నాకు నచ్చిన పద్యం: ధర్మజుని గుణవిశేషం

సీ.  ఎవ్వని వాకిట నిభమద పంకంబు
            రాజభూషణ రజో రాజి నడఁగు
      ఎవ్వని చారిత్ర మెల్ల లోకములకు
            నొజ్జయై వినయంబు నొరపు గఱపు
      నెవ్వని కడకంటి నివ్వటిల్లెడు చూడ్కి
            మానిత సంపద లీనుచుండు
      నెవ్వని గుణలత లేడు వారాసుల
            కడపటి కొండపైఁ గలయ బ్రాఁకు

తే.  నతడు భూరిప్రతాప, మహా ప్రదీప
      దూర విఘటిత గర్వాంధకార వైరి
      వీర కోటీర మణి ఘృణి వేష్టితాంఘ్రి
      తలుఁడు కేవల మర్త్యుఁడే ధర్మసుతుడు

పైపద్యం తిక్కన సోమయాజిది. ఆంధ్ర మహాభారతం విరాటపర్వం లోనిది. విరటుని అంతఃపురంలో సైరంధ్రిగా ఉన్న ద్రౌపది, ధర్మజుని గొప్పతనాన్ని గురించి భీమసేనునకు బోధించే పద్యం.

పాండవులను పెండ్లాడినప్పటి నుండీ అవమానాల తర్వాత అవమానాలను ఎదుర్కుంటూనే ఉన్నది ద్రౌపది. పెండ్లయిన మొదటి రోజే ఏకచక్రాపురంలో ఆ రాజపుత్రి పేదరికం అనుభవించింది. రాజసభలో తనకు తెలియకుండానే జూదంలో పందెంగా ఒడ్డబడింది. ఓడి పరునకు దాసి అయింది. ఏకవస్త్రగా ఉన్నపుడు సభలోకి లాక్కొని రాబడింది. అత్యంత అవమానకరంగా, దయనీయంగా గుడ్డలూడ లాగబడింది. అరణ్యవాసంలో సైంధవుని కామపు చూపులకు గురై రథమ్మీద కట్టివేయబడింది. అజ్ఞాతవాసంలో దాసీ పనికి నియోగింపబడింది. కీచకుని కామానికి గురయ్యింది. సభాభవనంలో కీచకుని చేత కాలి తాపు తిన్నది. రాజుకు మొరబెట్టుకోటానికి పోయి ధర్మజునిచే మందలించబడింది. ఇన్ని ఇడుములకూ కారణం ధర్మజుడే. అదేమాట భీమసేనుడు ద్రౌపదితో అని అన్నను గురించి విసుక్కుంటే – అది సరి కాదు, ధర్మజుడు సామాన్యుడు కాడు అని ఆయనను ఆకాశానికి ఎత్తుతుంది ద్రౌపది!

ఆశ్చర్యం ఏమిటంటే ఈ మాటలు ఈ సందర్భంలో – అంటే కీచకుని చేత భంగపడిన తర్వాత – చెప్పడమే! నిజానికి ధర్మజుని తమ్ములకన్నా, భార్యగా తానే చాలా బాధలనుభవించింది. బహుశా ఆమె సౌందర్యంలో ఏదో ప్రత్యేకమైన జ్వాల ఉండి వుండాలి. దుర్యోధనుడూ, కీచకుడూ, సైంధవుడూ (వీడు సోదరుడి వరస కూడా) – ప్రతీవాడూ ఆమె సౌందర్యానికి మోహితుడైనవాడే (బహుశా కర్ణునికీ అంతరాంతరాలలో ఆ ఆశ ఉన్నట్లే వుంది. కృష్ణుడు రాయబారానంతరం కర్ణుని కలిసి మాట్లాడేటపుడు ఈ బలహీనతను స్పృశించి వదులుతాడు). ఇలా అందరి దుర్దృష్టులకూ కేంద్ర బిందువై ఈమె చాలానే బాధ పడింది. దీనంతటికీ ధర్మరాజే కారణం అనే సంగతి ఆమె అనుభవానికి వచ్చిందే.

ఐనా, ఆమె ధర్మజుని గురించి అంత పొగడికగా మాట్లాడిందీ అంటే, ఆమెకు ధర్మరాజు వ్యక్తిత్వంలోని ఏదో మహత్తు – బహుశా మానవాతీతమైనది – ఆకర్షించివుండాలి. కేవల మర్త్యుడే ధర్మసుతుడు అని అన్నదంటే ఆయనను ఆమె మానవాతీతుడైన మహాత్మునిగానే గుర్తించివుండాలి. ఇది ఏదో ఒక పతివ్రతా స్త్రీ తన భర్తను గూర్చి పలికే చిలక పలుకుల్లా అనిపించడం లేదు. ధర్మజుని వైభవాన్నీ, అతని లోకస్తుత్యమైన శీలాన్నీ, అధికారాన్నీ, కీర్తినీ – అన్నిటినీ విశదీకరిస్తూ, అతడు కేవలం మానవుడే! అని నిజంగా ఆశ్చర్యపోతున్నది.

