ఇంతేరా ఈ జీవితం తిరిగే రంగులరాట్నము
కలిమి నిలవదు లేమి మిగలదు
కలకాలం ఒకరీతి గడవదు…
ఇలా సాగే పాటను మొదటిసారి విన్నప్పుడు, ఎవరీ మహానుభావుడనిపించింది. అది 1967. బాపట్ల ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో పి. యు. సి. చదువుతున్నాను. భారతీయ తాత్త్విక భావాలన్నింటినీ వడగట్టి యీ పాటను కట్టినట్టు అనిపించేది. పైగా దానికి అమరిన అద్భుతమైన ఫణితి సాహిత్యానికి వెలుగులద్దింది. ‘రంగులరాట్నం’ బి.ఎన్. రెడ్డి సినిమా. ఆయన కోరి యస్వీతో ఈ పాట రాయించుకున్నారు, అంతే! అరటిచెట్టు ఒకే గెల వేస్తుంది. కర్పూర చక్కరకేళీ ఒక్క గెల కాదు, ఒక్క పండు చాలదూ! సరిగ్గా అప్పుడే చంద్రమోహన్ బాపట్ల అగ్రికల్చరల్ కాలేజిలో చదువుతున్నాడు. మాకంటే బాగా పెద్దవాడు. ఓ పెద్ద పల్లెటూరిలా వుండే ఆనాటి బాపట్లలో ఒకర్నొకరు తెలియకపోవడం ఏముంటుంది? పైగా స్థానికులకు బలిమి ఎక్కువగా ఉండేది. ఆ కాలేజిలోకి కూడా చొరవగా వెళ్ళే సదుపాయం ఉండేది. మనోడు హీరోగా వచ్చిన సినిమా అంటే మరింత ఇష్టంగా చూస్తాం కదా. దాంతో ఆ పాట నోటికొచ్చేసింది.
కోరిక ఒకటి జనించు తీరక ఎడద దహించు
కోరనిదేదో వచ్చు శాంతి సుఖాలను తెచ్చు
ఏది శాపమో ఏది వరమ్మో తెలిసీ తెలియక
అలమటించుటే – ఇంతేరా ఈ జీవితం.
ఎవరికి వారు తమ గురించే ఈ మాటలు చెప్పాడనుకున్నారు.
చిన్నప్పుడు నవమి పందిళ్ళలో, కోటప్పకొండ తిరనాళ్ళలో తిరిగిన రంగులరాట్నాలు మర్చిపోయాను గాని శర్మగారెక్కించిన రంగుల రాట్నాన్ని యాభై ఏళ్ళయినా యింకా దిగలేదు. వయసొచ్చిన కొద్దీ అందులోని ప్రతి ముక్కా కొత్త అర్థాలు స్ఫురింపజేస్తున్నాయి.
ఓ పదేళ్ళ తర్వాత– నా రాత బాగుండి పత్రికల్లో పడ్డాను. ఆంధ్రజ్యోతి సంపాదకులు నండూరి రామ్మోహనరావు మాకో కాలమ్ రాయండని అడిగారు. అప్పుడప్పుడే పేరడీలలో కొంచెం చేయి తిరిగినవాణ్ణని పేరొచ్చింది. ఇహ వారం వారం డైలీ ఎడిట్ పేజిలో శీర్షిక అనేసరికి నాకు కొంచెం పెద్దరికం వచ్చేసింది. అలాగే రాద్దాం లేండని నండూరికి జాబు రాశాను. కాలమ్‌కి రంగులరాట్నం అని పేరు పెట్టుకున్నాను. ఏళ్ళ తరబడి నిరాటంకంగా ఆ శీర్షికను నడిపాను. కీర్తులు అపకీర్తులు మూట కట్టుకున్నాను. వాక్య నిర్మాణాలు నేర్చుకున్నాను. ‘రంగులరాట్నం’ నాలో వుండిపోయింది.
