వెణ్బా (ధవళగీతి)

పరిచయము

సంస్కృత ఛందస్సులో గురులఘువుల పాత్ర ముఖ్యమైనది. ప్రాకృత ఛందస్సులో మాత్రా గణములకు పెద్ద పీట. కన్నడ తెలుగు దేశి ఛందస్సు అంశ (బ్రహ్మ, విష్ణు, రుద్ర) గణములపై లేక ఉప (సూర్య, ఇంద్ర, చంద్ర) గణములపై ఆధారపడి ఉంటుంది. తమిళ ఛందస్సులో ‘అశై’ లేక స్వరము పునాది ఱాయి. ఈ అశై రెండు విధములు – నేర్ (గో) లేక నిరై (ధన). నేరశై లేక గోస్వరము (- చిహ్నము) రెండు, అవి గురువు (U), లఘువు (I). నిరైయశై లేక ధనస్వరము (= చిహ్నము) కూడ రెండు విధములు. అవి లగము (IU), లలము (II). ఈ స్వరములను పదేపదే చేర్చడమువల్ల మనకు ‘శీర్’ లేక గణము లభిస్తుంది. అవి రెండు, మూడు, నాలుగు స్వరముల గణములుగా ఉంటాయి. రెండు స్వరములు (అశైగళ్) ఉండే గణములో గురు లఘువుల సంఖ్య స్వరముల సంఖ్య కన్న ఎక్కువగా ఉండవచ్చును. రెండు స్వరముల గణములను మా, విళం గణములనియు, మూడు స్వరముల గణములను కాయ్, కని గణములనియు, నాలుగు స్వరముల గణములను పూ, నిళల్ గనములనియు పిలుస్తారు. మనకు పరిచితములైన గురు లఘువుల చిహ్నములతో ఈ గణముల వివరములను ఇంతకు ముందు వ్రాసిన ఒక వ్యాసములో వివరించియున్నాను. తమిళ భాషలో వెణ్బా ఛందస్సులో కావ్యములే వ్రాయబడ్డాయి! ఈ వ్యాసపు ముఖ్యోద్దేశము తమిళములో సుప్రసిద్ధమైన వెణ్బా ఛందస్సును ఉదాహరణములతో తెలుగులో పరిచయము చేయడమే.

వెణ్బా (ధవళగీతి)

తమిళములో పా అంటే పాట అని చెప్పవచ్చును. ప్రాచీన తమిళ ఛందస్సులో ప్రసిద్ధికెక్కిన ‘పా’ ఛందస్సులు – వెణ్బా, ఆశిరియప్పా, కలిప్పా, వాంజిప్పా, మరుట్పా.ఈ వ్యాసములో వెణ్బాగుఱించి మాత్రమే చర్చిస్తాను. వెణ్ అనగా తెలుపు అని, పా అనగా పాట అని అర్థము, కాబట్టి వెణ్బాను ధవళగీతి అని పిలువవచ్చును.

1. గణములు: వెణ్బాలో మా, విళం, కాయ్ – శీరులను లేక గణములను మాత్రమే ఉపయోగిస్తారు. అవి –

  1. మా శీరులు –
    తేమా ( – – ) 2 UU, UI
    పుళిమా (= – ) 4 IIU, III, (IUU, IUI)
  2. విళం శీరులు –
    కూవిళం ( – =) 2 UII, UIU
    కరువిళం ( = =) 4 IIII, IIIU, (IUIU, IUII)
  3. కాయ్ శీరులు –
    తేమాంగాయ్ ( – – – ) 2 UUU, UUI
    పుళిమాంగాయ్ ( = – – ) 4 IIUU, IIUI, (IUUU, IUUI)
    కూవిళంగాయ్ ( – = – ) 4 UIIU, UIUU, UIII, UIUI
    కరువిళంగాయ్ ( = = – ) 8 IIIIU, IIIUU, IIIII, IIIUI,(IUIIU, IUIUU, IUIII, IUIUI)

ఈ 30 గణములలో కుండలీకరణములలో చూపినవి ఎదురు నడక గల 10 గణములు. ఎదురునడకకు ఎక్కువగా అలవాటుపడని తెలుగువారి చెవులకు ఇవి అంతగా నప్పకపోవచ్చును. తమిళములో సామాన్యమైన ఉ-కారముతోబాటు స్వల్పోచ్చరణ కాలముతో ఉ-కారము కూడ ఉంటుంది (ఉదా. ఉలగు లోని గు-కారము). ఇట్టి ఉకారమును ప్రత్యేకముగా తీసికొనరు. ఇవి పదము చివర వస్తుంది. నేరశైతో వస్తే దానిని నేర్బు (-+) అనియు, నిరైయశైతో వస్తే దానిని నిరైప్పు (=+) అని అంటారు. వెణ్బాలో ఇది పాదాంతములో రావచ్చును. అప్పుడు ఇది ఒక లఘువుగా పరిగణింపబడదు. ఈ + గుర్తు ఈ అసంపూర్ణతను తెలుపుతుంది.

