కవిత్వీకరణ మరికొన్ని సంగతులు

కవిత్వం భాషకు, భావనకు ఉన్న పరుధుల్ని విస్తరింపజేస్తుంది. పదాల ఎంపిక, కూర్పు, కొత్త పదబంధాల సృష్టి వంటి సాధనాల ద్వారా ఇది సాధ్య పడుతుంది. ఇవేకాకుండా ఒక సన్నివేశాన్ని, తద్వారా కలిగిన అనుభూతిని వ్యక్తపరచటానికి పదచిత్రాలు లేదా ప్రతీకలను ఆధునిక కవులు విరివిగా వాడుకున్నారు. దీనిలో భాగంగా పోలికలు చెప్పటం, ఒక అనుభవానికి సంబంధించిన అతి సున్నితమైన వివరణ నివ్వటం, మానవీకరణ ఇలా రకరకాల ప్రక్రియలను వారు ఉపయోగించారు.

పోలిక చాలా సామాన్యమైన ప్రక్రియ. మంచి పోలికలు కవి ఊహాశక్తికి గీటురాళ్ళుగా పనికివస్తాయి. రెండు వస్తువుల మధ్య యితరులకు స్ఫురించని సామ్యాన్ని చూడటంలోనే కవి ప్రతిభ దాగి ఉంటుంది. పోలికల గురించి చెప్పాలంటే, బహుళ పంచమినాటి చంద్రుడు ఆకాశంలో కాళ్ళు తెగిన ఒంటరి ఒంటెలా ఉన్నాడని శ్రీ శ్రీ చెప్పినదాని దగ్గర్నించి, బావి భూమి బుగ్గపై ముడుచుకున్న నవ్వుసొట్టలా ఉందని ఇస్మాయిల్‌చెప్పిన దాకా అనేక ఉదాహరణలు తీసుకోచచ్చు. సమకాలీన కవులలో, కొంత అసాధారణమైన, అరుదైన ప్రతీకలు తీసుకోవటం మనకు కనిపిస్తుంది. ఉదాహరణకు, శివారెడ్డి “నిశ్శబ్దంగానే” అనే పద్యంలో వాడిన పోలికలు చూడండి

“నేను నిశ్శబ్దంగానే వెళ్ళిపోతాను
నిరుడుకమ్మిన మబ్బులా
…………
అద్దం మీంచి జారుతున్న నీటిబొట్టులా
స్నానంచేస్తూ గోడకంటించిన బొట్టులా”

అలాగే వేగుంట మోహనప్రసాద్‌(మో) “శిలవర్ణాల్లో శిల్పం” అనే పద్యం లో చెప్పిన ఒక విచిత్రమైన పోలిక

” మిట్ట మధ్యాహ్నం పొట్టమీద పెట్టుకున్న పుచ్చకాయ బుజ్జిపాపాయి”

రావి శాస్త్రి వంటి రచయితల కధల్లో కూడా చాలా ప్రతిభావంతమైన పోలికలు కనిపిస్తాయి. పోలిక చెప్పే పనిని ఆయన కొన్ని సమయాల్లో చెప్పే విషయానికి పరిపుష్టిని కలిగించటానికుపయోగించినా, మరి కొన్నిసార్లు కేవలం ఉపమించటంలో ఉండే ఆనందం కోసం చేసారనిపిస్తుంది. ఎక్కడో ఒక కధలో ఆయన మగవాడి చూచుకాలు కుంకుమ భరిణె మూతల్లా ఉన్నాయని రాసారు!

రెండు వస్తువులను పోల్చటం కంటె, రెండు అనుభవాలను పోల్చటం ఇప్పటి కవుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. వస్తువులకు సంబంధించిన పోలికల కంటె వీటిని చదివినప్పుడు కలిగే అనుభూతి సాంద్రత ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి ప్రయోగాల్లో అతి సున్నితమైన, విలక్షణమైన అనుభవాలను కవులు స్పృశించారు.