ఇంకా కొన్నేళ్ళ తర్వాత– ఆంధ్రజ్యోతిలో వుద్యోగం ఇచ్చారు. విజయవాడ వచ్చాను. నడిచేదారుల గమ్యమొక్కటే–నడిపేవానికి అందరొక్కటే! అనుకున్నాను. విజయవాడ తీర్థాలకు, క్షేత్రాలకు నెలవు. పత్రికలు, ఇతర అచ్చులవాళ్ళు, ఆకాశవాణి, చిత్రపంపిణీదారులు బెజవాడకున్న కొత్త హంగులు. వచ్చీపోయే ఎద్దడి బాగా వుండేది. పత్రికల్లో పని చేసే కొందరు ఆకాశవాణికి నిలయవిద్వాంసులు. అందులో నేనొకణ్ణి అయిపోయాను. విజయవాడ రేడియో స్టేషన్ ముందు ఓ పెద్ద రావిచెట్టు గలగల్లాడుతుండేది. దాని చుట్టూ ఒక సిమెంటు కట్టు ఉండేది. మాట కచ్చేరీల వారు, పాట కచ్చేరీల వారు, నిలయ మరియు నిలవ విద్వాంసులు ఆ రావిచెట్టు నీడన చేరితే– ఇహ చెప్పారూ… ఈ గలగలల ముందు ఆ గలగలలు వినిపించేవి కావు. అక్కడ తటస్థపడ్డారు రంగులరాట్నం కవి శ్రీరామ్ వెంకట భుజంగరాయ శర్మ. రేడియో ప్రసంగం కోసం వచ్చారు. ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి కూడా వున్నారు. ఈయన నాకు ముందే పరిచయం. హనుమచ్ఛాస్త్రి నన్ను ఘనంగానే శర్మకి పరిచయం చేశారు. దాంతో నేను వెంటనే యస్వీని పొగడ్డానికి అవకాశం లేకపోయింది. స్ఫుటమైన విగ్రహం, స్ఫుటమైన మాట. ‘నాకు తెలిసిన యస్వీ’ మీద అనర్గళంగా మాట్లాడాలని నా చాపల్యం. కాని నా మాట సాగనివ్వలేదు. గొప్పవారికి కర్ణపిశాచి ఉంటుంది కాబోలు! ఆ రావిచెట్టు నీడలో ఓ మూల సత్యం శంకరమంచి పొడుగ్గా నిలబడి పైవారం అమరావతి కథతో గొడవ పడుతుండేవారు. లలితసంగీతం వాళ్ళు కూనిరాగాలతో తెగ టెన్షన్ పడుతూ కనిపించేవారు. మూర్తీభవించిన అసహనం లాగా ఉషశ్రీ– ఆ రావిచెట్టు కట్టు వైతాళికులు తిరుగుతున్న రంగులరాట్నమయ్యేది. ఏనుగు పైని నవాబు! గాడిద పైని గరీబు! గుర్రం మీది జనాబు! పల్లకి లోని షరాబు! నడిచే దారుల గమ్యమొక్కటే!
మహనీయులు వీళ్ళంతా! మాటలలో బొమ్మలు కట్టడం, వాటిని అంత అందంగానూ ఆకాశవాణి ద్వారా శ్రోతలకు చూపించడం వారికి తెలుసు. యస్వీ రేడియో ప్రసంగాలు మహత్తర చిత్రకృతులు, కనువిందు చేసే కొండపల్లి బొమ్మలు. నిజానికి శర్మ అచ్చులకు రాసింది తక్కువ. హల్లులకు, అంటే ప్రసంగ పాఠాలకు రాసిందే ఎక్కువ. కృష్ణశాస్త్రి బడి, పలుకుబడితో పాటు వొద్దిక వొబ్బిడితనం కలిసిన దినుసు యస్వీది. గాలివాటు బావుందని అక్షరాలతో గాదెలు నింపింది లేదు. అతి ఎక్కువ చదివి అతి తక్కువ రాయడం శర్మ నైజం. పాతికేళ్ళలో పాతిక రేడియో ప్రసంగాలు చేశారు. అసలా ఎత్తుగడ, ప్రయాణం, ముగింపు నాటకీయంగా వినసంపుగా ఉంటుంది. ‘అల్లసాని వరూధిని’ లాంటి కొన్నింటిని మాత్రమే గుర్తు చేసుకుంటా. వరూధిని ఒక పాత్ర కాదు ఒక అనుభూతి అంటారాయన. అలాంటి ఓ అచ్చర తారసపడితే బాగుండనిపిస్తుంది. పురాణగాథ నించి ఒక చిన్న పోగు పట్టుకుని దాన్ని పట్టుకోకగా దిగ్గజకవి మనకు అందించాడు. అందుకే కృష్ణశాస్త్రి ‘అప్పుడు పుట్టివుంటే నేను పెద్దన్నని’ అని సంతోషంగా చాటుకున్నాడు. ఎంత కవ్వించినా కొరుకుడు పడని చాదస్తపు బ్రాహ్మడితో విసిగి వేసారి, చివరకు ‘వనిత తనంతతా వలచి వచ్చిన చుల్కన కాద ఏరికిన్’ అంటూ స్త్రీజాతికి ఓ సందేశం యిచ్చింది. ఇంతటి చా.బ్రా. ‘ఎవ్వతెవీవు భీతహరిణేక్షణ’ అన్నాడంటే– వరూధిని చక్కదనం నిగ్రహించుకోలేనంతటిదన్నమాట! (చూ. ధ్వని అలంకారం) అచ్చరకన్నె ‘ఇంతటి కన్నులుండ తెరువెవ్వరి వేడెదు భూసురేంద్ర’ అంటూ పాఠకుల్ని తిరిగి ధ్వని అలంకారం లోనే కొడుతుంది.
