కర్ణుడు యుద్ధసన్నద్ధుడయ్యాడు. అంతకు కొన్ని రోజుల ముందే తెలిసిన తన జన్మరహస్యం, తన తల్లికి తానిచ్చిన మాట అతడి స్థైర్యాన్ని నీరుగారుస్తూ ఉన్నాయి. అవసరమున్న వేళలో తన అస్త్రవిద్య పనికిరాకుండా పోతుందన్న గురుశాపం అక్షరసత్యమని తేలింది. గడప దాటుతుండగా, బ్రాహ్మణవేషంలో ఇంద్రుడు వచ్చి కవచకుండలాలను దానంగా అందుకొని వెళ్ళిపోతాడు, ఆకాశాన ఐరావతంపై కూర్చొని తీరుబడిగా కర్ణార్జునయుద్ధాన్ని చూసేందుకు. పైచేయి తనదే అయ్యిందన్న తృప్తి మిగిలింది కర్ణుడికి. ఇంతలో బ్రాహ్మణవేషధారియైన దేవదూత వచ్చి ఇంద్రుడు పంపిన విమలమనే అస్త్రాన్ని ఇచ్చి వెళ్ళిపోతాడు. అర్జునుడున్న చోటికే శల్యుడు కర్ణరథాన్ని తీసుకెళుతూ ఉండగా భరతవాక్యం వినబడుతుంది.
కొన్ని విశేషాలు
భాసనాటకాల్లో అతి చిన్నది ఇదే. ఐదే పాత్రలు. స్త్రీపాత్రల విలాపాలు లేవు కానీ ప్రాకృతికమైన నాయకుడు ఉన్నందునా, కరుణరసప్రధానమైనందునా దీన్ని ఉత్సృష్టికగా పరిగణిస్తారు.
ఇంద్రుడు కర్ణుడిని కవచకుండలాలు యాచించే కథ మహాభారతం వనపర్వంలో వస్తుంది (దాక్షిణాత్యపాఠంలో 311వ అధ్యాయం; సంశోధితపాఠంలో 284వ అధ్యాయం). ఈ కథను కర్ణుడు యుద్ధానికి బయలుదేరుతున్న సందర్భానికి జరపడం భాసుడు చేసిన మార్పు. మహాభారతకథలో, ఇంద్రుడి రాక కన్నా ముందు సూర్యుడు కర్ణుడిని హెచ్చరిస్తాడు. కర్ణుడు తన మాట విననందున శక్తి అనే ఆయుధాన్ని ఇంద్రుడినుంచి ఇప్పించుకొమ్మని సలహా ఇస్తాడు. కర్ణభారం కథలో సూర్యుడు ఉండడు. కర్ణుడికి హితవు చెప్పే బాధ్యత శల్యుడు తీసుకుంటాడు. ఈ నాటకంలో శల్యుడు మంచివాడే. కర్ణుడి మనఃస్థైర్యాన్ని క్రుంగదీసేలా ‘శల్యసారథ్యం’ చేసే రకం కాదు. కర్ణుడి హితం కోరినవాడే.
యుద్ధానికి వెళ్ళకముందే తాను ఓడిపోవడం మొదలుపెట్టాడని గ్రహించినా, తన ఉదాత్తతను వదులుకోని కర్ణుడి పాత్రచిత్రణ ఇప్పుడు మనకు కొత్తగా అనిపించకపోవచ్చు కానీ ఇతిహాసాల్లోని దుష్టపాత్రలను సానుభూతితో పునఃపరిశీలించడం, మృదువుగా చిత్రీకరించడం బహుశః భాసుడితోనే మొదలయ్యిందేమో.
ఈ కథలో ఒకటికి మూడుసార్లు కర్ణుడి బ్రాహ్మణభక్తిప్రకటనం ఎదురవుతుంది మనకు. రచయిత నేపథ్యము, అప్పటి బౌద్ధిక, సామాజిక వాతావరణాలు అలాంటి ప్రస్తావనలకు కారణమై ఉంటాయని ఊహించవచ్చు.
