రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

స్వప్నలోకచిత్రకారుడు మచాడో

రచన: వాడ్రేవు చినవీరభద్రుడు
సెప్టెంబర్ 2013

ఆంటోనియో మచాడో (Antonio Machado, 1875-1939) గురించి నేను మొదటిసారి విన్నది చెస్వాఫ్ మీవోష్ (Czeslaw Milosz) దగ్గర. ప్రసిద్ధ పోలిష్ కవి, నోబెల్‌ బహుమతి గ్రహీత మీవోష్ తనకి చాలా ఇష్టమైన కవుల కవితలు కొన్నింటిని, ఎ బుక్‌ ఆఫ్‌ లూమినస్‌ థింగ్స్‌ (1998) పేరిట సంకలనం చేశాడు. అందులో ప్రతి కవితకీ నాలుగైదు పరిచయవాక్యాలు రాశాడు. ఆ కవీ, ఆ కవితా ఎందుకిష్టమో మనతో పంచుకున్నాడు. అలా పరిచయం చేసిన వాటిలో మచాడో కవితలు కూడా ఉన్నాయి. అందులో ఒకచోట మచాడో గురించి రాస్తూ అతడు స్పానిష్‌ కవులందరిలోనూ మరీ చైనా తరహా కవి అని విలిస్‌ బార్న్‌స్టన్‌ (Willis Barnstone) అన్నాడని రాశాడు. ఆ వాక్యం నన్నొక అయస్కాంతం లాగా పట్టుకు లాగింది. అసలే నేను ప్రాచీన చీనాకవిత్వ ఆరాధకుల్లో ముందు వరసలో ఉండేవాణ్ణి. అనుభవాన్ని అక్షరీకరించడమనే రహస్యవిద్యను పట్టుకోవడానికి గత పాతికేళ్ళుగా ప్రాచీన చీనాకవుల శుశ్రూష చేస్తున్నవాణ్ణి. అటువంటిది ఒక స్పానిష్‌ కవి చీనా కవుల్లాగా కవిత్వం చెప్పాడని తెలియగానే ఉండబట్టలేకపోయాను. మచాడో కవిత్వానికి బార్న్‌స్టన్‌ చేసిన అనువాదం బోర్డర్‌ ఆఫ్‌ ఎ డ్రీమ్‌ (2004) తెప్పించుకుని చదివినదాకా నాకు నిద్రపట్టలేదు.

పుస్తకం చేతుల్లోకి రాగానే ఆతృతతో పేజీలు తిప్పుతూ చదివిన మొదటి కవిత తోనే మచాడో నన్ను పూర్తిగా లొంగదీసుకున్నాడు. ఆ కవిత, ముఖచిత్రం (Self portrait, 1906), కవి జీవితచిత్రమే:

నా బాల్యకాల జ్ఞాపకాలు, సెవీల్‌లో మా ఇంటిపెరడు,
పక్వాని కొస్తున్న నిమ్మపళ్ళతో మెరిసే పండ్లతోట.
కాస్టీల్ నేలమీద నడిచిన ఇరవయ్యేళ్ళు యవ్వనం, ఇక
నా జీవితం: మర్చిపోవాలనుకునే కొన్ని సంఘటనలు.

నేను డాన్‌ వాన్‌ని కాను, కలల రాకుమారుణ్ణీ
కాదని నా వేషం చూస్తేనే తెలుస్తుంది మీకు, సుమ
శరాలగాయాలు సహించినవాణ్ణే, స్త్రీలు ఎంతగా
చేయందిస్తే అంతగా ప్రేమలో కూరుకుపోయాను

నా రక్తనాళాల్ల్లో ఫ్రెంచివిప్లవాభిమానం, అయినా
నా కవిత్వం పుట్టేదొక ప్రశాంతమైన ఊటనీట
స్వధర్మం తెలిసిన సాహసిని, సత్యసంధుణ్ణి
అంతకన్నా సజ్జనుణ్ణి అనుకోవడమే నాకిష్టం

ఆధునికయుగోద్వేగమే నా సౌందర్యదృక్పథం
కాని పూర్వకవులనుండి కొన్ని గులాబీలు
సంగ్రహించకపోలేదు. అలాగని కొత్తముసుగులో
పాతపాటలు పాడను, పూతమెరుగులు మెచ్చను

అట్టహాసపు వీరగాథాగేయాల్లో బోలుతనం నాకు
నచ్చదు. వెన్నెట్లో కీచురాళ్ళ కూతల్లాంటివవి
ప్రతిధ్వనుల్ని తప్పించి ధ్వనికి చెవొగ్గుతాను
కంఠాలెన్నైనా నేను వినేదొకే ఒక్క స్వరం

నేను భావకవినా? ప్రబంధకవినా? తెలియదు.
నేను నా పద్యాన్నిక్కడ వదిలివెళ్ళినప్పుడు
తళతళలాడే దాని కత్తివాదర గుర్తుండాలి,
కాల్చిసానబెట్టిన కమ్మరికొలిమి కాదు.

నన్ను సదావెన్నంటే నేస్తంతో నా సంభాషణ
తనతో తాను మాట్లాడుకునే వాడొకనాటికి
దేవుడితో మాట్లాడకపోడు. నా స్వగతాలే
మనుషుల పట్ల నాలో ప్రేమ రగిలించాయి.

కష్టిస్తాను, నా ఖర్చులు నేనే చెల్లించుకుంటాను
ఇంటి అద్దె, దుస్తులు, శయ్య, రొట్టె సమస్తం.
చివరికి మీ ఋణమేదీ మిగుల్చుకోను, పైగా
నేను రాసిందానికి మీరే నాకు బాకీ పడతారు

నా అంతిమ ప్రయాణ తరుణం సమీపించాక
తిరిగిరాని తీరానికి లంగరెత్తేవేళ, పడవలో
నాదంటూ ఏదీ ఉండదు, సూర్యుడి కింద
సాగరతీరశిశువుల్లాగా దిసమొల తప్ప.

మచాడో అరుదైన స్పానిష్‌ కవి మాత్రమే కాదు, ప్రపంచకవి కూడా. ఆయన స్పానిష్‌ సాహిత్యంలో ’98 తరానికి చెందిన కవి. 1898లో అమెరికా చేతిలో స్పెయిన్‌ ఓడిపోయినప్పుడు పుట్టిన తరమది. వాళ్ళు తమ పరాజితస్వదేశం తిరిగి గర్వంగా తలెత్తుకోవాలని తపించారు. అలాగని మచాడో రాసింది దేశభక్తి కవిత్వం కాదు. అతడు తన దేశాన్ని తన దేశపు గ్రామాల్లో, పొలాల్లో, రైతుల్లో, ఋతువుల్లో దర్శించడానికి ప్రయత్నించాడు. అలా చూడటంలో అతడు రంగుల్ని చూశాడు. రాగాలు విన్నాడు. అవి స్పష్టంగా స్పెయిన్‌ రంగులు. కాని అతడు చూసిన స్పెయిన్‌ ఎంత స్ధానికమో, అంత విశ్వజనీనం. అందుకనే అతడు చూసిన, చూపించిన దృశ్యాల్లో నాకు నా బాల్యం, నా స్వగ్రామం, నా స్వదేశం కనిపించడంలో ఆశ్చర్యం లేదు. మచాడో కవితలు రాయడు, చిత్రిస్తాడు. బహుశా ఈ కళలో అతడితో పోల్చదగ్గ మరొక కవి ప్రపంచసాహిత్యంలో ప్రాచీన చీనా కవి వాంగ్‌ వీ (Wang Wei) మాత్రమే. ఈ మాట నేను అంటున్నది కాదు. వాంగ్‌ వీనీ, మచాడోనీ కూడా ఇంగ్లీషులోకి అనువదించిన బార్న్‌స్టన్‌ ఈ మాట అన్నాడని మీవోష్ రాశాడు. ఇందుకు ఆతడిచ్చిన ఉదాహరణనే (Summer night) నేనూ ఉదాహరిస్తున్నాను.

వేసవి రాత్రి
చాలా అందమైన వేసవి రాత్రి
ఈ పురాతనగ్రామమైదానానికి
మేడలు గవాక్షాలు తెరిచిపెట్టాయి
మనుష్యసంచారం లేని విశాలక్షేత్రం
రాతిబెంచీలు. చెట్లు, పొదలు
తెల్లని ఇసుక మీద సౌష్టవంగా
పరుచుకున్న నల్లనినీడలు.
దిగంతరేఖ మీద చంద్రుడు
గంటస్తంభంలో మెరుస్తున్న
గడియారగోళం
ఈ ప్రాచీనగ్రామసీమలో
ఒక పురాతనమైన నీడలా
నేనొక్కణ్ణే నడయాడుతున్నాను

బయటి దృశ్యాన్ని పట్టుకోవడంలో మచాడో ఒక లాండ్‌స్కేప్‌ చిత్రకారుడి లాగా కనిపిస్తాడు. ఈ గుణం వల్లనే అతడు ప్రాచీన చీనాకవుల్ని తలపిస్తాడు. అయితే అతడు చూసిన దృశ్యం బాహ్యప్రపంచదృశ్యం కాదు. అది ఆంతరంగిక ప్రపంచదృశ్యమే. దానికొక క్రమపద్ధతి ఉంది. బార్న్‌స్టన్‌ దాన్లో మూడు దశలున్నాయంటాడు. మొదటిదశలో కవి తన మనోమయ ప్రపంచానికి చెందిన స్వాప్నిక దృశ్యమొకటి చూస్తాడు. దాన్ని తన ఎదట ఉన్న బయట ప్రపంచపు లాండ్‌ స్కేప్‌ మీద ఆరోపించడం రెండవదశ. అప్పుడు ఆ బయటి దృశ్యంతో తన మానసికస్ధితిని, తన మూడ్‌ని అనుసంధానించడం మూడవదశ.

బయటి ప్రపంచపు ప్రకృతిని మానసిక ప్రకృతితో పోల్చి వర్ణించడం చీనాకవుల సంప్రదాయమని బార్న్‌స్టన్‌ అన్నాడు గానీ, ప్రాచీన సంస్కృత, ప్రాకృత, తమిళకవిత్వాల గురించి తెలిసినవాళ్ళకి అది కొత్తగా అనిపించదు. కానీ, భారతీయకవులు ప్రధానంగా మూడ్‌ని వర్ణించడంతో ఆగకుండా కథ చెప్పడం మీద ఎక్కువ దృష్టి పెట్టారు. తమ వర్ణనలు కూడా కథలో భాగంగా ఉండాలని కోరుకున్నారు. కథతో సంబంధం లేని ఆత్మకథనాత్మక ముక్తకరీతి కవిత్వం మనదేశంలో చాలానే వికసించినప్పటికీ, దాన్ని మనవాళ్ళు ప్రధానస్రవంతి కవిత్వంగా అంగీకరించలేదు. కవిత్వం రసపూరితం కావాలంటే అది కథని ఆశ్రయించకతప్పదనే భారతీయలక్షణవేత్తలు కూడా భావించారు.

కానీ చీనాకవులకి కథతో నిమిత్తం లేదు. కొత్తదనంతో కూడా నిమిత్తం లేదు. అవే అనుభవాలు, అవే అవస్ధలు, అవే భావావేశాలు. వాటినే పునః పునః చిత్రించడంలోనే వాళ్ళకి ఆసక్తి. అలా చిత్రించుకుంటూ పోవడంలోనే కవి తన ఆత్మను కూడా చిత్రించుకుంటూ పోతాడు. ఆ ఆత్మసంతకాన్ని గుర్తుపట్టడమే రసజ్ఞుడి పని. బార్న్‌స్టన్‌ ఇలా రాస్తున్నాడు:

“చీనీయ తావో చిత్రలేఖనంలో లాగా అతడు చిత్రిస్తున్న ప్రకృతి దృశ్యాల్లో తరచూ రచయిత అదృశ్యమై, కేవలం దృశ్యం మాత్రమే మిగిలిపోతుంది. అతను చిత్రిస్తున్న ప్రకృతిక్షేత్రంలోని సజీవ అస్తిత్వాలు — కపిలగోవు, పొలం దున్నుతున్న కారెద్దులు, వాటి వెనుక ముడుతలు పడ్డ నుదుటితో నడుస్తున్న రైతు, ఇంద్రధనుసు లాగా సాగే పక్షుల బారులు, చర్చి గంటస్తంభం మీద వాలి ఆకాశాన్ని ధ్యానించే కొంగ — ఇవన్నీ కూడా ఆ నిశ్చల ప్రకృతిదృశ్యంలో భాగంగా అమరిపోతాయి. అయినప్పటికీ ఆ దృశ్యం వెనుక ఆ కవి మనని చేయి పట్టుకుని నడిపిస్తుంటాడు. మనతో పాటే విప్పారిన నేత్రాలతో నడుస్తుంటాడు. అతడి కళ్ళల్లో నది ఒడ్డున పోప్లార్ల జ్ఞాపకాలు పునరుజ్జీవనం కోసం ఎదురుచూస్తున్న హేమంతకాలపు వెలమచెట్లూ, అక్కడ ఆ ఎస్పినో కొండమీద మరణాసన్నురాలైన తన భార్య కనిపిస్తూనే ఉంటారు. లేదా ఒక పురాతన స్పానిష్‌ గ్రామంలో అర్ధరాత్రి మల్లెపూల పరిమళాల మధ్య దిగంతరేఖ మీద చంద్రుడు ఉదయిస్తుండగా ఏకాకి గంటస్తంభం తోడుగా మట్టిబాటన నడుస్తుండే అతడి ఒంటరితనం మనకి ఆ కవితల్లో కనిపిస్తూంటుంది. అతడు తిరుగుతున్న పొలాలమ్మట మనం కూడా గుడ్డిగా కళ్ళు పెద్దవి చేసుకుని అతడు చూపిస్తున్న దృశ్యాలన్నీ చూడటం మొదలుపెట్టగానే ఆ కవితో పాటు, మనం కూడా అదృశ్యమైపోతాం.”


