“చెప్పు, చెప్పు. ఏం కల అది?”
“నన్నేం అడగొద్దు మనోజ్, నన్నడగొద్దు. నాకెప్పుడూ వస్తుందా కల.”
“కాబట్టే అదేంటో నేను తెలుసుకోవడం అవసరం మరి.”
“వద్దు మనోజ్!”
“నీకు జబ్బు చేసింది. సహజమే, నీకు జబ్బు చేయడం చాలా మామూలు విషయమే.”
“ఏం? ఎందుకలా? నాకు జబ్బు చేయడం సహజమా? ఎందుకేంటి?”
“మీ అబ్బాయి…”
“మా అబ్బాయి! ఏమిటి?”
“ఇంట్లో లేడు కదా!”
“మనోజ్! నీకెవరు చెప్పారో ఏమిటో గానీ మా అబ్బాయి దీపంకర్ లక్నోలో తన కజిన్తో పాటు ఉంటున్నాడు. అక్కడినుంచీ దిల్లీ వెళ్తాడు పైచదువులకు.”
“ఓహ్ గాడ్!”
మనోజ్ ఆవేదన, దుఃఖం భరించలేకపోయాడు. అతని దీర్ఘమైన నిట్టూర్పు తెలుపుతూనే ఉంది. తీర్థునికేమైంది? అందరు స్నేహితుల్లోకీ చాలా శాంత చిత్తం గలవాడు, మంచి కుఱ్ఱాడు తీర్థుడే.
“ఓహ్ గాడ్!”
కాగితం తీసుకుని మందులు వ్రాసి కూడా చింపి పారేశాడు. తనదగ్గరున్న ఒక మందు సీసా ఇస్తూ చెప్పాడు- రాత్రి పూట ఈ మందు తీసుకుంటూ ఉండు. నిద్ర పడుతుంది.”
“ఔనా, సరే వాడతాను.”
తీర్థయ్య మందు సీసా తీసుకొని వెళ్ళిపోయాడు. మనోజ్ గుమ్మం వరకూ వస్తూ, “బోస్ మళ్ళీ రాలేదు కదా నీ దగ్గరకు?”
“లేదు. ఏం”
“నేనే రావద్దన్నాను.”
“వస్తే మాత్రం రానిస్తాననుకుంటున్నావా? అనవసరంగా వచ్చి సవితతో పనికిమాలిన మాటలు మాట్లాడుతుంటాడు.”
తీర్థయ్య బయటికొచ్చాడు.
“ఏంటిది? ఉదయమా, సాయంకాలమా ఇది? ఇంత రద్దీగా ఉందేమిటి?”
“నిర్జన మార్గం… మేఘావృత రాత్రి… తుఫాను వంటి వాన… జయ్ సింహ్ కత్తితో దర్పంగా…” రవీంద్రనాథ టాగూర్ రచనలోని వర్ణన తీర్థయ్యకు చాలా నచ్చేది.
దీపంకర్ పాఠ్యపుస్తకాల్లో ఒక పాఠం ఉండేది. ‘రాజర్షి’ కదూ!
తీర్థయ్యకు తన కళ్ళు తడిసినట్టనిపిస్తోంది.
ఈనాడు సంతానం చాలా దారుణంగా తయారయింది. ఆఁ… మరేమిటి? తల్లిదండ్రులను హత్య చేసేంత దారుణంగా…
తీర్థయ్య చేతిలో ఉన్న మందుసీసాను జాగ్రత్తగా , గట్టిగా పట్టుకొని నడుస్తున్నాడు – అదేదో ఒలింపిక్ పవిత్రజ్యోతి అయినట్టు.
ఆ రోజు రాత్రి తీర్థయ్యకు మళ్ళీ అదే కల వచ్చింది. చౌరంగీ రస్తాకు రెండువైపులా లక్షల సంఖ్యలో జనం నిలబడి ఉన్నట్టూ, వాళ్ళంతా రాతివిగ్రహాలై నిశ్చలంగా నిలబడినట్టూ, దారికి రెండువైపులా పెద్దపెద్ద తెల్లటి నియాన్ దీపాలు వెలుగుతున్నట్టూ! ఆ దారంతా రక్తం! అక్కడ నిలబడి ఒక నడివయస్సు స్త్రీ ఛాతీని రెండు చేతులతో బాదుకుంటూ, ప్రవీర్! ప్రవీర్! అంటూ విలపిస్తోంది. ఆమె విరగబోసుకున్న పొడుగాటి జుట్టు ముఖం మీద పడుతోంది. పురాణకథల్లో వర్ణింపబడిన జనా ఆమేనని తీర్థయ్యకు అర్థమైంది.
