ఛందం© – తెలుగు ఛందస్సు సాఫ్ట్‌వేర్

ఉగ్గుపాలనుండి ఉయ్యాలలోనుండి
అమ్మ పాట పాడినట్టి భాష
తేనెవంటి మందు వీనులకును విందు
దేశభాషలందు తెలుగులెస్స!

— మిరియాల రామకృష్ణ

తెలుగు ఛందస్సు – సంక్షిప్త పరిచయం

పద్యాలను వ్రాయడానికి ఉపయోగించే విధానాన్ని ఛందస్సు అంటారు. ఛందస్సును మొట్టమొదట సంస్కృత వేదాలలో ఉపయోగించారు. శిక్ష, వ్యాకరణ, నిరుక్త, జ్యోతిష, కల్ప, ఛందస్సు అనే ఆరు వేదాంగములలో ఛందస్సు కూడా ఒకటి. వేదమంత్రముల అమరికను ఛందస్సు తెలుపుతుంది. పద్యపు లక్షణాలను, పద్యం వ్రాయడంలో పాటించవలసిన నియమాలను ఛందస్సు వివరిస్తుంది. తెలుగు పద్యం యొక్క ఛందస్సును నిర్ణయించేవి, 1. పాదముల సంఖ్య, సామాన్యముగా ఈ సంఖ్య నాలుగు; 2. గణముల అమరిక (గణ విభజన); 3. యతి; 4. ప్రాస.

గణములు: ఒక లఘువును ఉచ్చరించు కాలము ఒక మాత్ర, ఒక గురువు లేక రెండు లఘువులను ఉచ్చరించు కాలము రెండు మాత్రలు. గురులఘువుల సమూహమును గణము అంటారు. గురువుకు చిహ్నము U, లఘువుకు చిహ్నము I. మాత్రల సంఖ్యబట్టి మాత్రాగణముల నిర్మాణం జరుగుతుంది. ఒక మాత్రతో ఒక మాత్రాగణము (I), రెండు మాత్రలతో రెండు మాత్రాగణములు (U, II), మూడు మాత్రలతో మూడు మాత్రాగణములు (UI, IU, III), నాలుగు మాత్రలతో ఐదు మాత్రాగణాములు (UU, UII, IUI, IIU, IIII), ఐదు మాత్రలతో ఎనిమిది మాత్రాగణములు (IUU, UIU, UUI, IIIU, UIII, IUII, IIUI, IIIII) ఏర్పడతాయి.

మనము ఇప్పుడు ఛందస్సులో వాడే గణములు ఒకటినుండి మూడు అక్షరముల వరకు పరిమితము. అవి – ల (I), గ (U), వ లేక లగ (IU), హ లేక గల (UI), లల లేక లా (II), గగ లేక గా (UU), య (IUU), మ (UUU), త(UUI), ర(UIU), జ(IUI), భ (UII), న(III), స(III). ఇవి కాక తెలుగు దేశి ఛందస్సులో సూర్య, ఇంద్ర, చంద్ర అనే ఉపగణములున్నాయి. న-గణము (III), హ-గణము (UI) సూర్యగణములు. నల (IIII), నగ (IIIU), సల (IIUI), భ (UII), ర (UIU), త (UUI) గణములు ఇంద్రగణములు.

ప్రాస: ప్రతి పాదంలోని రెండవ అక్షరానికి ప్రాస అని పేరు. మొదటి పాదంలోని ప్రాసాక్షరమే మిగిలిన పాదాలలో కూడా రావాలి. ప్రాసాక్షరములో ఏ అచ్చు అక్షరమైనా ఉండవచ్చును. ఈ సమాన అక్షరాన్ని నిర్ణయించడానికి చాలా నియమాలు ఉన్నాయి. అంత్య ప్రాస నియమము కొన్ని పద్యాలలో చెప్పబడింది. ప్రాస పూర్వాక్షరానికి కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

యతి: ప్రతి పాదములో మొదటి అక్షరమునకు, అదే పాదములో వేరొక అక్షరమునకో లేక అక్షరములకో ఉండే సామ్యతను యతి అంటారు. సంస్కృతములో యతి పదవిచ్ఛేదనము మాత్రమే, కాని తెలుగులో యతి లేక వడికి ముఖ్య గుణము అక్షరసామ్యత. అక్షరముల ప్రత్యేకతను బట్టి యతి నియమము ఉంటుంది, అందువలన తెలుగు ఛందస్సులో ఎన్నో విధములైన యతులు ఉన్నాయి.