చిలకమర్తి లక్ష్మీనరసింహంగారి ‘భాసుని భారతనాటకములు’ పుస్తకంలో ‘కర్ణభారం’ చోటుచేసుకోలేదెందుకో. మానవల్లి రామకృష్ణకవిగారి అనువాదం ఆం.ప్ర.సాహిత్య అకాడెమీవారు ప్రచురించిన మానవల్లి కవి – రచనలు పుస్తకంలో లభ్యమవుతున్నది. ఫిబ్రవరి 1913 కల్లా మానవల్లివారి అనువాదం సిద్ధమయ్యింది (టి.గణపతిశాస్త్రిగారు పరిష్కరించిన భాసనాటకాలు 1912లో ప్రచురితమయ్యాయి). ముద్రితప్రతుల ఆధారంగా కాక నేరుగా తాళపత్రాలనుంచే అనువాదం చేసానని కర్ణభారానికి ముందుమాటలో చెప్పారు మానవల్లి రామకృష్ణకవిగారు.
నృసింహరూపంలో తనను దర్శించిన స్త్రీ-పురుష-అసుర-దేవతల సమూహాలకు, పాతాళలోకానికి సంభ్రమం కలిగించినవాడు, వజ్రాయుధసమానమైన తన చేతి గోళ్ళ వరుసతో హిరణ్యకశిపుడి వక్షాన్ని బద్దలుచేసినవాడు, దేవతల శత్రువులైన దానవుల బలాన్ని అణచినవాడూ అయిన లక్ష్మీధరుడు మీకు ఐశ్వర్యములను కలిగించుగాక!
(వెనక్కి తిరిగి చూసి) అరె! ఇదిగో అంగరాజు, యుద్ధవేషాన్ని ధరించి శల్యరాజుతో సహా తన భవనంనుంచి ఇటే వస్తున్నాడు! ఇదేమి, సమరోత్సాహం కలవారిలో ప్రముఖుడు, ఇతఃపూర్వమే తన పరాక్రమాన్ని లోకానికి చూపించినవాడు అయిన ఇతడికి ఎప్పుడూ లేని ఈ విషాదము? ఇతడు –-
అతిభయంకరమైన పరాక్రమంతో వెలిగేవాడు, యోధాగ్రణి… ఇప్పుడీ బుద్ధిమంతుడు దుఃఖిస్తున్నాడు. మబ్బుల దొంతరచేత తన కిరణాలు అడ్డగించబడిన సూర్యుడిలా ఉన్నాడు కర్ణుడు.
ఇంక నేను దారి తొలగుతాను. (వెళ్ళిపోతాడు)
(తతః ప్రవిశతి యథానిర్దిష్టః కర్ణః శల్యశ్చ ।)
కర్ణః:
మా తావన్మమ శరమార్గలక్షభూతాః
సంప్రాప్తాః క్షితిపతయః సజీవశేషాః ।
కర్తవ్యం రణశిరసి ప్రియం కురూణాం
ద్రష్టవ్యో యది స భవేద్ధనఞ్జయో మే ॥ 5 ॥
శల్యరాజ! యత్రాసావర్జునస్తత్రైవ చోద్యతాం మమ రథః ॥
(కర్ణుడు, శల్యుడూ ప్రవేశిస్తారు)
కర్ణుడు:
నా బాణాల దారిలో లక్ష్యాలై నిలిచిన రాజులు ప్రాణాలతో మిగిలి ఉంటారా? శత్రుసేనకు అగ్రభాగాన నిలిచిన అర్జునుడు నాకు కనబడితే, కౌరవులకు ప్రియం చేకూరుస్తాను.
పరస్పరం దేహాలను ఖండించుకొన్న యోధులతో, అశ్వాలతో, ఏనుగులతో, రథాలతో నిండే మహాయుద్ధాలలో క్రుద్ధుడైన యముడివలె విక్రమించే నాకు సైతం ఈ యుద్ధసమయంలో హృదయవైక్లబ్యం కలుగుతుంది.
