తెల్లగా తెల్లారకుండానే
మా ‘అద్దెకొంప’ బద్దకంగా ఒళ్ళు విరుచుకుంటుంది.
మా ఆవిడ అంట్లగిన్నెలతో
చేసే గలగల చప్పుళ్ళు
మాకు తొలిజాము కోడికూత!
గది నిండా అలుముకుని ఊపిరాడక
ఉక్కిరిబిక్కిరైపోయిన
‘తాలింపు గుబాళింపు’ తాదూరే సందు లేక,
మా ముక్కుపుటల్లో తిష్ట వేసుక్కూర్చుని
మమ్మల్ని సైతం ఉక్కిబిక్కిరి చేస్తుంది,
ఒక్కటే గది మరీ!
మా డబ్బా టీవీలోని ‘చించాన్’గాడు రాత్రి
కలలోకి వచ్చి కబుర్లు చెప్పేడు కాబోలు,
సింగిల్ కాట్ మంచం మీద పరచిన
చిరిగిన బొంత మీద కళ్ళు నులుముకుంటూ
మా చిన్నోడు!
నేను వాడికి ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ అదొక్కటే మరీ!
అప్పటికే నిద్ర లేచిన మా పెద్దది మాత్రం
చిరిగిన యూనిఫామ్ లోనుండి వెక్కిరిస్తున్న పేదరికాన్ని
కిక్కురు మనకుండా పిన్నీసుతో కుట్టేసుకుని
కళ్ళల్లో కాంతిపుంజాల్ని వెలిగించుకుంటుంది!
అది ఇప్పుడిప్పుడే బ్రతుకు బండి మీద
సవారీ చేయడం నేర్చుకుంటుంది మరీ!
గోడమీద గడియారం ముల్లుని ఒంటికి
తగిలించుకుని బయటకి లోపలికి
చక్రంలా తిరుగుతున్న మా ఆవిడ
ఒంటి మీద, రంగెలిసిపోయిన నైటీ
నిర్జీవంగా వేళ్ళాడుతూ
నన్ను చూసి పలకరింపుగా నవ్వుతుంటుంది!
ఆ టైంలో మా ఆవిడ నవ్వదు మరీ!!
నేను మాత్రం అవేం పట్టనట్టే,
పెదాలపై చిరునవ్వుని సింగారించుకుని
ఆ బరువంతా దర్జాగా గుండెల్లో అదిమిపెట్టుకుని
అలుపెరగని యోధుడిలా లోకం మీదకి
యుద్ధానికి బయలుదేరుతాను.
నాకు తెలియకుండానే, నటించడం నాకెప్పుడు అలవాటైపోయిందో మరీ?
ఒక్కోసారి అనిపిస్తుంటుంది,
కొన్నాళ్ళైతే ఆ బరువెక్కిన గుండె ఏమైపోతుందోనని?
దానికి నటించడం రాదు మరీ!