ఆంటోనియా మచాడో అండలూసియా ముఖ్యపట్టణమైన సెవీల్‌లో (Seville) 1875లో పుట్టాడు. అతడి తండ్రి ఆంటోనియా మచాడో ఆల్వారెజ్‌ జానపద విజ్ఞానంలో సుప్రసిద్ధ పండితుడు. మచాడోకు ఎనిమిదేళ్ళ వయస్సు వచ్చేటప్పటికి కుటుంబం మాడ్రిడ్‌కి (Madrid) మకాం మార్చింది. కాని తొలిబాల్యం నాటి ఆ అండలూసియా జ్ఞాపకాలు మచాడో మీద చెరగని ముద్ర వేశాయి. అతడి తొలి కవితా సంకలనం ‘సాలిట్యూడ్స్‌’ (Solitudes, 1903) పసితనపు రంగుల్నీ, రుచుల్నీ, సుగంధాల్నీ పట్టుకునే ప్రయత్నం చేసింది. దాన్ని 1907లో మరింత విస్తరించి ప్రచురించాడు. అప్పటి కవితల మీద వెర్లేన్‌ (Paul Verlain), హైన్‌రిచ్ హైనల (Heinrich Heine) ప్రభావంతో పాటు, మరొక స్పానిష్‌ కవి బెకర్‌ (Gustavo Becquer) ప్రభావం కూడా సుస్పష్టంగా ఉంది. బాదిలేర్ (Charles Bodelaire) గురించీ, విట్మన్‌ (Walt Whitman) గురించీ కూడా అతడికప్పటికే తెలుసు.

మచాడోని స్పానిష్‌లో 98వ తరానికి చెందిన కవిగా గుర్తిస్తున్నప్పటికీ అతడు చిత్రించిన స్పెయిన్‌ దేశభక్తి పూరితమైన స్పెయిన్‌ కాదు. తక్కిన కవులు రాజకీయంగా బలపడ వలసిన స్పెయిన్‌ గురించి ఆలోచిస్తుంటే, మచాడో స్పెయిన్‌ దేశపు మట్టి, రంగులు, పూలు, మనుషుల గురించీ ఆలోచిస్తూ ఉన్నాడు. ఆ కాలం నాటి కవితల్లో అతడి చిన్ననాటి జ్ఞాపకాలు ప్రధాన వస్తువు. చిన్ననాటి జ్ఞాపకం (Memory from Childhood) అని రాసిన ఈ కవిత చూడండి:

విసుగ్గా, వణికిస్తున్న శీతాకాలపు
మధ్యాహ్నం. బళ్ళో పిల్లలు
చదువుకుంటున్న దృశ్యం. కిటికీ
అద్దం మీద వాన చప్పుడు

తరగతి గది. బొమ్మల కార్డు మీద
ఒక పురాణ కథ
ఒకరినొకరు హతమార్చుకున్న
అన్నదమ్ముల బొమ్మ

బోలుగొంతుతో ఉరుముతున్న
ఉపాధ్యాయుడు, మాసిన దుస్తులు
అలసిపోయిన మనిషి, బక్కపలచని
దేహం, చేతిలో పుస్తకం

పిల్లలంతా ఎలుగెత్తి పాఠం
వల్లెవేయడం మొదలెట్టారు
‘ఏడేళ్ళు నలభైతొమ్మిది
ఏడెనిమిదిలు యాభయ్యారు’

విసుగ్గా, వణికిస్తున్న శీతాకాలపు
మధ్యాహ్నం. బళ్ళోపిల్లలు
చదువుకుంటున్న దృశ్యం. కిటికీ
అద్దం మీద వాన చప్పుడు

అతడి చిన్నప్పటి జ్ఞాపకాల్లో నదులూ, పోప్లార్‌ చెట్లూ, పువ్వులూ, కొండలూ పదేపదే ప్రత్యక్షమవుతాయి. అతడి కుటుంబం మాడ్రిడ్‌కి వచ్చేసినప్పటికీ ఆ చిన్నప్పటి అండలూసియా పట్టణంలో గడచిన అతడి పసితనం అక్కడి తోటలూ, నీటి ఊటలూ, తెల్లటి గోడలు, చర్చి శిథిలాలూ, సైప్రెస్‌ చెట్లూ, ఆ నిర్జననగరమధ్యాలూ కనిపిస్తూనే ఉంటాయి. తన చిన్నప్పటి ఇంట్లో గడుస్తున్న జీవితంలోకి కవిత్వం ప్రవేశించిన సందర్భాన్ని అతడెంతో సున్నితంగా కవితగా (A young face one day appears) మలిచాడు:

ఒకనాడొక యువతిముఖం
మా ఇంటిముందు కనిపించింది
నువ్వెందుకీ పాతయింటికి
తిరిగొచ్చావని అడిగానామెని.
అప్పుడామె ఒక కిటికీ తెరిచింది
పొలాలన్నిటిమీదా వెలుగు,
ఒక సుగంధం
ఇంట్లోకి ప్రవహించింది
తెల్లటిబాటపక్క
నలుపెక్కుతున్న తరుకాండాలు
శాఖాగ్రాన సుదూరస్వప్నాల్లోకి
తేలుతున్న ఆకుపచ్చపొగ
ప్రత్యూషపు తెల్లటిపొగమంచులో
విశాలమైననదిని తలపిస్తున్న
చెరువు, పాలిపోయిన కొండలమీద
మరొక పురాతన మృగతృష్ణ.


ఈ రోజుల్లోనే రాసిన ఒక కవిత నిన్నరాత్రి నిద్రపోతున్నప్పుడు (Last night as I was sleeping) చాల సుప్రసిద్ధం. దీనికి రాబర్ట్‌ బ్లై (Robert Bly) చేసిన ఇంగ్లీషు అనువాదానికి తెలుగు చూడండి:

నిన్నరాత్రి నిద్రపోతున్నప్పుడు
నేనో కలగన్నాను ‘ఎంత దివ్యమైన కల’
నా హృదయంలోకి నేరుగా
ఒక ఊటనీరు ప్రవహించింది.
జలాల్లారా, చెప్పండి,
నేనింతదాకా చవిచూడని
నవవసంతాన్ని వెంటబెట్టుకుని
ఏ రహస్యమార్గం ద్వారా
మీరు నాలో ప్రవహించారు?

నిన్నరాత్రి నిద్రపోతున్నప్పుడు
నేనో కలగన్నాను ‘ఎంత దివ్యమైన కల’
నా హృదయంలో ఒక తేనెపట్టు.
నా పాతజీవితపు చేదు విషాలనుంచి
బంగారు తేనెటీగలు
తెల్లనితునకల చుట్టూ
తియ్యని మధువు కూడబెడుతున్నాయి.

నిన్నరాత్రి నిద్రపోతున్నప్పుడు
నేనో కలగన్నాను ‘ఎంత దివ్యమైన కల’
నా హృదయంలో ఒక జ్వాలామయసూర్యగోళం
రగులుతున్నది.
ఎరట్రి అగ్నిగుండం నుంచి
వేడిగాలులు వెదజల్లుతున్నది.
ఎవరు చూసినా వెక్కివెక్కి ఏడ్చేస్తారు.

నిన్నరాత్రి నిద్రపోతున్నప్పుడు
నేనో కలగన్నాను ‘ఎంత దివ్యమైన కల’
నా హృదయంలో నేను
భగవంతుణ్ని పొదివిపట్టుకున్నాను.

మచాడో మొదటి కవితలంతటా ప్రకృతి తాజాగా కొత్త రంగులతో, నవసుగంధాలతో కనిపిస్తుంది. మచాడోని మన హృదయాలకు సన్నిహితంగా తీసుకొచ్చేవి ఈ కవితలే. మాడ్రిడ్‌ లోనే మచాడో కవిగా ఎదిగినప్పటికీ అతడి కవితల్లో మాడ్రిడ్‌ కనిపించదు. ఇందుకు కారణం అతడు బాదిలేర్‌ లాగా నగరకవి కాదు. ప్రకృతీ, పట్టణమూ ఒక్కటిగానే దర్శనమిచ్చే సెవీల్ లోనే అతడి హృదయం లగ్నమైపోయింది. అటువంటి కవితలు చూడండి:

ఒక మబ్బుపింజ, ఒక ఇంద్రధనుసు (A Torn cloud and a rainbow)

ఒక మబ్బుపింజ, ఒక ఇంద్రధనుసు
ఆకాశంలో తళుకుమంటున్నాయి
పంటపొలాలచుట్టూ
ఎండావానా గుడికట్టాయి
ఒక్కసారి మెలకువ వచ్చేసింది. నా కలల
ఇంద్రజాల స్ఫటికరాగాల్నెవరు
కలగాపులగం చేస్తున్నారు?
నా గుండె కొట్టుకుంటోంది,
నాకేదో దిగ్భ్రమ.
పూతపట్టిన నిమ్మపొద,
తోటలో సైప్రస్‌లు, గరికపచ్చ మైదానం
సూర్యుడు, నీళ్ళు, ఇంద్రచాపం
నీ కేశరాశిలో నీటిబిందువులు
ఇవన్నీ గాలిలో సబ్బుబుడగ లాగా
నా స్మృతిలో చెదిరిపోయాయి.


నేల నగ్నంగా వుంది (Naked is the earth)

నేల నగ్నంగా ఉంది
ఆకలిగొన్న ఆడతోడేల్లాగా ఆత్మ
శూన్యదిగంతం వైపు అరుస్తోంది
ఈ సూర్యాస్తమయంలో,కవీ,
నువ్వేం వెతుకుతున్నావు?
బాధిస్తున్న నడక, గుండెమీద
బరువుగా పరుచుకున్న బాట,
గడ్డకట్టిన గాలి, చిక్కనవుతున్న చీకటి
చేదెక్కుతున్న దూరం, తెల్లటిబాట మీద
నలుపెక్కుతున్న చిక్కటి చెట్లు
దూరపర్వతశ్రేణి మీద బంగారం,
రక్తం. సూర్యుడు మరణించాడు,
ఈ సూర్యాస్తమయంలో, కవీ
నువ్వేం వెతుకుతున్నావు?


తన ఎదుట ఉన్న ప్రకృతి దృశ్యంలో తన బాల్యాన్ని చూడటానికి ప్రయత్నించడంలో మచాడో నాకెంతో సన్నిహితుడుగా కనిపిస్తాడు. ఈ విషయంలో మచాడోకీ, నాకూ చాలా దగ్గర పోలిక ఉంది. అతడిలానే నేను కూడా ఎనిమిది తొమ్మిదేళ్ళ వయస్సులోనే నా స్వగ్రామాన్ని వదలి దూరంగా వెళ్ళిపోవలసి వచ్చింది. కానీ నా తదనంతర జీవితమంతా నేనెక్కడకు వెళ్ళినా, నా చిన్ననాటి ఊరు, అక్కడి వెలుతురునీ పోల్చుకోవడానికే ప్రయత్నిస్తూ వచ్చాను. చిన్నప్పుడు తనకేమీ తెలియని వయసులో తన నిర్మలమైన హృదయం మీద పడ్డ వెలుతురు ముద్రల్ని తన తదనంతర జీవితమంతటా తిరిగి అన్వేషించడానికి ప్రయత్నించడంలోనే అతడు కవిగా మారాడని మనం గుర్తు పట్టవచ్చు. ఈ కవిత చూడండి:

లారెల్‌ చెట్టుకింద (Below the laurel tree)

లారెల్‌ చెట్టు కింద వానకు తడిసిన
ఆకుపచ్చని రాతిబెంచి
దుమ్ముపడ్డ పూలతీగనీ
తెల్లగోడనీ కడిగేసింది వాన
హేమంతవేళ పచ్చికతో
ఆడుకుంటున్నదొక మందపవనం
పోప్లార్లు గాలితో
కబుర్లాడుతున్నాయి, నికుంజంలో
అపరాహ్ణమారుతం
దిగంతాన్ని వైభవోపేతం చేస్తూ
సూర్యుడు ద్రాక్షతీగలపాదుల్లో
కాంతినింపుతున్నాడు, మేడమీద
సంపన్నుడొకడు పైపు వెలిగించాడు
చిమ్ముతున్న పొగ
నా చిన్నప్పటి పాటలు గుర్తొస్తున్నాయి
ఏమైంది నా హృదయానికి?
మెత్తనినీడలు బంగారుచెట్ల మధ్య
తప్పించుకుపోతున్నాయా?