కష్టంగా ఉన్నది.
పూర్వం కుంతికి పుట్టాను. రాధేయుడిగా పేరుపొందాను. యుధిష్ఠిరాదులైన ఆ పాండవులు నాకన్నా చిన్నవాళ్ళు.
చాలాకాలంగా ఎదురుచూస్తున్న శుభసమయం – సుదినం – ఎట్టకేలకు సంప్రాప్తించింది. కానీ అమ్మ మాట కారణంగా నా అస్త్రవిద్య అడ్డగించబడి, వ్యర్థమవుతున్నది.
ఓ శల్యరాజా! నా అస్త్రవిద్యాభ్యాసవృత్తాంతాన్ని వినిపిస్తాను.
శల్యః:
మమాప్యస్తి కౌతూహలమేనం వృత్తాన్తం శ్రోతుమ్ ।
శల్యుడు:
ఆ వృత్తాంతాన్ని వినాలని నాకూ కుతూహలంగా ఉన్నది.
కర్ణః:
పూర్వమేవాహం జామదగ్న్యస్య సకాశం గతవానస్మి ।
కర్ణుడు:
పూర్వం నేను జమదగ్ని కుమారుడైన పరశురాముడివద్దకు వెళ్ళాను.
నా దురదృష్టం కొద్దీ వజ్రముఖం అనే పురుగు నా రెండు తొడలనూ కుట్టింది. గురువుగారి నిద్రకు భంగం కలుగుతుందనే భయంతో బిగబట్టి ఆ నొప్పిని ఓర్చుకున్నాను. నా గాయంనుంచి స్రవిస్తున్న రక్తం కారణంగా ఆయన మేల్కొని, ఏం జరిగిందో తెలుసుకొని కోపంతో మండిపడుతూ “అవసరమైనప్పుడు నీ అస్త్రాలు నిష్ప్రయోజనమగు గాక!” అని శపించారు.
ఈ అస్త్రాల సంగతి పరీక్షిద్దాము. (అలా చేసి) ఈ అస్త్రాలు శక్తిహీనమైనట్లున్నాయి. పైగా…
దైన్యంతో కన్నులు మూతపడుతున్న ఈ గుఱ్ఱాలు స్వాధీనం తప్పి మాటిమాటికీ జారి పడుతున్నాయి. ఏడాకుల అరటి చెట్టు వాసన ఉండే మదాన్ని స్రవిస్తున్న ఏనుగులు యుద్ధవైముఖ్యాన్ని సూచిస్తున్నాయా అన్నట్లు ఉన్నాయి.
మరణిస్తే స్వర్గం లభిస్తుంది. గెలిస్తే కీర్తి! ఈ లోకంలో ఆ రెండూ గౌరవించబడేవే. యుద్ధంలో నిష్ఫలత్వం అనేది ఉండదు.
అంతే కాక –
యుద్ధంనుంచి తిరిగి వస్తాయన్న ఆశ లేకపోయినప్పటికీ ఈ గుఱ్ఱాలు వేగంలో గరుత్మంతుడికి సమానమైనవి. శ్రీమంతమైన కాంభోజజాతికి చెందినవి. నిజానికి, వీటిని రక్షించాల్సిన బాధ్యత నాది. అయినప్పటికీ, ఈ అశ్వాలు నన్ను కాపాడుగాక.
గోవులకు బ్రాహ్మణులకు శుభమగుగాక. పతివ్రతలకు శుభమగుగాక. యుద్ధాలలో వెనుతిరగని యోధులకు శుభమగుగాక. సమయం ఆసన్నమైన నాకు శుభమగుగాక! అయ్యా, ప్రసన్నుడనయ్యాను.
దుస్సహమైన పాండవసేనలలో జొచ్చి, గుణగణసంపన్నుడని ఖ్యాతిగాంచిన ధర్మరాజును బంధించి నా శ్రేష్ఠమైన బాణాల వేగంతో అర్జునుడిని నేలకూల్చి – సింహం చనిపోయాక అడవి ప్రవేశయోగ్యం అయినట్లు – ఈ సమరభూమిని ప్రవేశయోగ్యంగా మారుస్తాను.
