ఏనుగుల ఆటలా – నవరసాలకు బాటలా?

పరిచయము

పురాతనమైన వృత్తాలలో శార్దూలవిక్రీడితము ఒకటి. దీనిని అశ్వఘోషుని కాలమునుండి కవులు వాడుచున్నారు. ప్రతి పాదమునకు పందొమ్మిది అక్షరాలు. ఈ వృత్తము సంస్కృత కవులకు అన్నము, రొట్టె వంటిది. దీనికి గణములు- మ-స-జ-స-త-త-గ, గురులఘువులు- UUU IIU IUI IIU UUI UUI U, (I = లఘువు, U = గురువు), యతి పదుమూడవ అక్షరము. చరిత్రపుటలలో శతాబ్దాలకు ముందు అజ్ఞాత కవి ఒకడు ఒక చిన్న ప్రయోగమును చేయగా కలిగిన పర్యవసానమే మత్తేభవిక్రీడితవృత్తము. శార్దూలవిక్రీడితము నందలి మొదటి గురువును రెండు లఘువులుగా మార్చుటే ఈ ప్రయోగము. ఆ లాక్షణికుడు ఈ వృత్తమునకు మత్తేభవిక్రీడితము అని పేరు పెట్టెను. విక్రీడితము అంటే ఆట. శార్దూలవిక్రీడితము పులుల ఆట అయితే మత్తేభవిక్రీడితము మదించిన ఏనుగుల ఆట.

మత్తేభవిక్రీడితమునకు గురులఘువులు- IIU UII UIU III UUU IUU IU, గణములు- స-భ-ర-న-మ-య-వ, యతి పదునాలుగవ అక్షరము. కన్నడ కవులు తమ కావ్యములలో ఎక్కువగా ఆఱు సంస్కృత వృత్తాలను మాత్రమే వాడారు. అవి- శార్దూలమత్తేభ విక్రీడితములు,చంపకోత్పలమాలలు, స్రగ్ధరమహాస్రగ్ధరలు. తెలుగు కవులు స్రగ్ధరమహాస్రగ్ధరలను చాల తక్కువగా వాడారు. తెలుగు కవులు క్రమముగా చంపకమాల, ఉత్పలమాల, మత్తేభవిక్రీడితము, శార్దూలవిక్రీడితములను ఎక్కువగా వాడారు. అనగా తెలుగు వృత్తాల వాడుకలో మత్తేభవిక్రీడితమునకు మూడవ స్థానము. మత్తేభము అని మఱొక వృత్తము ఛందశ్శాస్త్రములో ఉన్నా మత్తేభవిక్రీడితమును మత్తేభము అని కూడ పిలిచెదరు.

వృత్తౌచిత్యము

క్షేమేంద్రకవి సువృత్తతిలకము సంస్కృతములో ప్రసిద్ధమైనది. ఏయే వృత్తాలను యేయే సందర్భాలలో వ్రాయాలో అన్న విషయాన్ని ఇందులో క్షేమేంద్రుడు వివరించెను. ఆ కాలములో మత్తేభవిక్రీడితము ఉపయోగములో లేదు. అతడు మత్తేభమునకు జననియైన శార్దూలవిక్రీడితమును గుఱించి ఈ విధముగా చెప్పెను-

శౌర్యస్తవే నృపాదీనాం రాజుల శౌర్యమును స్తుతించునప్పుడు
శార్దూలక్రీడితం మతం శార్దూలవిక్రీడితమును ఉపయోగించవలెను.
సావేగపవనాదీనాం పవనవేగము మొదలగువాటిని వర్ణించుటకు
వర్ణనే స్రగ్ధరా మతా స్రగ్ధర ఉత్తమము.
శార్దూలవిక్రీడితైరేవ ఎత్తైన శిఖరములుగల పర్వతము,
ప్రఖ్యాతో రాజశేఖరః అందమైన వర్ణనార్హమైన పులుల
శిఖరీవ పరం వక్త్రైః నడకలచేత వలె, కవి రాజశేఖరుడు
సోల్లేఖైరుచ్చ శేఖరః శార్దూలవిక్రీడితములను బట్టియే ప్రసిద్ధుడాయెను.
ఇత్యేవం పూర్వకవయః పూర్వకవులు ఎన్నియో వృత్తములను ఉపయోగించినవారైనను,
సర్వవృత్తకరా అపి సాధారణముగా ముత్యాలహారమునందువలె
అస్మిన్ హార ఇవైకస్మిన్ ఈ ఒక్క వృత్తమునందే (శార్దూలవిక్రీడితమునందే)
ప్రాయేణాభ్యాధికాదరాః అధికమైన ఆదరణ చూపిరి.

మత్తేభవిక్రీడితము

దక్షిణదేశములో ఇప్పటి కర్ణాటక సీమ ఈ వృత్తమునకు జన్మస్థానమని ప్రస్తుతము భావించుచున్నారు. రెండవ పులకేశి కాలములో ఐహొళె శాసనములో మనము ప్రప్రథమముగా క్రిందిమత్తేభవిక్రీడితమును చూడగలము,ఇది సంస్కృతములో వ్రాయబడినది. దక్షిణాది కవులు పాటించిన ప్రాస ఇందులో కానరాదు. దీని కాలము క్రీస్తు శకము 634. ఆ పద్యము-

వరదా తుంగ తరంగ రంగ విలసద్ధంసానదీ మేఖలాం
వనవాసీమవమృద్నతస్సురపురప్ర్అస్పర్ధినీం సంపదా
మహతా యశ్య బలార్ణవేన పరితస్సేచ్ఛాదితోర్వీతలం
స్థలదుర్గంజలదుర్గతామివ గతం తత్తక్షణే పశ్యతాం

ఎత్తైన తరంగములతో నిండిన హంసానదిని ఒడ్డాణముగా గలిగినది, సంపదలలో అమరావతిని తలదన్నునది, బలార్ణవముతో చుట్టబడినది అని నగర వర్ణన. ఇది రాజు సిరిసంపదలను, బాహువీర్యాన్ని తెలుపుచున్నది.

మొదటి నాగవర్మ రచించిన ఛందోంబుధినుండి ఈ వృత్తమునకు లక్షణ పద్యమును క్రింద ఇస్తున్నాను. రేచన కవిజనాశ్రయపు ప్రణాళిక ఛందోంబుధి అని కొందఱు విమర్శకుల భావన.