“ఆ చెట్టు నీడన కూచుంటే
అప్పుడే అల్లిన
పచ్చి కొబ్బరాకు చాపమీద
నగ్నంగా పడుకున్నట్టుంటుంది.
తెగిన గాయం మీద
గోర్వెచ్చని నీళ్ళు పడ్డట్టు
అది ఖేదమో, మోదమో తేల్చుకోలేనట్టుంటుంది.”
(బాధల చెట్టు శిఖామణి)

ఇందులో వాడిన రెండు ప్రతీకలు ఒక అనిర్వచనీయమైన అనుభూతిని పాఠకునికి అందజేస్తాయి.

పద చిత్రంపై చేసిన ప్రయోగాల్లో, ఒక పదచిత్రాన్ని పొడిగించటం అనేది కూడా ఒకటి. ఇది రెండు రకాలుగా చెయ్యవచ్చు. ఒకే పోలికను రెండు వేరు వేరు వస్తువులకు ఆపాదించటం లేదా ఒకే వస్తువుకు రెండు దగ్గర సంబంధం ఉన్న పోలికలు వాడటం. ఉదాహరణకు, ఇస్మాయిల్‌ “బావి” అనే పద్యంలో నుంచి ఈ క్రింది వాక్యాలు తీసుకొందాం

“నీడల వీసన కర్ర విప్పి
ఎండలో సేదతీరుస్తుంది చెట్టు;
నీడల మడత విసన కర్ర బావి
వాడుకొమ్మంటుంది చేదతో విప్పి.”

ఇందులో చెట్టు, బావి రెండింటిని విసనకర్రతో పోల్చటం వల్ల, ఒకటి తెరుచుకొని ఉంటే, మరొకటి మూసుకొని ఉందని చెప్పటం వల్ల ఒక గొప్ప అందం వచ్చింది. రెండవ ఉదాహరణగా, వై.ముకుందరామారావు కవిత “సాయం సంధ్య” లో వయసు పైబడుతున్న యిద్దరు దంపతులమధ్య పెరిగిన దూరాన్ని గురించి రాసిన ఈ వాక్యాలు తీసుకోవచ్చు.

” ఆకర్షణై కొన్నాళ్ళు
పిల్లల వారధితో ఇంకొన్నాళ్ళు
తెలియనే లేదు.
ఎంత తొందరగా కరిగిపోయిందో
వారధి కూడా!
వీలున్నపుడెపుడో
ఇరువైపులా చేరుతూ
పడవలైపోయిన పిల్లలు”

పిల్లల్ని మొదట వంతెనతోనూ, తరువాత పడవలతోనూ పోల్చటం, పడవకు వంతెనకు ఉన్న అనులోమ సంబంధం ఇక్కడ ఎంతో మంచి ప్రభావం కలిగించాయి. రెండు ఒడ్డుల్ని కలపటమనే సామాన్య లక్షణంతో బాటు వంతెనకు పడవకు ఉన్న అనేక భేదాలు ఈ పదచిత్రంలో పలు లోతుల్ని చూడటానికి వీలు కల్పిస్తాయి. ఒక పదచిత్రాన్ని ఇంత బాగా పొడిగించటం అన్ని వేళలా సాధ్య పడే విషయం కాదు.

కొన్నిసార్లు ఒక పదచిత్రంలో ప్రత్యక్షమైన పోలిక ఏదీ ఉండనఖ్ఖర్లేదు. ఒక దృశ్యాన్ని తలపింపజేసే సున్నితమైన వివరణ, చిత్రమైన ఊహ లేదా మానవీకరణ వంటి వాటితో కూడా బలమైన పదచిత్రాలు నిర్మించవచ్చు.

“మీసాలు దువ్వుతుంది బొద్దింక ”
(సాలీడు యదుకుల భూషణ్‌)
“మౌంట్‌ఎవరెస్ట్‌మీద పతాకాలు నవ్వి నవ్వి అలసిపోతాయి”
(పిదప యదుకుల భూషణ్‌)
“పావురాలు జలజలా దారికడ్డు తప్పుకుంటాయి”
(మధ్యాహ్న సముద్ర పాఠం శ్రీధర్‌బాబు)

హైకూలలో కూడా సాధారణంగా ఒక దృశ్యావిష్కరణ ఉంటుందేగాని, ప్రత్యక్షమైన పోలిక చెప్పబడదు. శ్రీధర్‌బాబుదే ఒక హైకూ చూడండి

“సరుగుడు చెట్ల మధ్య నుంచి
సముద్రం
మనల్ని ఎగిరెగిరి చూస్తోంది.”