తన రెండవ సంకలనం ది ఫీల్డ్స్‌ ఆఫ్‌ కాస్టీల్ లో (Fields of Castile, 1907 – 1917) కవి తనకు దొరికిన రంగుల దారాలతో మరింత సుందరమైన దృశ్యాన్ని అల్లుకోవడం కనిపిస్తుంది. కాని ఈ మధ్యకాలంలోనే అతడి జీవితంలో అత్యంత ప్రధానమైన సంఘటన సంభవించింది. అతడు 1907లో సోరియా (Soria) పట్టణంలో ఉపాధ్యాయుడుగా ఉద్యోగజీవితం ప్రారంభించినప్పుడు లెయొనార్‌ అనే పధ్నాలుగేళ్ళ యువతితో ప్రేమలో పడ్డాడు. ఆ ప్రేమ ఆ యువతి పట్ల ప్రేమగా మాత్రమే కాక, కాస్టీల్ నేల పట్ల ప్రేమగా కూడా వికసించింది. అతడు రెండేళ్ళ తరువాత ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు కానీ ఆ ఆనందం ఎంతోకాలం నిలవలేదు. 1912లో లెయొనార్‌ ఆకస్మికంగా మరణించింది. అదే సంవత్సరం అతడు ఉత్తర అండలూసియా లోని బాయేసాకు (Baeza) వెళ్ళిపోయినప్పటికీ అతడి జీవితమంతా లెయొనార్‌, కాస్టీల్‌ల జ్ఞాపకం బరువైన జ్ఞాపకంగా మిగిలిపోయింది. పూర్వకాలపు సంతోషం స్థానంలో ఇప్పుడు దుఃఖం, వదల్లేని జ్ఞాపకాలు, ఏకాంతజీవితపు విషాదం కనిపించడం మొదలుపెట్టాయి. కాస్టీల్ క్షేత్రాల గురించి అతడు రాసిన కవితలన్నిటిలోనూ ఈ దుఃఖం అంతర్లీనంగా ప్రవహిస్తూనే ఉంటుంది. కొన్ని కవితలు చూడండి:

చైత్రమాసపు వేలజలాలు (The thousand waters of April)

చైత్రమాసపు వేలజలాలు
కేరింతలు కొడుతున్న గాలి
మేఘాలకూ, మేఘాలకూ మధ్య
ఊదారంగు ఆకాశం

నీళ్ళు, సూర్యరశ్మి. ఇంద్రచాపం
మెరుపు. దూరంగా
ఒక మబ్బు మీద పసుపురంగు
విద్యున్మాల

కిటికీ మీద వానవేళ్ళ చప్పుడు
అద్దాల ప్రతిధ్వని

సన్నగా వానజల్లు అల్లిక
కప్పిన అస్పష్టదిగంతం మీద
ఒక లేతాకుపచ్చ మైదానం
గజిబిజిగా కనిపిస్తున్న
ఓక్‌ చెట్ల అడవి, కనిపించకుండా
పోయిన కొండకొమ్ము

నింగి నుంచి నేలకు దింపిన దారాలు
కొత్త మడుగులు పేనుతున్నాయి
దువేరో నదీజలాల మీద
కదుల్తున్న నల్లని తరగలు

పంట పొలాల మీద వాన, అప్పుడే
నాట్లు వేసిన పొలాల మీద వాన
ఓక్‌ చెట్ల మీద ఒకింత ఎండ
దారిపక్క పడెలు కట్టినవాన

ఎండా, వానా. ఇంతలో నలుపెక్కి
ఇంతలో మెరుస్తున్న పొలాలు
ఇంతలోనే ఒక లోయ మీద చీకటి,
మరొక కొండ మీద వెలుతురు
ఇప్పుడే తళుకులీనుతూ, ఇంతలోనే
కునుకుతీసే పల్లెలు,
సుదూరప్రాచీనదుర్గాలు.

జేగురురంగు నేల మీద
పెద్దపెద్ద బంతులు దొర్లినట్టు
దూదిలాంటి బూదిలాంటి మబ్బులు


ఇప్పుడు కూడా ప్రకృతి అదే అందాలతో కనిపిస్తుంది కానీ, తన పక్కన తన స్నేహితురాలు లేదన్నది దుర్భరమైన విషయం కవికి. అందుకని ఏ అందాన్ని వర్ణించినా ఆమెను తలచుకోకుండా ఉండలేడు. తన బంధువు హొసే మరీయా పలాసియోని ఉద్దేశించి చెప్పిన కవితలో కూడా అదే ఛాయ.

హొసే మరీయా పలాసియోకు (To Jose Maria Palacio)

మిత్రమా, పలాసియో,
నది ఒడ్డున, దారి పక్క నల్లని పోప్లార్‌ కొమ్మల మీద
వసంతం అలంకారం మొదలుపెట్టిందా? దువేరో
నదీతీరమైదానాల్లో వసంతం రావడం కొంత ఆలస్యమే
కాని తీరా వచ్చాక ఎంత మెత్తగా, ఎంత కొత్తగా ఉంటుంది
పాత ఎల్మ్‌ వృక్షాల మీద కాసిని
చిగుర్లయినా తలెత్తాయా?
అకేషియాలింకా బోసిగానే ఉండి వుంటాయి,
సియొరా కొండలింకా మంచులో తడుస్తూనే వుంటాయి
తెల్లని, గులాబిరంగు మొంకాయో పర్వతరాశి మీద
ఆరగాన్‌ గగనం ఎంత శోభాయమానం!
బూడిదరంగు రాళ్ళమధ్య నల్లరేగుపొదలు
పూత పట్టాయా, పలచని పచ్చికలో
తెల్ల డైసీలు?

అక్కడి గంటస్తంభాల మీదకి
కొంగలిప్పుడే వచ్చి వాలుతుండాలి
నల్లరేగడి నాగేటిచాళ్ళలో ఆకుపచ్చ
గోధుమ చేలు,ముదురురంగు గాడిదలు,
చైత్రమాసపు వానలు పడుతూనే
పొలాల్లో నాట్లువేసే రైతులు. దవనంలో
మరువంలో తేనెటీగలు మైమరచే తరుణమిది
రేగుపళ్ళు మిగలముగ్గాయా?నల్లకలువలు
విరగబూశాయా?
అక్కడక్కడ పిట్టలవేటగాళ్ళు రహస్యంగా
పొంచివుంటారు కదా.
మిత్రమా, పలాసియో, చక్రవాకాలు
నదిఒడ్డుకు చేరుకున్నాయా?
తోటల్లో మొదటిగులాబీలు, తొలి లిల్లీలు
వికసించే నీలిరంగు మధ్యాహ్నం
ఆ ఎత్తైన ఎస్పినోలో,
ఎస్పినో సమాధివాటికలో
నిద్రిస్తున్న ఆమెని పోయి
పలకరించవూ


ఇదే స్ఫురణ ఈ కాలంనాటి మరికొన్ని కవితల్లో కూడా చూడవచ్చు:

ఈ బూడిదరంగు రాళ్ళ మధ్య (Verse VI: ‘Passages’)

ఈ బూడిదరంగు రాళ్ళ మధ్య
కలలు కనడానికి తేనె పోసినట్టు
ఆ బంగారు తంగేడుపూలు ఎవరు
పూయించారు? ఆ నీలినీలి
పూలగుత్తులెవరు కురిపించారు
ఎవరు చిత్రించారు
సాయంసంధ్యాకాశం మీద
ఊదారంగు, కాషాయవర్ణాలు?
తేనెపట్టు, పల్లెపట్టు
నదీప్రవాహం మీద వంగిన
కొండకొమ్ము, గండశిలల్ని
పెనవైచుకుంటూ అనంతకాలం
ఉరకలెత్తే ప్రవాహం, సస్య
కేదారాల హరితసౌందర్యం, అన్నీ, ప్రతి
ఒక్కటీ, చివరికి, ఆ బాదం చెట్లపాదుల్లో
తెల్లటి గులాబిరంగు మట్టి కూడా


పూలు పూసిన కొండలపక్క (by the flowering hills)

పూలు పూసిన కొండలపక్క
విశాలసాగరతరంగాలు
నా తేనెటీగల మధుకోశంలో
అక్కడక్కడ ఉప్పుతునకలు


నిన్నటి నా దుఃఖాలు (Yesterday my sorrows)

నిన్నటి నా దుఃఖాలు
గూళ్ళు అల్లుకునే
పట్టుపురుగులు
నేడు నల్లనిరెక్కలపురుగులు

ఎన్ని చేదుపూలనుంచి
నేనీ మైనం పోగుచేశానో
ఓఫ్, ఇప్పుడు నా దుఃఖాలు
తేనెటీగలై తిరుగుతున్నాయి

ఇప్పుడవి తాలుగింజలు
పొలాల్లో కలుపుమొక్కలు
గోధుమకంకులమీద బూజు
అడవిలో పెంకుపురుగులు

ఓఫ్, ఒకప్పుడు నా దుఃఖాలు
నిర్మలమైన కన్నీళ్ళు
తోటలు తడిపే పంటకాల్వలు
ఇప్పుడు నేలలోంచి
అడుసును లాగే
వరదనీళ్ళు.

ఒకప్పుడు నా హృదయం
నా దుఃఖాలకు
తేనెపట్టు,
ఇప్పుడవి తాకి మోది
పడగొట్టాలనుకునే
పాతగోడ.


1917-1930 మధ్యకాలంలో మచాడో న్యూ సాంగ్స్‌ (New Songs, 1924) పేరిట మరికొన్ని కవితలు రాశాడు. ఈ కాలంలో అతడు ఏబెల్‌ మార్టిన్‌, వాన్‌ డి మైరేన అనే పేరు మీద కూడా కవితలు రాశాడు. ఈ కాలంలో అతని జీవితంలోకి మరొక స్త్రీ ప్రవేశించింది. 1928లో సెగోవియాలో అతడు గియోమార్‌ అనే ఒక కవయిత్రిని కలిశాడు. ఆమె వివాహిత. ముగ్గురు పిల్లల తల్లి. భర్త ప్రభుత్వోద్యోగి. కాని వారిద్దరిమధ్య సఖ్యత ఉండేది కాదు. ఆమె దూరంగా ఉండేది. అప్పటికి స్పెయిన్‌లో విడాకుల చట్టం లేనందువల్ల ఆమె భర్త నుంచి దూరంగా ఉండేది. ఆమె పరిచయం అయిన తరువాత మచాడో పదేపదే ఆమె సన్నిధి కోసం తపించాడు. ఆమె అతడికి శారీరకంగా సన్నిహితం కాలేదు కానీ కవి దృష్టిలో ఆమె రక్తమాంసాలున్న స్త్రీ. ఆమె పట్ల అతడికి కలుగుతున్న ప్రేమ కోమలమైందీ, స్వప్నసదృశ్యమైందీ కాదు. ఇందులో సాంద్రత ఉంది, విరహం ఉంది, శారీరక కాంక్ష ఉంది, తీరని ఆకాంక్ష ఉంది. ఆమె కవికి ఎంత సన్నిహితంగా వస్తున్నదో అంత దూరంగా కూడా ఉండేదని చెప్పాలి. ఈ భావాలనే కవి ఒక కవితలో ఇట్లా చెప్పాడు:

నీ కవి
నిన్నే ధ్యానిస్తున్నాడు, నిమ్మపచ్చ,
ఊదారంగు దూరం,
పొలాలింకా పచ్చగా ఉన్నాయి
నువ్వు నాతోనే వున్నావు, గియొమార్‌
కొండలు మనల్ని లోపలికి లాక్కుంటున్నాయి
చెట్టుకీ చెట్టుకీ మధ్య రోజువాడిపోతోంది
రైలు విరుచుకుపడుతోంది,
పూలనీడల్లోకి తప్పుకున్నాయి.
గాడారామా కొండల
బంగారువన్నె గజిబిజి
ఒక దేవతా ఆమె ప్రేమికుడూ
కలిసిపారిపోతున్నందుకు
పున్నమి చంద్రుడు రొప్పుతూ వెంటబడ్డాడు
పెద్దకొండ సొరంగంలో
రైలు మాయమైంది
బీడుభూముల పచ్చిక, ధారాళమైన ఆకాశం
గ్రానైట్‌ కొండలు దాటాక, సున్నపురాళ్ళు దాటాక
చివరికి అపారసముద్రం
మనం చేతులు కలిపి ముందుకు పోదాం
మనం విముక్తులం
కథల్లో క్రూరచక్రవర్తిలాగా
దేవుడు వాయువేగంతో వెంటబడనివ్వు
ప్రతీకారేచ్ఛతో రగిలిపోనివ్వు
జీను సవరించనివ్వు, అయినా
మన ప్రేమ స్వతంత్రం
దాన్నెవరూ ఆపలేరు.