2. గణబంధనము లేక గణసంధి: తమిళ ఛందస్సులో మిగిలిన భాషలలోవలె గణములను మనకు ఇష్టము వచ్చినట్లు వాడుటకు వీలుకాదు. ఎప్పుడో ఒకప్పుడు తప్ప సామాన్యముగా పదములు గణములకు తగినట్లు ఉండాలి. ఒక పదము మఱొక గణములో ప్రవేశించరాదు. అది ఆ గణమునకే పరిమితమై ఉండాలి. అనగా పాదాంతములో విరామము ఉంటుంది. ఒక గణము తఱువాత వచ్చే గణము ముందు వచ్చిన గణము ఏ విధముగా అంతమవుతుందో అనే విషయముపైన ఆధారపడి ఉంటుంది. దీనిని “తళై” అంటారు. తెలుగులో ఈ పదమును గణబంధనములేక గణ సంధి అని చెప్పవచ్చును. ఈ నియమములు పాదములోని గణములకు మాత్రమే కాదు, పాదాంతములో ఉండే గణములకు కూడ (తఱువాతి పాదపు మొదటి గణముతో) వర్తిస్తుంది. వెణ్బాలో ఆ గణ బంధన నియమములు క్రింది విధముగా ఉంటుంది.

(1) రెండు స్వరగణములకు తఱువాత వచ్చే గణముల ప్రారంభ స్వరముల అమరికలు ఈ విధముగా ఉంటుంది. ఈ చిహ్నము ( I ) రెండు గణముల మధ్య సంధిని లేక బంధనమును (bond) చూపిస్తుంది.

– – | = ; = – | = ; – = | – ; = = | –

దీనిని ఇయర్శీర్ వెణ్దలై అంటారు.

(2) మూడు స్వరములు ఉండే గణములకు తఱువాత వచ్చే గణముల ప్రారంభ స్వరముల అమరికలు ఈ విధముగా ఉంటుంది.

– – – | – ; = – – | – ; – = – | – ; = = – | –

దీనిని వెణ్శీర్ వెణ్దలై అంటారు.

గురు లఘువుల భాషలో ఈ నియమములను ఈ విధముగా అనువాదము చేయ వీలగును – ఆఱు మా-గణముల (UU, UI, IIU, III, IUU, IUI) తఱువాత ఎల్లప్పుడు లఘువుతో ప్రారంభమయ్యే గణములను వాడవలెను; మిగిలిన 24 గణముల తఱువాత వచ్చే గణములు ఎప్పుడు గురువుతో ప్రారంభమవుతాయి.

3. ప్రాస: వెణ్బాకు 2 నుండి 12 పాదములు ఉంటాయి. రెండు పాదముల వెణ్బాను, కుఱళ్ వెణ్బా అంటారు. ఇది తిరువళ్ళువర్ వ్రాసిన తిరుక్కుఱళ్ గ్రంథములో వాడబడినది కావున దీనికి ఈ పేరు వచ్చినది. మూడు పాదముల వెణ్బాను, చిందియల్ వెణ్బా అనియు, నాలుగు పాదముల వెణ్బాను, అళవియల్ వెణ్బా అనియు, 5 – 12 పాదములు ఉండే వెణ్బాను, పక్రోడై వెణ్బా అనియు పిలుస్తారు. అన్ని రకముల వెణ్బాలకు చివరి పాదము తప్ప మిగిలిన పాదములలో నాలుగు గణములు ఉంటాయి. చివరి పాదములో మాత్రము రెండు గణములు, దానితో ఒక నేరశై (గోస్వరము) లేక నిరైయశై (ధనస్వరము) ఉంటాయి. రెంటిలో ఏ స్వరము ఉంటుందో అన్నది ముందు గణము ఏగణమో అనేదానిపైన ఆధారపడి ఉంటుంది. ఈ స్వరమునకు ఉ-కారాంత హల్లును చేర్చవచ్చును (నేర్బు లేక నిరైప్పు). కొందఱు ఇ-కారాంత పదములను కూడ చేరుస్తారు. వెణ్బాలలో అన్ని పాదములకు ద్వితీయాక్షర ప్రాస ఒకే విధముగా నుండ నవసరము లేదు. రెండు రెండు పాదములకు (ద్విపదవలె) ప్రాసను చెల్లించ వచ్చును. అన్ని పాదములకు ఒకే ప్రాసాక్షరమయితే ఆ వెణ్బాను, ఒరువికర్పా అంటారు, రెండు విధములైన ప్రాసలు ఉంటే అది, ఇరువికర్పా వెణ్బా. రెండుకన్న ఎక్కువ ప్రాసలు (పక్రోడై వెణ్బాలో) ఉంటే అది, పలవికర్పా వెణ్బా అవుతుంది.

4. తనిచ్చొల్ లేక ప్రత్యేక పదము: మూడు లేక నాలుగు పాదములు ఉండే వెణ్బాలలో రెండవ పాదములో నాలుగవ గణమునకు అదనముగా ప్రాసయతి ఉంటే అట్టి వెణ్బాలను, నేరిశై వెణ్బా అని పిలుస్తారు, అలా లేకపోతే అది, ఇన్నిశై వెణ్బా అవుతుంది. ఈ అదనపు ప్రాసాక్షర పదమును, తనిచ్చొల్ లేక ‘ప్రత్యేక పదము’ అని అంటారు.