శ్వసనేందు జ్వలనం దివం ధరె జలం దైత్యారి కామాంతక-
ప్రసరోద్యద్గణముం త్రయోదశయతి ప్రస్తార మాగిర్దొడీ
వసుధాచక్రదొళెయ్దె సందుదు కరం మత్తేభవిక్రీడితం
పెసరాయ్తింతిదు పింగళాహివరనిం వ్యాలోల నీలాలకీ

నల్లని అలకలు అల్లలలాడుచుండు దానా, వాయువు (స), చంద్రుడు (భ), అగ్ని (ర), స్వర్గము (న), భూమి (మ), నీరు (య),విష్ణువు (ల), శివుడు (గ)- ఈ గణములతో పదుమూడు అక్షరములకు విఱుగుచు ఈ భూమిపై నుండు వృత్తమునకు పింగళనాగుడుమత్తేభవిక్రీడితము అని పేరు పెట్టెను.

తెలుగులో మొదటి మత్తేభవిక్రీడితాలు

తెలుగు శాసనములలో పండ్రెండవ శతాబ్దమునకు ముందు మత్తేభవిక్రీడితము లేనట్లు తోచుచున్నది. నన్నయభట్టు శ్రీమదాంధ్రమహాభారతములో మొదటి పద్యము సంస్కృతపద్యము. ఇది ఒక శార్దూలవిక్రీడితము. మొదటి తెలుగు పద్యము ఒక ఉత్పలమాల. భారతములో మొదటి మత్తేభము అఱువదియాఱవ పద్యము! అది-

అమితాఖ్యానక శాఖలం బొలిచి, వేదార్థామలచ్ఛాయమై
సుమహద్వర్గ చతుష్కపుష్పవితతిన్ శోభిల్లి, కృష్ణార్జునో-
త్తమ నానాగుణ కీర్తనార్థఫలమై, ద్వైపాయనోద్యాన జా-
త మహాభారతపారిజాత మమరున్, ధాత్రీసురప్రార్థ్యమై
– నన్నయభట్టు, ఆదిపర్వము (1.66)

వ్యాసోద్యానవనమున మొలకెత్తి బ్రాహ్మణులకువంద్యనీయమైన మహాభారతమను పారిజాతవృక్షమునకు కొమ్మలు అందున్న ఎన్నో కథలయ్యెను, అది ఇచ్చు నీడ నిర్మలమైన వేదార్థము లయ్యెను, మహనీయమైన నాలుగు వర్గములు పూలయ్యెను, కృష్ణార్జునుల వివిధ గుణకీర్తనలు పండ్లయ్యెను. తాను వ్రాయబోయే భారతము ఎలాటిదన్న సంగతిని ఇక్కడ నన్నయగారు వివరించి చెబుతున్నారు. అది ఎల్లరి కోరికలను తీర్చే కల్పవృక్షము వంటిది. చెట్టుకు కొమ్మలు, ఆకులు, పూలు, పండ్లు ఉంటాయి గదా. ఈ చెట్టుకు కొమ్మలు భారతములోని కథలు, ఉపకథలు. చెట్టు నీడ ఇస్తుంది కదా, ఈ చెట్టునీడ వేదార్థాలు. అందుకే మహాభారతాన్ని పంచమవేదము అంటారు. ఇక ఈ చెట్టులో ఏ రకమైన పూలు పుష్పించునో? చతుర్విధపురుషార్థాలే ఇందులోని పూలు. ఇక పండ్లో నరనారాయణుల గుణకీర్తనలే. ఎందఱో పాత్రలు ఈ తెరపై వస్తారు, కాని ఈ కావ్యనాయకులు మరెవ్వరో కాదు, సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారమైన శ్రీకృష్ణుడు, ఆ దేవదేవుని అంశమైన అర్జునుడు. ఇలా మొట్టమొదటి మత్తేభములో నన్నయగారు భారతరచనలో తన ఆశలను, ఆశయములను స్పష్టీకరించారు.

ఇంచుమించు ఇదే భావములతో ఇంతకంటె సుందరముగా బమ్మెర పోతన భాగవత అవతారికలో క్రింది పద్యమును వ్రాసినారు. అది కూడ ఒక మత్తేభమే.

లలితస్కంధముఁ, గృష్ణమూలము, శుకాలాపాభిరామంబు, మం-
జులతాశోభితమున్, సువర్ణ సుమనస్సుజ్ఞేయమున్, సుందరో-
జ్జ్వల వృత్తంబు, మహాఫలంబు, విమల వ్యాసాలవాలంబునై
వెలయున్ భాగవతాఖ్య కల్పతరు వుర్విన్ సద్ద్విజశ్రేయమై
– పోతన, భాగవతము (1.20)

అందమైన చెట్టుబోదె, నల్లని వేరులు గలదిగా, చిలుకల పాటలతో నిండియుండునదిగా, లలితలతాభాసితమైనదిగా, బంగారు రంగుల పూలతో శోభిల్లునదిగా, బాగుగా చుట్టబడినదిగా, మంచి పండ్లు గలదిగా, గొప్ప విస్తారత గలదిగా భాగవతమనే కల్పతరువు భూమిపై సద్బ్రాహ్మణుల అంటే జ్ఞానుల శ్రేయస్సుకై వెలయును అని అర్థము పై పద్యానికి.

పోతన కూడ నన్నయవలెనే తన కావ్యాన్ని ఒక కల్పవృక్షమని చెప్పెను. కాని పోతనగారి పద్యములో శ్లేష కూడ ఉంది. భాగవతములోని అధ్యాయలకు స్కంధాలని పేరు, భాగవథ కథకు శ్రీకృష్ణుడు మూలాధారము, ఈ కథను శుకమహర్షి చెబుతాడు, అందమైన స్త్రీలతో విరాజిల్లి యుంటుంది, పండితులకు దేవతలకు జ్ఞానదాయిని, మంచి వృత్తాంతములతో వృత్తములతో నిండినది, మహాభీష్టము నిచ్చునది, వ్యాసమహర్షిపై ఆధారపడియుండునది ఈ భాగవతము అని కూడ అర్థము కల్పించుకోవచ్చు.

ముద్రాలంకారములో మత్తేభవిక్రీడితము

కవులు పద్యపు పేరును పద్యములో వచ్చునట్లు వ్రాయు తీరును ముద్రాలంకార మందురు. నన్నయగారి క్రింది పద్యమునకు ముద్రాలంకారపు పోలికలు గలవు. ఇది శకుంతలాదుష్యంతుల కుమారుడైన భరతుని శైశవ క్రీడలను వర్ణించు పద్యము. మదేభము, క్రీడ అను పదములు మత్తేభవిక్రీడితమును సూచించుచున్నది.

