తెలుగులో పుస్తక ప్రచురణ – ఆకారవికారాలు

తెలుగులో అచ్చుపుస్తకాలు కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్నాయి. ఇన్ని వస్తున్నా కూడా, ఇప్పటికీ ఒక ఇంగ్లీషు పుస్తకం దగ్గర పెడితే, దానికీ తెలుగు పుస్తకానికీ ఆకారంలో, నిర్మాణంలో, అచ్చు వేసే శ్రద్ధలో, తప్పులు లేకపోవడంలో తేడాలు కొట్టవచ్చినట్టు కనిపిస్తాయి.

అచ్చు అలవాటైన నూటయాభై ఏళ్ళ తర్వాత కూడా తెలుగులో చెప్పుకోదగిన ప్రచురణ సంస్థలు లేవు. ఈ సంస్థలకి ప్రచురణాపరంగా ఒక వ్యవస్థ లేదు. ఫలానా వారు ప్రచురించిన పుస్తకం అనగానే ఆ పుస్తకానికి ఒక గౌరవం కలగాలి అన్న పట్టుదల లేదు. సరదా మాటల్లో చెప్పాలంటే పుస్తకాలు అచ్చు వేసే వాళ్ళు ఉన్నారు కాని, ప్రచురించే వాళ్ళు లేరు. ప్రచురణ అనే మాటకి అర్థం ఏమిటి, దాని వెనకాల ఉన్న బాధ్యత ఏమిటి అన్న విషయం గురించి మనం ఎప్పుడూ వివరంగా ఆలోచించలేదు. మనకి పుస్తకం అచ్చు అవ్వడమే గొప్ప. పూర్వపు మాటల్లో చెప్పాలంటే మన రచనకి ‘ముద్రణ భాగ్యం’ కలగడమే గొప్ప.

పుస్తక నిర్మాణం అంటే పుస్తకంలో ఉన్న విషయానికి సంబంధించిన చర్చ కాదు, రచయిత ఎవరు, అందులో ఉన్న విషయం చెప్పుకోదగ్గదా కాదా, అందులో లోపాలు, గుణాలు ఏమిటి అన్న చర్చ కాదు. పుస్తకం ఒక వస్తువు. దాన్ని నిర్మించడంలో ఒక పనివాడితనం కావాలి. ఆ పనివాడితనం మన పుస్తకాలకి ఉందా? లేకపోతే ఎందుకు లేదు?

పుస్తక నిర్మాణం అంటే బైండింగు, కవరుపేజీ, లోపల టైటిల్ పేజి, విషయసూచిక, పేజీల కూర్పు, బొమ్మల కూర్పు, టైపోగ్రఫీ, అధ్యాయాలు, పేజీలు, పేరాల విభజన, చివర్లో ఉండవలసిన రిఫరెన్సులు, ఇండెక్సులు నిర్మించే తీరూ మొదలైనవి. వీటిని నిర్మించే తీరులో ఉండవలసిన శ్రద్ధ, ఎవరో ఒకరు, లేదా కొందరు పుస్తక నిర్మాణాన్ని పర్యవేక్షించ వలసిన అవసరం — ఇవీ మేం చర్చించదలచుకున్న విషయాలు. ఈ చర్చకీ, పుస్తకంలో విషయానికీ కొంత సంబంధం ఉంది కానీ, పుస్తకంలో విషయాల మంచి చెడ్డలు ఈ వ్యాసంలో చర్చకి రావు.

ఈ పరిస్ఠితిని గమనిస్తూ, తెలుగు ముద్రణ చరిత్రని పుస్తక నిర్మాణ దృష్ట్యా పరిశీలించడం ఈ వ్యాసంలో సంకల్పించిన పని.


తెలుగు ముద్రణ చరిత్రని పుస్తకనిర్మాణ దృష్ట్యా మూడు భాగాలుగా చూడవచ్చు.

  1. పురాణాలు, కావ్యాలు, ఇతర మత గ్రంథాలు.
  2. గుజిలీ ప్రతులు.
  3. ఆధునిక కవిత్వం.

1. పురాణాలు, కావ్యాలు, మత గ్రంథాలు


1అ. పంక్తులపోగు పద్యం
(భాగవతం, 1857)

పూర్వం పండితులు తాటాకుల పుస్తకాన్ని చదవడానికి అలవాటు పడబట్టి, ఆ పద్ధతిలోనే పుస్తకాలు అచ్చు వేసేవాళ్ళు. దీనిలో, ఒక పంక్తి ఎక్కడా ఆగకుండా తిన్నగా పోయి, అది కాగితం చివరకి వచ్చాక, దాని వెనక మరలా రెండో పంక్తి ఏర్పడి — ఇలా పుస్తకం అంతా పంక్తుల మయంగా కనిపిస్తుంది.