‘భీమేశ్వర పురాణంలో శ్రీనాథుడు’ మరొక రేడియో వాక్చిత్రం. ఏమిటో అంతా చూసినట్టే చెబుతారు. చెప్పి వర్ణిస్తారు. వర్ణించి చెబుతారు. మనకు నమ్మబుద్దేస్తుంది. ఆయన మాటలు చిత్రమైన మైకం లోకి తీసికెళ్తాయ్. శర్మ ఏమంటారంటే, ‘శ్రీనాథుడు తన అలవాట్లన్నీ భీమేశ్వరునకు మప్పి, తన వేషాలన్నీ ఆయన చేత వేయించి, తన అభిరుచులన్నీ ఆయనకూ అంటించి– దేవుని భోగాన్ని తన మోక్షంగా దర్శించి, తన మోక్షమే దేవునకు ఒక భోగంగా ప్రదర్శించి– దక్షవాటిని మోక్షభోగనివాసంగా భావన చేశాడు. పైగా ఇది శ్రీనాథుని స్వతంత్ర రచన’ అంటారు. శ్రీనాథుని అంతరంగాన్ని యింతగా ఆవిష్కరించిన రచన మరొకటి లేదంటారు. కవిసార్వభౌముని సీసపద్యాన్ని గుర్తు చేస్తారు.
సప్తగోదావరి జలము తేనె
బ్రహ్మసంవేద్యాది బహుతీర్థములు రేకు
లకరులు చారు దివ్యస్థలములు
నాళంబు లవణాబ్దివేలా విభాగంబు
కల్యాణ భోగమోక్షములు తావి
దక్షవాటీ మహాస్థానంబు కర్ణిక
హంసంబు భీమనాయకుడు శివుడు
తుల్యభాగయు నేలేరు తుమ్మికొనలు
భువిని సంభావ్యమైన యీ పుణ్యభూమి
అనఘ, సంసారతాప శాంత్యౌషధంబు!
తెలుగు దేశపు నడిబొడ్డు గోదావరీ మండలం. అది తెల్ల తామర. గోదావరీజలం తేనె. తీర్థాలు రేకులు. కల్యాణ భోగమోక్షాలు పరిమళం. దక్షవాటిక కర్ణిక. భీమేశ్వరుడు హంస. తక్కిన నదులు తుమ్మిపూలు. సంసారం వల్ల కలిగే తాపానికి యీ పుణ్యభూమి ఒక్కటే ఔషధం– ఇలా పద్యాన్ని విడమర్చి చెప్పి, శ్రీనాథుని తెలుగు మనసు రెక్కలు విప్పుకున్న కావ్యం భీమేశ్వర పురాణం అన్నారు. అంతేకాదు, శ్రీనాథుడు పచ్చి తెనుగుకవి, తెలుగు మీరిన కవి అంటూ ముగిస్తారు.