ఇందులో సముద్రానికి ఎంతో అర్థవంతమైన మానవీకరణ కల్పించబడింది.

కొన్ని సందర్భాల్లో సత్యం కూడా కవితాత్మకంగా ఉంటుందనటంలో సందేహం లేదు. “ప్రపంచమొక పద్మ వ్యూహం కవిత్వమొక తీరని దాహం” వంటి వాక్యాలు దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇందులో చెప్పిన విషయం మనందరం అంగీకరించేదే. అన్నివేళలా సత్యం ఇంత సూటిగా ఉండక పోవచ్చు. ఒక సత్యం కవి తన వ్యక్తిగత దృక్పధం మీద ఆధారపడి చేసిన ప్రకటనలా అనిపించినా కూడ, దానిని ప్రకటించటంలో అతడు ప్రదర్శించిన నేర్పువల్ల దానికొక ఒప్పుదల, కవితాత్మకత చేకూరతాయి. శ్రీధర్‌బాబు రాసిన ఈ వాక్యాలు చూడండి :

“కన్నీటి కశ్మలంలో చిగురిస్తాయి జీవన సౌరభాలు
దారి తప్పిన పాట కన్నా
గొప్ప కవిత్వం లేదు.” (పాత సంగతులు)

“నన్ను నేను పట్టుకోలేనప్పుడే నేను జీవిస్తాను” ( వేడన్‌తాంగల్‌)

అలాగే, “మోనా ఐ లీవ్‌యూ” అనే పద్యంలో మో ఇలా రాసారు

“కావాలని వెళ్ళిపోయిన వాడు ప్రవక్త అవుతాడు.
ఉండాలని ఉన్నవాడు మనిషవుతాడు.
………
ఆ వెళ్ళిపోయిన వాడు బాగుపడిందీ లేదు
ఇక్కడున్నవాడు చెడిపోయిందీ లేదు”

పదచిత్రాల వాడకంలో గుర్తించవలసిన ముఖ్య విషయం ఒకటుంది. అదేమిటంటే, కొన్ని పదచిత్రాల ద్వారా ఒక అనుభూతిని రూపుకడుతున్నప్పుడు, ఆ పదచిత్రాల మధ్య ఒక హార్మనీని సాధించటం ఎంతైనా అవసరం. అలాగే, పదచిత్రాలను పొదుపుగా వాడటం ముఖ్యం. ఎన్ని ఎక్కువ పదచిత్రాలు వాడితే అంత ఎక్కువ ప్రభావం కలుగుతుందనుకోవటం పొరపాటు. కవిత్వంలో economy of words లాగే economy of images కి కూడా ప్రాధాన్యత ఉంది. పరిమితమైన, అత్యంత ప్రభావవంతమైన ప్రతీకలను మాత్రమే ఎన్నుకొని, పాఠకునికి అనుభూతిని అందజేయగలగాలి. ఒక్క ప్రతీక ఎక్కువైనా, లేదా మిగతా వాటితో సరిపోకపోయినా, పద్యం దెబ్బతిని, పాఠకునిలో ఆశించిన ప్రతిస్పందన కలిగించలేకపోతుంది.

