కిరాతి ఖడ్గాన్నోయ్‌

మీ వంకరటింకర
మాటలనన్నీ
పేళ్ళుగ కొట్టి
గాడి పొయ్యిలో
పెట్టేస్తానోయ్
నిప్పు కణికనోయ్‌
నిప్పు కణికనోయ్
నేనంటే మరి
నేనేనోయ్‌

మొరిగే కుక్కకు
వెన్న రొట్టెలే
వేస్తానోయ్‌
వాగే నోటిని
మంచి మాటల
తుమ్మ జిగురుతో
మూస్తానోయ్‌
నేనంటే మరి
నేనేనోయ్‌

మెరమెచ్చు
మాటల
కంచెలనల్లి
కుటిల వర్తనుని
మోమాటాల
బందెలదొడ్డిలో
వేస్తానోయ్‌

తెంపరి కసి
రంపం తెచ్చి
విషపు బుర్ర
సొర చేపల
పళ్ళను కోస్తానోయ్‌
నేనంటే మరి
నేనేనోయ్‌

ఇంద్రజాలికుని
టోపీలోని
పావురాయిని
నేనేనోయ్‌
ఇత్తడి మాటల
లోకుల సరసన
పరుసవేదిని
నేనేనోయ్‌

నింగిని నంగిరి
వంకర చంద్రుని
పరపర కొరికే
రెండు శిరస్సుల
రాహువునోయ్‌

ఎడారి మాటల
బిడారు కోతల
తలారి దండుకు
కిరాతి ఖడ్గం
నేనేనోయ్‌

ఏవనుకున్నావ్‌,
విన్నావా, సరి
కరకరి కరకరి
ఛూరికనోయ్‌
ఉక్కిరి బిక్కిరి
కత్తెరనోయ్‌‌

నేనంటే మరి
నేనేనోయ్‌

(వాగ్రూపంలో ఉన్న కాళికకు)