స్వప్నలోకచిత్రకారుడు మచాడో

ఆంటోనియో మచాడో (Antonio Machado, 1875-1939) గురించి నేను మొదటిసారి విన్నది చెస్వాఫ్ మీవోష్ (Czeslaw Milosz) దగ్గర. ప్రసిద్ధ పోలిష్ కవి, నోబెల్‌ బహుమతి గ్రహీత మీవోష్ తనకి చాలా ఇష్టమైన కవుల కవితలు కొన్నింటిని, ఎ బుక్‌ ఆఫ్‌ లూమినస్‌ థింగ్స్‌ (1998) పేరిట సంకలనం చేశాడు. అందులో ప్రతి కవితకీ నాలుగైదు పరిచయవాక్యాలు రాశాడు. ఆ కవీ, ఆ కవితా ఎందుకిష్టమో మనతో పంచుకున్నాడు. అలా పరిచయం చేసిన వాటిలో మచాడో కవితలు కూడా ఉన్నాయి. అందులో ఒకచోట మచాడో గురించి రాస్తూ అతడు స్పానిష్‌ కవులందరిలోనూ మరీ చైనా తరహా కవి అని విలిస్‌ బార్న్‌స్టన్‌ (Willis Barnstone) అన్నాడని రాశాడు. ఆ వాక్యం నన్నొక అయస్కాంతం లాగా పట్టుకు లాగింది. అసలే నేను ప్రాచీన చీనాకవిత్వ ఆరాధకుల్లో ముందు వరసలో ఉండేవాణ్ణి. అనుభవాన్ని అక్షరీకరించడమనే రహస్యవిద్యను పట్టుకోవడానికి గత పాతికేళ్ళుగా ప్రాచీన చీనాకవుల శుశ్రూష చేస్తున్నవాణ్ణి. అటువంటిది ఒక స్పానిష్‌ కవి చీనా కవుల్లాగా కవిత్వం చెప్పాడని తెలియగానే ఉండబట్టలేకపోయాను. మచాడో కవిత్వానికి బార్న్‌స్టన్‌ చేసిన అనువాదం బోర్డర్‌ ఆఫ్‌ ఎ డ్రీమ్‌ (2004) తెప్పించుకుని చదివినదాకా నాకు నిద్రపట్టలేదు.

పుస్తకం చేతుల్లోకి రాగానే ఆతృతతో పేజీలు తిప్పుతూ చదివిన మొదటి కవిత తోనే మచాడో నన్ను పూర్తిగా లొంగదీసుకున్నాడు. ఆ కవిత, ముఖచిత్రం (Self portrait, 1906), కవి జీవితచిత్రమే:

నా బాల్యకాల జ్ఞాపకాలు, సెవీల్‌లో మా ఇంటిపెరడు,
పక్వాని కొస్తున్న నిమ్మపళ్ళతో మెరిసే పండ్లతోట.
కాస్టీల్ నేలమీద నడిచిన ఇరవయ్యేళ్ళు యవ్వనం, ఇక
నా జీవితం: మర్చిపోవాలనుకునే కొన్ని సంఘటనలు.

నేను డాన్‌ వాన్‌ని కాను, కలల రాకుమారుణ్ణీ
కాదని నా వేషం చూస్తేనే తెలుస్తుంది మీకు, సుమ
శరాలగాయాలు సహించినవాణ్ణే, స్త్రీలు ఎంతగా
చేయందిస్తే అంతగా ప్రేమలో కూరుకుపోయాను

నా రక్తనాళాల్ల్లో ఫ్రెంచివిప్లవాభిమానం, అయినా
నా కవిత్వం పుట్టేదొక ప్రశాంతమైన ఊటనీట
స్వధర్మం తెలిసిన సాహసిని, సత్యసంధుణ్ణి
అంతకన్నా సజ్జనుణ్ణి అనుకోవడమే నాకిష్టం

ఆధునికయుగోద్వేగమే నా సౌందర్యదృక్పథం
కాని పూర్వకవులనుండి కొన్ని గులాబీలు
సంగ్రహించకపోలేదు. అలాగని కొత్తముసుగులో
పాతపాటలు పాడను, పూతమెరుగులు మెచ్చను

అట్టహాసపు వీరగాథాగేయాల్లో బోలుతనం నాకు
నచ్చదు. వెన్నెట్లో కీచురాళ్ళ కూతల్లాంటివవి
ప్రతిధ్వనుల్ని తప్పించి ధ్వనికి చెవొగ్గుతాను
కంఠాలెన్నైనా నేను వినేదొకే ఒక్క స్వరం

నేను భావకవినా? ప్రబంధకవినా? తెలియదు.
నేను నా పద్యాన్నిక్కడ వదిలివెళ్ళినప్పుడు
తళతళలాడే దాని కత్తివాదర గుర్తుండాలి,
కాల్చిసానబెట్టిన కమ్మరికొలిమి కాదు.