స్పానిష్‌ అంతర్యుద్ధ సమయంలో అంటే తన చివరి సంవత్సరాల్లో అతడు సానెట్‌ (Sonnet) వైపు దృష్టి మళ్ళించాడు. డాంటే (Dante), గోంగొర (Gongora), రొన్సార్డ్‌ (Ronsard) వంటి మహా కవుల దారిన తాను కూడా తన భావావేశాల్ని సానెట్‌గా మలచాలని ప్రయత్నించాడు. ఉదాహరణకి న్యూసాంగ్స్‌లోనే సంకలనం చేసిన ఈ కవిత చూడండి:

అగ్ని గులాబి (Rose of fire)

ప్రేమికులారా, వసంతం అల్లిన అల్లిక మీరు,
నేలా, నీరూ, గాలీ వెలుతురూ కలనేత, మీ
వక్షంలో ఉప్పొంగుతున్న పర్వతాలు, మీ
నేత్రాల్లో అల్లుకున్న పొలాలు పుష్పిస్తున్నాయి

నడవండి చేయి కలిపి వసంతంతో, పంచుకోండి
పూలతేరు, పొంచివున్న మృగాలు మిమ్మల్ని
ద్రోహవస్త్రంలో బంధించకముందే, అల్లరి చిరుత
అందిస్తున్న తియ్యటి క్షీరాలు తాగండి నిర్భయంగా

వేసవి అయనాంశరేఖ మీద భూమి ఇరుసు వాలక
ముందే, పచ్చని చెట్ల నడుమ పూలు వసివాడకముందే
దాహమింకా తీరకముందే, నేలలింకా తడవకముందే

సాగండి ప్రేమప్రపంచపు అపరాహ్ణదిశగా, తృప్తిగా
ముందుకి, మునుముందుకి, అరచేత అగ్నిగులాబీతో.


చివరి దశలో యుద్ధకాలంలో రాసిన ఈ కవిత కూడా చూడండి:

మళ్ళా మన నిన్నటిరోజు (Again our yesterday)

మళ్ళా మన నిన్నటిరోజు. పరదాల వెనగ్గా
సంగీతం, సూర్యుడు. పక్కనతోటలో బంగారు
ఫలసేకరణ. నేను చేయి చాపగానే
చిమ్ముతున్న ఊటలో మచ్చలేని నీలిమ
సెవీల్‌లో నా బాల్యం, ఆమెతోనే నిండిపోయింది
నా జ్ఞాపకాన్ని కాలమెంత తొందరగా కబళిస్తోంది
మన జీవితమూ అంతే, తమ్ముడూ, మాన్యుయెల్‌
గుర్తుపెట్టుకో, రేపటి రోజెవరిది కానుందో?
మన హోమవేదికనెవరో బాగా బలిసిన ట్యూటన్లకీ,
ఆకలిగొన్న మూర్లకీ అమ్మేసారు, ఇటాలియన్లకి
వాళ్ళు సాగరద్వారాలు వేలం పాడేశారు
మన ప్రజల్లో భయం, ద్వేషం పైకి కనబడవు. ఆలివు
తోటల్లో ఆలివు నూనె గానుగాడుతూ పాడుపడతారు,
పొలం దున్నుతారు, పస్తులుంటారు, పాడుతారు, ఏడుస్తారు.

1938 మొదలవుతూనే ఫ్రాంకో సైన్యం బార్సిలోనా పట్టణాన్ని ఆక్రమించుకోవడానికి మూడురోజుల ముందు మచాడో, అతని కుటుంబం సరిహద్దు దాటి వెళ్ళిపోయారు. అక్కడే ఆ చలికాలపు రోజుల్లో ఆ కుటుంబం తిండిలేకుండా గడపవలసి వచ్చింది. అక్కడనుంచి మళ్ళా ఒక మిలటరీ వాహనం మీద ఫ్రెంచి సరిహద్దుల్ని దాటారు. చివరికి మచాడో తనెంతో ప్రేమించిన స్పానిష్‌ భూమిని వదలిపెట్టి, పరాయిదేశంలో అత్యంత దీనావస్థలో ఈ లోకాన్ని విడిచిపెట్టి పోవలసి వచ్చింది. వృద్ధురాలయిన తన తల్లి కూడా మరొక మూడురోజుల తరువాత అతణ్నే అనుసరించింది. అతడి కవితలో చెప్పుకున్న ఈ వాక్యాలు చివరికి నిజమయ్యాయి.

నా అంతిమప్రయాణతరుణం సమీపించాక
తిరిగి రాని తీరానికి లంగరెత్తేవేళ, పడవలో
నాదంటూ ఏదీ ఉండదు, సూర్యుడి కింద
సాగరతీరశిశువుల్లా దిసమొలతో నేను తప్ప.

అతను మరణించినప్పుడు అతని ఓవర్‌కోటులో ఈ వాక్యం దొరికింది.

ఈ నీలి దినాలు, నా పసితనపు సూర్యుడు


మచాడో తన కవిత్వం పొడుగునా చెప్పడానికి ప్రయత్నించిన దానికన్నా, ఒక చెప్పలేని తనాన్నీ, ఒక నిశ్శబ్దాన్నే ఎక్కువ చెప్పడానికి ప్రయత్నించాడని అనుకోవలసి ఉంటుంది. బార్న్‌స్టన్‌ రాసినట్లుగా, మచాడోకీ, అతడు పుట్టిన ఏడాదే పుట్టిన మరొక ప్రఖ్యాత కవి రిల్కకీ (Rilke) మధ్య ఈ విషయంలో కూడా ఒక పోలిక ఉంది. ఆ ఇద్దరు కవులూ కూడా ఏకాంతానికి చెందిన కవులు. వాళ్ళు తాము చూసిన, తాము జీవించిన ప్రకృతి దృశ్యాల్నే కవిత్వంలో చిత్రించడానికి ప్రయత్నించారు. కానీ వాళ్ళు చిత్రించింది కేవలం చెట్లూ, కొండలూ కాదు. అతడు చూసిన, మనకు చూపించిన ఆ బాహ్యప్రపంచపు స్పెయిన్‌, బార్న్‌స్టన్‌ అన్నట్లుగా, మచాడో ఆంతరంగికప్రపంచమే. మామూలు పడికట్టు మాటలాగా వినిపించినప్పటికీ, మచాడో స్పెయిన్‌ ఆత్మను దర్శించాడనేదే సరైన మాట.

మచాడో చిత్రించిన ప్రపంచానికి నిర్దిష్టమైన రంగులున్నాయి. బాగా చేయి తిరిగిన నీటిరంగుల చిత్రకారుడిలాగా మచాడో రంగులపెట్టెలో కూడా రంగులు పరిమితమే. కాని ఆ కొద్దిపాటి రంగులతోటే అతడు ఎప్పటికప్పుడు ఎంతో ప్రకాశభరితమైన లోకాన్ని చిత్రిస్తూ వచ్చాడు. అతడి కవిత్వమంతా ఎన్నిసార్లు చదివినా పుస్తకం మూసేసిన ప్రతిసారీ కళ్ళముందు మిగిలేవి ఆ రంగులే. ఆ రంగుల ఛాయలు భాషల పరిమితుల్ని దాటి, ఎంతదూరమైనా ప్రయాణించగలవనడానికి ఈ కవితలే గుర్తు.

దువేరో నదీతీరం (On the banks of Duero)

ఎత్తుగా గంటస్తంభం మీద వాలిన కొంగ
స్తంభం చుట్టూ, ఒంటరిమేడ చుట్టూ
కిచకిచలాడుతున్న పిచుకలు
మంచుతుపానుల, నరకఘోషల
శ్వేతశీతం తరలిపోయింది, ఈ
ప్రభాతం బద్ధకంగా ఒళ్ళువిరుచుకుంది
పేద సోరియా భూమిని మెత్తగా
వేడెక్కిస్తున్న సూర్యుడు
నీలంవన్నె తిరిగి విభ్రాంతపరుస్తున్న
పచ్చని పైన్‌ చెట్లు
దారిపక్క నది ఒడ్డున సన్నని పోప్లార్‌ చెట్లమధ్య
చిగురిస్తున్న వసంతం
మృదువుగా, మూగగా, తేటగా ప్రవహిస్తున్న
నది, మరీ లేతగాని, మరీ ముదురెక్కని
పంటపొలాలు
పచ్చికలో ఇప్పుడే ఒక చిన్నిపువ్వు పుట్టింది
తెలుపో, నలుపో. మైదానాల్లో అందమిప్పుడే
అంకురిస్తోంది, మంత్రమయవసంతం!
తెల్లటిబాట పక్క కిక్కిరిసిన చెట్లు, ఒడ్డ్డమ్మట
వికసించిన పోప్లార్లు,
సుదూరనీలదిగంతం మీద
కొండలనురగ
సూర్యప్రకాశభరితమైన రోజు
మధురాతిమధురం స్పెయిన్‌ భూమి

నల్లని జలాల పక్కన (By the black water: New Songs)

నల్లని జలాల పక్కన
సముద్రం, మల్లెల పరిమళం
సంగీతతరంగితసాయంకాలం
ముదురు ఓక్‌ చెట్టు
ముదురు ఓక్‌ చెట్టు
రాళ్ళబంజరు
సూర్యుడు మునిగిపోగానే
నది మేల్కొంటుంది
ఊదారంగు,కపిలవర్ణాల
దూరపర్వతశిఖరాల్లారా!
నీడలు పరుచుకున్న గాలిలో
నది ఒక్కటే మాట్లాడుతుంది
ఒక ప్రాచీన అపరాహ్ణపు
పేలచంద్రుడు
గడ్డకట్టిన పొలాలంతటా
మట్టికాదు, వెన్నెల

సూర్యుడి కింద ఒక కల తల దిమ్మెక్కిస్తూ (The dream below the sun)

సూర్యుడి కింద ఒక కల తల దిమ్మెక్కిస్తూ, కళ్ళు బైర్లు కమ్ముతూ
ఆకాశం ఎరుపెక్కిన వేళల అత్యుష్ణ స్వప్నం
వెలుగు చిమ్ముతున్న నదిమీద గాలి తీస్తున్న నాగేటిచాళ్ళు
మండుతున్న కొండలు
ఈ అపరాహ్ణం ఒట్టి దుమ్ము, సూర్యుడు
మారుమూల కనుమలో కునుకుతీస్తున్న
గాలిశంఖం కీచుమోత
తూలికలాంటి ఒక తేలికపాటికల
ఖర్జూరవృక్షం మీదనుంచి పైకి లేచి
నారింజపూలలో ఆవిరయ్యింది
ఆగిపోయిన మోటబావి నిశ్శబ్దంలో
ఒక కొంగ మత్తుగా ముక్కు జొనిపింది
ఒక ఎద్దు పచ్చిక మీద
అడ్డంగా మోరచాపింది
నిండుగా వికసించిన
కొమ్మల ఆకుపచ్చ నురగ
తెల్లగోడ మీద
చప్పుడు చెయ్యకుండా
ఒలుకుతోంది.
అట్టహాసపు ఆకాశం కింద
ఒక తోట సోమరిగా
నీడలో ముడుచుకుంది
ఎర్రటి అపరాహ్ణవేళ
దూరంగా
గంటస్తంభం కిటికీలు
తళుకులీనుతున్నాయి.

    
   

26అభిప్రాయాలు

మీ అభిప్రాయం తెలియచేయండి
  1. 1
    రాజశేఖర్ గుదిబండి September 12, 2013 1:43 am

    వాడ్రేవు గారు మీ అపారమైన విద్వత్తుకి, సరి సమానమైన మీ తృష్ణకి వేన వేల నమస్కారాలు. ఎక్కడి ఆంటోనియో మచాడో, ఎక్కడి బార్న్‌స్టన్‌…ఎక్కడి చైనా, ఎక్కడి స్పెయిన్. మా జీవితం లో ఇవన్ని మా అంతట మేం చదవగలమా, చదివినా అర్ధం చేసుకోగలమా ఇంత బాగా! ప్రపంచ సాహిత్యాన్ని మంచి నీళ్ళ లాగా మా దోసిట్లో పోస్తున్న మీకు సదా కృతజ్ఞులం.

    //నా అంతిమప్రయాణతరుణం సమీపించాక
    తిరిగి రాని తీరానికి లంగరెత్తేవేళ, పడవలో
    నాదంటూ ఏదీ ఉండదు, సూర్యుడి కింద
    సాగరతీరశిశువుల్లా దిసమొలతో నేను తప్ప.//

  2. 2
    రవిశంకర్ September 12, 2013 8:53 am

    వెనకెప్పుడో మీరు అన్నట్టు, చిన్ని గడ్డిపోచ వసంత స్పర్శ తననెట్లా తల మునకలు చేసినదీ వచ్చీరాని భాష లో చెప్తే ఎవరికర్ధమవుతుంది ఒక్క దండకారణ్య సాలవృక్ష సమూహాలకు తప్ప.మాటలకూ అందని మధురానుభూతిని అయాచితంగా ప్రసాదిస్తున్న మీకు సదా కృతజ్ఞులం.

  3. 3
    jayaprabha September 12, 2013 2:43 pm

    “పొంచివున్న మృగాలు మిమ్మల్ని/ ద్రోహవస్త్రంలో బంధించక ముందే, అల్లరి చిరుత అందిస్తున్న తియ్యటి క్షీరాలు తాగండి నిర్భయంగా!

    ఇది తెలుగు భాష లో ఏమన్నా ఒక అర్ధాన్ని ఇస్తుందా ? ” ద్రోహ వస్త్రం ” ఎమిటీ ?

    “దవనంలో మరువంలో / తేనెటీగలు మైమరిచే తరుణమిది”

    [?] దవనానికీ మరువానికీ పువ్వులుంటాయా? తేనెటీగలు రావడానికి?

    “నిమ్మ పొద, కేశ రాశి, ఊట నీరు, వేల జలాలు, జలాల్లారా!” లాంటివి తెలుగు భాషలొ తెలుగు కవితా వాక్య నిర్మాణంలో ఇమడని కృతక పదబంధాలు కావా?