ఇక ‘తెలుగింటి సత్యభామ’ను పలకరిద్దాం. ‘తెలుగు సాహిత్యంలో సత్యభామను చదివి చదివీ, కూచిపూడివారి రంగవేదికపై సత్యభామను చూచి చూచీ, తెలుగువారి సృజనాభిరతిని, రసికాభిరుచినీ సత్యభామ యెంతగా కదిలించిందో తలచుకుని తలచుకుని పరవశించి పోయేవారిలో నేనొకణ్ణి.’– ఇలా ఆరంభించి పారిజాతాపహరణం ప్రహసనాన్ని నడిపించి, చివరకు ‘సత్యభామ ఉట్టి వెర్రిబాగుల్ది’ అని తేలుస్తారు. ‘పాపం, సత్యభామ! అంత ఉద్వేగమూ అంతటి అమాయకతా వున్న ఆడది తెలుగుపడుచు కాక మరెవరై వుంటారు చెప్పండి! ఆమె సత్రాజిత్తు కూతురనుకునేరు. అది పురాణ చాదస్తం. ఆమె అక్షరాలా నంది తిమ్మనగారింట పుట్టింది. నిజం!’ అంటూ ముగిస్తారు యస్వీ.
సత్యభామ పాత్ర మీద, భామ నడత మీద, నడక మీద భుజంగరాయశర్మకు గట్టి పట్టుంది. ఎందుకంటే ఆయన కృష్ణాతీరం వారు. ఇద్దరి ఈయనైతే అద్దరి కూచిపూడి అగ్రహారం.
యస్వీ భుజంగరాయ శర్మ 15 డిసెంబరు 1925న తెనాలి తాలూకా కొల్లూరులో జన్మించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బి. ఏ. ఆనర్స్ చేశారు. కొద్దికాలం మద్రాసు పచ్చయప్ప కళాశాలలో పని చేశారు. తర్వాత జవహర్ భారతి వ్యవస్థాపకులు డి. ఆర్. పిలుపు మేరకు కావలి వచ్చారు. జవహర్ భారతి కళాశాలలో తెలుగు ఉపన్యాసకులుగా చేరి, ప్రిన్సిపాల్‌గా పదవీ విరమణ చేశారు. చిన్నతనంలో తండ్రి వొడిలో కూర్చుని కూచిపూడి భాగవతుల యక్షగానాలు చూశారు. భామాకలాపం, గొల్లకలాపం, దాదినమ్మ పాన్పు, వారి ప్రసిద్ధ రచనలు. కొల్లూరు ఇద్దరి లంక చక్కరకేళీల మధురిమలు, అద్దరి శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు ఆశీస్సులు పుష్కలంగా యస్వీకి లభించాయి.
ధారా రామనాధ శాస్త్రి (1932-2016)
ఆకాశవాణి రావినీడలో మరో విలక్షణ సృజనశీలిని మీకు పరిచయం చెయ్యలేదు. ఆయన నాట్యావధాని ధారా రామనాధ శాస్త్రి. నాట్యావధాన ప్రక్రియకు ఆయనే రూపకర్త. ఒంగోలు నుంచి ఢిల్లీ దాకా ఎక్కడ తెలుగువారుంటే అక్కడ నాట్యావధానాలు చేసి మెప్పించారు. ఇది తెలుగు సాహిత్యతెరపై వినూత్న ప్రక్రియ. రామనాధ శాస్త్రి, వారి సోదరులు రాధాకృష్ణమూర్తి, యీ అవధానం చేసేవారు. పృచ్ఛక ప్రేక్షకులు అప్పటికప్పుడు ఒక సమస్య యిస్తారు. వివిధ కాలాల్లోని రెండు ప్రసిద్ధ పాత్రలు కలిస్తే… అంటే పేరిగాడు, గిరీశం వేదిక మీద ఎదురు పడ్డారు. శకుని, శ్రీరాముడు తారస పడ్డారు. నక్షత్రకుడు తెనాలి రామలింగనికి దొరికాడు. ఇలాంటి సందర్భాల్ని అప్పటికప్పుడు వారి గుణగణాలను దృష్టిలో పెట్టుకుని, సంభాషణలు మనసులో అల్లుకోవాలి. కొద్దిపాటి మేకప్ సూచన ప్రాయంగా చేసుకుంటారు. ఆ వ్యవధి లోనే మాటలు, మాట మీద మాటలు అల్లుకుంటారు. తక్షణం రంగం మీదికి వచ్చి రసభరితంగా రక్తి కట్టిస్తారు. ఈ గొప్ప కళ ధారావారితో వచ్చి ధారావారితోనే అంతరించింది. ఎన్నో కళలుంటే తప్ప యీ నాట్యావధానాన్ని పండించలేరు.