ఛందం© – తెలుగు ఛందస్సు సాఫ్ట్‌వేర్

పద్యం అనేది సృజనాత్మకమైన ఒక సాహిత్య ప్రక్రియ. ఈ శతాబ్దానికి పూర్వం వరకు పద్యరచన తెలుగులోని ప్రముఖ సాహిత్య ప్రక్రియ. ఛందో నియమాలపై పట్టే పద్యరచనలోని పెద్ద సవాలు. పద్యం వ్రాస్తున్నప్పుడు ఏ ఛందస్సులో వ్రాస్తున్నామో ఆ ఛందస్సు లక్షణాలు సరిచూసుకోవాలి. ఛందో నియమాల ధారణ, నిరంతర అధ్యయనం, అభ్యాసం – వీటివల్ల కవులు పద్యరచనలోని సవాళ్లను విజయవంతముగా ఎదుర్కొన్నారు. తెలుగులో మన పూర్వ కవులు అందించిన అనంతమైన పద్య సాహిత్యం ప్రస్తుతం పుస్తక రూపంలోనే మనకు దొరుకుతోంది. ఎంత జాగ్రత్త పడినా అప్పుడప్పుడు కొన్ని తప్పులు దొర్లటం సహజమే. ఈ దోషాలు కొన్ని కవులు చేసినవి, మరి కొన్ని ముద్రాపకులవి. ఇప్పుడిప్పుడే ఈ పుస్తకాలన్నీ డిజిటైజ్ చేయబడుతున్నాయి. డిజిటైజేషన్లో ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కొని అక్షర దోషాలు ఎక్కడెక్కడ ఉన్నాయో, తప్పులు ఎక్కడెక్కడ ఉన్నయో అని చెప్పగల ఒక సాంకేతిక సాధనం అచ్చుపుస్తకాలలో ఉన్న దోషాలను సవరించటానికి అవసరం అవుతుంది. ఆ లోటును ఛందం సాఫ్ట్‌వేర్ చక్కగా పూరించగలదు.

ఈ ఆన్‌లైన్ సాఫ్ట్‌వేర్ తెలుగు యునీకోడ్ చూడగలిగిన అన్ని బ్రౌజర్లపైనా ఇది పనిచేస్తుంది. దీనిని ప్రత్యేకముగా ఇన్‌స్టాల్ చేసుకోనవసరం లేదు. ఒక పద్యాన్ని కేవలం అర సెకను లోపులో గణించవచ్చును. అంటే ఒక నిమిషం లోపులోనే ఒక శతకాన్ని గణించగలరన్న మాట.

ఛందం© ఏమేమి చేయగలదు?

  • కొత్త పద్యాలు రాసేవాళ్ళు దీని ఒక editorగా ఉపయోగించుకోవచ్చు.
  • తెలియని పద్యాలు ఏ ఛందస్సుకు చెందినవో కనిపెట్టవచ్చు.
  • పద్యం చెప్పిన ఛందస్సుకు చెందినదో లేదో చెప్పవచ్చు.
  • కొత్త ఛందస్సులు రూపొందించుకోవచ్చు.
  • ప్రచురణకర్తలు ఒక proofreaderలా ఉపయోగించుకోవచ్చు. (ఉదా: శ్రీ ఊలపల్లి సాంబశివరావుగారు డిజిటైజ్ చేసిన తెలుగు భాగవతము లోని 9000 పైగా గల పద్యాలలోని అక్షర దోషాలను పసిగట్టడంలో ప్రధాన పాత్ర ఛందం© పోషించింది.)
  • ఆసక్తి ఉన్నవాళ్లు సైట్లోని ఛందోరాజం, ఛందోరత్నావళి పుస్తకాల ద్వారా ఛందస్సును నేర్చుకోవచ్చు.