    వేరే నాగరికతకి చెందిన ఒక కవిని స్వంత భాష లోకి అనువాదం చేయడం ఏమంత సులువైన విషయం కాదు. ఆ ప్రయత్నం చేసిన చినవీరభద్రుని అభినందిస్తూనే, అనువాదం ఎప్పుడైనా కూడా అనువాదం కాబడిన భాషకి ఎంత దగ్గిరగా తేగలిగామన్నది కూడా అంతే ముఖ్యం గనక, ఇప్పుడు నేను పేర్కొన్న ఇలాంటి వాక్యాలు మరొకసారి చూసుకుని ఉంటే వాటిని తెలుగులోకి ఎలా తేవాలో కూడా అనువాదకునికి తెలిసి ఉండేది.

    “మరీముఖ్యంగా ఒక మాఘ మాసపు గాలి” అంటూ ఒక అనువాద కవితని మొదలు పెట్టిన శ్రీశ్రీ ఒక దారి మన ముందుంచాడు, తెలుగు భాషలో ఊరికే భాషా భేషజం లేకుండా తెలుగుకి సహజమైన రీతిలో అనువాదం చేయడంలో! ఎప్పుడన్నా బాగా చేయలేకపోయినా పరవాలేదు గానీ తెలుగులోకి భావాన్ని చెప్పే పద బంధాలు అసహజంగా ఉండకుండా ఉంటే చాలు. చేయబోయే అనువాదాలలో వీరభద్రుడు ఇలాంటి విషయాలలో బహుశా శ్రధ్ధ వహించ గలడని ఆశిస్తాను.

    జయప్రభ.

  4. 4
    సురేశ్ కొలిచాల September 13, 2013 1:34 pm

    “పొంచివున్న మృగాలు మిమ్మల్ని/ ద్రోహవస్త్రంలో బంధించక ముందే, అల్లరి చిరుత అందిస్తున్న తియ్యటి క్షీరాలు తాగండి నిర్భయంగా!

    ఇది తెలుగు భాష లో ఏమన్నా ఒక అర్ధాన్ని ఇస్తుందా ? ”ద్రోహ వస్త్రం” ఎమిటీ?

    జయప్రభగారు: స్పానిష్ మూలాన్ని ఆధారంగా కాక స్పానిష్ నుండి ఇంగ్లీష్ లోకి చేసిన అనువాదం అధారంగా చేసిన తెలుగు అనువాదం కాబట్టే ఇన్ని సమస్యలు. అదీ కాక, చినవీరభద్రుడుగారు ఆధారపడిన Willis Barnstone మూలంలో భావాలను యథాతథంగా ఉంచడం కన్నా ఇంగ్లీషు సానెట్ ఛందస్సుకు తన అనువాదం ఒదగడానికే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చాడు. Willis Barnstone చేసిన అనువాదం ఇంగ్లీష్ పాఠకులకు మచాదోను పరిచయం చెయ్యడానికి ఆంగ్లభాషకు, ఆంగ్ల ఛందస్సుకు సరిపోయే విధంగా చేసిన స్వేఛ్చానువాదం.

    చినవీరభద్రుడుగారు రాసిన ఈ పంక్తులకు ఆధారమైన ఇంగ్లీష్ అనువాదం చూడండి:

    Go out and walk with spring and share the season,
    and fearlessly keep drinking the sweet milk
    the wanton panther offers you, the treason
    of beasts, before she traps you in black silk.

    ఇందులో black silk అన్న మాట మూలంలో లేదు. రెండవ లైను చివర sweet milk అన్న మాటకు ప్రాస సరిపోయేవిధంగా నాలుగవ లైనులో black silk అన్న మాటను ప్రయోగించాడు. మూడవ లైనులో వాడిన treason అన్న మాట కూడా మూలంలో లేదు. మొదటి లైనులో seasonకు ప్రాస సరిపోయే విధంగా మూడవ లైనులో treason అని వాడాడు. మూలంలో లేని treason, silk తెలుగులో కలగలిసి ద్రోహవస్త్రంగా మారిపోయాయి.

    నడవండి చేయి కలిపి వసంతంతో, పంచుకోండి
    పూలతేరు, పొంచివున్న మృగాలు మిమ్మల్ని
    ద్రోహవస్త్రంలో బంధించకముందే, అల్లరి చిరుత
    అందిస్తున్న తియ్యటి క్షీరాలు తాగండి నిర్భయంగా

    మాచాదో రాసిన మూలం ఇది:

    pasead vuestra mutua primavera,
    y aun bebed sin temor la dulce leche
    que os brinda hoy la lúbrica pantera,
    antes que, torva, en el camino aceche.

    దీనికి నాకు తెలిసినంతలో టీకా ఇది:
    pasead = సంచరించండి; vuestra = మీ యొక్క; mutua = పరస్పర; primavera = వసంతం; y = మరియు; aun = ఇంకా/అయినా; bebed = తాగండి; sin temor = భయం లేకుండా; la dulce = తియ్యని; leche = పాలు; que = that ఏదైతే; os = మీకు; brinda = ఇచ్చునో; la lúbrica = slippery, lusty; pantera = Panther అను మృగము; torva = ఘోరం/నిష్ఠురం; en el camino = దారిలోన;aceche = కాపు కాయు; antes que = అంతకు ముందు.

    నాకు తోచిన అర్థాన్ని పంక్తులుగా రాస్తే:

    నడవండి వసంతంతో చేయి కలిపి;
    తుంటరి వయోవ్యాఘ్రం
    అందించే మధుర క్షీరాలను
    ఆస్వాదించండి నిర్భయంగా —
    అది కాలమార్గంలో పొంచి ఉండి
    ఘోరంగా దెబ్బతీయక ముందే.

  5. 5
    jayaprabha September 14, 2013 12:13 am

    కొలిచాలా! “వయోవ్యాఘ్రం” ఇది అర్ధం అవుతోంది. అది కాస్తా మనుష్యుల్ని కాలమనే మార్గంలో పొంచి కబళిస్తుందని మానవులు ఊరికే భయపడే కన్నా ఆ ముదిమి అనే పులి నించి కూడా నిర్భయంగా [ జీవన] క్షీరాన్ని గ్రోలండీ అని హితవు చెబుతున్నాడు కవి.

    అంటే మృత్యువుని అన్యాపదేశంగా చెబుతూనే చివరి దాకా నిర్భయంగా జీవితాన్ని అనుభవించమంటున్నాడు మచాదో.

    ఐతే, అసలు ఈ అర్ధం ఇంగ్లీషులోనే ధ్వనించడం లేదు. ఇంక దాని అనువాద వాక్యం అయితే తెలుగులో ఏ అర్ధాన్నీ ఇవ్వడం లేదు సరికదా, నవ్వు తెప్పించేది గా ఉంది. కదా? అనువాదం ఎప్పుడైనా ఏ భాషలో చేస్తున్నామో ఆ భాష లోని పాఠకులని దృస్టిలో పెట్టుకుని సాగాలి మరి.

    జయప్రభ.

  6. 6
    తః తః September 15, 2013 4:34 am

    “వ్యాఘ్రీవ తిష్ఠతి జరా పరితర్జయంతీ” ఎప్పటి వాడు భర్తృహరి ?
    తః తః

  7. 7
    Vadrevu Chinaveerabhadrudu September 15, 2013 7:19 am

    సురేశ్ కొలిచాలగారు — నా అనువాదం మీద జయప్రభ వ్యాఖ్యలు నాకేమంత ఆశ్చర్యం కలిగించలేదు గాని ఆ వ్యాఖ్యలకి జవాబు ఇవ్వడానికి మీరు తీసుకున్న శ్రద్ధకి నమోవాకాలు అర్పిస్తున్నాను. నేను ఆ కవితలని ఒక కవిగా గాని, లేదా అనువాదకుడిగా గాని అనువాదం చేయలేదు. ఆ కవిత్వం పట్ల ఆపుకోలేని తమకానికి లోనైన పాఠకుడిగా చేశాను. కాని మీరు రాసిన టీకా చదివాక ద్రోహవస్త్రం అనేమాట ఆ కవితలో మరీ బాగా అమరిందనిపిస్తోంది. మనం అనువాదం చేస్తున్నప్పుడు మనలో అంతర్గతంగా ఉండే ఒక మహాప్రజ్ఞ చేసే మిరకిల్ అది.

    ఇక మరువం,దమనం పూలుకావు. కాని వేరే దేశాల పుష్పాల పేర్లు మన భాషకి సన్నిహితంగా లేనప్పుడు మనం మనకి సన్నిహితంగా ఉండే పేర్లనే వాడుకోవలసిఉంటుంది. మరువం, దమనం అనే పేర్లు పాఠకుడిలో రేకెత్తించగల సున్నితమైన సంవేదన ముఖ్యం తప్ప, వాటి బొటానికల్ ఆక్యురసీ కాదు. నిమ్మ పొద, కేశ రాశి, ఊట నీరు, వేన వేల జలాలు లాంటి పదాల్లో తెలుగు లేదని ఇప్పుడే తెలుసుకున్నాను. కాని నేను నిస్సహాయుణ్ణి. ఆ కవితల్ని ఇప్పుడు అనువాదం చేసినా అలాగే అనువాదం చేస్తాను.

    మరోమాట కూడా చెప్పాలి. నా దృష్టిలో ‘మరీముఖ్యంగా ఒక మాఘమాసపుగాలి’ని నేనేమంత గొప్ప అనువాదంగా పరిగణించలేను.

    చినవీరభద్రుడు

  8. 8
    తః తః September 15, 2013 9:22 am

    సమాంతర దృక్పథాల మీద
    వెన్నెల వాలాలి!
    అవి కలుసుకున్నచోట
    చిన్నెలు రాలాలి!

    తః తః

  9. 9
    నరసింహ శర్మ మంత్రాల September 15, 2013 9:47 am

    “నీ వాడివాడి చూపుల్లో – నా నాడి కొట్టుకుంటోంది”

    దీనిని ఆంగ్లానువాదం చేస్తే… “ఇన్ యువర్ షార్ప్ షార్ప్ లుక్స్ – మై హార్ట్ బీట్స్ ఆల్వేజ్” అని వస్తూంది.

    దీనినే ఇంకోలా చెప్పొచ్చు…

    “The beat of my heart
    May lash in your
    Eyes of lust”

    “కోరలున్న విషనాగులు – కోరాడే కోలాటం” ప్రాసక్రీడలో భావం బలి.

    కవిత్వానికి భావోద్వేగమే ప్రధానం అనిపిస్తూంది.

  10. 10
    jayaprabha September 15, 2013 12:57 pm

    తహ తహ గారూ! భర్తృహరిని కోట్ చేయడం మీరు బాగుంది. ఆశ్చర్యమే కదా! ఇంక వీరభద్రునికి నా అభిప్రాయం మీద శ్రధ్ధ లేకపోయినా, లేదా ఆయన మళ్ళీ ఆ పధ్ధతిలోనే తిరిగి అనువాదం చేయబూనుకున్నా నాకొచ్చిన ఇబ్బంది మాత్రం ఏముందీ? నచ్చిన వాటిని ఆస్వాదిస్తాం! లేకపోతే సరేనని పేజీ తిప్పేస్తాం! అందువలన ఎవరికుండే అభిప్రాయాలు వారికి ఉంటాయి. ఇక్కద అది కాదు సమస్య. నేను కవిగా చేయలేదు, అనువాదకునిగా చేయలేదు అని వీరభద్రుడు అనడం మాత్రం నాకు వింత గానే అనిపించింది. అందులో ఏదో ఒక పాత్ర తప్పనిసరిగా అతనికి ఉంటుంది. తనకి అటువంటి పాత్ర ఏదీ లేదని వీరభద్రునికి అనే అవకాశం ఉండదనుకుంటాను. ఆయన ఆ రెండూ గనక.

    ఇంక ఒక నాగరికతకి చెందిన కవిని మరొక నాగరికతకి చెందిన భాష లోకీ ప్రతీకలలోకీ మార్చవలసి వచ్చేటప్పుడు ఎదురయ్యే సమస్యల మీద మాట్లాడుకోవడం అనువాదకులకి పనికొచ్చే సంగతే ఎప్పుడైనా! ఇక్కడ చదివే వాళ్ళు కూడా ముఖ్యమే అనుకుంటాను, వాళ్ళు ఎవరైనా! అందుకే కదా వీరభద్రుడు అంత శ్రమ పడిందీ?

    అవును. కొలిచాల గనక స్పానిష్‌లో మచాదో భావాన్ని గనక చెప్పక పోయి ఉంటే వీరభద్రుని అనువాద భావం / వాక్యం, అర్ధం లేనట్టుగానూ అసమగ్రంగానే మిగిలిపోయేది. “ద్రోహవస్త్రం” అన్న దాన్ని సమర్ధించుకోవడం కోసం వీరభద్రుడు అంత బెట్టు పోవాలా? మరీను!

    జయప్రభ.

  11. 11
    తః తః September 16, 2013 4:18 pm

    “కవిత్వానికి భావోద్వేగమే ప్రధానం అనిపిస్తూంది.”

