రచయితలకు సూచనలు

తెలుగు వెబ్ పత్రిక ఈమాట ప్రపంచం నలుమూలల్లో ఉన్న రచయితలందరి దగ్గర్నుంచి రచనల్ని ఆహ్వానిస్తోంది.

ఈమాటలో కథలు, కవితలు, వ్యాసాలు, పుస్తక సమీక్షలు, ఇతర ఆసక్తికరమైన రచనలు ప్రచురిస్తాం. తెలుగు సంస్కృతీ సమాజాలకి, తెలుగువారి జీవనవిధానాలకు సంబంధించిన ఏ రచనలైనా ప్రచురించబడతాయి. ఈమాట ఆశయాలు ముఖ్యంగా:

 1. తెలుగు వారి అనుభవాల్ని అనుభూతుల్నీ జీవనాన్నీ జీవితాన్నీ ప్రతిబింబించే రచనలకి, రచయితలకి ఒక వేదిక కల్పించటం
 2. ఈ వేదిక రాజకీయ, కుల, మత, వర్గ ధోరణులకి, వ్యాపార కలాపాలకి దూరంగా ఉండడం.
 3. ఇంటర్నెట్ టెక్నాలజీని ఉపయోగించుకొని, ఈమాట ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ తేలిక మార్గంలో అందేటట్టు చూడటం.

ప్రచురణార్హత

మంచి సాహిత్యానికి సమీక్ష, విమర్శ మేలు చేస్తుంది తప్పితే కీడు చేయదు అన్నది మా బలమైన నమ్మకం. ఈమాటకు మీరు పంపే రచనల్ని మేము (సంపాదకులు) సమీక్షించి ప్రచురణార్హత నిర్ణయిస్తాం. ప్రచురణకు అర్హమైనవి అనుకున్న రచనలలో ఏమైనా మార్పులు చేర్పులు చేయవలసి ఉంటే రచయితకు సూచిస్తాం. సాంకేతిక, వైజ్ఞానిక, చారిత్రక, శాస్త్రసంబంధి, తదితర ప్రత్యేక రచనలను అవసరమైతే ఆయా రంగాలలో అనుభవజ్ఞులకు పంపి, వారి సూచనల ఆధారంగా రచనల ప్రచురణార్హతను చేయవలసిన మార్పులను నిర్ణయిస్తాం. ఈ సూచనలు రచయిత పాటించాలనే నియమం లేదు. రచయిత మా సూచనలతో విభేదించవచ్చు, తమ తమ కారణాలు చెప్పవచ్చు. మీరూ మేమూ అని కాక మన అందరి ఉద్దేశ్యమూ రచనను వీలైనంత మెరుగు పరిచి పదిమంది పాఠకులూ చదివి మెచ్చేలా చేయడమే కాబట్టి సంపాదకులం రచయితలతో కలిసికట్టుగా, ఇది ఒక సమిష్టి బాధ్యతగా భావించి పనిచేస్తాం. ఇది చాలా సామరస్యమైన పద్ధతిలో రచయితను మెప్పింపడమే మా లక్ష్యంగా నడుస్తుంది. అవసరమని అనిపించినప్పుడు మాత్రమే మీ రచనలను మెరుగుపరచడం, తద్వారా పాఠకులకు చేరువ కావాలన్న రచయిత ఆశయం నెరవేరడానికి శాయశక్తులా తోడ్పడడం తప్ప మీ రచనలను, వాటిద్వారా మీ మీ ఉద్దేశ్యాలు, సందేశాలను మా ఇష్టప్రకారం మార్చడం మా పద్ధతి కానేకాదని రచయితలు గమనించగలరు. సృజనాత్మక రచన రచయిత మానసపుత్రిక. దానిపై అన్ని అధికారాలు రచయితవే. ఇందులో సందేహానికి తావు లేదు.

సంపాదకులు రచనకు సూచించిన మార్పులు, చేర్పులు రచయితలు చేసిన తరువాత లేదా మేము చేసిన మార్పులు అంగీకరించినాక ఆయా రచనలను ప్రచురణకు తగిన విధంగా ముస్తాబు చేసి, రచయితలకు ప్రివ్యూ పంపి, వారు అంగీకరించినాక మాత్రమే ప్రచురిస్తాము. ఒకవేళ రచయితలకి మార్పులు నచ్చకపోతే, మార్పులు చేయకుండా ప్రచురించడం మాకు ఇష్టం లేకపోతే, వారి రచన ప్రచురింపబడదు. ఐతే ఇది ఇప్పటిదాకా జరగలేదు.

ఈ పద్ధతి తెలుగు రచయితలకు కొత్త. వారి రచనకు తగిన గౌరవం ఇస్తారో లేదో అనే భయమో, సంపాదకుల, సమీక్షకుల విద్వత్తు, అర్హతల మీద అపనమ్మకమో ఇతరత్రా మరే కారణాల వల్లనో రచయితలకు సందేహాలు, అపోహలు ఉండడం సహజం. అందువల్ల, ఈ క్రమంలో మొదటినుంచీ రచయితలతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతూ ఉంటాం. చేసే ప్రతి చిన్న మార్పు వారి అనుమతితోనే చేస్తాం. ఈ ప్రివ్యూ పద్ధతి ఈమాటకు ప్రత్యేకం.