అమితోగ్రాటవిలోనఁ గ్రుమ్మరు వరాహ వ్యాళ శార్దూల ఖ-
డ్గ మదేభాదులఁ బట్టి తెచ్చి, ఘనుఁడై కణ్వాశ్రమోపాంత భూ-
జములం దోలిన కట్టుచుం బలిమిమై శాకుంతలుం డొప్పె వ-
న్య మదేభంబుల నెక్కుచుం దగిలి నానా శైశవక్రీడలన్
– నన్నయ భట్టు, ఆది (4.64)

చాల దట్టమైన అడవిలో విహరించే పందులను, పాములను, పులులను, ఖడ్గమృగాలను, మదించిన ఏనుగులను గొప్పగా వేటాడి పట్టి తెచ్చి కణ్వాశ్రమప్రాంతములోని చెట్లకు కట్టి బలముతో శకుంతల కుమారుడైన భరతుడు మత్తగజములను ఎక్కుచు శైశవక్రీడలలో గడపెను అని ఈ పద్యమునకు అర్థము.

ముద్రాలంకారముతో ఇంతకంటె చక్కగా కవిరాజశిఖామణి నన్నెచోడుడు కుమారసంభవములో ఒక మత్తేభవిక్రీడితమును రచించెను. మనసులోని సంతోషముతో విడువకుండ కామాసక్తితో ఎన్నో విధాలుగా పెనగులాడుచున్న ఏనుగుల ఆటను చూచిన పార్వతీదేవికి కుతూహలముతో జనించిన సంభోగాభిలాషతో కాంతిమయమైన చూపులను శివుని ముఖపంకజముపై ప్రసరించింది అను అర్థముగల ఆ పద్యమును క్రింద చదువవచ్చును-

హృదయాహ్లాదముతోడఁ బాయక సదానేక ప్రకారంబులన్
మదనాసక్తిఁ బెనంగుచున్న విలసన్మత్తేభవిక్రీడితం-
బది దాక్షాయణి చూచి కౌతుక రతైకాలీన భావాభిలా-
ష దృగత్యుజ్జ్వలదీధితుల్ పఱపె నీశానాననాబ్జంబుపైన్
– నన్నెచోడుడు, కుమారసంభవము (1.101)

మత్తేభవిక్రీడితము – వీరరసము

శార్దూలవిక్రీడితమువలె మత్తేభవిక్రీడితము కూడ వీరరసమును ఒలికించునదే. కవిబ్రహ్మ భారతములోని విరాటపర్వములో ఇట్టి పద్యములు ఎన్నో ఉన్నాయి. అందులో ఒక రెండు పద్యములు-

అడవిదున్నపోతులు, పులులు, ఏనుగులు మున్నగు జంతువుల గుంపును, మల్లయుద్ధనిపుణులను నిర్దయతో ఎదుర్కొని వరుసగా ఎప్పుడును పోరాడుచుండువాడవు నీవు. అయ్యో, అందఱిచే గౌరవించబడు మహనీయమైన నీ దేహమును నీచమైన పనులు జేసెడు అల్పజీవనమునకు విధి నియోగించెను గదా నేడు అని పాంచాలి భీముని చూచి వాపోతుంది. ఇందులో వీరరరసమును తెలుపునపుడు సంస్కృత సమాసశిల్పాలను ఎలా తిక్కనగారు చెక్కారో అన్నది గమనార్హము.

మహిషవ్యాఘ్రగజాదిసత్త్వచయ్అమున్, మల్లవ్రజంబున్, గృపా-
రహితుండై యెదురొడ్డుచున్, వరుసఁ బోరంజూచు నిన్నెప్పుడున్,
మహనీయంబగు నీ శరీరము జగన్మాన్యంబు, నీచక్రియా-
విహితంబైన కుజీవనంబు విధి గావించెన్ గటా దీనికిన్
– తిక్కన, విరాట (2.196)

క్రింది పద్యములో కీచకభీముల పోరాటమును తిక్కన వర్ణించెను. భీముడు కీచకుని పట్టగా, కీచకుడు పిచ్చి బలముతో భుజబల గర్వియగు హిడింబాసురినిచంపిన భీముని అమితమైన కోపముతో త్రోసివేయగా, ఇద్దఱును కడు తీవ్రముగా ఒండొరుల నొడలి నంటుచు విడువకుండ పోరాడుచుండిరి.

మగుడం గీచకుఁ బట్ట, వాఁడును బలోన్మాదంబునన్, బాహుగ-
ర్వగరిష్ఠుం డగు నా హిడింబరిపుఁ దీవ్రక్రోధుఁడై పట్టి బె-
ట్టుగఁ ద్రోపాడఁగ నిద్దఱున్ భుజబలాటోపంబుమై నొండొరున్
మిగులం జాలక కొంతసేపు వడి మేమేఁ బోరి రుగ్రాకృతిన్
– తిక్కన, విరాట (2.343)

నవరసములు

శార్దూలమత్తేభవిక్రీడితములు వీరరసపోషణకై ఉపయోగించబడినవి. మత్తేభమును కవులు శౌర్యరసముతోబాటు మిగిలిన అన్ని రసములను చిత్రించుటకు కూడ ఉపయోగించిరి. ఇది ఎలా అవుతుంది అని అనుకోవచ్చు. శార్దూలవిక్రీడితములోని మొదటి గురువును రెండు లఘువులుగా చేయుటవలన పదలాలిత్యము సాధ్యమవుతుంది. మూడు గురువులు ఒక్కుమ్మడిగా వస్తే సంస్కృత పదాలను వాడాలి (భీష్మద్రోణకృపాదిధన్వినికర్ఆభీలంబు …) లేకపోతే బిందువుతోనో, ద్రుతముతోనో, పదాలను విఱగగొట్టియో వాడాలి (సింగంబాకటితో …). కాని మొదటి గురువు లఘువైనప్పుడు మనకు పదప్రయోగానికి అవకాశాలు ఎక్కువవుతాయి. అందుకే శార్దూలవిక్రీడితముకన్న మత్తేభవిక్రీడితాలు తెలుగులో ఎక్కువ. దీనిని నిరూపించుటకు క్రింద కొన్ని పద్యములను మీ ఆనందమునకై తెలుపుతాను. అనుభూతులు కలిగించే నవరసములు ఆలంకారికుల దృష్టిలో ఇవి- శృంగారము, హాస్యము, కరుణ (శోకము), వీరము, రౌద్రము, భయానకము, బీభత్సము, అద్భుతము, శాంతము. విన్నకోట పెద్దన కావ్యాలంకారచూడామణిలో వీనిని ఈ క్రింది విధముగా వివరించెను-