వెణ్బా ఉదాహరణములు

ఇప్పుడు కొన్ని ఉదాహరణములను పరిశీలిద్దాము.

  1. கற்க கசடறக் கற்பவை கற்றபின்– – | = = | – = | – =
    நிற்க அதற்குத் தக – – | =- | =
    (குறள் 391 – கல்வி அதிகாரம்)

    కఱ్క కశడఱ క్కఱ్పవై కట్రపిన్ UI IIII UIU UIU
    నిఱ్క అదఱ్కు త్తగ UI IUU II
    తిరుక్కురళ్ – 391 (కల్వి అదికారం)
    UI తేమా, IIII కరువిళం, UIU కూవిళం, IUU పుళిమా

    ఇందులోని రెండు పాదములలో UI, IUU తఱువాత లఘువు, మిగిలిన గణములకు పిదప గురువు ఉన్నది. గణబంధనము లేక గణసంధి నియమములు పాటించబడినవి.
    (కఱ్క కశడఱ క్కఱ్పవై అను పదములు మదురై కామరాజ్ విశ్వవిద్యాలయపు ఆదర్శవాక్యము)

    పై కుఱళ్ కు నా అనువాదము –

    నేర్వం దగినవి – నేర్చుకొమ్ము తర్వాత – – | == | -=- | – – – | UU IIII – UIUI UUI
    యుర్విన్ దగురీతి నుండు – – | = – – | -+ UU IIUI U+
    UU తేమా, IIII కరువిళం, UIUI కూవిళంగాయ్, UUI తేమాంగాయ్, IIUI పుళిమాంగాయ్
    ఇందులోని రెండు పాదములలో UU తఱువాత లఘువు, మిగిలిన గణములకు పిదప గురువు ఉన్నది. గణబంధనము లేక గణసంధి నియమములు పాటించబడినవి.

  2. கூற்றமோ கண்ணோ பிணையோ மடவரல் -= | – – | -= | ==
    நோக்கமிம் மூன்றும் உடைத்து -= | – – | =+
    (அதிகாரம்:தகை அணங்கு உறுத்தல் குறள் எண்:1085)

    కూట్రమో కణ్ణో పిణైయో మడవరల్ UIU UU IIU IIIU
    నోక్కమిం మూన్ఱుం ఉడైత్తు UIU UU IU+
    తిరుక్కుఱళ్ కామత్తుప్పాల్- 1085
    UIU కూవిళం, UU తేమా, IIU పుళిమా, IIIU కరువిళం
    ఇందులోని రెండు పాదములలో UU, IIU తఱువాత లఘువు, మిగిలిన గణములకు పిదప గురువు ఉన్నది. గణబంధనము లేక గణసంధి నియమములు పాటించబడినవి.

    పై కుఱళ్‌కు నా అనువాదము –

    ఇది చావో కన్నులో – యిఱ్ఱియో యేమో IIUU UIU – UIU UU
    ముదితకున్ జూపులన్ మూడు IIIU UIU U+
    IIUU పుళిమాంగాయ్, UIU కూవిళం, UU తేమా
    ఇందులోని రెండు పాదములలో UU తఱువాత లఘువు, మిగిలిన గణములకు పిదప గురువు ఉన్నది. గణబంధనము లేక గణసంధి నియమములు పాటించబడినవి.


నేరిశై వెణ్బా: క్రింద రెండు కుఱళ్ వెణ్బాలు:

(i) లలిత లలితమై – లాస్యమ్ము లాడి
నెలఁతా యిట రమ్ము నీవు
(ii) మనము నొసఁగెద – మైత్రితో నీకు
దినము రజనియున్ నేను

ఇప్పుడు ఈ రెంటిని కలిపి నాలుగు పాదముల వెణ్బాగా వ్రాయవచ్చును. ప్రాసయతితో ఒక ప్రత్యేక పదమును వాడి ఈ రెంటిని కలిపినాను. ఇప్పుడు మనకు నాలుగు అక్షరముల వెణ్బా లభించినది. ‘లలితో’ అనే ఈ ప్రత్యేక పదమునకు (తనిచ్చొల్) మొదటి పదమైన నెలఁతా అనే పదమునకు ప్రాస మైత్రి ఉన్నది. అంతే కాదు మొదటి రెండు పాదములకు తఱువాతి రెండు పాదములకు ప్రాసాక్షరములు వేఱు. కాబట్టి ఇది – ఇరువికర్పా నేరిశై వెణ్బా.

