ఒక తెలుగు పుస్తకం కావాలి

బైబిల్, డిక్షనరీ ల తరువాత అమెరికాలో విరివిగా అమ్ముడు పోయిన పుస్తకం విలియమ్‌ స్ట్రంక్ (William Strunk, Jr.) ఇ. బి. వైట్ (E. B. White) రాసిన ది ఎలిమెంట్స్ ఆఫ్ స్టైల్ (The Elements of Style) అనే నూరు పేజీల పుస్తకం. ఇప్పటికి పది మిలియనుల పైచిలుకు కాపీలు అమ్ముడు పోయాయి. ఈ పుస్తకానికి యాభై సంవత్సరాలు నిండాయి. ఇంగ్లీషుమాటల వాడుకకు ఏడు నియమాలు, రచనకి ఉపయోగపడే పదకొండు సూత్రాలు, రచన రూపం నిర్దేశించే కొన్ని వివరాలు, రాసేటప్పుడు చాలామంది చేసే కొన్ని దుష్ప్రయోగాలు – ఇవి, ఈ పుస్తకంలో కూర్చబడ్డాయి.

ఈ పుస్తకం చరిత్ర విచిత్రమైనది. 1919 లో ఇ. బి. వైట్ కార్నెల్‌ విశ్వవిద్యాలయంలో ఇంగ్లీషు కాంపొజిషన్‌ క్లాసులో విద్యార్థి. పాఠం చెప్పే మేష్టారు విలియం స్ట్రంక్. పాఠ్యపుస్తకం మేష్టారు రాసి అచ్చు వేసుకున్న నలభైమూడు పేజీల పుస్తకం – ది ఎలిమెంట్స్ ఆఫ్ స్టైల్.

ఇ.బి. వైట్, ది న్యూ యార్కర్ (The New Yorker) వారపత్రిక సంపాదకుడుగా పనిచేసాడు. 1957 లో వైట్ ఈ పుస్తకాన్ని ప్రశంసిస్తూ ఆ పత్రికలో ఒక వ్యాసం రాసాడు. అప్పటికి ప్రొఫెసర్ స్ట్రంక్ చనిపోయి చాలాకాలం అయ్యింది. మేక్మిలన్‌ ప్రచురణ సంస్థ ప్రోద్బలంతో వైట్ ఆ పుస్తకానికి సవరణలు చేసి, రచనా రీతి, పద్ధతిపై ఒక కొత్త అధ్యాయం చేర్చి 1959 లో ప్రచురించాడు. ఆ తరువాత ఈ పుస్తకానికి నాలుగు ఎడిషన్లు వచ్చాయి. ఈ సంవత్సరం యాభయ్యవ వార్షిక ప్రతి అచ్చయ్యింది. ఇప్పటికీ ఇది నూరు పేజీల పుస్తకమే!

ఈ పుస్తకంలో సూత్రాలని సంప్రదించని వ్యాసకర్తలు గాని, నవలా రచయితలు గాని, కవులు గానీ ఉండి ఉండరు. ఇది అతిశయోక్తి కాదు. ఉదాహరణకి, రిచర్డ్ ఫోర్డ్ (Richard Ford), జే పరిని (Jay Parini), డేవిడ్ రెమ్నిక్ (David Remnik) , డొరొతీ పార్కర్ (Dorothy Parker) , స్టీవెన్‌ కింగ్ (Stephen King), జాన్ అప్‌డైక్ (John Updike), రాబర్ట్ పిన్‌స్కీ (Robert Pinsky), లాంటి ప్రసిద్ధ రచయితలు ఈ పుస్తకానికి నివాళులర్పించారు.

ఇది ఇంగ్లీషులో రచనలకు సంబంధించిన విషయం. ఇంగ్లీషు రచయితలకి ఉపయోగపడే విషయం. తెలుగులో రాసే వారికి దీని ప్రస్తావన ఎందుకు అని అడగవచ్చు. ఆ ప్రశ్నకి సంజాయిషీ ఇచ్చుకునేముందు, తెలుగులో ఇప్పటి రచనా విధానం గురించి ముచ్చటించుకుందాం.

మనలో చాలామంది వాడుక భాషలో రాస్తారు. అయినా, మాట్లాడినట్టుగానే రాయరు. రాసేటప్పుడు వాక్యనిర్మాణం మాట్లాడేటప్పటి వాక్యనిర్మాణంలా ఉండదు. అలా ఉండాలా, వద్దా అన్న ప్రశ్నని కాస్సేపు పక్కకు పెట్టి, మనం రాస్తున్న భాషకి వ్యాకరణ సూత్రాలు ఏమిటి, ఎక్కడ ఉన్నాయి అని ప్రశ్నించుకుందాం. ఇప్పటి వరకూ మనకి వాడుకభాష వ్యాకరణంపై పుస్తకం లేదు. చిన్నయసూరిగారి పుస్తకం మనలాంటి వాళ్ళు రాయడానికి ఉపయోగపడదని మీకు తెలుసు.