ఈ ప్రక్రియ ప్రేరణలో నాడు ఉషశ్రీ కోరగా భుజంగరాయ శర్మ ‘యెంకితో మధురవాణి’ ఊహాత్మక సంభాషణల్ని సిద్ధం చేశారు. వారిద్దర్నీ తీసికెళ్ళి సింహాచలం కొండ మీద కలిపారు. ఒకవైపు యెంకి పాటల మాటలు, మరోవైపు గురజాడ పలుకులు– నిజంగా కత్తి మీద సాము. ఆ కొండ, కోవెల వాతావరణంలో రెండు ప్రసిద్ధమైన తెలుగు పాత్రలు కలిసి మాట్లాడుకోవడం ఎంత బాగుంటుందో! చిన్నప్పుడెప్పుడో తెలుగు వాచకంలో చదువుకున్న ‘కలవారి కోడలూ కలికి కామాక్షి’ జానపద గేయాన్ని తీసుకుని ఒకనాటి సామాజిక కౌటుంబిక వ్యవస్థను కళ్ళకు కట్టించారు. అసలీ ఆలోచనే గొప్పది. చివరికి, ‘రచ్చలో చలిగేటి రాజేంద్రభోగి, మా అన్నలొచ్చారు మమ్మంపుతారా’ అని గోముగా కామాక్షి కోరితే అనుమతి లభిస్తుంది. చిరకాలంగా తెలుగువారు తమ సంతోషాలు, కష్టాలు, ఆనందాలు, కన్నీళ్ళు ద్విపదలోనే చెప్పుకున్నారు. ఈ కథ కూడా ద్విపదలోనే నడుస్తుంది. ద్విపద తెలుగువారి చిరంతనమైన ఆస్తి. మరో జానపదం ‘కోడల కోడల కొడుకు పెళ్ళామా’ దంపుళ్ళ పాట. సాహిత్యశిల్పాన్ని గురించి ఆకాశవాణిలో ప్రసంగిస్తూ, యీ అత్తాకోడళ్ళ సంవాదపాటను తీసుకుని విశ్లేషించారు శర్మ. అంతా చెప్పి, సాహిత్యంలో శిల్పం పచ్చిపాల మీది మీగడ లాంటిది, వేడిపాల మీది వెన్న లాంటిది, అని ముగిస్తారు. అందుకే యస్వీ వాక్చిత్రాలలో నాటకీయత వుంటుంది. బొమ్మలూ కనిపిస్తాయి.
అనంతామాత్యుడు భోజరాజీయంలో ఓ స్త్రీ పూలు కోయటాన్ని భావించిన తీరు చెప్తారు.
తరుణీరత్నము పువ్వుతీగ నొక చేతన్ వంచి పాదాగ్రముల్
ధరణిన్ మోపి యొకింత నిక్కి తనుమధ్యంబొప్ప కక్షద్వయ
స్ఫురణంబార కుచంబులుబ్బ నయనంబుల్ విచ్చి లీలన్ ముఖాం
బురుహంబెత్తి యొకర్తు కోసె నెలమిం బుష్పంబు లత్తోటలన్
కిందికొమ్మని ఒక చేత్తో వంచింది. పైకొమ్మ వంగినా అందలేదు. మునివేళ్ళమీద నిలబడి శరీరాన్ని పైకి సాచింది. సన్నని నడుం బయటపడింది. బాహుమూలాలు కనపడుతున్నాయి. వక్షస్థలపు పొంగు తెలుస్తోంది. కళ్ళు విప్పార్చింది. ఎంతో విలాసంగా ముఖం యెత్తి పట్టి అందిన పూలన్నీ కోసుకుంది. బొమ్మ కట్టడం అంటే ఇదే!