క్రమమున శృంగారము హా-
స్యముఁ గరుణము రౌద్ర వీర సంజ్ఞంబులు ఘో-
రము బీభత్సము నద్భుత
సమాఖ్య శాంతములు ననగఁ జను నవరసముల్
– పెద్దన, కావ్యాలంకారచూడామణి, (2.88)

మత్తేభవిక్రీడితము – శృంగారరసము

శృంగారము ద్వివిధములు- సంభోగము, విప్రలంభము. శృంగార రసము లేని జీవితము బహుశా నిరర్థకమే, అదే విధముగా కావ్యములలో కూడ ఈ రసమునకు ప్రాముఖ్యత హెచ్చు. అందుకే దీనిని రసరాజము అంటారు. క్రింద ఆంధ్రకవితాపితామహుడైన అల్లసాని పెద్దనగారి మనుచరిత్రమునుండి ఒక పద్యము- బ్రాహ్మణోత్తముడా, ప్రవరాఖ్యుడా, ఇంక నేను తాళజాలను.

ఇక నను హింసించకు మని, పోకముడి ఊడగా, శ్వాసవేగము హెచ్చగా, పూలు చెల్లాచెదరై చిందగా, తలకొప్పు వదలగా, పుష్పలత వంటి దేహము తత్క్షణము కంపించగా, ఊఱటగొలుపు మాటలతో అతి దీనమైన ముఖముతో ఆ దేవతాస్త్రీరత్నమైన వరూధిని కామాతురతతో మీదకు వచ్చినది.

వెతలన్ బెట్టకు మింక నన్ననుచు, నీవీబంధ మూడన్, రయో-
ద్ధతి నూర్పుల్ నిగుడన్, వడిన్ విరులు చిందన్, గొప్పు వీడన్, దనూ-
లత తోడ్తోఁ బులకింపఁగా, ననునయాలాపాతి దీనాస్యయై
రతిసంరంభము మీఱ నిర్జర వధూరత్నంబు పైపాటునన్
– పెద్దన, మనుచరిత్రము (2.67)

ఇక్కడ మఱొక విషయమును గమనించాలి. వరూధినికి ప్రవరునిపైన ఆశ ఉన్నను, అతనికి లేదు. అతడు ఆమెను నిరాకరించి వెళ్ళిపోయాడు. పిదప ఆమె మాయాప్రవరుడిని వరించింది. కావున ఇందులో రసము మాత్రమే కాదు, రసాభాసము కూడ ఉన్నది! పై పద్యములో స్త్రీ పురుషుని వరించ గోరగా, క్రింది పద్యములో స్త్రీని వరించిన పురుషుని విరహ తాపము వర్ణించబడినది.

తారను విడిచి చాల మరులుగొని చంద్రుడు ఆలోచనలు నిండిన మనస్సుతో, వ్యధతో వెనుకంజ వేయు అడుగులతో, భ్రమతో, అధైర్యముతో, కొనగళ్లలో పొంగివచ్చిన దుఃఖాశ్రువులతో హృదయములో మదనపడుతూ ఆ ఉద్యానవనములోని ఒక పొదరింటిలోకి వెళ్ళాడు.

అతి చక్కగా రచించబడిన మత్తేభవిక్రీడితము ఇది. దుఃఖముతో బాధపడేటప్పుడు పెద్ద పెద్ద పదాలు, దీర్ఘ సమాసాలు ఉచితముగా నుండవు. కావున కవి వేంకటపతి చిన్న పదాలను ఏ పాదము దానితో అంతమయేటట్లు వ్రాసెను.

అతి మోహోన్నతి తారఁ బాసి, శశి చింతాక్రాంత చిత్తంబుతో
వెతతో వెంకకు నీడ్చు పాదములతో విభ్రాంతి భావంబుతో
ధృతిహీనస్థితితో దృగంచల సముద్వేలాశ్రుపూరంబుతో
మతిఁ జింతించుచు వేఁగి యొక్క వనసీమన్ గుంజ గర్భంబునన్
-వేంకటపతి, శశాంకవిజయము (4.46)

మత్తేభవిక్రీడితము – హాస్యరసము

క్రింది పద్యములో పానీయభక్ష్యములు తెలుపబడినవి. వడ, ఆవడ, పకోడీ, హల్వా, బూందీ, ఓంపొడి, ఉప్పిండి, రవా ఇడ్లీ, బోండా, సేమియా ఇవన్నీ సరే గానీ, వాటిపై వెళ్ళే నీ దృక్కులను మరల్చి నేను తయారుచేసిన వేడి కాఫీని కొద్దిగా త్రాగరాదా, అయ్యా మహానుభావా.

వడపై, నావడపై, పకోడిపయి, హల్వాతుంటిపై, బూంది, యోం-
పొడిపై, నుప్పిడిపై, రవిడ్డిలిపయిం, బోండాపయిన్, సేవియా
సుడిపైఁ, బాఱు భవత్కృపారసము నిచ్చోఁ గొంత రానిమ్ము నే
నుడుకుం గాఫిని మ్రొక్కు గ్రుక్కఁ గొనవే యో కుంభ దంబోధరా
– కశ్చన, వేటూరి ప్రభాకరశాస్త్రి చాటుపద్యమణిమంజరినుండి

పై పద్యము నిజముగా క్రింది మత్తేభవిక్రీడితమునకు ఒక హాస్యానుకరణ (పేరడీ)!

ఓ శ్రీహరీ, కృష్ణా, దేవకీనందనా, సత్యవతిపై, విదురునిపై, అక్రూరునిపై, కుబ్జపై, అర్జునునిపై, ద్రౌపదిపై, కుచేలునిపై, గోపికాస్త్రీలపై ప్రసరించే ఆ నీ దయామృతమును నీ పాదాలను నమ్ముకొన్న నాపై కొంత చల్లరాదా.