1ఆ. పంక్తులపోగు వచనం
(చారుదర్వీషు, 1876)

ఛందస్సు పేరు ఒక అక్షరంతో సూచించడం ఉన్నప్పటీకీ (కం, చం, శ,) ఇవి పంక్తిలో భాగంగానే ఉంటాయి. పుస్తకం చదివే వారు, ఆ పుస్తకాన్ని ఎలా చదవాలో ముందే నేర్చుకుని ఉంటారు కాబట్టీ, వారికి చదివే పద్దతి గురించి ఈ అచ్చుపుస్తకం ఏ సౌకర్యాన్నీ కల్పించే అవసరం ఉండేది కాదు. పుస్తకం ఎలా చదవాలో ముందే తెలియని పాఠకుడికి ఈ పుస్తకం చదవడం సాధ్యం కాదు. తెలుగులో అచ్చు ప్రారంభం అయిన తొలినాళ్ళలో కావ్యాలూ, పురాణాలూ అన్నీ ఇలాగే అచ్చయ్యేవి.


2. మలినాటి కాలం
(భాగవతం, 1961)

తర్వాతి కాలంలో, అంటే ప్రబంధాలు అచ్చు వేసే కాలంలో పాఠకుడికి కొంత సౌకర్యం కల్పించడం అలవాటయ్యింది. పద్యం తర్వాతి పద్యం మధ్యలో కాస్త జాగా, నాలుగు పంక్తుల పద్యం వేరేగా కనిపించడం, ఆ పద్యం పేరు (కం, చం, శ,) పద్య ఆరంభంలో పద్యానికి దూరంగా అచ్చు వెయ్యడం మొదలైన తర్వాత పాఠకుడికి చదువుకోడానికి కాస్త సౌకర్యం కలిగింది.


3. వాక్యముఖపత్రం
(భాగవతం, 1857)

ఈ పద్దతికి తోడు, పుస్తక ముఖపత్రం ప్రచురించే పద్దతి పాతరోజుల్లో విశేషంగా ఉండేది. ముఖపత్రం ఒక పెద్ద వాక్యంగా ఉండేది. అందులో పుస్తకానికి పోషకులైన వారి బిరుదులు, రచయితల గురువులు, వారి పేర్లు, రచయిత బిరుదులు, ఆ పుస్తకాన్ని పరిష్కరించిన వారి పేరు, వారి బిరుదులు అన్నీ కలిపి ఏకవాక్యంగా ఆ ముఖపత్రం ఉండేది. కొంచెం జాగ్రత్తగా చూస్తే, పాత పుస్తకాల ఆశ్వాసాంత గద్యలకి ఇది ముఖపత్ర రూపం. కొన్ని ముఖపత్రాలు పద్యరూపంలో కూడా వుండేవి.

తర్వాత తర్వాత ముఖపత్రం కొంచెం స్పష్టంగా, పుస్తకం పేరు పెద్ద అక్షరాలలో పైన, దాని తర్వాత రచయిత పేరు, అడుగున ప్రచురణకర్త పేరు, ఇలా రావడం మొదలైంది.


4అ. వాక్యరూపముఖపత్రం
(1876)

ఆ కాలంలో ముద్రణశాలలు పండితులే పెట్టుకొనేవారు. జాగ్రత్తగా అచ్చుముద్రలు వారే చూసేవారు. ఆ రోజుల్లో పుస్తక నిర్మాణ శైలి ఎలా ఉన్నా, పుస్తకాలలో అచ్చుతప్పులు ఉండేవి కావు. అరసున్నలు, బండిర(ఱ)లు, జాగ్రత్తగా చూడవలసిన అవసరం ఉండబట్టి పండితులు ఆ రకమైన శ్రద్ధ చూపించేవారు. ఉదాహరణకి, ఆదిసరస్వతి ముద్రణాలయము, దాని తర్వాత వచ్చిన వావిళ్లవారి సంస్థ, దాదాపు అదేకాలంలో వేదం వెంకటరాయశాస్త్రిగారు అచ్చు వేయించిన పుస్తకాలు ఆ కోవలోనివి.