యస్వీ కవి, రచయిత, వక్త, నాటకకర్త, చిత్రకారుడు, అన్నింటినీ మించి సహృదయుడు, సౌజన్యమూర్తి. శిష్యవాత్సల్యం కలిగిన ఆదర్శ ఉపాధ్యాయుడు. ఆయన ఆంధ్రా యూనివర్సిటీలో చదివే రోజుల్లో కె. గోపాలస్వామికి ప్రియశిష్యుడు. ఎన్.టీ.ఆర్ బాగా పేరుప్రఖ్యాతులార్జించాక, ఒకసారి కావలి జవహర్ భారతిలో వారికి సన్మానం జరిగింది. ఆ సభలో ఆయన మాట్లాడుతూ– తనకు పౌరాణిక పాత్రలంటే యిష్టమని, రావణపాత్రంటే మరీ యిష్టమని చెబుతూ దానికి స్ఫూర్తి ఏమిటో చెప్పారు. ఆయన గుంటూరులో చదివే రోజుల్లో నాటక పోటీల నిమిత్తం విశాఖ ఆంధ్రా యూనివర్సిటీకి వెళ్ళారు. ఆ సందర్భంగా అక్కడాయన ఒక విద్యార్థి రావణ ఏకపాత్రాభినయం చేయగా చూశారు. అభినయం, ఆంగికం, వాచకం ఎన్టీఆర్‌ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఎప్పటికైనా ఈ వేషం ధరించి ఇంత బాగా ప్రదర్శించాలనుకున్నారు. ఆనాటి రావణపాత్ర నన్ను ముగ్ధుణ్ణి చేసింది. నాలో స్ఫూర్తి నింపింది– అంటూ విద్యార్థుల కరతాళాల మధ్య చెప్పారు. ఆనాటి రావణపాత్రధారి అక్కడే ఆ సభలోనే వున్నారు. ఆయనే యస్వీ భుజంగరాయ శర్మ. కానీ, ‘నేనేనండీ’ అని ప్రకటించుకోలేదు. ఋషిలాంటి మనిషి భుజంగరాయ శర్మ.
యస్వీ విశ్వరూపం ఆయన రచించిన యక్షగానాల్లో చూస్తాం. దక్షిణదేశంలో వున్న మేలట్టూరు వెంకట్రామ శాస్త్రి, చెయ్యూరు చెంగల్వరాయ శాస్త్రి, త్యాగరాజస్వామి, పరమప్రీతితో తెలుగు యక్షగానాలు కూర్చారు. తంజావూరు రాజుల కాలంలో తెలుగు యక్షగానాలు వెల్లువెత్తాయి. అయినా కాని అవి కూచిపూడి నాట్యరీతికి దీటు కావని పూర్వీకులు చెబుతారు. కూచిపూడి అగ్రహారంలో ఈ నృత్యరీతిని ఒక మహాతపస్సుగా సాధించారు. సిద్ధేంద్రయోగి అనుగ్రహించిన భిక్ష. కూచిపూడి నృత్యాన్ని కాలోచితంగా ప్రజాభిరుచిని గమనిస్తూ సంప్రదాయాన్ని పాటిస్తూ తళుకులద్దుతూ వస్తున్నారు. కూచిపూడిని నవీకరించడంలో ముగ్గురు మహనీయుల కృషి వుంది. పాతకాలం నాటి కొయ్య భుజకీర్తులు కిరీటాలు తదితర ఆభరణాలు మార్పించి చూడ సొంపులు తెచ్చినవారు బందా కనకలింగేశ్వర రావు. రగడలు, జతులు, గతులు ఆధునిక శైలిలో, నవ్యంగా సవ్యంగా సమకూర్చిన మహనీయుడు వోలేటి వెంకటేశ్వర్లు. భరతనాట్యానికి సాటిగా కూచిపూడి నాట్యరీతికి జాతీయహోదా తెప్పించడానికి కృషి చేసినవారు బాలాంత్రపు రజనీకాంతరావు. కేవలం ఒక చిన్న అగ్రహారపు నృత్యరీతి కాదని విశ్వపటంలో కూచిపూడి రీతి స్థానం సంపాదించుకుంది.