శల్యరాజా! ఇంక రథాన్ని అధిరోహిద్దాము.
శల్యః:
బాఢమ్ ।
(ఉభౌ రథారోహణం నాటయతః ।)
శల్యుడు:
మంచిది.
(ఇద్దరూ రథారోహణాన్ని అభినయిస్తారు.)
కర్ణః:
శల్యరాజ! యత్రాసావర్జునస్తత్రైవ చోద్యతాం మమ రథః ।
కర్ణుడు:
శల్యరాజా! ఆ అర్జునుడుండే చోటుకే నా రథాన్ని నడిపించు.
భో కణ్ణ! మహత్తరం భిక్ఖం యాచేమి ।
భోః కర్ణ! మహత్తరాం భిక్షాం యాచే ।
(తెర వెనకనుండి)
ఓ కర్ణా! మహత్తరమైన భిక్షను యాచిస్తున్నాను.
ఆహూయతాం స విప్రః । న న । అహమేవాహ్వయామి । భగవన్నిత ఇతః ।
కర్ణుడు:
(విని) ఏమి శక్తిమంతమైన శబ్దము!
ఈ శ్రీమంతుడు శ్రేష్ఠుడైన బ్రాహ్మణమాత్రుడు కాదు. ధీరగంభీరమైన ఇతడి మాటను విన్నంతనే నా ఈ అశ్వాలు, అకస్మాత్తుగా, చెవులను రిక్కించి, అందమైన కన్నులను మోడ్చి, మెడలను వంచి, తమ దేహాలపై అదుపును కోల్పోయి నిలుచుండిపోయాయి.
ఆ విప్రుణ్ణి రమ్మనండి. కాదు, కాదు నేనే ఆహ్వానిస్తాను. స్వామీ, ఇటు, ఇటు.
రాజేంద్రుల కిరీటాలలోని మణుల కాంతిచే ఎరుపెక్కిన పాదాలు కలవాడను, విప్రేంద్రులైన మీ పాదధూళిని శిరస్సున దాల్చి, ఈనాడు, ఈ లోకంలోని ధన్యుల సమూహంలో చేరిన వాడను అయిన నేను – కర్ణుడను – మీకు నమస్కరిస్తున్నాను.
శక్రః:
(ఆత్మగతమ్) కిం ను ఖలు మయా వక్తవ్యం, యది దీర్ఘాయుర్భవేతి వక్ష్యే దీర్ఘాయుర్భవిష్యతి । యది న వక్ష్యే మూఢ ఇతి మాం పరిభవతి । తస్మాదుభయం పరిహృత్యం కిం ను ఖలు వక్ష్యామి । భవతు, దృష్టమ్ ।
ఇంద్రుడు:
(తనలో) ఏమని చెప్పనిప్పుడు? “చిరంజీవ” అని అంటే, దీర్ఘాయుష్మంతుడవుతాడు. అనకపోతే, నన్ను మూర్ఖుడిగా లెక్కగట్టి పరాభవిస్తాడు. కనుక, ఆ రెండూ కాక ఏం చెప్పాలి? ఆఁ, తెలిసింది.
స్వామీ, ‘దీర్ఘాయువు క’మ్మని అనలేదేమి? పోనీలే, ఇదే బాగున్నది. ఎందుకంటే –
మనుష్యుడు ప్రయత్నపూర్వకంగా ధర్మాన్ని సాధించుకోవాలి. రాచరికపు సంపదలు పాము నాలుకవలె చంచలమైనవి. అందుకే ప్రజాపాలనలో మాత్రమే తన బుద్ధిని మగ్నం చేస్తే, దేహం నశించాక కూడా గుణాలు నిలిచి ఉంటాయి.
మహత్తరమైన భిక్షను ఇస్తాను. నా వైభవం గురించి వినండి.