దూరతీరాల్లో భీషణ ప్రాంతాల్లో
మరుభూమిలో, చొరరాని స్మశానంలో
ఆ చోటు కాదు నీది!
దుర్గమ వనాలలో , హిమసీమల
గిరిశిఖరాలపై
పయనించు పాపపంకిల
రాజ్యాలఁ ద్యజించు.
నీ పతి పుత్రహంతకుడగు శత్రుని పక్షమా?
పుత్రశోకాగ్నిసంపీడితా!
స్త్రీ దుఃఖం ఆకాశం యొక్క హృదయమే విరిగి పడినంతగా ఉంది. ఇదే సరైన సమయం – పరదాలు దించండి. గంటలు కొట్టండి. ఎవరు, ఎవరరుస్తున్నారిలా? ఇది మాహిష్మతీ పురం కాదని ఎవరన్నారు? వెళ్ళిపో ఇక్కడ్నించి!
ఆ క్షణంలో తీర్థయ్యకు చెప్పాలని బలంగా అనిపించింది: ” షి ఈజ్ ఇన్ ద రాంగ్ సిటీ.”
కానీ సరిగ్గా అప్పుడే గంటలు కొడుతున్నాయి. టంగ్! టంగ్! టంగ్! గడియారం మ్రోగుతోంది!
ఫోన్ మ్రోగుతోంది!
తీర్థయ్య లేచి కూర్చున్నాడు. మనిషికి టెలిఫోన్ అవసరమా? ఎందుకు ఫోన్ పెట్టుకోవడం? బిల్లు కట్టాలంటే తాతలు దిగొస్తారు. ఊపిరాడుతుందా?
తీర్థయ్య మ్రోగుతున్న ఫోన్ తీశాడు.
“ఫోర్ సెవెన్… నైన్?”
అదే నెంబర్ తీర్థయ్య ముందున్న టెలిఫోన్ మీద వ్రాసుంది. కానీ తీర్థయ్య “నో” అన్నాడు.
“ఇది తీర్థంకర్ ఛటర్జీ గారిల్లు కాదా?”
“నో”
“తీర్థా, నేను. బోస్. ఆ రోజు చెప్పాను కదా… దూరంగా రైల్వే లైన్ దగ్గరి ఇంట్లో. అవును, దీపంకర్ శవం! డైడ్ ఆఫ్ ఇంజురీస్! మీరు రానే లేదు! బాడీ హాజ్ బీన్ క్రిమేటెడ్! హలో! వింటున్నారా?”
“నో”
“ఇది తీర్థంకర్ ఛటర్జీ ఇల్లు కాదా?”
“కాదు.”
“ఇది ఫోర్ సెవెన్… నైన్ కాదా?”
“కాదు, కాదు. రాంగ్ నంబర్.”
తీర్థయ్య ఫోన్ పెట్టేశాడు. మళ్ళీ ఎందుకో రిసీవర్ తీసి మళ్ళీ పెట్టేశాడు. తర్వాత వెళ్ళి మంచం మీద పడుకున్నాడు. మళ్ళీ కల వస్తుందేమో. ఎలా అయినా ఆ కల ఇంకోసారి చూడవలసినదే. అప్పుడు గానీ తెలియదు, ఆ పిచ్చిది జనా రాంగ్ సిటీ నుంచి ఎలా తప్పించుకొని పారిపోయిందో! కలలు గాక ఇప్పుడింకేమీ మిగల్లేదు తీర్థయ్యకు. మెలకువ వచ్చాక కలకత్తా దారుల్లో ఎంత తిరిగినా తప్పించుకొని పారిపోయే దారే కనబడలేదతనికి. ఆ జనా వెనుకే వెళ్ళాలి. ప్రవీరుడు పోయింతరవాత , ప్రవీరుని తండ్రి విజయోత్సవాల్లో అందరూ మునిగితేలుతుంటే , జనా ఒక్కత్తీ పారిపోయింది కదా!
తీర్థయ్యకు నిద్ర పట్టేసింది.
(హిందీ మూలం: రాంగ్ నంబర్, మహాశ్వేతాదేవీకీ కహానియా, 1993. నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రచురణ.)