లలిత లలితమై – లాస్యమ్ము లాడి
నెలఁతా యిట రమ్ము – నీవు – లలితో
మనము నొసఁగెద – మైత్రితో నీకు
దినము రజనియున్ నేను

మఱి రెండు కుఱళ్ వెణ్బాలు:

(iii) మనసు కరుగదేల – మారాజ నీకు
వినతి నిడితి విను
(iv) కొనుమయ్య చిత్తమ్ము- కోర్కె యిదియే
వనజ నయనా హరీ

ఈ రెంటిని కలిపి వ్రాసినప్పుడు ప్రత్యేక పదము మాత్రమే కాక, చివరి పదమైన విను-కు ఇంకొక అక్షరమును జతచేస్తే తప్ప గణము సరిగా కుదరదు. విను అనే పదము వినుమా అయినది. ఇందులో అన్ని పాదములకు ప్రాసాక్షరము ఒక్కటే. రెండవ పాదములో మొదటి పదము వినతి-కి నాలుగవ గణపు పదమైన ప్రణతి-కి ప్రాస చెల్లుతుంది. కాబట్టి ఇది – ఒరువికర్పా నేరిశై వెణ్బా.

మనసు కరుగదేల – మారాజ నీకు
వినతి నిడితి – వినుమా – ప్రణతిఁ
గొనుమయ్య చిత్తమ్ము- కోర్కె యిదియే
వనజ నయనా హరీ

ఇన్నిశై వెణ్బా: ఇందులో రెండవ పాదములో ప్రత్యేక పదము (తనిచ్చొల్) ఉండదు. క్రింద ఇచ్చిన ఉదాహరణములో అంత్యప్రాస ఒక ప్రత్యేకమైన అలంకారము. దీనిని ‘ఇయైబు’ అంటారు. క్రింద ఒక ఉదాహరణము –

మానసము నందనము – మానసము సంద్రమ్ము
మానస మ్మంబరము – మానసము శృంగమ్ము
మానసము వన్నియలు – మానసము పుష్పమ్ము
మానస మ్మాలయము నీకు

మఱొక ఉదాహరణము –

ధవళగీతిఁ బాడనా – తాళము నో యువిదా
శ్రవణములన్ దేనెలా – చక్కఁగ నో నవలా
భువన మెల్ల నిండఁగా – పొంగెడు వార్నిధియై
కవనములన్ గట్టుచున్ నేను

చిందియల్ వెణ్బా: త్రిపది – మూడు పాదముల వెణ్బా, చిందియల్ వెణ్బా. క్రింద రెండు ఉదాహరణములు –

వనజమన మోము – వనజములు కళ్ళు
వనజములు కేలు – వనజములు కాళ్ళు
వనజమన దేహమ్ము నీకు

సౌందర్య సీమలోఁ – జందాల డోలలో
చెందొవ నేస్తి – చెలువంపు మాయలో
నుందమా యెప్డు చెలీ

కన్నడ ఛందస్సులో అతి ప్రాచీనమయిన ఛందస్సు త్రిపది. త్రిపదికి లక్షణములు – వి/వి – వి/వి // వి/బ్ర/వి/వి // వి/బ్ర/వి. మొదటి పాదములో ప్రాసయతి, అన్ని పాదములకు ప్రాస ఈ ఛందస్సు ప్రత్యేకత. పైన ఇవ్వబడిన రెండవ ఉదాహరణములో చివరి చెలీ పదమును చెలియరో అని మార్చినప్పుడు, అది కన్నడ త్రిపది అవుతుంది. ఇట్టి చిందియల్ వెణ్బా కన్నడ త్రిపది కల్పనకు కారణమేమో అనే ఊహ నాకు కలుగుతుంది.

పక్రోడై వెణ్బా: క్రింద ఎనిమిది పాదముల వెణ్బా. ఇందులో రెండు ప్రాసలు ఉన్నాయి. మొదటి నాలుగు పాదములకు ఒక ప్రాస, చివరి నాలుగు పాదములకు వేఱొక ప్రాస. రెండవ పాదములో నాలుగవ గణముతో ప్రాస కూడ ఉన్నది. కావున ఇది ఇరువికర్పా నేరిశై పక్రోడై వెణ్బా.

దేవీ ధవళాంగీ – దివ్యాంశా శారదా
కావన్ నను వాణీ – గానాబ్ధీ – భావదా
రావా రచయిత్రీ – ప్రాచీనా వాక్సుధా
నీవే రసనపై – నృత్యమాడు మమ్మా
వరదాయీ వాఙ్మయీ – బ్రహ్మమనోహారీ
స్వరదాయీ శాశ్వతా – సర్వదుఃఖహారీ
కరుణఁ జూపు కన్నులన్ – గైత లిచ్చు నారీ
శరణిఁకపై నీవెగాదా

లయ

పద్యపు లయను ఓశై అంటారు. వెణ్బా లయను చెప్పలోశై అంటారు. చెప్పల్ అనగా చెప్పుట. ఒక ప్రశ్నకు జవాబు ఇచ్చునట్లు ఒక వాక్య రూపములో వెణ్బా ఉండాలని భావన. ఇయర్శీర్ వెణ్దలై మాత్రమే పద్యమంతా ఉంటే దానిని తూంగిశై చెప్పల్ అంటారు; వెణ్శీర్ వెణ్దలై మాత్రమే పద్యమంతా ఉంటే దానిని ఏన్దిశై చెప్పల్ అంటారు. రెండు విధములైన గణబంధనములు (గణసంధులు) ఉంటే దానిని ఒళుగిశై చెప్పల్ అంటారు.