ద్విజోత్తమా! మంచి గుణాలతో, అమృతసమంగా ఉండే క్షీరధారలను వర్షించేవి, కాంతిమంతమైనవి, సంతృప్తి చెందిన దూడలచే అనుసరించబడేవి, వయస్సులో ఉన్నవి, అర్థిజనం ఎక్కువగా కోరుకునేవి, పవిత్రమైనవి, కొమ్ములకు బంగారం తాపడం చేయబడ్డవీ అయిన వేయి ఆవులను ఇస్తాను.
మదజలం నదుల్లా పారే చెక్కిళ్ళతో ఉన్నవి, తుమ్మెదలచే చుట్టుముట్టబడి ఉన్నవి, ఉన్నతపర్వతసమూహాలను పోలి ఉన్నవి, తెల్లని గోళ్ళు, దంతాలూ ఉన్నవి, యుద్ధంలో శత్రువులను సంహరించేవీ అయిన ఈ ఏనుగుల మందను ఇస్తాను.
భయపడవద్దు, భయపడవద్దు. మీరు ప్రసన్నులు కండి. ఇంకో మాట –
మీకు ఇష్టమైతే, నా అవయవాలతోబాటు పుట్టినది, నా దేహానికి రక్ష, దేవాసురులైనా మహాస్త్రాలతో సైతం భేదించలేనిది అయిన ఈ కవచం, కుండలాలతో సహా ఇచ్చేందుకు అర్హమైనది.
కాలం గడిచే కొద్దీ నేర్చుకున్న విద్య నశించిపోతుంది. బలంగా వేళ్ళూని ఉన్న వృక్షాలూ పడిపోతాయి. చెరువుల్లో చేరిన నీరూ ఇంకిపోతుంది. దేవతలకు ఇచ్చిన ఆహుతి, అర్థులకిచ్చిన దానము శాశ్వతంగా ఉండిపోతాయి.
(తీసుకొని, తనలో) హమ్మయ్య! స్వీకరించాను వీటిని. పూర్వం, దేవతలందరూ అర్జునుడి విజయం కోసం చేసి తీరవలసినదని నిశ్చయించిన పనినే చేసానిప్పుడు. ఇక నేను ఐరావతాన్ని అధిరోహించి అర్జునకర్ణుల ద్వంద్వయుద్ధాన్ని చూస్తాను. (వెళ్ళిపోతాడు)
ఓ కర్ణా! కవచకుండలాలను స్వీకరించడంవల్ల కలిగిన పశ్చాత్తాపంతో ఇంద్రుడు నిన్ను అనుగ్రహించాడు. పాండవులలో ఒకడిని చంపడంలో వమ్ము కాని విమల అస్త్రాన్ని – విమల అనే పేరుగల ఈ శక్తిని – స్వీకరించు.
కర్ణః:
ధిగ్, దత్తస్య న ప్రతిగృహ్ణామి ।
కర్ణుడు:
ఛీ! దానానికి బదులుగా ప్రతిదానాన్ని స్వీకరించను.
దేవదూతః:
నను బ్రాహ్మణవచనాద్ గృహ్యతామ్ ।
దేవదూత:
బ్రాహ్మణుడి మాట మేరకు స్వీకరించవచ్చు.
కర్ణః:
బ్రాహ్మణవచనమితి । న మయాతిక్రాన్తపూర్వమ్ । కదా లభేయ ।
కర్ణుడు:
బ్రాహ్మణుడి మాటా? ఇంతకు ముందెప్పుడూ జవదాటలేదు. ఎప్పుడు లభిస్తుంది?
ప్రళయకాలసముద్రఘోషకు సమానమైన శంఖధ్వని – కృష్ణుడిదో, అర్జునుడిదో అయి ఉండాలి. యుధిష్ఠిరుడి పరాజయానికి కోపించి అర్జునుడు ఈనాడు తన చేవ మేరకు యుద్ధం చేయనున్నాడు.
శల్యరాజా! ఆ అర్జునుడున్నచోటికే నా రథాన్ని తీసుకెళ్ళు.