కవితానిర్మాణంలో ఒక కవిత ఎలా ప్రారంభమవుతుందనే విషయానికి చాలా ప్రాధాన్యత ఉంది. నా ఉద్దేశ్యంలో begin at the beginning అనే సూత్రం కవిత్వానికి వర్తించదు. కవిత ఎప్పుడూ ఒక సంభాషణ మధ్యలో మొదలై, పాఠకుణ్ణి అందులోకి తీసుకుపోవాలని నేననుకొంటాను. మొదటి వాక్యం ప్రామిసింగ్‌గా ఉండాలి.అంతేకాని, “ఏం చెప్పను నేస్తం”, “ఏదో రాయాలని ఉంది” వంటి విసుగుపుట్టించే వాక్యాలతో మొదలైతే, ఆ కవిత ఎక్కువదూరం తీసుకెళ్ళలేదు. కొన్ని పద్యాలలో మొత్తం పద్యానికి సంబంధించిన థీమ్‌మొదటి ఒకటి రెండు వాక్యాలలోనే ప్రకటింపబడటం మనం చూడవచ్చు. పద్యంలో ఏమి చెప్పబడుతుందనేదానికి సంబంధించిన క్లూ మొదట్లోనే మనకు దొరికిపోతుంది. పద్యం లాజికల్‌గా అక్కడే మొదలై, ముందుకు విస్తరించినట్టుగా మనకు స్పష్టం గా తెలుస్తూ ఉంటుంది. ఉదాహరణకు, శివారెడ్డి పద్యాలలో ఈ ప్రారంభ వాక్యాలు చూడండి

“ఇంతా చేస్తే అయ్యింది పదకొండే” ( ఇంతా చేస్తే)
“ఎదురు చూడటం మృత్యువు” (ఎదురు చూడటం)
“నాలోని గోడ కూల్తుంది” (గోడ)

ఈ రకమైన ప్రారంభాలను మో రాసిన ” నిరీహ ” అనే కవిత ప్రారంభంతో పోల్చి చూస్తే, ఆసక్తికరంగా ఉంటుంది. ఈ కవిత “అలాఅని పెద్ద బాధా ఉండదు” అని మొదలౌతుంది. ఇందులో కవి ఏమిచెప్పబోతున్నాడన్నదాన్ని గురించిన స్పష్టమైన క్లూ లేదు. కాని, ఏం చెప్తాడో చూడాలన్న ఉత్సుకతను మాత్రం ఈ వాక్యం కలిగిస్తుంది. మొదటిరకం ప్రారంభంలో ఏమి చెప్పబోతున్నాడనేది మనకవగతమైపోవటంచేత, ఎలా చెప్తాడో చూడాలన్న ఆసక్తి మాత్రం ఉంటుంది. ఐతే ఈ రెండిటిలోనూ, మొదటివాక్యం కవితకు మొదలు మాత్రమే. అందులోని ప్రధాన వాక్యాలు, ముఖ్యమైన ప్రతీకలు ముందు ముందు రావచ్చు. కాని, కొన్ని కవితలలో అతి ముఖ్యమైన ప్రతీక కవిత మొదట్లోనే ఎదురుకావటం మనం గమనించ వచ్చు. కన్నెగంటి చంద్రశేఖర్‌ వసంతం గురించి రాసిన కవిత “మంచు మళ్ళీ ఏడు రంగులుగా విడిపోతుంది “అని మొదలౌతుంది. అలాగే, నా పుస్తకంలో “మోళీ ” అన్న కవిత “నీ క్షణికానందాన్ని ఆమె తొమ్మిది నెలలు మోసింది”అని మొదలౌతుంది. ఇవి ఆయా కవితలలో ప్రధానమైన ప్రతీకలు. ఇలా ప్రారంభించటంలో ఒక ఇబ్బంది కూడా ఉంది. తారస్థాయిలో పాట మొదలుపెట్టినట్టు,ఆ తరువాతి భాగం నిర్వహించటం కొంత కష్టమౌతుంది.