సంస్కృత దేశి ఛందస్సులతో పోలికలు

తమిళ ఛందస్సు మఱే భాష ఛందస్సుతో సంపర్కము లేక స్వతంత్రముగా పుట్టినది. అయితే వాటితో పూర్తిగా పోలికలు లేవని చెప్పలేము. వెణ్బాకు సంస్కృత దేశి ఛందస్సులతో ఉండే కొన్ని పోలికలను ఇక్కడ చెప్పదలచుకొన్నాను. ఇవి ప్రత్యేకతలు మాత్రమే. ఎల్ల వేళలలో వెణ్బాను ఇలా వ్రాయరు.

సంస్కృత ఛందస్సులోని కొన్ని వృత్తములతో వెణ్బా పోలికలు:

  1. సుగంధి వృత్తపు లయతో ధవళగీతి –

    మొదటి మూడు పాదములలో వెణ్బా అమరిక – UIUI UIUI – UIUI UIU
    చివరి పాదపు అమరిక – UIUI UIUI U
    UIUI కూవిళంగాయ్ , UIU కూవిళం

    ఆకసాన చంద్రబింబ – మందమైన రాత్రిలో
    నాకరమ్ము వీడకుండ – నాప్రియుండు తాకఁగా
    నాకమొండు నిల్చెఁగాదె – నాకుముందు రమ్యమై
    యేకమౌను చుక్కలొక్కటై

  1. వనమయూరపు లయతో ధవళగీతి –

    మొదటి మూడు పాదములలో వెణ్బా అమరిక – IIIII UIII – UIII UU
    చివరి పాదపు అమరిక – IIIII UIII U+
    IIIII కరువిళంగాయ్, UIII కూవిళంగాయ్, UU తేమా

    కల యొకటి నా నిదురఁ – గల్గినది యింపై
    లలితమగు భావముల – రాసమయె సొంపై
    కల చెదురఁ గన్నులయె – కడలివలె నాకున్
    లలితుఁ డొక నిర్ఘృణుఁడు నాకు

  2. మహేంద్రవజ్ర లయతో ధవళగీతి –

    మొదటి మూడు పాదములలో వెణ్బా అమరిక – IIUI UU – IIUI UU
    చివరి పాదపు అమరిక – IIUI UU IU
    IIUI పుళిమాంగాయ్, UU తేమా

    అమలేందు బింబ – మ్మగు నీదు మోమున్
    గమలాక్ష రేయిన్ – గలలోనఁ గంటిన్
    విమలాభ్ర మందున్ – బ్రియ వెల్గెఁ దారల్
    సుమమాల వేతున్ హరీ

  3. స్రగ్విణి లయతో ధవళగీతి –

    మొదటి మూడు పాదములలో వెణ్బా అమరిక – UIU UIU – UIU UIU
    చివరి పాదపు అమరిక – UIU UIU U+
    UIU కూవిళం

    ఎందుకో చెప్పవే – యిట్టు లీ వేగిర
    మ్మెందుకో చెప్పవే – యిట్టు లీ క్రోధన
    మ్మెందుకో చెప్పవే – హృన్మణీ వేగమే
    ముందురా నవ్వుచున్ నీవు

  4. తోటక వృత్తపు లయతో ధవళగీతి –

    మొదటి మూడు పాదములలో వెణ్బా అమరిక – IIU IIU – IIU IIU
    చివరి పాదపు అమరిక – IIU IIU IU
    IIU పుళిమా

    అమలా అతులా – అచలా వరదా
    కమలా దయితా – కవితా సరితా
    విమలా నిను నే – విరులన్ గొలుతున్
    నమన మ్మిదిగో హరీ

  5. ఉపేంద్రవజ్ర నడక కలిగిన కోల వృత్తపు లయతో ధవళగీతి –

    మొదటి మూడు పాదములలో వెణ్బా అమరిక – IUI IIU – IIUI UU
    చివరి పాదపు అమరిక – IUI IIU IU
    IUI, IIU పుళిమా, IIUI పుళిమాంగాయ్, UU తేమా

    మనమ్ముఁ గల నిన్ – మఱువంగ లేనే
    దినమ్ము దలతున్ – దియనైన వాంఛన్
    గనంగ నగునా – కమలాక్ష నిన్నున్
    వ్రణమ్ము హృదిలో నయెన్

  6. భుజంగప్రయాతపు లయతో ధవళగీతి –

    మొదటి మూడు పాదములు – IUU IUU – IUU IUU
    చివరి పాదము – IUU IUU IU
    IUU పుళిమా

    స్మరింతున్ సదా నిన్ – స్మరారీ మహేశా
    పురారీ దలంతున్ – ముదమ్మై గణేశా
    హరా రా యఘమ్ముల్ – హరించున్ గిరీశా
    ధరింతున్ విభూతిన్ శివా