4ఆ. పద్యరూపముఖపత్రం
(1849)

ఆ రోజుల్లో అచ్చయ్యే పుస్తకాలలో పేజీ అంతా అక్షరాలతో నిండిపోయి వుండేది. పేజీ వెడల్పు తగినంత ఉండని కారణం చేత, ఉత్పలమాల, చంపకమాల, ముఖ్యంగా సీసం వంటి పద్యాల మొత్తం చరణం అంతా ఒక పంక్తిలో పట్టేది కాకపోవడం చేత, ముద్రాపకులు చివరి రెండు, మూడు అక్షరాలు ఆ పంక్తికి పైన కొసరు లాగ అచ్చు వేసేవారు. దీంతోపాటు, ఆ పుస్తకం అచ్చు వేసేవారి మతమర్యాదలు, పుస్తకం పట్ల భక్తి పుస్తకాలలో కనిపించేవి. మన పాత పుస్తకాల పేర్లేవీ శ్రీ లేకుండా ఉండవు (శ్రీమదాంధ్ర మహాభారతము, శ్రీమద్రామాయణము.) పుస్తకం ఆరంభంలో శారాదాంబైయనమః, శివాయనమః, శ్రీకృష్ణపరమగురుభ్యోనమః, శ్రీహయగ్రీవాయనమః (వావిళ్ల), శ్రీమత్పరదేవతాయైనమః (చెళ్లపిళ్ల) వంటి మాటలు ఉండేవి.


5. శ్రీముఖాలు మర్యాదలు
(యాత్రాచరిత్ర, 1915)

పుస్తకం వెల, ప్రచురించబడిన సంవత్సరం, మొదలైన వివరాలు ఎక్కడ ఉండాలనే నియమం ఉండేది కాదు. ఎవరికి తోచినట్టు వారు వేసేవారు. పుస్తకం పేరు వెన్ను మీద వేసే అలవాటు కూడా ఒక క్రమంలో ఉండేది కాదు. పుస్తకం కొంత సన్నపాటిదైతే వెన్ను మీద ఏమీ ఉండేది కాదు. భారీ పుస్తకాలకు వెన్ను మీద పేర్లు నిలువు గాను, అడ్డు గాను, ఇంకా రకరకాల పద్ధతులలో ఉండేవి. ఫుస్తకం మీద రచయిత పేరు, అనువాదకుల పేర్లు ఎలా వెయ్యాలనే విషయంలో కూడా ఒక పద్ధతంటూ ఏమీ ఉండేది కాదు. ఆరోజుల్లో వావిళ్ళవారు కళాపూర్ణోదయం వేసిన పద్ధతి చూస్తే ఈ సంగతి వివరంగా బోధపడుతుంది. ఆ పుస్తకం ముఖపత్రం మీద కట్టమంచి రామలింగారెడ్డి పేరు ప్రముఖంగా వుంటుంది. ఆయన కళాపూర్ణోదయానికి తన సొంత తరహాలో విమర్శ వ్యాసం రాశారు. ఆ వ్యాసాన్ని వావిళ్ల వారు కళాపూర్ణోదయానికి ముందు మాటగా వాడుకున్నారు. కాని ఆ పుస్తకానికి ప్రతిపదార్థాలు రాసిన పండితుడి పేరు ముఖపత్రం మీద ఎక్కడా కనిపించదు. ఓపిగ్గా వెతుక్కుంటే ఆయన చదలవాడ జయరామశాస్త్రి అని పుస్తకం చివరి పేజీలో అధస్సూచికగా కనిపిస్తుంది. వావిళ్ళవారే వేసిన భర్తృహరి సుభాషితానికి సంస్కృత భాష్యం ఎవరు రాశారో, తెలుగు వ్యాఖ్యానం ఎవరు రాశారో ముఖపత్రం మీద కనిపించదు. ఉపోద్ఘాతంలో సంస్కృతం భాష్యం ఎవరిదో తెలుస్తుంది కానీ, తెలుగు వ్యాఖ్యానం ఎవరిదో తెలియదు. ఇవన్నీ మనం వెతికి చూసుకోవాలి. పండితుల పేర్లు చెప్పకపోవడం వావిళ్ళవారికి బహుశా సి. పి. బ్రౌను దగ్గర నుంచి వచ్చిన అలవాటు కావొచ్చు.

ఇది, పండితులు అచ్చు వేయించిన పుస్తకాల కథ.

