిన్ని పాటలు/పద్యాలు, ముఖ్యంగా గగ్గయ్య పైన ఆయన పాడిన పాటలు, పద్యాలు అన్నింటితో (దాదాపుగా!) ఒక పూర్తి వ్యాసం రాసే ప్రయత్నం చేస్తాను.

ఈ రికార్డులన్నీ 1935-36 ముందు నాటివి. అప్పటికే ‘సుబ్బిసెట్టి హాస్యం’ ప్రవేశించినట్లు తెలుస్తుంది. నిజానికి ఇదేమీ ఆశ్చర్యకరమైన విషయం కాదు. గ్రామఫోను రికార్డులు వచ్చిన తొలినాళ్ళనుండే ద్వందార్థాలతో కూడిన మాటలతో ‘కామెడీ’ లేక ‘హాస్యపు’ పాటల రికార్డులు చెప్పుకోదగ్గ సంఖ్యలోనే విడుదలయ్యాయి. ఈ తొలినాటి కామెడీ పాటలపైనా కూడా ఎప్పుడైనా సమయం దొరికితే ఒక నిడివైన వ్యాసం రాయాలనే కోరికైతే ఉంది.

  1. చింతామణి – అనుభవము. పులిపాటి వెంకటేశ్వర్లు, పి. రామతిలకం.

  2. చింతామణి నుండి ఒక దృశ్యము. పులిపాటి వెంకటేశ్వర్లు.

  3. కళావర్ రింగ్ – చిటపట చినుకులు.

  4. కళావర్ రింగ్ – ఏరా నా ప్రియా.

  5. కళావర్ రింగ్ – కోకిల కూయని కూయగా.

  6. కళావర్ రింగ్ – మరువకుమా.

  7. పులిపాటి వెంకటేశ్వర్లు – ఇంత రంభలవంటి (అఠానా)

  8. చింతామణి – సుబ్బిసెట్టి అనుభవము. పులిపాటి వెంకటేశ్వర్లు, గండికోట జోగినాథం.

  9. చింతామణి – తాతలనాటి చింతామణి. వేమూరి గగ్గయ్య.


07 జనవరి 2017 – ‘ఘనుని హరిశ్చంద్రుఁ గాటికాపరి జేసె…’ అన్న చింతామణి నాటకంలోనిదే మరొక పద్యం అదనంగా జతపరచబడింది. ఈ పద్యం పాడింది ఎస్. పి. లక్ష్మణ స్వామి (హచిన్స్ రికార్డు, SN132, సుమారు 1932-33 ప్రాంతం నాటిది). ఈయన కూడా 1925-1945 మధ్య కాలంలో నాటక రంగంలోను, సినిమా రంగంలోను ప్రముఖ గాయకుడు, నటుడు. కచ దేవయాని (1936), శశిరేఖా పరిణయం (మాయాబజార్ – 1936), తెనాలి రామకృష్ణ (1941) మొదలైన చిత్రాలలో ప్రధాన పాత్రలు ధరించాడు. లక్ష్మణ స్వామి పాడిన మరికొన్ని పాటలు, పద్యాలు మరొకసారి.