  7. వసంతతిలక లయతో ధవళగీతి –

    మొదటి మూడు పాదములు – UUI UIII – UII UIUU
    చివరి పాదము- UUI UIII U
    UUI తేమాంగాయ్, UIII, UIUU కూవిళంగాయ్, UII కూవిళం

    ఆనంద మీభువన – మన్నియు నీవరమ్ముల్
    గానమ్ము పారు సుర – గంగగ సుస్వరమ్ముల్
    నీనవ్వు చిందులిడు – నిర్మల భాసనమ్ముల్
    నానాథ నన్ను గన రా

  8. తామరస (లలితపదా, కమలవిలాసినీ) వృత్తపు లయతో ధవళగీతి –

    మొదటి మూడు పాదములు – IIII UII – UII UU
    చివరి పాదము- IIII UII U+
    IIII కరువిళం, UII కూవిళం, UU తేమా

    తరళుని కన్నులు – తామర పూవుల్
    సరళము చూపులు – చక్కని దీవెల్
    హరుసపు నవ్వులు – హ్లాదపు గీతుల్
    వరదుని పల్కులు విందు

  9. సాక్షీ వృత్తపు లయతో ధవళగీతి –

    మొదటి మూడు పాదములు – IIU IIUI – UIU UU
    చివరి పాదము- IIU IIUI U+
    IIU పుళిమా, IIUI పుళిమాంగాయ్, UIU కూవిళం, UU తేమా

    కనఁగా నడిరేయి – కాన్కతో వచ్చెన్
    మనసా, మగరాజు – మల్లెలే యిచ్చెన్
    వినవే నను జూచి – ప్రేమతోఁ బల్కెన్
    తనువే పులకించె నాకు

  10. కుసుమవిచిత్రా వృత్తపు లయతో ధవళగీతి –

    మొదటి, మూడవ పాదములు IIII UU – IIII UU
    రెండవ పాదము – IIII UU – III IUU
    చివరి పాదము – IIII UU II
    IIII కరువిళం, UU తేమా, III, IUU పుళిమా

    మనసున నిన్నే – మఱిమఱి దల్తున్
    వనరుహ నేత్రా – పరమ పవిత్రా
    కనఁగను రావా – కరుణను దేవా
    తనువిట వేచెన్ గద

  11. సమయప్రహితా వృత్తపు లయతో ధవళగీతి –

    మొదటి మూడు పాదములు – IIU IIUI – UUI UU
    చివరి పాదము – IIU IIUI U+
    IIU పుళిమా, IIUI పుళిమాంగాయ్, UUI తేమాంగాయ్, UU తేమా

    వరుసన్ మదిలోన – భావమ్ము లెన్నో
    విరస మ్మయి కొన్ని – వేధించుచుండున్
    సరస మ్మయి కొన్ని – సంతోష మిచ్చున్
    మరణ మ్మిఁకనెప్డు – వచ్చు

  12. నాసాభరణ వృత్తపు లయతో ధవళగీతి –

    మొదటి మూడు పాదములు – UU IIUU – UIIU UIIU
    చివరి పాదము – UU IIUU U+
    UU తేమా, IIUU పుళిమాంగాయ్, UIIU కూవిళంగాయ్

    ఏమో బ్రదుకేమో – యెందులకో యీవిధమై
    పామో యది త్రాడో – పర్విడఁగాఁ గాటిడునో
    వేమో యది తీపో – విందిడునో మందగునో
    స్వామీ భ్రమలేనా చెప్పు

దేశి ఛందస్సులో వెణ్బాతో కొన్ని పోలికలు

  1. మదనోత్సవపు (6,6 – 6,5 మాత్రలు) లయతో ధవళగీతి –

    నాలుగు పాదముల అమరిక –
    UIIU UIUI – UIUI UIU
    UIIU UIUI – UIIU UIU
    UIIU UIIU – UIUI UIU
    UIIU UIUI U+
    UIIU, UIUI కూవిళంగాయ్, UIU కూవిళం

    కన్నులతోఁ బల్కరించి – కాల్చుచుండు కామినీ
    నిన్నె సదా తల్చుచుందు – నెచ్చెలి రా తిన్నఁగా
    వన్నెలతోఁ జిన్నెలతోఁ – బంచదార నవ్వుతో
    వెన్నెలయే జీవితమ్ము నాకు

  2. మిశ్రగతి (3,4 మాత్రలు) లయతో ధవళగీతి –

    మొదటి మూడు పాదములు – III IIU – III IIU
    నాలుగవ పాదము – III IIU IU
    III, IIU పుళిమా

    చెలియ కనవా – చెలిమి నియవా
    పిలుపుఁ గొనవా – వెలుఁగు నెలవా
    తలపు కడలిన్ – దనరు నలపై
    వలపు తరణిన్ జనన్

  3. మిశ్రగతి (4,5 మాత్రలు) లయతో ధవళగీతి –

    మొదటి మూడు పాదములు – UII UIU – UII UIU
    నాలుగవ పాదము – UII IIIU U
    UII, UIU కూవిళం, IIIU కరువిళం