ఎన్ని ఛందస్సులు?

ఛందస్సులు అనంతం. ప్రస్తుతం ఈ పరికరముతో 343 తెలుగు ఛందస్సులను గణించుకోవచ్చు. ఇవి కోవెల సంపత్కుమారాచార్యుల సంపాదకత్వములో వెలువడిన ఛందఃకోశము నుండి గ్రహింపబడినవి. అన్ని సమవృత్తాలను గణించుకోవచ్చు. ఈ 343 మాత్రమే కాక కొత్త ఛందస్సులను రూపొందించుకొని గణించుకోవచ్చు.. అంటే ఏవిధమైన పద్య ఛందస్సును అయినా గణించవచ్చన్న మాట.

సంస్కృత , తెలుగు ఛందస్సుల నియమాలు ఒకటే అయినా వాటి గణన ప్రక్రియ కొంత విభిన్నం, అందువల్ల ప్రస్తుతానికి సంస్కృత ఛందస్సులను గుర్తించలేదు. కానీ ఇవే ఛందో నియమాలతో తెలుగులో వ్రాసిన పద్యాలను గణించగలదు. 1300 కు పైగా గల సంస్కృత ఛందస్సుల నియమాలు కూడా ఛందంలో ఉన్నాయి. ఛందం©ను అన్ని రకాల ఛందోనియమాలను పరిగణలోకి తీసుకొని నిర్మించడం జరిగింది. 11,000 పద్యాలు సరిచూడబడ్డాయి.

ఛందం© – ఒక ఉదాహరణ

దెప్పర మగు కాలముచే
నెప్పుడు దేవతల కెల్ల నష్టం బగు నీ
యొప్పిదముఁ గృష్ణుఁ డరిగినఁ
దప్పెఁ గదా! తల్లి! నీవు తల్లడపడఁగన్
— పోతన భాగవతము (1.397)


ఛందం© – ఒక ఉదాహరణ

ఈ పద్యాన్ని ఛందంతో గణించినపుడు వచ్చిన ఫలితం పక్క చిత్రంలో చూడగలరు.

(ఇక్కడ రెండవ పాదం లో ‘నె’ కు ‘న’కు యతి మైత్రి కుదరదు అని ఛందం© చెప్తున్నది. టైపింగు తప్పిదమేమో? తెలుగు సాహిత్య అకాడమీ వారి ప్రచురణలో పాఠ్యం అలానే ఉంది. ఇది మరొక ప్రత్యేక యతి కూడా కాదు. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ప్రచురణ చూడగా నష్టం అనేది సరైన పాఠ్యం కాదని, నిష్టం అనేది సరైన పాఠ్యం అని తేలింది. ఛందం ఉపయోగానికి ఇది ఒక ఉదాహరణ.)

కేవలం ఛందోగణనమే కాకుండా యతి, ప్రాసలు సరిచూడడం, ఛందస్సుల లక్షణాల శోధన వంటి మరికొన్ని ఛందస్సుకు పనికి వచ్చే పనిముట్లను కూడా ఈ సాఫ్ట్‌వేర్ అందిస్తుంది. సమీప భవిష్యత్తులో ఈ సాఫ్ట్‌వేర్‌ను మరింత అభివృద్ధి చేసే పని సాగుతున్నది. ముఖ్యంగా:

  • శతకాలను, కావ్యాలను సరిచూసుకొనేలా (bulk computing కోసం) ఒక అప్లికెషన్ సిద్ధంగా ఉంది. దానిని మరింత అభివృధ్ధి చేసి అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నం.
  • 1300 లకు పైగా గల సంస్కృత ఛందస్సులను కూడా గణించే సదుపాయం.
  • ముద్రించుకొనేందుకు, ఇతరులతో పంచుకొనేందుకు వీలుగానూ ఉండగల ఛందోగణన దస్త్రంను అందుబాటు లోకి తేవడం. ఉదాహరణ: [దస్త్రం-1] | [దస్త్రం-2]
  • బంధ,చిత్రకవిత్వ పద్యాలను కూడా గుర్తించే దిశగా కృషి చేయడం.