    పాటకి beat ప్రధాన మనిపించినట్లు. భావొద్వేగం నెససరీ యే గానీ సఫిసియెంట్ కాదు. భాషకు సంబంధించిన ప్రతిదీ గుండెకాయ ఒక్క దాని తోనే కాదు తలకాయకు కూడా సంబంధించి ఉంటుంది. “మరువం, దమనం అనే పేర్లు పాఠకుడిలో రేకెత్తించగల సున్నితమైన సంవేదన ముఖ్యం తప్ప, వాటి బొటానికల్ ఆక్యురసీ కాదు.”అన్న శ్రీ వాడ్రేవు మాటలు నా కంత సబబుగా ఉన్నట్లనిపించటం లేదు. కాల గమనంలో ‘బాల్యకాల’ వంటి పదబంధాలతో చేసిన అనువాదం -అనువాదం అనను, గిరీశాన్ని గుర్తు తెచ్చుకుంటూ తర్జుమా అంటాను. ఇది మచాడో కి అన్యాయం చేసే ప్రమాదం ఉంది. ‘ఇండియాటుడే’లో శ్రీ వాడ్రేవు రాసినవి చదివి వారి అభిమాని నైన వాణ్ణి, అయినా నాకు ఇలా రాయక తప్పటం లేదు.

    నేచర్ కు సంబంధించి యాక్యురసీ ఆఫ్ ఎ సైంటిస్ట్, యాక్యురసీ ఆఫ్ ఎ పొయెట్ ల గురించీ ఈ మాటలు ఒక సారి చూడండి:

    “Kalidasa’s knowledge of nature is not only sympathetic, it is also minutely accurate. Not only are the snows and windy music of the Himalayas, the mighty current of the sacred Ganges, his possession; his too are smaller streams and trees and every littlest flower. It is delightful to imagine a meeting between Kalidasa and Darwin. They would have understood each other perfectly; for in each the same kind of imagination worked with the same wealth of observed fact.”

    from KALIDASA – TRANSLATIONS OF SHAKUNTALA & OTHER WORKS, BY ARTHUR W. RYDER

    తః తః

  12. 12
    lyla yerneni September 16, 2013 7:12 pm

    Exquisite.

    Like the way I revisit a person, a painting, a book, a garden, I have longing for, I am going to revisit this writing many times.

    Many Thanks.

    లైలా

  13. 13
    jayaprabha September 17, 2013 1:30 pm

    మరువం, దవనం తీసుకోవడంలో కాదు నా ఇబ్బంది, ఆ పక్కనే ఆ “తేనెటీగల్ని” తెచ్చి పెట్టడంలో! అనువాదకునికి గనక అక్కడ ఆ తేనెటీగ ప్రస్తావన గనక ముఖ్యం అయితే, అప్పుడు అక్కడ సుగంధపూరితమైన పువ్వుల పేర్లు చాలానే ఉన్నాయి కదా తెలుగులో సైతం? వాటిని పెట్టి ఉండొచ్చును. కాదూ మరువం దవనం గనక మాత్రమే అనువాదకుని ప్రిఫరెన్స్ అయితే అప్పుడు తేనెటీగ ప్రస్తావన గురించి ఆలోచించాల్సి ఉంటుంది. ఎందుకంటే, మరువం దవనం వాటి సురభిళ పత్రాలకోసం మాత్రమే ప్రఖ్యాతి వడసినవి. పువ్వులకోసం కాదు. అందువలన తేనెటీగల ప్రస్తావన అక్కడ అసలు నప్పదు అన్నది నా ఉద్దేశ్యం! అనువాదకునకు తన సొంతభాష లోకి తర్జుమా చేసేటప్పుడు ఈ విషయంలో అయితే స్పష్టత తప్పక ఉండాలి. తేనెటీగలు మరువానికీ దవనానికీ నప్పవు. మరువం దవనం పూలకి కాదు ప్రసిధ్ధి. వాటిమీదకి తేనెటీగ వాలే వీలు లేదు. అందుకూ! అందువలన మొదటి పోలిక తరవాతి మాటకి ప్రతిబంధకం కాక తప్పదు. అందుకనే అడిగాను మరువం దవనం — వీటికీ తేనెటిగలకీ ఎలా కుదురుతుందని. ఇంతకీ దీనికి మచాదో ఏం రాసేడో అసలు భాషలో అది తెలిస్తే అప్పుడు కదా అసలు దానికి ఈ అనువాదం ఏపాటి సన్నిహితంగా ఉందో, తెలిసేది? అనువాదకునికి స్వతంత్రం ఉంటుంది. నేను దాన్ని ఒప్పుకుంటాను కూడా! శ్రీ శ్రీ “ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమ సమూహములు?” అన్న పద్యం ఇందుకు ఉదాహరణగా భావిస్తాను. అయితే “నప్పడం” అన్నది చాలా ముఖ్యం. నప్పక పోయాకా మిగిలిన మాటలేవన్నా వట్టివే!!

    జయప్రభ.

  14. 14
    lyla yerneni September 17, 2013 6:43 pm

    నేచర్ కు సంబంధించి యాక్యురసీ ఆఫ్ ఎ సైంటిస్ట్, యాక్యురసీ ఆఫ్ ఎ పొయెట్ ల గురించీ ఈ మాటలు ఒక సారి చూడండి:

    మీరు ఈ స్పానిష్ పొయెట్ ని గురించి చదువుతూ,’గిరీశం’ లాటి తెలుగు దగుల్బాజీ పోరంబోకు వెధవ ప్రస్తావన ఎలా తెచ్చారండీ? ఏమిటి సంబంధం? కాళిదాసు అంత సైంటిఫిక్, బొటానికల్ కవి ఐతే, అభిజ్ఞాన శాకుంతలంలో తుమ్మెద శకుంతల ముఖం చుట్టూ ఎందుకు తిరిగిందండి?

    లైలా

  15. 15
    jayaprabha September 17, 2013 11:03 pm

    శకుంతల ముఖ”పద్మం” గనకనే ఆ తుమ్మెద ఆమె ముఖం చుట్టూ పరిభ్రమించింది. ఆమె ముఖం కాస్తా అక్కడ పద్మం లాగా కాక ఏ ఆకులాగానో లేక ఏ కొమ్మ లాగానో ఉండి ఉంటే పరిభ్రమించేది కాదు. కాళిదాసే అయినా పువ్వు మీద తుమ్మెద పోలికని తెచ్చేడు గానీ ఆకుల మీద వాలి నట్టు తేలేదు కదా?

    కన్యాశుల్కం లో తర్జుమా అన్న మాట కి ఒక సందర్భం ఉంది. అక్కడ గిరీశం కాదు ముఖ్యం. ఆ మాట “తర్జుమా” అన్నది మాత్రమే మనం గమనించవలసింది. అనువాదం లో ముక్కస్య ముక్కహ గా చేసినప్పుడు దానిని “తర్జుమా” అనడం తెలుగులో కద్దు. ఎప్పుడైనా “తర్జుమా” లా ఉండకుండా అనువాదం అన్నది అనువదింపబడిన భాషలో సహజంగా వొదగాలి అని తహ తహ గారి భావన అని నాకు అర్ధం అయింది. తెలుగులో అది కవిత కావాలి కానీ తెలుగు పదాలు కనిపిస్తూనే వాక్యాలు మాత్రం మరేదో భాష చదివినట్టు ఉండకూడదు. రెంటికీ చాలా తేడా ఉంటుంది మరి.

    జయప్రభ.

  16. 16
    తఃతః September 18, 2013 3:13 am

    రెండవ ఫ్రశ్న :”అభిజ్ఞాన శాకుంతలంలో తుమ్మెద శకుంతల ముఖం చుట్టూ ఎందుకు తిరిగిందండి?”

    సమాధానం RYDER చెపితేనే బాగుంటుంది. నాకూ వినాలనుంది.

    మొదటి ప్రశ్న:’గిరీశం’ లాటి తెలుగు దగుల్బాజీ పోరంబోకు వెధవ ప్రస్తావన ఎలా తెచ్చారండీ?”

    4. శ్రీ వాడ్రేవు రాసింది చదువుతున్నప్పుడు ఒక గొప్ప స్పానిష్ కవి గురించి చదువుతున్నట్లనిపించలేదు గనక.
    3. మచాడో కవితలను తెలుగులో తానొక అనువాదకునిగా చెయలేదని శ్రీ వాడ్రేవు చెప్పారు గనక. [కవి కర్మ కావ్యమైనట్టు అనువాదకుడు చేసింది అనువాదం.]
    2. గిరీశం ‘చమక్కు’ ఇష్టం గనక.
    1. స్పానిష్ తొ పొలిస్తే ‘తెలుగు దగుల్బాజీ’అని నేను అనుకొలేదు గనక.

    తఃతః

  17. 17
    తమ్మినేని యదుకుల భూషణ్ September 18, 2013 4:20 am

    అనువాదంలో మహా ప్రజ్ఞ మాట దేవుడెరుగు, ఏ మాత్రం పట్టు దప్పినా అర్థం లోయలోకి జారి పోతుంది ద్రోహ వస్త్రాన్ని కప్పుకుని.అనువాదంలో స్వేచ్ఛకు పరిమితులున్నాయి. మూలంలో కవికి భాష పట్ల గల వివేచన మీద అనువాదకుడు శ్రద్ధ వహించాలి. మచాడో వాడుక భాషకు పట్టం కట్టిన వాడు. అలతి అలతి పదాలతో భావాన్ని తేట పరచగల సరళమైన శైలి అతని సొంతం. ఇవన్నీ విస్మరించదగిన అంశాలు కాదు అనువాదంలో. చైనీస్ కవిత్రయం (లీ పో, తో పు, వాంగ్ వీ) లో రస దూరం అధికం. కవితా శక్తిలో వారిని సమీపించగలిగిన వారు నాస్తి నాస్తి అనే చెప్పాలి. నాలుగు పద చిత్రాలు సమ కూర్చిన ప్రతి ఒకడు ఈ ప్రాచీన కవి త్రయంతో తూగలేరు, కారణం, కవిత్వమన్నది ఉన్నత నాగరకతలో భాగం, అలాగే, విజ్ఞానం తత్వ శాస్త్రాలు కూడా, వీటి మధ్య సమన్వయం గొప్ప నాగరికతల్లో (ఉదా చైనా , గ్రీసు, భారత నాగరికతలు) కనిపిస్తుంది. అంతే గాక, ప్రకృతి పరిశీలన అనాదిగా నాగరకతకు పునాది.అమోఘమైన శబ్ద శక్తితో భావాలను నాగరికతల ఎల్లలు దాటించే వాడు అనువాదకుడు కాబట్టి, తేనెటీగల్ని ఎక్కడ బడితే అక్కడ వదల రాదు. మూలాన్ని తరచి చూడకుండా చేసేది అనువాదమే కాదు. గుడ్డెద్దు చేలో పడినట్లు ప్రతీ కవితను అనువాదం చేయాలి అన్న లౌల్యాన్ని వీడి పరిమితులను గుర్తెరిగి చేసిన అనువాదాలు కాల పరీక్షను తట్టుకొని నిలబడతాయి.

    బార్న్ స్టోన్ సంకలనం బంగాళాఖాతం, రాబర్ట్ బ్లై తో (Times Alone) మొదలు పెట్టడం సులువు.The Poem Itself (1962) అన్న పుస్తకంలో మూల భాషలో కవిత, భావానువాదం, కవి పరిచయం ఉండటం వల్ల కొంత అవగాహన పెరుగుతుంది. (ఇందులో మచాడో కవితలు ఉన్నాయి). కావలిసిన పుస్తకాలు, ఉపకరణాలు ఉన్న ఈ శతాబ్దిలో మూల భాషనుండి తెనుగు చేయడం అన్ని విధాలా మంచిది. ఈ అనువాదాల్లో అన్నిటికన్నా నవ్వు తెప్పించినది “Noche de verano కవితకు అనువాదం:

    మూలంలో స్పష్టంగా :
    “Yo en este viejo pueblo paseando
    solo, como un fantasma.”

    ‘పాతవడ్డ పల్లెటూరులో నేను
    ప్రేతంలా ఒంటరిగా తిరుగుతాను’ అంటున్నాడు కవి

    దాన్నే మన బార్న్ స్టోన్ :
    ‘I walk through this ancient village,
    alone, like a ghost ‘

    అనువాదకుల ‘అంతర్గతంగా ఉండే ఒక మహాప్రజ్ఞ’ చేసే మిరకిల్:

    మూలంలోని దెయ్యం కాస్త నీడై కూచుంది, అది కూడా మామూలు అణా కాణీ నీడ కాదు, మూలంలో లేని ఒక పురాతనమైన నీడ

    ఈ ప్రాచీనగ్రామసీమలో
    ఒక పురాతనమైన నీడలా
    నేనొక్కణ్ణే నడయాడుతున్నాను

    చివరికి బొత్తిగా హృదయ కవాటాలు లేని గూగుల్ ఉపకరణం వాడి చేసిన ముక్కస్య ముక్క అనువాదం:

    “నేను ఈ పాత పట్టణంలో వాకింగ్
    ఒంటరిగా, ఒక దెయ్యం వంటి.”