    వానలు వచ్చునా – వాగుల నింపునా
    గానము మ్రోఁగునా – గంగగ పారునా
    తేనెల జల్లు లా – తెల్గుగ మారునా
    యీనవ ఋతువులోనన్

  4. ద్విపద (ఇం/ఇం – ఇం/సూ) లయతో ధవళగీతి –

    పాదముల అమరిక –
    IIIU UUI – UIU UI
    IIIU UIU – UII UI
    IIIU UIU – UIU UI
    IIIU UUI U
    IIIU కరువిళం, UIU, UII కూవిళం, UUI తేమాంగాయ్, UI తేమా

    రజనిలోఁ జంద్రుండు – రమ్యమై వెల్గె
    కుజనుఁడా చూపవే – కూర్మిని నాకు
    విజనమౌ కానలోఁ – బ్రేమ లేదయ్యె
    నిజముగా నీమన్కిలో

  5. (గణబంధన నియమములవలన పాదములు ఎప్పుడు లఘువుతో ఆరంభమవుతాయి, సూర్య గణము ఎప్పుడు గలమే)

  6. సీసపు లయతో ధవళగీతి –

    పాదముల అమరిక – మొదటిరెండు పాదములు సీస పాదము, మూడవ పాదము ద్విపద పాదము
    UUI UIU – UUI UIU
    UUI UIU – UI III
    IIUI UIU – UIU UI
    IIUI UUI U
    UUI తేమాంగాయ్, UIU కూవిళం, IIUI పుళిమాంగాయ్, UI తేమా, III పుళిమా

    ఈరాత్రి భవ్యమై – యీరాత్రి దివ్యమై
    యీరాత్రి నవ్యమై – యింపు నలరె
    శరదిందు కాంతిలోఁ – జెల్వ మీ ధాత్రి
    సరసమ్ము లాడంగ రా

  7. ఆటవెలఁది లయతో ధవళగీతి –

    పాదముల అమరిక –
    UI IIIUI – UIU UIU
    UI III – III IIIUI
    UI IIIUI – UIU UIU
    UI IIIUI U+
    UI తేమా, III పుళిమా, IIIUI కరువిళంగాయ్, UIU కూవిళం

    వెన్న మనసులోనఁ – బ్రేమయే వెన్నయా
    కన్నె మనసు – కలల కవనమయ్యె
    వన్నె లలరినట్లు – వాంఛలే పూచెఁగా
    నన్ను కనవదేల నీవు

  8. తేటగీతి లయతో ధవళగీతి –

    మొదటి మూడు పాదములు – UI IIUI – UUI UIUI
    చివరి పాదము – UI IIUI U
    UI తేమా, IIUI పుళిమాంగాయ్, UUI తేమాంగాయ్

    ఊఁగెఁ దులతూఁగె – నుల్లాస ప్రేమడోల
    మ్రోఁగె నిను దల్చి – మోదంపు రాగవీణ
    తీఁగ సవరించి – తీయంగ మీటుచుంటి
    యోగ మగు వేళ రా

  9. (చివరి గణమైన UIUI ఒకే పదముగా ఉండాలి)

  10. కన్నడములోని సాంగత్యపు (ఇం/ఇం – ఇం/ఇం // ఇం/ఇం/సూ)లయతో కుఱళ్ వెణ్బా –
    మొదటి పాదము – UIU UIU – UIU UIU
    రెండవ పాదము – UIU UUI U+
    UIU కూవిళం, UUI తేమాంగాయ్

    అమ్మయే దైవ మా – అబ్బయే దైవమ్ము
    బమ్మయే సృష్టించె నిన్ను

రమణమహర్షి ఏకాత్మపంచకము

భగవాన్ శ్రీ రమణమహర్షి ఏకాత్మపంచకము పేరితో వెణ్బాలను వ్రాసెను. క్రింద వాటిని పంచుకొంటున్నాను. దీనిని మొట్టమొదట తెలుగులో వ్రాసి, తఱువాత తమిళములో శ్రీ రమణ అనువదించారు.

తన్ను మరచి తనువు – తానై తలచి
ఎన్నియో జన్మము – లెత్తి తుది -తన్ను
తెలిసి తా నౌట పలు – దేశ సంచార
కల న్మేల్కొనుట కను – 1

తానుండి తానుగ – దన్ను తా నేనెవ
డే నుండు స్థాన – మేది, యను వానికి (స్థానమ్ము ఏది ?)
నేనెవ డెక్కడ – నేనున్నా నన్న మధు
పానుని యాడు పలుకు – 2

తనలో దను ఉండ – దాను జడమౌ
తనువందున్నట్టు – తలచు -మనుజుడు
చిత్రములో నున్నది చిత్రమున కాధార
వస్త్రమని ఎంచువాడు – 3

పొన్నుకు వేరుగ – భూషణ ముండునే
తన్ను విడిచి – తనువేది -తన్ను
దను వను వాడజ్ఞుడు – తా నను వాడు
తను గనిన జ్ఞాని ధరించు – 4