ఇక పోతే, ముగింపు కూడా కవితా నిర్మాణంలో ముఖ్యమే. వాహనంలాగా కవితను కూడా , మొదలుపెట్టి నడపటమే కాకుండా, ఎక్కడ ఎలా ఆపాలో తెలిసి ఉండటం చాలా అవసరం. కాని, కవిత ముగింపు గురించి చర్చించటం, మొదలు గురించి చెప్పినంత తేలిక కాదు. ఎందుకంటే, ముగింపులో అనేకమంది అనేక పద్ధతులు పాటిస్తారు. కొందరు ముగింపులో పద్యాన్ని sum up చేస్తారు. మరికొందరు ముగింపు కవితకు పధ నిర్దేశం చేస్తుందని భావిస్తారు. ఇంకొందరు కవిత మొత్తం ఎలా నడిచినా, ముగింపులో తమ రాజకీయ నిబద్ధతను నిరూపించుకునే ప్రయత్నం చేస్తారు. తాత్వికంగా కవితకు ముగింపంటూ ఉండదని, కవి తన పద్యాన్ని ఎక్కడో ఒకచోట ఒదిలిపెట్టటం మాత్రమే చేస్తాడని కొందరు భావిస్తారు. అసలు, ఒక కవి తన జీవితంలో ఒకే పద్యం రాస్తాడని, వివిధ సమయాల్లో రాసేవి దానిలో భాగాలు మాత్రమేనని ఒక కవిగారు అభిప్రాయపడ్డారు. ఇలా రకరకాల ధోరణులిందులో ఉన్నాయి. ఐతే, నా ఉద్దేశ్యంలో, ఒక కవితకు ముగింఫు ఎంత సమగ్రంగా ఉంటుందనేది, తీసుకున్న వస్తువుని బట్టి ఉంటుంది. ఉదాహరణకు, ఒక పాప ఆటపాటల గురించి రాసిన కవితను, ఆ పాప నిదురపోయే దృశ్యంతో ముగిస్తే, అది ఎంతో సమంజసంగా ఉంటుంది. ఏదియేమైనా, కవిత్వంలో క్లుప్తత చాలా ముఖ్యం కాబట్టి, అవసరాన్ని మించి కవితను పొడిగించకుండా జాగ్రత్త పడితే సరిపోతుందనుకుంటాను. ఇంకొక విషయం. ఇతర భాషలు కొన్నిటిలో ఉన్నట్టు, ముగింపులో surprise లేదా కొసమెరుపు వంటివి తెలుగు కవితలలో ఎక్కువగా కనిపించవు. ఈ కవితలలో వ్యక్తీకరణకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది. కవితలో మొదటి వాక్యం దగ్గర్నించి ఇది మనకు తెలుస్తూనే ఉంటుంది. దానికోసం చివరిదాకా ఆగవలసిన పనిలేదు. ఎక్కడైనా ఒకటి రెండు వ్యంగ్య కవితలలో కొసమెరుపు కనిపిస్తే కనిపించవచ్చు. శ్రీ శ్రీ లిమరుక్కులు, సిరిసిరిమువ్వ పద్యాలలో ఉదాహరణలు దొరుకుతాయి.

కవిత మొదలుకి, ముగింపుకి మధ్య ఒక సామ్యం సాధించటం కూడా ఒక ప్రక్రియగా చెప్పుకోవచ్చు. మొదలుపెట్టిన వాక్యాలతోనే కవిత ముగించటం ద్వారా గాని, లేదా మొదటి వాక్యానికి కాంట్రాష్టుగా ముగింపు వాక్యాలు తీర్చిదిద్దటం ద్వారా గాని ఇది సాధ్యపడుతుంది.