    మూలాన్ని గాలికొదిలేసే అనువాదాలు , మూలాన్ని వదలలేని అనువాదాలు రెండు అతి వాదాలే, కాబట్టి , వీటికి దూరంగా ఇంచుక రసజ్ఞత తో చేసిన అనువాదాలు రాణిస్తాయి. “ఉప్పు కప్పురంబు ఒక్క పోలిక నుండు, చూడ చూడ రుచుల జాడ వేరు”

    ఏది ఏమైనప్పటికి ఒక అనువాదమంటూ చేసి అలరించిన వీరభద్రులను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అనువాదంలో స్వేచ్ఛ లాంటి విషయాలు మరొక విడి వ్యాసంలో ముచ్చటిస్తాను

    తమ్మినేని యదుకుల భూషణ్
    ———————————–
    “Noche de verano”
    Antonio Machado

    Es una hermosa noche de verano.
    Tienen las altas casas
    abiertos los balcones
    del viejo pueblo a la anchurosa plaza.
    En el amplio rectángulo desierto,
    bancos de piedra, evónimos y acacias
    simétricos dibujan
    sus negras sombras en la arena blanca.
    En el cénit, la luna, y en la torre,
    la esfera del reloj iluminada.
    Yo en este viejo pueblo paseando
    solo, como un fantasma.

    translated from the Spanish by Willis Barnstone

    “Summer Night”
    A beautiful summer night.
    the tall houses leave
    their balcony shutters open
    to the wide plaza of the old village.
    In the large deserted square,
    stone benches, burning bush and acacias
    trace their black shadows
    symmetrically on the white sand.
    In its zenith, the moon; in the tower,
    the clock’s illuminated globe.
    I walk through this ancient village,
    alone, like a ghost.
    ——————-
    వేసవి రాత్రి
    చాలా అందమైన వేసవి రాత్రి
    ఈ పురాతనగ్రామమైదానానికి
    మేడలు గవాక్షాలు తెరిచిపెట్టాయి
    మనుష్యసంచారం లేని విశాలక్షేత్రం
    రాతిబెంచీలు. చెట్లు, పొదలు
    తెల్లని ఇసుక మీద సౌష్టవంగా
    పరుచుకున్న నల్లనినీడలు.
    దిగంతరేఖ మీద చంద్రుడు
    గంటస్తంభంలో మెరుస్తున్న
    గడియారగోళం
    ఈ ప్రాచీనగ్రామసీమలో
    ఒక పురాతనమైన నీడలా
    నేనొక్కణ్ణే నడయాడుతున్నాను
    ——————

    ఇది ఒక అందమైన వేసవి రాత్రి.
    వారు పొడవైన ఇళ్లు కలిగి
    ఓపెన్ బాల్కనీలు
    anchurosa పాత పట్టణం చదరపు.
    పెద్ద దీర్ఘ చతురస్రం ఎడారిలో
    రాతి బల్లలు మరియు acacias evónimos
    సుష్ట డ్రాయింగ్
    తెలుపు ఇసుక వారి నలుపు నీడలు.
    అత్యున్నత స్థాయికి, చంద్రుడు, మరియు టవర్,
    ప్రకాశవంతమైన గడియార ముఖ.
    నేను ఈ పాత పట్టణంలో వాకింగ్
    ఒంటరిగా, ఒక దెయ్యం వంటి. (గూగుల్ అనువాదం )

  18. 18
    తఃతః September 18, 2013 11:44 pm

    “Hats off” భూషన్!’ఎవరో రావాలి!’ అన్నట్టు వచ్చారు మీరు.

    ‘ఈ మాట’ సంపాదక వర్గానికి: నిర్ణయం మీదే అయినప్పటికీ ప్రతి రచననీ కనీసం ఇద్దరికి చూపించండి. రచయితల పేర్లు చూసి అచ్చేసి వదిలేయకండి. ‘ఆరు నెలలలో అవధాని’ని ఎవరికైనా చూపించారా అని బహిరంగంగా అడిగినట్టు గుర్తు. “Bowler ఎవరు అని కాదు బంతి ఎలాంటిదొ చూసి ఆడు” అని చెప్పేవాడు చిన్నప్పుడు మా కేప్టెన్.

    తఃతః

    [మీ సలహాకి కృతజ్ఞతలు – సం.]

  19. 19
    V.Ch.Veerabhadrudu September 20, 2013 4:54 am

    ఈ చర్చ ముగిసిపోయిందనుకున్నాను గానీ, ఇంకా కొనసాగుతున్నందుకు ఆశ్చర్యంగానే ఉంది. ఒకటి రెండు వివరణలు ఇవ్వవలసి ఉందనిపించింది.

    1) బాల్యకాల అనే పదబంధంలో లోపమేమిటో నాకు తెలియలేదు. వైకం బహమ్మద్ బషీర్ గొప్ప మళయాళ రచయిత.ఆయన ఒక రచన పేరు బాల్యకాలసఖి. అది మళయాళ పదబంధమంటారా, తెలుగు మీద ఉన్నదానికన్నా సంస్కృత ప్రభావం మళయాళం మీద మరీ ఎక్కువ అన్నది అందరికీ తెలిసిందే.

    2) మరువం, దవనం అనే పేర్లని నేను ఉద్దేశ్యపూర్వకంగానే వాడాను. కవి మాట్లాడుతున్న సుగంధం కేవలం పుష్పజాతుల సుగంధం మాత్రమే కాదు, అదీకాక, ఈ వ్యాఖ్యలు చదివి చింతిస్తున్న నన్ను రాళ్ళబండి కవితాప్రసాద్ ఇటువంటి పదప్రయోగాలు గతంలో కూడా ఉన్నాయని, వెంటనే తన ధారణలోంచి సురభి మాధవరాయకవి అనే 18వ శతాబ్దపు కవి తన చంద్రికాపరిణయం అనే ప్రబంధంలో నాయిక తన కొప్పులో మరువం తురుముకున్నప్పుడు దాని మీద తుమ్మెదలు వాలాయని రాశాడని అన్నారు.

    3) ఇక తమ్మినేని యదుకులభూషణ్ గారికి నవ్వు తెప్పించిన నా పదప్రయోగం ‘పురాతమైన నీడ’లో నవ్వు తెప్పించిందేమిటో నాకు అర్థం కాలేదు. ఘోష్ట్ అనే పదానికి ప్రేతమనే అర్థమో, దెయ్యమనే అర్థమో గూగుల్ సెర్చ్ చూడకుండా కూడా స్ఫురించేవే. కాని కవి హృదయం అర్థమయితే తప్ప ‘పురాతనమైన నీడ’ అనే అర్థం స్ఫురించదు. కేవలం స్పానిష్ వాచకాన్ని ఇంటర్నెట్ ముందు కూచుని బాబిలోన్ ట్రాన్సలేటింగ్ టూల్ నొక్కితే వచ్చే అర్థం ప్రేతమని మాత్రమే ఉంటుంది. కాని మొత్తం కవిని చదివి కొన్నాళ్ళ పాటు మరే ధ్యాసా లేకుండా గడిపితేగాని ‘పురాతనమైన నీడ’ అన్న మాట స్ఫురించదు.నిజంగానే మహాప్రజ్ఞ చేసే మిరకిల్ ఇది.

    ఇంతకీ తెలుగులో ఇందరు స్పానిష్ మహాపండితులు ఉండి కూడా నాకు ఇన్నాళ్ళ పాటు మచాడో పేరు ఎందుకు తెలియలేదో?

  20. 20
    తఃతః September 20, 2013 8:10 am

    నేను మలయాళీ నైతే నాకు ‘బాల్యకాలం’ odd గా వినిపించేది కాదేమో. ‘పెద్ద కాలము’, ‘పిదపకాలం’ లాగా ‘బాల్యకాలం’ తెలుగు కు సొంతం గా అనిపించలేదు. పైగా కాలానికి సంబంధించి ‘బాల్యకాలం’లో కొంత superfluity ఉన్నట్టనిపించింది.

    తఃతః

  21. 21
    ఏల్చూరి మురళీధరరావు September 20, 2013 12:33 pm

    ఈ సంక్షిప్తలేఖలో ప్రసక్తింపబడుతున్నది ఉపరి చర్చాగతంగా వచ్చిన మరువం పైని భ్రమరావరోహణమన్న విషయానికి సంగతం:

    1) సురభి మాధవరాయల చంద్రికా పరిణయంలో నాయిక కైశ్యంలో మరువాన్ని అలంకరించుకోగా తుమ్మెదలు వాలిన వర్ణన ఉండినట్లు కనబడలేదు. నా దగ్గరున్నది వెల్లాల సదాశివశాస్త్రులు, అవధానం శేషశాస్త్రుల వారల అద్భుతమైన వ్యాఖ్యతో ఉన్న 1904 నాటి ముద్రణ. అందులో లేదు.

    2) లోకసిద్ధంగా మరువానికి పువ్వులుండనప్పటికీ, కావ్యాలలో కవులు మరువానికి పువ్వులను వర్ణింపకపోలేదు. ఒక ఉదాహరణ:

    వహ్నేః శక్తిర్జలమివ గతాఽదర్శనాద్దాహవృత్తే
    ర్నిత్యోద్గన్ధౌ నవమరువకే వర్తతే పుష్పకార్యమ్
    శీతాత్ త్రాసం దధదివ రవిర్యాతి చాశాం కృశానో
    ర్నీహారార్తా ఇవ చ దివసాః సామ్ప్రతం సఙ్కుచన్తి.
    – రాజశేఖరుని బాలరామాయణం (5-37)

    అని. దీనికి తిరుపతి వెంకటకవుల అనువాదం:

    చలి భరియింపలేక రవి సత్వరుఁడై చనుఁ బావకాశకున్;
    జ్వలునుఁడు నీరువోలెఁ గడుఁ జల్లనివాఁడయి యుండుఁ; బూవు మొ
    గ్గలు వికసించు నా మరువకంబులయంద హిమానికిం దినం
    బులు భయమందెనో! యనఁగఁ బొల్పఱు రాత్రులు వృద్ధిఁజెందఁగన్.

    3) లోకవిరుద్ధ మైనప్పటికీ నిర్గంధ కుసుమాలపై తుమ్మెదలు వచ్చి వ్రాలటం కూడా కవిసమయాలలో కవుల వర్ణనలలో ఉన్నదే. ఒక ఉదాహరణ:

    కింశుకం సుగంధరహితమన్నది లోకసిద్ధం:

    రూపయౌవనసంపన్నాః విశుద్ధకులసంభవాః
    విద్యాహీనా న శోభన్తే నిర్గంధా ఇవ కింశుకాః.

    అని. దీనికి జంధ్యాల పాపయ్యశాస్త్రి గారి తెలుగుసేత –

    జవ్వనంబుఁ గలిగి, సౌందర్యమును గల్గి,
    కలిమిఁ గలిగి, విద్యఁ గనని జనులు
    గంధరహిత కింశుక ప్రసూనంబులు
    లలితసుగుణజాల! తెలుఁగుబాల!!

    లోకవిరుద్ధమైనా గంధరహిత కింశుకం మీదికి తుమ్మెదలు వచ్చి వ్రాలిన వర్ణన ఒకటి:

    సామ్యం సమ్ప్రతి సేవతే విచకిలం షాణ్మాసికై ర్మౌక్తికై
    ర్బాహ్లీకీ దశనచ్ఛటారుణతరైః పత్త్రై రశోక శ్చితః
    భృఙ్గాలఙ్ఘితకోటికింశుక మిదం కిఞ్చిద్వివృన్తాయతే
    మాఞ్జిష్ఠస్తబకైశ్చ పాటలతరో రన్యైవ కాచిల్లిపిః.
    – రాజశేఖరుని విద్ధ సాలభంజిక (1 – 12)

    దీనికి జనమంచి వేంకట రామయ్య గారి తెలుగుసేత:

    ఇదె షాణ్మాసికమౌక్తికాళి కెనయై యింపొందెడున్ మల్లెపూ;
    లిదె తేఁటుల్ పయి వ్రాలఁ గింశుకసుమం బీషద్వివృంతం బగున్;
    ఇదె బాహ్లీకిరదచ్ఛదారుణములై యేపారుఁ గంకేళికా
    చ్ఛదముల్; రక్తగుళుచ్ఛముల్ నవరుచిన్ సంధించెడున్ బాటలిన్.

    ఇటువంటివి ఇంకా అనేకం ఉన్నాయి. కవిసమయం కాబట్టి మరువం పైని భ్రమరావరోహణమన్న కల్పన అంగీకార్యమే అనుకొంటాను.

  22. 22
    jayaprabha September 20, 2013 2:03 pm

    సంస్కృతం నించి ఒక్కోభాష పదాల అర్ధాలనీ సందర్భాలనీ ఒక్కో రీతిలో గ్రహించింది అన్న విషయం కాస్త పరిశీలిన చేసినా తెలిసే విషయం. కన్నడంలో నవలని కాదంబరి అంటారు. తెలుగులో అలా అనరు. హిందీలో ఉపన్యాస్ అంటారు. అదే పదం తెలుగులో వేరే అర్ధంలో వాడకం చేస్తారు. ఆగ్రహ్ అనే పదం హిందీ లోనీ తెలుగులోనీ ఒకే అర్ధంలో లేదు. ఇలా బోలెడు. అందువలన ఏ భాష వాడుక ఆ భాషదే అవుతుంది. దీన్ని సమర్ధించుకునే వీలేదీ? పాపం వీరభద్రుడికి సురభి మాధవరాయలు అనే వాడు ఇలా పనికొచ్చాడన్నమాట 🙂 అక్కడికి మాధవరాయలు రాస్తే అదేమన్నా ప్రమాణమా ఏమిటి?