అరయం జందనగంధిపై, విదురుపై, నక్రూరుపైఁ, గుబ్జపై,
నరుపై, ద్రౌపదిపైఁ, గుచేలకునిపై, నందవ్రజస్త్రీలపైఁ,
బరఁగంగల్గు భవత్కృపారసము, నాపైఁ గొంత రానిమ్ము, మీ,
చరణాబ్జంబుల నమ్మినాడ హరి కృష్ణా దేవకీనందనా
– అన్నయ్య, దేవకీనందనశతకము, 91

మత్తేభవిక్రీడితము – కరుణరసము

సీతను లక్ష్మణుడు అడవిలో విడిచిన తఱువాతి ఘట్టమును తిక్కనగారు నిర్వచనోత్తరరామాయణములో ఇలా తెలిపారు. ఒక వనితారత్నము అడవిలో గట్టు తెగిన దుఃఖముతో, కళలేని చూపుతో, కన్నీళ్ళతో, దుమ్ముతో మలినమైన దేహముతో, బిగ్గరైన ఏడుపుతో, విడివడిన జుట్టుతో, వేడి నిట్టుర్పులతో వాడిన ముఖపద్మముతో నున్న స్థితిలో నుండెను. ఇక్కడ ఔచిత్యాన్ని కొద్దిగా గమనించండి. హృదయము శోకముతో విచ్ఛిన్నమవుతుంటే దేహసౌందర్యముపై మనసు వెళ్ళదు. ఆమె స్త్రీజాతికి శిరోభూషణము, కాఱడవిలో భర్త ఆజ్ఞచే పరిత్యజించబడినది. ప్రాణాలపైనే ఆమెకు ఆసక్తి లేనప్పుడు ఒళ్ళు ఎలాగుంటే నేమి, కేశపాశాలు ఎలాగుంటే నేమి? వెక్కివెక్కి ఏడ్చినప్పుడు ఎండలో ఎండిన తామరపువ్వులా ముఖము వాడకుండా ఉంటుందా? వృత్తపు ఎన్నిక కన్నా, పదాల ఎన్నిక ముఖ్యమని ఈ పద్యము ద్వార మనము తెలిసికోవచ్చు.

ఒక నారీతిలకంబు, గాననములో నుద్దామ శోకార్తయై,
వికలాలోకన మశ్రుధారలునుఁ, బృథ్వీరేణులిప్తాంగముం,
బ్రకటాక్రందనమున్, వికీర్ణకబరీభారంబు, వక్త్రాబ్జశో-
షకనిశ్వాసగమోష్మముం గల యవస్థం బొందఁగా నయ్యెడన్
-తిక్కన, నిర్వచనోత్తరరామాయణము (9.38)

ఇదే ఘట్టమును ఇదే వృత్తములో కంకంటి పాపరాజు ఉత్తరరామాయణములో ఎలా వ్రాసెనో గమనించండి. అయ్యో, అపవాదును నాకు తెలుపక రామరాజు ఇలా వంచన చేసెను గదా యని విన్నబోయింది సీత. మోమోడక ఏ విధముగా తెలిపి పొమ్మన్నాడు అని తలచును. ఓ భగవంతుడా, నా పతినుండి నాకు వియోగము కల్పించితివి గదా. ఇక నాకింకెవ్వరు దిక్కు, ఈ ప్రాణము కూడ పోకుండా ఉందే అని వాపోయింది సీత.

అని దుఃఖించు, నపప్రథన్ దెలుప కాహా భూవిభుం డింత వం-
చనఁ గావించునె యంచు, విన్ననగు నే చందంబునన్ దెల్పి పొ-
మ్మనె మోమోడక యంచు నెంచుఁ, బతి బాయన్ జేసితే దైవమా
యను, నింకెవ్వరు దిక్కనున్ దొలఁగ వీ ప్రాణంబు లౌరా యనున్
– పాపరాజు, ఉత్తరరామాయణము, (6.303)

మత్తేభవిక్రీడితము – రౌద్రరసము

మఱొక తిక్కన పద్యము. ఇది విరాట పర్వములోనిది. ఇందులో కోపము, ఆవేశము, అధికారము ముప్పిరిగొని యున్నది. ద్రౌపది భీముని కీచకునివద్దకు తీసికొని వెళ్ళు సమయమున ద్రౌపదితో పలికిన మాటలు ఇవి. నా కోపము ఎలాటిదో తెలుసా?

ఈ భూమండలము చలించగా, ఆకాశము కదలుచుండగా, దిశలు దద్దరిల్లగా, కులపర్వతాలు కంపించగా, సముద్రాలు కల్లోలమొందగా, నా కోపమును సార్థకము చేసి చిత్రవధను చేసే నేర్పుతో వానికి కోపమును తెప్పిస్తాను. వేంకటరామకృష్ణుల తెలుగు సువృత్తతిలకములో మత్తేభవిక్రీడితమునకు ఈ పద్యమే లక్ష్యముగా చూపబడినది.

అవనీచక్రము సంచలింపఁగ, దివం బల్లాడ, నాశాచయం
బవధూతంబుగ, గోత్రశైలనికరం బాకంపముం బొంద ,న
ర్ణవముల్ ఘూర్ణవ మొందఁ, గ్రోధము గృతార్థత్వంబు నొందించి, చి-
త్రవధప్రౌఢి వహించి, సూతునకు రౌద్రం బేర్పడం జూపెదన్
– తిక్కన, విరాట (2.284)

మత్తేభవిక్రీడితము – భయానకరసము

పరమ వైష్ణవుడైన అంబరీష మహారాజు ఏకాదశి ఉపవాసము చేసి ద్వాదశినాడు దేవుని పూజించి పారణము చేయు సమయములో దుర్వాసమహాముని అతిథిగా వచ్చాడు. అతనిని ఆహ్వానించి భోజనము చేయుమని చెప్పగా అతడు స్నానానికి వెళ్ళి ఇంకా రాలేదు. ద్వాదశి ముహూర్తము తీరక మునుపే తాను పారణము చేయాలి, మఱి అతిథి భోజనము చేయక ముందు తాను తినరాదు. చివరకు తీర్థాన్ని తీసికొని దుర్వాసునికై ఎదురుచూస్తున్నాడు. దుర్వాసుడు స్నానము ముగించి వచ్చి జరిగిన సంగతి తెలిసికొని కుపితుడయ్యాడు. ఒక జటను పీకి దానిని అంబరీషునిపై శక్తిగా ప్రయోగించాడు. సర్వాంతర్యామియైన విష్ణుమూర్తి దీనిని చూసి దుర్వాసునికి బుద్ధి కలిగించాలని తన చక్రాయుధాన్ని ఆ జటపై పంపించాడు. ఆ చక్రము మునికృత్యను దహించి పిదప మునిని వెన్నాడింది. దుర్వాసునికి ఎంతో భయము కలిగింది. తాను వెళ్ళిన చోటల్లా ఆ చక్రము కూడ తనను వెన్నాడుతుంది. భయగ్రస్తుడైన దుర్వాసుని అవస్థను పోతన చక్కగా క్రింది మత్తేభములో తెలిపినారు. దుర్వాసుడు భూమిలో దూరితే చక్రము కూడ అలాగే చేస్తుంది. సముద్రములో మునిగితే అది సముద్రములో మునుగుతుంది. ఆకాశమువైపు ఎగిరితే అది కూడ ఆకాశాన్ని అంటుతుంది. దిక్కుదిక్కులా వెళ్ళితే అది కూడ అలాగే వెళ్ళుతుంది. వేగముగా దిగబడిబోతే చక్రము కూడ దిగజాఱుతుంది. నిలిస్తే నిలుస్తుంది. తిరస్కరిస్తే అలాగే. ఈ పాటును, భయాన్ని పోతన ఎలా చిత్రించినారో చూడండి.