నన్ను సదావెన్నంటే నేస్తంతో నా సంభాషణ
తనతో తాను మాట్లాడుకునే వాడొకనాటికి
దేవుడితో మాట్లాడకపోడు. నా స్వగతాలే
మనుషుల పట్ల నాలో ప్రేమ రగిలించాయి.

కష్టిస్తాను, నా ఖర్చులు నేనే చెల్లించుకుంటాను
ఇంటి అద్దె, దుస్తులు, శయ్య, రొట్టె సమస్తం.
చివరికి మీ ఋణమేదీ మిగుల్చుకోను, పైగా
నేను రాసిందానికి మీరే నాకు బాకీ పడతారు

నా అంతిమ ప్రయాణ తరుణం సమీపించాక
తిరిగిరాని తీరానికి లంగరెత్తేవేళ, పడవలో
నాదంటూ ఏదీ ఉండదు, సూర్యుడి కింద
సాగరతీరశిశువుల్లాగా దిసమొల తప్ప.

మచాడో అరుదైన స్పానిష్‌ కవి మాత్రమే కాదు, ప్రపంచకవి కూడా. ఆయన స్పానిష్‌ సాహిత్యంలో ’98 తరానికి చెందిన కవి. 1898లో అమెరికా చేతిలో స్పెయిన్‌ ఓడిపోయినప్పుడు పుట్టిన తరమది. వాళ్ళు తమ పరాజితస్వదేశం తిరిగి గర్వంగా తలెత్తుకోవాలని తపించారు. అలాగని మచాడో రాసింది దేశభక్తి కవిత్వం కాదు. అతడు తన దేశాన్ని తన దేశపు గ్రామాల్లో, పొలాల్లో, రైతుల్లో, ఋతువుల్లో దర్శించడానికి ప్రయత్నించాడు. అలా చూడటంలో అతడు రంగుల్ని చూశాడు. రాగాలు విన్నాడు. అవి స్పష్టంగా స్పెయిన్‌ రంగులు. కాని అతడు చూసిన స్పెయిన్‌ ఎంత స్ధానికమో, అంత విశ్వజనీనం. అందుకనే అతడు చూసిన, చూపించిన దృశ్యాల్లో నాకు నా బాల్యం, నా స్వగ్రామం, నా స్వదేశం కనిపించడంలో ఆశ్చర్యం లేదు. మచాడో కవితలు రాయడు, చిత్రిస్తాడు. బహుశా ఈ కళలో అతడితో పోల్చదగ్గ మరొక కవి ప్రపంచసాహిత్యంలో ప్రాచీన చీనా కవి వాంగ్‌ వీ (Wang Wei) మాత్రమే. ఈ మాట నేను అంటున్నది కాదు. వాంగ్‌ వీనీ, మచాడోనీ కూడా ఇంగ్లీషులోకి అనువదించిన బార్న్‌స్టన్‌ ఈ మాట అన్నాడని మీవోష్ రాశాడు. ఇందుకు ఆతడిచ్చిన ఉదాహరణనే (Summer night) నేనూ ఉదాహరిస్తున్నాను.

వేసవి రాత్రి
చాలా అందమైన వేసవి రాత్రి
ఈ పురాతనగ్రామమైదానానికి
మేడలు గవాక్షాలు తెరిచిపెట్టాయి
మనుష్యసంచారం లేని విశాలక్షేత్రం
రాతిబెంచీలు. చెట్లు, పొదలు
తెల్లని ఇసుక మీద సౌష్టవంగా
పరుచుకున్న నల్లనినీడలు.
దిగంతరేఖ మీద చంద్రుడు
గంటస్తంభంలో మెరుస్తున్న
గడియారగోళం
ఈ ప్రాచీనగ్రామసీమలో
ఒక పురాతనమైన నీడలా
నేనొక్కణ్ణే నడయాడుతున్నాను

బయటి దృశ్యాన్ని పట్టుకోవడంలో మచాడో ఒక లాండ్‌స్కేప్‌ చిత్రకారుడి లాగా కనిపిస్తాడు. ఈ గుణం వల్లనే అతడు ప్రాచీన చీనాకవుల్ని తలపిస్తాడు. అయితే అతడు చూసిన దృశ్యం బాహ్యప్రపంచదృశ్యం కాదు. అది ఆంతరంగిక ప్రపంచదృశ్యమే. దానికొక క్రమపద్ధతి ఉంది. బార్న్‌స్టన్‌ దాన్లో మూడు దశలున్నాయంటాడు. మొదటిదశలో కవి తన మనోమయ ప్రపంచానికి చెందిన స్వాప్నిక దృశ్యమొకటి చూస్తాడు. దాన్ని తన ఎదట ఉన్న బయట ప్రపంచపు లాండ్‌ స్కేప్‌ మీద ఆరోపించడం రెండవదశ. అప్పుడు ఆ బయటి దృశ్యంతో తన మానసికస్ధితిని, తన మూడ్‌ని అనుసంధానించడం మూడవదశ.