వెంపటి చినసత్యం (1929-2012)
ఈ మెరుగులన్నీ అందిపుచ్చుకుని రంగంపై కూచిపూడి భామను నిలబెట్టిన వారు వెంపటి చినసత్యం మేష్టారు. ఇంటా బయటా అనేక విమర్శలకు ఓర్చి, ఎప్పటికప్పుడు సరికొత్త ప్రయోగాలు చేస్తూ కూచిపూడి ప్రాభవాన్ని పెంచారు. మొదట ఒకట్రెండు నృత్యనాటికలు దేవులపల్లి కృష్ణశాస్త్రి రచించారు. ఆ తరువాత చాలా వరకూ భుజంగరాయ శర్మే సమకూర్చారు. శ్రీకృష్ణపారిజాతం వారి తొలి నృత్యనాటిక. 1958 ప్రాంతంలో రచించారు. ఇక తర్వాత వెంపటి చినసత్యం కోసం రచించినవే అన్నీ. అభిజ్ఞాన శాకుంతలమ్, హరవిలాసం, చండాలిక, కల్యాణ రుక్మిణి, పద్మావతీ శ్రీనివాసమ్, శివ ధనుర్భంగం, అర్ధనారీశ్వరం మొదలైనవి. శివ ధనుర్భంగం రచించేటప్పుడు రామాయణాన్ని ధనుర్భంగం, వనవాసం, పట్టాభిషేకం అనే మూడు భాగాలుగా సమగ్రం చేయాలనుకున్నారు. కాని, మిగిలిన రెండూ వచ్చినట్టు లేదు. వీరి యక్షగానాల్లో వాచవిగానైనా అందాలు పరామర్శించడం తలకు మించిన భారం అవుతుంది. కల్యాణ రుక్మిణిలో రుక్మిణి నాట్యగీతి ఉదహరిస్తాను:
అగరుధూపలతిక వోలె
అవశమయేనే మనసు!
ఎగిసిపోయెనే మనసు!
ఎంత వెర్రిదే మనసు!
కలలో నీలిమ కని
నీలిమలో కమలపత్ర చారిమ కని
కమలపత్ర చారిమలో సౌహృద మృదు రక్తిమ కని
కలలో మువ్వలు విని
మువ్వలలో సిరిసిరి చిరునవ్వులు విని
సిరిసిరి నవ్వులలో మూగవలపు సవ్వడి విని
కలలో వేణువు విని
వేణువులో విరహ మధుర వేదన విని
విరహ మధుర వేదనలో ప్రణయ తత్త్వ వేదము విని ।అగరు।
దీన్ని నట్టువాంగంలో పూర్ణచంద్రిక రాగంలో వింటాం. మాన్య సంగీతరావు వెంపటి చినసత్యానికి నిలయ విద్వాంసులు. అప్పట్లో యీ గీతాన్ని వోలేటి వెంకటేశ్వర్లు తనదైన బాణీలో కూర్చి, విజయవాడ రేడియో ద్వారా సంగీతపాఠం చెప్పారు. అందుకే ఇది బాగా జ్ఞాపకం.
మరో గొప్ప సృజన ‘చండాలిక’. రవీంద్రుని కరుణోహాడోలిక. దీనజన చరిత్ర చిత్ర తూలిక ఈ చండాలిక. ఈ నృత్యనాటికను విశ్లేషిస్తూ ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి అన్న మాటలివి: “కూచిపూడివారు వైదిక సంప్రదాయ బద్ధులైన విప్రులు. అస్పృశ్యతను అంతలో విదళించగలిగిన వారు కారు. కాని చిత్రమేమిటంటే చినసత్యంగారు ఈ ఛాందసాన్ని విదళించి తక్కిన కూచిపూడి వారెవ్వరూ చేపట్టని యీ సంస్కరణ నాటకాన్ని చేపట్టి జేగీయమానంగా ప్రదర్శించారు.”
మద్రాసులో 1986 జనవరిలో భుజంగరాయ శర్మ షష్టిపూర్తి ఉత్సవం వెంపటి చినసత్యంగారి ఆధ్వర్యంలో జరిగింది. రాణి సీతై హాల్లో వేడుకగా మహోత్సవంగా జరిగింది. నేనప్పటికే మద్రాసుకు పాతకాపునయ్యాను. సత్యం మేష్టారు, రమణయ్య రాజా, ఇంకా కొందరు పెద్దలు, ప్రముఖులు సన్నిహితులయ్యారు. అసలు నేను ఉండేదే బాపు రమణల నీడలో. ఆ వుత్సవంలో పాల్గొనే మహద్భాగ్యం కలిగింది. యస్వీ రచించిన నృత్యనాటికల్లోంచి ఒక్కో రసవద్ఘట్టాన్ని తీసుకుని ప్రదర్శించారు. ఇప్పటికీ ఆ దృశ్యమాలిక నా కళ్ళల్లో వుంది. ఆ సంగీత సాహిత్యాలు చెవుల రింగుమంటూ వుంటాయి. ఆ సందర్భంగా శర్మ నృత్యనాటికల్ని సత్యం మేష్టారు ఒక సంపుటిగా తీసుకొచ్చారు. కూచిపూడికి శర్మ పదమైతే, వెంపటివారు పాదమై దివ్యపథాన నడిపించారు.