భువిఁ దూఱన్ భువిఁ దూఱు, నబ్ధిఁ జొర నబ్ధుల్ సొచ్చు, నుద్వేగియై
దివిఁ బ్రాకన్ దివిఁ బ్రాఁకు, దిక్కులకుఁ బో దిగ్వీధులం బోవుఁ, జి-
క్కి వెసం గ్రుంగినఁ గ్రుంగు, నిల్వ నిలుచుం, గ్రేడింపఁ గ్రేడించు, నొ-
క్క వడిన్ దాపసు వెంట నంటి హరిచక్రం బన్య దుర్వక్రమై
-పోతన, భాగవతము (9.107)

మత్తేభవిక్రీడితము- బీభత్సరసము

అర్జునుడికి మఱొక పేరు బీభత్సుడు. హరవిలాసమునుండి బీభత్స రసములో బీభత్సునిగుఱించి ఒక పద్యము. రాక్షసుల దేహాలు ఆకాశము కంపించునట్లు పాండవుని గాంఢీవమునుండి వినిర్గతమైన బాణాల ప్రచండతాండవముతో భ్రమింపజేసి హహాకారములతో చెట్లవలె నేలకూలినవి. సంస్కృత సమాసాలతో యుద్ధములోని అలజడిని, హాహాకారాన్ని ఎంత బాగుగా కవిసార్వభౌముడు చిత్రించెనో ఈ పద్యములో! బిందుపూర్వక డ-కారానుప్రాస ఈ రసపోషణకు ఎంత దోహదాన్ని కలిగించిందో!

జవ మేపాఱఁగఁ గూలె దైత్య తనువుల్ సర్వంసహాపీఠిఁ బాం-
డవ గాంఢీవధనుఃప్రకాండభవకాండప్రస్ఫుటోచ్చండ తాం-
డవ పాండిత్యవిశేష విభ్రమకృతాడంబప్రతీకంబులై
యవనీంద్రం(నీజం)బుల భంగి నింగి యద్రువన్ హాహానినాదంబులన్
– శ్రీనాథుడు, హరవిలాసము (7.175)

మత్తేభవిక్రీడితము – అద్భుతరసము

బలరాముడేమో కన్నయ్య మన్ను తిన్నాడని ఫిర్యాదు చేస్తాడు యశోదకు. ఆమె కృష్ణుని పట్టుకొని చెవి నులిమి నోరు తెఱిచి చూపమంది. కృష్ణుడు నోరు తెఱవగా ఆమెకు చతుర్దశాభువనాలు, సృష్టిస్థితి లయాదులు కనిపించాయి.

ఇది కలయా, దైవమాయయా, మఱి వేఱు దైవ సంకల్పమునకు అర్థమా, నిజమా, ఆలోచించే శక్తి కూడ నశించిపోయింది నాలో, అసలు నేను యశోదాదేవినో కానో, ఇది వేఱు చోటైయుండు నేమో, ఈ పసివాడేమి, వీని నోటిలో విశ్వసృష్టి కాంతిమయముగా గోచరించుటయేమి, చూడగా ఇది ఒక గొప్ప ఆశ్చర్యమే. ఇందులోని కలయో వైష్ణవమాయయో అన్న పదాలు తెలుగులో ఒక నానుడి అయి సర్వజనాదరణ పొందిందంటే అంటే అతిశయోక్తి కాదేమో! అద్భుతరసానికి క్రింద పోతన రచన-

కలయో, వైష్ణవమాయయో, యితర సంకల్పార్థమో, సత్యమో,
తలఁపన్ నేరక యున్నదాననొ, యశోదాదేవిఁ గానో, పర-
స్థలమో, బాలకుఁ డెంత, యీతని ముఖస్థంబై యజాండంబు ప్ర-
జ్వలమై యుండుట కేమి హేతువొ, మహాశ్చర్యంబు చింతింపఁగన్
– పోతన, భాగవతము (10.342)

మత్తేభవిక్రీడితము – శాంతరసము

శాంతి, సహనము, సౌజన్యము మొదలగు సాత్విక భావములను ప్రతిబింబింపజేయు పద్యములు శాంతరసమునకు చిహ్నములే. క్రింద మొల్ల రామాయణమునుండి ఒక పద్యము. అగ్నిదేవుడు పాయసపాత్రను దశరథుని కొసగు సమయములో వ్రాసినది ఇది. అయోధ్యాధీశుడైన దశరథుడు లీలవిలాసాలతో పిల్లలకొఱకై యజ్ఞము చేయగా, తేజోమయుడైన అగ్నిదేవుడు హేమపాత్రలో పరమాన్నము నింపి ఎదుట నిలిచి ప్రేమతో నర్మవాక్యములను పలికెను.