‘ఎవ్వని వాకిట నిభమద పంకంబు రాజభూషణ రజో రాజి నడగు’ అనడంలో ధర్మజుని గజబలమూ, సామంత బలమూ ఒకేసారి చర్చితమైనాయి. ఆ మహారాజు వాకిట వున్న గజరాజుల మదధారల వలన నేలంతా బురద అయిపోతే – రాజదర్శనానికి వచ్చిన సామంతరాజుల రద్దీ కారణంగా వారి శరీరాల మీది భూషణాల్లోని రత్నమాణిక్యాలు ఒకటొకటి రాచుకున్నందువలన – రాలిన వజ్రాల పొడి ఆ బురదను అడగిస్తున్నదట. ఎంత చక్కని ఊహ! అతని శీలం సర్వలోకాలకూ ఉపాధ్యాయకమై వినయంలో పాఠాలు నేర్పిస్తున్నదట. అతని కడకంటి చూపు సోకిన చోట మహా సౌభాగ్యాలు వెల్లివిరుస్తాయట. అతని సద్గుణాల చర్చ సప్తసముద్రాల అవతలి పర్వతాల మీదకి ప్రాకుతాయట. అటువంటి ధర్మజుడు – వైరివీరుల గర్వాంధకారాన్ని దూరానికి తరిమివేసే గొప్ప దీపం లాంటి ప్రతాపంతో శత్రువుల చేత కాళ్ళు మ్రొక్కించుకునే ధర్మజుడు – కేవలం మర్త్యుడేనా? ఇదీ పద్య భావం.

ఇకపోతే పద్యం ఎత్తుగడే గొప్పగా వుంది. ఇలాంటి ఎత్తుగడ గల పద్యాలు తెలుగు కవిత్వంలో ఆ తరువాతా చాలా వచ్చాయి గానీ, ఈ ధోరణి పద్యాలలో ఇదే తొట్ట తొలి పద్యం అంటారు. ఆ కారణం వల్ల కూడా ఈ పద్యం ప్రత్యేకమైనది. సాధారణంగా ఈ ఎత్తుగడతో సీసపద్యాలే బాగుంటాయి. మొదటి నాలుగు పాదాల్లో ఎవ్వని, ఎవ్వని అంటూ మొదలు పెట్టి చివరకు వచ్చేసరికి, అటువంటి వాడు అని తేల్చి చెప్పే పద్ధతి వలన – ముగింపులోని శక్తి కారణంగా ఉద్దిష్టాంశానికి అధికమైన ప్రాధాన్యం, ఒక ఒత్తిడి తీసుకువచ్చే అవకాశం కలుగుతుంది. అంతే కాదు, మొదటి నాలుగు పాదాలూ, ఏ పాదానికి ఆ పాదం భావం విరిగిపోయేట్టు చెప్పి, ఎత్తు గీతిలో ఒకే పెద్ద సంస్కృత సమాసాన్ని నాలుగు పాదాల్లోకీ చొచ్చుకుపోయేట్టు గుప్పించడం ద్వారా, మొదటి నాలుగు పాదాల్లో చెప్పిన దానికి మరింత ఊనిక, ఊపు వచ్చే వీలు కుదిరింది. ఈ ఎత్తుగడ, ముగింపు కలిగిన పద్యాలు ఆతర్వాతి కవులను చాలామందిని ఆకర్షించాయి. ఎందరో వ్రాశారు కూడా (ఉదా: ఏ దేవి సేవింతు రేకామ్రనాధుండు, కరిగిరీశుడు కింకరుల వోలె – హరవిలాసము, శ్రీనాధుడు).

ఇక పద్యంలో భాష కూడా ప్రత్యేకించి చెప్పుకోవలసిందే. తిక్కన సాధారణంగా తెలుగు పక్షపాతి అయినా సందర్భోచిత పద్యమూ, పద్యోచిత భాషలను బాగా పాటించినవాడు. ఇక్కడి సందర్భం తత్సమ పద బాహుళ్యాన్ని ఆశించేది. ఆందుకని ఎత్తు గీతిలో పెద్ద సంస్కృత సమాసాన్ని ఎత్తిపోశాడు. ‘ఎల్లలోకములకు ఒజ్జయై ఒరపు గఱపు, కడకంటి నివట్టిల్లెడు చూద్కి, కడపటి కొండపై కలయ బ్రాకు’ – లాంటి చక్కటి తెలుగు పద బంధాలను సంస్కృత పదాల మధ్యలో మల్లెపూల మాలలో కనకాంబరాలలా పొదిగి ఒదిగించి, పద్యధారకు ఎంతో సౌలభ్యాన్ని చేకూర్చాడు.

పదంలో గానీ, పద్యంలో గానీ, భావంలో గానీ, అభివ్యక్తి నైపుణ్యంలో గానీ ఎంతో ఔచితినీ, సామర్థ్యాన్నీ సాధించిన కవిగా, అందరికన్నా ముందు కవిబ్రహ్మనే సంభావించాలి. ద్రౌపది చెప్పినట్లు ధర్మవిభుడు కేవలం మర్త్యుడు అవునో కాదో కానీ, తిక్కవిభుడు మాత్రం కేవల కవిమాత్రుడు కాదు.