ఈ ప్రక్రియకు వీలుగా మీ రచనలని సంచిక ప్రచురణ తేదీకి కనీసం 10 రోజుల ముందుగా పంపాలి. ఆలస్యంగా అందిన రచనలను తరువాతి సంచికలో ప్రచురణకు పరిశీలిస్తాము.

రచయితలకు ముఖ్య గమనికలు

 • ఇంతకు ముందు మరొక పత్రికలో ఎక్కడైనా ప్రచురించిన, లేదా ప్రచురణకు పరిశీలించబడుతున్న సమకాలీన రచనలు ఈమాటలో ప్రచురించబడవు. అదే విధంగా, ఇంటర్నెట్‌లో, వెబ్ పత్రికలలో, స్వంత బ్లాగులలో, ఇతర వెబ్ సైట్లలో ప్రచురించబడిన రచనలకు కూడా ఈమాటలో ప్రచురణార్హత ఉండదు. అయితే, సంపాదకులు గతకాలం నుంచి కొన్ని అరుదైన రచనల్ని తిరిగి ఈమాటలో పాఠకుల కోసం ప్రచురించడం ఈ నిబంధనకు మినహాయింపు.
 • రచనలు తమ స్వంతమనీ, మునుపెక్కడా ప్రచురించ లేదనీ, వేరే పత్రికల వద్ద పరిశీలనకు లేదనీ రచయితలు హామీ ఇవ్వాలి.
 • ప్రచురణార్హత విషయంలో ఈమాట సంపాదకులదే తుది నిర్ణయం.
 • ఈమాటలో ప్రచురింపబడిన రచనలను అచ్చుపత్రికలు, ఇతర సంకలనాలలో తిరిగి ప్రచురించుకోవడానికి రచయితలకి సర్వాధికారాలు ఉంటాయి. అయితే, రచయితలు తమ రచనలను వేరే వెబ్‌సైట్‌లలో మళ్ళీ ప్రచురింపదల్చుకుంటే, వారు తమ రచన మొత్తమంతా కాకుండా, అందులో కొన్ని భాగాలు (excerpts) మాత్రమే ఉటంకిస్తూ, ఈమాటలో పూర్తి రచనకి లింకు జతచేయాలి (తమ సొంత వెబ్‌సైట్ లేదా బ్లాగులు దీనికి మినహాయింపు – వీటిలో రచయితలు ఈమాటకు లింకునిచ్చి తమ పూర్తి రచనని తిరిగి ప్రచురించుకోవచ్చు. ఐతే, మరుసటి రోజే కాకుండా కనీసం రెండు వారాల వ్యవధిని ఇవ్వమని మా విన్నపం). అచ్చుపత్రికలు లాంటి ఇతర మాధ్యమాలలో పునః ప్రచురణకు పంపేటప్పుడు ఆ రచన ఈమాటలో ముందు ప్రచురించబడిందని ఆయా పత్రికా సంపాదకులకు తెలియజేయాలి.

రచనలు పంపే పద్ధతి

 • రచయితలు తమ రచనల్ని సంపాదకులకి నేరుగా ఈ-మెయిల్ (submissions@eemaata.com) ద్వారా పంపాలి. రచనలని టెక్స్ట్ ఫైళ్ళ రూపంలో పంపడం ఉత్తమం. తమ రచనలతో పాటు చిత్రాలు జత చేయదల్చుకున్నవారు ఆయా చిత్రాల కాపీరైటు నిబంధనలకి లోబడి వ్యవహరించాలి. ఎక్కువ చిత్రాలు పంపే ముందు సంపాదకులని సంప్రదించడం మంచిది. రచయితలు తమ రచనలతో బాటు తమ ఫోటో, వివరాలు కూడా జత చేయవచ్చు.
 • రచయితలు తమ రచనల్ని R.T.S. లో కానీ, యూనికోడ్ లో కానీ టైపు చేసి పంపవచ్చు. రచయితల సౌలభ్యం కోసం తెలుగులో టైపు చేయడానికి సహాయపడే పరికరాలు కొన్ని ఇక్కడ పొందు పరుస్తున్నాం.
 • కేవలం పీ.డీ.ఎఫ్ (pdf), లేదా చేతివ్రాత స్కాన్ చేసి బొమ్మల (jpg, gif వగైరా) రూపంలో పంపిన రచనలు పరిశీలించబడవు.
 • తమ రచనల్ని శ్రవ్య రూపంలో పంపదలుచుకున్న వారు ఎంపీ3 (MP3) ఫార్మాట్లో పంపితే మంచిది. అలా కుదరని వారు మాతో సంప్రదిస్తే వేరే మార్గాలు సూచించగలం.

ఇతరత్రా సందేహలుంటే, పైన సూచించిన మాకు మీ ప్రశ్నలు మెయిల్ ద్వారా పంపవచ్చు, లేదా ఈ పేజీలో ఉన్న అభిప్రాయాల పెట్టెలో రాసి పంపవచ్చు. సాధ్యమైనంత త్వరలో సమాధానం ఇవ్వటానికి ప్రయత్నిస్తాం.