ఇల సాకేతనృపాలశేఖరుఁడుఁ దా హేలావిలాసంబుతో,
ఫలకాంక్షన్ గ్రతువుం బొనర్చినయెడన్, బంగారు పాత్రమ్ము లో-
పల దుగ్ధాన్నము చాల నించుకొని, తాఁ బ్రత్యక్షమై నిల్చి, ని-
ర్మల తేజంబునఁ బావకుం డనియెఁ, బ్రేమన్ మంజు వాక్యంబులన్
– మొల్ల, రామాయణము, బాల 37

ఇదే ఘట్టములో ఇదే వృత్తములో విశ్వనాథ సత్యనారాయణ గారు ఎలా వ్రాసినారో చూద్దామా? అగ్నిదేవుడు యజ్ఞకుండమునుండి బయటకు వచ్చి ఇలా చెప్పాడు. రాజశేఖరా ఇది అమృతజ్యోతిమయమైనది. ఆవుపాలతో వండినది, సంతానము నిచ్చునది, ఆరోగ్యప్రదాయిని, ఈ పరమాన్నమును నీ భార్యల కిమ్ము, నీవు మనసారా యేది వాంఛింతువో అదియే నీకు సిద్ధించును, నీ దేవేరులను దీనిని తినుమనుము. ఇది అమృతము, ఇది వెలుగు అని అగ్ని దేవుడు పలికాడు. తనయులు లేరనే అంధకారములో తపించిపోతున్న దశరథునికి జ్యోతిర్మయులైన, అమరులైన కుమారులు జన్మింతురని జరుగబోయే సంఘటనకు, ముందే జ్యోతిరూపుడైన ఆ అగ్ని వెలుగు చూపుతాడు.

అమృతజ్యోతిరుపేత మియ్యది నృపాలా, అద్యగోదోహప-
క్వము, సంతానకరం, బనామయము, పర్వాన్నంబు ప్రాప్తించె, ను-
త్తముఁడా భార్యల కిమ్ము దీనిని, యదర్థంబై యజింతో, తద-
ర్థము ప్రాప్తించెడు, నారగింపు మనుమీ ధాత్రీశ, నీ భార్యలన్
– సత్యనారాయణ, రామాయణకల్పవృక్షము, ఇష్టి, 424

ఆముక్తమాల్యద కథాప్రారంభములో శ్రీకృష్ణదేవరాయలు విలుబుత్తూరిని (విల్లిపుత్తూరిని) ఇలా వర్ణించెను. అందమైన ఉద్యానవనాలలోని కోకిలల, చిలుకల కలరవములు చంద్రశాలలో చెక్కబడిన నల్లని పచ్చని కోకిలల చిలుకల కలరవములో అనే భ్రమను కలిగించాయి. ఎక్కడ చూచినా ఆకాశాన్నంటే బంగారు మేడలే. పాండ్యరాజ్యలక్ష్మి పాపటిలో రత్నములా శ్రీవిల్లిపుత్తూరు శోభించుచున్నది.

లలితోద్యాన పరంపరా పికశుకాలాప ప్రతిధ్వానముల్,
వలభీ నీల హరిన్మణీపికశుకస్వానభ్రమం బూంప, మి-
న్నులతో రాయు సువర్ణసౌధముల నెందుం జూడఁ, జెన్నొంది శ్రీ
విలుబుత్తూరు సెలంగుఁ, బాండ్య నగరోర్వీ రత్న సీమంతమై
– శ్రీకృష్ణదేవరాయలు, ఆముక్తమాల్యద, (1.51)

నాకు నచ్చిన రెండు మత్తేభాలు

పైన చెప్పిన ఉదాహరణములతో మత్తేభవిక్రీడితవృత్తపాత్రలో ఏ రసమునైనను నింపుటకు సాధ్యము అని తెలిపినాను. ఈ వ్యాసము ముగించుటకు ముందు నాకు నచ్చిన ఒక రెండు మత్తేభవిక్రీడితములను మీతో పంచుకోవాలనే ఆశ ఉదయించింది. పోతన గజేంద్రమోక్షములో, వామనచరిత్రలో, రుక్మిణీకల్యాణములో రసవత్తరమైన మత్తేభవిక్రీడితములు ఉన్నవి. వాటిలో దశమస్కంధపూర్వభాగమునందలి రుక్మిణీకల్యాణ ఘట్టములోని క్రింది పద్యమును ఎఱుగనివారు అరుదు. చదువురానివారు కూడ కంఠతా పట్టిన పద్యములలో ఇది ఒకటి.

రుక్మిణీకల్యాణములోని పాత్రలకు పేరులు మార్చి, ఇప్పటి నైసర్గికతను, సన్నివేశాలను, నేపథ్యమును ఉంచితే ఒక మంచి ప్రేమకథ అయి తీరుతుంది. తానేమో కృష్ణుని పెళ్ళాడాలని తలచింది. తండ్రి, అన్నలు శిశుపాలునికి ఇవ్వాలని తీర్మానించారు. ఈ ఇక్కట్టునుండి తప్పించుకోవాలంటే ఒకే దారి. అది ఆ ప్రేమహృదయునికి సందేశము పంపడమే. బ్రాహ్మణునిచేత ప్రేమసందేశాన్ని, పరిష్కార మార్గాన్ని పంపుతుంది. పంపిన తఱువాత రుక్మిణికి క్షణము ఒక యుగమయింది. నిముసనిముసానికి ఏవో పిచ్చి ఆలోచనలు. మనసు ఉయ్యాలలా ఊగుతుంది ఆమెకు. ఆ బ్రాహ్మణుడు వెళ్ళాడో లేదో, ఇక్కడినుండి అక్కడికి నడవాలి గదా, అలసటతో ఏ చెట్టు క్రింద కూర్చున్నాడో, పోనీ బ్రాహ్మణుడు కృష్ణునివద్దకు వెళ్ళాడనే అనుకొందాము, కృష్ణుడు ఈ సమాచారన్ని విని తప్పుగా తలచాడో ఏమో, స్త్రీ తనంతట తానే వలచి వచ్చినది అతనికి వెగటుగా తోచిందేమో, మన మనసుకు, మన ఆలోచనలకు ఇందులో తావుందా, అంతా ఆ భగవంతుని లీల, ఆ జగదీశ్వరుడు అనుకూలిస్తాడో, ప్రతికూలిస్తాడో, ఆ గౌరీదేవి గుడి చెంతకు కృష్ణుని రమ్మన్నాను గదా, ఆ మంగళగౌరి నాకు ఎవరిని భర్తగా ఇస్తుందో, నన్ను పాల ముంచుతుందో నీట ముంచుతుందో, నా అదృష్టము ఎలాగుందో అని ఎన్నెన్నో చెప్పలేని, చెప్పరాని, చెప్పజాలని భావాలకు ఒక అద్దమువలె పోతనగారు ఈ పద్యాన్ని రచించారు. ఈ కవితామృతధారను ఎన్ని సారులు త్రాగినా తనివితీరదు.