అభిమతం

ఏ సాంకేతిక సాధనం లేదా యంత్రం, మానవ విచక్షణకు ఏమాత్రం సాటిరావు అన్నది నగ్నసత్యం. ఇవి కొన్ని పరిథులకు లోబడి మనకు సహాయకారిగా ఉంటాయి. పద్య రచననను చేయడానికి భాషపై పట్టు సాధించడంతో పాటుగా, ఛందో నియమాల ధారణ, అధ్యయన, అభ్యాసనాలు కొంతవరకూ చేయవలసిందే. పద్య రచనలో సాంకేతిక సాధనాలను ఉపయోగించడం అనేది సాంప్రదాయవాదులు మొదటి పరిచయంలోనే అంత హర్షించక పోవచ్చు కానీ తెలుగుకు మాత్రమే గల ప్రత్యేక సాహిత్య ప్రక్రియను తరువాతి తరానికి అందించడానికి సాంకేతిక సాధనాల అవసరాన్ని గుర్తించాల్సి ఉంది. అటువంటి ఈ సాంకేతిక సాధనం ఛందం©ను పద్యరచనలో పాండిత్యం గలవారు ఉపయోగించి, దీని అభివృద్ధిలో పాలు పంచుకోవాలన్నది నిర్మాతగా నా అభిమతం.

మీరు పద్య రచయితలు, పత్రికారంగానికి చెందినవారు, సాహిత్యాభిమానులు, ప్రచురణకర్తలు అయితే మీకు ఈ సాధనం తప్పక ఉపకరిస్తుందని ఆశిస్తాను. ఛందం© గురించి పది మందికి మీబ్లాగు ద్వారానో , మరోలానో పదిమందికీ తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈ సాఫ్ట్‌వేర్ ఎలా వాడుకోవాలో వివరంగా తెలిపే పరిచయ-సహాయపత్రం మీకోసంగా పొందుపరిచాను.

– మిరియాల దిలీప్.
(m.dileep@gmail.com)

(బ్లాగు, వెబ్‌సైట్, ఫేస్బుక్, గూగుల్: Dileep Miriyala or దిలీపు మిరియాల.)

[నా దగ్గర లేని ఎన్నో ఉదాహరణలను సేకరించి, ప్రతీ పద్య లక్షణాలను వ్యక్తిగతంగా సరిచూసి, చిన్న చిన్న అక్షర దోషాలను కూడ సవరించి ఇచ్చినందుకు శ్రీ కె. నాగ భూషణరావుగారికి (ఆంధ్రభారతి); ఈ వ్యాసరచనలో నాకు సహాయము, సలహాలను ఇచ్చిన శ్రీ జెజ్జాల కృష్ణమోహన రావుగారికి; 50కి పైగా తెలుగు యునీకోడ్ ఫాంటులను తయారు చేసి, అనేక తెలుగు సంబంధ సాంకేతిక పరికరాల నిర్మాణంలో నాకు ప్రేరణను, సలహాలను ఇచ్చిన శ్రీ దర్భా అంబరీషగారికి; శ్రీ మల్లిన నరసింహరావు, శ్రీ రాకేశ్వర్, శ్రీ మురళీ కోరిమిల్లి, ఫణి ప్రదీపు, సందీపు మరియూ నా శ్రీమతి అనురాధ, ఇంకా నన్ను ప్రోత్సహించిన ఎందరికో నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు.]