అచ్చు యంత్రం రాకముందు తెలుగు రచనలలో విరామస్థాన సూచికలు లేవు. మొట్టమొదటిసారి అచ్చయిన చాలా పాత గ్రంధాలు చూడండి. మాటకీ మాటకీ మధ్య జాగా కూడా ఉండేది కాదు. ఇప్పుడు అలా అచ్చు వేస్తే చదవడం ఎంత కష్టమో ఆలోచించండి. కామా, ఫుల్‌స్టాప్, కోలన్‌, సెమికోలన్‌, కొటేషన్‌ మార్కులు, మాటకీ మాటకీ మధ్య జాగా మొదలైన చిహ్నాల వాడకం పుస్తకాలు విరివిగా అచ్చువెయ్యడం మొదలైన తరువాతనే పెరిగింది. ఇది ఇంగ్లీషు ప్రభావమే. ఇప్పటికీ వాక్యంలో ఎప్పుడు, ఎక్కడ ఏ విరామచిహ్నాలు పెట్టాలో సూచించే పుస్తకం లేదు. అంతే కాదు, వాడుకభాషలో రాసినప్పుడు వాక్యనిర్మాణం ఎట్లా ఉండాలో నేర్పే పుస్తకం లేదు.

ఉదాహరణకి ఈ సంపాదకీయంలో మొట్టమొదటి వాక్యం తీసుకోండి. ఎక్కడెక్కడ కామాలు పెట్టడం అవసరమో, ఎక్కడ అనవసరమో నిర్దేశించే పుస్తకం లేకపోవడం వలన, నా ఇష్టమైన చోట నేను విరామచిహ్నాలు పెట్టుకుంటాను. దీనిని పరిష్కరించే ఎడిటర్ తనకు తోచినచోట తాను విరామచిహ్నాలని పెడతాడు. నా వాక్యనిర్మాణ సరళి, దాని విమర్శ కాసేపు మరిచిపోదాం. నా మొదటి వాక్యంలో ఎక్కడా విరామ చిహ్నాలు పెట్టకపోతే వాక్యం చదివి అన్వయం చేసుకోవడం ఎంత కష్టమో ఆలోచించండి.

స్ట్రంక్ అండ్ వైట్ పుస్తకంలో సూచించిన విరామ సూత్రాలు కొద్ది మార్పులతో మనకి కూడా ఉపయోగ పడతాయి.

పోతే, వాక్యనిర్మాణం. ఆ మొదటి వాక్యమే తీసుకోండి – స్ట్రంక్, ఇ. బి. వైట్ రాసిన ది ఎలిమెంట్స్ ఆఫ్ స్టైల్ అనే నూరు పేజీల పుస్తకం, బైబిల్, డిక్షనరీల తరువాత అమెరికాలో విరివిగా అమ్ముడు పోయిన పుస్తకం. ఈ రకమైన వాక్య నిర్మాణం సూటిగా ఉన్న నిర్మాణం. బహుశా, పాఠకుడికి తేలికగా అర్థమవవచ్చు. వాక్యనిర్మాణం గురించి వాళ్ళ పుస్తకంలో ఇచ్చిన అన్ని సూచనలూ మనకి ఉపయోగపడవు. నిజమే! పాఠకుడిని దృష్టిలో పెట్టుకొని రచనలని మెరుగు పరిచే కొన్ని సూత్రాలు తెలుగు రచనలకి కూడా ఉపయోగ పడతాయి. ‘ది ఎలిమెంట్స్ ఆఫ్ స్టైల్’ వంటి పుస్తకం తెలుగులో తయారు చేసుకోవలసిన అవసరం ఉన్నదని నేను నమ్ముతున్నాను. అందుకని ఆ పుస్తకప్రస్తావన తెచ్చాను.

రచనారీతి, పద్ధతి – అంటే స్టైల్‌ (‌style) అని నా భావం. వీటిని నిర్దేశించడం ఏ భాష లోనూ సాధ్యమైన పని కాదు. అది వ్యక్తిగత విషయం. మహా కవులెందరో వ్యాకరణ సూత్రాలని ఉల్లంఘించి రాసారు. అటువంటి రచనలు చదివినప్పుడు, వ్యాకరణ సూత్రాలను మరిపించే మహత్తరమైన విశేషమేదో మనమనసుకి హత్తుకొనిపోతుంది. ఆ రచనారీతి అందరికీ సాధ్యం కాదు కాబట్టి, స్ట్రంక్ అండ్ వైట్ పుస్తకం లాంటిది మనకి అవసరం.

రచయితలకేనా ఇటువంటి సూత్రాల పుస్తకం అని అడగచ్చు. ఎడిటర్లకు కూడా ఇటువంటి పుస్తకం అవసరమే! ఇంగ్లీషు ఎడిటర్లకి ఉపయోగపడే పుస్తకం ఆర్థర్ ప్లాట్నిక్ (Arthur Plotnik) రాసిన ది ఎలిమెంట్స్ ఆఫ్ ఎడిటింగ్, ఎ మోడర్న్ గైడ్ ఫర్ ఎడిటర్స్ అండ్ జర్నలిస్ట్స్ (The Elements of Editing, A Modern Guide for Editors and Journalists), 1982 లోనే వచ్చింది. కానీ, అందులో చాలా వివరాలు జర్నలిస్టులకి ఉపయోగపడతాయి. జర్నల్స్‌ సంపాదకులకి అంతగా ఉపయోగపడవు.

తెలుగులో తయారు చేసుకునే పుస్తకం, రచయితలకి, జర్నలిస్టులకి, ఎడిటర్లకి, ఉపయోగపడేటట్టుగా ఉండాలి. ఇది ఎంత చిన్నదిగా ఉంటే అంత మంచిది. ఆఖరిగా మిలియన్‌ డాలర్ల ప్రశ్న.

పిల్లి మెడలో గంట కట్టేదెవరు?