ఘనుఁ డా భూసురుఁ డేగెనో నడుమ మార్గశ్రాంతుఁడై చిక్కెనో
విని కృష్ణుం డది తప్పుగాఁ దలచెనో విచ్చేసెనో యీశ్వరుం
డనుకూలింపఁ దలంచునో తలఁపడో యార్యామహాదేవియున్
నను రక్షింప నెఱుంగునో యెఱుఁగదో నా భాగ్య మెట్లున్నదో
– పోతన, భాగవతము (10.1.1725)

నాకు నచ్చిన రెండవ పద్యము నంది తిమ్మనగారి పారిజాతాపహరణములోనిది. సత్యభామకు అందమైన ఆ ముక్కుపై ఎంత కోపమో. నారదుడిచ్చిన పారిజాత పుష్పాన్ని రుక్మిణికిచ్చినాడు, తనకీయలేదన్న విషయాన్ని విన్న పిదప గుండె భగ్గుమన్న దామెకు. అతడు నటనసూత్రధారి కావచ్చు, తాను మాత్రము తక్కువ తిన్నదా. కోపగృహానికి వెళ్ళి తలనొప్పి అని తలుపులు మూసికొని పడుకొన్నది. శ్రీకృష్ణుడు వచ్చి ఆమెను అనునయించుటకై ప్రయత్నాలు చేస్తున్నాడు. దాసుని తప్పులు దండాలతో సరి అన్నట్లు ఆమె పాదాలను తాకబోవగా సత్యభామాదేవికి త్రాచుపాములా కోపము వేయి పడగ లెత్తినది. కాలితో తన్నినది సత్యప్రియుని. అప్పుడు తిమ్మనగారు చెప్పిన సుందరమైన పద్యము ఇది.

ఈ కథలో మఱో కథ. ఎప్పుడో చిన్నాదేవి పాదాలు ప్రమాదవశాత్తు తగిలిందని కోపించుకొన్న రాయలవారు ఆమెను నిరాదరించుచున్న వార్తను విన్న తిమ్మన ఈ పద్యమును రాయలకు ఒక పాఠము నేర్పుటకై వ్రాసినదను కథ కూడ ఉన్నది. ఆ కృష్ణుడు ఎలాటివాడు? అతని శిరస్సు బ్రహ్మేంద్రాదులచే సదా పూజించబడునది. అతడెవరబ్బా? అతడు లతాంతాయుధుని కన్నతండ్రి. పూలమ్ములవాని పూలవలె మృదువైనది కృష్ణుని దేహము. మన్మథుడు అతి సుందరుడైతే మన్మథుని తండ్రి కూడ సుందరుడే గదా? అట్టి పూజార్హమైన సుందరమైన మెత్తని శిరస్సును తన ఎడమకాలితో తన్నినది సుకుమారియైన సత్య. ఆమె లతాంగి కనుక దెబ్బ మెత్తగా తగిలింది కాబోలు. ఇంతతో ఆపలేదు తిమ్మన. భర్తలు తప్పులు చేస్తే కోపముతో రేగిపోయే భార్యలకు ఉచితానుచితాలు తెలుస్తాయా అని అర్థాంతరన్యాసములో పలికెను.

సత్యభామచేత కృష్ణుని తన్నించిన ఖ్యాతి తిమ్మనకే దక్కిందనుకొనేరు సుమా? శ్రీజయదేవకవి గీతగోవిందములోని పందొమ్మిదవ అష్టపదిలో ఆ మాధవుడే రాధను ఆమె కోమలపదములను తన శిరస్సుపై నుంచ వేడినట్లు వ్రాసెను. ఆ పదము క్రింద-

స్మర గరల ఖండనం మమ శిరసి ఖండనం మన్మథుని వేడిని తగ్గింపజేయునదియైన నీ
దేహి పద పల్లవ ముదారం సుందర పదపల్లవములను నా శిరస్సుపై
జ్వలతి మయి దారుణో మదన కదనానలో అలంకారముగా నుంచుము. నేను దారుణమైన
హరతు తదుపాహిత వికారం మదనకదనానలములో మండుచున్నాను.
దానికి అది ఉపశమన మగును

జలజాతాసన వాసవాది సుర పూజా భాజనంబై తన-
ర్చు లతాంతాయుధు కన్న తండ్రి శిర మచ్చో, వామ పాదంబునం
దొలఁగంద్రోచె లతాంగి, యట్ల యగు, నాథుల్ నేరముల్ సేయఁ, బే-
రలుకం జెందిన యట్టి కాంత లుచితవ్యాపారముల్ నేర్తురే
– తిమ్మన, పారిజాతాపహరణము- 1.121

చివరి మాట

ఒకే మట్టితో కుమ్మరివాడు ఎన్నో విధములైన పాత్రలను చేస్తాడు. అదే విధముగా ఒక మత్తేభవిక్రీడితవృత్తములో ఎన్ని రసముల నైనను నింపవచ్చు. కవీంద్రుల కలములో ఈ మత్తగజము ఎన్ని ఆటల నాడిందో, ఎన్ని పాటలను పాడిందో, ఎన్ని గుండెలను తాకిందో, ఎన్ని అనుభూతులను కలిగించిందో. ఈ ఏనుగుల ఆట నవరసాలకు బాటయే!

నవమాలల్ బలు గూర్చవచ్చు వరవీణాపాణి పూజార్థమై
నవరాగమ్ములఁ బాడవచ్చు రసవిన్యాసమ్ముతోఁ, జిత్తసం-
భవభావమ్ముల వ్రాయవచ్చు రహితో మత్తేభవిక్రీడిత-
మ్మవ, హృద్యమ్ముగ నింపవచ్చుఁ గవితన్ మందారమాధుర్యముల్

జెజ్జాల కృష్ణ మోహన రావు

రచయిత జెజ్జాల కృష్ణ మోహన రావు గురించి: జననం నెల్లూరు (1943).మదరాసులో SSLC వరకు.తిరుపతిలో ఉన్నత విద్యాభ్యాసం. IISc,బెంగుళూరులో Crystallography లో Ph.D పట్టా;1980 దాకా మదురై కామరాజ్ విశ్వవిద్యాలయంలో రీడర్‌గా విద్యాబోధన; తర్వాత అమెరికాలో శాస్త్రజ్ఞునిగా దీర్ఘకాలం ప్రవాస జీవితం. ఛందస్సు మీద విస్తారంగా వ్యాసాలు రచించారు.పాటలు పద్యాలు రాశారు. అనువాదాలు చేశారు.వీరి సుభాషితాల సంకలనం: Today’s Beautiful Gem. ఛందశ్శాస్త్రంలో కృషి,పరిశోధనకు గాను విరోధినామ (2009)సంవత్సరపు బ్రౌన్ పురస్కారాన్ని అందుకున్నారు. ...