2. గుజిలీ పుస్తకాలు


6అ. గుజిలీ పుస్తకం నమూనా
ఎన్. వి. గోపాల్ అండ్ కో

సరిగ్గా ఇదే సమయంలో, సమాంతరంగా ఇంకో ప్రచురణ రంగం నడిచింది. పెద్ద బొబ్బిలిరాజు కథ, బాలనాగమ్మ కథ, కామమ్మ కథ, సహస్ర శిరఛ్ఛేద అపూర్వ చింతామణి లాంటి పుస్తకాలు ఈ కోవలోవి. రోడ్ల పైన, రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారాల మీద, చేత్తో పుస్తకాల కట్టలు పట్టుకుని, వాటి పేర్లు అరుచుకుంటూ వీటిని అమ్మేవారు. వీటికీ చూడగానే గుర్తు పట్టేలా ఒక ప్రత్యేకమైన ఆకారం ఉండేది. చవకరకం కాగితం మీద, పేజీ అంతా నింపేసిన అక్షరాలతో, ఇవి తయారై వచ్చేవి. వీటిమీద ‘పండితులచేఁ బరిష్కృతము’ అనే మాట ఉండేది. ఇవి అచ్చు వేసిన సంవత్సరం కానీ, ఎన్ని కాపీలు వేశారు అనే వివరం కానీ ఈ పుస్తకాలపై ఉండేవి కావు. కానీ, ఈ పుస్తకాలు విపరీతంగా అమ్ముడు పోయేవని మాత్రం మనకి తెలుసు. కొండపల్లి వీరవెంకయ్య, కాళహస్తి తమ్మారావు, సిద్ధేశ్వర, ఎన్. వి. గోపాల్ అండ్ కో. వంటి ప్రచురణ సంస్థలు ఈ తరహా పుస్తకాలని వేసేవి. ఈ పుస్తకాల అట్టల లోపల పేజీ లోనూ, చివరపేజీ లోనూ రకరకాల మందుల ప్రకటనలు — యవ్వనాన్ని తిరిగి పొందడం యెలాగ, సౌందర్యాన్ని నిలబెట్టుకోవడం యెలాగ, మంత్రాలు తంత్రాలు వాడటం యెలాగ, వగైరా — ఉండేవి.


6ఆ. గుజిలీ పుస్తకంలో ప్రకటనలు
ఎన్. వి. గోపాల్ అండ్ కో

ఈ రెండు రంగాలు చాలాకాలం పాటు ఇలా ఒక పద్ధతిలో కొనసాగాయి. ఇదే సమయంలో, పంచాంగాలు అచ్చు వేసేవారి పద్ధతి మరొకలా ఉండేది. ఇప్పటికీ ఈ పద్ధతిలో పంచాగాలు అచ్చు వేస్తున్నారు. ఈ పుస్తకాల ఆకారాన్ని బట్టీ, నిర్మాణాన్ని బట్టీ ఇది పండితుల వేయించిన ప్రామాణిక గ్రంథమా, లేక బజారులోనో రైల్వే బుక్ షాపులోనో దొరికే పుస్తకమా లేక పంచాంగమా అని చెప్పడానికి శ్రమ పడక్కరలేదు. వీళ్ళందరికీ అచ్చు ఒక సౌకర్యమే గానీ, దాని నాణ్యత మీద ఒక దృష్టి లేదు. ఈ పద్ధతి ఈనాటికీ కొనసాగుతోంది.

3. ఆధునిక కవిత్వం

అచ్చు వేసిన పుస్తకం అందంగా ఉండాలి అనే ఊహ భావకవిత్వం తోనే మొదలైంది. భావకవులకు పద్యానికి ‘రూపం’ ఉండాలని తెలుసు. వైతాళికులు ప్రచురణ తెలుగు కవిత్వం అచ్చు వెయ్యడంలో వచ్చిన పెద్ద మార్పు. పద్యం ఎక్కడ విరిచి ఎలా చదవాలో దానికి తగ్గట్టుగా పంక్తులు విడగొట్టి వేసిన మొదటి పుస్తకం వైతాళికులు. ఈ పుస్తకం నుంచే తెలుగులో ఆధునిక పద్యానికి ఒక ‘రూపం’ వచ్చిందని చెప్పవచ్చు. ఇప్పుడు దొరకడం లేదు కానీ వైతాళికులు మొదటి ముద్రణ ఎవరైనా చూస్తే ఈ సంగతి బోధపడుతుంది. ఇంగ్లండు నుంచి తెప్పించిన ఖరీదైన ఫెదర్ వెయిట్ పేపరు మీద ఒక పద్ధతిలో ప్రతి పద్యం చక్కగా కూర్చి, పరిష్కరించి, అచ్చు వేసిన పుస్తకం ఇది.