చివరగా, సింటాక్సు గురించి క్లుప్తంగా ముచ్చటిస్తాను. వచన కవిత్వంలో వివిధ కవులు పాటించిన లయ, పాద విభజన, వాక్య నిర్మాణం మొదలైన వాటిగురించి విస్తృతంగా పరిశోధించవచ్చు. గతంలో ఒకసారి “వచన కవిత్వ లక్షణాన్వేషణ పునరవలోకనం ” అనే వ్యాసంలో చేరా వచన కవిత్వంలో సింటాక్సు, భాషా వ్యూహాలు మొదలైన వాటి గురించి చాలా ఉపయుక్తమైన , ఆసక్తికరమైన విశేషాలు రాసారు. ఇకపోతే, ప్రత్యేకంగా ప్రాస గురించి చెప్పుకోవాలంటే, ప్రారంభంలో కొందరికి అంత్య ప్రాసమీద మోజు ఉండవచ్చుగాని, మన భాషలో ఎందుకనో అది అంతగా నప్పదు. దానికంటె, అక్షర మైత్రి తెలుగుకు సహజంగా ఉంటుంది. ఇస్మాయిల్‌ వంటివారు కొందరు రెండో అక్షరం ప్రాసను చాలా వరకు పాటించారు. ఐతే, ఈ ప్రాస చాలా సున్నితంగా , కనిపించీ కనిపించనట్టుగా ఊంటుంది; రెండు వరుస పాదాలకంటె మించదు. దీనివలన, సన్నని బంగారు గొలుసు తగిలించినలాంటి అందమేదో పద్యానికి చేకూరుతుంది. ఇటీవల యదుకుల భూషణ్‌పద్యాలలో కూడా ఇటువంటి ప్రాసను వాడటం గమనించాను.
“రంభలతో నిండి ఉన్న
ముంబయికో నమస్కారం”. (ముంబయి)
“పటాటోపంలేని
పొటాటో రైతులు” (van gough)

ఈయనైతే,కొన్నిచోట్ల నాలుగు పాదాల ప్రాసను పాటించారు.

“నగలా అమరింది
పొగమంచు తెర
నగరంలో ఏముంది
తగరం ఎర” (ముంబయి)

చిత్రమైన అనుప్రాసలు పాటించటం, అనుప్రాసవల్ల స్ఫురించే పదచిత్రాలు కూర్చటం ఇటీవల మో రాసిన కొన్ని పద్యాలలో గమనించాను.
“ఎక్కడా ఎవరికీ ఎవరమూ దొరకము
ఎడారిలో ఎవడి ఒంటె సంచీ వాడిదే
ఒంటెలు మాత్రం ఒంటేలు కలగలిసి పోసుకుంటై” (అన్వేషణ)

“ఆ కష్టమేదో నీ ఒక్క కాష్టానికే వొచ్చినట్టు ” (జ్ఞాపిక)

ప్రాస విషయంలో వచన కవులు నిర్దిష్టమైన నియమమేదీ పాటించాల్సిన పనిలేదు. తమ ప్రకటనలో వెసులుబాటు ఉన్నప్పుడు వీటిని పాటించి లేనప్పుడు పరిహరించవచ్చు. ఐతే, అక్షర మైత్రి, పదాల అందం, నిర్దిష్టత గురించిన పూర్తి అవగాహన ఉండటం ఎంతైనా ఉపకరిస్తుంది.

ఈ వ్యాసంలో పేర్కొన్న విషయాలన్నిటిని నేను చాలా క్లుప్తంగా ప్రస్తావించాను. వీటి గురించి ఇంకా విస్తారంగాను, లోతుగాను చర్చించటానికి అవకాశంఉంది. ఏది ఏమైనా, నేనిదివరకే పేర్కొన్నట్టు, వచన కవిత్వ రచనలో వచ్చిన అనేక ధోరణులను ఎప్పటికప్పుడు కొత్తగా అంచనా వెయ్యటం, వివిధ కోణాలలో విశ్లేషించటం పాఠకులకే కాకుండా, కవులకి కూడా ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.

ఇందులో ఉదహరించి పద్యాలు ఈ క్రింది పుస్తకాలనుంచి తీసుకోబడ్డయి

శ్రీ శ్రీ మహా ప్రస్థానం
ఇస్మాయిల్‌ మృత్యు వృక్షం
శివారెడ్డి వర్షం వర్షం
వేగుంట మోహనప్రసాద్‌ చితి చింత, సాంధ్య భాష
శిఖామణి మువ్వల చేతి కర్ర
వై.ముకుందరామారావు మరో మజిలీకి ముందు
పసునూరు శ్రీధర్‌బాబు అనేకవచనం
తమ్మినేని యదుకుల భూషణ్‌ నిశ్శబ్దంలో నీ నవ్వులు
విన్నకోట రవిశంకర్‌ కుండీలో మర్రి చెట్టు