    నాకు స్పానిష్ రాదు గనక నేను వీరభద్రుని అనువాదం లోంచి మచాదోని చదవ బోయాను. కాకపోతే ఆయన రాసిన తెలుగు లోంచి నాకు మచాదో కొరుకుడు పడలేదు. కొంపదీసి నాకు తెలుగు కూడా తెలియదని అనుకోడు కదా చినవీరభద్రుడు? “మహాప్రజ్ఞ చేసే మిరకిల్” ఆ ప్రజ్ఞ సంగతి దేవుడెరుగు గానీ అసలు ఈ పదబంధం ఏమిటబ్బా? ఇదేదో “తిలకాష్ట మహిషబంధం” కన్నా చిక్కుగా ఉందే!

    జయప్రభ.

  23. 23
    lyla yerneni September 20, 2013 8:20 pm

    లోకసిద్ధంగా మరువానికి పువ్వులుండనప్పటికీ,కావ్యాలలోకవులు మరువానికి పువ్వులను వర్ణింపకపోలేదు..

    పువ్వులతో కూడిన దారమునకు తావి అబ్బినట్టు – discussion thread పరిమళిస్తున్నది.

    మరువానికి, దవనానికి, వీటిని పూలకోసం పెంచకపోయినా, పూలు ఉంటాయండి. చిన్నవి. తులసి, కొత్తిమీర, పొదీనా, రోజ్మేరీ, ఈ herbs అన్నిటికీ పూలుంటాయి. నడిచే దారుల పక్కన, కొన్నిసార్లు దారులలోనే, నాపరాళ్ళ సందులలో వీటిని నాటితే, నడచినప్పుడల్లా బ్రతుకు ఘుమ్మంటుంది.

    తెలుగు ఆడవారు చాలా ఇష్టంతో మరువం, దవనాలను కుంపట్లలో పెంచుతారు. మరువం చిన్ని ఆకులతో సున్నితంగా ఉంటుంది. దవనం కొంచెం ట్విగ్గీగా, సిల్వరీగా ఉంటుంది. రెండూ, పూల మాలలలో, కలర్ కాంట్రాస్ట్ కూ, సుగంధాల మిళాయింపుకూ వాడతారు కద.

    తేనెటీగలూ, సీతాకోకచిలుకలూ, హమ్మింగ్ బర్డ్స్, ఇతర పిట్టలూ రావటానికి తోటలో రకరకాల జాతుల రంగుల పూలూ, పళ్ళ చెట్లూ ఆలోచనతో నాటిస్తారు. పాలినేషన్ సరిగా సాగటానికి, హెర్బల్ గార్డెన్, పూల మడులూ, పక్క పక్కనో, కలగలుపుగానో వెయ్యొచ్చు. అసలు తేనెటీగలు, సీతాకోకచిలుకలూ నిలకడ లేనివి కదా, అవి అన్ని మొక్కలనూ, కాస్తో కూస్తో విజిట్ చేస్తాయి.

    ఇంతకీ, రచనలో ఒక్క ద్రోహ చింతన లేదే? ఎందుకండీ ఎవరైనా వ్యాఘ్రాల్లాగా పొంచి ఉండటం? ఎందుకు ఈ రచన ప్రచురణ యోగ్యం కాదన్నట్టు, నిఘా పెంచితే, ఇట్టి, పొరపాట్లు జరగవన్నట్టు, హెచ్చరికలు? ఏమో, ప్రేతాలని, భూతాలని ఇంకా దర్శించని నాకు, ఒక ‘పురాతనమైన నీడ’ eery గా ఉంది. అసలు ఒక సమకాలీకుడైన రచయిత నాకు ప్రజ్ఞ ఉన్నది అని తనంత తాను చెపితే మనం నమ్మలేమా? అది మనకు బడాయి లాగానూ, నవ్వు కలిగించేది గానూ ఉంటుందా? అతని రచన లోని అందం ఇంకా మసకేసి పోతుందా?

    లైలా

  24. 24
    jayaprabha September 21, 2013 1:29 am

    ఇక్కడ అనువాదం లోని విషయాలని గురించి మాట్లాడటం అన్నది విషయం! నేను చినవీరభద్రుని ప్రయత్నాన్ని మెచ్చుకుంటూనే నాకు కనబడిన ఇబ్బందిని ప్రస్తావన చేశాను. తెలుగు చేసినప్పుడూ పైగా దానిని అచ్చువేసినప్పుడు ఇతరులు వారి అభిప్రాయాలని తెలియజేయమనే అర్ధం. “పొగడమని” కాదనుకుంటాను. లైలాకి నచ్చి ఉంDaవచ్చు. అంతమాత్రాన అందరికీ నచ్చాలా? ఒకవేళ Eదన్నా అభ్యంతరాలు ఉన్నప్పుడు ఆ అనువాదకుడు వాటిని గురించి ఆలోచిస్తాడే తప్ప రాసిన వారి “పాండిత్యాన్ని” ప్రశ్నించడు. లైలాకి ఇవి కనిపించలేదో లేక అలాంటివి ఆమెకి ఇష్టమో మరి. లైలా ఏకంగా రాసినవారిని “పులులని” అనడం అంటే అసలు అది ఆమె స్వభావాన్ని గురించి చెప్పుకోవడమే కదా? అంత నిస్ఠూరం దేనికో? నా వరకు అయితే నేను పులినీ కాను వీరభద్రుడు లేడి కూనా కాడు. అనువాదాలు చేయడం మంచిది. కానీ ఎలా చేయడమో అది కూడా ఎంతో ముఖ్యమే! ఏదో ఒకటి రాసేను కదా “ప్రశంసించమంటే” అదేదో సామెత లాగా ఉంటుంది. ఎప్పుడైనా ఏ రాత అయినా చిట్ట చివరికి ఆస్వాదయోగ్యంగా అయితే ఉండాలి. పంటికింద రాయి పడ్డట్టు పదబంధాలు ఇబ్బందిని కలిగించకూడదు. అనువాదం చేయడం మంచి సంగతి. అయితే అది బాగా ఉండేలా చేయడం కూడా అంతే మంచి సంగతి. ఇంక అచ్చువేసినప్పుడు అభిప్రాయాలని ఆశించడమనే అర్ధం! ఐతే అన్నిసార్లూ ఆ అభిప్రాయాలు అనువాదకునికి నచ్చేవే ఉండవు. చదివే పాఠకుల అనుభవం సైతం ఇక్కడ అంతే ముఖ్యం గనక! ఇదే విషయం!

    జయప్రభ.

  25. 25
    ఏల్చూరి మురళీధరరావు September 21, 2013 3:17 am

    యెర్నేని లైలా గారికి
    నమస్కృతులతో,

    మీ సహృదయవాక్యానికి ధన్యవాదాలు. ప్రసక్తింపబడుతున్నది మరువం పువ్వులపై తుమ్మెదలు వాలటం అన్న వాక్యాధికరణం తర్వాత కాబట్టి దానిని పునరుక్తం చేయలేదు. అయినా, లోకసిద్ధంగా భ్రమరావరోహణకు పాత్రంగా మరువానికి పువ్వులుండనప్పటికీ, కావ్యాలలో కవులు మరువానికి పువ్వులను పెద్దవిగా వర్ణింపకపోలేదు. అని నేను సరిగా వ్రాసి ఉంటే, అతివ్యాప్తికి తావుండేది కాదు.

    మీ కొత్తిమీర పువ్వుల ప్రస్తావం, ప్రస్తావన:

    కొత్తిమీర పువ్వుల మైమరపించే సువాసన తనకెంతో ప్రీతిపాత్రమని, అయితే, కొత్తిమీరను నలిపినప్పుడు వచ్చే ఘాటైన వాసన మాత్రం తనకు ప్రాణాంతకంగా అనిపిస్తుందని – రాయప్రోలు సుబ్బారావు గారు అనేవారు. ఇంటర్వ్యూలలో అన్నారు కూడాను. వారితో సహకృతంగా దానిని సౌందర్యద్రవ్యంగా పరిగణించి, “కొత్తిమిరి సొగసును గుస్తరించి” విరివిగా కవితలలో వర్ణించిన తెలుగు కవులు ఇంకొకరిద్దరికంటె ఉండరేమో.

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

    అస్థానపతితంగా పెద్దలకు ఈ హృదయగతాన్ని కూడా మనవి చేస్తున్నందుకు దయతో మన్నింప ప్రార్థన:

    విమర్శనీయం ఎక్కడ కనుపించినా విమర్శకులు విమర్శించటం సరస్వతీతత్త్వమే అని నేనకొంటాను.

    విమర్శలో తర్కసంగతి వల్ల, వ్యక్తివివేకం వల్ల 1) వాద బలం 2) వాది బలం అన్నవి ఎప్పుడూ ఉంటాయి. వాదబలంలోని సౌష్ఠవం, వాదిబలంలోని నిష్ఠురత – రెండూ విద్యార్థులకు శిక్షాప్రణీతాలే. ఆనందవర్ధనుడంతటి మహానుభావుణ్ణి జయంత భట్టు ‘పణ్డితమ్మన్యః’ అన్నాడు. ఆయన విమర్శ కారణంగానే మనము ఆనందవర్ధనుణ్ణి ఆలంకారిక సార్వభౌమునిగానూ; జయంత భట్ట జగదీశ భట్టులను నైయాయిక సార్వభౌములుగానూ శిరసావహిస్తున్నాము.

    కవి కృతితోపాటు విమర్శను అధ్యయనించటమూ – అదెంత ప్రామాణికమైనా, కాకపోయినా – మనకు “రజతగిరి మీఁద హరిహరారాధనంబు”.

    ఒకవేళ విమర్శకవాక్యంలో అసంగతమైన కటుత్వం, అసహృదయత, నిష్కర్షలో ప్రకర్ష ధ్వనించినదనుకొన్నా, అధ్యయనపరులకోసం కవులు, సహృదయులు ఓరిమితో సమాధానం చెప్పక తప్పదు. అదే విమర్శ కాలాంతరంలోనూ వెలువడవచ్చును కనుక.

    కవితావిమర్శలో కవి – విమర్శకుల చర్చలో సాంయాత్రికుల వాకోవాక్యాలలో పారస్పరికత నిర్నిమిత్తం.

    భక్తునికి సాటి భక్తుల భక్తిని విమర్శించే అధికారం లేదని భక్తిశాస్త్రం అంటున్నది. భక్తిపరులకు సాహిత్యం, విమర్శ క్రమప్రథతో స్వస్వరూపాన్ని అనుసంధించే తుల్యపథాలే.

  26. 26
    Dr.Ismail September 21, 2013 11:42 pm

    ఏల్చూరి మురళీధరరావు గారు — మీ మొదటి వ్యాఖ్య చదువుతూంటే ఓ విధమైన గగుర్పాటు కలిగింది. Thanks. For me ‘పురాతనమైన నీడ’ gave me ‘రససిద్ధి’ as for as that poem is concerned.

    Nice discussion. Enjoyed it.

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • మరొకసారి గంగ నేలకు దిగింది
  • నిత్యవసంతం కృష్ణశాస్త్రి కవిత్వం
  • పఠాభి కవిత్వం: మళ్ళీ కొత్తగా కొన్ని ఆలోచనలు
  • పరిచయం: ఇంటివైపు – అఫ్సర్ కవితల సంపుటి
  • స్వప్నలోకచిత్రకారుడు మచాడో

ఇటువంటివే…

  1. శ్రీ సూర్యనారాయణా…
  2. పలుకుబడి: ఋతువులు, కాలాలు
  3. తెలుగు ప్రపంచభాష ఎప్పుడవుతుంది?
  4. కొన్ని త్రిపుర సందర్భాల్లో
  5. బ్రౌన్‌ని సమగ్రంగా ఎవరూ చూడలేదు: పరుచూరి శ్రీనివాస్‌తో ఆకాశవాణి ముఖాముఖీ

సెప్టెంబర్ 2013 సంచికలో ...

  • అదే నేను
  • బ్రౌన్‌ని సమగ్రంగా ఎవరూ చూడలేదు: పరుచూరి శ్రీనివాస్‌తో ఆకాశవాణి ముఖాముఖీ
  • ఇంటి మొగుడు
  • ఈమాట సెప్టెంబర్ 2013 సంచికకు స్వాగతం!
  • ఉగాది కవిసమ్మేళనాలు
  • ఏటి గట్టున ఇల్లు
  • కినిగె స్మార్ట్ స్టోరీ కాంపిటీషన్
  • కొన్ని త్రిపుర సందర్భాల్లో
  • కోళ్ళ మంగారం మరికొందరు
  • ట్రిల్
  • తెలుగు ప్రపంచభాష ఎప్పుడవుతుంది?
  • దశావతారస్తుతి
  • దానవోద్రేక స్తంభకుడు
  • నాకు నచ్చిన పద్యం: శ్రీనాథుని శృంగారలీల
  • పలుకుబడి: ఋతువులు, కాలాలు
  • పల్లెటూర్ to పట్నం: The Seven Seater
  • రక్తకన్నీరు
  • రాతి పడవ
  • శ్రీ సూర్యనారాయణా…
  • సమ్మోహనామృతం
  • స్వప్నలోకచిత్రకారుడు మచాడో
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

కొన్ని త్రిపుర సందర్భాల్లో
బ్రౌన్‌ని సమగ్రంగా ఎవరూ చూడలేదు: పరుచూరి శ్రీనివాస్‌తో ఆకాశవాణి ముఖాముఖీ

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.