ఎప్పుడు నున్నది – ఏకాత్మ వస్తువే
యప్పడా వస్తువు – నాది గురు – చెప్పక
చెప్పి తెలియగ – జేసినారే , ఎవరు (ఎవ్వరు ?)
చెప్పి తెలుపుదురు చెప్పు – 5

ఏకాత్మ తత్వము – నిట్టి దని తేల్చి భక్త
దేహాత్మ భావము – దీర్చెను ఏకాత్మ
జ్ఞాన స్వరూప -రమణ గురు నాధుడు తా
నానతిచ్చు పంచక మందు – 6

ముగింపు

తమిళ సాహిత్యములో సంగకాలమునుండి నేటివఱకు విరివిగా వాడబడిన వెణ్బా ఛందస్సును గుఱించిన వివరములను తెలిపినాను. ఈ ఛందస్సును వ్రాయు విధానము, ఇందులోని నియమములు, వీటిని పోలిన సంస్కృత వృత్తములు, తెలుగు కన్నడ ఛందస్సులను వివరించినాను. వ్యాసమును కొన్ని ధవళగీతులతో ముగిస్తాను.

ఆకసము భూమిని – నంటిన యెల్లలో
చీకటిని వెల్గురేక దాకు

మునుగ నదులలో – ముఱికి నిన్నంటు
నొనరవుగ పున్నెములు నీకు

మానస మ్మబ్ధి – మణిమయము గంభీర
మ్మాననము నింగి – హరిణాంక శోభితము
గానమది గంగ గదా

చింత వలదురా – శ్రీలు గలుఁగురా
వంత తొలఁగురా – భావి వెలుఁగురా
చెంత నిలువరా – చేరు ఘడియరా
కంతు జనకుఁడా రా

అమ్మ అటు చూడు – మందముగఁ జంద్రుఁడే
అమ్మ యతి త్వరగ – నా చంద్రు నాకిమ్ము
చిమ్ము నెలవెలుఁగుఁ – జేతిలోఁ బట్టుతా
నమ్మ పరుగెత్తుతా

మనోహర గీతికను – మంద్రమై పాడ
ఘనమ్ముగఁ బారెఁగా – గానగంగ నదిగా
వినీలతర సుందరా – వేగమ్ము రారా
మనమ్మిది నీకే గదా

వేణు రవములందు – వెన్నుఁడే పల్కునా
మౌన హృదయ – మలల మయమొనర్చ
గాన లహరిలోన – గాయమ్ము లారునా
ప్రాణ మొసఁగువాఁడు వాఁడు

కమ్మఁ జదువంగఁ – గాయమ్ము పొంగుచుండె
రమ్ము ననుఁగాన – రాజిల్లు ప్రేమతోడ
నిమ్ము సుఖసౌఖ్య – మింపారఁ దీయగాను
కొమ్మ యిటఁ బూఁచె రా

మనసా యొకరోజు – మారాజు నీవే
విను వే ఱొకరోజు – బిచ్చాల ఱేఁడే
దినముల్ గడువంగ – దేవుండు పిల్చున్
దనువే శవమౌనుగా

కృతజ్ఞతలు – ప్రారంభదశలో న్యూజెర్సీ వాస్తవ్యులైన శ్రీ సుబ్రమణ్యంగారు వెణ్బా రచనాభ్యాసములో నాకెంతయో సలహాలను ఇచ్చారు, వారికి నా హృదయపూర్వకమైన వందనములను సమర్పిస్తున్నాను.


గ్రంథసూచి

  1. యాప్పరుంగలక్కారిక్కై – అమితసాగరర్(గుణసాగరుని వ్యాఖ్యతో) – Ulrike Niklas అనువాదము, Institut Francais de Pondichery, 1993.
  2. A Reference Grammar of Classical Tamil Poetry, V.S. Rajam, American Philosophical Society, 1992.
  3. Introduction to Tamil Prosody, Ulrike Niklas.
జెజ్జాల కృష్ణ మోహన రావు

రచయిత జెజ్జాల కృష్ణ మోహన రావు గురించి: జననం నెల్లూరు (1943).మదరాసులో SSLC వరకు.తిరుపతిలో ఉన్నత విద్యాభ్యాసం. IISc,బెంగుళూరులో Crystallography లో Ph.D పట్టా;1980 దాకా మదురై కామరాజ్ విశ్వవిద్యాలయంలో రీడర్‌గా విద్యాబోధన; తర్వాత అమెరికాలో శాస్త్రజ్ఞునిగా దీర్ఘకాలం ప్రవాస జీవితం. ఛందస్సు మీద విస్తారంగా వ్యాసాలు రచించారు.పాటలు పద్యాలు రాశారు. అనువాదాలు చేశారు.వీరి సుభాషితాల సంకలనం: Today’s Beautiful Gem. ఛందశ్శాస్త్రంలో కృషి,పరిశోధనకు గాను విరోధినామ (2009)సంవత్సరపు బ్రౌన్ పురస్కారాన్ని అందుకున్నారు. ...