రాలిన పూలన్నీ ఏరి తెచ్చుకుంటాను,
ఎవరూ చూడకుండానే.
దోసిటినిండా రంగురంగుల పువ్వులు,
తేనెలు కారే పువ్వులు.
కొన్ని తేనెటీగల ముళ్ళు కూడా వస్తాయి.
వాసన చూస్తాను,
చెంపలకు ఆనిస్తాను,
మైకం కళ్ళతో రెండు గొట్టాలు వేసుకుని పీలుస్తాను.
ఒక పూటంతా ఎండలో ఆరనిస్తాను,
ఒక పూట నీడలో ఎండబెడతాను.
వాసన పోకుండానే,
రంగులు రంజుగా ఉన్నప్పుడే,
జ్ఞాపకాల సిరాలో ముంచి,
పుస్తకంలో దాచుకుంటాను,
ఎక్కడో జాగ్రత్తగా పెట్టి మర్చేపోతాను.
ఎప్పుడో అనుకోకుండా, ఎవరికో
దొరుకుతుందా పుస్తకం.
రసగ్రాహులైన వాళ్ళు అయితే,
రంగు రంగుల కవితల్ని, మాంచి
గుబాళింపుతో రుచిచూస్తారు.
పిల్లలకు ఖాళీ తేనెతుట్టొకటి దొరుకుతుంది,
దానిలో నీళ్లు నింపి ఆడుకుంటూ
వాళ్ళు, నన్ను తలుచుకుంటారు.