రవీంద్రుణ్ణి అభిమానించారు. అరవిందుణ్ణి ప్రేమించారు. వాల్మీకిని, కాళిదాసుని శిరసున ధరించారు. తిక్కన, శ్రీనాథులను కాచి వడపోశారు. ప్రబంధ సాహిత్యాల పరిమళాన్ని మనసుకు పట్టించుకున్నారు. వెంపర్లాట లేని ఋషిత్వాన్ని సాధించారు. జీవితాన్ని, ప్రతిభని నిష్కామంగా కూచిపూడి నృత్యరంగానికి అంకితం చేశారు. యస్వీ ఏ ప్రక్రియను చేపట్టినా అది బంగారమై ప్రకాశించింది. భుజంగరాయ శర్మ వచనం విలక్షణమైనది. మూడు పదాలు చాలు–కచ్చితంగా పోల్చుకోవచ్చు! సంగీత నృత్య రూపకాలలో ఆయన చూపిన ప్రతిభ అనన్యసామాన్యమైంది. ఆ ‘చారిమ’ ప్రపంచమంతా వ్యాపించింది. సంప్రదాయ సాహిత్యాన్ని పుక్కిలి పట్టారు. ఆధునిక అభ్యుదయ సాహిత్యాల్ని మనసా వాచా ప్రేమించారు. కృష్ణశాస్త్రిని, శ్రీశ్రీని చెరొక కంట్లో ధరించారు. విశ్వనాధను మనసున భరించారు.
అవే అక్షరాలు, అవే మాటలు. కాని వాక్యమెందుకు అంత బాగుంటుంది? అని అడిగితే తల వంచుకుని మౌనం వహించడం యస్వీ నైజం. అవే మెంతులు, అవే జీలకర్ర… ఓ తల్లి చేత్తో వేస్తే రుచులు పండుతాయి. ఇంకో తల్లి వేస్తే మెంతులు మెంతులే!
నేను 1967 నించి యస్వీ భుజంగరాయ శర్మ సృష్టించిన రంగులరాట్నం దిగలేదు. ఆ మహనీయుడు 1997లో కన్ను మూశారు. అప్పుడూ, ఇంతేరా ఈ జీవితం పాటను తలుచుకున్నాను. కడమకు అన్ని కథలూ కంచికి చేరాల్సిందే కదా! ఇంకా ఎన్నో సంగతులు నేను ప్రస్తావించలేదని తెలుసు. విషయసూచికలివ్వగలం గాని సమగ్రత అసాధ్యం.
నా చిన్ననాటి జ్ఞాపకం. శ్రీకాళహస్తిలో స్త్రీలు కొందరు గుడిముందు కూచుని దిక్కులు చూస్తూ కబుర్లాడుకుంటూ మధ్య మధ్య పూల బేరాలు చూసుకుంటూనే పూలదండలు అల్లడం చూసేవాణ్ణి. కాలి బొటనవేలికి జమిలిగా మెత్తటి నూలుదారం పోసుకొని రెండోకొసని ఎడమచేత్తో పట్టుకునేవారు. కుడిచేతి చూపుడువేలితో అద్ది తీసిన తుమ్మిపూరెక్కల్ని వడివడిగా దారప్పోగుల మధ్య పొదిగేవారు. కాసేపటికి సన్నటి తుమ్మిపూలచెండు తయారయ్యేది. ఒక తంత్రీవాద్యాన్ని పలికిస్తున్నట్టనిపించేది. పుష్పలావికల అద్భుతమైన హస్తకళానైపుణ్యం అబ్బురపరిచేది. ఘుమఘుమలాడే తెల్లని గుండ్రని పూలచెండును చేతిలోకి తీసుకున్నాక అలాగే దోసిలిలో వుంచుకోవాలనిపిస్తుంది. ఆ పూలచెండు శిల్పం గొప్పది. యస్వీని చదివాక తుమ్మిపూలచెండు మాత్రమే నాకు గుర్తొస్తుంది. యస్వీ తెలుగువారి పుణ్యఫలం.